గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, జులై 31, 2014

హెరిటేజ్ భవనం స్వాధీనానికి.. ఆంధ్ర పోలీస్ కుట్ర !

- బ్రిటిష్‌నాటి కట్టడం దక్కించుకునేందుకు యత్నం
- తమకు కేటాయించాలంటూ గవర్నర్‌కు లేఖలు
- ఇచ్చే ప్రసక్తేలేదంటున్న తెలంగాణ అధికారులు
రాష్ట్రం విడిపోయినా తెలంగాణపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు ఆంధ్ర పోలీసు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. విభజనలో తమకు కేటాయించని ఓ పురాతన భవనాన్ని సొంతం చేసుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు. పాత డీజీపీ కార్యాలయంలో ఉన్న పురాతన భవనాన్ని తమకు కేటాయించాలంటూ గవర్నర్‌కు లేఖల మీద లేఖలు రాస్తు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 
police-Heritageవిభజనలో భాగంగా సీఐడీ నూతన భవనాన్ని ఏపీ పోలీస్ డీజీపీ కార్యాలయంగా, పాత డీజీపీ కార్యాలయాన్ని తెలంగాణ పోలీస్ డీజీపీ కార్యాలయంగా కేటాయించారు. ఆంధ్ర సీఐడీ విభాగం కోసం ఏసీ గార్డ్స్‌లోని పాత సీఐడీ కార్యాలయాన్ని, తెలంగాణ సీఐడీకి తెలంగాణ డీజీపీ కార్యాలయంలోని మూడో ఫ్లోర్‌ను కేటాయించారు. చారిత్రక నేపథ్యం..ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు పాత డీజీపీ కార్యాలయంలో ఉన్న పురాతన భవనంపై ఆంధ్రా అధికారుల కన్నుపడింది. బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఈ భవనాన్ని స్వాధీనం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని తెలంగాణ పోలీస్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అత్యంత పటిష్ఠంగా ఉన్న ఈ భవనంలో 1896 నుంచి 1992 వరకు పోలీస్ బాస్‌లు విధులు నిర్వర్తించారు. అంతటి చారిత్రకనేపథ్యం ఉన్న భవనాన్ని తమకు కేటాయించాలంటూ నెలరోజులుగా గవర్నర్‌కు లేఖల మీద లేఖలు రాస్తున్నట్టు తెలిసింది. తమకు భవనాల కొరత ఉందని కట్టుకథలు చెప్తూ తెలంగాణ డీజీపీకీ లేఖలు రాశారు. దీనిపై తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు ఘాటుగానే స్పందించారు. బ్రిటీష్ కాలం నుంచి నిజాం రాజులు, తెలంగాణ పోలీస్‌శాఖ వరకు ప్రత్యేకమైన నేపథ్యం ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో ఈ భవనం వదులుకోబోమని వారు చెప్పినట్టు సమాచారం. విభజన జరిగిన తర్వాత ఆ భవనానికి సంబంధించి కరెంట్‌బిల్లు చెల్లించడంతోపాటు భవన మరమ్మతులు తెలంగాణ పోలీస్ శాఖే చేయించిందని, అలాంటి భవనంపై తమకే పూర్తి హక్కులుంటాయని తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులు అంటున్నారు.

అన్ని భవనాలు ఆంధ్రాకేనా?

నూతన సీఐడీ భవనం, పాత సీఐడీ భవనం, హైదరాబాద్‌రేంజ్ ఆఫీస్.. ఇలా పోలీస్‌శాఖలో ఉన్న ప్రధాన కార్యాలయాలన్నీ ఆంధ్ర పోలీస్ శాఖకే కేటాయించడంతో తెలంగాణ పోలీస్‌శాఖకు భవనాల కొరత ఏర్పడింది.

తాజాగా బ్రిటీష్ కాలంనాటి చారిత్రక కట్టడం పాత డీజీపీ కార్యాలయాన్ని కూడా కేటాయించాలని ఆంధ్రా అధికారులు అడగడం కుట్రపూరితమే అవుతుందని తెలంగాణ పోలీస్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఒకేచోట రెండురాష్ర్టాల పోలీస్‌శాఖలు పనిచేయలేవనే కారణంతోనే వేర్వేరుగా కార్యాలయాలు కేటాయించారు. తెలంగాణ పోలీస్ ప్రధానకార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఈ హెరిటేజ్ భవనం తమకే చెందుతుందని గవర్నర్‌కు రాసిన లేఖలో తెలంగాణ అధికారులు స్పష్టంచేశారు. ఈ భవనాన్ని త్వరలోనే ఆధునీకరిస్తామని ఉన్నతాధికారులు టీ మీడియాకు తెలిపారు. చారిత్రక నిర్మాణాలకు పుట్టినిల్లులాంటి తెలంగాణలో ఈ భవనం తెలంగాణ పోలీస్‌శాఖకే చెందేలా గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

"దస్‌కా బీస్... బీస్‌కా చాలీస్..." -సచివాలయంలో ఆంధ్ర కాంట్రాక్టర్ల హవా...!

-సచివాలయంలో ఆంధ్ర కాంట్రాక్టర్ల హవా!
-పెన్నులు, పిన్నులు మొదలు ఫర్నీచర్‌దాకా
-మార్కెట్ రేటుకు రెట్టింపు ధరలతో సరఫరా
-గప్‌చుప్‌గా ఆర్థిక శాఖ అధికారులు
-పర్సంటేజీలు అందుతుండటంతోనే!
దస్‌కా బీస్.. బీస్ కా చాలీస్! ఇదేమీ సిన్మా థియేటర్ల వద్ద బ్లాక్ టికెట్ల వ్యవహారం కాదు! వందకు వెయ్యి.. వెయ్యికి పదివేలు..! ఇదేమీ కాయ్ రాజా కాయ్ అంటూ సాగే పందాలు కావు! తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో స్టేషనరీ, ఫర్నీచర్, కంప్యూటర్లు వగైరా సరఫరా చేసే కాంట్రాక్టర్ల బిల్లింగ్ వ్యవహారం.
Office-Stationery-Suppliesతెలంగాణను ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర వలసపాలకులు, వారి ఆశ్రితులు అందినంత దోచుకుతింటే.. సచివాలయం సహా వివిధ ప్రభుత్వ విభాగాల్లో అవసరమైన స్టేషనరీ, ఫర్నీచర్ తదితరాలు సమకూర్చే ఆంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత కూడా తమతమ స్థాయిలో చిలక్కొట్టుడు కొడుతున్నారు. పిన్నులు, పెన్నులు, ఫైళ్లు, అందులో కాగితాలు మొదలుకుని విద్యుత్ ఉపకరణాలు, కంప్యూటర్లు, ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు, ఫర్నీచర్, అధికారుల ట్రావెల్ సదుపాయాల వరకూ సరఫరా చేసే, సమకూర్చిపెట్టే, మరమ్మతులు చేసే కాంట్రాక్టు సంస్థలన్నీ ఆంధ్ర ప్రాంతంవారివే కావడం విశేషం.
సీఎం పేషీ, మంత్రుల కార్యాలయాలు సహా పెద్ద సంఖ్యలో ఆఫీసులు ఉన్న సచివాలయంలో సహజంగానే కాగితాలు, కలాలు, గుండు పిన్నులు వంటి స్టేషనరీ అదే స్థాయిలో అవసరం ఉంటుంది. ఒక్క స్టేషనరీ ఖర్చే రోజుకు వేల రూపాయల్లో ఉంటుంది. ఈ స్టేషనరీ సరఫరాలో భారీ స్థాయిలో అవకతవకలు జరుగుతున్నట్లు అభిప్రాయాలు ఉన్నాయి. చాలామటుకు కేసులలో బయటి మార్కెట్ ధరకు రెట్టింపు బిల్లు వేస్తున్నారని పలువురు సిబ్బంది చెప్తున్నారు.

అధికమొత్తంలో సరఫరా చేసే సంస్థల నుంచి అధికారులకు, కొందరు కీలక ఉద్యోగులకు సరఫరా కాంట్రాక్ట్ సంస్థల నుంచి పర్సంటేజి ముడుతుంటుందని అంటున్నారు. అందుకే సరఫరాదారులు రెట్టింపు బిల్లులు వేసినా.. వాటిని క్లియర్ చేసేస్తుంటారని సమాచారం. కొత్తగా ఐఏఎస్ అధికారులు నియమితులైనప్పుడు, మంత్రులు బాధ్యతలు స్వీకరించినప్పుడు కాంట్రాక్టర్లకు పండుగే.

వారివారి పేషీల్లోకి అవసరమైన ఫర్నీచర్‌ను సరఫరా చేసే సమయంలో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా బిల్లులు వసూలు చేస్తున్నారని అంటున్నారు. ఇవి లక్షల రూపాయల్లో ఉండటంతో మార్జిన్లు కూడా అధికంగానే ఉంటాయని చెబుతున్నారు. సర్కారీసొమ్మేకదా.. మనదేం పోయిందని భావించే కొందరు అధికారులు పర్సంటేజీలకు ఆశపడి.. కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అందుకే బయట పది రూపాయలకు దొరికే వస్తువుకు సెక్రటేరియట్‌లో ఇరవై, ఇరవై ఐదు రూపాయలకు సరఫరా చేస్తున్నారని తెలుస్తున్నది.

సాధారణ ప్రజల పనులకోసం చిన్న చిన్న విషయాలకు సైతం కొర్రీలు వేసే ఆర్థికశాఖ అధికారులు ఇలాంటి వాటికి మాత్రం ఎలాంటి అడ్డుపుల్లలు వేయకపోవడం విశేషం. ఐఏఎస్ అధికారులు, మంత్రులకు ట్రావెల్స్ పేరుతో వాహనాలు ఏర్పాటు చేసేవారిది మరో వ్యవహారం. ఈ వాహనాల కోసం నెలకు వేల రూపాయల్లో అద్దెలను అధికారులు చెల్లిస్తుంటారు. వాహనాలు సరఫరా చేసే ట్రావెల్ ఏజన్సీలు కూడా ఆంధ్ర ప్రాంతం వారివే. మరి ఈ చిలక్కొట్టుడుకు ముగింపు ఎప్పుడో?
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

బుధవారం, జులై 30, 2014

ఉమ్మడి అడ్మిషన్ల విధానానికి.. ఆంధ్రా సర్కార్ తూట్లు!

- ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌పై ఏకపక్ష నిర్ణయం
- ఏపీ ఒత్తిడితో ఉన్నత విద్యామండలి నిర్ణయం
- కౌన్సెలింగ్‌ను వ్యతిరేకించిన 9 మంది సభ్యులు
- ఎంసెట్ అడ్మిషన్లపై సుప్రీంలో కొనసాగుతున్న విచారణ
- షెడ్యూల్ ప్రకటించడం కోర్టు ధిక్కారమే!
- తాజా పరిణామాలపై సీఎం కేసీఆర్ ఆగ్రహం!
- ఎవరికీ అన్యాయం జరగదన్న మంత్రి జగదీశ్‌రెడ్డి
రాష్ట్ర విభజన జరిగినా ఆంధ్ర పాలకులు మాత్రం తమ ఆధిపత్యధోరణిని విడనాడటం లేదు. విద్యుత్ పీపీఏలు, కృష్ణా నీటి పంపిణీలో తెలంగాణకు అన్యాయం చేయాలని ప్రయత్నించి విఫలమైన ఆంధ్రబాబులు తాజాగా విద్యారంగంలోనూ వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి విద్యా విధానానికి తూట్లు పొడుస్తూ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏపీ సన్నాహాలు చేస్తుండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండురాష్ర్టాలలో ఇంజినీరింగ్, మెడికల్, ఎంబీఎ, ఎంసీఏ, బీఎడ్‌వంటి వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాల్లో పదేండ్లపాటు ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఉమ్మడి అడ్మిషన్ల విధానానికి ఆంధ్ర సర్కారు తూట్లు పొడిచింది. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ తేదీలపై సోమవారం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై ఎంసెట్ అడ్మిషన్ల కమిటీ సమావేశంలో పాల్గొన్న తొమ్మిదిమంది సభ్యులు కూడా తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. అవేవీ పట్టించుకోకుండా ఆంధ్రప్రభుత్వ ఒత్తిడితో ఇంజినీరింగ్‌లో ప్రవేశాల కోసం ఆగస్టు 7 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభించాలని ఉన్నత విద్యామండలి ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పాటైన నేపథ్యంలో సిబ్బంది విభజనకు సంబంధించిన పనులు పూర్తికాలేదు. దీంతో ఆయా ప్రభుత్వ విభాగాలలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. దీంతోపాటు ఫీజుల పథకంలో కొన్ని మార్పులు చోటుచేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ గడువును అక్టోబర్ నెలాఖరువరకు పెంచాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని విద్యాశాఖ అధికారులు చెప్పారు. దీనికి సంబంధించి అక్టోబర్ 4న కేసు విచారణకు రానుందని, అందుకే కౌన్సెలింగ్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఒకవేళ ఏదైనా నిర్ణయం తీసుకున్నా అది కోర్టు ధిక్కారం అవుతుందని వారు అంటున్నారు. ఇదేవిషయాన్ని ఉన్నత విద్యా మండలి చైర్మన్‌కు లేఖ ద్వారా తెలియజేశారు. అయినప్పటికీ ఉన్నత విద్యా మండలి అధికారులు పెడచెవిన పెట్టారు. విద్యా మండలి చైర్మన్ ఆంధ్ర ప్రభుత్వం చెప్పినట్టు ఆడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

సీఎం కేసీఆర్ ఆగ్రహం!

కౌన్సెలింగ్ తేదీల షెడ్యూల్‌ను ప్రకటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగకుండా చూడాలని ఆదేశించినట్టు తెలుస్తున్నది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత తెలంగాణలో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించినట్టు సీఎం కార్యాలయ వర్గాలు చెప్పాయి. అడ్మిషన్ల విషయంలో తెలంగాణ విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరుగనివ్వమని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు.

సర్టిఫికెట్ల పరిశీలనకు సహకరించం: టీ పాలా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉన్నతమండలి తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ పాలిటెక్నికల్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ (టీ పాలా) ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చే నెల 7 నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ సర్టిఫికెట్ల పరిశీలనా ప్రక్రియను తాము బహిష్కరిస్తున్నామని టీ పాలా రాష్ట్ర నాయకులు ఎంనాగరాజు, తారాసింగ్ ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం చెబితేనే తాము కౌన్సెలింగ్‌కు సహకరిస్తామన్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

పోలవరం ముసుగులో తెలంగాణ ఖనిజ దోపిడీకి రహదారి!

-పోలవరం ముసుగులో సక్రమం కానున్న అక్రమాలు
-రంగంలోకి దిగనున్న ఆంధ్రా పెట్టుబడిదారులు
-ఏడు మండలాల్లో సంపదను కొల్లగొట్టేందుకు సిద్ధం
-బాక్సైట్, రంగురాళ్లు, గ్రాఫైట్, టేకు.. అన్నీ ఖతం
పార్లమెంట్‌లో పోలవరం ఆర్డినెన్స్ ఆమోదం పొందడంతో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిదారుల అనందానికి అవధుల్లేకుండాపోయాయి. భద్రాచలం ఏజెన్సీలోని ఏడు మండలాల్లోని ఆదివాసీలను తరిమికొట్టి అపారమైన ఖనిజ సంపద, కలప,ఇసుకను ోచుకునేందుకు ిద్ధమవుతున్నారు. ఇన్నాళ్లూ ఈ ప్రాంతం తెలంగాణలో ఉండడం, ఆదివాసీచట్టాలు అడ్డురావడంతో దొడ్డిదారిన దోచుకున్న పెట్టుబడిదారులు ఇప్పుడిక రాజమార్గంలోనే రూ.30 లక్షల కోట్లు విలువైన సంపదను లూటీ చేయనున్నారు. 
విలువైన బాక్సైట్, రంగురాళ్లు మింగుడే: చింతూరు, వీఆర్‌పురం మండలాల మధ్య 30 కిలోమీటర్ల మేర లక్ష హెక్టార్లలో ఖనిజం విస్తరించి ఉన్నట్లు అంచనా. ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడితే 200ఏండ్లు బాక్సైట్‌ను వెలికి తీస్తూ 50వేల మం దికి ఉపాధి కల్పించవచ్చు. టన్ను బాక్సైట్ రూ.15వేల నుంచి రూ.20వేల ఉంది. మొత్తం రూ.5లక్షల కోట్ల ముడిఖనిజం ఇక్కడ లభ్యమవుతుంది. చింతూరు నుంచి మోతుగూడెం వరకు పదికిలోమీటర్లలో 20 వేల హెక్టార్లలో రంగురాళ్లున్నాయి. జైపూర్, ముంబై కంపెనీలతోపాటు ఆంధ్రా పెట్టుబడిదారులు ఇప్పటికే చాలా వరకు వీటిని తరలించుకుపోయారు. ఇప్పుడు ఆంధ్రా పెట్టుబడివర్గం చూపంతా రంగురాళ్లపైనే ఉంది. చింతూరు మండలంలో రూ.10 లక్షల కోట్లు విలువ చేసే గ్రాఫైట్ ముడిఖనిజం 50వేల హెక్టార్లలో విస్తరించి ఉందని అంచనా. గతంలోనే ఆంధ్రా పెట్టుబడదారులు క్వారీలు తవ్వడానికి ప్రయత్నిచంగా స్థానికుల తిరుగుబాటతో వెనుదిరిగారు.

ఇక్కడ పరిశ్రమ ఏర్పడితే 50 ఏండ్లపాటు ఉత్పత్తి కొనసాగుతుంది. 5 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఇప్పుడు ఈ ఖనిజాన్ని కూడా ఆంధ్రా పెట్టుబడివర్గం తమ ఖాతాలో వేసుకోనుంది. ఏజెన్సీలో లక్షల హెక్టార్లలో టేకుప్లాంటేషన్లున్నాయి. 2011లో చింతూరు మండలం కొమ్మూరులో రూ.6 కోట్ల విలువైన ఒక టేకు ప్లాంటేషన్‌ను దొడ్డిదారిన దోచుకెళ్లారు. వీఆర్‌పురం, కూనవరం, భద్రాచ లం మండలాల్లోనూ టేకు ప్లాంటేషన్లు ఉన్నాయి. ఒక్కో ప్లాంటేషన్ 20, 30 హెక్టార్లలో విస్తరించిన వీటి విలువ రూ.10 లక్షల కోట్లు ఉంటుందని అంచనా.

ఇసుక ర్యాంపుల మునక: భద్రాచలం రాముడి పాదాలు తాకుతూ సుమారు 300 కిలోమీటర్ల మేర గోదావరి ప్రవహిస్తున్నది. న్యాయబద్ధమైనవి 12 ఇసుక ర్యాంపులున్నాయి. న్యాయబద్ధంగా లేనివి వందల్లో ఉన్నాయి. రాష్ట్రంలో మరెక్కడా దొరకని నాణ్యమైన ఇసుక ఈ ఏజెన్సీలో ఉంది. యంత్రాలతో తవ్వినా తరగని ఇసుక గని భద్రాచలం. దీనిపైనా ఆంధ్రా పెట్టుబడిదారులు కన్నేశారు. ఇప్పటికే బినామీపేర్లతో ఇసుక టెండర్లను కైవసం చేసుకొని కోట్లు కూడబెట్టారు. ఇప్పుడు కూనవరం, వీఆర్‌పురం, భద్రాచలం, వేలేరుపాడు, కుక్కునూరు, బుర్గంపాడు మండలాల్లో ఇసుక ర్యాంపులు ఉండవు. పోలవరం పుణ్యమాని నీటమునగక తప్పదు. పోలవరం నిర్మాణం జరిగితే నీరు స్టోరేజీ అవుతుంది. ఈ ర్యాంపులు శాశ్వతంగా కనుమరుగవుతాయి. ఆదివాసీలకు కనీసం కూలిపని కూడా దొరకదు.

ఆదివాసీల భూములకు దిక్కెవరు: ఏజెన్సీలోని గోదావరి పరిహారక ప్రాంతం నల్లరేగడి, కండ కలిగిన భూమి కావడంతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెం దిన వలస రైతులు అమాయక ఆదివాసీల వద్ద కౌలుకు తీసుకొని దశాబ్దాలుగా సాగు చేస్తున్నారు. అంతా చౌదరి, నాయుడు, రాజు సామాజికవర్గం వారే. 80 శాతం ఆదివాసీల భూములు వీరి గుప్పిట్లోనే ఉన్నాయి. ఏడు మండలాలు ఆంధ్రా లో విలీనమైనందున ఆదివాసీల భూములను లాక్కునేందుకు కుట్రపన్ననున్నారు. పీసా, 1/70 చట్టాలను తొక్కిపట్టి ఆంధ్రా అగ్రకులాలు ఆదివాసీల భూములను లాక్కునే ప్రమాదం ఉంది. ఏడు మండలాల ఆదివాసీల భూములకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంత వరకు భరోసా ఇవ్వలేదు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

గతమంతా అవినీతిమయమే...!

తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అంతానికి సరియైన దిశలో అడుగులు పడుతున్నాయి. ప్రతి పథకంలోనూ వేల కోట్ల కుంభకోణం బయటపడుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిని రూపుమాపేందుకు వ్యవస్థాపరమైన దిద్దుబాటు మొదలుపెట్టారు. దీన్ని కొనసాగించి అవినీతిపరుల బొక్కసాల్లోంచి అక్రమ ధనాన్ని బయటకు తీయాలి. ఇలా వచ్చిన ధనంతో బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా ప్రజోపయోగ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయాలి. 

అవినీతి చీడ పీడలేని చోటు అంగుళమైనా ఉన్నదా అంటే అనుమానమే. రాష్ట్రం లో దేశంలో అవినీతి రక్కసి జడలు విప్పి నాట్యం చేస్తున్నది. ప్రజా జీవనాన్ని అతలా కుతలం చేస్తున్నది. మొత్తం పాలనా వ్యవస్థను నిర్వీర్యం చేసింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరుణంలో అడుగు వేయాలన్నా అవినీతే పెద్ద అడ్డంకిగా తయారయింది. కాబట్టి అవినీతి రక్కసి రెక్కలు విరిచి వేయకుండా మన రాష్ట్రంలో మన పాలన సాగేట్టు లేదు. ఈ నేపథ్యంలోనే అవినీతి అనేది ప్రధాన చర్చగా ముందుకు వచ్చింది.

వ్యవస్థ మొత్తం అవినీతిమయమైందన్న మాట చాలా కాలంగా అందరూ అంటు న్నా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత గత ప్రభుత్వాల బట్టబయలవుతున్నా యి. ముఖ్యంగా పాలనా వ్యవస్థే అవినీతిని పెంచి పోషిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో తేటతెల్లమవుతున్నది. ప్రభుత్వ పథకాలన్నీ అవినీతికి కేంద్రాలుగా మారిపోయాయి. ముఖ్యంగా సంక్షేమ పథకాలంటేనే అవినీతికి చిరునామాగా తయారయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకుల ఛత్రఛాయల్లో అధికారయంత్రాం గం, నేతలు, బ్రోకర్లు ఏకమై పథకాలన్నింటినీ అవినీతిమయం చేశారు. ముఖ్యంగా రేషన్ కార్డులు,ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్ల పథకాల్లో అవినీతి కట్టలు తెగి ప్రవహించింది.

పేద, బలహీన వర్గాలకు చౌక ధరలకు నిత్యావసరాలను సరఫరా చేసే తెల్ల రేషన్ కార్డుల్లో కూడా అవినీతికి అంతేలేదు. తెలంగాణ రాష్ట్రంలో 85 లక్షలు కుటుంబాలు ఉంటే 89 లక్షల తెల్లకార్డులు ఇచ్చారు. ఇవేగాక మరో 14లక్షల పింక్ కార్డులు ఉన్నాయి. ఒకానొక అధ్యయనంలో ఇందులో 30 శాతం బోగస్ కార్డులుంటాయని తేలింది. ఆరోగ్యశ్రీ పథకం అయితే బడుగు, బలహీన వర్గాల కోసం గాకుండా కార్పొరేట్ హాస్పిటళ్ల కోసమే తయారైనట్లుగా ఉన్నది. ఈపథకం కింద ఐదేళ్లలోనే 30 వేల కోట్లు ఖర్చు చేశారని సమాచారం. ఇవన్నీ రాష్ట్రంలోని కొన్ని హాస్పిటళ్లకే స్వంతమయ్యాయి.

ఆరోగ్యశ్రీ పథకం కింద ఖర్చు చేసిన ఈ ప్రభుత్వ డబ్బుతో నిమ్స్ లాంటి పది ఆసుపత్రులను నిర్మించుకోవచ్చు. ఇక ఫీజు రీయింబర్స్‌మెంటు అనేది కూడా కాలేజీ యాజమాన్యాల కోసమే ఉన్నట్లుగా తయారైంది. కేవలం ఫీజు రీయింబర్స్ ఫండు కోసమే నడుస్తున్న ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయంటే ఆశ్చర్యం లేదు. కనీస బోధ నా సిబ్బంది, వసతులు లేకుండా, కనీస విద్యాప్రమాణాలు పాటించకుండా నడుస్తున్న కాలేజీలే ఎక్కువ అని నిపుణుల కమిటీ ఒకటి తేల్చింది. ఇలాంటి వృత్తివిద్యా కళాశాలలు ప్రతి యేటా 4వేల కోట్లు దండుకుంటున్నాయి. దీనిలో కనీసం 2, 500 కోట్ల రూపాయలు అప్పనంగా బుక్కుతున్నాయి. పేదవాడి ఇంటి పథకంలో అవినీతి, అక్రమాలు పరాకాష్టకు చేరుకున్నాయి.

తెలంగాణలో 11,200 గ్రామాలుంటే 593 గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం దశాబ్దకాలంలో 22లక్షల 40 వేల ఇళ్లు నిర్మించినట్లు కాగితా ల్లో రాసుకున్నారు.తెలంగాణ ప్రభుత్వం 293 గ్రామాల్లో నిర్వహించిన సర్వేలో 36 వేల ఇళ్లు కాగితాలపైనే ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. వీటి పేరుమీద 235 కోట్లు దళారులూ, నేతల జేబుల్లోకి వెళ్లాయి. ఒక్క 2008-09 సంవత్సరంలోనే 5,500 కోట్లు పేదల ఇళ్ల కోసం ఖర్చు చేసినట్లు రాశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆదిలాబాద్ నియోజకవర్గంలోనే 45వేల ఇళ్లు నిర్మించినట్లు చెప్పుకున్నారు. ఇదే విధంగా మంథనిలో 41,099, కొడంగల్‌లో 32,337, పరిగిలో 30, 410 ఇళ్లు నిర్మించి పేదవాడికి సొంత ఇంటి భాగ్యం కల్పించినట్లు చెప్పారు. తీరా చూస్తే చాలా గ్రామాల్లో ప్రభుత్వ లెక్కల్లో చూపినట్లు పేదల ఇళ్లూ లేవు, పేదలూ లేరు. అంటే ఇళ్లన్నీ కాగితాలపైనే ఉండి, కోట్ల రూపాయల ప్రజా ధనమంతా అవినీతి పరుల జేబుల్లోకి వెళ్లింది.

ఇంత జరుగుతున్నా ఈ సమాజమంతా చూస్తూ ఊరుకున్నదా? అంటే అదేం లేదు. అంతా అవినీతి గురించి మాట్లాడే వారే. రాజకీయనాయకులూ, సివిల్ సొసైటీ అని చెప్పుకునే అనేక స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు, వ్యక్తులూ అందరూ మాట్లాడారు. అయితే వ్యవస్థీకృత అవినీతిని వ్యక్తిగత అవినీతిగా చూపి కొందరు అధికారులను బాధ్యులను చేశారు. అవినీతికి వ్యతిరేకంగా తాము ఎంత ఘటికులో చెప్పుకునేందుకు ఇళ్ల కుంభకోణంలో 490 మంది అధికారులను సస్పెండ్ చేశారు.

ఇంకో 285 మందిని ఉద్యోగాలనుంచి తొలగించి చేతులు దులుపుకున్నారు. నిజానికి అవినీతి వృక్షానికి వేర్లు పైన ఉంటాయి. శాఖలు కిందికి విస్తరిస్తాయి. అవినీతికి ఆయువు పట్టు పాలకుల్లో ఉన్నది. పథకాల విధివిధానాల రూపకల్పనలో ఉన్నది. వాటి అమలులో ఉన్నది. అవీనితికి బాధ్యులుగా చేసి శిక్షించ దలిస్తే మొదటి ముద్దాయిలుగా గత ప్రభుత్వాల్లోని పెద్ద మనుషులు ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుం ది. ఇన్నాళ్లకైనా తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అంతానికి సరియైన దిశలో అడుగులు పడుతున్నాయి. ప్రతి పథకంలోనూ వేల కోట్ల కుంభకోణం బయటపడుతున్నది.

ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిని రూపుమాపేందుకు వ్యవస్థాపరమైన దిద్దుబాటు మొదలుపెట్టారు. దీన్ని కొనసాగించి అవినీతి పరుల బొక్కసాల్లోంచి అక్రమ సొమ్ము ను బయటకు తీయాలి. ఇలా వచ్చిన ధనంతో బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా ప్రజోపయోగ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయాలి. అలాగే అవినీతిని రూపుమాపేందుకు సంక్షేమ పథకాల రూపకల్పనలోనూ, అమలులోనూ పారదర్శకత ఉండే విధంగా విధివిధానాలు రూపొందించాలి. ఇది తెలంగాణ ప్రజాకాంక్ష.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

మంగళవారం, జులై 29, 2014

గోదావరిపై ఏపీ సర్కార్ రాద్ధాంతం...!

-బేసిన్‌పై పెత్తనానికి కుట్ర
-సక్రమ ప్రాజెక్ట్‌లపై కూడా అనవసర పేచీలు
-తెలంగాణ వాటాకు గండికొట్టే యత్నం
-6న రివర్‌బోర్డు సమావేశం
ఉమ్మడి రా్రష్ట్రంలో కృష్ణా నీటికి గండి కొట్టిన ఆంధ్రప్రదేశ్ పాలకులు విభజన తర్వాత తెలంగాణలోని గోదావరి నీటిపై పెత్తనం కోసం అనవసర పేచీలు పెడుతూ కొత్త వివాదాలను తెరపైకి తెస్తున్నారు. ఎలాంటి వివాదం లేకుండా పూర్తిగా తెలంగాణ పరిధిలోనే ఉన్న సక్రమ ప్రాజెక్ట్‌లకు కూడా మళ్లీ ఆమోదముద్ర కావాలంటూ లొల్లి చేస్తున్నారు.
గోదావరి బేసిన్‌లో ఎలాంటి వివాదాలు, పంపకాలు లేకపోయినా వాటిని కేంద్ర జలసంఘం పరిధిలోకి తీసుకొచ్చి తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని కుట్రలు పన్నుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే పాలనా అనుమతులు పొంది, ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్లు వేసి ఏనాడో పనులు మొదలైన ప్రాజెక్ట్‌లపై కూడా ఆంధ్రసర్కార్ కిరికిరి చేస్తున్నది. ప్రాణహిత- చేవెళ్ల, కాంతనపల్లి, రాజీవ్‌సాగర్-దుమ్ముగూడెం, రుద్రమకోట ఎత్తిపోతల పథకం, శ్రీపాద ఎల్లంపంల్లి బ్యారేజీ, కాళేశ్వరం, కొమురంభీమ్ ప్రాజెక్ట్‌లకు కేంద్రం ఆధీనంలోని అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి చేయాలని ఆంధ్ర సర్కార్ వాదిస్తున్నది.
కేంద్ర జలసంఘం నుంచి ఇంకా పూర్తిస్థాయి అనుమతి రాలేదు కాబట్టి వీటిని పునః సమీక్షించి నీటి వాటా లెక్కలు చూడాలని వితండ వాదన చేస్తున్నది. నిజానికి ఈ ప్రాజెక్ట్‌లన్నింటికీ ఉమ్మడి రాష్ట్రంలోనే పరిపాలనా పరమైన అనుమతులు లభించాయి. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అనుమతులు, కేంద్ర జలసంఘంలో దశలవారీ క్లియరెన్స్‌లు అభించాయి. అయితే, వీటికి నీటి లభ్యత ఎలా ఉంటుందోననే వివరణ లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనవసర అభ్యంతరాన్ని లేవదీస్తున్నది. గోదావరిలో ఉమ్మడి ఏపీకి 1480 టీఎంసీల కేటాయింపు ఉండగా ఇందులో తెలంగాణకు 912.2485 టీఎంసీల వాటా దక్కింది. తెలంగాణ వాటాకు గండికొట్టి తమ వాటాను పెంచుకోవాలన్న కుటిలబుద్ధితో కుట్రలు పన్నుతున్నది. గోదావరి జలాలపై ఏపీ సర్కారు అనవసర రాద్ధాంతం చేయటం దురదృష్టకరమని రిటైర్డ్ ఇంజినీర్ల ఫోరం ప్రధానకార్యదర్శి మేరెడ్డి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రం విడిపోయినా ఆంధ్రపాలకులు తమ వలసవాద దురహంకారాన్ని వదలడం లేదని మండిపడ్డారు. కాగా, గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం వచ్చే నెల 6వ తేదీన హైదరాబాద్‌లో జరుగనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధికారులు ఎజెండా సిద్ధం చేసుకోవాలని గోదావరి రివర్‌బోర్డు చైర్మన్ మహాదేవన్ సూచించారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

తెలంగాణలో 1956 ప్రాతిపదిక ఎందుకంటే...

వందల ఏళ్లుగా ఇక్కడ విద్య విస్మరణకు గురైంది. సామాన్యుడికి అందని పండై ఉండిపోయింది. స్వాతంత్య్రానంతరం మన ప్రభుత్వా లు విద్యావ్యాప్తికి చర్యలు ప్రారంభించీ ప్రారంభించక ముందే ఉమ్మడి రాష్ట్రం పేరిట మరో దాస్యప్రపంచంలోకి తెలంగాణ నెట్టివేయబడింది. విద్యారంగం మీద మళ్లీ అమావాస్య కమ్మింది. ఆరు దశాబ్దాల కాలంలో ఈ రంగంలో జరిగిన అన్యాయం వల్లించడం చర్విత చరణమే అవుతుంది. ఇపుడు గ్రహణం విడిచింది కాబట్టి విద్యను సార్వజనీనం చేయడం ఆ రంగంలో దశాబ్దాల పాటు జరిగిన లోటు పాట్లను వేగంగా పూడ్చుకోవడం మన ముందున్న కర్తవ్యం. ఇన్నాళ్లూ నష్టపడ్డాం కనుక మనకే వందకు వంద శాతం ఫలాలు దక్కడం న్యాయం. అందుకు ఉమ్మడి రాష్ట్రం అంటించిన మరకలన్నీ తుడిచేయక తప్పదు. మా పిల్లలు ఇక్కడే పుట్టారు అంటూ లాజిక్కులు మాట్లాడే ప్రతివాడూ ఒకనాటి చొరబాటుదారుడే. అందుకే 1956 కటాఫ్ శాసనం! 
కట్టా శేఖర్‌రెడ్డి

1956 ప్రాతిపదికగా స్థానికతను నిర్ధారించడం మీద వివిధ వర్గాల్లో తీవ్ర స్థాయి చర్చ జరుగుతోంది. ప్రభుత్వం మరీ కఠినంగా వ్యవహరిస్తున్నదని కొందరు అభిప్రాయపడుతుంటే, కొంతమంది తెలంగాణవాదులు కూడా మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఉద్యమంలో జీవన్మరణ సమస్యగా పోరాడినవారు మాత్రం ఈ ప్రతిపాదనను స్వాగతిస్తున్నారు. కాగా సీమాంధ్ర ఆధిపత్యాన్ని కొనసాగించి తీరాలని కంకణం కట్టుకున్న తెలుగుదేశం పార్టీ ఇందులో రంధ్రాన్వేషణకు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నది.

ఏపీకి చెందిన ఆ పార్టీ మంత్రులు తమ శాఖ పనులు వదిలిపెట్టి ఈ విషయం మీదే దృష్టి కేంద్రీకరించారు. దీన్ని దెబ్బ కొట్టేందుకు ఎన్డీఏ సర్కారు మీద ఒత్తిడి కూడా తెస్తున్నారు. వీరి చర్యలను ఖండించిన రాష్ట్ర విద్యామంత్రి జీ జగదీశ్‌రెడ్డి ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణను ఆక్రమించినవారి పిల్లలకు కూడాఫీజు రీయింబర్స్‌మెంటు ధనాన్ని తెలంగాణ ప్రభుత్వంతో కట్టించాలని తెలుగుదేశం తెగ ఆరాటపడుతున్నది అని చురకలంటించారు.

ఇందులో న్యాయాన్యాయాలు పరిశీలించాలంటే గతంలో ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముల్కీ ఉద్యమం హైదరాబాద్ రాష్ట్రంలో చాలా పాతదే అయినా ఆంధ్ర, తెలంగాణల విలీనానికి, విభజనలకు కేంద్ర బిందువు ముల్కీ నిబంధనలే. 

1969 ఉద్యమం: ముల్కీ నిబంధలకోసం, ముల్కీ నిబంధనల అమలులో జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగానే 1969లో జై తెలంగాణ ఉద్యమం వచ్చింది. ముల్కీ నిబంధనలు చెల్లవని జస్టిస్ చిన్నపరెడ్డి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును నిరసిస్తూ తెలంగాణవాదులు నాడు వీధుల్లోకి వచ్చారు. మళ్లీ ముల్కీ నిబంధనలను సమర్థిస్తూ అక్టోబరు 1972లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక దాన్ని నిరసిస్తూ సీమాంధ్రలో జై ఆంధ్ర ఉద్యమం జరిగింది.

ఆంధ్ర నాయకత్వం ఒత్తిడికి తలొగ్గిన నాటి కేంద్ర ప్రభుత్వం సుప్రీం తీర్పునకు వ్యతిరేకంగా ఆరు సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆరు సూత్రాల పథకం ముల్కీ నిబంధనలను రద్దు చేసి, జోనల్ వ్యవస్థను తెచ్చింది. అందుకు అనుగుణంగా 1972 డిసెంబరు 23న పార్లమెంటులో చట్టం చేశారు. ఆరు సూత్రాల పథకం ప్రకారం 371డీని తెచ్చారు. రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చారు. ఇవన్నీ తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా జరిగినవే. మరోవైపు ముల్కీ నిబంధనలు ఉల్లంఘించి చేసిన నియామకాలను ఇప్పటివరకు సరిదిద్ద లేదు. అందుకే ఇప్పుడు 1956 నుంచి దిద్దుబాటు చేయడం తప్పనిసరి అని 1969 ఉద్యమకారుడు కెప్టెన్ లింగాల పాండు రంగారెడ్డి అభిప్రాయపడ్డారు.

ముల్కీ నిబంధన ఒకటి ప్రకారం అంటే
) పుట్టుకతో హైదరాబాద్ రాష్ట్రపౌరుడు అయి ఉండాలి.
బి) హైదరాబాద్‌లో స్థిర నివాసం కలిగినవారై ఉండాలి.
సి) అతడు లేక ఆమె పుట్టేనాటికి వారి తండ్రి హైదరాబాద్‌లో 15 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసి ఉండాలి.
డి) ఆమె ఒక ముల్కీకి భార్య అయినా అయి ఉండాలి.

ముల్కీ నిబంధన 3 ప్రకారం హైదరాబాద్ రాష్ట్రంలో కనీసం పదిహేను సంవత్సరాలు స్థిరనివాసం ఉండి ఉండాలి.
తన మాతృప్రాంతంతో తనకిక ఎటువంటి సంబంధం లేదని మెజిస్ట్రేట్ నుంచి ఒక ధృవీకరణ పత్రం సమర్పించాలి.

పెద్ద మనుషుల ఒప్పందంలో ముల్కీ నిబంధనలను 12 సంవత్సరాలకు కుదించారు. ఆ ప్రకారంగానే రాజ్యాంగంలో పొందు పరిచారు. 371(1) ప్రకారం ముల్కీ నిబంధనలకు రాజ్యాంగ బద్ధత కల్పించారు. అందుకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్‌మెంట్ యాక్ట్-1957ని కూడా చేశారు.

కానీ వీటన్నింటినీ ఉల్లంఘించి ఆంధ్ర, రాయలసీమ ప్రాంతవాసులు 1956 నుంచి 1969 వరకు తెలంగాణలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు సంపాదించారు. అప్పట్లో 23,780 మంది అక్రమంగా ఉద్యోగాలు సంపాదించారని నిర్ధారించారు. ఈ ఉల్లంఘనలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభం కాగానే వీరిని బదిలీ చేయడానికి కాసు బ్రహ్మనందరెడ్డి ప్రభుత్వం జీవో 36 జారీ చేసింది. కానీ వారు కోర్టుకు వెళ్లారు. స్టేలు తెచ్చుకున్నారు. కోర్టు ఈ కేసుల విచారణ సందర్భంగానే ముల్కీ నిబంధనలు చెల్లవని హైకోర్టు చెప్పింది. అంతేకాదు ముల్కీ నిబంధనలు హైదరాబాద్ పౌరులకు వర్తించవని, బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వారికి మాత్రమే వర్తిస్తాయని మరో తీర్పు చెప్పింది. తెలంగాణ నిరుద్యోగులు దీంతో మరింత ఆగ్రహోదగ్రులయ్యారు అని 1969 ఉద్యమ నాయకుడొకరు చెప్పారు.

సీమాంధ్ర ఆధిపత్యంలోని ప్రభుత్వాలు ఎప్పుడూ ముల్కీ నిబంధనలను గౌరవించలేదు. నిజాయితీగా ఉల్లంఘనలను సరిదిద్దే ప్రయత్నం ఏనాడూ చేయలేదు. రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాత కూడా ఉల్లంఘనలు ఆగలేదు. ఇంకా పెరిగాయి. హైదరాబాద్‌ను కాలనీగా మార్చుకునే ప్రయత్నం చేశారు. 610 మనకు తాజా ఉదాహరణ. ఎంతమంది బయటి ప్రాంతంవారో నిర్ధారించడానికి రెండు దశాబ్దాలు పట్టింది. తెలంగాణలో సుమారు 59 వేల మంది ఆంధ్రప్రాంతంవారు అక్రమంగా ఉద్యోగాలు సంపాదించారని జయభారత్‌రెడ్డి కమిషన్ గుర్తించింది.

గిర్‌గ్లానీ కమిటీ అక్రమార్కుల సంఖ్య లక్షకు పైగా ఉంటుందని నిర్ధారించింది. వారిని గుర్తించిన తర్వాత బయటికి బదిలీ చేయడానికి ప్రయత్నిస్తే ఒక్కరు కూడా ఇక్కడి నుంచి కదల్లేదు. కోర్టులకెళ్లి, ట్రిబ్యునల్‌లకు వెళ్లి స్టేలు తెస్తారు. ప్రభుత్వం వారిని వెనుకేసుకువస్తుంది. అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క అన్యాయాన్ని కూడా సరిద్దిలేదు. ఇప్పుడు కూడా సరిదిద్దకపోతే తెలంగాణ వచ్చి ప్రయోజనం ఏమిటి? అని టీఎన్‌జీవో నాయకుడు ఒకరు ప్రశ్నించారు.

ముల్కీ నిబంధనల ఉల్లంఘన యాభై ఆరేళ్లుగా జరుగుతూ వచ్చింది. తెలంగాణ చాలా నష్టపోయింది. వాటిని సరిదిద్దాలంటే ఒక్కరోజుతో అయ్యే పనికాదు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఈ దిశగా తీసుకుంటున్న నిర్ణయాలను సమర్థిస్తున్నాం. 610 జీవో ప్రకారం ఇక్కడ అక్రమంగా ఉద్యోగాలు సంపాదించినవారిని ఒక్కరిని కూడా కదిలించలేకపోయిన చంద్రబాబునాయుడు కానీ, ఆ తర్వాత వచ్చిన వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు కానీ ఇప్పుడు ఏముఖం పెట్టుకుని 1956 ప్రాతిపదికను వ్యతిరేకిస్తారు? సీమాంధ్ర ఆధిపత్య ప్రభుత్వాలు చేసిన పాపాలకు ఇప్పుడు ప్రాయశ్చిత్తం జరగాల్సిందే అని అధ్యాపక శాసన మండలి సభ్యుడు ఒకరు అన్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

సోమవారం, జులై 28, 2014

జర్నలిస్టు కాలనీ పక్కన రూ.100 కోట్ల స్థలం స్వాహా

-ప్రభుత్వ, ప్రైవేట్ భూములను కబ్జా చేసిన బడాబాబులు
-దిక్కులు, లేఅవుట్ మార్చి 40 ప్లాట్లకు మహవీర్ బిల్డర్స్ ఎసరు
-ఫస్ట్ లీఫ్ పేరుతో ప్రభుత్వ భూమిలో పూజా డెవలపర్స్ విల్లాలు
-రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారుల అండదండలు!
-కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న బాధితులు
ఇటు చూస్తే భూకబ్జా.. కట్ చేస్తే క్రమబద్ధీకరణ! అది శివారు ప్రాంతమైనా.. నగరం నబొడ్డయినా! ఖాళీగా ఉంటే చాలు! ప్రభుత్వ స్థలమైనా.. ప్రైవేటు భూములైనా! ఆక్రమించుకోవాలన్న ఆలోచన రావడమే తరువాయి.. వందల కోట్ల విలువైన భూములు స్వాహా అయిపోతున్నాయి! రాత్రికి రాత్రే కాగితాలపై కాగితాలు పుట్టిస్తారు.. ప్లాన్లు మార్చేస్తారు.. అనుకూలమైన అధికారులను పట్టుకుని రికార్డులనే తిరగరాయిస్తారు! ఆ భూములు తమ ముత్తాతల సొమ్మయినట్లు అమాంతం తమ ఖాతాలో వేసుకుంటారు! ఇక జోరుగా నిర్మాణాలు.. విక్రయాలు.. లాభార్జన! రాజధాని నగరంలో ఏ మూల చూసినా ఇదే తతంగం! ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకి అత్యంత సమీపంలో ఉన్న గోపనపల్లిలో! ఈ తాజా కబ్జా కహానీ వంద కోట్ల రూపాయల పైచిలుకు ధరపలికే భూములది!
firstleafhousesహైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ పరిశ్రమ విస్తరించిన ప్రాంతానికి కూతవేటుదూరంలో ఉన్న భూములవి. ఆ ప్రత్యేకతే ఆ భూములకు మంచి విలువను తెచ్చిపెట్టాయి. ఖాళీగా ఉన్న ఆ భూములపై కబ్జారాయుళ్లు కన్నేశారు. ఒకరు పాత లేఅవుట్‌లో కొన్ని ప్లాట్లు కలుపుకొని.. కొత్త లేఅవుట్ వేస్తే.. మరొకరు ఆక్రమించిన భూమిలో విల్లాలు మొలిపిస్తున్నారు! ఇదేం అన్యాయమని అసలు యజమానులు అధికారుల చుట్టూ తిరిగితే న్యాయం జరుగలేదు. ఆక్రమించిన భూమిలో నిర్మాణాలకు అనుమతి ఇచ్చారా? అని సమాచార హక్కు చట్టం కింద అడిగితే.. అసలు మీ ప్రశ్నలో స్పష్టతలేదు పొమ్మన్నారు! ఎటుపోవాలో తెలియని బాధితులు ఇప్పుడు న్యాయపోరాటం చేస్తున్నారు. ఇవేవీ పట్టని నిర్మాణ సంస్థలు దర్జాగా కబ్జా చేసిన భూమిలో దిలాసాగా దందా చేసుకుంటున్నాయి. ఇది ఐటీ పరిశ్రమ వేళ్లూనుకుని ఉన్న శేరిలింగంపల్లి మండలంలోని గోపనపల్లిలో అక్రమార్కుల కబ్జా కథ! 
గోపనపల్లి రెవెన్యూ గ్రామంలో సర్వేనంబర్ 74లో ఏర్పడిన అతిపెద్ద వెంచర్ జర్నలిస్టు కాలనీ. సర్వే నంబర్ 74 కింద 105 ఎకరాల 18 గుంటల భూమి ఉంటే అందులో 60 ఎకరాల భూమిని జర్నలిస్టులకు కేటాయించారు. జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ దానిని లేఅవుట్ చేసి, ప్లాట్లుగా విభజించి, ఆనాటికి సొసైటీలో సభ్యులుగా ఉన్న జర్నలిస్టులకు కేటాయించింది. పక్కా ప్లాన్ కూడా ఉండడంతో ఇప్పటివరకు కబ్జారాయుళ్లు ఈ భూమిపై కన్నేయలేదు. జర్నలిస్టులతో తమకెందుకులే అనుకున్నారో.. లేక జర్నలిస్టులతో పెట్టుకుంటే అక్రమాల చరిత్ర అంతా బయటకు తీసి కటకటాల వెనక్కు తోయిస్తారని అనుకున్నారోగానీ ఈ భూమి జోలికి రాలేదు. కానీ.. జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీని అనుకుని ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలపై కన్నేసిన బడాబాబులు.. వాటిని కబ్జా చేసి.. పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ సర్వే నంబర్‌లో జర్నలిస్టు కాలనీ రోడ్డుకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిలో ఫస్ట్‌లీఫ్ పేరుతో పూజా వెంచర్స్ అనే సంస్థ విల్లాల నిర్మాణానికి దిగింది. ఈ విల్లాలను విక్రయించడానికి అందమైన బ్రోచర్లను విడుదల చేసింది. ప్రభుత్వ భూమిలో యథేచ్ఛగా నిర్మాణాలు జరుగుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ విల్లాలను నిర్మించే బడా సంస్థకు రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులు సహకరిస్తుండడంతో అక్రమణదారుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఇది మహవీర్ బిల్డర్స్ కబ్జా కహానీ

మహవీర్ బిల్డర్స్ అనే సంస్థ జర్నలిస్టు కాలనీకి మరోవైపు ఉన్న పట్టా భూమి సర్వే నంబర్ 75లో గతంలో వెలసిన లేఅవుట్‌లో కొన్ని ప్లాట్లను తీసుకుంది. పక్కనే ఖాళీగా ఉన్న 74 సర్వే నంబర్‌లోని దాదాపు ఎకరం భూమిని కబ్జా చేసింది. ఇంతటితో ఆగకుండా సర్వే నంబర్ 75లో 300 గజాల చొప్పున ఉన్న దాదాపు 40 ప్లాట్లను కూడా కలుపుకొని పాత లేఅవుట్‌ను మార్చి కొత్త లేఅవుట్ చేసి ప్రైవేట్ భూములను కబ్జా చేసింది. దీంతో ప్లాట్ల అసలు యజమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆక్రమణకు గురైన తమ ప్లాట్లను రక్షించుకోవడానికి రెవెన్యూ, జీహెచ్‌ఏంసీ కార్యాలయాల చుట్టూ తిరిగినా పట్టించుకున్న అధికారులు లేకపోయారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని ప్లాట్ల యజమానులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మహవీర్ బిల్డర్స్ సంస్థ ప్రభుత్వ భూమిని కూడా కలుపుకొని కబ్జా చేస్తే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మిన్నకుండడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం రంగంలోకి దిగి కబ్జాకు గురైన ప్రభుత్వ, ప్రైవేట్ భూములను కాపాడాలని బాధితులు కోరుతున్నారు. భూములను కబ్జా చేసిన సంస్థలు నిర్మాణాలు చేపట్టడానికి అనుమతులు ఇచ్చారా? అని సమాచార హక్కు చట్టం కింద జీహెచ్‌ఎంసీకి దరఖాస్తు చేస్తే, మీరు అడిగిన ప్రశ్న క్లారిటీగా లేదని రాతపూర్వకంగా సమాధానం ఇవ్వడంతో ఆక్రమణదారులకు అధికారులు అండగా ఉన్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

ఆదివారం, జులై 27, 2014

బ్లాగిల్లు కబుర్లు: "నా తెలంగాణ కోటి రత్నాల వీణ" బ్లాగు రచయిత శ్రీ గుండు మధుసూదన్‍తో బ్లాగిల్లు ఇంటర్వ్యూ (స్పెషల్)

అవి తెలంగాణా ఉద్యమం ఉద్ధృతంగా జరుగుతున్న రోజులు..

పత్రికల్లో , టీవీల్లో ఎక్కడ చూసినా నాయకుల మాటల తూటాలు ..

ఇక బ్లాగుల్లో సరే సరి .. టపాల్లోనూ , వ్యాఖ్యల్లోనూ ఇరు ప్రాంతాల బ్లాగర్లూ ఒకరి నాయకులను మరొకరు దుమ్మెత్తి పోసుకుంటూ , ఒకరి ఉద్యమాలను మరొకరు విమర్శించుకుంటూ తమ తమ వాదనలను సమర్ధించుకుంటూ ఉంటే, ఒక తెలంగాణా కవి కేవలం తన కలం నుంచి జాలువారిన పద్యాలను భాణాలుగా తన బ్లాగు ద్వారా సంధించారు.. !!

ఎటువంటి ఛందస్సునైనా అలవోకగా ప్రయోగిస్తూ ఆయన సంధించిన టపాలు కొందరికి ఆలోచననూ , కొందరికి ఆశ్చర్యాన్నీ, కొందరి ఉద్రేకాన్నీ కలిగించాయి. 


ఒకవైపు ప్రసంశలేకాదు, విమర్శలు చుట్టుముట్టినా తను చేపట్టిన కార్యాన్ని దిగ్విజయంగా పూర్తిచేసిన కరడుగట్టిన తెలంగాణావాది ఆయన ..

ఆయన గుండు మధుసూదన్‍ గారు. 



"శ్రీలు గురియించు తెలగాణ నేల కొల్లఁ
గొట్టఁ దగునని యాంధ్రులుఁ గూడి, దుష్ట
మార్గ మవలంబనము సేసి, మనల బాని
సలుగ మార్చి, "యాంధ్ర ప్రదేశ్" స్వంత రాష్ట్ర
మనుచు భావించి, దోచిరి మనల నాఁడు!

నేఁటి దాఁకను దోపిడి నిలుప కుండఁ;
గడుపు మండియుఁ దెలగాణ విడిచి పొమ్మ
టంచు నుద్యమమ్ములఁ జేయ నక్కజముగఁ
బ్రభుత తెలగాణ రాష్ట్రమ్ము రాజిల నిడె!
నా తెలంగాణ కోటి రత్నాల వీణ!!"

అంటూ "నా తెలంగాణ కోటి రత్నాల వీణ" అనే తన బ్లాగు ద్వారా శ్రమించిన తెలుగు భాషా పండితుడీయన. ఈయనకు "తెలంగాణ" అనే పదం శ్వాస అయితే,  "తెలుగు భాష" ప్రాణం లాంటిది. 

ఈయనతో "బ్లాగిల్లు" జరిపిన ఇంటర్వ్యూ చదవండి ... 

ప్రశ్న : మీ గురించి విపులంగా తెలుపుతారా ? 

నేనొక ప్రథమశ్రేణి తెలుగు పండితుడిని. వరంగల్లు జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శంభునిపేటలో పనిచేస్తున్నాను. నాకు మొదటినుంచీ తెలుగు సాహిత్యమంటే చాలా ఇష్టం. అందుకే స్వయంగా గ్రంథపఠనంచేసి, పద్యంపై పట్టుసాధించాననే అనుకొంటున్నాను. నేనెంతవరకు కృతకృత్యుణ్ణయ్యానో మీవంటివారలే చెప్పాలి. నా ప్రథమ బ్లాగు "మధుర కవనం"లో తెలంగాణ కవిపండితులు శ్రీకంది శంకరయ్యగారి శంకరాభరణంలో నేను రాసిన పూరణములన్నీ ప్రచురించి, సుకవిపండితబృందానికి అందిస్తున్నాను.


ప్రశ్న : మీ వ్యక్తిగత విషయాలు, మీ విద్యాభ్యాసం గురించి కాస్త చెపుతారా ? 

పూజ్యులు, కీర్తిశేషులు మా నాన్న శ్రీ గుండు రామస్వామిగారి ప్రోత్సాహంతో ఐదవతరగతి వరకు ఐదు శతకాలను నేర్చుకొని, ఆరు, ఏడు, ఎనిమిది తరగతులలో పోతనభాగవతంలోని గజేంద్ర మోక్షణం, ప్రహ్లాదచరిత్ర, రుక్మిణీ కళ్యాణం ఘట్టాలను నేర్చిన నేను, కేవలము పదవతరగతి వరకు ఉపాధ్యాయుల పర్యవేక్షణలో చదువుకొని, చిన్ననాటనే వివాహమైనందున, ఇంటి పరిస్థితులు అనుకూలించక, ఒక షాపులో గుమాస్తాగా పనిచేస్తూ, ప్రైవేటుగా ఓపెన్ యూ నివర్సిటీలో డిగ్రీ, కాకతీయ దూరవిద్యా కేంద్రం (SDLCE) నుండి పీజీ సాధించి, టీపీటీ పొంది, వివిధ ప్రైవేటు పాఠశాలల్లో చాలీచాలని జీతంతో జీవనం గడిపి, చివరికి డీఎస్సీ1994లో వరంగల్లులోనే ప్రప్రథమునిగానిలిచి "తెలుగు పండిత"వృత్తిని చేపట్టాను. భగవంతుడు నాకు ఈ వరాన్నిచ్చినందుకు కృతజ్ఞుడనై వున్నాను.


ప్రశ్న : బ్లాగు వ్రాయాలన్న కోరిక మీకు ఎలా కలిగింది?


తెలంగాణ అరవై ఏండ్లుగా ఆంధ్ర పాలకుల చేతిలో మోసగింపబడుతూ, అనేక బాధలనందుతుంటే...కేసీఆర్‍ నాయకత్వంలో ఉద్యమం మొదలవగా, నా వంతు బాధ్యతగా తెలంగాణ ప్రజలను నా పద్యాలతో, గేయాలతో మేలుకొలుపాలనీ, ఆంధ్ర అక్రమార్కుల దౌర్జన్యాలను అందరికీ తెలియజేయాలనీ, ముఖ్యంగా ఆంధ్రాపాలకుల, అక్రమార్కుల దౌష్ట్యాలను ఎత్తిచూపడం ద్వారా వాళ్ళ ఆటలు సాగకుండా అడ్డుకోవడానికి ప్రజలు నేతలు ఉద్యమించడానికై "నా తెలంగాణ కోటి రత్నాల వీణ" బ్లాగును ప్రారంభించాను.


ప్రశ్న : మీ బ్లాగు " నా తెలంగాణ కోటి రత్నాల వీణ" గురించి ఇంకాస్త...

నా బ్లాగు "నా తెలంగాణ కోటి రత్నాల వీణ"లో ఒక సగటు తెలంగాణవాదిగా తెలంగాణ ప్రజలకై వారి స్థాయిననుసరించి (పద్యాలను, గేయాలను, వచన కవితా ప్రక్రియలను అనుసరించి) సీమాంధ్రుల దౌర్జన్యాలను బహిర్గతం చేస్తూ టపాలు ప్రచురిస్తున్నాను. ఇలా రాసే అవకాశం నాకు కలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అరవై ఏండ్ల ఆంధ్రవలస పాలనలో తెలంగాణ పొందిన ఖేదాన్ని సహింపలేక, ఉద్వేగంతో తెలంగాణులను మేలుకొలుపడానికై కవితను ఆశ్రయించాను.తెలంగాణ రాష్ట్రసాధనలో నేనూ ఒక పాత్రధారినైనందుకు గర్విస్తున్నాను.


ప్రశ్న : మీరు పద్యం అనే ఆయుధాన్ని ఎందుకు ఎంచుకున్నారు ? 

పద్యమంటే నాకు ఎంత ఇష్టమో...నా "మధుర కవనం"లోనూ, "నా తెలంగాణ కోటి రత్నాల వీణ"లోని ప్రారంభ పద్యాలలోనూ ప్రస్ఫుటమవుతుంది. తెలంగాణ రాష్ట్రావతరణ తదుపరి నేను రచనలు కొంతవరకు ప్రక్కనుంచి, నమస్తే తెలంగాణలో ప్రచురించిన "సీమాంధ్ర దురాగతాలకు సంబంధించిన" అంశాలను టపాలుగా ప్రచురిస్తున్నాను. ఇందుకు ఈ మధ్య నాకు ఏర్పడిన అనారోగ్య పరిస్థితులే కారణమయ్యాయి. మునుముందు గేయాన్ని, పద్యాన్ని పాఠకుల స్థాయిననుసరించి ప్రచురించగలను. "తెలుఁగు పద్యంబు నిత్యమై తేజరిల్లు" అనేది నా నినాదం. తెలుగు పద్యాన్ని నశించిపోకుండా కాపాడి భావితరాలకు అందించాలనేదే నా తపన.


ప్రశ్న : మీ బ్లాగులో వ్యతిరేకంగా వచ్చిన కామెంట్లపై మీరు ఎలా స్పందించేవారు?

నా బ్లాగులో ఎన్నో వ్యతిరేక వ్యాఖ్యలు వచ్చాయి. ఆంధ్ర అక్రమార్కులు, ఆంద్రపాలకులు మనను దోపిడీలతో బాధల్లోకి నెడుతుంటే వ్యతిరేకించినందుకు స్పందించిన ఆంధ్ర ప్రజలు తెలంగాణులకు జరిగిన ద్రోహాన్ని గుర్తించకుండా...ఆ అక్రమార్కులనూ, స్వార్థ ఆంధ్ర పాలకులనూ సమర్థిస్తూ...తెలంగాణులను తెలబాన్‍లు, తాగుబోతులు, గోచీగాళ్ళు, సోమరిపోతులు, తెలివిలేనివాళ్ళు, భాషరానివాళ్ళు, కవులు లేనివాళ్ళు...అంటూ అనేకవిధాలుగా నిందిస్తూ వ్యాఖ్యలు రాశారు. అంతేకాదు...నన్ను కూడా చెప్పుకోవడానికి కూడా వీలు లేని బూతులు తిట్టారు...మొద్దు సుద్ద అన్నారు...కవివి కావు అన్నారు...పదాడంబరం తప్ప విషయంలేదు... కవిత్వం లేదు..అన్నారు. ఎన్నో విధాలుగా అబద్ధాల రాతలతో...అసమంజసమైన రాతలతో నన్ను ఇబ్బందులకు గురిచేశారు. పని కట్టుకుని నన్ను నిందించడానికే వ్యాఖ్యలు్ రాశారు. కొన్ని అసమంజసమైన వ్యాఖ్యల్ని నేను ప్రచురించక..స్పామ్‍లో పెడితే..కొందరైతే నన్ను కించపరుస్తూ తమ బ్లాగుల్లో టపాలు పెట్టి...వారి పాఠకులు, వీక్షకులచేత తిట్టించారు...చులకన చేయించారు. అయినా నేను జంకలేదు, వెనుకంజవేయలేదు. అన్నింటికీ ఎదురొడ్డి ముందుకు దూసుకుపోయానే తప్ప ఆగలేదు. మునుపటికన్న ఎక్కువ టపాలతో వాళ్ళను ఎదుర్కొన్నాను. తెలంగాణుల అదృష్టవశాన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా...ఆంధ్ర అక్రమార్కుల దౌష్ట్యాలు ఇంకా ఆగలేదు...ఎక్కడ సందుదొరికినా అక్రమాలు చేస్తూనే వున్నారు. అవి నమస్తే తెలంగాణ పత్రికద్వారా బహిర్గతం కావడం...వాటిని ప్రత్యేకంగా పేర్కొంటూ నా బ్లాగులో ప్రచురించడం చేస్తున్నాను. నా ధ్యేయం అన్యాయాన్ని ఎదుర్కోవడం...ప్రజలకు తెలియజేయడం..తద్వారా ఆ అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి వెళ్ళేలా చేసి, న్యాయాన్ని జరిపించడం! నేను చాలా వరకు కృతకృత్యుడనయ్యాననే అనుకొంటున్నాను. తద్వారా ఎంతో తృప్తిని పొందాను!


ప్రశ్న : మీ బ్లాగులో సీమాంద్రులను ఎక్కువగా విమర్శిస్తారన్న ఆరోపణ ఉంది...

తప్పు. మా(తెలంగాణుల)  దృష్టిలో "సీమాంధ్రు"లంటే సీమాంధ్ర అక్రమార్కులు...సీమాంధ్ర ప్రజలు కారు! సీమాంధ్ర ప్రజలు మా సోదరులు! మమ్మల్ని దోచుకున్నవారు సీమాంధ్ర అక్రమార్కులు, దోపిడీదారులు, దగాకోరులు! మా పోరాటం (అహింసాయుత పోరాటం) సీమాంధ్ర అక్రమార్కులపైనే!

ప్రశ్న : మీకు అత్యంత ఆనందం కలిగిన సందర్భం .. ( బ్లాగు లోకంలో కూడా )...


నేను ఏ ఆశయంతోనైతే బ్లాగును ప్రారంభించానో ఆ ఆశయం..."తెలంగాణ రాష్ట్ర సాధన" నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. తెలంగాణ ఏర్పడినప్పుడు కలిగిన ఆనందం, నాకు ఉద్యోగం లభించినప్పుడు కూడా కలగలేదు. అరవై ఏండ్ల తెలంగాణులకల సాకారం కావడంకంటే మరో ఆనందం ఏముంటుంది? తెలంగాణ బంగరు తెలంగాణగా మారేంతవరకూ విశ్రమించను. టపాలు రాస్తూనే ఉంటాను...ఆ భగవంతుడు చల్లగాచూస్తే!

మీరు వేసిన ప్రశ్నలద్వారా నా ఆశయాన్ని తమరు బహిర్గతపరిచినందుకు, ఈ బ్లాగు ద్వారా నా తెలంగాణ ప్రజలకు "తెలుగు పద్యం తెలంగాణలో కూడా జీవించే ఉంది" అనే విషయాన్ని తెలుపగలుగుతున్నందుకు...మీకు అనేక కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. నా మరో బ్లాగు"మధుర కవనం" (పద్యసాహిత్య వేదిక) ద్వారా తెలుగు పద్యాన్ని చిరస్థాయిగా నిలుపడంలో నా వంతు పాత్రను నిర్వహిస్తాను.



ప్రశ్న : రాష్ట్రం రెండుగా విడిపోవడంవల్ల తెలుగు భాషకు లాభమా? నష్టమా ? ఎలా ?


నష్టమనేది ఏదీ ఉండదు గాక ఉండదు అని నా అభిప్రాయం. పైగా న్యాయం జరుగుతుంది. మొదటినుండీ ఆంధ్రవారికి తెలంగాణ పలుకుబడి అంటే చులకనభావం ఉన్నవిషయం అందరికీ తెలిసిందేకదా! ఇప్పుడు తెలంగాణ మాండలికానికి సరియైన గౌరవం లభిస్తుంది. ఇన్నాళ్ళూ తెలంగాణ యాసకు ఈసడింపులూ, వెకిలి నవ్వులే

తప్ప సరియైన గౌరవం దక్కలేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇలాంటి అగౌరవం జరగడానికి ఆస్కారం ఉండదు. పైగా ఎవరైనా అగౌరవపరిస్తే తగిన చర్య తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతేగాక, ఇప్పటివరకూ ఆంధ్రలోని కవులే
కవులనీ, తెలంగాణలో కవులేలేరనీ చెబుతూ...వాళ్ళ కవుల చరిత్రలే తెలంగాణుల చేత చదివించారు...వాళ్ళ సంస్కృతే తెలంగాణులచేత ఆచరింపజేశారు. ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం వెలుగొందుతుంది...తెలంగాణ కవులు వెలుగుచూస్తారు..స్వేచ్ఛావిహంగాలై అడ్డుకొనే ఆంధ్రా స్వార్థపరులులేక మునుముందుకు దూసుకెళ్ళుతారు...తెలంగాణ సాహిత్యాన్ని వెలిగింపజేస్తారు...తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్ని ప్రపంచానికి చాటుతారు. తెలంగాణ బాసకూ, యాసకూ ప్రాధాన్యత తెస్తారు.


ప్రశ్న : మీ భవిష్యత్ కార్యాచరణ ఏమిటి ? 


నేను ఇంక మూడేండ్లలో పదవీ విరమణ పొందుతాను. ఆ తదుపరి నా చిన్న పుస్తక భాండాగారమందున్న ప్రాచీన

పద్య గ్రంథాలకు సులభ వ్యాఖ్యలు రాయాలనీ, నా స్వీయపద్య గ్రంథాలను ముద్రించి సాహితీ పిపాసువుల కరకమలాలను అలంకరింపజేయాలనీ, నాకున్న బోధనానుభవంతో భావి నూతన పండితులకై వ్యాకరశాస్త్రమును సులభతరము చేస్తూ పుస్తకాలు రాయాలనీ...నా కోరిక. ఇది నెరవేరుతుందో...లేదో...? నా ఆరోగ్యం సహకరిస్తుందో...లేదో...? అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. అంతా ఆయన దయ!

ప్రశ్న : ఏ రకమైన కవిత్వం అంటే మీకు ఇష్టం ? 


నాకు చిత్రకవిత్వం అంటే చాలా ఇష్టం. ఒక పద్యంలో మరో పద్యాన్ని ఇమిడ్చి(గర్భకవిత్వం) రాయడం...బంధ కవిత్వం రాయడం...నాకు ఇష్టం. అయితే, మునుముందు వీటినీ రచించి, తెలంగాణ సాహితీ జిజ్ఞాసువులకు, సుకవిపండితులకు చేరువచేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు పాఠశాల పనులతో తలమునకలై వున్నందువల్ల ఆ పని చేయలేకపోతున్నాను. పదవీవిరమణ తదుపరి ఆ బృహత్కార్యాన్ని చేపట్టాలని ఆశిస్తున్నాను.


ప్రశ్న : బ్లాగర్లకు మీరు ఇచ్చే సలహా...?

బ్లాగర్లకు సలహా ఇచ్చేటంత గొప్పవాడిని కాను నేను! కేవలం నా తెలంగాణకొరకు "నేను సైతం తెలంగాణ ఉద్యమానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను". నేను ఒక సాధారణ తెలుగు భాషా పండితుడను. బ్లాగర్లకు నేనేం సలహా ఇవ్వగలను?

అయితే ఒక్క విషయం ఇక్కడ చెబుతాను...తెలంగాణకు ఎవరు అవమానం కలిగించినా, నష్టం కలిగించినా సహించక వెంటనే స్పందించి, బ్లాగుద్వారా...పోరాడాలి. సమస్య ప్రజల దృష్టికీ, పాలకుల దృష్టికీ తీసుకుపోవాలి. సమస్యా పరిష్కారానికి మార్గం వేయాలి. మరొకటి...తెలంగాణ తల్లి బిడ్డలైనందుకు ఋణం తీర్చుకోవడానికి తెలంగాణ గొప్పతనాన్నీ, తెలంగాణుల ఔన్నత్యాన్నీ ప్రచారం చేయాలి. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుటలో తగిన విధంగా దోహదం చేయాలి.

గమనిక: పై ఇంటర్వ్యూను "బ్లాగిల్లు కబుర్లులో" వీక్షించడానికి: 
"నా తెలంగాణ కోటి రత్నాల వీణ" బ్లాగు రచయిత శ్రీ గుండు మధుసూదన్‍తో బ్లాగిల్లు ఇంటర్వ్యూ(స్పెషల్)పై క్లిక్ చేయండి.

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

ఏపీజీఏడీకి విభజన బాధ్యతా?

-తెలంగాణ సర్కారుకు భాగస్వామ్యం ఇవ్వాల్సిందే
-కమల్‌నాథన్ ఉత్సవ విగ్రహం
-మార్గదర్శకాలపై ఢిల్లీలోనే తేల్చుకుంటాం
-తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ
ఉద్యోగుల విభజన ప్రక్రియలో కమల్‌నాథన్ కేవలం ఉత్సవ విగ్రహంగా మారిపోయారని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ఘాటుగా విమర్శించింది. ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ మొత్తం అవశేష ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలనా శాఖకు ధారపోయడాన్ని తీవ్రంగా విమర్శించింది. దీనివల్ల తెలంగాణ ఉద్యోగులకు ఎట్టి పరిస్థితిలోనూ న్యాయం జరిగే అవకాశమే లేదని పేర్కొంది. దీనితో పాటు ప్రక్రియ మార్గదర్శకాల్లో అడుగడునా తెలంగాణ వ్యతిరేక నిబంధనలే పొందుపరిచారని దుయ్యబట్టింది.
deviprasad
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే వీటిని రూపొందిస్తే కమల్‌నాథన్ సంతకం చేసి వెబ్‌సైట్లో పెట్టినట్టు ఉందని జేఏసీ విమర్శించింది. ఈ దురన్యాయాలను కేంద్రం దృష్టికి తెచ్చేందుకు ఆగస్ట్ మొదటి వారంలో ఢిల్లీ పర్యటన జరుపుతున్నట్టు ప్రకటించింది. ఆప్షన్ అనే విధానాన్ని పూర్తిగా తొలగించాలని, గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సెక్రటేరియట్ వరకు తెలంగాణ ఉద్యోగులు తెలంగాణకు, ఆంధ్ర ఉద్యోగులను ఆంధ్రాకు కేటాయించాలని జేఏసీ డిమాండ్ చేసింది.

తెలంగాణ ఉద్యోగుల మనోభావాలకు విఘాతం కలిగిస్తున్న 18ఎఫ్‌ను పూర్తిగా రద్దు చేయాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. శనివారం టీఎన్జీవో కార్యాలయంలో తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ అత్యవసర స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశం వివరాలను టీఎన్‌జీవో నేత జీ దేవీప్రసాద్ విలేకరులకు వివరించారు. ఆగస్టు 2న మరోసారి ఉద్యోగ సంఘాల సమావేశం నిర్వహిస్తామని, అభ్యంతరాల నివేదికను రూపొందిస్తామని, ఆగస్టు 4న కమల్‌నాథన్‌కు అందజేస్తామని వివరించారు

కేంద్రానిది గుత్తాధిపత్య ధోరణి...

ఉద్యోగుల విభజన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా గుత్తాధిపత్యాన్ని తీసుకున్నదని ఆయన విరుచుకుపడ్డారు. ఏపీజీఏడీకి నోడల్ ఏజెన్సీ బాధ్యతలను ధారాదత్తం చేయడం ద్వారా తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షను కాలరాచి వేశారని దుమ్మెత్తిపోశారు. విభజనలో ఏపీ ప్రభుత్వంతోపాటు తెలంగాణ ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.

భార్య లేదా భర్త విధిగా తెలంగాణ ప్రాంతానికి చెందినప్పుడు మాత్రమే తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించాలని పేర్కొన్నారు. ఉద్యోగి తల్లిదండ్రుల స్థానికత ఆధారంగానే దీన్ని నిర్ధారించాలని కోరారు. ఆప్షన్లంటూ ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారిని భార్యభర్తల పేరుతో తెలంగాణకు కేటాయిస్తే తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

18ఎఫ్ వద్దే వద్దు..

తెలంగాణ రాష్ట్రంలో జనాభా దామాషాలో ఏదేని శాఖలో 42 శాతం ఉద్యోగులు లేనట్లయితే ఆంధ్రా ఉద్యోగులను బట్వాడా చేస్తామని మార్గదర్శకాలలో 18ఎఫ్ తెలియజేయడం గర్హణీయమన్నారు. 18 ఎఫ్ నిబంధనల ప్రకారం ఆంధ్రా ఉద్యోగులందరూ తెలంగాణలో తిష్ఠవేసే ప్రమాదమున్నదన్నారు. 10వ షెడ్యూల్‌లోని సంస్థలపైన సంవత్సరం తర్వాత నిర్ణయం తీసుకుంటామనడంతో వాటిలో ఆంధ్ర ఉద్యోగులు హైదరాబాద్‌ను వదిలే అవకాశాలు లేవని విమర్శించారు.

ఇప్పటి వరకు 12లక్షల ఉద్యోగాల్లో 56 వేల మంది ఉద్యోగులను మాత్రమే విభజించారని మిగతా 11లక్షల ఉద్యోగుల విభజనపై ఎప్పుడు నిర్ణయిస్తారని ప్రశ్నించారు. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ విభాగాలలో 20 శాతం, 30 శాతం, 40 శాతం స్థానికేతర కోటా సృష్టించి వేలాది ఆంధ్రా ఉద్యోగులు చేరిపోయారని వారి కారణంగా తెలంగాణ వేలాది ఉద్యోగాలను కోల్పోయిందని చెప్పారు. శాఖాధిపతుల కార్యాలయాల్లో పని చేస్తూ ఎఫ్ ఫామ్‌లోఉన్న ప్రతి ఉద్యోగి వివరాలను పబ్లిక్ డెమోనియంలో పొందుపర్చాలని కోరారు.

కో ఛైర్మన్ సీ విఠల్ మాట్లాడుతూ కమలనాథన్ ఉత్సవ విగ్రహమై పోయారని, ఆంధ్రా ప్రభుత్వం రాసిచ్చిన మార్గదర్శకాలపైన కమలనాథన్ సంతకం చేసి వెబ్‌సైట్‌లో పెట్టారని విమర్శించారు. విద్యుత్ ఇంజనీర్ల జేఏసీ ఛైర్మన్ శివాజీ మాట్లాడుతూ తెలంగాణలో మూడు వేల మంది ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లున్నారని వీరిని ఏపీకే కేటాయించాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్‌గౌడ్ తెలంగాణ ఉద్యోగులను, అధికారులను తెలంగాణకు కేటాయించాలనే అతిసాధారణ నిబంధనపైన ఎందుకింత గింజుకుంటున్నారని మండిపడ్డారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

ఇండ్ల స్కాంపై కొరడా...!

-సీఐడీ విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశం
-ఇందిరమ్మ గృహనిర్మాణ పథకంలో అవినీతిని తేల్చేందుకు..
-2004-14 మధ్య అవకతవకలపై దర్యాప్తు
-త్వరలో బోగస్ రేషన్ కార్డులపైనా విచారణ!
-2006-14 మధ్య 22.40 లక్షల గృహాలపై స్పష్టత లేదు
-బాధ్యులైన 490మంది అధికారులపై గత ప్రభుత్వ వేటు
-తెలంగాణ ఏర్పడినంక 593 గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు
-రూ.235 కోట్లు దుర్వినియోగం అయ్యాయని తేలింది
-36వేల ఇండ్లు కట్టకుండానే లెక్కల్లో చూపించారు
-2008-09లోనే 75శాతం అవినీతి జరిగింది
-రూ.5500 కోట్లు ఇస్తే.. మంజూరైన ఇండ్లు13లక్షలే
-అధికారులతో సమీక్షలో సీఎం కేసీఆర్
indirammaఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాల హయాంలో వివిధ రంగాల్లో జరిగిన అక్రమాలపై విచారణలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో బలహీనవర్గాల గృహనిర్మాణ పథకంలో జరిగిన భారీ అవకతవకలపై సీఎం కే చంద్రశేఖర్‌రావు సీఐడీ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు. ఇదే క్రమంలో రెండు మూడు రోజుల్లో బోగస్ రేషన్ కార్డుల విషయంలోనూ ప్రభుత్వం విచారణకు ఆదేశించనున్నట్లు తెలుస్తున్నది. ఇండ్ల నిర్మాణంలో అవినీతిపై సీఎం కేసీఆర్ తన చాంబర్‌లో శనివారం సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. 36వేల ఇండ్లు నిర్మించకుండానే నిర్మించినట్టు తప్పుడు లెక్కలు చూపించినట్టు అధికారుల విచారణలో తేలిందన్న సీఎం.. 2004 నుంచి 14 వరకు జరిగిన అవకతవకల్లో వందల కోట్ల రూపాయల అవినీతి చోటుచేసుకుందని చెప్పారు. 

గృహ నిర్మాణాల్లో అవినీతికి పాల్పడ్డ అధికారుల్లో 490 మందిని గత ప్రభుత్వ హయాంలోనే సస్పెండ్ చేశారని, మరో 285 మంది డిస్మిస్ అయ్యారని తెలిపారు. ఇదే విషయంలో పలువురు నాయకులపై కూడా కేసులు పెట్టారని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా.. గృహనిర్మాణంలో రూ.235 కోట్లు దుర్వినియోగం అయినట్లు తేలిందని చెప్పారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపితే అవినీతి ఇంకెంత స్థాయిలో ఉంటుందోనని సీఎం విస్మయం వ్యక్తం చేశారు. గతంలోనే ఈ వ్యవహారాలను శాసనసభ దృష్టికి తెచ్చి, విచారణ జరపాలని డిమాండ్ చేశామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 99శాతం మందికి ఇండ్లు కట్టిచ్చినట్టు లెక్కలు చూపించినా, వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయని అన్నారు. 2006-14 మధ్య 22.40 లక్షల ఇండ్లపై స్పష్టత లేదని చెప్పారు. ఒక్క 2008-09 మధ్యే 75శాతం అవినీతి జరిగిందని తెలిపారు. ప్రభుత్వం రూ.5500 కోట్లు విడుదల చేస్తే 13 లక్షల ఇండ్లు మాత్రమే నిర్మితమయ్యాయని చెప్పారు.

ఆదిలాబాద్ నియోజకవర్గంలో 45వేల ఇండ్లు, మంథని నియోజకవర్గంలో 41,099 ఇండ్లు, కొడంగల్ నియోజకవర్గంలో 32,337 ఇండ్లు, పరిగిలో 30,416 ఇండ్లు కట్టినట్టు లెక్కలు చూపుతున్నా వాస్తవ లబ్ధిదారులు అంత సంఖ్యలో లేరని ప్రభుత్వాధికారుల తనిఖీల్లో తేలిందని సీఎం కుండబద్దలు కొట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవి మాత్రమే కాకుండా మరో 4.60 లక్షల ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని లెక్కలు చెప్తున్నారని సీఎం తెలిపారు. ఒక్క గృహ నిర్మాణంలో కాకుండా పెన్షన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, రేషన్‌కార్డుల్లో కూడా భయంకరమైన అవినీతి, అక్రమాలు జరిగాయని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ మొత్తం అవినీతి వ్యవహారాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అలా చేయకపోతే అసలైన లబ్ధిదారులకు న్యాయం జరుగదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అందుకే ఈ వ్యవహారంపై సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం కొత్తగా కట్టదల్చుకున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో ఇలాంటి అవతవకలు జరుగకుండా జాగ్రత్తపడాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 83.59 లక్షల కుటుంబాలకు సంబంధించి సమగ్ర సర్వే నిర్వహిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వంలోని 4లక్షల మంది ఉద్యోగుల ద్వారా కేవలం ఒకే రోజులో సర్వే నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం ఆగస్టు 1న రెవెన్యూ అధికారులకు హైదరాబాద్‌లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నామని ప్రకటించారు.

నేడో రేపో బోగస్ కార్డులపైనా..

రెండు మూడు రోజుల్లో బోగస్ రేషన్‌కార్డుల వ్యవహారంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇదే రకమైన ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ఏండ్లుగా బోగస్ కార్డుల జారీ జరిగిందని, వాటిని ఉపేక్షించే ప్రసక్తే లేదని ప్రభుత్వం భావిస్తున్నది. నిజమైన లబ్ధిదారులకే రేషన్ కార్డు ప్రయోజనాలు అందాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారు. బోగస్ కార్డులను సరెండర్ చేయాలన్న ప్రభుత్వ హెచ్చరికతో ఇప్పటికే దాదాపు 2లక్షల కార్డులను సరెండర్ చేశారు. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 84,20,662 లక్షల కుటుంబాలు ఉంటే రేషన్ కార్డులు 1,47,02,479 ఉన్నాయి. అయినప్పటికీ చాలా మందికి రేషన్‌కార్డులు లేవు. అంటే రేషన్‌కార్డుల జారీలో అవకతవకలు ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ఏటా ప్రభుత్వం 1800 కోట్లు ఖర్చు చేస్తున్నది. జాతీయ ఆహార భద్రత చట్టం అమల్లోకి వస్తే మరో వెయ్యి కోట్ల వరకూ ప్రభుత్వంపై భారం పడనుంది. ఈ నేపథ్యంలో బోగస్ కార్డులను ఏరివేసి, నిజమైన లబ్ధిదారులకు న్యా యం చేసేలా చూడాలని ప్రభుత్వం భావిస్తున్నది. బోగస్‌కార్డులను ఏరివేస్తే ప్రజాపంపిణీ వ్యవస్థలోని లోపాలను సరిదిద్దేందుకు అవకాశం ఉంటుంది. వృథాపోతున్న వ్యయాన్ని నియంత్రించుకోవడం ద్వారా ఖజానాపై భారాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ఇదే అంశంపై ఇటీవల పౌర సరఫరాల శాఖ సమీక్షా సమావేశంలో చర్చించారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)



జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

శనివారం, జులై 26, 2014

కేటీపీఎస్ ఏడోదశకు ఓకే...!

తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యుత్ లోటు భర్తీ, మిగులు విద్యుత్ సాధించేందుకు ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ ప్రాజెక్టుల్లో భాగంగా శుక్రవారం ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ ఏడోదశ విస్తరణపై చేపట్టిన ప్రజాభిప్రాయసేకరణకు ప్రజల నుంచి సానుకూలంగా భారీ స్పందన లభించింది. స్థానిక విద్యుత్ కళాభారతి క్రీడా మైదానంలో నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణలో కేటీపీఎస్ ఏడోదశ నిర్మాణం చేపట్టాలని సమావేశానికి హాజరైన వారంతా ముక్తకంఠంతో కోరారు.
ktpsఅన్నిపార్టీల నేతలు ఏడో దశ నిర్మాణానికి వ్యతిరేకం కాదని, భవిష్యత్‌లో 8వ దశ నిర్మాణం కూడా చేపట్టాలని కోరారు. కాలుష్యనియంత్రణ చర్యలు, కేటీపీఎస్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి, నిర్వాసితులకు ఉద్యోగాలు, ఆరోగ్య పరిరక్షణ, క్యాజువల్ లేబర్ పర్మినెంట్ వంటి డిమాండ్లను నెరవేర్చాలని, ప్రజల ఆరోగ్యాలకు హాని కలగకుండా కేటీపీఎస్‌ను ఎన్నిదశలుగా విస్తరించినా అభ్యంతరం లేదని అన్నిపక్షాల నాయకులు కోరారు. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ మాట్లాడుతూ విద్యుత్ లోటు భర్తీ, విద్యుత్ మిగులు రాష్ట్రంగా తయారు చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. కలెక్టర్ శ్రీనరేశ్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిపెంపు లక్ష్యంతోపాటు నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ఆలోచనతో కేటీపీఎస్ ఏడోదశ విస్తరణను చేపట్టిందన్నారు.

టీఎస్‌జెన్‌కో ఎండీ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, స్థానికులు లేవనెత్తిన అనేక సమస్యలకు తప్పని సరిగా పరిష్కారం చూపిస్తామన్నారు.ప్రజాభిప్రాయ సేకరణను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

తుదిశ్వాస వరకూ హైదరాబాదీనే!

-భారతీయురాలినని ఇంకెలా నిరూపించుకోమంటారు?
-మహిళనైనందుకే నాపై విమర్శలా?
-మరే దేశంలోనైనా ఇలా జరుగుతున్నదా?
దేశ, విదేశాల్లో లెక్కకుమిక్కిలి విజయాలు, ప్రశంసలు, అవార్డులతో భారత మహిళా టెన్నిస్‌కు చిరునామాగా ఉన్న సానియా మీర్జా కొన్నాళ్లుగా తన స్థానికతపై రాద్ధాంతం చేస్తున్న కుహనా జాతీయవాదులకు కన్నీళ్లతో అడుగుతున్న ప్రశ్న ఇది! తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా
ఎంపికైంది మొదలు పసలేని విమర్శలతో నానాయాగీ చేస్తున్న తీరు ఈ హైదరాబాదీ స్టార్‌ను ఎంత బాధించిందోగానీ, ఎట్టకేలకు పెదవి విప్పిన సానియా భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయింది. తన దేశభక్తిని శంకించొద్దని, తుదిశ్వాస వరకూ హైదరాబాదీనని గర్వంగా చెప్పుకుంటానంటూ శుక్రవారం ఎన్డీటీవీ చానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో కన్నీళ్లపర్యంతమైంది. 

sania-mirza2
తన స్థానికతను వివాదం చేయడంపై టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆవేదన వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా తన నియామకంపై రాజకీయ దుమారం రేగడంపై తీవ్రంగా కలత చెందినట్లు ఎన్డీటీవీ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో సానియా వాపోయింది. మహిళనైనందుకే తనపై ఇన్ని విమర్శలు చేస్తున్నారనీ, మరే దేశంలోనైనా ఇలా జరుగుతుందా అని ప్రశ్నించింది. ఎన్నో విజయాలు సాధించి దేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాననీ, తన భారతీయతను ఇంకెన్నిసార్లు నిరూపించుకోవాలని సానియా కన్నీళ్లు పెట్టుకుంది.

ఇంటర్వ్యూలో సానియా చెప్పిన వివరాలు ఆమె మాటల్లోనే..
-ఈ వివాదం నన్ను చాలా బాధిస్తోంది. నా భారతీయతను శంకించడం సరికాదు. నా స్థానికతపై ఇంత రచ్చ చేయడంవల్ల వారికేం ప్రయోజనమో అర్థంకావడం లేదు.

-చాలా ఏళ్లుగా నా దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నాను. టెన్నిస్‌లో చాలా విజయాలు అందుకున్నాను. ఆటలో నా ప్రతిభద్వారా దేశానికి ఎంతో గౌరవప్రతిష్టలు తీసుకొచ్చాను. పెళ్లయ్యాక కూడా భారత్ కోసమే ఆడి ఎన్నో పతకాలు సాధించాను. ఇక నా భారతీయతను ఎలా నిరూపించుకోవాలి?

-మరే దేశంలోనూ ఇలా జరగదేమో? మనం పురుషాధిక్య సమాజంలో ఉన్నాం. నేను మహిళను..అందులోనూ వేరే దేశం వ్యక్తిని పెళ్లాడినందుకే ఇలా నాపై నిందలు వేస్తున్నారు. 

-నన్ను బయటివ్యక్తిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. నేను పక్కా హైదరాబాదీని. వందేళ్లకు పైగా నా కుటుంబం భాగ్యనగరంలోనే నివసిస్తోంది. నా మూలాలన్నీ ఇక్కడే ఉన్నాయి. నా చివరిశ్వాస వరకు హైదరాబాదీగానే, భారతీయురాలిగానే జీవిస్తాను. 

-నా కుటుంబానికి ఎప్పుడు కూడా మతం, కులం పట్టింపులు లేవు. అందుకే నా భర్త ఎక్కడినుంచి వచ్చాడన్నది వాళ్లెప్పుడూ ఆలోచించలేదు. షోయబ్‌ను తొలిసారి కలిసినప్పుడు కూడా అతనిది పాకిస్థానా లేదంటే మరే దేశమా అన్నది నా మదిలోకి కూడా రాలేదు. కానీ వీళ్లెందుకు ఇవన్నీ పట్టించుకుంటున్నారో తెలియడం లేదు. నేను దేశభక్తి మెండుగా ఉన్నదాణ్ని. అందుకే ఇంత భావోద్వేగానికి గురవుతున్నాను. 

-ఇకనుంచి ఎవరేమనుకున్నా, ఎలాంటి విమర్శలు చేసినా పట్టించుకోను. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ హోదా అన్నది నాకు దక్కిన అరుదైన గౌరవం. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సాబ్ నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయను. రాష్ట్ర ప్రతినిధిగా గౌరవాన్ని నిలబెడతా.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

రాయల్టీ హాంఫట్...!

-విజిలెన్స్ నిఘాలో బయటపడిన భారీ కుంభకోణం
-బోర్డును ముంచిన ఏడు బడా కంపెనీలు.. మరో పదహారు కంపెనీలదీ అదే తీరు
-అగ్రిమెంట్ల రద్దుకు సీవీసీ సిఫారసు.. నివేదికను తొక్కిపట్టిన సీమాంధ్ర పాలకులు
-సొంతింటికి దూరమవుతున్న సాధారణ ప్రజలు

రాజధానిలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల సొంతింటి కల ఎందుకు నెరవేరటం లేదు? ఒకప్పడు నాలుగైదు లక్షల్లో లభించిన ఒక మోస్తరు ఫ్లాట్ ధర ఇప్పుడు ఒక్కసారిగా ఆకాశానికి ఎందుకు ఎగబాకింది? సాధారణ ప్రజలకు ఇండ్లు కట్టించే రాష్ట్ర హౌసింగ్ బోర్డు ఎందుకు జీవచ్ఛవంలా పడి ఉంది? దానికి ఉన్న భారీ ల్యాండ్ బ్యాంకు ఎలా పరుల హస్తగతమైంది? నిబంధనలను ఉల్లంఘించినవారిపై చర్యలకు స్వయంగా విజిలెన్స్ కమిషన్ ఆదేశించినా ఎందుకు చర్యలు లేవు?..

RAMKYఈ ప్రశ్నలకు సమాధానాలను అన్వేషిస్తే ఉమ్మడి రాష్ట్రంలో గత సీమాంధ్ర సర్కారులు హౌసింగ్ బోర్డును ఒక ఆదాయ వనరుగా మార్చుకునేందుకు చేసిన ప్రయత్నం కనిపిస్తుంది. బోర్డుకు రావాల్సిన సొమ్ములను ప్రభుత్వ ఖాతాలో జమ చేయించుకున్న ఉదంతం వెల్లడవుతుంది. తమవారికి దోచిపెట్టిన ప్రభుత్వ దోపిడీదందా సాక్షాత్కరిస్తుంది. నిబంధనలకు పాతరేసిన వైనం ఇండ్లులేని ప్రజలను పరిహసిస్తుంటుంది. బోర్డుకు కట్టాల్సిన రాయల్టీని దర్జాగా ఎగవేసిన బడా కంపెనీల అసలు స్వరూపం నగ్నంగా నిలబడుతుంది. అన్నింటికి మించి.. 1200 కోట్ల రూపాయల కుంభకోణం వికటాట్టహాసం చేస్తూ తాండవం చేస్తుంటుంది!

ఏపీ హౌసింగ్ బోర్డులో కళ్లు తిరిగే కుంభకోణం బయటపడింది. పెట్టుబడిదారులు, గత వలస పాలకులు కుమ్మక్కయిన ఫలితంగా ఏపీ హౌసింగ్‌బోర్డుకు 1200 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. నిబంధనలకు బిల్డర్లు పాతరేయడం, కట్టాల్సిన రాయల్టీలు కట్టకపోవడం, చెల్లింపులలో జాప్యం, వడ్డీలు కలుపుకొంటే బోర్డుకు ఇంతటి నష్టం కలిగిందని సాక్షాత్తూ కేంద్ర విజిలెన్స్ కమిషన్ పేర్కొంది. ఈ అక్రమాలను సరి చేసేందుకు సీవీసీ పలు సిఫారసులు చేసినా.. నాటి సీమాంధ్ర ప్రభుత్వాల్లోని పలువురు అధికారులు ప్రభుత్వ నేతల ఒత్తిళ్లతో ఫైలును తొక్కిపట్టారని సమాచారం.
ఏమిటీ హౌసింగ్‌బోర్డు?:

లాభాపేక్ష లేకుండా.. పట్టణ ప్రాంతాల్లోని మధ్య తరగతి, దిగువ మధ్యతరగతివర్గాలకు ఇండ్లు నిర్మించి, విక్రయించేందుకు ఏర్పాటు చేసిన సంస్థ ఇది. ప్రభుత్వంపై ఎలాంటి భారం పడకుండా మార్కెట్‌లో తక్కువ ధరకు ఇండ్లను నిర్మించడం దీని లక్ష్యం. ఇందుకోసం ఈ సంస్థకు భారీ స్థాయిలో ల్యాండ్ బ్యాంకు కూడా ఉండేది. హౌసింగ్ బోర్డు ఇండ్ల నిర్మాణరంగంలో క్రియాశీల పాత్ర పోషించినంతకాలం నిర్మాణ ధరలు నియంత్రణలో ఉన్నాయి. 2004కు ముందు హైదరాబాద్‌లోని అమీర్‌పేట, శ్రీనగర్‌కాలనీ, యూసఫ్‌గూడ, ముషీరాబాద్, ఆబిడ్స్, హిమాయత్‌నగర్‌వంటి కోర్ ఏరియాల్లో వెయ్యి గజాల ప్లాట్ కేవలం రూ.4.50లక్షల నుంచి 5.50 లక్షలకే ప్రైవేట్ బిల్డర్ల వద్ద లభించేవి. ఇలా నగర రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను హౌసింగ్ బోర్డు నియంత్రణలో ఉంచగలిగింది.
ఉదారమైన లక్ష్యాలున్న ఈ సంస్థను మూసివేసేందుకు నాటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తే.. మరో అడుగు ముందుకేసిన తర్వాతి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సంస్థను మూసివేయలేదుకానీ..

జీవచ్ఛవంగా మార్చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
హౌసింగ్‌బోర్డు ల్యాండ్ బ్యాంకును రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎరగా వేశారు. నగరంలో భూమి, అపార్ట్‌మెంటు ఫ్లాట్‌ల ధరలను అమాంతంగా ఆకాశానికి పెంచేశారు. ఫలితంగా హైదరాబాద్‌లో సొంతిల్లు కొనడం కాదు కదా.. కనీసం కలగనే పరిస్థితి లేకుండా పోయింది. నిజాంకాలం నుంచి నగరంలో ఇండ్ల నిర్మాణం కోసం సేకరించిన ల్యాండ్ బ్యాంక్‌పై కన్నేసిన సీమాధ్ర భూ రాబందులు.. ప్రభుత్వం ఇచ్చిన సడలింపుతో పావులు కదిపాయి. జాయింట్ వెంచర్ల పేరుతో కోట్ల రూపాయల విలువైన భూములను స్వాధీనం చేసుకున్నాయి.

జాయింట్ వెంచర్ల పేరుతో శఠగోపం..

హౌసింగ్ బోర్డు ఇండ్లు నిర్మించి, విక్రయించే పద్ధతికి వైఎస్ ప్రభ్వుత్వం తెరదించింది. ఆ పనిని జాయింట్ వెంచర్లకు కట్టబెట్టారు. కొన్ని షరతులు విధించారు. వీటి ప్రకారం.. ఈ భూములు కొనుగోలు చేసిన జాయింట్ వెంచర్లు 30 నెలల్లో నిబంధనల ప్రకారం ఇండ్లు, విల్లాలు, అపార్ట్‌మెంట్లు, ఎల్‌ఐజీలతోపాటు కమర్షియల్ కాంప్లెక్స్‌లుకూడా నిర్మించుకోవడానికి అనుమతించారు. ఇలా నిర్మించిన వాటిని విక్రయించగా వచ్చిన ఆదాయం నుంచి 3.5% హౌసింగ్ బోర్డుకు రాయల్టీగా చెల్లించి కొనుగోలుచేసిన వారి పేరు మీద రిజిస్ట్రేషన్లు చేయించాలి. ఈ రిజిస్ట్రేషన్లను నేరుగా హౌసింగ్ బోర్డు నిర్వహించాలి. అయితే బిల్డర్లు మార్కెట్ చేసుకోవడానికి అనుకూలంగా సేల్ అగ్రిమెంట్లు చేసుకోవడానికి మాత్రం హౌసింగ్ బోర్డు అనుమతించింది. దీన్ని అడ్డుపెట్టుకున్న బడాబాబులు హౌసింగ్ బోర్డుకు రాయల్టీ ఎగవేసి, సేల్ అగ్రిమెంట్లద్వారా నిర్మాణాలను అమ్మేసుకున్నారు.

ఇప్పటివరకు ఒక్క నిర్మాణం కూడా రిజిస్ట్రేషన్ కాలేదు. పైగా వీటిలో సామాన్యుల కోసం ఉద్దేశించిన ఎల్‌ఐజీ ఫ్లాట్లను నిర్మించకుండా ఇష్టారాజ్యంగా కమర్షియల్ నిర్మాణాలు చేపట్టారు. ఫలితంగా
మధ్యతరగతి ప్రజలకు అపార్ట్‌మెంట్లు, కాలనీలుగా ఆవిర్భవించాల్సిన దాదాపు 186 ఎకరాల భూములు డెవలపర్స్ చేతిలో విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, భారీ హోటళ్లుగా మారాయి. ఇక్కడే అసలు మెలికంతా ఉంది. ఆర్థిక వనరులు సమీకరించే పేరిట ప్రభుత్వం 2004-05 మధ్య కాలంలో హౌసింగ్‌బోర్డు భూములు విక్రయించి.. ఆ సొమ్మును బోర్డు ఖాతాలో కాకుండా ప్రభుత్వ ఖాతాలో జమచేసుకుంది. 

ఈ రకంగా దాదాపు 3వేల కోట్ల రూపాయలు బోర్డుకు కాకుండాపోయాయి. ఇదొక ఎత్తయితే.. ఈ భూములు కొనుగోలు చేసిన కంపెనీలు.. హౌసింగ్ బోర్డుకు కట్టాల్సిన రాయల్టీని ఎగ్గొట్టడం, చెల్లింపుల జాప్యం వంటి కారణాలతో హౌసింగ్‌బోర్డు దాదాపు 1200 కోట్ల రూపాయలు నష్టపోయింది. ఈ లెక్క స్వయంగా విజిలెన్స్ కమిషన్ తేల్చినదే. ఈ ఎగవేతదారుల్లో రాంకీ ఇన్‌ప్రాస్ట్రక్చర్స్, ఇందూ ఈస్ట్రన్ ప్రావిన్స్ ప్రాజెక్ట్స్, డీఎల్‌ఎఫ్, మధుకాన్ వంటి బడాకంపెనీలు కూడా ఉన్నాయి.

కంపెనీలపై విజిలెన్స్ నిఘా..

జాయింట్ వెంచర్లతో కుంభకోణానికి పాల్పడ్డ హైదరాబాద్‌లోని ఏడు కంపెనీలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ జరిపి నివేదిక రూపొందించింది. జాయింట్ వెంచర్ల పేరుతో వెలిసిన కంపెనీ బాగోతాలు, ప్రభుత్వానికి అవి చేసిన నష్టం, దానిని భర్తీ చేసేందుకు చర్యలను సుదర్ఘీంగా నివేదికలో పేర్కొంది.

జాయింట్ వెంచర్లు నిర్మించి స్థానిక మార్కెట్ విలువను పట్టించుకోకపోడం, జాయింట్‌వెంచర్ విధానాన్ని అమలు చేసే సమయంలో ఈక్విటీ నిర్వహణలో ప్రభుత్వ నిబంధనలను అమలు చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించి కోట్ల రూపాయలు అక్రమంగా లబ్ధిపొందారని నివేదిక పేర్కొంది. ఇలా నిబంధనలు ఉల్లంఘించిన డెవలపర్లతో కుదుర్చుకున్న అగ్రిమెంట్లను రద్దుచేయాలని, ఈ వ్యవహారంపై సీఐడీ లేదా సీబీఐ విచారణ జరుపాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నాలుగు నెలలక్రితం ప్రభుత్వానికి అందించిన నివేదికలో స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఇలాగే జాయింట్ వెంచర్ల పేరుతో నిబంధనలు ఉల్లంఘించిన మరో 16 సంస్థలపై హౌసింగ్ బోర్డు అధికారులే స్వయంగా విచారణ జరిపి ఆ సంస్థల అగ్రిమెంట్లను రద్దు చేయాలని కూడా విజిలెన్స్ కమిషన్ తన నివేదికలో సిఫారసు చేసింది. అయితే.. ఈ నివేదిక బయటకు రాకుండా కొంతమంది బిల్డర్ల అడుగులకు మడుగులొత్తే అధికారులు తొక్కిపెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. దానికి సీమాంధ్ర ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లుకూడా కారణమని హౌసింగ్‌బోర్డు వర్గాలు చెబుతున్నాయి.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కొడుకా.. ఎప్పుడు మాట్లాడుతవ్!

-పిల్లల క్షేమంపై ఆందోళనలో తల్లిదండ్రులు
-ఇంకా కోలుకోని బాధిత కుటుంబాలు
-యశోదాలో కొనసాగుతున్న వైద్యచికిత్స
-నలుగురు చిన్నారుల పరిస్థితి విషమం
కొడుకా.. ఎప్పుడు లేస్తవ్? ఎప్పుడు మాట్లాడుతవ్? దవాఖాన మంచంపై పడి ఉన్న బిడ్డను తల్చుకుని ఓ తల్లి ఆక్రోశమిది. ఆమెదే కాదు.. అక్కడున్న తల్లిదండ్రుల్లో ఇదే ఆదుర్దా. తమ పిల్లలు ప్రాణాపాయం తప్పించుకుని బయటపడాలని వారు కోటి దేవుళ్లకు మొక్కుతున్నారు. తమ కంటిపాపలను కాపాడాలంటూ వైద్యులను వేడుకుంటున్నారు. ఇది మెదక్ జిల్లా మాసాయిపేటలో గురువారం స్కూలు బస్సును రైలు ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలై నగరంలోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన. రెండో రోజుకు కూడా వారు ఆ ఘోరకలి నుంచి తేరుకోలేదు.
alfaవార్డుల్లో చికిత్స పొందుతున్న బిడ్డలను చూసి గొల్లుమంటున్నారు. ఘటన జరిగిన రోజు దగ్గరుంచి అన్నీ చూసుకున్న మంత్రులు శుక్రవారం కూడా ఆస్పత్రికి వచ్చి, విద్యార్థులకు అందుతున్న చికిత్స, వారి ఆరోగ్యంపై వైద్యులను వాకబు చేశారు. అక్కడే ఉన్న తల్లిదండ్రులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఆస్పత్రికి వచ్చినవారిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య, మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రిశశిధర్‌రెడ్డి, ఎల్ రమణ, నోముల నర్సింహయ్య, ఆరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, మహిళ సంఘం నేత సంధ్య తదితరులున్నారు. 40 మంది సూపర్ స్పెషలిస్టు వైద్యుల బృందం, వంద మంది నర్సులు వైద్య సేవల్లో నిమగ్నమై ఉన్నారు.

tableగాయపడిన వారి ప్రస్తుత పరిస్థితి ఇదీ..: గాయపడిన 20 మంది విద్యార్థులూ ప్రస్తుతం యశోదా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. అరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 10 మంది పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పది మంది వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారు. గాయపడిన చిన్నారులకు సికింద్రాబాద్ పీజీ కాలేజీ విద్యార్థులు శుక్రవారం ఆస్పత్రిలో రక్తదానం చేశారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

రైల్వేగేటా.. అదెక్కడ..?

- ఎక్కడోతప్ప కానరాని రైల్వేగేట్లు
- మృత్యుకుహరాలుగా మారుతున్న క్రాసింగ్‌లు
- నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రైల్వేశాఖ
- ప్రమాదం జరిగితే తప్ప, స్పందించని అధికారులు
రైల్వేగేట్లు మృత్యువుకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. వాయువేగంతో దూసుకువస్తున్న రైళ్లు కన్నుమూసి తెరిచేలోపే వందలమంది ప్రాణాలను కబళిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 10వేల వరకు కాపలాలేని రైల్వే క్రాసింగ్‌లు ఉండగా, రాష్ట్రంలో 400లకు పైగా ఉన్నట్లు రైల్వే శాఖ లెక్కలు చెప్తున్నాయి. 
raiwgteadhekadaరాష్ట్రంలో కాపలాలేని రైల్వేక్రాసింగ్‌ల పరిస్థితిని పరిశీలిస్తే.. ప్రధాన రైల్వే మార్గమైన విజయవాడ- సికింద్రాబాద్ మధ్య ఉన్న ఖమ్మం జిల్లాలో భారీగానే రైల్వే గేట్లు ఉన్నాయి. డోర్నకల్ నుంచి ఇల్లెందు వరకు, డోర్నకల్ నుంచి కొత్తగూడెం వరకు అనేక క్రాసింగ్‌లు ఉన్నా ఎక్కడా రైల్వే గేట్లు కనిపించవు. దశాబ్దాలు కిందటనే రైల్వే లైను పడినా.. గేట్ల నిర్మాణంలో రైల్వేశాఖ ఎక్కడాలేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. నిత్యం రద్దీగా ఉంటే ఇల్లందు పట్టణంలోని స్టేషన్ బస్తీలోనే గేటు ఏర్పాటుచేయలేదంటే ఇక గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నల్లగొండ జిల్లాలో 171 కిలోమీటర్ల మేర రైలు మార్గం ఉండగా.. సికింద్రాబాద్ - బీబీనగర్ - భువనగిరి - కాజీపేట, సికింద్రాబాద్ - బీబీనగర్ - నడికుడి - గుంటూరు వెళ్లే రెండు లైన్లు ఉన్నాయి.

ఈ మార్గాల్లో క్రాసింగ్‌ల వద్ద కాపలా సరిగా లేకపోవటంతో 1994 నుంచి ఇప్పటి వరకు సుమారు 100మందికిపైగా మృత్యువాత పడ్డారు. బీబీనగర్ - నడికుడి మధ్య పగిడిపల్లి నుంచి వాడపల్లి వరకు 86 క్రాసింగులు ఉంటే.. 30కిపైగా క్రాసింగుల వద్ద గేట్లు లేవు. మసాయిపేట ఘటనతో వరంగల్ జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రైల్వేశాఖ, జిల్లా విద్యాశాఖాధికారులు వేర్వేరుగా అత్యవసర సమావేశాలు నిర్వహించారు. లెవల్‌క్రాసింగ్‌ల వద్ద 24 గంటలు షిఫ్టుల వారీగా సిబ్బంది ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లాలో రెండు రైల్వే గేట్లు ప్రమాదకరస్థితిలో ఉన్నాయి. మర్పల్లి మండలంలోని కొత్లాపూర్-కోటమర్పల్లి మధ్యలో రైల్వేగేటు లేకపోవడంతో తరుచు ప్రమాదాలు జరుగుతున్నాయి.

నవాబుపేట్ మండలంలోని ముబారక్‌పూర్‌లో రైల్వేగేటు ఉన్న కాపలదారుడిని అధికారులు నియమించలేరు. కాచిగూడ- ద్రోణాచలం రైల్వేలైన్‌లో మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని తిమ్మాపూర్ స్టేషన్ నుంచి ఆలంపూర్ స్టేషన్(కర్నూల్ సరిహద్దు) వరకు మొత్తం 110 రైల్వే లెవల్ క్రాసింగ్‌లు ఉన్నాయి. వీటిలో కాపలాలేని లెవల్ క్రాసింగ్‌లు 33 ఉన్నాయి. మే 5, 1995న బాలానగర్ మండలంలోని రంగారెడ్డిగూడలో కాపలా గేటులేని లెవల్ క్రాసింగ్‌వద్ద దాటుతున్న జీపును రైలు ఢీకొట్టడంతో.. అందులో శుభకార్యం నిమిత్తం వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన 13మంది మృత్యువాత పడ్డారు. 1998లో దేవరకద్ర మండలంలో ఆరుగురు, 2012లో కౌకుంట్ల వద్ద ఐదుగురు ఈ తరహా ప్రమాదాల్లో మృతిచెందారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మీవాడ, తలమడుగు మండల కేంద్రంలో ఒకటి, అదే మండలంలో మరో మూడు రైల్వే క్రాసింగ్‌లు ఉన్నాయి. వీటికి కాపలాదారులను నియమించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 12 చోట్ల రైల్వే క్రాసింగులు కాపలా లేకుండా ఉన్నాయి. ఇక్కడ ఎటునుంచి ఏ రైలు వచ్చి ఢీకొంటుందోనని స్థానికులు భయపడుతున్నారు.

రైలు అసిస్టెంట్ డ్రైవరే.. గేటుకీపరు: కరీంనగర్ జిల్లాలోని పలు మార్గాల్లో రైల్వే గేట్ల వద్ద కాపలాదారులు లేరు. దీంతో రైలు డ్రైవరే గేటు కీపరు పనిని చేస్తున్నారు. పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే లైన్ ఆర్మూర్ వరకు పూర్తికాగా, జగిత్యాల వరకే నడుపుతున్నారు. ఈ మార్గంలో దక్షణ మధ్యరైల్వే జీఎం సర్వే చేసినప్పుడు రైల్వే గేట్ల ఆవశ్యకతను గుర్తించి మంజూరు చేశారు.

గేట్లు వచ్చింది.. కానీ కాపలాదారుడు లేడు. దీంతో పుష్పుల్ రైలు దేశ్‌రాజ్‌పల్లి గేటుకు కాస్త దూరంలో ఆగితే.. డ్రైవర్‌కు అసిస్టెంట్‌గా ఉన్న వ్యక్తి కిందికి దిగి గేటు వేసి పచ్చజెండా ఊపుతాడు. రైలు ముందుకు కదిలాక గేటు ఎత్తి సదరు ఉద్యోగి రైలు ఎక్కుతాడు. మధ్యలో మూడు చోట్లా ఇదే పరిస్థితి ఉంటుంది. ఈ గేట్ల వద్ద కాపలాదారులను నియమించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మాసాయిపేటలో జరిగిన ఘటనే సరిగ్గా 32 సంవత్సరాల క్రితం జిల్లాలోని కొలనూరు రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. మార్చి 20, 1982లో జనతా ఎక్స్‌ప్రెస్ ఓ బస్సును ఢీకొన్న ఘటనలో తీర్థయాత్రలకు వెళ్తున్న 61మంది భక్తులు మృత్యువాత పడ్డారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!