గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, నవంబర్ 21, 2014

రోడ్లే లేని ఖ‌నిజాల ఖిల్లా...!

bridge


భారీ డిమాండ్ ఉన్న ఖనిజం నిక్షిప్తమైన చోట పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం త్వరితగతిన అభివృద్ధి చెంది రూపురేఖలే మారిపోతాయి. అదొక పల్లెటూరు అయినా పట్నాన్ని తలపించేలా మార్పుతథ్యం. కానీ సమైక్యరాష్ట్రంలో వలసపాలకులు కుట్రలకు 25 ఏండ్ల కిందట ఉన్న పరిస్థితులే నేటికీ ఓ గ్రామంలో దర్శనమిస్తున్నాయి.
-డోలమైట్ ఖనిజమున్నా అభివృద్ధి చెందని మాదారం
-ఖనిజం తవ్వుకుని కనీససౌకర్యాలు కల్పించని వైజాగ్‌స్టీల్స్
-రూ.900 కోట్ల ఖనిజం తరలింపు.. రూ.40 కోట్ల రాయల్టీ చెల్లింపు
-25 ఏండ్లుగా గ్రామానికి రాయల్టీ వాటా ఇవ్వని సమైక్య పాలకులు

తెలంగాణ సొమ్ము దోచిపెట్టిన సమైక్యపాలకుల కుట్రలకు బలైందీ డోలమైట్ మాదారం! ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని మాదారం గ్రామాన్ని జల్లెడపట్టి డోలమైట్‌ను ఏపీలోని వైజాగ్‌స్టీల్స్‌కు కట్టబెడుతూ వలసపాలకులు రెడ్‌కార్పెట్ పరిచారు. అదే సమయం లో కనీసం ఈ గ్రామంలో సదరు కంపెనీ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నదా? లేదా? అనే విషయాన్ని గాలికొదిలేసింది. 
గాజువాకను సుందరంగా తీర్చిదిద్దిన స్టీల్‌ప్లాంట్: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మాదారం చుట్టుపక్కల భారీస్థాయిలో డోలమైట్ నిక్షేపాలు ఉన్నాయి. ముడి ఇనుమును కరిగించగా వచ్చే వ్యర్థాలను తొలగించేందుకు, ఇనుమును కరిగించే కొలిమిలను తయారుచేసేందుకు డోలమైట్‌ను ఉపయోగిస్తారు. ఈ కర్మాగారంలో లోహాలను కరిగించేందుకు ఉపయోగించే కొలిమి నుంచి ఉద్భవించే విపరీతమైన వేడిమిని డోలమైట్‌తో తయారుచేసే ఇటుకలే తట్టుకోగలుగుతాయి. అందుకే డోలమైట్ ఖనిజానికి భారీ డిమాండ్. మాదారంలోని డోలమైట్‌కు హైగ్రేడ్ రా మెటీరియల్‌గా పేరుంది. ఉత్తమ నాణ్యత ఉన్న డోలమైట్‌పై సమైక్యరాష్ట్రంలో వలసపాలకుల కన్ను పడింది. విశాఖ స్టీల్‌ప్లాంట్ అవసరాల కోసం ఇక్కడ అనుబంధంగా 1989లో ఓ పరిశ్రమ నెలకొల్పారు.

ఉత్పత్తిని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.900 కోట్ల విలువైన 75 లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేసి విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్‌కు ఎగుమతైంది. 75 లక్షల టన్నుల డోలమైట్‌ను ఉత్పత్తిచేసిన ఈ కర్మాగారం ప్రభుత్వానికి రూ.40 కోట్ల రాయల్టీ చెల్లించింది. ఈ రాయల్టీ నుంచి మాదారం గ్రామ పంచాయతీకి ఒక్కపైసా కూడా చెల్లించలేదు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుచేసిన గాజువాకను సుందరనగరంగా తీర్చిదిద్దిన విశాఖ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం, అనుబంధ కర్మాగారం నెలకొల్పిన తెలంగాణలోని మాదారం గ్రామాన్ని మాత్రం పట్టించుకోలేదు.

నిబంధనలకు తూట్లు.. నిర్వాసితులకు మొండిచేయి: ప్రభుత్వానికి చెల్లించే రాయల్టీలో 25 శాతం వాటా స్థానిక సంస్థలకు చెల్లించి ఏజెన్సీ గ్రామాలను అభివృద్ధి చేయాలని జీవో ఎంఎస్ నెంబర్ 49లో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ అప్పటి సర్కా రు నిబంధనలను తుంగలోతొక్కి తీవ్ర అన్యాయం చేసింది. ఇప్పటివరకు రూ.40 కోట్ల రాయల్టీని చెల్లించినందున మాదారం పంచాయతీకి రూ.10 కోట్లు రావాల్సి ఉంది. కానీ సమైక్యరాష్ట్రంలో ఒక్కపైసా రాయల్టీలో ఇవ్వలేదు. విశాఖ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం మాదారం డోలమైట్ మైన్స్ కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు మొండిచేయి చూపింది.

210 మంది రైతుల నుంచి 950 ఎకరాల భూమిని సేకరించి కొందరికే ఉద్యోగాలు కల్పించింది. మిగతా నిర్వాసితులు ఎన్నోసార్లు ఆందోళన చేపట్టినా ఫలితం లేకపోయింది. డోలమైట్ మైనింగ్ వల్ల కాలుష్యంతో ఇప్పటికీ రైతులు పంటనష్టపోతూనే ఉన్నారు. గనుల్లో భారీ పేలుళ్ల కారణంగా గ్రామంలో ఇండ్లకు బీటలుబారుతున్నాయి. మాదారంలో ఏ రోడ్డుచూసినా గుంతలూ, గతుకులే. వర్షాకాలంలో పదడుగులు కూడా వేయలేని దుస్థితి గ్రామానిది. కోట్లాది రూపాయల విలువైన ఖనిజాన్ని తరలించుకుపోతున్న వైజాగ్‌స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం కనీస బాధ్యతగా రోడ్లను కూడా పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వలసపాలకుల నిర్లక్షానికి గురైన మాదా రం స్వరాష్ట్రంలోనైనా బాగుపడుతుందని గ్రామస్తులు ఆశిస్తున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

మంగళవారం, నవంబర్ 18, 2014

మన రాష్ట్రం...మన చిహ్నాలు...

PALAPITTA


-రాష్ట్ర అధికార చిహ్నాల ఎంపికలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముద్ర ..
-తెలంగాణ సంప్రదాయానికి ప్రాధాన్యం
రాష్ట్ర అధికారిక చిహ్నాలు ఖరారయ్యాయి. చిహ్నాల ఎంపికపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వయంగా కసరత్తు చేశారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలను పరిగణనలోకి తీసుకుని వాటికి అనుగుణంగా...

రాష్ట్ర జంతువుగా జింక
రాష్ట్ర పక్షిగా పాలపిట్ట
రాష్ట్ర వృక్షంగా జమ్మిచెట్టు(శమీవృక్షం)
రాష్ట్ర పుష్పంగా తంగేడి పువ్వు 
లను ఎంపిక చేశారు. 

Tealanganastate-symbols

అంతకు ముందు అటవీశాఖ అధికారులు రాష్ట్ర జంతువుగా అడవిదున్న, పక్షిగా పాలపిట్ట, చెట్టుగా ఇప్ప లేదా పువ్వుగా మోదుగపూవును ప్రభుత్వానికి ప్రతిపాదిన పంపించారు. ఇందులో పాలపిట్టను ఖరారు చేసిన సీఎం మిగతా వాటిలో మార్పులు చేశారు. తెలంగాణ జీవనానికి, మనో భావాలకు అనుగుణంగా చిహ్నాలను నిర్ణయించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర కోణంలో చిహ్నాల ఖరారు జరిగిందని, స్వరాష్ట్రంలో మన చరిత్ర నేపథ్యాన్నే పరిగణలోకి తీసుకుని ఎంపిక చేయడం అవసరమని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. తెలంగాణ ప్రకృతితో ముడిపడిన అంశాలతోపాటు ప్రజల విశ్వాసాలు, పురాణాల నేపథ్యం, శుభాశుభాలు తదితర అంశాలపై లోతైన పరిశీలన జరిపిన తర్వాతే ముఖ్యమంత్రి చిహ్నాలపై ఒక నిర్ణయానికి వచ్చారు. ఏ ఏ చిహ్నాలను ఎందుకు ఖారారు చేయాల్సి వచ్చిందో సీఎం వివరించారు.

TANGEDU-PUVVU


జమ్మిచెట్టు ఆశీర్వాదం..



Tealanganastate-symbols

జమ్మిచెట్టు తెలంగాణ ప్రజల జీవనంలో అంతర్భాగం. రాష్ట్రంలో గొప్పగా జరుపుకునే పండుగ దసరా. ఆ రోజు జమ్మి చెట్టుకు పూజ చేసి ఆకును బంగారంగా భావించి స్వీకరిస్తారు. మిత్రులు బంధువులతో అలయ్‌బలయ్ చేసినా పెద్దలకు నమస్కరించినా, పాదాభివందనం చేసినా జమ్మిఆకును సమర్పించి వందనం చేయడం తెలంగాణ విశిష్ట సంప్రదాయం. ఉన్నది అందరూ పంచుకోవడం అనే తెలంగాణ సంస్కృతికి ప్రతీక. పాండవులు అజ్ఞాతవాస సమయంలో ఆయుధాలను జమ్మిచెట్టుపై భద్రపరిచారు. దసరా రోజునే శమీవృక్ష పూజ అనంతరం ఆయుధాలు దించి యుద్ధంలో పాండవులు విజయం సాధించారు. జమ్మి చెట్టు శక్తి, ఆశీర్వాదం వల్లనే పాండవుల విజయం సాధ్యమైందనేది పురాణగాథ. ఇవాళ తెలంగాణ ప్రజల విజయానికి జమ్మి చెట్టు ఆశీర్వాదం అవసరముంది. జమ్మిచెట్టు అధికారిక చిహ్నంగా ఉండటం మేలు చేస్తుంది. అందుకే అది మన చెట్టయింది.

JAMMI-CHETTU


పాలపిట్ట శుభసూచకం..



పాలపిట్టకు తెలంగాణ సంస్కృతికి దగ్గరి బంధం ఉంది. దసరా పండుగ నాడు పాలపిట్టను దర్శించుకోవడం ఇక్కడి ప్రజలు పుణ్యకార్యంగా భావిస్తారు. ఏ పనిలోనైనా పాలపిట్ట కనిపిస్తే శుభసూచకమని తెలంగాణలో విశ్వాసం. లంక నగరంపై దండెత్తే ముందు శ్రీరాముడు పాలపిట్టను దర్శించుకున్నాడని జనశ్రుతి. తెలంగాణ రాష్ట్రం కూడా అన్ని రంగాలలో విజయపథాన నడవడానికి శుభసూచకంగా పాలపిట్టను ఎంపిక చేశారు. 

DEER


తంగేడు పువ్వు.. మన అందరి పువ్వు..



పసుపుపచ్చ రంగుతో ప్రకృతికే వన్నె తెచ్చే తంగేడి పువ్వు ఇప్పుడు మన రాష్ట్ర పుష్పంగా రికార్డుకెక్కుతోంది. తెలంగాణ సంస్కృతికి తంగేడు పువ్వు నిలువుటద్దం. అదిలేని బతుకమ్మ పండుగను ఊహించలేం. తంగేడు పువ్వు సౌభాగ్యాన్ని కాపాడే విశిష్ట పుష్పంగా తెలంగాణ మహిళలు ఆరాధిస్తారు. ఈ కారణంగానే తంగేడు పువ్వును అధికారిక పుష్పంగా ముఖ్యమంత్రి ఖరారు చేశారు.

జింక ఎందుకంటే..



ఇక రాష్ట్ర జంతువు ఎంపికలో తెలంగాణ వాసుల మనస్తత్వాన్ని సీఎం పరిగణనలోకి తీసుకున్నారు. రాష్ట్రం దాదాపు అన్ని ప్రాంతాల చిట్టడవుల్లో సైతం జింకలు విరివిగా ఉన్నాయి. తెలంగాణ ప్రజలు సున్నిత మనస్కులు, అమాయకులు. జింక కూడా అత్యంత సున్నితమైనది, అమాయకమైనది. జింకకు భారతదేశ చరిత్రతో, పురాణాలతో గాఢమైన అనుబంధం ఉంది. రామాయణంలో జింకకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ కారణంగా జింక ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర జంతువైంది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

శుక్రవారం, నవంబర్ 14, 2014

30వేల ఎకరాలు...రాజధాని కోసమా?...రియల్ దందా కోసమా?...

-30 వేల ఎకరాలు ఎవరికోసం?
-హుండీ డబ్బులతో సింగపూర్ నిర్మిస్తారా?
-పేద అరుపులు.. పెద్ద మాటలు
- మండిపడుతున్న ఏపీ మేధావులు
-ఆరు వేల ఎకరాల్లో అద్భుతంగా నయా రాయ్‌పూర్
-సింగపూర్ సినిమా ప్రచార పటాటోపమే
-ఆ నగరం వెనుక 195 ఏండ్ల చరిత్ర
-దేశంలో 30 వేల ఎకరాలు
-సేకరించిన రాజధానే లేదు
-హైదరాబాద్‌లో రాజధాని 225.520 ఎకరాలే
-చండీగఢ్ ఉన్నది 114 చ.కి.మీ.లోనే
వేల ఎకరాల్లో రాజధాని.. సింగపూర్.. మలేసియా... ఇవీ ఇవాళ అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చూపిస్తున్న త్రీడీ సినిమా. ఆయన భజన బందం, ఆస్థాన పత్రికలు కూడా యథాశక్తి ఊదరగొడుతున్నాయి. తామేం తక్కువ తినలేదన్నట్టు ఆస్థాన ఎన్నారైలూ సదస్సులు పెట్టి భారీగా చందాలు సేకరిస్తున్నారు. ఇక్కడా హుండీలు. అవి చాలవన్నట్టు పత్రికలు కూడా ఆ కార్యక్రమంలో తలమునకలవుతున్నాయి. ఇంతకీ ఒక రాజధానికి ఎంత భూమి కావాలి? దేశంలో అనేక రాజధానుల వైశాల్యమెంత? ఏపీ జనాభా ఎంత? ఆదాయమెంత? దానికి ఈ 30వేల ఎకరాలకు పొంతన ఉందా? మాట్లాడితే సింగపూర్‌అంటూ జేబులో బొమ్మనేదో తీసి ఇస్తానంటున్న బాబు అసలు సింగపూర్ ఇవాల్టి అభివృద్ధి వెనక కరిగించిన కాలం, అక్కడి పాలకుల అంకితభావం ఎంతో అన్నది గమనించారా? బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టే కార్పొరేట్ మూకలను చుట్టు పెట్టుకుని 30 వేల ఎకరాల్లో ఆయన చేసేది రాజధాని నిర్మాణమా? రియల్ ఎస్టేట్ దందానా? ప్రజలు ఏమనుకుంటున్నారు? 

seemandhra

దేశంలో 29 రాష్ర్టాలున్నాయి. అందులో ఎన్ని రాజధానులు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి అనేది పరిశీలిస్తే ఏపీ రాజధాని లెక్కల్లో డొల్లతనం బయటపడుతుంది. అనేక రాజధాని నగరాలు కూడా వందల ఏండ్ల కాలక్రమంలో విస్తరించినవే తప్ప ఒకేసారి ఏకంగా ఇంత భూభాగంలో నిర్మించినవి కావు. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌కు కొత్త రాజధాని నిర్మించాలని తలపెట్టి సేకరించిన భూమి కేవలం 19 వేల ఎకరాలు. అందులో రాజధాని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆడిటోరియాలు ప్రజల నివాసాలు సహా ప్రజోపయోగ భవనాల సముదాయాలకు కేటాయించింది కేవలం 6 వేల ఎకరాలు. హైదరాబాద్ రాజధాని కేవలం 225.52 ఎకరాలే: వాస్తవానికి హైదరాబాద్ రాజధాని నిర్మాణం కేవలం 225.52 ఎకరాల భూమిలోనే జరిగింది. ఆ పరిధిలో నిజాం రాజులు నిర్మించిన భవనాలే ఇప్పటికీ రాజధాని అవసరాలు తీరుస్తున్నాయి.

వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, అసెంబ్లీ, సెక్రటేరియట్, మంత్రుల నివాస సముదాయం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాలన్నీ ఈ పరిధిలోనే ఉన్నాయి. రాష్ట్ర గవర్నర్ కొలువుదీరే రాజ్‌భవన్ ఉన్నది కేవలం 22 ఎకరాల భూమిలోనే, ఎమ్మెల్యేలు కొలువుదీరే అసెంబ్లీ ఉన్నది ఆరు ఎకరాలు.. 294 మంది ఎమ్మెల్యేలు, 90మంది ఎమ్మెల్సీలు నివాసం ఉండడానికి నిర్మించిన ఎమ్మెల్యేల నివాస సముదాయం రెండు చోట్ల కలిపి కేవలం 18.10 ఎకరాల భూమిలోనే, సచివాలయం ఉన్నది 22.80 ఎకరాల భూమిలో, హై కోర్టు ఉన్నది 2.9 ఎకరాల భూమిలో మాత్రమే.

సింగపూర్ జేబులో వస్తువు కాదు..: రాష్ట్ర విభజనలో హైదరాబాద్ వంటి రాజధానిని కోల్పోయామని తిరిగి ఆ స్థాయి నగరం కావాలంటూ చంద్రబాబు ఎన్నికలనాటినుంచే ప్రచారం ప్రారంభించారు. హుండీలు పెట్టి ఏదో కోల్పోయామన్న భావన రగిలించారు. సెంటిమెంటును రెచ్చగొట్టి సరిగ్గా అలాంటి రాజధాని కచ్చితంగా అవసరం అన్న భ్రమ కల్పించారు. వాస్తవానికి దేశంలో అనేక రాష్ర్టాల్లో రాజధానులు విజయవాడ, విశాఖ కన్నా పెద్దవేం కావు. కొద్దిపాటి పెట్టుబడితో విశాఖ లేదా విజయవాడలనే రాజధానులుగా మార్చుకోగల అవకాశముంది. విజయవాడ రాజధాని కావాలని ఆ నగర ప్రజలు ఆరు దశాబ్దాల క్రితమే కలలు గన్నారు. అయితే హైదరాబాద్‌ను చూపి పక్కదారి పట్టించారు.

తర్వాత సింగపూర్ వంటి రాజధాని అంటూ రంగుల బొమ్మలు చూపించారు. అదేదో తన జేబులో వస్తువు.. తీసి ఇస్తానన్నట్టు ప్రచారం చేశారు. అయితే సింగపూర్ ఆ స్థాయికి చేరడానికి ఎన్నేండ్లు పట్టిందో..ఎంత నిజాయితీతో అక్కడి పాలకులు అభివృద్ధికి పాటు పడ్డారో విస్మరించారు. సింగపూర్ వెనుక 195 సంవత్సరాల కృషి ఉంది. మహాసౌధాలు రావడానికి ఆరేడు తరాలు పట్టింది. ఎంతో నిజాయితీగా చెమటోడ్చి తపించి, త్యాగాలు చేసి కృషి జరిపితే అది సమకూరింది. పారిశ్రామిక వేత్తలు, విద్యాసంస్థల యజమానులు, రియల్ వ్యాపారులను మంత్రులు, ఎమ్మెల్యేలుగా పెట్టుకుని చంద్రబాబు సర్కారు ఏ మేరకు నిజాయితీ చూపగలదో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. పోనీ వీరేమైనా అద్భుత నగరాల నిర్మాతలా అంటే హైదరాబాద్‌లో అభివృద్ధి పేరిట చేసిన భూదందాలు తెలియనివి కావు. ఎమ్మార్ ప్రాపర్టీస్, రహేజా, ఇందూ ప్రాజెక్టుల లాంటి భూ కుంభకోణాలు జగద్విదితం.

విజయవాడ, గుంటూరును ముంచి...: వాస్తవానికి రాజధాని వల్ల అదనంగా తరలివచ్చే ఉద్యోగులు ఇతరుల అవసరాలు తీర్చడానికి గుంటూరు, విజయవాడ నగరాలున్నాయి. ఆ నగరాలపై కొంత పెట్టుబడి పెడితే ఇప్పటికే ఉన్నదానికి తాజా అభివృద్ధితోడై ఆ నగరాలు అద్భుతంగా విస్తరిస్తాయి. ఆ నగరవాసుల ఆస్తులకు భారీగా విలువలు పెరుగుతాయి. మరోవైపు తక్కువ భూములు సేకరించి అక్కడ సెక్రటేరియట్, అసెంబ్లీ, ఎమ్మెల్యే క్వార్టర్స్, మంత్రుల క్వార్టర్స్, సీఎం క్యాంపు కార్యాలయాలతోపాటు వివిధ శాఖల ప్రధాన కార్యాలయాలు, పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నిర్మాణం, హైకోర్టు, జడ్జిల క్వార్టర్స్, రాజ్‌భవన్‌లతో పాటు ఇతర ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. దానివల్ల ఖర్చు తగ్గి, త్వరగా రాజధాని నిర్మాణం పూర్తి అవుతుంది. ఈ నగరాలనుంచి తాజా రాజధాని ప్రాంతం కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. మెట్రోలాంటి సౌకర్యాలు కల్పిస్తే సరిపోతుంది. కానీ నేలవిడిచి సాము చేస్తున్న చంద్రబాబు నాయుడు, లేని ప్రచారాన్ని కల్పించి.. రాజధానిని చుక్కల్లో చూపిస్తున్నారు.

ప్రపపంచలోనే ప్రతిష్టాత్మకమైన రాజధానిని నిర్మిస్తానని ప్రచారం చేస్తూ పచ్చటి పంటలు పండే 30 వేల ఎకరాల భూములను కొల్లగొడుతున్నారు. ఈ మొత్తం ప్రక్రియ వెనుక కార్పొరేట్ సంస్థల మాయాజాలం ఉందనే ఆరోపణలున్నాయి. టీడీపీ పంచన చేరిన ఈ కార్పొరేట్ సంస్థల యజమానులు ఈ ప్రాంతంలో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారని, వాటికి భారీ మార్కెట్ సృష్టించే పనిలో భాగంగానే ఇదంతా జరుగుతున్నదని అంటున్నారు. రాజధాని భూముల్లో రేపు జాయింట్ వెంచర్ల పేరుతో వీరే, సేకరించిన ఆ భూములను ఆధీనంలోకి తెచ్చుకుంటారనే ప్రచారం జరుగుతున్నది.

డెవలప్‌మెంట్ అథారిటీ చాలు..: రాజధానిని అభివృద్ది చేయడానికి భూసేకరణే అవసరం లేదని, ప్రణాళికాబద్ధ నిర్మాణానికి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తే సరిపోతుందని, పట్టణ నిర్మాణ రంగ నిపుణుల, మేధావుల వాదన. దేశంలో అనేక రాష్ర్టాల్లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి పాటించిన సూత్రం ఇదే.

ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించే వరకు భూసేకరణ చేసి, వాటిల్లో నిర్మాణాలు చేపడితే సరిపోతుందని అంటున్నారు. ఆ తరువాత డెవలప్‌మెంట్ అథారిటీ ద్వారా మాస్టర్ ప్లాన్ రూపొందించి, రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్, కమర్షియల్, ఎడ్యుకేషనల్, మెడికల్, హైరేజ్ బిల్డింగ్ ఏరియాజోన్, సైబర్‌జోన్, ఎయిర్‌పోర్టు అథారిటీ జోన్‌లంటూ ఇలా డెవలప్‌మెంట్ అథారిటీ ప్రాంతం ఏర్పాటు చేసి ఇందులోని ప్రాంతాన్ని జోన్లవారిగా విభజిస్తే సరిపోతుందని వారు అంటున్నారు. హైదరాబాద్‌లాంటి నగరం కూడా అభివృద్ధి జరిగింది కూడా ఈ పద్ధతిలోనే. ఆ ప్లాన్ ప్రకారమే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఐటిఐఆర్ ప్రాజెక్టునూ ప్రభుత్వం ప్రకటించింది.

ఆయనదంతా మాయే..: చంద్రబాబు నేల విడిచి సాము చేస్తున్నారని మేధావులు అంటున్నారు. ఆయనదంతా మాయ. చెప్పేది కొండంత..చేసేది గోరంత..ఒకవైపు నిధులు లేవంటారు. రాజధానికి హుండీలు పెడతారు. చందాలు వసూలు చేయిస్తారు. మరోవైపు కోట్ల ఖర్చుపెట్టి ఉత్సవాలు చేస్తారు. చార్టర్‌ ఫ్లైట్లు వేసుకుని సింగపూర్ వెళ్తారు. ఆయనలో ఇద్దరు మనుషులున్నారు. ఎలా నమ్మాలి అని గుంటూరుకు చెందిన ఓ మేధావి ప్రశ్నించారు.

రాజధానికోసం 30 ఎకరాల సేకరణ ఎక్కడా జరగలేదు. చత్తీస్‌గఢ్‌లో నయారాయ్‌పూర్‌లో తొలిదశ కింద సేకరించింది ఆరువేల ఎకరాలు. 12 ఏండ్లనుంచి కడుతుంటే ఇప్పటికీ పూర్తికాలేదు. నిధులు లేక చాలా స్థలం ఖాళీగానే ఉంది. అత్యంత ఆధునిక నగరంగా చెప్పే చండీగఢ్ ఇపుడున్నది 114 చదరపు కిలోమీటర్లే. సుమారు 25 లక్షల జనాభా ఆ నగరంలో ఉన్నారు. పరిశ్రమలు, ఆఫీసులు, ప్రజల నివాసాలు అన్నీ ఆ పరిధిలోనే ఉన్నాయి. మరి ఏపీ రాజధానిలో ఎన్ని లక్షల మందిని ఎక్కడనుంచి పట్టుకువచ్చి పెడతారు? అని ఆయన ప్రశ్నించారు.

రాజధానా..రియల్ దందాలా?


ఒక రాజధాని కోసం ఇన్ని వేల ఎకరాలా? రాజ్‌భవన్, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల గహ సముదాయాలను నిర్మించడానికి ఇంత భూమి అవసరమా? ఇన్ని ఎకరాలు ఏం చేస్తారు..ఏం కడతారో ప్రజలకు చెప్పాలి.


ప్రభుత్వ భూమి ఉండగా సేకరణ దేనికి?


అసలు భూసేకరణే అవసరం లేదు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూములున్నాయి. అవి సరిపోతాయి. స్కూల్స్, హౌజింగ్, అధికారుల నివాసాలకు, మంత్రులు, ఎమ్మెల్యేల క్వార్టర్లకు, అసెంబ్లీ, రాజ్‌భవన్, సచివాలయ నిర్మాణాలకు ఎంత భూమి అవసరమో చెప్పండి ముందు.


అసలు 30వేల ఎకరాలెందుకో చెప్పరేం?


చంద్రబాబు పారదర్శకత పాటించడం లేదు. పార్టీ సొంత కార్యాలయం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. సహకరిస్తామని కేంద్రం చెబుతుంటే సింగపూర్‌కు వెళ్లడం దేనికి సంకేతం?


ధరలు పెంచడానికే...


రాజధాని ఏర్పాటుకు ఐదు వేల ఎకరాలు చాలు. 30 వేల ఎకరాల భూమి కావాలని ప్రచారం చేయడం వల్ల భూముల ధరలకు రెక్కలు రావడం తప్ప ఒరిగేదేం లేదు.


అడ్డగోలు సేకరణ తగదు


రాజధాని ఏర్పాటుపై నిపుణులు నివేదిక ఇచ్చారు. దాని ఆధారంగా భూ సేకరణ జరపాలి. అడ్డగోలుగా భూములు సేకరించడం సరికాదు.


కావాలంటే మేమే చందాలిస్తాం


రాజధాని నిర్మాణం కోసం మా భూములు ఇవ్వం. ఎవడో రాజధానిని నిర్మిస్తానంటే మా భూములెందుకివ్వాలి? బాబుకు కావాలంటే ఎకరాకు లక్ష మేమే చందాలిస్తాం.

గురువారం, నవంబర్ 13, 2014

ఆంధ్రా అధికారులు గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్న గుండ్రేవుల సర్వే గుట్టురట్టు!!!

survey


అనుమానమే నిజమైంది. ఏపీ ప్రభుత్వం దొంగచాటుగా గుండ్రేవుల దగ్గర సాగిస్తున్న భూముల సర్వే గుట్టురట్టయింది. ఈ సర్వే పనులను గద్వాల ఆర్డీవో అబ్దుల్ హమీద్ బుధవారం నిలిపివేయించారు. వడ్డేపల్లి మండలం చిన్నధన్వాడ, పెద్దధన్వాడ మధ్య పంట పొలాలను, నదీపరివాహక ప్రాంతాలను గుట్టుచప్పుడు కాకుండా సర్వే చేస్తున్న విషయాన్ని ఈ నెల 10న నమస్తే తెలంగాణ.. చంద్రబాబు నీటి కుట్ర శీర్షికన ప్రచురించింది. 

-నిజమైన నమస్తే తెలంగాణ కథనం
-పనులను నిలిపివేయించిన గద్వాల ఆర్డీవో

కొందరు ఆంధ్ర అధికారులు సర్వే చేస్తూ వెళ్లగా.. మరికొందరు భూముల్లో డ్రిల్లింగ్ చేసి మట్టి నమూనాలను వెలికితీసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. నది ఒడ్డున గుడారాలు వేసుకొని మరీ ఈ పనులు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో హమీద్.. వెంటనే పనులు నిలిపేసి అక్కడినుంచి వెళ్లాల్సిందిగా వారిని ఆదేశించారు. ఉమ్మడి రాష్ట్ర సమయంలో తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు అమలుచేయడానికి వీల్లేదంటూ కర్నూలు జిల్లా అధికారులకు ఫోన్లో స్పష్టంచేశారు. దీంతో సిబ్బంది అక్కడి నుంచి వెళ్లడానికి అంగీకరించారు.

కొంతకాలంగా ఈ పనులు జరుగుతున్న వడ్డేపల్లి రెవెన్యూ అధికారులు మాత్రం పసిగట్టలేకపోవడం గమనార్హం. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జీవో 100ను విడుదల చేస్తూ కర్నూలు జిల్లా సీ బెళగల్ గ్రామ సమీపంలో గుండ్రేవుల జలాశయాన్ని ప్రతిపాదించారు. ఈ పనులను చేపట్టిన ఆర్వీ కన్సల్టెన్సీ సంస్థ రూ.50 లక్షల ఖర్చుతో సర్వే డిజైన్‌ను రూపొందించి 20 రోజుల కిందట కర్నూలు జలమండలి అధికారులకు నివేదించినట్లు తెలిసింది. తుంగభద్ర వరదల సమయంలో కర్నూలు ముంపునకు గురికాకుండా ఉండటానికి 20 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం ఉన్న గుండ్రేవుల జలాశయాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం.

ఈ రిజర్వాయర్ ఆనకట్ట 40 మీటర్లు కాగా.. 18 అడుగుల మట్టికట్టను నిర్మించి నీటిని నిల్వ చేయనున్నారు. దీనివల్ల మహబూబ్‌నగర్ జిల్లాలో 4 గ్రామాలు, కర్నూలు జిల్లాలో 8 గ్రామాలు ముంపునకు గురవుతాయని ఆ కన్సల్టెన్సీ నివేదించినట్లు తెలిసింది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

మంగళవారం, నవంబర్ 11, 2014

లీజులపై సీమాంధ్ర సర్కార్ అడ్డగోలు జీవోలు...!!!

lease


సీమాంధ్ర పాలన తెలంగాణను కొల్లగొట్టింది. హైదరాబాద్ జిల్లాలో నిజాం, బ్రిటిష్ కాలం నాటి లీజు భూములను కూడా అబ్బసొత్తులాగా అమ్మేసుకున్నారు. పాత జీవోలు పాతరేశారు. కొత్త జీవోలు పుట్టించారు. ఉన్న జీవోలు తుంగలో తొక్కారు. ఎప్పుడో 1930లోనే నిజాం ఎంతో దూరదృష్టితో హైదరాబాద్ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సమున్నత ఆశయంతో పౌరుల నివాసాలు.. వ్యాపారం నిమిత్తం అతి తక్కువ ధరకు భూములను లీజుకు ఇచ్చారు. ఇటు నగరం అభివృద్ధి జరగడంతో పాటు అటు భూములు కూడా సర్కారు చేజారకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
-నిజాంనాటి లీజు భూములను..అబ్బసొత్తులా అమ్ముకుంటున్నారు !
-అక్రమార్కులకు హక్కులిచ్చి అడ్డంగా దోచిపెట్టిన సమైక్య సర్కార్
-ఇప్పటికే 3 వేల పైచిలుకు లీజులు క్రమబద్ధీకరణ
-రూ.లక్ష కోట్ల విలువైన భూములు పరాధీనం
-తాజాగా ఎంఓయూతో విక్రయాలు
మిగిలిన 510 లీజు భూములు విలువ రూ.600 కోట్లకు పైమాటే
-స్వాధీనపరుచుకోవాలంటున్న తెలంగాణవాదులు

అయితే ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర సర్కార్, అధికారులు నియమ నిబంధనలకు పాతరేసి భూములు అన్యాక్రాంతం చేశారు. లీజు ఉల్లంఘించిన వారినుంచి భూములు స్వాధీన పరుచుకునే హక్కులు ఉన్నా బేరాలు పెట్టుకుని వారికే అర్పించుకున్నారు. ఇంతదాకా ఇలాంటి మూడువేల పైగా లీజు భూములు సర్కారు చేయి దాటి పోయాయి. లక్ష కోట్లకు పైగా విలువైన భూమి పరాధీనమై పోయింది. 
ఈ అక్రమాలకు సీమాంధ్ర అధికారులు కూడా సహకరించారు. లీజు భూములను రక్షించవలిసిన ఎస్టేట్ అధికారే కబ్జాదారులకు అనుకూలంగా సర్కారుకు నివేదిక పంపడంతో కొత్త జీవోలు వచ్చి ఉల్లంఘనులు ఎంఓయూతో తమ భూములు అమ్ముకుంటున్నారు. ఇంకా రూ.600 కోట్ల విలువైన భూములు లీజు ఉల్లంఘనుల చేతిలో ఉన్నాయి. కనీసం వాటినైనా దక్కించుకోవాలని తెలంగాణవాదులు కోరుతున్నారు.

లీజు భూములు అంటే.. : 1930 ప్రాంతంలో నిజాం సర్కార్ రెట్రో సీడెడ్ ప్రాంతంగా పేరొందిన సికింద్రాబాద్ ప్రాంతాన్ని పౌర నివాస సముదాయాలు, వ్యాపార కూడళ్ల (బ్రిటీష్ ఇండియా గవర్నమెంటు పటాలాల) నిమిత్తం అప్పటి బ్రిటీష్ ప్రభుత్వంలోని మిలటరీ ఎస్టేట్ ఆఫీసర్ ద్వారా సాధారణ ప్రజలకు 90 సంవత్సరాలకు లీజుకు ఇచ్చింది.

లీజు కొనసాగించేందుకు ప్రతి 30 సంవత్సరాలకోసారి రెన్యువల్ చేసుకోవడం వంటి అనేక నిబంధనలు విధించింది. 1945 నాటికి ఈ భూములతో పాటు కంటోన్మెంటు భూములను సైతం బ్రిటీష్ ప్రభుత్వం తిరిగి నిజాం సర్కారుకు ఇచ్చేసింది. ఆ సమయంలో బ్రిటీష్ రెసిడెంట్లకు నిజాం ఇచ్చిన హామీ మేరకు లీజుదారుల నుంచి ఆ భూములను నిజాం స్వాధీనం చేసుకోలేదు. ఆ తరువాత నిజాం ప్రభుత్వం భారతదేశంలో విలీనం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు జరిగిపోయాయి. 1978లో జీవో నెం.169 (రెవిన్యూ) తేదీ 21.5.1978 ద్వారా ఆంధ్రప్రదేశ్ (సికింద్రాబాద్ ప్రాంతం) భూ పరిపాలన రూల్స్ 1976ను జారీ చేసి ఆ లీజు భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకువచ్చారు.

అపుడు కూడా లీజు కాలపరిమితి పూర్తి కాలేదు కాబట్టి వారిని కొనసాగించారు. జిల్లా జాయింట్ కలెక్టర్‌కు లీజు భూముల నిర్వహణ బాధ్యతను అప్పగించారు. 1930- 1970 మధ్య కాలంలో హైదరాబాద్ జిల్లాలో 6,500 లీజు భూములున్నట్లు రికార్డులుండగా,1991నాటికి అవి 2,249 కి తగ్గిపోయింది. తర్వాత కాలంలో లీజు భూములు యజమానుల వారసుల మధ్య విభజనలు కూడా జరగడంతో వాటి సంఖ్య 2,304కి చేరింది.

దోచిపెట్టిన సీమాంధ్ర సర్కార్..


ఇదిలా ఉంటే బంగారు బాతులాంటి ఈ విలువైన భూముల అజమాయిషీ చేజిక్కడంతో సీమాంధ్ర పాలకులు వాటిని సొమ్ము చేసుకోవడం ప్రారంభించారు. కుంటి సాకులు, గుడ్డి సాకులతో దొడ్డిదారి జీవో తెచ్చి వాటిని లీజు దారులకే శాశ్వతంగా కట్టబెట్టడం మొదలుపెట్టారు. సక్రమంగా లీజు రెన్యూవల్స్‌ను పాటిస్తున్నారు.. అనే కారణాలు కూడా చూపి లక్షల కోట్ల విలువైన భూములను కారుచౌకగా ధారాదత్తం చేశారు. ఈ క్రమంలో 1994వ సంవత్సరంలో 816 జీఓ ఇచ్చారు. దీనిప్రకారం ప్రభుత్వానికి క్రమం తప్పకుండా ఫీజు చెల్లిస్తూ, 30 సంవత్సరాల కొకసారి రెన్యూవల్ చేసుకున్న వారికి ఫ్రీహోల్డ్ (లీజు భూములపై శాశ్వత హక్కుదారుగా) చేసుకునేందుకు అనుమతినిచ్చేశారు.

అంటే ఈ సాకుతో ఈ భూములను పందేరం చేశారన్నమాట. ఈ దెబ్బకు 3 వేలమందికి ఖరీదైన భూములు దఖలు పడ్డాయి. అక్కడికీ ఇంకా సగం మంది మిగిలిపోవడంతో 2005 డిసెంబర్ 31న మళ్ళీ 816జీఓ ఒకటి తెచ్చి తిరిగి క్రమబద్ధీకరణకు అనుమతినిచ్చేశారు. ఈసారి 1,737 మంది భూములు సొంతం చేసుకున్నారు. 57 మంది లీజుదారుల దరఖాస్తులు మాత్రం ఇతర కారణాలతో రద్దయ్యాయి. మొత్తంగా 567 లీజుదారులు లీజు రెన్యువల్ విధానం కింద ఇంకా కొనసాగుతున్నారు. తర్వాత 2006లో 1976 లీజు రూల్స్‌లోని సెక్షన్ 17ను ప్రభుత్వం 177జీఓ జారీ చేసి సవరణ చేసింది.

ఈ సవరణ ప్రకారం లీజుదారులు లీజు కాలం ముగిసే తేదీకి రెండు నెలల ముందుగా లీజు రెన్యూవల్‌కు దరఖాస్తు చేయాలి. లేదా లీజు రెన్యూవల్ కాలం ముగిసిన తేదీకి ఒక నెలలోపు దరఖాస్తు చేసినట్లయితే తగు జరిమానాతో లీజులను రెన్యూవల్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అంటే మిగిలిన ఈ భూములను సమర్పించుకోవడానికి రంగం సిద్ధం చేశారన్నమాట.

జీరా ప్రాంత లీజులు..: సికింద్రాబాద్‌లోని ఈ మొత్తం లీజు ప్రాంతాలకు ఇక్కడే ఉన్న జీరా లీజు ప్రాంతానికి కొంత వ్యత్యాసం ఉన్నది. మిగతా సికింద్రాబాద్ లీజు స్థలాలు అప్పటి నిజాం ప్రభుత్వం బ్రిటీష్ ఇండియా ప్రభుత్వానికి బదిలీ చేసినవి. కాని జీరా ప్రాంతం అప్పటి హైదరాబాద్ భగత్ జిల్లా తాలుకాదార్ ద్వారా భూసేకరణ జరిపి టౌన్ ఇంప్రూవ్‌మెంట్ ట్రస్ట్ ద్వారా మిలటరీ ఎస్టేట్ అధికారికి అప్పగించారు. ఈ లీజు భూమి (జీరా ప్రాంతం) భూసేకరణపై అప్పటి పర్ పెచ్యువల్ లీజుదారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులలో కేసులు దాఖలు చేశారు.

2002లో సుప్రీంకోర్టు తుది తీర్పు జారీ చేసి సదరు భూమి భూసేకరణపై ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ తీర్పు జారీ అయిన తర్వాత జీరా ప్రాంత లీజుదారులు తమకు కూడా యాజమాన్య హక్కుల మార్పిడి అవకాశాన్ని ఇవ్వాలని దరఖాస్తు చేశారు. అయితే జీరా ప్రాంత లీజుదారులు ప్రభుత్వానికి అద్దె చెల్లించకపోగా, రెన్యూవల్‌ను కూడా సక్రమంగా చేయలేదు. దీంతో ఈ దరఖాస్తులను సీసీఎల్‌ఏ పెండింగ్‌లో పెట్టింది. ఇక్కడ మొత్తం126 లీజులు ఉన్నాయి.

ఉల్లంఘలకు జేసీ వత్తాసు..


సీమాంధ్ర పాలకులే కాదు.. అధికారులు కూడా తక్కువ తినలేదు. సీమాంధ్ర పాలనలో ఎస్టేట్ అధికారిగా విధులు నిర్వహించిన జేసీ శ్రీధర్ ఉల్లంఘనులతో చేతులు కలిపి పదవికి ఉన్న సర్వహక్కులను పాతరేశారు. లీజు నియమాలను అతిక్రమించిన లీజుదారుల నుంచి భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం 1989లో జీఓ ఎంఎస్‌నెంబర్ 109ను, 2002లో జీఓ ఉంఎస్ నెంబర్ 832ను, 2006లో జీఓ ఎంస్ నెంబర్ 177లను విడుదల చేసింది. అయితే చేతివాటంకు అలవాటుపడిన సీమాంధ్ర పాలకులు, సీమాంధ్ర అధికారులు ఒక్క ఉల్లంఘనుడికి కూడా షోకాజ్ నోటీసులు జారీ చేయలేదు. ఒక్క లీజు భూమి వెనక్కి తీసుకోలేదు. లీజులు రెన్యువల్ చేసుకున్నా లేకున్నా కండ్లు మూసుకున్నారు. పైగా జేసీ శ్రీధర్ తానే లీజుదారుల తరుపున వకాల్తా పుచ్చుకొన్నట్టు వ్యవహరించారు.

భూములు స్వాధీనం చేసుకుంటే లీజుదారులకు నష్టం వాటిల్లుతుందంటూ సీసీఎల్‌ఏకు లేఖ రాశారు. ముందే కూడబలుక్కున్నట్టు అప్పటి సీమాంధ్ర పాలకులు దాన్ని అంగీకరించారు. ఈ వెసులుబాటుతో లీజు ఉల్లంఘనులు ఎంఓయూతో అగ్గువకు విలువైన ప్రభుత్వ భూములను ఇతరులకు విక్రయించుకుంటున్నారు. లీజు నిబంధనల ప్రకారం లీజు భూములను కొనడం అమ్మడం నేరం. అయినా అధికారులు స్పందించలేదు.

లోకాయుక్త మొట్టికాయలు..


లీజు భూముల్లో జరుగుతున్న అక్రమాలపై సమాచార హక్కు కార్యకర్త నాగిళ్ల శ్రీనివాస్ లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. విచారణకు హాజరైన ఎస్టేట్ అధికారులు లోకాయుక్తకు పొంతన లేని సమాధానాలిచ్చి గడువుకావాలని కోరారు. లోకాయుక్త అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి జీఓ నెం. 177 పరిధిలోకి వస్తున్న లీజులలో జరుగుతున్న అక్రమాలను అరికట్టి ఆ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. లీజు రెన్యూవల్ విధానంలో కొనసాగుతున్న మొత్తం 567 లీజు కేసులలో 510 లీజులు జీఓ 177 పరిధిలోనికి వచ్చాయి. అంటే 510 మంది లీజుదారులు లీజు రూల్స్‌ను అతిక్రమించారు. నిర్ణీత సమయంలో రెన్యూవల్‌కు దరఖాస్తు చేసుకోలేదు.

ఈ కేసులలో ఇప్పటి వరకు 347మంది లీజుదారులకు షోకాజ్ నోటీసులు జారీచేయడం జరిగింది. మరో 163 మంది లీజుదారులకు షోకాజ్ నోటీసుల జారీ ప్రకియ కొనసాగుతోంది. నోటీసు అందిన నెల రోజులలోపు వారి లీజు ఎందుకు రద్దు చేయకూడదో వివరణ తీసుకొని వారి లీజులను రద్దుచేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. కనీసం ఈ భూముల విషయంలోనైనా దృఢంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో) 

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


సోమవారం, నవంబర్ 10, 2014

ఆంధ్ర బాబు తెలంగాణలో చేయబోతున్న మరో నీటి కుట్ర!

-తుంగభద్ర నీటికి ఎసరు
-సీ బెళగల్ దగ్గర భారీ రిజర్వాయర్‌కి సన్నాహాలు
-నడిగడ్డలో ఆంధ్రా అధికారుల దొంగచాటు సర్వేలు
కుట్రల బాబు మరో కుట్రకు తెరతీశారు. తుంగభద్ర మీద గుట్టుచప్పుడు కాకుండా బ్యారేజీ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. హైదరాబాద్- మద్రాస్ రాష్ట్రం ఉమ్మడి సొత్తు అయిన తుంగభద్ర నీటిని ఏకపక్షంగా రాయలసీమకు మళ్లించేందుకుగాను అధికారులను సర్వేకు ఆదేశించారు. ఆంధ్రా అధికారులు తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా నడిగడ్డ ప్రాంతంలో దొంగచాటుగా చొరబడి గుట్టుచప్పుడు కాకుండా సర్వేలు జరుపుతున్నారు. ఈ విషయం ఆనోటా ఈనోటా బయటికి రావడంతో ఈ ప్రాంతంలో అలజడి ప్రారంభమైంది. 

tungabadrariver

కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కర్నూలు జిల్లా సీ బెళగల్, మహబూబ్‌నగర్ జిల్లా వడ్డేపల్లి మండలాల మధ్య ప్రవహించే తుంగభద్ర నది నుంచి నీటిని మళ్లించేందుకు జీవో నంబర్100ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ విషయంలో అప్పుడు పెద్ద వివాదమే చెలరేగింది. తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పతనంతో ఆ విషయం కూడా కనుమరుగైంది. 

అయితే శతవిధాలా తెలంగాణ విభజనను అడ్డుకోవడానికి ప్రయత్నించి విఫలమైన చంద్రబాబు సీమాంధ్రలో అధికారం చేపట్టిననాటినుంచి కక్షపూరితంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. రత్నాల గర్భగా ఉన్న తెలంగాణ ప్రాంతం దూరంకావడం జీర్ణించుకోలేక అడుగడుగునా అవరోధాలు సృష్టిస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లూ తెలంగాణకు కరెంటు ఆపి నానా యాతనలు పెట్టిన బాబు ఈసారి నీటివనరుల మీద దృష్టిసారించారు. అందులో భాగంగానే నడిగడ్డలో ఆంధ్రా అధికారులు సర్వే జరుపుతున్నారని తెలిసింది. ఈ రిజర్వాయర్ నిర్మాణం వల్ల తెలంగాణకు ముఖ్యంగా పాలమూరు జిల్లాకు భారీ నష్టం వాటిల్లుతుంది.

అనుమతులు లేకుండానే..


నిజాం, మద్రాస్ రెసిడెన్సీ ప్రభుత్వాల మధ్య కుదుర్చుకున్న ఒప్పందాలను, బచావత్ ట్రిబ్యూనల్ తీర్పును ఆంధ్రా పాలకులు ఏనాడూ గౌరవించిన పాపాన పోలేదు. ఏ అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు కట్టి ఇప్పటికే తెలంగాణకు కృష్ణలో నీళ్లు దొరక్కుండా చేశారు. తాజాగా సీ బెళగల్ దగ్గర భారీ రిజర్వాయర్ నిర్మాణానికి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల మధ్య సర్వే పనులు దొంగచాటుగా మొదలయ్యాయి. ఆ రిజర్వాయర్ నుంచి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలకు సాగునీటిని తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది.

తుంగభద్ర నదికి అడ్డంగా మినీ ఆనకట్టను నిర్మించి అక్కడి నుంచి నీటిని సీ బెళగల్ వరకు గ్రావిటీ ద్వారా తీసుకెళ్లి నిల్వ చేస్తారు. ఇరు జిల్లాల మధ్య ప్రవహిస్తున్న తుంగభద్ర పరీవాహక ప్రాంతంలో సర్వే పనులు మొదలుపెట్టారు. వడ్డేపల్లి మండలం పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడ గ్రామాల మధ్య ఆనకట్ట వల్ల ఏమేరకు భూములు ముంపునకు గురవుతాయనే విషయాన్ని తెలుసుకునేందుకే ఈ దొంగచాటు సర్వేకు కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

సమాచారం తెలుసుకుంటా..: తహసీల్దార్


మూడు రోజులుగా మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు వర్క్ టు రూల్ పాటిస్తున్నారు. ఇది అవకాశంగా తీసుకున్న ఆంధ్రా ఉద్యోగులు గుట్టు చప్పుడు కాకుండా సర్వే పనులు చేస్తున్నట్టు ఆ గ్రామాల ప్రజలు టీ మీడియాకు సమాచారమిచ్చారు. నిబంధనల ప్రకారం ఉద్యోగులు అధికారికంగా ఇతర రాష్ర్టాల్లోకి ప్రవేశించే ముందు ఆయా ప్రభుత్వాల నుంచి విధిగా అనుమతి పొందాల్సి ఉంటుంది. అయినా అంతర్ రాష్ట్ర నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రా అధికారులు ప్రవేశించడం చట్ట ఉల్లంఘనకు దారి తీస్తున్నది.
వడ్డేపల్లి తహసీల్దార్ శాంతకుమారిని వివరణ కోరగా తమ సిబ్బంది వర్క్ టు రూల్ పాటిస్తున్నందున కర్నూలు జిల్లా అధికారుల సర్వే విషయం తమ దృష్టికి రాలేదని అన్నారు. సోమవారం వీఆర్వో ద్వారా విషయాన్ని తెలుసుకుంటానని తెలిపారు. ఇదే విషయాన్ని రాజోళి పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా వెంటనే విచారణ చేపడుతామని చెప్పారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో) 


జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


ఆదివారం, నవంబర్ 09, 2014

అల్మాస్‌గూడలో అక్రమార్కుల అబ్రకదబ్ర!

almasguda-lands


-30 ఎకరాల గైరాన్ సర్కారీ భూమి మాయం
-విలువ రూ.100 కోట్లకు పైనే.. రెవెన్యూ మాయాజాలం ..
-రికార్డుల్లో భూమి.. క్షేత్రంలో అదశ్యం
-అబ్బసొత్తులా అమ్మేసుకున్న స్థానిక నాయకులు..
- ఆశీర్వదించిన రాష్ట్రస్థాయి నాయకగణం
-ఈ భూమికే పట్టాలిచ్చిన సమైక్య సర్కారు..
- 772 కుటుంబాల పరిస్థితి అయోమయం
ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు పాలన అనే పేరుతో నడిపిన అరాచకం అంతా ఇంతా కాదు. రాజధాని నగరంలో ఎన్ని ఇండ్లు ఉన్నాయో జీహెచ్‌ఎంసీకే తెలియదు. రాజధాని చుట్టుపక్కల ఏ ప్రభుత్వ భూమి ఎవరి ఆధీనంలో ఉన్నదో రెవెన్యూ యంత్రాంగానికే తెలియదు. ఒక చట్టం, ఒక నిబంధన, ఒక జీవో, ఓ పద్ధతి.. ఓ క్రమశిక్షణ.. ఏవీ లేకుండా రెవెన్యూ విభాగంలో సాగిన పాలన చూస్తే ముక్కున వేలేసుకోవాలి. ఇంతోటి పాలనకు హైదరాబాద్‌కు మేమే ఊడబొడిచామంటే.. కాదు.. మేమే ఊడబొడిచామంటూ బిల్డప్‌లు. వాస్తవమేమంటే సీమాంధ్రుల పాలనలో అడ్డదారిలో రాత్రికి రాత్రి కోట్లు గడించాలనుకున్న ప్రతివాడూ సర్కారు, రెవెన్యూ అధికారుల అండదండలతో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న సర్కారుభూములు కొల్లగొట్టాడు.

almasguda-lands

దానికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో సహా అంతా సరసమైన ధరలకు తమ సేవలను సమర్పించుకున్నారు. వెరసి వేల కోట్ల విలువైన భూములన్నీ హారతి కర్పూరమై పోయాయి. ఇవాళ ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న భూమి క్షేత్రస్థాయిలో ఉండదు. క్షేత్ర స్థాయి పొజిషన్‌లో ఉన్న వారి వివరాలు ప్రభుత్వ రికార్డుల్లో ఉండవు. రికార్డుల్లో ఉన్న నక్షాకు క్షేత్రస్థాయి భూమి సరిహద్దులకు సంబంధమే ఉండదు. దీనికి తాజా ఉదాహరణ రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం అల్మాస్‌గూడలో సర్వే నం.138 భూమి వ్యవహారం. ఇక్కడ గైరాన్ సర్కారీ కింద 65.03 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాలి. కానీ క్షేత్రస్థాయిలో ఏకంగా 30 ఎకరాలు మాయమైంది. దాని విలువ ఎంత తక్కువ వేసుకున్నా... వంద కోట్లు!

ఇలా బయటపడింది...


ప్రభుత్వ రికార్డుల ప్రకారం అల్మాస్‌గూడ సర్వే నెం.138లో 65.03 ఎకరాలు గైరాన్ సర్కారీ కింద ప్రభుత్వ భూమిగా ఉంది. గతంలోనే ఇందులో రాజీవ్‌గహ కల్ప ఇండ్లకు 16.17 ఎకరాలు, శ్మశానవాటికకు 5 ఎకరాలు, రహదారులకు 2.05 ఎకరాలు, పార్కుకు 1 ఎకరం, డీఎం హౌజెస్‌కు 0.20 ఎకరాలు, ఇందిరమ్మ ఇండ్ల కింద 9.05 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. పోతే ఇంకా 30కి పైగా ఎకరాల భూమి ఉండాలి. ఇక్కడ ప్రభుత్వం జీఓ నెం.493 కింద పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని సంకల్పించి అర్హులను గుర్తించింది. మొదటి దఫా 697 మందికి ప్లాట్ల కోసం 9 ఎకరాలను కేటాయించింది.

వాస్తవంగా రాజధాని, దాని చుట్టు పక్కలా ఇండ్ల పట్టాలు ఇవ్వవద్దని ఓ ప్రభుత్వ జీవో ఉంది. అయినా మంత్రుల స్థాయిలో పైరవీలు చేసి స్థానిక నాయకులు ఈ పట్టాల కార్యక్రమం మంజూరు చేయించారు. ఈ పట్టాల లేఅవుట్ రెవెన్యూ సిబ్బంది చేయాలి. అయితే ఇక్కడ నాయకులు తమ పైరవీలు, పలుకుబడితో తామే ఆ కార్యక్రమానికి పూనుకున్నారు. అయితే ప్రభుత్వ భూమి బోలెడంత ఖాళీ ఉంది కాబట్టి 9 ఎకరాలకు బదులు 12 ఎకరాల్లో లేఅవుట్ చేశారు. 697 ప్లాట్లకు అదనంగా తామే సొంతంగా మరో 259 ప్లాట్లు వేసి ఒకరి ప్లాటు మరొకరికిగా అమ్మేసుకున్నారు. లక్షల రూపాయలు చేతులు మారాయి. రెవెన్యూ అధికారులు కూడా వారికి సంపూర్ణంగా సహకరించారు.

ఇక స్థానిక నాయకులు అక్కడ ఆరేళ్లుగా ప్లాట్లు వేస్తూ విక్రయాలు యధేచ్ఛగా సాగిస్తూ ఎవరికి ఎంత ఇవ్వాలో అంతా.. ఇచ్చేసి కోటీశ్వరులయ్యారు. చాలా మంది బడానాయకగణానికి ఇందులో వాటాలు ఉన్నాయి. ఆ సొమ్మునే కొందరు ఎన్నికల ఖర్చుకు వినియోగించారని సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పక్కనే ఉన్న స్థలం కావడంతో హాట్ కేక్‌ల్లాగా అమ్ముడుపోయింది. నగరంలో ప్లాట్లు కొని ఇండ్లు కట్టుకునే పరిస్థితి లేక అనేక మంది మధ్య తరగతికి చెందిన వారు రూ.లక్షలు వెచ్చించారు. ఐతే ఏదో పట్టా కాగితాలు ఇచ్చేసి నాయకగణం చేతులు దులిపేసుకుంది. కలర్ జిరాక్స్‌తోనే ఈ తతంగం నడిపారు.

ప్రభుత్వ పట్టాలకూ అదనపు నంబర్లు తగిలించి...


ఇది బాగానే జరిగింది. ప్రభుత్వం ఇక్కడ రెండోదఫా 13.12 ఎకరాలు పంపిణీ చేయాలని సంకల్పించింది. 772 ప్లాట్లకు లబ్ధిదారులను గుర్తించి రెవెన్యూ వారు పట్టాలు మంజూరు చేశారు. అయితే అప్పటికే ఇక్కడ భూముల్లో ప్లాట్లు లేఅవుట్ చేసి నాయకులు లక్షల రూపాయల చొప్పున వెలగట్టి అమ్ముకున్నారు. ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న నక్షా ముందు పెట్టి దాంట్లోనే గీతలు గీసి ఇది నీకు ఇది నాకు అంటూ దుకాణం పెట్టి డబ్బులు చేసుకున్నారు. కొన్నవారికి అవే కలర్‌జిరాక్స్‌లు ఇచ్చారు. ఈలోగా లబ్దిదారుల ఎంపిక, పట్టాల మంజూరు జరిగింది. తీరా లేఅవుట్ చేయడానికి క్షేత్రస్థాయికి వెళితే అక్కడ సరిపడా భూమి లేదని అధికారులకు వెల్లడైంది. అంటే ప్రభుత్వ భూమి అప్పటికే గుట్టు చప్పుడు కాకుండా కబ్జాదారుల పాలైందన్న మాట.

మిగిలిన కొద్దిపాటి స్థలంలో ప్లాట్లు వేసినా పట్టాలు మంజూరైన లబ్దిదారులకు సరిపోయే స్థితిలేదు. అప్పటికే రెవెన్యూ యంత్రాంగం జారీ చేసిన పట్టాల స్థలంలోని ప్లాట్లకు బై వన్ బైటూ అంటూ రాసి అమ్మేసుకున్న నాయకులు ఈ కొత్త మంజూరు ముందుకు రావడంతో తెల్లముఖం వేశారు. ఎట్లాగూ ప్లాట్లు చేశామన్న భరోసాతో మధ్య తరగతి వర్గాలకు ఒక్కొక్కరి దగ్గర రూ.లక్ష నుంచి రూ.2.50 లక్షల దాకా వసూలు చేశారు. రెవెన్యూ యంత్రాంగం జారీ చేసిన పట్టాలను కలర్ జిరాక్స్‌లు తీసి కొనుగోలు చేసిన వారికి అంటగట్టారు. నిజమైన అర్హులు తెర మీదికి రావడంతో కొనుగోలు చేసిన వారికి ప్లాట్లు చూపించలేకపోయారు. ప్లాట్లు విక్రయించిన కొందరు నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పోటీ చేశారు. ఎన్నికలు అయిపోగానే పొజిషన్ ఇప్పిస్తామంటూ హామీలు గుప్పించారు.

2008 నుంచి సాగుతోన్న ఈ దందాలో పట్టాలు(నకిలీ, అసలు) పొందిన 700కు పైగా మందికి ఇప్పటిదాకా పొజిషన్ ఇవ్వలేదు. ప్లాట్లు చూపించాలంటూ నాయకుల వెంట పడుతున్నారు. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో ప్లాట్లు చేసేందుకు స్థలమే లేకపోవడంతో ఏం చేయాలో తెలియక అక్రమార్కులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సమైక్య రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, వీఆర్వోలు ఆడిందే ఆటగా పాడిందే పాటగా నడిచింది. మరో అక్రమానికి తెర తీస్తే గానీ అక్రమార్కులు బయట పడే మార్గం లేదు. ఐతే తెలంగాణ రాష్ట్రంలో వారి పప్పులు ఉడకడం లేదు.

అసలెవరో.. నకిలీలెవరో


ఇక ఈ మొత్తం సర్వేలో పొజిషన్ తీరు దారుణంగా ఉంది. ప్రభుత్వం మొదటి దఫా 697 మంది అర్హులను, ఆ తర్వాత 772 మందిని ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి జాబితాలోని వారికి ప్లాట్లు చూపించారు. రెండో దఫా వారికి ఉత్త పట్టా కాగితాలే మిగిలాయి. ఇక్కడ నాయకులు లేఅవుట్ చేసి ప్రభుత్వం జారీ చేసిన పట్టాలకు కూడా బై వన్ బైటూ అంటూ వేసి అమ్ముకున్నారు. కొనుగోలుదారులు ఇందులోనే నాయకులు ఇచ్చిన కలర్ జిరాక్స్‌లతో రూపొందించిన పట్టాల ఆధారంగా ఇండ్లు నిర్మించుకున్నారు. ఇపుడు మొత్తం క్షేత్రస్థాయిలో చూస్తే ప్రభుత్వం జారీ చేసిన అసలు లబ్ధిదారులకు బదులు స్థానిక నాయకులు జిరాక్స్ కాపీలతో అమ్మగా కొన్న అనర్హులే ఎక్కువ మంది పొజిషన్‌లో ఉన్నారని తేలిసింది. అంతేకాదు రెవెన్యూ అధికారుల జాబితాలో పేర్కొన్న పేర్లు, రేషన్‌కార్డుల నెంబర్లకు కూడా పొంతన కుదరడం లేదు. ఉదాహరణకు ప్లాట్ నెం.818ని జాబితాలో జే రాజ్యలక్ష్మి(రామకష్ణారావు)కు కేటాయించారు.

కానీ పట్టా మాత్రం ఎన్ బ్రహ్మచారి పేరిట జారీ చేశారు. ఇలా వందల సంఖ్యలో వ్యత్యాసాలు ఉన్నాయని సమాచారం. పూర్తి స్థాయిలో విచారణ జరిపితే కొనుగోలు బాగోతం బయట పడుతుంది. ఇంకా ఈ స్థలంలో చాలా కాలంగా వ్యవసాయం చేసిన దళిత రైతులకు స్థానిక నాయకులే ఎకరాకు రూ.16 లక్షల వరకు ఇచ్చేసి వారిని వెళ్లగొట్టారని తెలిసింది. ఇంకా కొందరు ఇక్కడే వ్యవసాయం చేస్తున్నారు. స్థలం సర్కారుదే అయినా అనాదిగా తాము ఈ భూములను నమ్ముకొని ఉన్నామంటున్నారు.

రికార్డుల్లోనూ అయోమయం..:
సరూర్‌నగర్ మండల తహసీల్దార్ కార్యాలయం మొదలు కలెక్టరేట్ వరకు సర్వే నెం.138పై గందరగోళం నెలకొని ఉంది. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తరపున డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ లేఖ నెం.ఇ4/1407/2013, తేదీ.3-3-2014 ద్వారా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, సరూర్‌నగర్‌కు ఉత్తర్వును జారీ చేశారు. దానిలో సర్వే నెం.లో రాజీవ్‌గహ కల్పకు 16.17 ఎకరాలు, గ్రేవ్‌యార్డుకు 5 ఎకరాలు, రోడ్లకు 2.05 ఎకరాలు, పార్కుకు 1 ఎకరం, డీఎం హౌజెస్‌కు 0.20 ఎకరాలు, ఇందిరమ్మ ఇండ్ల పట్టాలకు 9.05 ఎకరాలు కేటాయించినట్లుగా పేర్కొన్నారు. కానీ మొత్తం విస్తీర్ణాన్ని 65.05 ఎకరాలుగా పేర్కొన్నారు.

అదశ్యమైన 30 ఎకరాల స్థలం ఏమైందో అందులో ప్రస్తావించలేదు. ఇదే సర్వే నెంబరులో భూమి మాయమైందని తమ దర్యాప్తులో తేలిందని సరూర్‌నగర్ డిప్యూటీ కలెక్టర్ తేదీ.24.05.2013న జిల్లా కలెక్టర్‌కు లేఖ నెం.బీ/1113/2013 ద్వారా వివరించారు. పలు అంశాలకు కేటాయించినది పోగా మిగిలిన స్థలం అన్యాక్రాంతమైనట్లు పలువురు సమాచార హక్కు చట్టం కింద తీసుకున్న సమాచారం ప్రకారం స్పష్టమైంది. రూ.వంద కోట్లకు పైగా విలువజేసే 30 ఎకరాల స్థలం ఏమైందో క్షేత్ర స్థాయి దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. గతంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన కొందరు ఇపుడు ఈ అంశం మీద నోరు విప్పడం లేదు.

అవును.. ఫిర్యాదులున్నాయి...! -అధికారుల ఉవాచ


అవును.. నిజమే. అల్మాస్‌గూడ సర్వే నెం.138పై అనేక ఫిర్యాదులు ఉన్నాయి. రికార్డుల్లోనూ వ్యత్యాసం ఉన్న మాట వాస్తవమే. కేటాయింపులను సరిగ్గా రికార్డుల్లో పొందుపర్చలేదు. కేటాయింపులు పోగా చాలా వరకు అన్యాక్రాంతమైందని తెలుస్తోంది. 772 మందికి పట్టాలు గతంలో ఇచ్చారని చెబుతున్నారు. ఐతే ఎవరు అసలు, ఎవరు నకిలీలో గుర్తించాల్సిన అవసరం ఉంది.

స్థానిక నాయకులు కేటాయించిన దాని కంటే ఎక్కువ విస్తీర్ణంలో లే అవుట్ చేసినట్లు సమాచారం ఉంది. ఐతే దీనిపై సమగ్ర దర్యాప్తు చేయించేందుకు అనుమతి కోసం ఆర్డీఓకు లేఖ రాశాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరలోనే ప్రతి పట్టాను పరిశీలిస్తాం. నకిలీలను గుర్తిస్తాం. అన్యాక్రాంతమైన స్థలాన్ని స్వాధీనం చేసుకుంటాం. దర్యాప్తుకు ఏకంగా టీములను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని గుర్తించాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించాం. నాయకుల ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించాం. త్వరలోనే విచారణ చేస్తాం.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో) 

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

శనివారం, నవంబర్ 08, 2014

చెక్‌పోస్ట్‌పై ఏపీ వ్యాపారుల దౌర్జన్యం...

Vadapalli-vadda


ప్రభుత్వానికి కమర్షియల్ సేల్స్‌ట్యాక్స్ ఎగ్గొట్టడం జన్మహక్కు అన్నట్లుగా ఏపీ వ్యాపారులు జులుం ప్రదర్శించారు. నకిలీ వే బిల్లులతో పత్తిలోడ్లను సరిహద్దు దాటిస్తూ సర్కారుకు పన్నులు ఎగ్గొడుతున్నారు.
- మేము లేకుంటే తెలంగాణకు గతిలేదంటూ దురుసు వ్యాఖ్యలు
- సీఎస్టీ చెల్లించకుండానే పత్తిలోడ్లు సరిహద్దు దాటింపు
- ఆంధ్రా అధికారి జోక్యంతో ప్రభుత్వానికి రూ.3 లక్షలు నష్టం

నల్లగొండ-గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో దామరచర్ల మండలంలోని వాడపల్లి వద్ద ఏర్పాటు చేసిన వాణిజ్యపన్నులశాఖ చెక్‌పోస్టు వద్ద ఏపీ వ్యాపారుల ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. పన్ను కట్టాలని బండ్లు ఆపిన సిబ్బందిపై శుక్రవారం దౌర్జన్యానికి దిగి ట్యాక్స్ చెల్లించకుండానే వాహనాలను సరిహద్దు దాటించారు.


ఒక్కసారికి క్షమించాలని ఆంధ్రా అధికారి రాయబారం


ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా నకిలీ వే బిల్లులతో ఆంధ్రాకు అక్రమంగా పత్తి లోడ్లను తరలిస్తున్న వైనంపై ఈ నెల1న నమస్తే తెలంగాణలో వంద కోట్ల పన్ను ఎగవేతకథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అధికారులు చెక్‌పోస్టుల వద్ద గట్టి నిఘా ఏర్పాటుచేశారు. బుధవారం రాత్రి 11గంటల నుంచి తెల్లవారుజాము వరకు పన్ను చెల్లించకుండా ఆంధ్రాకు తరలిస్తున్న 46 పత్తి లోడ్లను చెక్‍పోస్ట్ వద్ద ఆపేశారు. ఆంధ్రా పత్తి వ్యాపారులు శుక్రవారం వచ్చి చెక్‌పోస్ట్ సిబ్బందితో ఘర్షణకు దిగారు.

మేము లేకుంటే తెలంగాణకు గతిలేదు.మేం రాకుంటే పత్తి కొనుగోలు చేసేవారు లేరు...అని ఆగ్రహంతో ఊగిపోతూ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. దీంతో సుమారు గంటపాటు ఘర్షణ వాతావరణం నెలకొంది. మార్కెటింగ్ పన్ను చెల్లిస్తున్నామని, టిన్ నెంబర్ ఉందని.. కమర్షియల్ సేల్స్‌ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదంటూ గొడవపడ్డారు. తెలంగాణలో కొనుగోలు చేసే పత్తికి ఇక్కడి నుంచే వే బిల్లులుండాలని, చిలకలూరిపేట, పొందుగుల వే బిల్లులను అనుమతించబోమని సిబ్బంది తేల్చిచెప్పారు. చివరకు మిర్యాలగూడలో పనిచేస్తున్న సీమాంధ్రకు చెందిన ఓ అధికారి చొరవ చేసుకొని సిబ్బందికి నచ్చజెప్పాడని సమాచారం. ఈ ఒక్కసారికి క్షమించేయండని చెప్పడంతో లారీలను వదిలేశారు. పత్తిలోడ్లు సరిహద్దు దాటడంతో సర్కారుకు రూ.3లక్షల నష్టం వాటిల్లింది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

శుక్రవారం, నవంబర్ 07, 2014

విద్యుత్ పాపాలెవరివి?

-నేడు అసెంబ్లీలో కరెంటు సమస్యపై చర్చ
-విపక్షాల విమర్శలకు దీటుగా బదులివ్వనున్న సర్కార్ 
-వాస్తవ స్థితిని ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం  
తెలంగాణకు టీడీపీ, కాంగ్రెస్ అన్యాయాలపై గణాంకాలతో చర్చకు సిద్ధమైన అధికారపక్షం

తెలంగాణలో విద్యుత్ సమస్యలపై వాస్తవాలను మరింతగా ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నది. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో శుక్రవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా విపక్షాల ప్రశ్నలకు దీటుగా సమాధానమివ్వడమేకాకుండా సమస్య తీవ్రతకు కారణాలు వివరిస్తూ, అందుకు కారకులు ఎవరనేది తేటతెల్లం చేయాలనీ, టీడీపీ, కాంగ్రెస్‌ల పాపాల మూట విప్పాలని యోచిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు (టీడీపీ, కాంగ్రెస్) తెలంగాణపట్ల ప్రదర్శించిన వివక్షే ప్రస్తుత పరిస్థితులకు కారణమనే వాస్తవాలను సభద్వారా ప్రజలకు స్పష్టం చేయనున్నది. అధికారంలో ఉన్న కాలంలో తెలంగాణలో కరెంటు కష్టాలపై నోరు మెదపని పార్టీలు కొత్త రాష్ట్రంలో పాలనాపగ్గాలు చేపట్టిన ఐదు నెలల ప్రభుత్వంపై ఆరోపణలు చేయడాన్ని అధికారపక్షం తీవ్రంగా పరిగణిస్తున్నది. 

electricity-power-stations

నిజాంకాలంలోనే విద్యుత్‌కాంతులను నింపుకున్న తెలంగాణకు సీమాంధ్ర ప్రభుత్వాలు చేసిన అన్యాయాలు, మౌలిక వనరుల (నీళ్ళు, నిధులు, బొగ్గు) దోపిడీ, తద్వారా ఉద్యోగాల దోపిడీవంటి అంశాలపై గణాంకాలతో సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నదని సమాచారం. అరవై ఏండ్ల తెలంగాణ పోరాటాలను పలుచన చేసిన కాంగ్రెస్, టీడీపీలు...అవి అధికారంలో ఉండగా తెలంగాణలో విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించకుండా ఇక్కడి సింగరేణి బొగ్గును సీమాంధ్రకు తరలించి విజయవాడ, రాయలసీమలలో కొత్త ప్రాజెక్టులు ఏర్పాటుచేసిన తీరును ప్రభుత్వం ఎండగట్టనున్నది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ జిల్లాల విద్యుత్ కేటాయింపులను సీమాంధ్ర అవసరాలకు తరలించిన ఉదంతాలను ప్రస్తావించనుంది. గత రెండేండ్లలో తెలంగాణ విద్యుత్ అవసరాలకోసం కారిడార్ బుక్ చేయని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, పోలవరం ముంపు గ్రామాల పేరుతో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపుకుని లోయర్ సీలేరు విద్యుత్‌వాటాలో తెలంగాణకు మొండిచెయ్యి ఇస్తున్న వైనాన్ని ప్రభుత్వం సభ దష్టికి తీసుకురానున్నది.

electricity-power-stations

గత ఆర్థిక సంవత్సరం (2013-14)లో లోయర్ సీలేరు జల విద్యుత్ కేంద్రం 1,263 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించింది. విభజన చట్ట ప్రకారం ఇందులో 53.89% విద్యుత్‌ను తెలంగాణకు ఇవ్వాలి. కానీ.. లోయర్ సీలేరు ఉత్పత్తి వివరాలను ఆంధ్రా సర్కారు డ్యూలింగ్ చేయకుండా గోప్యంగా ఉంచడం గమనార్హం. వాస్తవానికి గతేడాదిలో అప్పర్ సీలేరు-456 మిలియన్‌యూనిట్లు, లోయర్ సీలేరు- 1,263 మిలియన్ యూనిట్లు, డొంకరాయి-115 మిలియన్ యూనిట్ల చొప్పున సీలేరు బెల్ట్‌లో మొత్తం 1,834 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. సంవత్సరం పొడవునా ఈ మూడు ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి జరగడం విశేషం.

జెన్‌కో ప్రాజెక్టులు రాకుండా..


ప్రభుత్వరంగ సంస్థ ఏపీ జెన్‌కో పరిధిలోనూ కొత్త ప్రాజెక్టులు రాకుండా, ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యం పెరగకుండా కాంగ్రెస్ పాలకులు సీమాంధ్ర పెట్టుబడివర్గాలకే ప్రాధాన్యం ఇచ్చారు. ఫలితంగా కరీంనగర్‌జిల్లా నేదునూరు, రంగారెడ్డి జిల్లాలో శంకరపల్లిలోని గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. సకాలంలో నేదునూరు పూర్తయితే 2100మెగావాట్ల విద్యుత్‌ఉత్పత్తి జరిగి ఉండేది. శంకరపల్లి పవర్‌ప్రాజెక్టు భూమి కేటాయింపులు 2000 సంవత్సరంలోనే జరిగినా నిర్మాణం ఊసే లేకుండా పోయింది. తొలుత నాఫ్తా ఆధారంగా విద్యుత్‌ఉత్పత్తి చేయాలని భావించారు. అది వ్యయంతో కూడుకున్నది కావడంతో దానిని గ్యాస్ పవర్ ప్రాజెక్టుగా మార్చారు. అయితే శంకరపల్లిని కాదని, దాని తర్వాత వచ్చిన సీమాంధ్రుల పవర్ ప్రాజెక్టుకు 2003లో కేంద్రం గ్యాస్ కేటాయించింది.

గ్యాస్ కేటాయింపులోనూ నేతల హస్తం


ల్యాంకో పవర్‌ప్రాజెక్టుకు గ్యాస్ కేటాయింపులోనూ కాంగ్రెస్ నేతల హస్తం లేకపోలేదు. వాస్తవానికి కాకినాడ వద్ద కట్టాల్సిన ల్యాంకో పవర్‌ప్రాజెక్టు ఏకంగా విజయవాడ సమీపంలోని కొండపల్లికి తరలించారు. ప్రభుత్వ వ్యయంతో జెన్‌కో స్థలాల మీదుగా ల్యాంకో ప్రాజెక్టుకు పైప్‌లైన్ నిర్మించారు. శంకరపల్లి ప్రాజెక్టుకు వచ్చిన అభ్యంతరాలు ల్యాంకో ప్రాజెక్టుకు రాకపోవడంలో ఔచిత్యం నాటి పాలకులకే తెలియాలి. అంతే కాకుండా మర్చెంట్ పవర్ ప్రాజెక్టుగా ల్యాంకో కొండపల్లి ప్రాజెక్టుకు ఎపీ ట్రాన్స్‌కో సిఫార్సు చేయలేదు. ఆ తర్వాత ల్యాంకోకు గ్యాస్ కేటాయింపులకోసం నాటి రాష్ట్ర ప్రభుత్వం చట్టవిరుద్ధంగా సిఫార్సు చేయడం గమనార్హం. 

గత పాలకులదే పాపం


గత పాలకుల వివక్ష, ప్రస్తుతం వేసవిని తలపిస్తున్న వాతావరణంతో తెలంగాణ జిల్లాలు కరెంటు కష్టాలను చవిచూస్తున్నాయి. మార్చిని తలపించేలా భానుడి ప్రతాపం ఉండడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. దీంతో పంటలను కాపాడేందుకు ప్రభుత్వం పారిశ్రామికరంగానికి మొదట్లో వారంలో రెండు రోజులు పవర్ హాలిడే ప్రకటించడమే కాకుండా పట్టణాలు, ముఖ్యనగరాల్లో కొన్ని గంటలపాటు కరెంటు కోతలను అమలుచేసింది. ఇటీవల హుదూద్ తుఫాన్‌వల్ల వాతావరణం చల్లబడడంతో పరిశ్రమలకు పవర్ హాలిడేను ఒక రోజుకు కుదించారు. మరోవైపు ప్రభుత్వం పెద్ద ఎత్తున విద్యుత్ కొనుగోలు జరిపి, పంటలను కాపాడే ప్రయత్నంచేసింది. అక్టోబర్‌లో యూనిట్‌కు రూ.8.62ల చొప్పున 14 మిలియన్‌యూనిట్ల విద్యుత్ కొనుగోలుచేసిన సందర్భాలున్నాయి. 

విద్యుత్ సమస్యల నివారణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు


దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు చర్యల్లో భాగంగా వచ్చే 25 ఏండ్ల కు 500 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 500 మెగావాట్లు వినియోగంలోకి రానున్నాయి. 2016 అక్టోబర్ నుంచి ఏడేండ్లపాటు మరో రెండువేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఇటీవల టెండర్లను కూడా ఆహ్వానించింది. స్వల్పకాలిక చర్యల్లో భాగంగా 2015 మే 29నుంచి రెండువేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇందులో 1,718 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు ధరల విషయంలో చర్చలు జరుగుతున్నాయి. 

రాష్ట్రంలో సౌరశక్తికి అపార అవకాశాలున్న నేపథ్యంలో ప్రైవేటురంగంలో సోలార్ పవర్ ప్రాజెక్టులకు ప్రభుత్వం వేగవంతంగా అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ ప్రాజెక్టుల ఉత్పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు తొలివిడతగా 500 మెగావాట్ల టెండర్లు నిర్వహించగా దాదాపు నాలుగురెట్లు స్పందన లభించడం గమనార్హం. దీనిని దృష్టిలో ఉంచుకుని మరో 500మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల అనుమతుల అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పవన విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలున్నట్లు గుర్తించిన ప్రభుత్వం ప్రైవేటురంగంలో విండ్ పవర్ ప్రాజెక్టులకు అనుమతులిస్తున్నది. ఇటీవలే రంగారెడ్డి జిల్లా పరిధిలో 300 మెగావాట్ల విండ్‌పవర్ ప్రాజెక్టుకు అనుమతించడమే కాకుండా మరో 300 మెగావాట్ల ప్రాజెక్టు ఏర్పాటుపై పరిశీలిస్తున్నది. 

ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందం


రాష్ట్ర విద్యుత్ అవసరాలకోసం ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకుంది. ఈమేరకు ఇటీవల సీఎం కేసీఆర్, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ సమక్షంలో ఎంవోయూపై సంతకాలు జరిగాయి.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

గురువారం, నవంబర్ 06, 2014

గిదీ మన లెక్క!

త్లెల్ఱంగాణ ప్రజలకు, బ్లాగు వీక్షకులకు
కార్తీక పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు!!!


badget-2014


budget-table


తెలంగాణ వస్తే ఏం జరుగుతుంది? యాచించే స్థితి నుంచి శాసించే దశకు చేరుకోవడం వల్ల ఏమిటీ లాభం? మన రాష్ర్టాన్ని మనమే పరిపాలించుకుంటే మనకు ఒరిగేదేంటి? ఈ ప్రశ్నలకు తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ సమాధానాలు చెప్పింది. మన నిధులు మనకేనన్న నినాదాన్ని నిజం చేసి చూపించింది. ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్ లక్ష కోట్లకు చేరుకోవడానికి దాదాపు 46 ఏండ్లు పట్టింది. 2004-05 ఆర్థిక సంవత్సరానికి అప్పటి రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం మొదటిసారిగా రాష్ట్ర బడ్జెట్‌ను లక్ష కోట్లమార్క్ దాటించింది.
-తొలి బడ్జెట్‌లోనే లక్ష కోట్ల మార్కు
-46 ఏండ్లకుగానీ లక్ష కోట్లకు చేరని ఉమ్మడి బడ్జెట్
-తొలి ఏడాదే తడాఖా చూపిన టీఆర్‌ఎస్ సర్కార్
-కేటాయింపుల్లో దామాషా లెక్కన ఘనమైన పెరుగుదల
దామాషా నిష్పత్తిపరంగా చూస్తే తెలంగాణకు అందులో ఇంచుమించు సగం ఉండాలి. కానీ.. సీమాంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ దగాపడుతూ వచ్చింది. ఇప్పుడు స్వరాష్ట్రంగా అవతరించిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లోనే లక్ష కోట్ల మార్క్ చేరుకుని రికార్డ్ సృష్టించింది. తద్వారా ఉమ్మడి రాష్ట్రంలో వివిధ రంగాలకు జరిగిన కేటాయింపులను తెలంగాణ వాటాతో పోల్చితే ఏకంగా రెట్టింపు చేసింది. గడిచిన బడ్జెట్‌తో సరి చూసుకుంటే.. 2013-14 ఆర్థిక సంవత్సరానికి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలోని మొత్తం 23 జిల్లాలకు కలిపి 1.61 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రవేశపెడితే.. కేవలం పది నెలల కాలానికి.. పది జిల్లాలకు కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లక్ష కోట్లు! లక్ష కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి సత్తా చాటడమే కాకుండా.. గతేడాది 23 జిల్లాలకూ కలిపి కేటాయించిన మొత్తాలకు మించిన స్థాయిలో పది జిల్లాలకు కేటాయింపులు జరుపడం తెలంగాణ ప్రభుత్వ విజయమేననడంలో సందేహం లేదు.

ఉదాహరణకు వ్యవసాయ రంగానికి గత బడ్జెట్‌లో 23 జిల్లాలకు కలిపి 6,128 కోట్లు కేటాయిస్తే.. ఈ ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం ఏకంగా 8511.17 కోట్లు కేటాయించి, ఉమ్మడి రాష్ట్ర రికార్డును తిరగరాసింది. శాంతి భద్రతలకు ఉమ్మడి రాష్ట్రంలో 5386 కోట్లు కేటాయిస్తే.. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో 3307 కోట్లు కేటాయించారు. లెక్కకు మిక్కిలి రంగాల్లో దామాషా నిష్పత్తితో పోల్చితే అదనంగానే కేటాయింపులను గమనించవచ్చు. తెలంగాణ అన్యాయాలు ఎదుర్కొన్న ప్రతి రంగంలోనూ ఇటువంటి కేటాయింపులే కనిపిస్తాయి. ఇవే కాకుండా.. గత పాలకులు పట్టించుకోని కొన్ని కొత్త రంగాలకు ఇతోధికంగా నిధులు కేటాయించింది టీఆర్‌ఎస్ ప్రభుత్వం. రెండు జీవనదులు పారుతున్నా తెలంగాణకు మంచినీటి గోస తప్పలేదు. దాన్ని రూపుమాపేందుకు సంకల్పించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. వాటర్ గ్రిడ్‌కోసం తొలిదశలో 2వేల కోట్ల రూపాయలను కేటాయించింది.

రోడ్ల అభివృద్ధికి మరో రెండువేల కోట్లు, పెన్షన్లకు1689.99 కోట్లు, దళితులకు భూమి కొనుగోళ్లకు వెయ్యి కోట్లు కేటాయించింది. దళిత, గిరిజన, మైనార్టీ యువతుల పెళ్లిళ్ల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు 330 కోట్లు పొందుపర్చింది. అన్నింటికి మించి.. తెలంగాణ కోసం తమ ప్రాణాలను బలిదానం చేసిన అమరవీరుల కుటుంబాలను ఆదుకునేందుకు వంద కోట్లను ప్రత్యేకంగా కేటాయించింది. ఇలాంటి అనేక ప్రాధాన్యాలను తెలంగాణ ప్రభుత్వం ఎంచుకోవడం గమనించవచ్చు.

మనది చెరువుల దేశం


తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కేంద్రం చెరువు. ప్రాచీనచరిత్రలో తెలంగాణను చెరువుల దేశంగా పేర్కొన్నారు. గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించేందుకు 45 వేల చెరువులను వచ్చే ఐదేండ్లలో బాగు చేస్తం. కృష్ణా, గోదావరి బేసిన్‌లో 265 టీఎంసీల నీటిని నిల్వచేసుకునే సామర్థ్యం ఒకప్పుడు మన చెరువులకు ఉండేది. తిరిగి ఆ సామర్థ్యాన్ని పొందాలి. ఈ యేడాది 9 వేల చెరువులను పునరుద్ధరించడానికి రూ.2 వేల కోట్లను బడ్జెట్‌లో ప్రతిపాదిస్తున్నాం.

బుధవారం, నవంబర్ 05, 2014

ఓరుగ‌ల్లు టు జ‌గ‌ద‌ల్ పూర్‌...

chati


-మలి కాకతీయ రాజ్యంలోకి..చరిత్ర పిలిచింది.. 
చరిత్ర ఒక తరగని గని. ఎంత తవ్వినా ఎప్పటికప్పుడు నిత్యనూతన ఆవిష్కరణలు తారసపడుతూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆధారాలు జిజ్ఞాసకు పదును పెడుతూనే ఉంటాయి. కాకతీయ సామ్రాజ్యం ప్రతాపరుద్రునితో అంతమై పోలేదన్నది నూతన ఆవిష్కరణ. ఇక్కడ ముగిసిన అధ్యాయం బస్తర్ అడవుల్లో మలి కాకతీయ సామ్రాజ్యం రూపంలో పురుడు పోసుకుని వందల ఏళ్లుగా వర్ధిల్లుతున్నది. కాకతీయ వారసత్వం పుణికిపుచ్చుకున్న తెలంగాణకు బస్తర్ ఇప్పుడొక అపురూప కథావస్తువు. కళ్లారా చూడాల్సిన తీర్థయాత్రా స్థలి. 
చరిత్ర పుస్తకాలకు పరిమితం అనుకున్న కాకతీయ వారసులను ప్రత్యక్షంగా చూడడం రుద్రమదేవి, ప్రతాపరుద్రులను స్ఫురణకు తెచ్చుకోవడం, వందల కిలోమీటర్ల అవతల నట్టడవిలో వెలసిన దంతేశ్వరీ ఆలయంలో కాకతీయ శిల్ప కళారీతులను ఒడిసిపట్టుకోవడం ఓ అద్భుత అనుభవం. ఎటొచ్చీ మావోయిస్టులు, పోలీసులకు మధ్య యుద్ధభూమిగా మారిన ఆ ప్రాంతానికి ప్రయాణించడమే అన్నింటికన్నా క్లిష్టతరమైన అంశం. 

ganesh


ఓరుగల్లునుంచి జగ్‌దల్‌పూర్.. ఇది రెండు నగరాల మధ్య జరిపే సాధారణ పర్యటన మాత్రమే కాదు. ఒక మహాసామ్రాజ్యపు రెండు రాజధానుల మధ్య ప్రయాణం. ఒక చోట ముగిసిన చరిత్ర ఆనవాళ్లు మరోచోట ఆవిర్భవించిన ప్రదేశాల మధ్య చరిత్రకు అనుసంధానాన్ని తడిమిచూసే ప్రక్రియ. ఇక్కడ మాయమైన వైభవాన్ని అక్కడ వెతుక్కునే తపన. పోల్చుకునే ఆరాటం. ఇదే మమ్మల్ని వరంగల్‌నుంచి బస్తర్‌కు నడిపించింది. బస్తర్‌లో కాకతీయ రెండో సామ్రాజ్యం కథనం నమస్తే తెలంగాణలో ప్రచురితమైన నాటినుంచి ఈ తపన ఉంది. కాకతీయులకు అక్కడ ఒక వారసుడున్నాడని తెలిసినప్పటినుంచి కలుసుకోవాలన్న ఉబలాటం.

కాకతీయుల చరిత్ర ప్రతాపరుద్రుడితోనే అంతం కాలేదు. ఆయన తమ్ముడు అన్నమదేవుడు వరంగల్ నుంచి బస్తర్‌కు చేరి అక్కడ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారనే చరిత్ర ప్రచురితమైనాక తెలంగాణ వ్యాప్తంగా చరిత్రకారుల్లో ఇదొక చర్చనీయాంశంగా ఉంది. సహజంగానే అనుమానాలు, సంశయాలు ఎటూ ఉంటాయి. ఈ నేపథ్యం బస్తర్ వైపు నడిపించింది. దానికితోడు వరంగల్‌లో కాకతీయ ఉత్సవాలు జరిగిన సందర్భంగా బస్తర్‌లోని మలి కాకతీయ రాజు అన్నమదేవుడి వంశానికి చెందిన వారసుడు కమల్‌చంద్ర భంజ్‌దేవ్ కాకతీయతో జరిపిన సంభాషణలు.. ఇవన్నీ మాలో ఆసక్తిని వందల రెట్లు పెంచాయి.

బస్తర్ వెళ్లాలి. మలి కాకతీయుల రాజసౌధాన్ని చూడాలి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజులు ఎట్లా ఉంటున్నారు? వారి ఉనికి ఎట్లా ఉంది? అక్కడి ప్రజల యోగక్షేమాల విషయంలో వారి పాత్ర ఏమిటి? నిజంగా వారు రాజులుగానే ఉంటున్నారా? ప్రజాస్వామ్యయుతంగా ప్రజలుగానే జీవిస్తున్నారా? ఇటువంటి అనేకానేక విషయాలు తెలుసుకోవాలనే ఉబలాటం మొదలైంది. అతి కష్టంమీద బస్తర్ రాజు కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌తో అపాయింట్‌మెంట్ దొరికింది. తర్వాత ఎడిటర్ కట్టాశేఖరరెడ్డి జాగ్రత్తలు చెప్పి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. నెట్‌వర్క్ కో-ఆర్డినేటర్ మార్కండేయ సలహాలిచ్చారు.

idol


యుద్ధక్షేత్రం మధ్యనుంచి...


దండకారణ్యం ప్రాంతంలో ఉన్న బస్తర్‌లో ఇపుడు యుద్ధం జరుగుతున్న పరిస్థితి ఉంది. బస్తర్, దంతేవాడ, సుకుమా, బీజాపూర్, కాంకేర్ ప్రాంతాల్లోని అడవి అంతా అలజడిగా ఉంది. భారతసైన్యం, మావోయిస్టుల మధ్య హోరాహోరీ పరిస్థితి ఉంది. కొత్త వ్యక్తుల మీద అనుమానపు చూపులు ప్రసరించే సమయం. జిల్లా కేంద్రాలు మినహా మిగిలినదంతా గిరిజన గ్రామాలు అడవులు కావడం మరో సమస్య. మా ప్రయాణం భద్రాచలం,సుకుమా నుంచి జగ్‌దల్‌పూర్‌కు ప్లాన్ చేసుకున్నాం. మిత్రుడు జూలకంటి, టీ న్యూస్ వేముల నాగరాజు, కెమెరామెన్ సాంబశివుడు కలిసి ప్రయాణం ప్రారంభించాం.

ఛత్తీస్‌గడ్ బార్డర్ కుంట చేరే సరికే సాయంత్రం నాలుగైంది. అక్కడి నుంచి రెండు జిల్లాలు దాటాలి. రాత్రి ఎనిమిదికల్లా జగ్‌దల్‌పూర్ చేరుకోవచ్చుననుకుంటే అక్కడికి చేరే సరికి పన్నెండైంది. అంతా అడవి దారే. సుకుమా నుంచి మెలికలు తిరిగే ఘాట్లు. లోయలు. వాహనం స్పీడు చాలావరకు గంటకు ఐదు నుంచి పది కిలోమీటర్ల కంటే సాధ్యం కాదు. మధ్యలో ఎర్రబోరు, దోర్నపాల ప్రాంతాలు తగిలాయి. 76 మంది సీఆర్‌పీఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సును మావోయిస్టులు పేల్చివేసిన చోటు అదే. దర్బా దాటగానే కేశ్‌కాల్‌ఘాట్. సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్రకర్మ, మాజీ కేంద్రమంత్రి వీసీ శుక్లా లాంటి వాళ్లు ప్రయాణిస్తున్న కాన్వాయిపై మావోయిస్టులు దాడి చేసిన చోటు. సుకుమా జిల్లా హెడ్‌క్వార్టర్‌కు చేరుకునే సరికి సెల్ కవరేజ్ వచ్చింది. అప్పటిదాకా అదీలేదు.

అప్పటికి రాత్రి తొమ్మిదిన్నర అయింది. సుకుమా జిల్లా కేంద్రమే అయినా మండల కేంద్రం కన్నా అధ్వాన్నంగా ఉంది. సుకుమా పేరు అందరికీ సుపరిచితమే. అక్కడి కలెక్టర్ అలెక్స్‌పూల్ మీనన్ కిడ్నాప్‌కు గురైన వార్తలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. అక్కడ కొత్త వ్యక్తులతో ఎవరూ పెద్దగా మాట్లాడరు. హోటల్లో చాయ్‌పెట్టిచ్చిన మనిషి ఎంత మాట్లాడాలని ప్రయత్నించినా ఆచితూచి మాట్లాడాడు. అక్కడి నుంచి జగదల్‌పూర్ ప్రయాణం.

కాటుక చీకటి. కళ్లు పెద్దవి చేసుకొని చూసినా దారి మినహా ఏమీ మరేమీ కనిపించని చీకటి. చేరేసరికి రాత్రి పన్నెండున్నరైంది. మనలాగా లాడ్జ్‌ల్లో తేలిగ్గా అనుమతి దొరకదు. ఐడీ ప్రూఫ్‌ల జిరాక్స్ అన్నీ ఇస్తే వాటిని చూసుకొని లాడ్జ్ నిర్వాహకులు తృప్తి పడితేనే సాధ్యం. అన్నిరకాలుగా ఆయన సంతృప్తి పడ్డ తరువాతే గది దొరికింది.

మ్యూజియంతో మొదలు..


మా యాత్ర గమ్యానికి చేరింది. కాకతీయ ఆనవాళ్లను సందర్శించే కార్యక్రమం జగ్‌దల్‌పూర్‌లోని మ్యూజియంతో మొదలైంది. ముందుగా కాకతీయ రాజవంశ వారసుడు రాజా కమల్‌చంద్ర భంజ్ దేవ్ కాకతీయను కలుద్దామనే అనుకున్నాం. ఆయన అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నం మొదలుపెట్టాం. ఆయన రమ్మన్నాడని ఇంతదూరం వచ్చాం. తీరా ఆయన దొరుకుతాడో లేదో అన్న అనుమానం మొదలైంది. అందరం కలిసి రాజప్రాసాదం వద్దకు చేరుకున్నాం. మహల్ రాజసం ఉట్టిపడుతున్నది. ప్రవేశద్వారం వద్దే గుడి. సెక్యూరిటీ. సమస్య ఏమిటంటే అనుమతిలేనిదే లోనికి వెళ్లకూడదు. లోనికి వెళ్లనిదే అనుమతి దొరకదన్నట్టు ఉంది అక్కడ పరిస్థితి.

కమల్‌చంద్ర భంజ్‌దేవ్ వ్యవహారాలు చూసుకునే కుమార్ జయదేవ్‌తో ఫోన్‌లో మాట్లాడాం. ఆయన దూరంగా ఉన్నాను. నేను అక్కడికి రావడానికి గంట పడుతుంది అన్నాడు. మహల్ చూస్తే కదలబుద్ది కాలేదు. ఈరోజు ఎట్లయినా సరే లోపలికి వెళ్లాల్సిందే. రాజుతో మాట్లాడాల్సిందే అనుకున్నాం. ఇంతలో అక్కడికి దగ్గరే పురావస్తుశాఖ మ్యూజియం ఉందని తెలిసింది. మ్యూజియం అంటే వారసత్వ సంపద. అక్కడ కాకతీయులకు సంబంధించిన ఏవైనా చారిత్రక ఆధారాలు దొరకొచ్చు. ఎలాగూ గంట సమయం ఉంది. బయటికి వచ్చి అడ్రస్ పట్టుకున్నాం. తీరా అక్కడికి వెళితే మ్యూజియం లోపల ఫొటోలు తీయడం నిషేధం అన్నాడు అక్క చౌకీదార్. కాసేపు తర్జనభర్జన. ఫొటోలు లేకుంటే ఎలా? మ్యూజియం అధికారి ఎల్సీ మెస్రా ఫోన్ నెంబర్ దొరికింది. కాసేపు సంభాషించిన తర్వాత అనుమతి దొరికింది.

మ్యూజియం రెండస్థుల మేడ. సుమారు 50 విగ్రహాలున్నాయి. మరో 100 విగ్రహాలు స్థలం లేక స్టోర్ రూంలో పడేశారు. ప్రదర్శనకు పెట్టిన విగ్రహాల్లో చాలా వరకు కురుష్పాల్, బస్తర్, బడేడోంగర్, చోటేడొంగర్, జగదళ్‌పూర్, దంతేవాడ తదితర ప్రాంతాల్లో లభించాయి. వాటిలో అనేకం గణపతి, శివపార్వతుల విగ్రహాలు. రామప్ప నాగిని పోలిన నాగిని విగ్రహం కూడా అక్కడుంది. విగ్రహాల్లో 13, 14వ శతాబ్దానికి సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. కాకతీయ శిల్పాలతో పోలిస్తే ఈ విగ్రహాల ఫినిషింగ్ కొంచెం ముతకగా ఉంది. కొన్ని శాసనాలు కూడా ఉన్నాయి. అర్థం కాని భాష. ఏమైనా దాదాపు అన్నీ కాకతీయ రీతులను గుర్తుకు తెచ్చేవే. మన చరిత్రకారులు ఆ మ్యూజియంలో ఉన్న విగ్రహాలు, శాసనాలు చూస్తే అవి కాకతీయుల శిల్పరీతులేనని తేల్చివేస్తారనిపించింది.

ఈ సందట్లో అక్కడ ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ బీజాసింగ్ ఠాకూర్ తారసపడ్డారు. ఆయనతో కొద్దిసేపు మాట్లాడాం. ఆయన బస్తర్ కాకతీయుల ఆనవాళ్లు వరంగల్‌లో ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఒకటి అర్థమైంది. అక్కడున్న వారికి ప్రతాపరుద్రుడి వరకే తెలుసు. అంతకన్నా ముందు కాకతీయుల గురించి పెద్దగా తెలియదు. విచిత్రంగా మనకు ప్రతాపరుద్రుడి వరకే తెలుసు ఆయన తర్వాత (మన చరిత్రకారులు పట్టించుకోనట్టే..) అన్నమదేవుడు, ఆయన తరువాత వారి గురించి తెలియదు. ఈ లింకే అనుసంధానం జరగాల్సి ఉంది. ఓ గంట తరువాత కుమార్ జయదేవ్ చెప్పిన టైం కానే అయింది.

మళ్లీ మహల్‌కు వెళ్లాం. కుమార్ జయదేవ్ చెప్పిన సమయానికి వచ్చారు. మేమే కొంచెం లేటు. ఆయన మాకోసం వేచి చూస్తున్నారు. ఆయన చిరునవ్వుతో కూడిన పలకరింత మమ్మల్ని మలి కాకతీయ సామ్రాజ్య వారసుల రాజప్రాసాదంలోకి ఆహ్వానించింది. ఆ రాజ్య వారసుడితో భేటీకి సమయాన్ని పరిచింది. ఉద్వేగం, సంభ్రమంతో కూడిన అనుభూతితో గేటు దాటి ప్రాసాదంలోకి అడుగుపెట్టాం...

-(ఛత్తీస్‌గఢ్ నుంచి) నూర శ్రీనివాస్

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

మంగళవారం, నవంబర్ 04, 2014

దొంగ బుద్ధి!

రాష్ట్ర విభజన అనంతరం ఆయా సంస్థల పంపకాలను సజావుగా సాగకుండా అనేక అడ్డంకులు సృష్టిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ పాలకులు, తెలంగాణకు చెందవలసిన నిధులను తమ ప్రాంతానికి దొంగచాటుగా జారగొట్టడం క్షమించరాని నేరం. కార్మిక శాఖకు చెందిన ఇద్దరు అధికారులు ఉమ్మడి నిధుల నుంచి 420 కోట్ల రూపాయలను విజయవాడలోని ఒక బ్యాంకుకు తరలించారు. ఆరువందల కోట్లకు పైగా దొంగిలించడానికి పథకం వేసినట్లు వెల్లడైంది. ఇందుకు సంబంధించిన ఫైళ్ళు కూడా మాయమయ్యాయి. తెలంగాణ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండడంతో ఈ బాగోతం బయటపడ్డది. దొంగతనంగా తరలించడమే కాకుండా గుట్టు బయటపడ్డ తరువాత హుందాగా వ్యవహరించకుండా, తప్పించుకునే వేషాలు వేయడం సిగ్గుచేటు! ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పెద్దల కనుసన్నలలోనే ఈ వ్యవహారం సాగిందని స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది.
తమ పెద్దల ఆదేశాల మేరకే ఇందుకు తెగించినట్టు నిధులు తరలించిన అధికారులు చెబుతున్నారు. పైనున్న పెద్దలు వీరిని వెనకేసుకొస్తున్నారు. ఇంత జరిగిన తరువాత, లెక్కలు తీసి నిజాయితీగా పంచి ఇచ్చేందుకే తరలిస్తున్నామని చెప్పుకుంటున్నారు! హైదరాబాద్ తాత్కాలిక ఉమ్మడి రాజధానిగా ఉండి ప్రభుత్వాధినేత సకల పరివారంతో ఇక్కడే తిష్టవేసి ఉండగా, లెక్కలు తేలని ఈ ఉమ్మడి నిధులను హడావుడిగా విజయవాడకు తరలించవలసిన అవసరం ఏమొచ్చినట్టు? నిజాయితీ ఉంటే తరలించే ముందు తెలంగాణ ప్రభుత్వానికి ఒక మాట చెప్పవచ్చు కదా!
దొంగచాటుగా విజయవాడకు నిధులు తరలించిన వ్యవహారంలో తమకు సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ పెద్దలు బుకాయించవచ్చు.

అయితే ఆంధ్రప్రదేశ్ పాలకులది నిజాయితీ గల మనస్తత్వమా, అల్పబుద్ధా అనేది నిర్ధారణ చేసుకునేందుకు ఇతర ఉదంతాలను పరిశీలించవలసి ఉంటుంది. 

తెలంగాణ నిధులను తమ ఖాతాలో జమ చేసుకోవడం రివాజుగా సాగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం వాటిని రాబట్టుకోవడానికి అనేక తంటాలు పడవలసి వస్తున్నది. తెలంగాణ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీకి చెందిన ఇరవై ఒక్క కోట్ల రూపాయల నిధులను విజయవాడలో ఖాతా తెరిచి అక్కడికి ఆన్‌లైన్‌లో తరలించడంపై ఉద్యోగులు ఆందోళన చేయవలసివచ్చింది.

కేంద్రం నుంచి ఉమ్మడిగా వచ్చిన నిధులను వెంటనే తెలంగాణకు చెల్లించకపోవడం మొదలైన చిల్లర బుద్ధులను ఆంధ్రప్రదేశ్ పాలకులు ప్రదర్శిస్తున్నారు. కొన్ని విద్యా సంస్థలను ప్రస్తుతానికి ఉమ్మడిగా కొనసాగించిన నేపథ్యంలో వాటి నిధులను తమ రాష్ర్టానికి కొత్త వాహనాలు కొనడానికి, ఇంధనానికి ఇతరత్రా యధేచ్ఛగా ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దేశంలో ఎక్కడ రాష్ర్టాలు విడిపోయినా ఎక్కడి ఆస్తులు అక్కడి రాష్ర్టానికే ఉంటాయనేది స్థిరపడిన సూత్రం. కానీ హైదరాబాద్‌లోని వివిధ కార్పొరేషన్ల ఆస్తుల కబ్జాకు సీమాంధ్ర పాలకులు కుట్ర పన్నుతున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ కార్యాలయంలో పనిచేసే ఇద్దరు సీమాంధ్ర అధికారులు తెలంగాణ నివేదికను తప్పుల తడకగా రూపొందించడంవల్ల రావలసిన నిధులు ఆగిపోయాయని తెలిసింది. ఆంధ్రప్రదేశ్ నివేదిక ఆమోదం పొందగా, ఇక్కడ తిష్టవేసిన అధికారుల నిర్వాకం వల్ల మనరాష్ట్ర నివేదిక తిరస్కారం పొందింది.

తెలంగాణ పట్ల సీమాంధ్ర అధికారులలో విద్వేషం పేరుకుపోయి ఉందనడానికి దీనిని ఉదాహరణగా చెప్పవచ్చు.
నిధుల దొంగతనమే కాదు... కొన్ని చెప్పుకోవడానికి కూడా మనసొప్పని చిల్లర పనులకు సీమాంధ్ర అధికారులు, ఉద్యోగులు పాల్పడుతున్నారు.

ఫర్నిచర్‌ను ఎత్తుకుపోవడం, గదులు ఆక్రమించుకుని ఖాళీ చేయకపోవడం వంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. పోలీసు శాఖకు చెందిన ఒక కార్యాలయాన్ని ఖాళీ చేసినప్పుడు ఫ్యాన్లు, వైర్లు, మరుగు దొడ్డిలోని కమోడ్ వంటివి కూడా పీక్కపోయారు! కొన్ని కార్యాలయాలలో పరిశుభ్రంగా, అందంగా ఉండే గదులు ఆక్రమించుకుని తెలంగాణ వారికి పాతకాలపు గదులు కేటాయించారు. కంప్యూటర్లు అత్యాధునికమైనవి తమ వద్ద పెట్టుకుని కాలంచెల్లినవి తెలంగాణకు ఇచ్చిన ఉదంతాలు ఉన్నాయి. వాహనాల కేటాయింపులోనూ వివక్షే. ఇవన్నీ నిలదీసి అడిగితే సీమాంధ్ర నాయకులు అధికారులు సిగ్గుతో తలదించుకోవలసి వస్తుంది. కానీ తెలంగాణ వారు హుందాగా వ్యవహరిస్తున్నారు. ఏదో ఒక సంఘటన అయితే అది ఆ వ్యక్తి తప్పిదంగా భావించవచ్చు.

ఎక్కడ చూసినా సీమాంధ్ర అధికారుల నిర్వాకం నలుగురు చూసి నవ్వుకునే విధంగా ఉంటున్నది. దాదాపు ఆరు దశాబ్దాలు తెలంగాణ నిధులను కొల్లగొట్టడానికి అలవాటు పడ్డ నాయకులు, అధికార గణం విడిపోయే దశలో కూడా అదేవిధంగా వ్యవహరిస్తున్నారు. కార్మిక శాఖ నిధుల దొంగిలింపు పొరపాటు ఘటన కాదు. సీమాంధ్ర పాలకవర్గ దోపిడీ సంస్కృతికి, సంకుచిత మనస్తత్వానికి మచ్చుతునక.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)


జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

ఆదివారం, నవంబర్ 02, 2014

తెలంగాణ అధికారులపై...సీమాంధ్ర అధికారుల కుట్రలు...!!!

-విద్యామండలి కార్యదర్శి సతీశ్‌రెడ్డిపై కోవర్టు ముద్ర
-దోచేస్తున్న నిధులు అడ్డుకున్నారని కక్షసాధింపు
-అన్ని సంస్థల్లోనూ ఇదే తరహా అవమానాలు
ఉమ్మడి విద్యాసంస్థల్లోని తెలంగాణ అధికారులపై ఆంధ్రా పాలకులు కుట్రల మీద కుట్రలు చేస్తున్నారు. పొమ్మనలేక పొగ పెడ్తున్నారు. విద్యాసంస్థల విభజనలో భాగంగా ఏపీ ఉన్నత విద్యామండలిలో సెక్రటరీగా పనిచేసిన ప్రొఫెసర్ సతీశ్‌రెడ్డిపై కుట్ర చేసి మానసిక వేధింపులకు గురిచేశారు. స్వయంగా ఆయనే రాజీనామా చేసేలా ఒత్తిడి తెచ్చారు. ముఖ్యమైన ఫైళ్ళు పంపకుండా, కింద స్థాయి ఉద్యోగస్థులతో క్లియర్ చేయించుకుంటున్నారు. తెలంగాణ సెక్రటరీని పరిగణనలోకి తీసుకోకుండా తెలంగాణ నిధులను అడ్డదారిలో ఖర్చు చేశారు.
చివరకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ను కోవర్టుగా ఆరోపించారు. ఇదంతా చేసింది ఉమ్మడి నిధులు దోచుకుంటున్న ఆంధ్రా అధికారులను ప్రశ్నించినందుకే. ఇంకా రెండేండ్లు సర్వీసు ఉన్నా ఆంధ్రా అధికారుల తీరుపై తీవ్ర మనస్తాపానికి గురై తన సెక్రటరీ పదవికి సతీశ్‌రెడ్డి రాజీనామా చేశారు. తెలంగాణ ఉద్యోగస్థులపై ఇలాంటి వేధింపులు అన్ని రకాల ఉమ్మడి విద్యాసంస్థలలో కొనసాగుతున్నాయి. కొంతకాలంగా తెలుగు యూనివర్సిటీలో కూడా ఇదే విధానం కొనసాగుతున్నది.

ఆంధ్ర సిబ్బందికి ప్రమోషన్లు ఇచ్చి, కోర్టు ఆదేశాలు ఉన్నా తెలంగాణ సిబ్బందిని పట్టించుకోలేదు. ఒకే రకమైన విధులలో పనిచేస్తున్న ఆంధ్రా, తెలంగాణ ఉద్యోగులలో ప్రాంతీయ పక్షపాతం చూపిస్తున్నారు. దీనిపై తెలుగు యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యోగులు శనివారం ఆందోళన నిర్వహించారు. తెలుగు యూనివర్సిటీ వీసీని అడ్డుకున్నారు. ఇలాంటి కుట్రలే ఆర్జీయూకేటీలో కూడా కొనసాగుతున్నాయి. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వైస్ చాన్స్‌లర్ తెలంగాణ ఉద్యోగస్థులను వేధింపులకు గురి చేస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యామండలి, సాంకేతిక విద్యామండలి, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ వంటి విద్యాసంస్థలలో కూడా ఇలాంటి ఘటనలే చోటుచేసుకుంటున్నాయి.

దీనిపై స్పందించి, తెలంగాణ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్‌ను కలిసినా ఏం ప్రయోజనం లేకుండా పోతున్నదని తెలుగు యూనివర్సిటీ నాన్ టీచింగ్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

శనివారం, నవంబర్ 01, 2014

ఇది అనైతికం...!!!

-కృష్ణా బోర్డు తీర్పు ఏకపక్షం
-న్యాయపోరుకు సిద్ధం: మంత్రి హరీశ్
-బాబు, కేంద్రం ఒత్తిళ్లతోనే ఈ తీర్పు
-తీర్పుపై టీ బీజేపీ వైఖరేమిటి?
-కేంద్రంలో తెలంగాణ మంత్రులేరి?
-విద్యుత్ సమస్యపై కేంద్రానికి 30 లేఖలు
-దరఖాస్తులు పెండింగ్‌లో లేవనడం అన్యాయం: హరీశ్
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి విషయంలో కృష్ణానది యాజమాన్య బోర్డు ఇచ్చిన తీర్పు పూర్తిగా ఏకపక్షంగా ఉందని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆక్షేపించారు. బోర్డు తన పరిధిలోకి రాని అంశాలపై నిర్ణయం తీసుకోవడం అనైతికమని అన్నారు. బోర్డు తీర్పుపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నామని, తెలంగాణ న్యాయమైన హక్కుల కోసం న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నామని హరీశ్ ప్రకటించారు. 
కృష్ణా రివర్ బోర్డు ఇచ్చిన తీర్పుపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమక్షంలో శుక్రవారం సచివాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. సమావేశానికి మంత్రి హరీశ్‌రావు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడారు. బోర్డు నిర్ణయంపై నిప్పులు చెరిగారు. నీటి పంపకం బోర్డు పరిధిలోకి రాదని, అది ట్రిబ్యునల్ చేయాల్సిన పని అని తేల్చిచెప్పారు. బోర్డు తన పరిధిని దాటి వ్యవహరించిందని మండిపడ్డారు. కేవలం ఒప్పందాలను అమలుపరచడం వరకే బోర్డు పని అని గుర్తు చేశారు. బోర్డు ఇచ్చిన తీర్పుపై మరోసారి ఫిర్యాదు చేస్తామని హరీశ్ చెప్పారు.

harish


తీర్పు వెనుక చంద్రబాబు ఒత్తిడి: కేంద్ర ప్రభుత్వంపై ఏపీ సర్కారు ఒత్తిడి తెచ్చి, తీర్పు ఏకపక్షంగా వచ్చేలా చేసిందని మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీ ప్రభుత్వంతోపాటు తెలంగాణ ప్రభుత్వంకూడా బోర్డుకు ఫిర్యాదు చేసిందని, అయితే ఏపీ ఫిర్యాదు చేసిన 48గంటల్లో తీర్పు ఇచ్చిన బోర్డు తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదును మాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు.

వాస్తవానికి శ్రీశైలంలో ఏపీ ప్రభుత్వ హక్కు కేవలం 33 టీఎంసీలేనని, కానీ అనధికారికంగా 90టీఎంసీలు తీసుకుపోతోందని విమర్శించారు. 65 టీఎంసీలు వాడుకున్నట్లు వాళ్లే చెబుతున్నారని అన్నారు. దీనిపై బోర్డుకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని ఆరోపించారు. తెలంగాణ రైతుల కష్టాలు చూడకుండా తీర్పు ఇవ్వడం వెనుక పెద్ద ఎత్తున రాజకీయ ఒత్తిళ్లున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు, ఏపీ సీఎం చంద్రబాబు ఒత్తిడి తీర్పులో స్పష్టంగా కనిపిస్తున్నదని విమర్శించారు.

టీ బీజేపీ నేతల వైఖరేమిటి?


బోర్డు తీర్పుపై తెలంగాణ బీజేపీ నేతల వైఖరేంటని హరీశ్ ప్రశ్నించారు. తెలంగాణ పంటలను ఎండబెట్టే కేంద్రాన్ని సమర్థిస్తారా? కేంద్రాన్ని ఇప్పటికైనా ప్రశ్నించరా? అని నిలదీశారు. రైతులపై ప్రేమ ఉంటే తెలంగాణకు రావాల్సిన కరెంటు ఏపీ ఇచ్చేలా కేంద్రంద్వారా ఒత్తిడి తేవాలని అన్నారు. తెలంగాణకు 54% కరెంటు ఇవ్వాలని పార్లమెంట్ చెప్పినా ఏపీ అమలు చేయడం లేదని మంత్రి విమర్శించారు.

కేంద్ర జల సంఘం ఆదేశాల ప్రకారం జూలైనుంచి అక్టోబర్ 31వరకే శ్రీశైలం కుడికాలువ నీళ్లు వాడాలని, కానీ నవంబర్ వరకు గతంలో తీసుకుపోయారని అన్నారు. రివర్‌బోర్డు చైర్మన్ కేంద్ర జలసంఘంలో సభ్యుడని, జల సంఘం ఇచ్చిన ఆదేశాలను ఆయనే ఎలా ఉల్లంఘిస్తారని హరీశ్ నిలదీశారు. ఏపీ తప్పులను ప్రశ్నించని బోర్డు ఇలా తీర్పు ఇవ్వడం సరైంది కాదని అభ్యంతరం తెలిపారు. హంద్రీనీవాకు శ్రీశైలం నీటిని తరలిస్తుంటే బోర్డు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.

తెలంగాణ రైతులు అధైర్యపడొద్దు


తెలంగాణ రైతులు అధైర్యపడొద్దని మంత్రి హరీశ్‌రావు కోరారు. ఇతర రంగాలకు తగ్గించుకుని రైతులకు కరెంటు ఇస్తామని తెలిపారు. ఎంత ధర పెట్టయినాసరే బహిరంగ మార్కెట్లో కొని ఇస్తామని, రైతులకు నష్టం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

మంత్రి మాటలు ఆయన విజ్ఞతకే


తెలంగాణ రాష్ట్రం దరఖాస్తులేవీ తమ వద్ద పెండింగ్‌లో లేవని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెబుతున్న మాటలు అన్యాయమని హరీశ్ అన్నారు. ఇప్పటి వరకు ఆయనకు 30లేఖలు రాశామంటూ వాటిని మీడియాకు చూపించారు. సీఎం కేసీఆర్‌కూడా కలిశారని తెలిపారు. కేంద్రంలో వంద దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, అయినా వాటిని పరిష్కరించడం లేదని విమర్శించారు.

మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి లేఖ ఇచ్చారని తెలిపారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదులేవీ తమ వద్ద పెండింగ్‌లో లేవని మంత్రి అనడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణపై ప్రేమ ఉంటే తెలంగాణ ఎంపీలకు ఎందుకు మంత్రి పదవులు ఇవ్వలేదని ప్రశ్నించారు. సీనియర్ నాయకులున్నా ఎందుకు మొండిచెయ్యి చూపారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఐఏఎస్ విభజన ఫైలు ఐదునెలలుగా పెండింగ్‌లో ఉన్నా ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. ఈ ఫైల్‌ను పరిష్కరించడానికి కేవలం అరగంట సమయం సరిపోతుందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. చంద్రబాబుకు తాము సహకరిస్తున్నామని, అయితే ఆయనే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాడని విమర్శించారు.

3 టీఎంసీలే వాడుకోండి


-రాష్ర్టానికి కృష్ణాబోర్డు ఆదేశాలు
-రెండో తేదీ వరకే విద్యుత్ ఉత్పత్తి
-15న మళ్లీ సమీక్షిస్తామని వెల్లడి

శ్రీశైలం జలాల నుంచి నవంబర్ 2వ తేదీలోపు విద్యుత్ ఉత్పత్తికి మూడు టీఎంసీల నీటిని మాత్రమే వాడుకోవాలని కృష్ణా రివర్ బోర్డు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు రాష్ర్టాల వాదనలు, శ్రీశైలం రిజర్వాయర్‌లో ఉన్న నీటి నిల్వ, దీర్ఘకాలిక ప్రాతిపదికన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో సమగ్ర ఆపరేషన్ పద్ధతులు, ప్రస్తుతం ఉన్న విద్యుత్, నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఆదేశాలు జారీచేస్తున్నట్లు బోర్డు తెలిపింది. 
2వతేదీలోపు విద్యుత్ డిమాండ్ కూడా తగ్గుముఖం పడుతుందని పేర్కొంది. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి తెలంగాణ, ఏపీల మధ్య నెలకొన్న వివాదంపై బుధ, గురువారాల్లో బోర్డు సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. రెండు రాష్ర్టాల వాదనలు విన్న బోర్డు శుక్రవారం తన నిర్ణయాన్ని ప్రకటించింది.

అవసరమైతే నవంబర్ 15న మరోసారి కూడా ఈ అంశాన్ని సమీక్షిస్తామని పేర్కొంటూ చైర్మన్ ఆమోదంతో కేఆర్‌ఎంబీ చీఫ్ ఇంజినీర్ ఆర్‌కే గుప్తా పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో రెండ్రోజులుగా జరిగిన సమావేశాల వివరాలను పొందుపరిచారు. ఉత్తర్వుల్లో ఏమన్నారంటే..

ఇతర అవసరాలకంటే తాగు, సాగునీటికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి సూచించాలని గత నెల 21న ఏపీ ప్రభుత్వంనుంచి వచ్చిన నోట్ ప్రకారం కృష్ణా నదీ నిర్వహణ బోర్డు (కేఆర్‌ఎంబీ) అదేరోజున తెలంగాణ ప్రభుత్వానికి లేఖ ఇచ్చింది. ఇదే తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కూడా గత నెల 22న కేఆర్‌ఎంబీకి లేఖ ఇచ్చింది. సాగునీటి అవసరాలకు సమానంగా విద్యుత్ ఉత్పాదనను కూడా పరిగణించాల్సిన అవసరముందని, ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం తమకు రావాల్సిన కరెంటు వాటాను ఇవ్వని దరిమిలా ఇది మరింత కీలకమని ఆ లేఖలో స్పష్టం చేసింది.

ఈ మేరకు అక్టోబర్ 30న జలసౌధలో కేఈఆర్‌ఎంబీ రెండో సమావేశం జరిగింది. ఇందులో బోర్డు సభ్యులతో పాటు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావుకూడా పాల్గొన్నారు. రెండు రాష్ర్టాలకు సంబంధించిన జలాలు, విద్యుత్ అవసరాలను ఆయా రాష్ర్టాల ప్రతినిధులు సమావేశంలో వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమైన కరెంటు డిమాండ్ ఉందని, ఆ మేరకే శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి చేస్తున్నామని ఇంజినీర్ ఇన్ చీఫ్ తెలిపారు. ముఖ్యంగా పంటలను కాపాడుకోవటంలో భాగంగా నవంబర్ 2నుంచి శ్రీశైలం నుంచి ఎక్కువస్థాయిలో కరెంటు ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంటుందని, విద్యుత్ డిమాండ్ తగ్గేకొద్దీ ఉత్పత్తిని తగ్గించడంతో పాటు నాగార్జునసాగర్‌లో విద్యుత్ ఉత్పత్తి చేపడతామన్నారు.

తద్వారా కొంతకాలానికి శ్రీశైలంలో ఉత్పత్తి అనేది అవసరపడదని ఈఎన్‌సీ తెలిపారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో వివిధ రకాల భిన్న జీవోలు జారీ చేశారని, రాష్ట్ర విభజన దరిమిలా వాటిని సవరించాల్సిన అవసరముందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నదని స్పష్టంచేశారు. దీంతో బోర్డు అధికారులు దీనిపై ఒక సూచన చేశారు. ప్రస్తుతం ఉన్న నిర్వహణ మార్గదర్శకాల్లో ఎలాంటి మార్పులు చేయాలన్నా.. రెండు రాష్ర్టాల సంప్రదింపులతో సాగునీరు, ఇతర అవసరాలకు సంబంధించిన వివరాలపై సమగ్ర అధ్యయనం అవసరమని, దీనితో పాటు అవసరమైన వివరాలు లభ్యమై, నూతన మార్గదర్శకాలను రూపొందించే వరకు ప్రస్తుతం ఉన్న వాటిని రెండు రాష్ర్టాలు గౌరవించాలని బోర్డు సభ్యులు సూచించారు. ఇదే విషయాన్ని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పార్టు-9లోని పేరా 85(8)లో పొందుపరిచినట్లు చెప్పారు.

జులై 10న జరిగిన కృష్ణా నది నిర్వహణ బోర్డు తొలి సమావేశంలోనూ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించినట్లు తెలిపారు. రెండు రాష్ట్రాలు వివరాలు సమర్పించాల్సిందిగా పలుమార్లు కోరినప్పటికీ అది ఇంకా పెండింగులోనే ఉందన్నారు. రెండు రాష్ర్టాలకు సంబంధించిన నీటి అవసరాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ... జూన్ 2 నుంచి ఇప్పటివరకు జూన్ 24, జులై 11, ఆగస్టు 4న ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లు తెలిపారు. తాగు, సాగునీటికి ఇబ్బంది లేకుండా విద్యుత్తు ఉత్పాదన చేపట్టాల్సిందిగా గత నెల 21న జారీ చేసిన బోర్డు లేఖలో స్పష్టం పేర్కొన్నామని అధికారులు తెలిపారు.

లేనట్లయితే ఈ సీజన్‌లో తాగు, సాగునీటి ఇబ్బందులు వస్తాయని తెలిపినట్లు చెప్పారు... అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెండువైపులా వాదనలు విన్న తర్వాత ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకొని ఈనెల రెండో తేదీ వరకు మూడు టీఎంసీల వరకు నీటిని విద్యుత్తు ఉత్పాదనకు వాడుకోవచ్చనే నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!     జై జై తెలంగాణ!