గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, జూన్ 17, 2014

మరో కుట్రకు తెరతీసిన బాబు!

-విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ వాటా 55 శాతంపై కన్ను
-ఈఆర్సీలో పెండింగ్‌లో ఉన్న పీపీఏల రద్దుకు యోచన
తెలంగాణపై మరో కుట్రకు ఆంధ్రప్రదేశ్ సీఎం చందబాబు తెరతీశారు. తెలంగాణను అంధకారంలో నెట్టి నవ్యాంధ్రప్రదేశ్‌ను నిర్మించేందుకు చంద్రబాబు వ్యూహాల్లో నిమగ్నమయ్యారు. విద్యుత్‌రెగ్యులేటరీ కమిషన్(ఈఆర్సీ)లో పెండింగ్‌లో ఉన్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ)లను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంధనశాఖ అధికారులను ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర విభజన అనంతరమూ సీమాంధ్రలోని ఏపీ జెన్‌కో పవర్ ప్రాజెక్టుల విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణకు 55 శాతం విద్యుత్ వాటా ఉంటుంది. అన్ని జెన్‌కో ప్రాజెక్టుల నుంచి నాలుగు డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(డిస్కమ్స్)లతో పీపీఏలు ఉన్నాయి.

ఏపీ జెన్‌కో పీపీఏల గడువు పూర్తికావడంతో వాటి పొడిగింపు అంశం ఈఆర్సీ వద్ద కొంతకాలంగా పెండింగ్‌లో ఉంది. ఇప్పటివరకు ఈఆర్సీ అనుమతించని జెన్‌కో పీపీఏలను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఈఆర్సీకి లేఖను అందించాలని బాబు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇటీవల సీమాంధ్రలో బొగ్గు కొరత కారణంగా జెన్‌కో ప్లాంట్లు పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయలేని పరిస్థితి నెలకొంది. ఇతరత్రా మార్గాల్లో బొగ్గు లభ్యత సాధించినా, విద్యుత్ ఉత్పత్తిలో పీపీఏ ప్రకారంగా, రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 55 శాతం మేరకు విద్యుత్‌ను అందించాల్సి ఉంటుంది.

తాము ఉత్పత్తిచేసే విద్యుత్తును తమ అవసరాలకన్నా తెలంగాణకు ఎక్కువ వాటా ఇవ్వాల్సి వస్తుందన్న నిజాన్ని చంద్రబాబు సర్కారు జీర్ణించుకోలేకపోతోంది. పీపీఏలను రద్దుచేస్తే ఎలా ఉంటుందని బాబు శనివారం తన నివాసంలో జరిగిన సమీక్షలో ఏపీ ఇంధనశాఖ ఉన్నతాధికారులను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. పీపీఏలను రద్దుచేయడం సాధ్యంకాదన్న ఓ ఉన్నతాధికారిపై బాబు ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. సొంత అవసరాలను వదులుకుని పొరుగింటి సేవలు ఎంతకాలం చేసుకుందాం? అని బాబు మండిపడినట్టు తెలుస్తోంది. చంద్రబాబు వ్యూహం ఆచరణరూపం దాలిస్తే సీమాంధ్రలోని జెన్‌కో విద్యుత్‌లో తెలంగాణకు వాటా లేకుండా పోయే ప్రమాదం పొంచి ఉంది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి