గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, జూన్ 05, 2014

సెర్ప్ (రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ) లో సీమాంధ్రుల మకాం!

-అత్యధిక డైరెక్టర్లు సీమాంధ్ర రిటైర్డ్ అధికారులే 
-దొడ్డిదారిన ర్యాటిఫికేషన్ పద్ధతిలో పదోన్నతులు
-ఏజెన్సీ నియామకాల్లోనూ చేతివాటం
-ఖజనాకు భారం.. ఫలితాలు ఘోరం
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు రిటైర్డ్ ఉన్నతాధికారులు, వారి బంధువులు, ఎన్జీవో సంస్థల ప్రతినిధులకు తెలంగాణ రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) పునరావాస కేంద్రంగా తయారైంది. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని నిర్మూలించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించి అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్ సంస్థను ఏర్పాటు చేసింది. ఇంతటి ప్రాధాన్యం కల్గిన సంస్థలో ఉద్యోగుల నియామకానికి ప్రత్యేక విధానమంటూ లేదు. దీన్ని ఆసరాగా తీసుకున్న సీమాంధ్ర ఉన్నతాధికారులు సెర్ప్‌ను సీమాంధ్ర సంస్థగా మార్చేశారు. సంస్థపై గుత్తాధిపత్యం చెలాయిస్తూ విభజన తర్వాత కూడా ఇంకా పెత్తనం సాగించేందుకు కుట్రలు చేస్తున్నారు. విభజన సందర్భంగా సెర్ప్‌లోని డైరెక్టర్ పోస్టులను, 187 మంది ఉద్యోగులను ఇరురాష్ట్రాలకు ఆయా ప్రాంతాల్లో అమల్లో ఉన్న ప్రాజెక్టులకు అనుగుణంగా కేటాయించారు. 

list
ఈ క్రమంలో తెలంగాణకు 10, సీమాంధ్రకు 10 డైరెక్టర్ పోస్టులు పంపిణీ చేశారు. డైరెక్టర్ పోస్టులలో కేవలం ఇద్దరు మాత్రమే తెలంగాణవారు ఉండడంతో మరో 8 పోస్టులను ఖాళీలుగా చూపారు. వీటిని పదోన్నతుల ద్వారా తెలంగాణ వారితో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ సీమాంధ్ర అధికారులు మాత్రం ఈ ప్రతిపాదనలను బుట్టదాఖలు చేసి రాత్రికిరాత్రే ఖాళీగా ఉన్న డైరెక్టర్ పోస్టుల్లో సీమాంధ్రకు బదిలీ అయిన వారిని నియమించే కుట్రలకు తెరలేపారు. ఉన్నతస్థాయిలో ఉన్న సీమాంధ్ర అధికారులు ఉద్యోగుల కేటాయింపులకు సంబంధించిన జాబితాను కూడా తారుమారు చేసినట్లు సమాచారం. ప్రాధాన్యత ఉన్న డైరెక్టర్ పోస్టులను సీమాంధ్రకు కేటాయించి, తెలంగాణలో ఉన్న డైరెక్టర్ పోస్టులను ప్రాధాన్యం లేనివిగా చూపి వాటి మూసివేతకు కుట్ర పన్నుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏజెన్సీల ద్వారా అటెండర్లుగా తీసుకున్న సీమాంధ్ర సిబ్బందికి కొంతమంది డైరెక్టర్లు అడ్డదారిలో పదోన్నతులు కల్పిస్తున్నారు. ఇందుకోసం రికార్డులు మార్చి ర్యాటిఫికేషన్ (పెండింగ్ అప్రూవల్ పద్ధతి)లో ప్రమోషన్లు కట్టబెడుతున్నారనే ఆరోపణలున్నాయి. 

ఉద్యోగుల నియామకంలో సెర్ప్ పాలకమండలిదే తుదినిర్ణయం కావడంతో కీలక స్థానాల్లో ఉన్న సీమాంధ్ర అధికారులు వ్యూహాత్మకంగా సంస్థలోని వివిధ విభాగాలలో సీమాంధ్ర వారిని నియమిస్తున్నారు. సంస్థలో అవసరం లేని డైరెక్టర్ పోస్టులను సృష్టిస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఒకే క్యాడర్‌లో ఉద్యోగులు పనిచేస్తున్నప్పటికీ వేతనాల విషయంలో తెలంగాణ , సీమాంధ్ర ఉద్యోగుల మధ్య రూ.వేల వ్యత్యాసం ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. సంబంధిత డైరెక్టర్ల నుంచి ఏదైనా సమాచారం కావాలని కోరితే ఉన్నతాధికారుల ఆదేశాలు లేనిదే ఇవ్వలేమని చెప్పడం గమనార్హం. సీమాంధ్ర అధికారుల కుట్రలపై ఇప్పటికే తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ఏర్పాటు చేసిన వార్‌రూంకు సెర్ప్ సిబ్బంది నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి. సెర్ప్‌లో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం విచారణ జరిపి ఉన్నతాధికారుల కుట్రలను బట్టబయలు చేయాలని పలు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి