గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks
దేవతా స్తుతులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
దేవతా స్తుతులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

గురువారం, అక్టోబర్ 22, 2015

అమ్మ! దయామయి! సింహవాహనా!!

తెలంగాణ ప్రజలకు రచయితలకు కవి పండితులకు

దసరా పండుగ శుభాకాంక్షలు!!




చండి! భవాని! శైలసుత! శాంభవి! భైరవి! యోగమాయ! చా
ముండి! వృషాకపాయి! సతి! మోక్షద! శాంకరి! దుష్ట దానవో
త్ఖండతరాశుకాండ! వరదాయి! శుభప్రద! భద్రకాళి! పా
షండ శిఖండి! శక్తి! మహిషాసుర మర్దిని! సింహవాహనా! (1)


నేతల నీతిమంతులుగ నేర్పడఁ జేసియు; మమ్ము నేఁడిటన్
పూత మనమ్ము గల్గునటు పూని, వరమ్మిడి, వెల్గఁ జేసియున్;
చేతము చల్లనౌ నటుల శీఘ్రమె కాంక్షలఁ దీర్చి, మాకు నీ
యాతన డుల్చి, ప్రీతిఁ గనుమమ్మ! దయామయి! సింహవాహనా! (2)


నిరతము నిన్ను గొల్చెదము; నిక్కము! నమ్ముము! మా మనోరథ
స్థిర నవ రాష్ట్ర మిచ్చితివి దీక్షలు సేసి, తపించి పోవ, మా
చిరమగు వాంఛఁ దీరిచి, విశేష తమాంచిత హేమ రాష్ట్రమున్
కర మనురాగ యుక్తముగఁ గాంచుచు నీఁగదె సింహవాహనా! (3)


ఆత్రముతోడ వేచితిమి, హర్ష సుహృద్వర రాష్ట్రదాయి! మా
శత్రుల మానసమ్ములనుఁ జక్క నొనర్చియు, వారలన్ సుహృ
న్మిత్రులుగాను మార్చి, కరుణించియు, మమ్మిఁక వేగిరమ్మె స
ద్గాత్రులఁ జేసి, స్వర్ణ తెలగాణము నీఁగదె సింహవాహనా! (4)


ప్రజలను నిత్య సత్య యుత వర్తన శీ లురఁ జేసి, వారలన్
గుజనులు కాక యుంటకయి కూర్మినిఁ బంచి, మహోత్తమాశయాం
బుజ ఘన శోభి తాత్మ నిడి, ప్రోచి, ప్రశస్త సువృత్తతోన్మహా
యజనముఁ జేయు శక్తి సదయన్నిడు మో శివ! సింహవాహనా! (5)


-:శుభం భూయాత్:-




శనివారం, సెప్టెంబర్ 26, 2015

విఘ్నములఁ దొలఁగింపుము విఘ్నరాజ!

కవి పండితులకు, తెలంగాణ ప్రజలకు, వీక్షకులకు
వినాయక నిమజ్జన దినోత్సవ శుభాకాంక్షలు!


(తెలంగాణ రాష్ట్రమును తొందరగా ఈయుమని దివి: సెప్టెంబర్ 18, 2013 నాడు నేను విఘ్నపతిని ప్రార్థిస్తూ వ్రాసిన పద్యములకు సంతసించిన ఆ విఘ్నేశ్వరుడు మనకు మన తెలంగాణ రాష్ట్రమును ప్రసాదించి మనను బానిసత్వమునుండి విముక్తులను చేసినాడు. అందులకు మరొక్కసారి  ఆనాటి దినమును స్మృతికితెచ్చుకొంటూ ఆ పద్యాలను ఇక్కడ ప్రకటిస్తున్నాను. అప్పటి మన ఆకాంక్షలు ఎలా ఉన్నాయో మరొక్కసారి జ్ఞాపకము చేసుకొనండి సోదరులారా!)




హెచ్చు తగ్గులు లేనట్టి హిత మనమున,
దరికిఁ జేరనిచ్చితిమి యందఱనుఁ బ్రేమఁ
గుఱియ; స్వార్థ మేమాత్రమ్ముఁ గోర మయ్య;
వేగఁ దెలగాణ మీవయ్య విఘ్నరాజ! (1)


మమ్ము బాధించినట్టి సీమాంధ్రులకును
మంచి బుద్ధిని దయసేసి, మమత గలుగు
వారలుగ మార్చి, దీవించి, వరము లిచ్చి,
వేగఁ దెలగాణ మీవయ్య విఘ్నరాజ! (2)


మాయ లేనట్టి వార; మమాయకులము;
కుడు మటన్నఁ బండు వటంచుఁ గూర్మి మీఱ,
సంతతము సంతసముఁ బూని, స్వాగతింప;
వేగఁ దెలగాణ మీవయ్య విఘ్నరాజ! (3)


తెలుఁగు వారందఱును నొక్కటిగను నుండి,
ప్రాంతములుగాను విడిపోవ బాగటంచు,
వేడుచుంటిమి ప్రార్థించి, పేర్మి మీఱ;
వేగఁ దెలగాణ మీవయ్య విఘ్నరాజ! (4)


ఆత్మ గౌరవోద్యమ మిది, యాదరించి,
యిష్టములఁ దీర్చి, యెడఁబాపి కష్టములను,
మమ్ముఁ గరుణింప వేడెద మనమునందు;
వేగఁ దెలగాణ మీవయ్య విఘ్నరాజ! (5)



-: శుభం భూయాత్:-

(గత టపాను ఇక్కడ చూడగలరు: విఘ్నరాజ!)






గురువారం, సెప్టెంబర్ 17, 2015

ఓం శ్రీ మహా గణాధిపతయే నమః !

సుకవి పండిత మిత్రులకు, బ్లాగు వీక్షకులకు
వినాయక చతుర్థి పర్వదిన శుభాకాంక్షలు!



స్వాగత వృత్తము:
శ్రీ గణేశ! ఘన చిత్సుఖ దాతా!
శ్రీ గిరీశ సుత! శ్రేష్ఠ! వరిష్ఠా!
యోగి రాడ్వరద! యోగ విశేషా!
స్వాగత ప్రమథ వర్గ! నమో ఽహమ్! (1)


ప్రమాణి వృత్తము:
గజాననా! ఘనాకృతీ!
ప్రజావళి ప్రమోద! స
ద్ద్విజ స్తుత! స్థిరా! చతు
ర్భుజా! నమో ఽస్తు తే ఽనిశమ్! (2)


ప్రణవ వృత్తము:
హేరంబా! మిత హిత సంతోషా!
గౌరీ నందన! కరి మూర్ధన్యా!
సూరి ప్రాకట శుభ సంశ్లోకా!
భూరి క్షత్ర! విముఖ! వందే ఽహమ్! (3)


శాలినీ వృత్తము:
సారాచారా! నీత సత్పుణ్య దాతా!
పారాశర్యామోద బాష్పోత్సుకా! క్రౌం
చారి భ్రాతా! భూరి సమ్మోద పాత్రా!
ధీర స్తుత్యా! హే ద్విదేహ ప్రభాసా! (4)


వంశస్థము:
నమో నమో విఘ్న వినాశకాయ తే!
నమో విచిత్రాయ! వినాయకాయ తే!
నమః పవిత్రాంచిత నామకాయ తే!
నమో సదాదాన! ఘనాయ తే నమః! (5)


వన మయూరము:
హేరుక! భవాత్మజ! మహేంద్ర నుత గాత్రా!
ధీర! సుముఖ! ప్రముఖ! దివ్య దరహాసా!
ఘోర తర సంసృతి వికూప తరణాప్తా!
చారు రుచి దంత కులిశ ప్రహరణాఢ్యా! (6)


స్రగ్విణీ వృత్తము:
పార్వతీ నందనా! భారతోల్లేఖనా!
సర్వ గర్వాపహా! ఛాత్ర విద్యోదయా!
ఖర్వ విఘ్నోన్నతా! కార్య సిద్ధిప్రదా!
శర్వ పుత్రాగ్రజా! శాంత మూర్తీ! నమః! (7)


ఇంద్ర వంశము:
జీవేశ! సర్వోత్తమ! చేతన ప్రదా!
దేవ స్తుతా! శాంకరి! ధీ విశేష! ది
వ్యా! విశ్వ సంపూజిత! వక్రతుండ! ఢుం
ఠీ! వేద వేద్యా! ఘన తేజ! తే నమః! (8)


భుజంగ ప్రయాతము:
ద్విపాస్య! త్రి ధామ! త్రిధాతు! ప్రసిద్ధా!
సుపర్వ ప్రమోదా! శుభాంగా! వృషాంకా!
కపి త్థాత్త సంపృక్త భుక్త ప్రహృష్టా!
కృపాంభోధి! కుబ్జాకృతీశా! నమస్తే! (9)


(శుభం భూయాత్)




శుక్రవారం, ఆగస్టు 08, 2014

వరలక్ష్మీ వ్రతమాహాత్మ్య కథ!


ఆ.వె. 
సకల దేవతాళి సంస్తుతించుచునుండఁ
జేరి పార్వతియును, జిఱునగవుల
శివుఁడు తనదు భస్మసింహాసమ్మునఁ
గొలువు దీఱఁ, బతినిఁ గోరెనిట్లు! (1)

ఆ.వె.
“స్వామి! స్త్రీలు సకల సౌఖ్యసౌభాగ్యముల్,
పుత్రపౌత్రవృద్ధిఁ బొందునట్టి
వ్రత మొకండుఁ దెలిపి, వ్రతవిధానమ్మును
జెప్పుమయ్య నాకుఁ జిత్త మలర!” (2)

కం.
సతి కోరఁగ విని, శివుఁడును
హిత మిత వాక్యముల ననియె, “హే పార్వతి! నీ
వతి వినయమునను గోరితి;
కుతూహల మ్మెసఁగ వినుము కోరిక తీఱన్! (3)

తే.గీ. 
మగధదేశానఁ గుండిన మనెడి పట్ట
ణమున నొక ద్విజ, ‘చారుమతి’, మతి దధిజ,
పద్మ పదపద్మ సక్త సద్భక్తి హృదయ,
ఘన పతివ్రత, సద్వంద్య కలదు; వినుము! (4)

కం.
ఒకనాఁడు స్వప్నమందున
సకల ధనము లొసఁగు తల్లి, సాక్షా ద్రమయే
ప్రకటిత మాయెను సరగున
వికసిత కరుణా హృదబ్జ విలసితమణియై! (5)

తే.గీ. 
“చారుమతి! నన్నుఁ బూజింపు, శ్రావణమునఁ
బౌర్ణమికి ముందునన్ శుక్రవారమందు!
సకల సౌభాగ్య సంతాన సౌఖ్యతతులఁ
గూర్చుదానను నమ్ముమో గుణవిశాల!” (6)

ఆ.వె. 
అనుచుఁ బలికి మాయమాయె నా మాతయ;
చారుమతియు లేచి, సంతసించి, 
“వరము లొసఁగు తల్లి! వరలక్ష్మి! కరుణించి, 
మమ్ముఁ బ్రోవు మమ్మ! నెమ్మి నిమ్మ! (7)

కం. 
హే మాతా! సంపత్కరి!
శ్రీ! మా! నారాయ ణీంది! సింధుజ! లక్ష్మీ!
నేమమున నిన్నుఁ గొలుతును;
నీ మనమున మమ్ముఁ గరుణ నెసఁగఁగ గనుమా!” (8)

తే.గీ. 
అనుచుఁ బరిపరి విధముల వినుతి సేసి,
పతికి, నత్తమామలకును నతివ తెలుప;
సంతసమ్మున విని, వారు సమ్మతించి, 
“వ్రతము సలుపంగ వలె” నని పలికి రపుడు! (9)

కం. 
ఇది విన్న యూరి సుదతులు
ముదమున మది మెచ్చి యంతఁ బున్నమి మున్నై
యెదురుపడు శుక్రవారము
గదురన్ శ్రావణమునందు ఘనమగు వేడ్కన్! (10)

తే.గీ. 
“పద్మకరి! సర్వలోకైకవంద్య! లక్ష్మి! 
దేవి! నారాయణప్రి యాబ్ధితనయ! నమ”
మనుచు వారలు చారుమతిని గలసియుఁ
జేరి వరలక్ష్మి పూజను జేసి రపుడు. (11)

తే.గీ. 
తొలి ప్రదక్షిణచే నందియలును మ్రోగె;
మలి ప్రదక్షిణఁ గంకణములు మెఱసెను;
కడ ప్రదక్షిణ సర్వాంగ ఘటిత భూష
ణ యుతలైరి! సంపదలె యందఱి గృహాల!! (12)

తే.గీ. 
పఱఁగ వరలక్ష్మి కరుణించి పడతులకును
సంపదలు ధాన్య సౌఖ్య సత్సంతతులను,
నాయురారోగ్య భోగ్య సన్మాన్యములను
దగఁ బ్రసాదించె! వ్రత ఫలితమ్ము దక్కె!! (13)

కం. 
సతి వింటివె యీ కథ! నే
సతి పతు లిది విన్నఁ గాని, చదివిన, లక్ష్మీ
సతి, తా నొసఁగును సకలము,
లతి శుభముల నిచ్చుఁ గాత, యనవరతమ్మున్! (14) 

(ఇది వరలక్ష్మీ వ్రతమాహాత్మ్య కథ)

-:o:శుభం భూయాత్:o:-

శుక్రవారం, మే 02, 2014

పద్య రచన: అన్నపూర్ణేశ్వరీ స్తోత్రము

తేది: సెప్టెంబర్ 12, 2012 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యము


(అన్నపూర్ణాష్టకమునందలి ప్రథమ శ్లోకానువాదము)



శా.

మా కానందము నిచ్చ లిచ్చి, వరసంరక్షా సుశోభాబ్ధివై;
మా కృత్యమ్ముల ఘోర పాపము నశింపం జేయు సాక్షాచ్ఛివా!
యో కాళీ! హిమశైల వంశ విమలా! యో కాశికాధీశ్వరీ!
మా కీయం గదె భిక్ష రక్ష దయలున్ మా తాన్నపూర్ణా ఽమ్బికా!!



మూలశ్లోకము:
నిత్యానన్దకరీ వరాభయకరీ సౌన్దర్యరత్నాకరీ
నిర్ధూతాఖిలఘోరపాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ|
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||



భావము:
నిత్యమైన ఆనందము నిచ్చుదానవు, వరములను- అభయమును ప్రసాదించు దానవు, సౌందర్య సముద్రమైన దానవు, ఘోరమైన పాపముల నన్నిటినీ కడిగివేయుదానవు, హిమవంతుని వంశమును పవిత్రము చేయుదానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపెట్టుము.


బుధవారం, ఏప్రిల్ 30, 2014

అంబ దయామయి సింహవాహనా!

తేది:అక్టోబర్ 13, 2013 నాటి విజయ దశమి పర్వదినమున నేను తెలంగాణ నిమ్మని కోరుతూ ఆదిపరాశక్తియగు సింహవాహనను స్తుతించాను. ఇప్పుడు ఆ తల్లి మనకు మన రాష్ట్రాన్ని ఇచ్చింది. అందుకు కృతజ్ఞతతో మళ్ళీ ఆ టపాను పునః ప్రకటము చేస్తున్నాను. తెలంగాణ సోదరులు దీనిని ఆదరించగలరని మనవి.

ఆ టపా ఇది:
తెలంగాణ ప్రజలకు రచయితలకు కవి పండితులకు
విజయ దశమి పర్వదిన శుభాకాంక్షలు!!


చండి! భవాని! శైలసుత! శాంభవి! భైరవి! యోగమాయ! చా
ముండి! వృషాకపాయి! సతి! మోక్షద! శాంకరి! దుష్ట దానవో
త్ఖండతరాశుకాండ! తెలగాణ వరాంచిత రాష్ట్రదాయి! పా
షండ శిఖండి! శక్తి! మహిషాసుర మర్దిని! సింహవాహనా! (1)

నేతల నీతిమంతులుగ నేర్పడఁ జేసియు; మమ్ము నేఁడిటన్
పూత మనమ్ము గల్గునటు పూని, వరమ్మిడి, వెల్గఁ జేసియున్;
చేతము చల్లనౌనటుల శీఘ్రమె రాష్ట్రము నేర్పరించియున్;
మా తెలగాణ మా కొసఁగు మమ్మ! దయామయి! సింహవాహనా! (2)

పూనెను కేంద్రమిప్పు డనుమోదము తోడుత రాష్ట్ర మీయఁగన్;
దీని నమోఘ రాష్ట్రముగఁ దీరిచి దిద్దియు మా కిడంగ, నీ
వే నవ రూప కర్తవయి, వేగమె హైదరబాదుఁ గోరు, మా
కా నగరమ్ముతోడి తెలగాణము నీఁగదె సింహవాహనా! (3)

నిరతము నిన్ను గొల్చెదము; నిక్కము! నమ్ముము! మా మనోరథ
స్థిరతర రాష్ట్రమందఁగను దీక్షలు సేసి, తపించినాము, మా
చిరమగు వాంఛఁ దీరిచి, విశేష తమాంచిత నవ్య రాష్ట్రమున్
కర మనురాగ యుక్తముగఁ గాంచుచు నీఁగదె సింహవాహనా! (4)

ఆత్రముతోడ వేచితిమి, హర్ష సుహృద్వర రాష్ట్రదాయి! మా
శత్రుల మానసమ్ములనుఁ జక్కనొనర్చియు, వారలన్ సుహృ
న్మిత్రులుగాను మార్చి, కరుణించియు, మమ్మిఁక వేగిరమ్మె స
ద్గాత్రులఁ జేసి, నీవు తెలగాణము నీఁగదె సింహవాహనా! (5)


-: శుభం భూయాత్ :-

బుధవారం, ఏప్రిల్ 02, 2014

స్వప్న గోవిందం

తేది: ఆగస్టు 10, 2012 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యములు


(ఒకనాఁటి శ్రీకృష్ణజన్మాష్టమి వేకువ జామున నా హృదయ దర్పణమున నేనొక కలఁ గాంచితిని)

తే.గీ.
అదియ వేణుగోపాలుని యాలయమ్ము;
గోపురము పైన శంఖచక్రోదయమయె!
గాలిగోపురమునఁ జేరఁ గళలఁ దేల్చి,
సకల దేవతలును గొల్వ స్వాగతింతు! (1)

శా.
సర్వైశ్వర్య వదాన్యుఁ డీతఁడు; సహస్రాక్షాదు లీ కృష్ణునిన్
సర్వేశుండని గొల్తు రీ దినము; సత్సంగీత హర్షాన, దుః
ఖోర్వీభార విదూరుఁ డంచును సదా కుడ్యమ్ములన్ నిల్చియున్,
గర్వమ్మింతయు లేకఁ గీర్తనలచేఁ గంసారిఁ గీర్తింపఁగన్ (2)

కం.
నాదు మనోనేత్రమ్మున
నీ దినమీ యాలయమ్ము నిక్కువముగ, స
మ్మోద మ్మొనఁ గూర్చుచు, దా
మోదరు లీలల వెలార్చి ముగ్ధునిఁ జేసెన్! (3)

సీ.
ఒకచోట శ్రీకృష్ణుఁ బ్రకటాపగా యము
     నను దాఁటు వసుదేవు నాప్త కృత్య;
మొక్కచోఁ బూతన మక్కువ నిడు స్తన్య
     మునుఁ ద్రావి, ప్రాణాలఁ గొను విధమ్ము;
నొకచోన శాకటు న్నుగ్గుసేయఁగ నాక
     సమ్మున కెగయు నసంపు వితము;
నొక్కెడఁ గాళియు నుక్కడఁగించియు
     ఫణముల నర్తించు భంగిమమ్ము;
గీ.
ఒక దెసను వెన్న మీఁగడ లోలిఁ ద్రాగు;
నొక యెడను గోపికల నృత్య వికసనమ్ము;
నొకటఁ జాణూర ముష్టికుల కపజయము;
నొక్క దిక్కునఁ గంసుని నుఱుము సేఁత! (4)

ఆ.వె.
ఎంత సుదిన మిద్ది! వింతలఁ జూపించి,
నన్నుఁ బ్రోచునట్టి వెన్నదొంగ!
మాయఁ బన్ని నన్ను మన్నింప, ధన్యుండ!
పరమపురుష, మోక్ష వరము నిడుము!! (5)

(అనుచుఁ బ్రార్థించుచుండ, పక్షుల కిలకిలారావాలచే మెలకువ రాఁగ, నది కలయని తెలిసి, యా దేవదేవునకు మనస్సున మ్రొక్కి,లేచితిని.)

మంగళవారం, ఏప్రిల్ 01, 2014

దత్తపది: చంద్ర-గంగ-నాగ-భస్మ...నచ్చిన ఛందం...శ్రీకృష్ణ స్తుతి

తేది: ఆగస్టు 09, 2012 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన...
శివునకు అలంకారాలైన
చంద్ర - నాగ - గంగ - భస్మ
పదాలను ఉపయోగిస్తూ
నచ్చిన ఛందస్సులో
శ్రీకృష్ణుని స్తుతిస్తూ
పద్యం వ్రాయమనగా
నేను రాసిన ఆటవెలది పద్యము




యదు కులాబ్ధి చంద్ర! యవనారి! గోపాల!
పాద జనిత గంగ! వాసుదేవ!
నగధర! వ్రజ మోహనా! గరుడ గమన!
శౌరి! పద్మనాభ! స్మర జనయిత!

-: శుభం భూయాత్ :-


సోమవారం, మార్చి 31, 2014

జయ యుగాది మాతా!

తెలంగాణ కవిపండితమిత్రులకు, బ్లాగు వీక్షకులకు
జయనామ యుగాది పర్వదిన శుభాకాంక్షలు!!



స్వాగత వృత్తము:
స్వాగతమ్ము జయ స్వాగతమమ్మా
వేగిరమ్మె యిఁక వేడుకనిమ్మా
భోగభాగ్యములు పొందుగనిమ్మా
యోగసిద్ధులవి యొప్పుగనిమ్మా!

స్వగ్విణీ వృత్తము:
మా తెలంగాణమున్ మంచిరాష్ట్రమ్ముగన్
చేతువంచిప్పుడున్ శీఘ్రమే కోరుచున్
మాతరో నిన్ను మేమాదరోత్కృష్టతన్
నూతనోత్సాహమందోలలాడింతుమే!

రథోద్ధత వృత్తము:
దుష్టపాలనము దూరమాయెఁగా
కష్టకాలమిఁక ఖర్వమాయెఁగా
శిష్టభావనలు శీఘ్రమే యిడన్
తుష్టి నొందెదము తూర్ణ మో జయా!

వనమయూర వృత్తము:
ఎన్ని తెలగాణమున హీనతను డుల్చన్
నిన్ను నుతియించెదము నిక్కమగు భక్తిన్
విన్నపము చేసెదము వేగ మముఁ బ్రోవన్
మన్ననను మమ్ము గనుమమ్మ జయ మాతా!

తోవక వృత్తము:
కలుములతోడను గాంక్షలు తీరన్
విలువలఁ బెంచెడి ప్రేమల నిమ్మా
ఫలితము దక్కఁగ వంతలు తీర్చన్
దలఁచెద మిప్పుడు తల్లి జయమ్మా!

ప్రియంవదా వృత్తము:
అరువదేండ్ల కల హంగు మీఱఁగన్
విరుల వర్షమును బ్రేమ తోడుతన్
గురియఁ జేయఁగను క్రొత్త రాష్ట్రమున్
వరలఁ జేయ జయ వందనమ్మిదే!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

మంగళవారం, జనవరి 14, 2014

సంక్రాంతి మాత, కనుము!

తెలంగాణ కవి పండిత మిత్రులకు, ప్రజలకు
మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు!!
జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

జై తెలంగాణ నినదమ్ము సకల జనుల
నిత్య నూతన మంత్రమై నింగి కెగయఁ,
గేంద్ర లక్ష్యమై తెలగాణ క్షేమముగను
మమ్ముఁ జేరంగ సంక్రాంతి మాత కనుము!

మా "తెలంగాణ బిల్" భోగి మంటలందు
నాహుతిని జేయ, శీఘ్రమే యది పునీత
యై వెలిఁగిపోయి, తెలగాణయై, బిరాన
మమ్ముఁ జేరంగ సంక్రాంతి మాత కనుము!

సీమ దౌష్ట్యమ్ము నణచియుఁ, జెలఁగి వదరు
ముఖ్యమంత్రికి నొసఁగి సద్బుద్ధి, వేగ
ముగఁ దెలంగాణ "రాష్ట్రమై" మోదమునను
మమ్ముఁ జేరంగ సంక్రాంతి మాత కనుము!

జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

బుధవారం, డిసెంబర్ 04, 2013

అమ్మా! దుఃఖించకు తల్లీ!


ఉత్పలమాల:
నీతి నిజాయితిన్ విడచి నేతలు చేరి స్వలాభ కాములై
యీ తెలగాణ రాష్ట్ర సుజనేప్సితమున్ విడనాడి యిత్తఱిన్
మాతరొ! నీకు స్వేచ్ఛనిడ మానిరి! యెన్నడు స్వేచ్ఛనందుటో?
ఓ తెలగాణ మాత! మము నోమఁగఁ జూడు దయార్ద్ర చిత్తవై!

కందము:
ఘడియ కొక మాట మార్చుచు,
పిడివాదముతోడఁ గష్టపెట్టఁగఁ, గంటన్
దడిఁబెట్ట వలదు తల్లీ!
వడిగాఁ దెలగాణ వచ్చు! వచ్చును సుఖముల్!

ఆట వెలఁది:
మూర్ఖులుండి రచట! మోసమ్ముఁ గూర్పంగఁ
బూనఁగాను, మేము పోరు సలిపి,
నిన్ను వేగఁ దెచ్చు నిష్ఠతో నుంటిమి!
కంట నీరు పెట్టఁగాను వలదు!!

తేఁట గీతి:
మోసకారుల, నీచుల మూర్ధములను
నీదు పాదాల పైఁబడ నేర్పుఁ జూపి,
బుద్ధి నేర్పెద మో తల్లి పోరు సలిపి!
ఓటుతో నిన్నుఁ దెచ్చెద మోర్పు తోడ!!

పంచచామరము:
బిరాన రాఁగ నుంటివమ్మ! వేదనమ్ము మానుమా!
స్వరమ్ము మార్చువారిలోని స్వార్థమున్ బెకల్చియున్;
వరోగ్ర భీకరాకృతిన్, జవమ్ముఁ బూని, శీఘ్రమే
పరాక్రమోద్యమమ్ముఁ జేయ, భవ్య రాష్ట్ర సాధ్యమౌ!

జై తెలంగాణ!      జై జై తెలంగాణ!

ఆదివారం, అక్టోబర్ 13, 2013

మా తెలగాణ మా కొసఁగు మమ్మ! దయామయి! సింహవాహనా!

తెలంగాణ ప్రజలకు రచయితలకు కవి పండితులకు
విజయ దశమి పర్వదిన శుభాకాంక్షలు!!


చండి! భవాని! శైలసుత! శాంభవి! భైరవి! యోగమాయ! చా
ముండి! వృషాకపాయి! సతి! మోక్షద! శాంకరి! దుష్ట దానవో
త్ఖండతరాశుకాండ! తెలగాణ వరాంచిత రాష్ట్రదాయి! పా
షండ శిఖండి! శక్తి! మహిషాసుర మర్దిని! సింహవాహనా! (1)

నేతల నీతిమంతులుగ నేర్పడఁ జేసియు; మమ్ము నేఁడిటన్
పూత మనమ్ము గల్గునటు పూని, వరమ్మిడి, వెల్గఁ జేసియున్;
చేతము చల్లనౌనటుల శీఘ్రమె రాష్ట్రము నేర్పరించియున్;
మా తెలగాణ మా కొసఁగు మమ్మ! దయామయి! సింహవాహనా! (2)

పూనెను కేంద్రమిప్పు డనుమోదము తోడుత రాష్ట్ర మీయఁగన్;
దీని నమోఘ రాష్ట్రముగఁ దీరిచి దిద్దియు మా కిడంగ, నీ
వే నవ రూప కర్తవయి, వేగమె హైదరబాదుఁ గోరు, మా
కా నగరమ్ముతోడి తెలగాణము నీఁగదె సింహవాహనా! (3)

నిరతము నిన్ను గొల్చెదము; నిక్కము! నమ్ముము! మా మనోరథ
స్థిరతర రాష్ట్రమందఁగను దీక్షలు సేసి, తపించినాము, మా
చిరమగు వాంఛఁ దీరిచి, విశేష తమాంచిత నవ్య రాష్ట్రమున్
కర మనురాగ యుక్తముగఁ గాంచుచు నీఁగదె సింహవాహనా! (4)

ఆత్రముతోడ వేచితిమి, హర్ష సుహృద్వర రాష్ట్రదాయి! మా
శత్రుల మానసమ్ములనుఁ జక్కనొనర్చియు, వారలన్ సుహృ
న్మిత్రులుగాను మార్చి, కరుణించియు, మమ్మిఁక వేగిరమ్మె స
ద్గాత్రులఁ జేసి, నీవు తెలగాణము నీఁగదె సింహవాహనా! (5)

                        -:శుభం భూయాత్:-