గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, జూన్ 05, 2015

2019లో టీడీపీ తెలంగాణలో రాజ్యమేలుతుందా...???


ప్రజలకు నిజాలు కావాలి. మీ సొంత ఎజెండాలు కాదు. తెలంగాణ ప్రజలు తెలంగాణను ఏలుకోనివ్వాలి. వీలైతే నిర్మాణాత్మకమైన సలహాలిచ్చి ఓ చేయి వేయాలి. కానీ నడిచే కాళ్లల్లో కట్టెను పెట్టే పనులు చేయొద్దు. కావాలనే మీడియా గొంతు నొక్కితే...ఆ పాపం ప్రభుత్వాలను తప్పకుండా చుట్టుకుంటుంది. తెలంగాణ మీడియా ఇప్పుడిప్పుడే విచ్చుకుంటున్నది. ఎదగనీయాలి. పాత్రికేయ విలువలను కాపాడుతూ, బాధ్యతగల పాత్రను పోషిస్తూ రెండు రాష్ర్టాల ప్రజలను, వారి పాలనను ఒక్కలా చూడాలి. 


మే 27 నుంచి 29 దాకా మూడు రోజులు సాగిన మహానాడు సందర్భంగా.. చంద్రబాబు మాటలు, ఆయనకు వత్తాసు పలుకుతున్న పత్రికలు...అనటానికి సిగ్గులేదు, వినటానికి ఎగ్గులేదు, రాసెటోనికి బుద్ధిలేదు...అన్నట్లున్నాయి. ఆయన పలుకులు అంతంత పెద్ద అక్షరాలతో వేయడం వాటి పక్షపాత దోరణిని, దిగజారుడుతనాన్ని తెలియజేస్తున్నాయి.ఆ మాటలన్నీ ఇంకా తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకు చివరి ప్రయత్నమా? అసలు తెలంగాణ ప్రజలు ఏమాత్రమైనా టీడీపీని సహించే పరిస్థితిలో ఉన్నారా? హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లో నివాసముంటున్న సీమాంధ్ర డబుల్ ఓటర్లు గత ఎన్నికల్లో కట్టబెట్టిన సీట్లతో మిడిసిపడితే ఎట్ల? ఊడ్చుకుపోయిన ఐదు జిల్లాలు, ఒక్కొక్క సీటు వచ్చిన రెండు జిల్లాలు గుర్తుకురావడం లేదా? 


పరాయి పాలనకు ఓటేసిన ఓటర్లతో తెలంగాణ ఓటర్లను జతకడితే అంచనా తప్పు అవుతుంది. అసలు టీడీపీ వెంట ఉన్న తెలంగాణ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు అయినా చంద్రబాబు ఆ మూడు రోజుల మాటల మూటలను నమ్ముతారా? టీడీపీలో కొనసాగుతున్న తెలంగాణ రాజకీయ నాయకులకు ఆ పార్టీ ఎలాంటి భవిష్యత్తును ఇవ్వలేదు. అది అసాధ్యం. ఏ పదవీ లేకుండా రాజకీయాలు సాగించడం, నియోజకవర్గ ప్రజలను కేడర్‌ను ఎంతకాలం కాపాడుకోగలరు? అసలు సమీప కాలంలో నమ్ముకున్న పార్టీ టీడీపీ ఏదైనా సాధించిపెట్టగలదని ఆశ ఉన్నదా? తెలంగాణ ప్రజలు ముందుముందు నమ్మితే కాంగ్రెస్‌ను నమ్ముతారేమోగానీ టీడీపీని దరిచేరనీయరు.


ఏది ఏమైనా.. ఓ ముఖ్యమంత్రి తనస్థాయిని, ఆ సీటు మర్యాదను మరచి మాటల కత్తులతో విషాన్ని వెడలగక్కడం, వాటికి పత్రికలు ప్రాధాన్యమివ్వడం చిల్లరగా ఉన్నది. చంద్రబాబు మాటలు చూస్తుంటే తెలంగాణ ప్రజలు వట్టి గొర్రెదాటు ప్రజలు, పూర్తిగా అమాయకులు. ఉత్తుత్తగానే మోసపుచ్చ వచ్చనే భ్రమలో ఆయన ఉన్నట్లనిపిస్తున్నది. ఆంధ్రుల ఆధిపత్య పాలనను కూలదోయడానికి దశాబ్దాల పాటు ఉద్యమించిన ప్రజలు ఇంకా ఆంధ్రులను, వారి పార్టీలను చేరదీస్తారనుకోవడం ఊహకైనా తప్పే. చంద్రబాబు మాత్రం తెలంగాణ ప్రజలకు గత్యంతరం లేదన్నట్లు మాట్లాడటం అహంకార పూరితమైనది. తెలంగాణ ప్రజల పచ్చిపుండు ఆరకముందే వారి రాజధాని హైదరాబాదులో ఈ డ్రామా వేయడం, వారినే తక్కువ చేస్తూ, వారి విజ్ఞత పట్ల అవగాహనలేని మాటలు మాట్లాడ్డం తెలంగాణ ప్రజల సహనానికి పరీక్ష పెట్టినట్లున్నది.


మొదటిరోజు ఓ పత్రిక శీర్షికవార్త- సంపదలు సృష్టించానని చంద్రుని వాక్కు. అదిసరిగా నిలబెట్టుకోవడం కేసీఆర్ పనట. అసలు సృష్టించేదేమిటీ? దాన్నో అపురూప వస్తువుగా జారిపోకుండా కాపాడుకునేదేంది! తానేదో దానం చేసినట్లు, దాన్ని తాగి తందనాలాడి తగిలేయద్దన్నట్లుంది ఆ మాట. ఎప్పుడో పదేళ్ల క్రితమే ప్రజలకు, పాలనకు దూరమైన టీడీపీ సృష్టించిన సంపద ఎవరికి దక్కిందో లెక్క లు చెబితే బాగుంటుంది. ప్రపంచ బ్యాంకుకు, అమెరికా కంపెనీలకు రాష్ర్టాన్ని తెగనమ్మడమే అభివృద్ధి, వారికి ప్రజాధనంతో సౌకర్యాలు కల్పించడమే సంపద అవదు. టీఆర్‌ఎస్‌కు టీడీపీ అంటే భయమట! ఆ భయపడ్డ వారెవ్వరో వారి లిస్టు ఇస్తే బాగుంటుంది. ఉల్టా చోర్... సామెత లాగుంది ఈ మాట. టీడీపీ తెలంగాణలో కరిగిపోతున్న మంచుగడ్డ. ఏనాడైనా ఆంధ్ర పెత్తనంలేని రాజకీయ పార్టీకే తెలంగాణ ప్రజలు పట్టం కడతారు. ఆంధ్రుల మోసకారితనం, కుటిలనీతిని రుచి చూసిన తెలంగాణ ప్రజలు ఏనాడూ వారిని నమ్మరు.


మహానాడులోని చంద్రబాబు మాటలన్నీ నరుకుడే, బాతాల పోశెట్టి కోతలే! ఒక్కటీ అయ్యేది లేదు పొయ్యేది లేదు. 2019లో తెలంగాణలో టీడీపీ అధికారం అంటే పొల్లగాండ్ల మాటలా, ఆటలా! అసలు ప్రస్తుతం వెంట ఉన్న ఎమ్మెల్యేలను, తాబేదార్లను కాపాడుకోవడమే కనాకష్టం. మానసికంగా టీడీపీకి దూరమైన ప్రజల్లో న్యూనతాభావంతో తిరుగుతున్న వారిని ఊకదంపుడు ఆశగొలుపు మాట లు కట్టిపడేస్తాయన్న నమ్మకం లేదు. చంద్రబాబుకు అంతా తెలుసు. వెలవెల బోతున్న తెలంగాణ కేడర్‌ను ఉత్సాహపరిచేందుకు ఉత్తుత్త మాటలతోనైనా ఊరడించక తప్పదు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో నాయకుడికే తెలుసు, ఆయన్నీ నమ్ముతున్నట్లు నటిస్తున్న వాళ్లకూ తెలుసు. 2019 దాకా వీరిని కాపాడుకోకపోతే వచ్చే ఎన్నికల నాటికి నిలబడే అభ్యర్థులే కరువవుతారు.


సెంటిమెంట్ ఎల్లకాలం ఉండదు అన్న చంద్రబాబు మాట తప్పుడు అంచనా. సెంటిమెంట్‌ను సరియైన కోణంలో అర్థం చేసుకోనట్టే. పరాయి పాలనను ఏ కోశానా అంగీకరించని తెలంగాణ ప్రజల సెంటిమెంటును ఇంత తక్కువగా అంచనా వేయడం తగదు. అన్ని రంగాలలో అన్ని రకాలుగా ఆంధ్రుల దోపి డీ పాలనపట్ల తెలంగాణ ప్రజలు తెలివికి వచ్చి పోరాడటం ఉత్త సెంటిమెంటేనా! అది గాలికి కొట్టుకుపోయే దుమ్ము ధూళియా! దారినపోయే మూర్ఖుడు నేను ఈ కారును కొంటా! ఈ బంగళా కొంటా! అంటుంటే చూసేవాళ్లు, వినేవాళ్లు నవ్వుకుంటారు. లేదా చిత్రంగా చూసేవాళ్లు, నవ్వుకుంటూ చూస్తూ పోతారేగాని, ఆ మాటలను ఏ మాత్రం విశ్వసించరు. 2019లో తెలంగాణలో టీడీపీ పాలన అన్న మాట కూడా అంతే.


ఏ పాలకుడికైనా రాజధాని నగరానికి రంగులద్ది, ఫ్రేముకట్టి చూడండహో అభివృద్ధి అని మెడలో వేసుకుతిరగడం రివాజైంది. కుంటుపడిన వ్యవసాయం, మూలకు పడిన చేతివృత్తులు, మాల్స్ చేతిలో మసిబారిపోయిన చిరువ్యాపారుల బతుకులు కానరావడం లేదు. వీరు మరిచినా ఓట్లేసేటప్పడు వారు నాయకులను మరువరు. బాబు అభివృద్ధి తీరునూ, దాన్ని భుజానేసుకుని తిరిగిన నాయకులను మరువరు. చంద్రబాబు అభివృద్ధినంతా గోరటి వెంకన్న పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల పాట తెల్లగోలు చేసింది. మరో తార్కాణం అవసరం లేదు.


ఎన్టీఆర్‌కు చంద్రబాబు ఏమవుతడో, ఆయనకు ఈయనగారు ఏం చేశారో జగమెరిగిన ముచ్చటే. ఆయనకు ఇవ్వాళ్ల ఎన్టీఆర్ అవతార పురుషుడు. ఇప్పుడు ఎన్టీఆర్ బొమ్మలు, డైలాగులు తెలంగాణలో చెల్లని నాణాలు. ఆయన మాయలోంచి తెలంగాణ ప్రజలు ఏనాడో బయటపడ్డారు. టీడీపీ జాతీయపార్టీగా వీలైనన్ని రాష్ర్టాలకు విస్తరణ అనే మాట పెద్ద జోకు. ఇట్ల పంచుకున్నంత మాత్రాన, ఇంకోరి ఇంట్లో పాగా వేస్తే అక్కడి ప్రజలు ఊరుకుంటారా? అసలు ఏం ఆధారం చేసుకుని తెలుగేతర రాష్ర్టాలకు టీడీపీ విస్తరణ అనడం జరిగిందో! జాతీయ పార్టీ అని చంకలు గుద్దుకోవడంలో అర్థమేమిటో వారికే తెలియాలి. 


ఎర్రబెల్లి, తదితరుల ఒత్తిడికి కక్కలేక మింగలేక రాష్ట్ర విభజన లేఖను రాష్ట్ర పతికి సమర్పించారు గానీ అసలు మర్మమంతా డిసెంబర్ 9ప్రకటన తర్వాత ఆంధ్రప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా లేఖలు సమర్పించడంతో బయటపడింది కదా! రాష్ట్ర విభజనకు ముందుగా లేఖ ఇచ్చింది తెలుగుదేశం పార్టీయేనని ఎర్రబెల్లి నోరునొచ్చేట్లు మొత్తుకున్నా.., పాసివాసనే.. మరోటి కాదు.


నిజానికి ఈ మహానాడు జరిగిన మూడు రోజులు చంద్రబాబు మాటలు తెలంగాణ ప్రజల మనసుల్లో బాధనే కలిగించాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటువల్ల నష్టపోయింది టీడీపీయే. ఎందుకంటే అది ఆంధ్రనాయకుల పార్టీ. అనవసరంగా గోబెల్స్ ప్రచారం చేపట్టి పత్రికలు చులకనవుతున్నాయి. అన్ని వార్తలు మంచిగనే ఉంటాయి. తెలంగాణ ముచ్చట అనగానే చిన్నచూపు, వక్రభాష్యం. పాలనపట్ల విపరీతమైన ధ్వేషం, అక్కసు. చంద్రబాబు అనగానే వార్తల హారతులు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో వేసే వార్తలు తెలంగాణ ప్రజలకెందుకు? తెలంగాణ పాలనపై తికమకపెట్టే చర్యలు, వీలైతే ఎల్లో జర్నలిజం స్థాయి వార్తలు పత్రికలకు శోభనియ్యవు. ఏది నిజమో తెలియక పాఠకులు అయోమయంలో పడిపోతున్నరు. 


కొత్త జేఏసీలు పెట్టే పని పత్రికలకెందుకు? రాజకీయ పార్టీల పాలనను పొగడడం, తెగడడం తెలుగు పత్రికా రంగంలో ఈ స్థాయిలో ఎన్నడూ లేదు. ప్రజలకు నిజాలు కావాలి. మీ సొంత ఎజెండాలు కాదు. తెలంగాణ ప్రజలు తెలంగాణను ఏలుకోనివ్వాలి. వీలైతే నిర్మాణాత్మక సలహాలిచ్చి ఓ చేయి వేయాలి. కానీ నడిచే కాళ్లల్లో కట్టెను బెట్టే పనులు చేయొద్దు. కావాలనే మీడియా గొంతు నొక్కితే ఆ పాపం ప్రభుత్వాలను తప్పకుండా చుట్టుకుంటుంది. తెలంగాణ మీడియా ఇప్పుడిప్పుడే విచ్చుకుంటున్నది. 


ఎదగనీయాలి. పాత్రికేయ విలువలను కాపాడుతూ, బాధ్యతగల పాత్రను పోషిస్తూ రెండు రాష్ర్టాల ప్రజలను, వారి పాలనను ఒక్కలా చూడాలి. స్వార్థ చింతనతో సీమాంధ్ర నేతలను తెలంగాణలో ప్రతిష్ఠించాలని ఉబలాటబడుతున్న పార్టీని నెత్తికెక్కించుకుంటే క్రమక్రమంగా తెలంగాణలో వీటి ఉనికి కనుమరుగుకాకతప్పదు. ఆ రోజులు మొదలయినట్లే ఉంది పరిశీలిస్తుంటే..

- బి.నర్సన్

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి