గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, మే 08, 2016

మాతృ వందన ఫలం


మిత్రులందఱకు "మాతృదినోత్సవ శుభాకాంక్షలు"


భూప్రదక్షిణ షట్కానఁ బొందు ఫలము;
కాశి యాత్రాచరణ మిడు ఘనఫలమ్ము;
సింధువునఁ జేయు స్నాన సంస్థిత ఫలమ్ము;
మాతృ వందన మాచరింపఁగనె కలుగు!


స్వస్తి

మంగళవారం, మే 03, 2016

వేరుపడినా... తీరుమారదా...!


gatikaపాలమూరు తెలంగాణకు ఎంత అవసరమైన ప్రాజెక్టో అందరికీ తెలుసు. కానీ రైతుల భవిష్యత్ కన్నా, తమ రాజకీయ భవిష్యత్తే ముఖ్యమనుకునే వాళ్లు పాల(మూరు)ల్లో విషం చుక్కలు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. అనంతపురం జిల్లాకు నీళ్లొచ్చాయనే ఆనందంతో హంద్రీనీవా భగీరథ విజయయాత్ర పేరుతో నాలుగేళ్ల క్రితం అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి నిర్వహించిన పాదయాత్రకు కేబినెట్ మంత్రిగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన డీకే అరుణ హారతులిచ్చి దీవెనలందించారు. అనంతపురం కూడా పాలమూరు లాంటి వెనుకబడిన జిల్లానే, రైతులెవరైనా రైతులేనని, తాను అందుకే వెళ్లానని నాటి తన చర్యను సమర్థించుకున్నారు. ఇప్పుడు తాజా సన్నివేశం పరిశీలిస్తే.. డీకె అరుణ సొంత జిల్లా అయిన పాలమూరు రైతులకు నీళ్లివ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నది. దీన్ని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రఘువీరారెడ్డి గట్టిగా వ్యతిరేకించి ధర్నాకు దిగారు. ఎంత తేడా? ఎలాంటి అనుమతులు లేకుండా, ఎగువ రాష్ర్టాలకు సమాచారం అందివ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమను పూర్తి చేసుకున్నది. అయినా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంతగా తప్పుబట్టలేదు. సముద్రంలోకి పోయేకన్న ఎవరో ఒకరు వాడుకుంటే రైతులకే కదా మేలు జరిగేది అని నిండు అసెంబ్లీలో కేసీఆర్ వ్యాఖ్యానించారు కూడా. గతేడాది నాగార్జునసాగర్ నీళ్లను వాడుకునే విషయంలో కూడా రెండు రాష్ర్టాల మధ్య లొల్లి పుట్టింది. అప్పుడు కూడా కేసీఆర్ పట్టింపునకు పోకుండా, టీఎంసీల లెక్కలు చూసుకోకుండా రైతులెవరైనా రైతులే అనే విశాల దృక్పథంతో సాగర్ ఆయకట్టు రైతుల కోసం సాగునీరు విడుదల చేశారు. 


కేసీఆర్ ఇంత ఉదారంగా వ్యవహరిస్తుంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మనస్తత్వం మాత్రం రోజురోజకు మరుగుజ్జుదవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు కరువును చూసి చలించి దత్తత తీసుకుంటునట్లు బాబు ప్రకటించారు. పాలమూరు దారిద్య్రాన్ని పారదోలే వరకు నిద్రపోనని మనవి చేసుకున్నారు. కానీ ఆయన తొమ్మిదేళ్ల పాలనలో పాలమూరు కోసం ఒక్క ప్రాజెక్టు కట్టలేదు. ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలో పాలమూరు జిల్లాను సస్యశామలం చేయడం కోసం వడివడిగా అడుగులు పడుతున్నాయి. అదే చంద్రబాబు ఉత్తర తెలంగాణకు నీళ్లిస్తానని నమ్మబలికి దేవాదులకు పునాదిరాయి వేశారు. కానీ ఆయన పదవిలో ఉండగా రూపాయి పని జరగలేదు. కాంగ్రెస్ హయాంలో ఒక్క ఎకరానికి నీరివ్వలేదు. 


గత పాలకులు హామీలిచ్చి, నమ్మబలికి వదిలేసిన ప్రాజెక్టులను కేసీఆర్ పట్టుదలతో పూర్తి చేయడానికి నిర్ణయించారు. దీన్ని చంద్రబాబు సహించలేకపోతున్నారు. ఉత్తర తెలంగాణకు నీళ్లిచ్చే కాళేశ్వరాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు భూమి పూజ చేసిన రోజే ఏకంగా ఏపీ కేబినెట్ తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తీర్మానం చేయడం వారి రాక్షస మనస్తత్వాన్ని కూడా బయటపెట్టింది. ఇక వైఎస్సార్సీపీది మరో డ్రామా. జగన్ కూడా పాలమూరుకు నీళ్లివ్వడమే పాపమన్నట్లు ప్రవర్తిస్తున్నారు. శ్రీశైలం దగ్గర ఆగిన నీళ్లను తెలంగాణ వాడుకుంటే మరి పోతిరెడ్డి పాడుకు నీళ్లెట్ల ఎక్కుతయని ప్రశ్నిస్తున్నడు. అక్రమంగా కట్టుకున్న పోతిరెడ్డిపాడు కోసం పాలమూరు రైతులు నష్టపోవాలని స్పష్టంగానే చెపుతున్నాడు. 


రాష్ట్ర విభజన జరగక ముందు తెలంగాణపై విషం కక్కి అక్కడ రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నించిన పార్టీలు నేటికీ అదే పంథా కొనసాగిస్తున్నాయి. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీయగలిగితే అది ఆంధ్ర ప్రజలకు లాభం చేసిపెట్టడంతో సమానమనే సంకుచిత భావజాలంతో అక్కడి పార్టీలున్నాయి. చంద్రబాబు, జగన్, రఘువీరారెడ్డి.. ఈ ముగ్గురు తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చేస్తున్న వాదనలోని అంతరార్థం ఒక్కటే. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత అన్ని జెండాలు ఒక్కటై తెలంగాణాను అడ్డుకోగలిగినట్టే (తాత్కాలికంగానైనా) కృష్ణాపై కట్టే ప్రాజెక్టులను అడ్డుకోవాలన్నదే వారి ఉమ్మడి లక్ష్యంగా కనిపిస్తున్నది. ఆంధ్రా నాయకుల్లో, పార్టీల్లో ఏక రూపత చూస్తే తెలంగాణ పార్టీలకు లేనిదేమిటో అర్థమవుతుంది. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్ర పార్టీలు ప్రత్యక్షంగానే వ్యతిరేకిస్తుంటే, తెలంగాణలోని కాంగ్రెస్, టీడీపీలు ఎలాగైనా పాలమూరు పథకాన్ని ఆపాలని దొడ్డి దారిన ప్రయత్నిస్తున్నాయి. 


అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ పార్టీలు పాలమూరు ప్రాజెక్టును వ్యతిరేకించడానికి రాజకీయ ప్రయోజనాలే తప్ప, ప్రజాప్రయోజనం కనిపించడం లేదు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆంధ్రజనం ఆగ్రహంతో ఉన్నారు. ఆ ఆగ్రహాన్ని కేంద్రం వైపో లేక తెలంగాణ వైపో మళ్లించాలనే వ్యూహంలో చంద్రబాబున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణను అడ్డుకోవడానికి తాను చేసిన ప్రయత్నాలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనను అధికార పీఠంపై కూర్చోబెట్టాయని చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు. అందుకే మళ్లీ తెలంగాణ వ్యతిరేకతను ఎజెండాగా మార్చుకోవాలని చూస్తున్నారు. జగన్ కూడా ఇంచుమించు అదే పద్ధతిని అవలంబిస్తున్నాడు. సమైక్య రాష్ట్రంలో మాదిరిగా నీళ్ల దోపిడీ సాధ్యం కాదనీ తెలుసు. కాబట్టే పోతిరెడ్డిపాడును గుర్తు చేస్తున్నారు. 


తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు, పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు రాయలసీమకు మళ్లించాడు, ఈ పని చంద్రబాబు చేయలేకపోతున్నాడని జగన్ ఆంధ్ర ప్రజలకు చెప్పదలుచుకున్నారు. విభజనకు కారకుడు జగనే అని చంద్రబాబు అప్పుడు విపరీత ప్రచారం చేసి ఆంధ్రలో లబ్ధి పొందారు. ఇప్పుడు అదే అస్ర్తాన్ని చంద్రబాబుపై జగన్ ప్రయోగిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా జనంలో పోయిన ఆదరణను కొద్దో గొప్పో నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నది. ప్రత్యేక హోదా రాకపోవడంతో పాటు, చంద్రబాబు వైఫల్యాలను ఎండకట్టే పనిలో కాంగ్రెస్ ఉన్న ది. పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టులు పూర్తవుతాయనే విషయంలో ఆంధ్ర పార్టీలకు ఏకాభిప్రాయం ఉంది. కానీ పూర్తయ్యే పాలమూరు విషయాన్ని రాద్ధాంతం చేసే విషయంలో ఎవరెన్ని మార్కులు సాధించుకుంటారనే విషయంపైనే ఆంధ్రలో పోటీ నడుస్తున్నది. ఇక తెలంగాణలో కూడా అంతే. 


పాలమూరు, కాళేశ్వరం, డిండి పూర్తయితే ప్రజలు కేసీఆర్‌కు జేజేలు పలుకుతారు. ఎంత వ్యతిరేకత ఉన్నా పాలమూరు, నల్గొండ జిల్లాలు కాంగ్రెస్ పార్టీని ఇప్పటిదాకా ఆదరిస్తూ వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లో సగం సీట్లు ఈ జిల్లాలవే కావడం గమనార్హం. ఇప్పుడు ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే జనం కాంగ్రెస్‌ను మరిచిపోతారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో సింగిల్ డిజిట్ వచ్చే అవకాశం కూడా లేదు. అందుకే పాలమూరు ఆగిపోవాలని, కనీసం జాప్యం కావాలని కోరుకుంటున్నారు. పాలమూరు ఎంత అవసరమైన ప్రాజెక్టో అందరికీ తెలుసు. కానీ రైతుల భవిష్యత్ కన్నా, తమ రాజకీయ భవిష్యత్తే ముఖ్యమనుకునే వాళ్లు పాల(మూరు)ల్లో విషం చుక్కలు వేయడానికి ప్రయత్నిస్తున్నారు.జై తెలంగాణ!    జై జై తెలంగాణ!