-అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములు స్వాధీనం చేసుకుంటాం
-ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద సెక్యులరిస్టు..
-బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి మహమూద్ అలీ
రాష్ట్రంలో 17వేల ఎకరాలు అన్యాక్రాంతం అయినట్లు ప్రాథమికంగా గుర్తించామని డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూములన్నింటినీ రీ సర్వే చేయిస్తామని ప్రకటించారు. సర్వే భూములపై ప్రతి నెల మీడియాకు వివరాలు అందిస్తామన్నారు. సీమాంధ్రుల పాలనలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ, వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పెద్ద సెక్యులరిస్టు అని కొనియాడారు. నిజాం పాలనలో హైదరాబాద్ నగరంలో హిందూ ముస్లీంలు కలిసిమెలిసి ఉండేవారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఆ వాతావరణం నెలకొంది. పాతబస్తీ, కొత్తబస్తీ అనే తేడా లేకుండా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తాం అని ప్రకటించారు. అవసరమైన మేరకు హైదరాబాద్ నగరాన్ని విస్తరిస్తామని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు రెవెన్యూశాఖ మంత్రిగా మహమూద్ అలీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే రామారావు, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
బాధ్యతల స్వీకరణ అనంతరం మహమూద్ అలీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించిపెట్టిన మహాత్ముడు కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్ అప్పగించిన బాధ్యతను నెరవేర్చుతానన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఐఏఎస్ అధికారి నేతృత్వంలో రెండు హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటుచేస్తానని ప్రకటించారు. పాతబస్తీ ప్రజలకు రుణాలు మంజూరు చేసే విషయంలో బ్యాంకర్లు వివక్ష చూపుతున్నారని.. ఇలాంటి అంశాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి