గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, మే 31, 2015

నువ్వు సృష్టించిన సంపదను ఎవరి చేతుల్లో పెట్టావు బాబూ?


నీ సంపద సృష్టికి ప్రజల చేతుల్లో వనరులు పెట్టాలి. చెరువులు బాగుచెయ్యాలి. పొలాలకు నీరివ్వాలి. విద్యుత్ ఉత్పత్తి పెంచాలి. సంపద పెరగాలి. కానీ అది సమాజ సంపద కావాలి. సంపద పెరగాలి కానీ అది ప్రజల కోసం పెరగాలి. ప్రజల పరం కావాలి. అంతేకానీ విసిరేస్తే రాలే గింజలు కాదు. జనమంటే అడుక్కుతినేవాళ్లో నువు పారేసింది ఏరుకు తినే వాళ్లో కాదు. సృష్టించింది చాల్లే గానీ, అది కరిగి జనంలోకి ప్రవహించే...
చిత్తశుద్ధి చూపియ్యండి బాబు గోరూ!
చేతి మంత్రదండముతో ఎంతెంత సంపద సృష్టించినావు బాబూ. దొర గారూ. దొరలబాబుగారూ. సంపద. ఎటుచూసినా సంపద. కళ్లు తిరిగిపోయే సంపద. మల్టీ ప్లెక్సులు, మెగామాల్‌లు, రిసార్టులు, గోల్ఫ్‌లు, నోవోటెల్‌లు, పబ్బులు కళ్లు మబ్బులు పట్టే ప్లేబోయ్ క్లబ్బులు. క్లబ్బుల్లో మెరుపువెలుగుల మసకచాటు జీవితాలు. రోడ్డు మీద బియండబ్ల్యులు, పార్టీ ఆఫీసుల ముందు పోర్ష్‌కార్లు, కాఫీ షాపుల ముందు కిడ్స్ పార్క్ చేసే మినీ కూపర్‌లు. ద్యావుడా... ఏం సంపదరా బాబూ. వర్టిగో వచ్చి కళ్లు తిరిగేంత సంపద. ఈ భోగభాగ్యవైభవ చంద్రిక గురించి ఒక చిన్న ప్రశ్న వేసుకొని బ్రేక్ తీసుకుని, బ్రీత్ తీసుకుని మరిన్ని వివరాల్లోకి వెళ్దాం. కొంచెం వాటర్ తాగండి.
సంపద సృష్టించా! అనే మహానాటి ప్రకటన చూసి ఆ స్థాయిలో కాకపోయినా ఏదో మనకున్నంత బుర్రలో ఓ చిన్నప్రశ్న మొలిచింది. అదేమనగా....ఎవరి చేతిలో?. ఈ అనంత సంపద. షాంపేన్ నురగలా ఆగకుండా పొంగే సంపద ఎవరి చేత ఎవరి కోసం ఎలా సృష్టించబడింది. దాన్ని అనుబగిస్తున్న రాజాలెవరు. ఈ సంపద గుట్టలు పెరిగి పెద్దయిపోతుండగా వాటివైపు ఆశగా తలెత్తి చూస్తూ మిగి లిపోయే బతుకులెవరివి.

ఓ సీను. మీరే ఇమేజిన్ చేసుకోండి. ఒకాయన. సకల సిరిసంపదలతో ఊగితూ లిసోలిపోయేటాయన. 
ఆయన తనకు చవగ్గా దొరికిన భూములు, ఫీజు లేకుండా దొరికిన లైసెన్సులు, భారీగా దొరికిన రాయితీల ద్వారా వచ్చిపడిన సంపద లోంచి కొంత తీసి ఇంట్లో జలపాతం కట్టుకున్నాడు. దాని నుంచి ఫోర్సుగా ఎగసిపడ్డ నీటి తుంపరలు ఆయన ఇంటి గోడవతల నివాసముంటున్న గుడిసెవాసుల మీద కూడా పడ్డాయి. వారు నాలుకలు బయటపెట్టి నిలబడితే వారి దాహం తీర్చాయి. దీన్ని ట్రికిల్ డౌన్ అంటారు. సృష్టించబడిన జలసంపద ఎంత ఎక్కువైతే నాలుకలు చాచి దాహం దాహం అంటున్న వారి గొంతు అంత ఎక్కువగా తడుస్తుంది.

రాశుల రాశుల సంపద నాటి నైజాము సర్కరోడికీ ఉంది. నేటి సుభ్రతో రాయ్‌కీ ఉంది. బ్రూనే సుల్తాను వరకూ ఎందుకు సుజనులు, నానీలు, జగనులు, మాట్రిక్సులు, గాలి రామలింగడులు...వీరందరికీ సంపద ఉంది. భారతదేశములో వలే తెలుగు రాజ్యాలలో కూడా గత ఇరవై ఏళ్లలో నియోరిచ్ బాబులు పుట్టలు పుట్టలుగా పెరిగారు. సంపద పెంచుకున్నారు. ఆర్థిక అసమానతలు గత ఇరవై ఏళ్లకాలంలో రెండొందల శాతం పెరిగాయి. ఉన్నోడికీ లేనోడికీ మధ్య దూరం కొన్ని కాంతి సంవత్సరాలంత పెరిగిపోతున్నది. కనుక, సంపద నిజం. కానీ, అది రాను రానూ కొందరిచేతిలోనే పేరుకుపోతున్నది. ఇది చేదునిజం.

ప్రపంచబ్యాంకు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వాల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్- ఎవరి లక్ష్యమైనా ఒకటే. సంపద సృష్టించడం. పెద్ద కెరటం వచ్చినపుడు అన్ని పడవలూ పైకి లేస్తాయని చెప్పడమే ఆ విధాన సారాంశం. మొదట చంద్రబాబూ ఆపై రాజశేఖరరెడ్డి సంపద సృష్టి సిద్ధాంతాన్ని బాగా నమ్మారు. ఒకోసారి వాళ్లు తెలియక నమ్మారేమో అని కూడా అనుమానం వచ్చేది. కానీ మొన్నటి మహాప్రకటనతో ఆ అనుమానం పోయింది. కార్పొరేట్ ఆసుపత్రుల యజమానులు వైద్యమంత్రులూ కార్పొరేట్ కళాశాలల యజమానులు విద్యామంత్రులూ అవుతున్న వైనం చూసినా రాజధాని నిర్మాణంలో ఎంచుకున్న విధానం చూసినా, సంపద సృష్టి మోజు ఎంత పీక్‌లో ఉందో వెర్రీవీజీగా అర్ధమైపోతుంది.

ఉన్నతాదాయ వనరులకూ వ్యాపారులకూ కల్పించే ఆర్థిక ప్రయోజనాలు, తద్వారా పోగుపడే సంపదలు పరోక్షంగా సమాజంలోని పేదవర్గాలకు మేలు చేస్తాయని ఒక వాదన. ఇదే ట్రికిల్ డౌన్. మహామాంద్యం కాలంలో విల్‌రోజర్స్ అనే ఒక అమెరికన్ వ్యంగ్యవ్యాఖ్యాత కాయిన్ చేసిన పదమిది. ఇది వాడుకున్నోడికి వాడుకున్నంత. ట్రికిల్ డౌన్ సిద్ధాంతం అధికారికంగా ఒక అర్ధశాస్త్ర పారిభాషికపదం కాకపోయినా, కేపిటలిస్టు రాజకీయాలు ఈ కాన్సెప్టును బాగా వాడుకున్నాయి. సంక్షేమపద్దులపై కోతలు విధించడానికి ధనికులకు కార్పొరేట్లకు మేళ్లు చేసే రాయితీలు కల్పించడానికి, కేటాయింపులు జరపడానికీ ఇదొక బహానాగా పనికొచ్చింది. పనికొస్తూనే ఉంది. దురదృష్టవశాత్తూ ఇదొక విఫల విధానమనీ, దీని ఫలితాలు వ్యతిరేక ప్రభావాన్ని చూపించాయనీ అనేక ప్రభుత్వాల అనుభవం నిరూపించింది. అయినంక కూడా సంపద సృష్టి నినాదం ప్రవచిస్తున్నారంటే, దాని వెనుక వర్గప్రయోజనాన్ని చూడాల్సిరాక తప్పదు తమ్ముళ్లూ.

నిజానికి ఇది చాలా పాతది. అమెరికాలో పంతొమ్మిదో శతాబ్దం కాలంలోనే దీన్ని పరీక్షించారు. దాన్నే హార్స్ అండ్ స్పారో సిద్ధాంతమని వెటకరించారు. గుర్రా నికి బాగా గుగ్గిళ్లు తినిపిస్తే అది రోడ్డు మీద విసర్జించే ఫీకల్ మేటర్‌తో కాకులకు ఆహారం దండిగా దొరుకుద్దని దాని సారము. ఏం చేస్తే ఏం. మార్కెట్ లేవాలి. ఎవరు మునిగినా. కార్పొరేట్ల మీద పన్నుభారం తగ్గించి వాళ్ల లాభాలు పెంచితే ముందుగా అవి ఉద్యోగులకిచ్చే జీతాల్లో రిఫ్లెక్టవుతాయనే ఆశతో (ఆశపెట్టి) పాతికేళ్ల క్రితమే రీగనామిక్స్ పెట్టుబడిదారీ దేశాలను ఆకర్షించాయి. రీగన్ అడ్మిన్‌లో బడ్జెట్ ఎడ్వయిజర్ డేవిడ్‌స్టాక్‌మన్ ఆలోచన ఇది. కానీ, కొంతకాలానికి ఆయనే ఈ విధానం ప్రయోజనం మీద అనుమానంలో పడిపోయాడు.

అయినా ఆ తర్వాత మార్గరెట్ థాచర్‌తో సహా ఎంతోమంది దేశాధినేతలు ఆ మార్గంలో నడిచారు. ఒబామా బెయిలవుట్లు ఈ సిద్ధాంతం వెలుగులోవే! గత కొన్ని దశాబ్దాలుగా వాస్తవిక అర్థంలో ఉద్యోగకల్పన తరిగిపోతున్నది. నిజ వేతనాలు తరిగిపోతున్నవి. దీనంతటికీ కారణం ఈ విధానాల కారణంగా సంపద కొద్దిమంది దగ్గర కేంద్రీకృతమైపోవడం. 2012లో టాక్స్ జస్టిస్ నెట్‌వర్క్ జరిపిన అధ్యయనం ఇలాంటి సంపదసృష్టివాదుల నెత్తిన ఒకటి పీకింది. సూపర్‌రిచ్ చేతుల్లో పోగుపడ్డ సంపద నుంచి బొట్లేమీ కారడం లేదనీ, నిజానికి ఆ అపార సంపదంతా టాక్స్ హెవెన్స్‌లో దాచి పెట్టడమో నిజమైన డిక్లరేషన్స్ నుంచి తప్పించుకోవడమో జరిగింది కానీ, ఆయా దేశాల ఆర్ధిక వ్యవస్థలకు తద్వారా పేదలకూ ఒరిగిందేమీ లేదని క్లియర్ పిక్చర్ తేల్చేసింది. ఏ సూచిక చూసినా ప్రపంచవ్యాప్తంగా ధనికులకూ పేదలకూ మధ్య అంతరాలు శరవేగంగా పెరిగిపోతున్నాయేగానీ, ఎక్కడా తగ్గడం లేదని చెబుతూనే ఉన్నాయి.

సాటి అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇండియాలో ఈ అంతరం మరీ ఎక్కువ. అది పెరుగుతున్న వేగం ఎక్కువ. ఈ అంతరాలు ఇదే వేగంతో సాగితే ఈ సంపద మరింత వారి చేతిలో పోగుపడటం ఖాయం. అభివృద్ధీ అది పోగుచేసిన సంపదల్లో భూమిపుత్రులకు భాగం దొరకనపుడే పోరాటాలు రగులుతాయి. లాటినమెరికా నుంచి తెలంగాణ వరకూ రుజువైంది ఇదే. బాబు గారిలాంటోళ్లు నేర్చుకోలేని పాఠమూ ఇదే.

చంద్రబాబు వంటి నేతలు రాష్ర్టాల్లోనూ, మోడీగారు దేశంలోనూ కార్పొరేట్ల రుణం తీర్చుకునే పనిలో ఈ సంపద సృష్టి సిద్ధాంతపు దొంగజపం చేస్తున్నారు. చంద్రబాబు విధానాలు ఈపాటికే సంపదను కేంద్రీకృతం చేశాయి. ఆయన హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో నియోరిచ్‌లు విపరీతంగా పెరిగిపోయారు. వాళ్లే ఆ తర్వాత రకరకాల స్కాముల్లో ఆర్థికనేరాల్లో నిందితులయ్యారు. సింగపూర్‌లు కడతారు సరే ఆ ఆకాశహర్మ్యాల్లో నివసించేదెవరు? ఆ రహదారులపై రివ్వున దూసుకుపోయే ఖరీదైన కార్లెవరివి? సంపద సృష్టించా అంటూ-ఆయన డబ్బా కొట్టకోడమూ, వీళ్లు తాటికాయ లైన్లు బేనర్ పెట్టడమూ. హుహ్.

సంపద సృష్టికి ప్రజల చేతుల్లో వనరులు పెట్టాలి. చెరువులు బాగుచెయ్యాలి. పొలాలకు నీరివ్వాలి. విద్యుత్ ఉత్పత్తి పెంచాలి. సంపద పెరగాలి. కానీ అది సమాజ సంపద కావాలి. సంపద పెరగాలి కానీ, అది ప్రజల కోసం పెరగాలి. ప్రజల పరం కావాలి. అంతేకానీ విసిరేస్తే రాలే గింజలు కాదు. జనమంటే అడుక్కుతినేవాళ్లో, నువు పారేసింది ఏరుకునే వాళ్లో కాదు. సృష్టించింది చాల్లే గానీ, అది కరిగి జనంలోకి ప్రవహించే చిత్తశుద్ధి చూపియ్యండి బాబు గోరూ! ఆఫ్టర్ ఆల్ మనది 20 కోట్ల మందికి తిండే దొరకని దేశం.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!



శనివారం, మే 30, 2015

భారతంలో శకుని ఏనాడైనా లోకకళ్యాణం కోరాడా?


మాయాదర్పణం ముందు నిలబెడితే శకునికి లోకకల్యాణం కనిపించదు. అబద్ధాలకోరుకు హరిశ్చంద్రుడు కనిపించడు. వక్రదృష్టి కలవాడికి రుజుమార్గం కనిపించదు. ఆంధ్రజ్యోతికి, దాని అధిపతి రాధాకృష్ణకు తెలంగాణ విషయంలో ఎప్పుడూ మంచి కనిపించదు. మంచి వినిపించదు. హుస్సేన్‌సాగర్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలొకటి. ఆంధ్రజ్యోతి రాసిందొకటి. హుస్సేన్‌సాగర్‌ను ఖాళీ చేయడంపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరిస్తే, అబద్ధాలకు అలవాటైన ఆంధ్రా జ్యోతి యథావిధిగా సుప్రీంకోర్టు హుస్సేన్‌సాగర్‌ను ఎండగొట్టొద్దు అని ఆదేశించినట్టుగా రాసింది. అంతేకాదు హుస్సేన్‌సాగర్‌లో ఏం జరుగుతున్నదో చూసిరావడానికి వెళ్లాలని గ్రీన్ ట్రిబ్యునల్ నిపుణులను ఆదేశించింది. 



rk

ఇవేవీ తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ఆదేశాలు కాదు. కోతికి కొబ్బరికాయ దొరికితే ఎగురుతుంది. ఆంధ్రజ్యోతికి తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ దొరకకపోయినా ఎగురుతుంది. ఆ పత్రికకు తెలంగాణలో ప్రతిదీ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనిపిస్తుంది. తెలంగాణ ప్రశాంతంగా ఉంటే రాధాకృష్ణకు పూనకం వస్తుంది. తెలంగాణకు సమస్యలు లేకపోతే ఆయన కుతకుత ఉడికిపోతాడు. అన్నీ తలకిందులుగా, వంకరగా కనిపించే అసాధారణ చిత్తభ్రాంతి ఏదో ఆయనను వెంటాడుతున్నది. అందుకే రాధాకృష్ణ తెలంగాణ విషయంలో ఏ మంచినీ భరించలేకపోతున్నాడు. ఇక్కడ రుణమాఫీ జరిగితే.. మిగులు బడ్జెట్ కదా అని ఏడుస్తాడు. ఇక్కడ రెండు లక్షల ఇండ్లు నిర్మించి ఇస్తామంటే డబ్బులెక్కడివి అంటాడు. కొత్త సచివాలయమంటే గుండెలు బాదుకుంటాడు. ఆకాశహర్మ్యాలు అంటే గాలిలో మేడలు అంటాడు. 

అవి ఎలా సాధ్యం కావో కథనాల మీద కథనాలు వండి వార్చుతాడు. ఇవాళ రాధాకృష్ణ తెలంగాణ మీద ద్వేషంతో అన్ని హద్దులూ చెరిపేశాడు. బరితెగించేశాడు. "....న భయం న లజ్జ". ఏకంగా సుప్రీంకోర్టు ఆదేశాలకే వక్రభాష్యం పలికాడు. కోర్టు ఇవ్వని ఆదేశాలను తన పత్రికలో, మీడియాలో రాసుకుని సంబర పడ్డాడు. తమ మీడియా పచ్చి అబద్ధాలకోరని తనకు తానే ఎలుగెత్తి చాటుకున్నాడు. ఇతర పత్రికల్లో వచ్చిన సదరు వార్త చూసి ముక్కున వేలేసుకోవడం పాఠకుల వంతైంది. సాంస్కృతిక సారథి మీద రాధాకృష్ణ జుగుప్సాకరమైన రాతలతో తనలోని అపరిచితుడిని బహిరంగ పరుచుకున్నాడు. రాధాకృష్ణ అబద్ధాలు అచ్చొత్తడం ఇది మొదలు కాదు. మొన్నటికి మొన్న రాధారాజా రెడ్డి దంపతులకు రవీంద్రభారతిలో అనుమతి నిరాకరణ అంటూ గగ్గోలు పెట్టాడు. తెలంగాణ కళాకారులకు అన్యాయం అంటూ విషకథనాలు రాశాడు. ఖర్మగాలి.. ఆ దంపతులు లైవ్‌లోకే వచ్చి రాధాకృష్ణ వైఖరిని ఏకి పారేశారు. సరే తెలంగాణ వచ్చినప్పటినుంచి ఇలా ఎన్ని అబద్ధాల కథనాలు రాశాడో చెప్పడం చర్విత చరణమే అవుతుంది. ఏ ఒక్కటీ ఏనాడూ వాస్తవ రూపం దాల్చింది లేదు.


టార్గెట్ కేసీఆర్..

కేసీఆర్ మీద ఆయన కుమ్మరించిన విషానికి అంతే లేదు. మొన్నటికి మొన్న కొత్తపలుకులో రాధాకృష్ణ ఏడుపు వర్ణించనలవి గాదు. ఆయన దృష్టిలో కేసీఆర్ బస్తీల పర్యటన కేవలం ప్రజలను భ్రమల్లో ముంచేయడానికే. కేసీఆర్ ఎత్తుగడలను ప్రతిపక్షాలు అర్థం చేసుకోలేకపోతున్నాయని వారి తరఫున తానే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రతిపక్షాలు కేసీఆర్ వలలో పడడంతో కేసీఆర్‌కు రాజకీయ లబ్ధి చేకూరుతుందని బాధ పడ్డాడు. అలా వలలో చిక్కుతున్న వాళ్లు నిన్నా మొన్నా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు కాదు. ఘటనాఘటన సమర్థులైన కాంగ్రెస్ నాయకులు. తిమ్మిని బమ్మిని చేసే మీడియా అండ ఉన్న టీడీపీ నాయకులు. వీళ్లు నోట్లో వేలేసుకున్న వాళ్లుగా రాధాకృష్ణకు కనిపిస్తున్నారు. సరే వారి ఖర్మకు వాళ్లని వదిలేద్దాం. ఇక రాధాకృష్ణ మరో ఆరోపణ ఏమిటంటే కేసీఆర్ అనేక పథకాలు ప్రకటిస్తారు తప్ప ఆచరణకు రావట. 

అలా ప్రకటన ఇచ్చి వివాదం చేసి వదిలేయడం కేసీఆర్ జాణతనమట. కొత్త సచివాలయం ప్రతిపాదన ఉత్తుత్తిదేనట. మరి...
  • సదరు సచివాలయం కోసం ప్రభుత్వం రూ.150 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇవ్వడం కూడా ఉత్తుత్తిదేనా?
  • చెస్ట్ హాస్పిటల్ స్థలాన్ని బదిలీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు కూడా ఉత్తుత్తివేనా?
  • హైకోర్టులో సచివాలయ నిర్మాణానికి అనుకూలంగా వాదించడం ఉత్తుత్తిదేనా?
  • అసలు రూ.150 కోట్లు నిధులే ఇచ్చినపుడు కొత్త భవనాలు కట్టడం కష్టమా?
...అనేది రాధాకృష్ణ విజ్ఞతకే వదిలేయాలి. పోనీ రాధాకృష్ణకు ఉత్తుత్తిగా కనిపించి ఉందనుకుందాం. మరి పాత సచివాలయం ఎంత పవిత్ర ప్రదేశమో.. దాన్ని తరలిస్తే రాష్ర్టానికి, దేశానికి వీలైతే ప్రపంచానికి ఎంత నష్టం వాటిల్లుతుందో చిలవలు పలువలు చేస్తూ చంద్రజ్యోతి నిండా పుంఖానుపుంఖాలు కథనాలు ఎందుకు వడ్డించినట్టు? ఉత్తుత్తిదే అయినపుడు అయ్యేదా పొయ్యేదా అని ఊరుకోవచ్చు కదా. ఇదే మాటను మిత్రుడు చంద్రబాబుకు చెప్పి టీడీపీ నాయకులకు ఆయాసం తప్పించి ఉండవచ్చు కదా! పోసే నిప్పులన్నీ పోసి ఇపుడు నంగనాచి మాటలు!


ఇండ్లపై నిప్పులు..

ఇక ఉస్మానియా యూనివర్సిటీ గురించి ఆయన రాసిన రాతలు మరీ విచిత్రం. ఆయన రాతలు చదివిన వారు కొంపదీసి రాజధానిలోని పేదల ఇండ్లన్నీ ఉస్మానియాలోనే కడుతున్నారా? అనే అనుమానానికి రాక తప్పదు. ఎందుకంటే ఉస్మానియాలో ఇండ్లు అని కేసీఆర్ కావాలనే ప్రకటన చేసి వివాదం రేపారని, తర్వాత ప్రతిపక్షాలు అడ్డు చెబుతున్నాయంటూ ఇండ్ల నిర్మాణాలన్నీ ఆపేస్తారని భవిష్యవాణి అనుగ్రహించారు. కానీ అసలు విషయం ఏమిటంటే ఒక్క పార్సీగుట్ట పేదలకు మాత్రమే ఉస్మానియాలో ఇండ్లు కడతామని కేసీఆర్ చెప్పారు. 


అదికూడా సదరు బస్తీలో ఎక్కడా అంగుళం జాగా లేకపోవడం వల్ల. ఉస్మానియా ఆ పక్కనే ఉండడం వల్ల. నిజానికి కేసీఆర్ అనేక బస్తీల్లో ఇండ్ల నిర్మాణాలకు హామీ ఇచ్చారు. కొన్ని చోట్ల అక్కడే స్థలం ఉంది. మరికొన్నిచోట్ల ఇతర ప్రదేశాల్లో చూస్తున్నారు. హమాలీ బస్తీలో అక్కడే స్థలం ఉంది. అక్కడే కడతామని చెప్పారు. ఖైరతాబాద్‌లోనూ బస్తీలో స్థలం ఉంది అక్కడే కడతామన్నారు కానీ ఉస్మానియాకు తీసుకుపోతాననలేదు. అలాగే మొత్తం రెండు లక్షల ఇండ్లు బంజారాహిల్స్‌లో కట్టిస్తామని కేసీఆర్ అనలేదు. ఎక్కడి బస్తీలో అక్కడే పేదలకు ఇండ్లు కడతాం.. బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో కూడా బస్తీ పేదలకు అక్కడే ఇండ్లు కడతామని అన్నారు. కేసీఆర్ అనని మాటలు నోట్లో దూర్చడం సీమాంధ్ర మీడియాకు ఇది కొత్తకాదు.


నాలుక తిప్పేసి..

ఇక నిన్నటిదాకా తెలంగాణకు మిగులు అంటూ కన్నీళ్లు పెట్టుకున్న రాధాకృష్ణ ఇవాళ ఇండ్ల విషయానికి వచ్చేసరికి డబ్బులెక్కడున్నాయి? అంటూ దబాయిస్తున్నాడు. రూ.20 వేల కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేసే ప్రభుత్వానికి రెండు లక్షల ఇండ్లకు నిధులు సమకూర్చుకోవడం అసాధ్యమా? విద్యుత్ విషయంలోనూ ఇలాగే అవహేళనలు చేసిన వారున్నారు. కానీ విద్యుదుత్పత్తికి లక్ష కోట్లు, మిషన్ కాకతీయకు, వాటర్ గ్రిడ్ పథకానికి వేల కోట్లు సమకూర్చుకున్న అనుభవం కండ్ల ముందరే ఉంది. ప్రభుత్వం ఎలాంటి ఇండ్లు కట్టగలదో ఐడీహెచ్ కాలనీ సజీవ సాక్ష్యంగా కూడా సిద్ధంగా ఉంది. 


అసలు విషయం జీహెచ్‌ఎంసీ..

అన్నీ అయ్యాక ఆఖరుకు అసలు విషం కక్కేశాడు రాధాకృష్ణ. కేసీఆర్ ఇదంతా కేవలం జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం చేస్తున్నారట. అందుకే మోదీ స్వచ్ఛ భారత్ అన్నపుడు పట్టించుకోకుండా ఇపుడు రంగంలోకి దిగారట. ఇంకా చాలా చాలా రాశారు. కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన తొలి సమీక్షా సమావేశం హైదరాబాద్ నగరంపైననే అనే విషయం రాధాకృష్ణ మరిచిపోయి ఉండవచ్చు. వర్షాకాలం వస్తున్నందున వర్షపునీటి సమస్య, ట్రాఫిక్ సమస్యలపై కేసీఆర్ సుదీర్ఘ సమావేశాలు నిర్వహించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పం వెల్లడించింది కూడా అపుడే. అపుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు లేవు. అసలు పాత పాలకవర్గం పదవీకాలం కూడా పూర్తి కాలేదు. ఎంఐఎం ఆధ్వర్యంలో పాలక వర్గం కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ అభివృద్ధిపై ఆ తర్వాత అనేక ప్రణాళికలను ప్రకటిస్తూ వచ్చారు.


నగరంలో పోలీస్ వ్యవస్థ పటిష్టం.. లక్ష సీసీ కెమెరాల ఏర్పాటు, జీపీఎస్ వ్యవస్థ కలిగిన వాహనాల పంపిణీ, కమాండ్ కంట్రోల్ రూం ప్రతిపాదన అన్నీ ఆ కార్యక్రమంలో భాగంగా వస్తున్నవే. సిగ్నల్ ఫ్రీ ట్రాఫిక్ కావచ్చు.. హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన కావచ్చు.. ఆ జలాశయం వద్ద ఆకాశహర్మ్యాల నిర్మాణం కావచ్చు.. మెట్రో విస్తరణ కావచ్చు! ఇవన్నీ పాత పాలకవర్గం ఉన్నకాలంలోనే జరిగాయి. గురుకుల్ భూముల ఆక్రమణల తొలగింపుకూడా అపుడే జరిగింది. ఆక్రమణల కూల్చివేతలు ఆపాలని పాలకవర్గం తీర్మానించింది కూడా. ఆ క్రమంలోనే మూసీ వెంట పార్కుల నిర్మాణం కోసం విహంగ వీక్షణ, మోండా మార్కెట్ సందర్శన, రవీంద్రభారతికి నూతన భవనం, కళాభారతి భవనం, ఉస్మానియా దవాఖానలో జంట టవర్ల ప్రతిపాదన.. ఇలా అనేక పథకాలు పరంపరగా చర్చిస్తూనే వస్తున్నారు. నిరంతర విద్యుత్ సరఫరా, ఐడీహెచ్‌లో ఇండ్ల నిర్మాణాలు కొలిక్కి వచ్చి, ప్రజల్లో ప్రభుత్వం మీద భరోసా కలిగిన తర్వాతే సీఎం బస్తీల పర్యటనలు చేపట్టారు. కానీ రాధాకృష్ణకు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగబోతున్నాయి కాబట్టి కేసీఆర్ పర్యటించినట్టుగా కనిపిస్తున్నది.


శవం చెవిలో రామరామ..

సరే సీఎం పర్యటిస్తున్నారు. హామీలు ఇస్తున్నారు. రూ.200 కోట్లు వ్యయం చేసి అనేక తక్షణ సమస్యలు పరిష్కరిస్తున్నారు. రాధాకృష్ణకు నొప్పేమిటి? అక్కడే ఉంది కీలకం. రాష్ట్రంలో టీడీపీ పాడెమీద ఉంది. శవం తరలించే సమయంలో అక్కడక్కడా కిందికి దింపి చెవిలో రామరామ చెప్తారు. ఏమో చనిపోయిన వాడు గొంతుకలిపి లేస్తాడన్న ఆశ! ఇపుడు రాధాకృష్ణ గ్యాంగుకు సదరు ఆశ జీహెచ్‌ఎంసీ రూపంలో ఉంది. ఈ ఎన్నికల్లో నగరంలోని సీమాంధ్రుల ఓట్లతో టీడీపీ లేచి నిలుచుంటుందని బాబు పరివారం గాఢంగా నమ్ముతున్నది. 


ఇక్కడ ఊపిరి పోసుకుంటే దీన్ని షో చేసి తెలంగాణలో విజృంభించాలనేది వారి ఎత్తుగడ. నగరంలో టీఆర్‌ఎస్‌కు పునాది లేదని వారు గాఢంగా విశ్వసిస్తున్నారు. కానీ కేసీఆర్ పర్యటనలు పరిస్థితిని తారుమారు చేస్తున్నాయి. అందుకే రాధాకృష్ణ ఠారెత్తిపోతున్నాడు. ఎందుకంటే తెలంగాణలో టీడీపీకి ఇది చివరి అవకాశం. ఈ ఎన్నికల్లో ఉనికి చాటుకోకపోతే తెలంగాణలో ఈ పార్టీలో ఇక ఎవరూ మిగలరు. అందుకే కేసీఆర్ దూసుకుపోతున్న తీరు బస్తీల్లో ఆయనకు లభిస్తున్న ఆదరణ రాధాకృష్ణ కంటి మీదనిద్ర లేకుండా చేస్తున్నది. ’మరుండవన్ కణ్ణుక్కు.. ఇరుండ దెల్లామ్ పేయ్’ అని తమిళంలో ఓ సామెత ఉంది. అంటే ’ధైర్యం లేనివాడికి అన్నీ దయ్యంలాగే కనబడతాయ’. ఇపుడు రాధాకృష్ణదీ అదే పరిస్థితి!
- సవాల్‌రెడ్డి


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


శుక్రవారం, మే 29, 2015

ఇదీ...మన తెలంగాణ సంస్కృతి అంటే...!!!


తెలంగాణ ప్రజలది మూలవాసి సంస్కృతి. ఆది మానవుడు నడయాడిన దశ నుంచి, ఆధునిక నాగరికత వరకు తెలంగాణ ప్రజల మత విశ్వాసాలు, ఆచార వ్యవహారాల్లో వైవిధ్యం, విభిన్నత చోటుచేసుకున్నది. నాగార్జున కొండ, ఏకశిలా నగరాల బౌద్ధ ఆరామాలను బట్టి, ఇక్కడ బౌద్ధమతాన్ని ప్రజలు పెద్ద మొత్తంలో ఆదరించారనే విషయం అర్థమవుతుంది. బౌద్ధుల తర్వాత, జైనమతం తెలంగాణలో అడుగుపెట్టింది. నల్లగొండ, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో జైన మతానికి సంబంధించిన, అనేక ఆనవాళ్లు తవ్వకాల్లో బయటపడ్డాయి. భువనగిరి సమీపంలోని కొలను పాక జైన మందిరాన్ని ప్రజలు విస్తృతంగా సందర్శిస్తుంటారు. 

బౌద్ధ, జైన మతాల తర్వాత, ఉత్తర భారతం నుంచి వచ్చినది ముస్లిం మతం. పాలకులుగా ముస్లింలు సుమారు నాలుగువందల ఏళ్ల పాటు పాలించడం వల్ల ఇక్కడి సంస్కృతిలో మార్పులు చోటుచేసుకున్నాయి. అలాగే ఉర్దూ పాలనాభాష కావడం కారణంగా విద్యా, ఉద్యోగ అవకాశాల కోసం కొంతమంది ఇస్లాంమతాన్ని స్వీకరించారు. ముస్లిం పాలనలోనే క్రైస్తవ, సిక్కు, పార్సీ తదితర మతాలు కూడా, తెలంగాణ నేలపైన అడుగుపెట్టాయి.ఇలా భిన్నమతాల సంగమంగా తెలంగాణ సంస్కృతి పేరుగాంచింది.
తెలంగాణ అనగానే గుర్తొచ్చే బతుకమ్మ, బోనాలు మొదలైన పండుగలు తెలంగాణ ప్రత్యేకతను నిలబెడుతున్నాయి. ఈ పండుగలను మిగిలిన ఏ ప్రాంతంలోనూ జరుపుకోరు. అలాగే పువ్వులతో పండుగ చేసుకునే చరిత్ర ప్రపంచంలో మరెక్కడా కానరాదు. తెలంగాణ ప్రజలు ఎంతటి ప్రకృతి ఆరాధకులో బతుకమ్మ పండుగను చూస్తే అర్థం అవుతుంది. శ్రమలో భాగంగా ప్రకృతిని పూజించే సంస్కృతి తెలంగాణలో ఇప్పటికీ కనిపిస్తుంది. బతుకమ్మ తర్వాత తెలంగాణలో పెద్ద పండుగ దసరా. నిజానికి దసరా పండుగ దేశమంతటా జరుపుకునేదే అయినప్పటికీ, తెలంగాణలో జరుపుకునే తీరులో వైవిధ్యమున్నది. పండుగను సద్దులు, దసరా, పిల్ల దసరా పేర్లతో మూడు రోజుల పాటు జరుపుకుంటారు. ఏ పండుగైనా ఒక్కరోజు, రెండురోజులో ఉంటే, దసరా మాత్రం తెలంగాణలో మూడు రోజుల పాటు జరుపుకుంటారు. దసరా రోజు తెలంగాణ ప్రజలు పాలపిట్టను చూడడానికి పొలాల్లోకి వెళతారు. తప్పనిసరిగా పాలపిట్టను చూడాలనే ఆచారం ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నది. అలాగే దసరా నాటి సాయంత్రం, జమ్మి ఆకు పంచుకొని, పెద్దల ఆశీర్వాదాలు అందుకుంటారు. 
హిందూ ముస్లిం సోదరత్వానికి చిహ్నంగా దర్గా, ఉర్సు ఉత్సవాలు జరుపుకుంటారు. ఇందులో భాగంగా పీరీల పండుగను కూడా తెలంగాణలో ఘనంగా జరుపుకుంటారు. అలావ సుట్టూ అడుగులు వేస్తూ..పాటలు పాడుకుంటారు. దసరాతో పాటు ఉత్తర భారతీయుల వలసతో తెలంగాణకు వచ్చిన పండుగ హోళీ. ఇది తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుకొని ముఖ్యపట్టణాల వరకు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. బతుకమ్మ, హోళీ పండుగలపై ప్రత్యేకంగా పాటలు కూడా రూపొందించుకున్నారు ఇక్కడి ప్రజలు. ఇక ఆహారం విషయానికోస్తే తెలంగాణ వంటకాలు కూడా మిగిలిన తెలుగు సమాజపు రుచులలో ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. సకినాలు, బచ్చాలు, బిర్యానీ తదితర కమ్మటి రుచులు, తెలంగాణ ఆహారపు ప్రత్యేకతలను చాటుతాయి.
ఇంతటి ఘనమైన సంస్కృతి ఉమ్మడి పాలనలో వివక్షకు గురైంది. ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు వలస పాలకులు. తమదే గొప్ప భాష, సంస్కృతి, చరిత్ర అన్నట్టుగా వ్యవహరించారు. ఈ అణచివేత, వివక్ష దశాబ్దాల పాటు కొనసాగింది. మరోవైపు రాజకీయంగా కొనసాగిన ఆధిపత్యం తెలంగాణ ప్రజలను మరింత బానిసత్వంలోకి నెట్టింది. దీంతో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ఈ కనిపించని కుట్రలపైన తెలంగాణ ఉద్యమం ఐగ్గె మండింది. సకల కుట్రలను కుల్లం కుల్ల చేసింది.
అన్యాయాలకు ఊతమిస్తున్న పాలనను మార్చకుంటే తెలంగాణ బాగుపడదని భావించింది. అలా ఉమ్మడి రాష్ర్టం ఏర్పడిన నాటి నుంచే ఉద్యమం మొదలైంది. లక్షలాదిమంది పోరాటం, వేలాదిమంది త్యాగాల ఫలం, కేసీఆర్ మహోన్నత నాయకత్వం తెలంగాణరాష్ర్ట స్వప్నాన్ని నిజం చేశాయి. గడిచిన ఏడాది కాలంగా మళ్లీ ఛిద్రమైన బతుకులను సరిదిద్దే పని మొదలైంది. పడావు పడ్డ వ్యవసాయాన్ని బాగుచేయడం కోసం తెలంగాణ సర్కార్ నడుం బిగించింది. నూటికి అరవై శాతం తెలంగాణ జనాభాకు ఇప్పటికీ వ్యవసాయమే జీవనాధా రం.
రైతుల బతుకులు బాగుచేయడానికి మొదలుపెట్టిన చారిత్రాత్మక పథకమే మిషన్ కాకతీయ. ఆనవాళ్లు కోల్పోయి నిర్వీర్యంగా మారిన చెరువులను, పునరుద్ధరించేందుకు సీఎం కేసీ ఆర్ పూనుకున్నారు. ఆనాడు కాకతీయ కాలంలో ప్రజల బతుకులు పచ్చబడేలా చేసిన చెరువులకు, ఇన్ని రోజులకు మళ్లీ జీవమొచ్చింది. ఊరూరా చెరువుల పండుగ షురువైంది. ఇక వానలు పడడమే ఆలస్యం. రైతులు, కూలీల నుంచి మొదలు చేతివృత్తుల వారి వరకు పనిదొరకనుంది. ఎనకటి మంచికాలం మళ్లీ మనముందుకు రానుంది. 
అంతేకాదు వృద్ధులకు ఆసరా, దళిత, మైనారిటీ ఆడపిల్లల పెళ్లిల్లకు 51వేల రూపాయల ఆర్థికసాయం అందించే కళ్యాణలక్ష్మీ, కళాకారులకు ఉద్యోగాలు, హాస్టల్ పిల్లలకు సన్నబియ్యం, ఇంటింటికి తాగునీరందించే వాటర్ గ్రిడ్, కోతల్లేని కరెంటు సరఫరా, పరిసరాలను పరిశుభ్రంగా మార్చే స్వచ్ఛ్ హైదరాబాద్, స్వచ్ఛ్ తెలంగాణ, పచ్చదనం కోసం ఊరూర పెంచే హరితహారం, ఉపాధి అవకాశాలను అందించే ఇండస్ట్రీయల్ పాలసీ- ఐపాస్ వంటి పథకాలన్నో తెలంగాణను తనకాళ్ల మీద తాను నిలబడేలా చేయనున్నాయి. ఈ పథకాలు, ప్రభుత్వ కృషి వల్ల గత సంస్కృతి మళ్లీ వేయి కాంతులతో విలసిల్లనుంది.

ఉమ్మడిపాలనలో దశాబ్దాలుగా జరగని అభివృద్ధి సంవత్సర స్వయంపాలన కాలంలో జరిగింది. తెలంగాణ ప్రజలకు ఒక ఆత్మవిశ్వాసం, ధీమా ఏర్పడ్డాయి. మన పండుగలు, పబ్బాలకు గత వైభవం రావడం మొదలైంది. అందుకు సాక్ష్యమే అధికారికంగా ఈ యేడాది జరిపిన ఎన్నో పండుగలు. తెలంగాణ వైతాళికుల వర్ధంతులు, జయంతుల నిర్వహణ, ట్యాంక్‌బండ్ మీద ఈసారి తెలంగాణ ఆత్మగౌరవ పండుగ బతుకమ్మ పండుగకు కొత్త జవజీవాలను అద్దింది. బతికిచెడ్డ గడ్డను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రతీ పౌరుడు కంకణబద్ధుడు కావాలి. గత వైభవాన్ని తిరిగి సాధించి, దేశంలోనే ఆదర్శ రాష్ర్టంగా నిలబెట్టుకునేందుకు గడిచిన సంవత్సరకాల పాలన ఒక విశ్వాసాన్ని అందించింది. రానున్న రోజులు తెలంగాణ బిడ్డల సంస్కృతికి మరింత కొత్తమెరుగులద్దుతుంది. సారవంతమైన తెలంగాణ సంస్కృతి సంపద దశ దిశలా కాంతులీనుతుంది.  ఇదే మన లక్ష్యం...ఇందుకై ..మన ముఖ్యమంత్రి కేసీఆర్‍తో సహా...మనమంతా కృషిచేద్దాం. ఎవరైనా అడ్డుపుల్ల వేయాలని చూస్తే...తగిన బుద్ధి చెప్పుదాం.

వ్యాసకర్త: సాంస్కృతిక సారథి, ఎమ్మెల్యే


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!



గురువారం, మే 28, 2015

తెలంగాణలో డీలా...సీమాంధ్రలో గోలగోల...!!!???

-తెలంగాణలో డీలా, సీమాంధ్ర గోలగోల
-ఎదురు తన్నుతున్న చంద్రబాబు వ్యూహాలు
-ఆంధ్ర పెత్తనం మీద మండిపడుతున్న టీటీడీపీ
-మాగంటికి సిటీ పదవిపై రేవంత్ మండిపాటు
-ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముందే చేతులెత్తేసిన టీడీపీ
ఇటు తెలంగాణ, అటు సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి గందరగోళంగా మారింది. తెలంగాణలో ఉన్న బలమైన నాయకులు వెళ్లిపోగా డీలా పడిపోతే, సీమాంధ్రలో ఎన్నికలముందు చేరిన నాయకుల భారంతో ఆగమాగమవుతున్నది. భవిష్యత్తు ఉందా లేదా తెలియక ఇక్కడ అయోమయం ఏర్పడితే సీమాంధ్రలో భారీ విజయం సాధించీ ఎవరినీ సంతృప్తి పరచలేక చతికిలపడింది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టినపుడు కేంద్రం సహకారంతో ఇక్కడ పరోక్షపాలన.. సీమాంధ్రలో ఎదురులేని పాలన చెలాయిస్తామనుకున్న సంతోషం అచిరకాలంలోనే ఆవిరైంది. అక్కడ ఇక్కడ పప్పులుడకని పరిస్థితి ఏర్పడింది. తాజాగా చంద్రబాబు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీ కావు. తెలంగాణలో నాయకులను రోజూ బుజ్జగించాల్సి వస్తుంటే సీమాంధ్రలో రోజుకొకరు ఎదురుతిరుగుతుంటే ఏమీ చేయలేని స్థితి చంద్రబాబుది. 


babu

తెలంగాణలో చంద్రబాబు పార్టీ నేతల మధ్య ఒక రకమైన కోల్డ్‌వార్ జరుగుతున్నది. ఓ వైపు వారిని బుజ్జగిస్తూనే మరోవైపు సీమాంధ్ర పెత్తనమే రుద్దుతున్నారు. తెలంగాణ టీడీపీకి రమణను అధ్యక్షునిగా చేసినా కుమారుడు లోకేశ్‌ను రెండోవైపు రుద్దారు. ఇదీ చాలక ఓసారి ఎర్రబెల్లికి, మరోసారి రేవంత్‌కు ప్రాధాన్యం ఇస్తూ అందర్నీ ఉత్సవ విగ్రహాలుగా వాడుకుంటున్నారు. మరోవైపు తెలంగాణ మీద కుట్రలు చేస్తూ, తెలంగాణ ఏర్పాటు ఘోరం.. దారుణం అంటూ ప్రకటనలు చేస్తూ, వారికి మింగలేని కక్కలేని పరిస్థితిని తానే తెస్తున్నారు. తెలంగాణలో టీడీపీ ఉండాలి.. కానీ సీమాంధ్ర పెత్తనంలోనే ఉండాలన్న వ్యూహాన్ని చంద్రబాబు అమలుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ నగర అధ్యక్ష పదవిని సీమాంధ్రకు చెందిన మాగంటి బాబుకు ఇవ్వడం ద్వారా బాబు తన నిజస్వరూపాన్ని ప్రదర్శించారు. ఆంధ్ర నాయకులను తెలంగాణ నాయకులు భుజానికెత్తుకోవాల్సిందేనని పరోక్షంగా వెల్లడించారు. బాబు నిర్ణయంతో తెలంగాణ ఎమ్మెల్యేలు తీవ్ర మనస్తాపం చెందుతున్నారు.


జిల్లాల్లో నాయకులు ప్రజలకు ముఖం చాటేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాగంటి పేరును ఖరారు చేయడం పట్ల పార్టీలో విస్తృతస్థాయి చర్చ జరుగుతున్నది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ పదవిని సీమాంధ్ర నేతకే కట్టబెట్టడం ఏమిటని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆయన సామాజిక వర్గం ఓట్లు, సీమాంధ్ర ప్రాంత ఓట్లను దృష్టిలో ఉంచుకునే అధినేత చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారంటూ బాబు ఆంతరంగికులు సన్నాయి నొక్కుతున్నారని తెలిసింది. అంటే ఒక్క సీమాంధ్ర ఓట్లు మాత్రమే టీడీపీకి చాలా? తెలంగాణ వారి ఓట్లు అవసరం లేదా? అని శ్రేణులు వాపోతున్నాయి. 


చంద్రబాబును అన్నింటికీ వెనకేసుకు వచ్చే ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కూడా గ్రేటర్ హైదరాబాద్ పార్టీ అధ్యక్ష పదవిని ఆంధ్రకు చెందిన ఎమ్మెల్యే మాగంటి గోపీకి కట్టబెట్టేందుకు చంద్రబాబు మొగ్గు చూపడంపై అగ్గి మీద గుగ్గిలమైనట్టు తెలిసింది. ఇప్పటిదాకా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా కొనసాగగుతున్న మాజీ మంత్రి క్రిష్ణయాదవ్‌కే మళ్లీ అవకాశం ఇవ్వాలని ఆయనను వెంటబెట్టుకుని చంద్రబాబు వద్దకే వెళ్లినట్టు సమాచారం. తెలంగాణలో పార్టీ నేతలు కరువైనట్లుగా ఆంధ్ర ప్రాంతనేతకు సిటీ అధ్యక్ష పదవిని కట్టబెడుతున్నారని నమస్తే తెలంగాణ ప్రచురించిన కథనం క్లిప్పింగ్‌ను చంద్రబాబు వద్ద ఉంచినట్టు తెలిసింది. తెలంగాణ ప్రజలు గోపీనాథ్‌ను వ్యతిరేకిస్తున్నారని, ఆంధ్రప్రాంత నేతలకు పదవులిస్తే వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలవచ్చనే ఆలోచన సరికాదని రేవంత్‌రెడ్డి వివరించినట్టు తెలిసింది. 


రాష్ట్రంలో ప్రస్తుతం ఓటుకు ఆధార్‌కార్డును అనుసంధానం చేస్తున్నారని, దీనితో ఇక్కడున్న ఆంధ్రప్రాంత వాసులు తాము పుట్టిన ప్రాంతాల్లో ఓటును కాపాడుకునేందుకు ఇక్కడి ఓట్లు వదులుకుంటున్నారని తెలిపినట్టు సమాచారం. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రులు పలువురు నగరాన్ని విడిచి వెళ్లిపోతున్నారని, ఇక్కడి రాజకీయాలపై వారికి ఆసక్తి కూడా నశించిందని ఆయన వివరించినట్టు తెలిసింది. ఈ పరిస్థితుల్లో ఆంధ్ర నాయకులకు తెలంగాణ ప్రాంతంలో పార్టీ పదవులు కట్టబెడితే తెలంగాణ ప్రజలకు పార్టీ దూరమవుతుందే తప్ప ఏ ప్రయోజనం ఉండదని కరాఖండీగా చెప్పారని తెలిసింది. 


ఇదిలా ఉంటే తెలంగాణ ప్రాంతానికి అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఎల్ రమణకు ఈ వ్యవహారంలో ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదని తెలిసింది. పేరుకే అధ్యక్షుడు తప్ప పార్టీలో ఎవరూ ఆయన అధీనంలో లేరని, మరోవైపు ఎర్రబెల్లి, రేవంత్‌లు పెత్తనం కోసం ఎవరి గ్రూపులు వారు కడుతున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. చంద్రబాబు కూడా ఎపుడు ఎవరి మాట వింటారో.. ఎవరిని అందలం ఎక్కిస్తారో తెలియని పరిస్థితి ఉందని వారన్నారు. 


తప్పుడు వ్యూహంతో వెల్లక్కిలా..


ఉన్న కష్టాలు చాలక పార్టీకి గుడ్‌బై చెప్పిన ఎమ్మెల్యేలను దెబ్బ కొట్టాలని కోర్టుకు ఎక్కిన టీడీపీకి చుక్కెదురైంది. సోమవారం హైకోర్టు ఎదుట అనుబంధ పిటిషన్ దాఖలు చేస్తే వెంటనే దానిని విచారించాల్సిన పని లేదని కోర్టు తేల్చి చెప్పింది. తలసాని శ్రీనివాస్ యాదవ్, చల్లా ధర్మారెడ్డి, తీగల కృష్ణారెడ్డిలను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయకుండా నిరోధించాలని టీడీపీ తరపున ఎర్రబెల్లి దయాకర్‌రావు పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు పెద్దగా స్పందించక పోవడంతో తర్వాత ఏమిటి అనేది అర్థం కాక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.


మరోవైపు ఈ చర్యతో ఎన్నికకు ముందే చేతులెత్తేసినట్టు అయింది. గెలుపు విషయాన్ని పక్కనపెడితే ఈ ఎన్నికల్లో ఎంతమంది పార్టీకి ఓటు వేస్తారో తెలియని అయోమయం నెలకొంది. గెలవని అభ్యర్థికి ఓటెందుకు? అనే అభిప్రాయం ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో కనిపిస్తున్నదంటున్నారు. ఇంతోటిదానికి ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం ఎర్రబెల్లి, రేవంత్ సిగపట్లకు కూడా దిగారు. చివరకు రేవంత్‌రెడ్డి బలపరిచిన వేం నరేందర్‌రెడ్డికే అభ్యర్థిత్వం వరించగా ఎర్రబెల్లి చిన్నబుచ్చుకున్నారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


బుధవారం, మే 27, 2015

తెలంగాణలో కవులే లేరా...???!!!


ఆంధ్రులందరూ ఒకేజాతికి చెందినవారైనా ఆంధ్రదేశంలోని ప్రాంతాల భేదాన్నిబట్టి నిజామాంధ్రులు, కోస్తా ఆంధ్రులు, రాయలసీమ ఆంధ్రులు, కళింగాంధ్రులు అనే నాలుగు ప్రధాన భేదాలు కనిపిస్తాయి. నిజామాంధ్రులు నివసించే భూభాగాన్నే మనం ‘తెలంగాణ (పూర్వం త్రిలిఙ్గాన్ధ్రము)’ అని వ్యవహరిస్తున్నాం. ఏమి దురదృష్టమో కాని కొన్ని ప్రాంతాల పండితుల్లో, పెద్దల్లో తెలంగాణంలో తెలుగు లేదనీ, ఉన్నా అది సరైన తెలుగు కాదనీ నిష్కారణమైన అసత్యమైన అపోహ నేటికీ ఉంది. ఈ అపోహ కలిగిన వారు తెలంగాణంలోని మారుమూల పల్లెలకు వెళ్లితే తెలంగాణపు తెలుగు బాస సొగసులు వారికి తెలియవస్తాయి.

ఒక పండితుడు ‘నిజాం రాష్ట్రంలో తెలుగు కవులు పూజ్యము’ అని గోలకొండ పత్రిక తొమ్మిదవ సంవత్సరాది సంచికలో ఒక అభియోగం కూడా చేసినాడు, దానిని సహింపక తెలంగాణ వైతాళికుడైన సురవరం ప్రతాపరెడ్డిగారు ఎంతో శ్రమపడి తెలంగాణ ప్రాంతంలో కవుల వివరాలను సేకరించి ‘గోలకొండ కవుల సంచిక’ను ప్రచురించినారు. ఇందులో తెలంగాణ ప్రాంతమందలి 354 మంది ఆధునిక కవుల వివరాలను, 183 మంది ప్రాచీన కవుల వివరాలను పేర్కొనడం జరిగింది. తెలంగాణలో విలసిల్లిన సాహిత్యానికి అమూల్యమైన చరిత్ర ఉంది. తెలుగు సాహిత్యంలోని శిఖరాయమాణులైన కవులెందరో తెలంగాణని పునీతం చేసినవారే. తెలుగు కవులకున్న వైశిష్ట్యాన్ని గుర్తించే ‘ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహా’న్ని రచించిన ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారు తమ గ్రంథంలో కొందరు తెలంగాణ కవులు అనే పరిచ్ఛేదాన్ని కల్పించినారు.

దీన్నిబట్టి తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణ ప్రాంతపు కవులకు గల ప్రత్యేకతను గమనించవచ్చు. తెలుగు సాహిత్యంలో మొట్ట మొదటిసారిగా దేశి పద్ధతిలో స్వతంత్ర రచన చేసిన కీర్తి తెలంగాణలోని పాలకుర్తికి చెందిన సోమనాథునికే చెందుతుంది. భాషలో, ఛందస్సులో, వస్తువులో ఎంతో నవ్యతను ప్రదర్శిస్తూ ఇతడు రచించిన బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర కావ్యాలు తెలుగు సాహిత్యానికి మణిదీపాలు. సోమన రచించిన వృషాధిప శతకం మకుట నియమం, సంఖ్యానియమం కలిగిన శతకాల్లో మొట్టమొదటిది. ప్రాచీన తెలుగు రామాయణాల్లో భాస్కర రామాయణం మిక్కిలి ప్రజాదరణను పొందిన గ్రంథం. ఎఱ్ఱన రచించిన రామాయణం లభ్యం కాలేదు కనుక లభ్యమైన మార్గ పద్ధతికి చెందిన రామాయణాల్లో ఇదే ప్రథమం. ఇది హుళక్కి భాస్కరుడు, మల్లికార్జున భట్టు, కుమార రుద్రదేవుడు, అయ్యలార్యుడు- ఈ నలుగురు కవుల సమష్టి కృషి. వీరిలో హుళక్కి భాస్కరుడు ఓరుగల్లును పాలించిన కాకతీయ రాజుల ఆస్థానంలో ఉన్న కవి. భాస్కర రామాయణాన్ని అంకితం గొన్నది కాకతీయ సైన్యాధ్యక్షుడు సాహిణి మారన.

ఈ విధంగా లభ్యమైన మొదటి మార్గ రామాయణం కవులందరూ తెలంగాణ ప్రాంతానికి చెందినవారే. భాస్కర రామాయణానికి కొద్ది ముందుగా వచ్చిన ద్విపద రంగనాథ రామాయణ కర్త గోన బుద్ధారెడ్డి కూడా తెలంగాణ ప్రాంతపువాడే. ఆంధ్రులు అత్యంత భక్తితో ఆరాధించే మహాగ్రంథం పోతన భాగవతం. పోతన వరంగల్లు జిల్లాలోని బమ్మెర గ్రామానికి చెందినవాడు. ఈ కవి ప్రాంతం విషయంలో ఇప్పటికీ కొందరు వివాదాలు లేవనెత్తడం దురదృష్టకరమైన విషయం. మొట్టమొదటగా తెలుగులో అనువదింపబడ్డ పురాణం మార్కండేయ పురాణం. ఈ పురాణాన్ని తెనిగించిన మారన తిక్కన శిష్యుడై కొంతకాలం నెల్లూరులో ఉన్నా తరువాత వరంగల్లులో కొంతకాలం నివసించి రెండవ ప్రతాపరుద్రుని సేనా నాయకుడైన నాగయ్య గన్న నాయకునికి తన గ్రంథం అంకితం చేసినాడని విమర్శకుల అభిప్రాయం.

తెలుగులో మొదటి పురాణానువాదం వెలసిన కీర్తి తెలంగాణకే దక్కుతుందని చెప్పవచ్చు. అచ్చ తెలుగు కావ్యానికి మొట్టమొదటగా పురుడుపోసింది తెలంగాణమే. ఈ కావ్య రచయిత తన యయాతి చరిత్ర కావ్యాన్ని పొట్ల చెరువు (పట చెరువు) పట్టణానికి సర్దారైన అమీన్‌ఖానుకు అంకితం చేసినాడు. యక్షగాన ప్రక్రియకు మొదటిగా నారు పోసినవాడు, కందుకూరి రుద్రకవి. ఈతని సుగ్రీవ విజయం మిక్కిలి ప్రసిద్ధం. ఇలా ఆయా ప్రక్రియల్లో మొదటగా సాహిత్య సృష్టి జరుగడమే కాక ఇంకెంతో సారస్వతం తెలంగాణంలో గణనీయంగా వచ్చిందని చెప్పవచ్చు. ఇటీవల తెలంగాణంలోని సారస్వతాన్ని గురించి ఎంతో కృషి జరుగుతుంది. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో ఈ విషయంపై ఒక పరిశోధన ప్రణాళిక సాగుతుంది. వివిధ కళాశాలల్లో గోష్ఠులు నిర్వహింపబడుతున్నాయి. అంతేకాక కొందరు పరిశోధకులు స్వయంగా ఈ విషయంపై కృషి చేసి ఎన్నో నూత్నాంశాలను వెలువరిస్తున్నారు.

అట్టి పరిశోధకుల్లో డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి అగ్రగణ్యులు. ఎన్నో సాహిత్య చరిత్ర గ్రంథాలను, శాసనాలను పరిశోధించి, సుమారు ఐదువందలమంది సంస్కృతాంధ్ర కవుల వివరణలతో సుమారు 800 పేజీల గ్రంథాన్ని రచించి తెలుగు సాహిత్యానికి ఎంతో సేవ చేసినాడనటంలో ఏమాత్రం సందేహం లేదు. వ్యాఖ్యాతృ చక్రవర్తిగా విశ్వవిఖ్యాతి చెందిన మెదక్‌ జిల్లావాసి మల్లినాథుడు, ప్రతాపరుద్రుని ఆస్థానాన్ని అలంకరించిన విద్యానాథుడు, రాచకొండ ప్రభువు ఆస్థానంలో ఉన్న విశ్వేశ్వరుడు, ఓరుగల్లు నివాసియై సంస్కృతంలో సుమారు 74 కావ్యాలను రచించిన అగస్త్య కవి – ఇలా తెలంగాణంలో విలసిల్లిన సంస్కృత కవుల నెందరినో గుర్తించి ఇందులో వివరించడం విశేషం.

ఇందులో ఆయా కవులను యుగ విభజనానుసారంగా వివరించడం వల్ల తెలంగాణంలో వచ్చిన సాహిత్య పరిణామ క్రమం తెలుసుకునే అవకాశం ఉంది. అందువల్ల ఈ గ్రంథం ఒక రకంగా తెలంగాణ సాహిత్య చరిత్ర అవుతున్నది. కవుల వివరణలతో పాటు వారి గ్రంథాలలోని శ్లోకాలనూ, పద్యాలనూ ఈ గ్రంథంలో ఉదాహరించడం వారి కవితా వైశిష్ట్యాన్ని గుర్తించడానికి ఉపకరిస్తుంది. ఐతే కొన్ని చోట్ల ఈ పద్యాలు పరిమితిని దాటినట్లుగా కనిపిస్తుంది. సంస్కృతాంధ్రాలలో రచింపబడ్డ తెలంగాణ శాసనాల్లో కావ్య సంపద ఎంతో ఉంది. సాహిత్య చరిత్రకారులు కావ్యఖండాలనదగిన శాసనకర్తలైన కవులను విస్మరించడం జరిగింది. నారాయణరెడ్డి ఈ విషయంలో కూడా ఎంతో కృషి చేసి అచింతేంద్రయతి, మయూరసూరి, ఈశ్వర భట్టోపాధ్యాయుడు మొదలైన సంస్కృత శాసన కవులను, ఇతర తెలుగు శాసన కవులను పేర్కొని వారి శాసనాల్లోని విషయాలను వింగడించడం విశేషం.

కుల పురాణాలను, జానపద కథలను పట్టించుకున్న సాహిత్య చరిత్రకారులు అరుదు. జాంబ పురాణం, విశ్వకర్మ పురాణం, మడేల్‌పురాణం, గౌడ పురాణం మొదలైన పురాణాలను, నల్లసోమనాద్రి కథ, సదాశివరెడ్డి కథ మొదలైన జానపద కథలను గూర్చి నారాయణరెడ్డి వివరించడం గ్రంథానికి అదనపు మెరుగు. ఈ గ్రంథం తెలంగాణ సాహిత్య చరిత్రను సమగ్రంగా వివరిస్తుంది. నారాయణరెడ్డి ఎంతో శ్రమకోర్చి, వివిధ గ్రంథాలు, శాసనాలు మొదలైనవి పరిశోధించి ఈ గ్రంథాన్ని రచించి తెలంగాణా సాహిత్య చరిత్రకే కాక ఆంధ్ర సాహిత్య చరిత్రకు కూడ ఎంతో సేవ చేసినాడు. ఇందుకు మిత్రుడు డా.నారాయణరెడ్డిని మనసారా అభినందిస్తున్నాను. పండితులు, జిజ్ఞాసువులు నారాయణరెడ్డి ఈ ప్రయత్నాన్ని సహృదయంతో ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

తెలుగుకూ, తెలుగు కవులకూ ఇక్కయైన తెలంగాణను ప్రశంసిస్తూ శ్రీ మందడి వేంకటకృష్ణ కవి గారు చెప్పిన ఈ క్రింది పద్యంతో నా ‘అభినందన’ను ముగిస్తాను.

సీ.
కవితాలతాంగి స త్కారాళి మొదయదే
     ప్రతి వత్సరమున గ    ద్వాల సభల
ఆంధ్రభారతి మహ    దానంద మొందదే
     ప్రతి వత్సరము వన    పర్తి సభల
పండితమండల    ప్రాభవం బెసఁగదే
     ప్రతి వత్సరమున గో    పాలు పేట
ఆంధ్ర సాహిత్య వి    ద్యావినోదము లేదె
     యాత్మకూర్పురిని ప్ర   త్యబ్దమందు

గీ.
నిట్టియాస్థాన చయముల    కింపు బెంపు
తేజమొసగిన నైజాము    దేశమందు
తెలుగునకు నిక్కయైన యీ    దేశమందు
కవివరేణ్యులు పండితుల్‌    గలరు కలరు.
(గోలకొండ కవుల సంచిక. పుట 309)


  • ఆచార్య రవ్వా శ్రీహరి
  • (ఆగస్టు 2, 2009న హైదరాబాద్‌లోని సీఫెల్‌లో ఆవిష్కరణ జరగనున్న ‘ముంగిలి- తెలంగాణ ప్రాచీన సాహిత్యం’ )


(మద్గురుమూర్తులు ఆచార్య రవ్వా శ్రీహరిగారికి కృతజ్ఞతలతో)


జై తెలంగాణ!    జై జై తెలంగాణ!




మంగళవారం, మే 26, 2015

తెలంగాణ స్వయం పాలన...సాంస్కృతిక వైభవం...

image of telangana cultural and historical కోసం చిత్ర ఫలితం


స్వయం పాలనకు ఏడాది కావస్తున్నది. ఈ ఏడాది కాలంలో మన సంస్కృతి, చరిత్ర కొత్త చిగురులు వేసింది. పరాయి పాలకుల నిర్లక్ష్యానికి, వివక్షకు గురైన తెలంగాణ సంస్కృతి మళ్లీ ఆత్మగౌరవంతో తలెత్తుకొని నిలబడింది. అరవై ఏళ్లలో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి ఇంకా శ్రమించాల్సి ఉన్నది. మన అభివృద్ధి వికాసానికి తెలంగాణ సంస్కృతిని తిరిగి నిలబెట్టడం కీలకమైన విషయం. పది జిల్లాల్లో ఎక్కడమట్టి పట్టుకున్నా అది శతాబ్దాల చరిత్రను ఎలుగెత్తి చాటుతుంది. తెలంగాణ నేల పూర్వకాలం నుంచి అనేక మంది పాలకుల పాలనలో కొనసాగడం మూలంగా, ఇక్కడి సంస్కృతిలో వైవిధ్యం చోటుచేసుకున్నది. అందువల్ల తెలంగాణ సంస్కృతి ఒక ఉపఖండ లక్షణాలను కలిగినదిగా విశ్లేషకులు చెబుతారు. అలాగే దేశానికి మధ్యలో ఉండడం కారణంగా ఉత్తర దక్షిణ భారతాలకు కూడలిగా కూడా భావిస్తారు. క్రీ.శ.6వ శతాబ్దం నుంచి తెలంగాణలో శాతవాహనుల పాలన కొనసాగిందని చరిత్ర పుస్తకాలు తెలుపుతున్నప్పటికీ, తెలంగాణ చరిత్రకారులు ఇటీవల దొరికిన ఆధారాలతో తెలంగాణలో తెగల జీవనానికి ముందు నుంచే, సింధూ నాగరికతతో సమానమైన నాగరికత విలసిల్లినట్లుగా తెలుస్తున్నది. అలాగే ఇక్కడ దొరికిన ఇనుము, ఉక్కు ఖనిజంతో వ్యవసాయంలో వికసన దశ ఏర్పడిందని, ఇక్కడి అవసరాలకు సరిపోగా మిగిలిన లోహాన్ని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసిన చరిత్ర కూడా వెలికితీయడం జరిగింది. తెగలుగా ఉన్న జాతి ఇక్కడి చరిత్రను ఎలుగెత్తిచాటుతుంటే, వ్యవసాయ వికాసం, బౌద్ధ ఆరామాలు ప్రజల సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తున్నవి. నాగరికతలో భాగంగా విద్య, వైజ్ఞానిక ఆవిష్కరణలు జరిగిన విధానాన్ని ఇక్కడి సాహిత్యం కళ్ల ముందుంచుతున్నది. 


తెలుగు సాహిత్యంలో తొలి విప్లవకవి పాల్కుర్కి సోమనాథుడు, తెలుగు ప్రజలు గర్వపడేలా భాగవతాన్ని తెనిగీకరించిన మహాకవి బమ్మెర పోతన తెలంగాణ ప్రాంతానికి చెందినవారే. తన కావ్యాలను పాలకులకు అంకితమివ్వనని శపథం చేసిన పోతన, తన చరమాంక జీవితాన్ని వ్యవసాయం చేయడంలోనే గడిపిన చరిత్ర ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని తెలియజేస్తున్నది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ముస్లిం పాలకుల రాకతో తెలంగాణలో మరో నూతనత్వం చోటుచేసుకున్నది. ముస్లిమేతరులైన బహుజనులు, ముస్లింలు, పార్సీలు, సిక్కులు తదితర జాతుల ప్రజలు ఇక్కడికి వలస వచ్చి, ఇక్కడి సంస్కృతితో మమేకం కావడంతో పాటు, ఇక్కడి మంచిని స్వీకరించి, తమ సంస్కృతిలోని ఉన్నతమైన విషయాలను ఇక్కడి ప్రజలతో కలబోసుకున్నారు. అలా ఇక్కడి సంస్కృతిని గంగా, జమున తహెజీబ్ అని విదేశీ పర్యాటకులు కొనియాడేలా సుసంపన్నం చేశారు.



ముస్లిం రాజులు పాలించినప్పటికీ వారు ఇతర మతస్థుల ఆచార వ్యవహారాలను గౌరవించారు. కులీకుతూబ్‌షా తన ప్రేయసి పేరు మీద భాగ్యనగరాన్ని నిర్మించాడు. తన ప్రేమ కోసం ఒక నగరాన్నే నిర్మించిన చరిత్ర ప్రపంచంలోనే అరుదు. అంతే కాకుండా తన పాలనలో అక్కన్న, మాదన్నలను మంత్రులుగా నియమించుకోవడమే కాకుండా, ప్రతి శ్రీరామనవమికి పట్టు వస్త్రాలను తానే స్వయంగా తీసుకెళ్లి సమర్పించిన మత సామరస్యం ఇక్కడనే కనిపిస్తుంది. ఆసఫ్ జాహీల పాలనలో కూడా తెలుగు కవులను ఆస్థాన కవులుగా నియమించుకున్న చరిత్ర ఉన్నది. పాలకులు మారుతున్నప్పటికీ, ప్రజలు మాత్రం తమ స్థానికత్వాన్ని ఈ నేల స్వభావాన్ని ఏమాత్రం కోల్పోకుండా కాపాడుకున్నారు. గోలుకొండ కేంద్రంగా ఒకప్పుడు కొనసాగిన వజ్రాల వ్యాపారం, హైదరాబాద్‌ను "పెరల్‍సిటీ" అని కీర్తించేలా చేసింది.


ఆ కాలంలో గోలకొం డ ప్రాంతంలో ముత్యాలను రాసులుగా పోసి అమ్మారని ఇప్పటికీ చెప్పుకుంటారు. వ్యాపార సంబంధమైన జీవనం తెలంగాణ పట్టణాలకే పరిమితమయ్యింది తప్ప విశాల సమూహాలుగా ఉన్న తెలంగాణ ప్రజల్లో ప్రకృతితో కలిసి జీవించేతనమే ఇటీవలి కాలం వరకు సజీవంగా ఉన్నది. దొరికిన దానితోనే సంతృప్తిగా జీవించడం మినహా, రేపటి గురించి కూడబెట్టుకుని, దాచుకునే లోభ మనస్తత్వం తెలంగాణ ప్రజల్లో మచ్చుకు కూడా కనిపించదు. స్వార్థ చింతనలేని జీవన విధానం తెలంగాణ ప్రజల్లో కనిపించే మరో సాంస్కృతిక ప్రత్యేకత.



ఉత్పత్తి విధానమే ఉపరితలమైన సంస్కృతిని నిర్ణయిస్తుంది అన్న అవగాహనతో చూసినపుడు తెలంగాణ ప్రజలది ఏ సంస్కృతో అర్థమవుతుంది. తెలంగాణ ప్రాంతాన్ని బ్రిటీషు వలస పాలన ఆక్రమించుకోకపోవడం కారణంగా తెలంగాణ ప్రజలకు వలస వ్యాపార ధోరణులు అలవడలేదు. ఇప్పటికీ పుట్టినూరే కన్నతల్లి అనే భావన తెలంగాణ ప్రజల్లో సజీవంగా ఉంది.


తెలంగాణ నైసర్గిక స్వరూపమే భిన్నమైనది. మౌలికంగా కొండలు, గుట్టలు, వంపులు, డొంకలు, ఎత్తయిన తోపులు ఇట్లా వాతావరణంలోనే ఒక ప్రత్యేకత ఉన్న ది. కోస్తా ప్రాంతంలో నీటి పారుదల సౌకర్యాల వల్ల గోదావరి జిల్లాల్లో ఎక్కడ కూడా ఖాళీ కనిపించదు. మైదాన ప్రాంతాలల్ల సాగుజేసి, ప్రకృతిపైన మరింత దాడి చేసి, ప్రకృతిని ఒకరకంగా హింసించి, లాభాల కోసం విపరీతమైన వాణిజ్య పంటల్ని పండిస్తూ, లాభ ప్రాధాన్యతతో ఉన్న జీవన విధానం వారిది. తెలంగాణలో మాత్రం మనుగడ కోసం, ఆహారం కోసం, ఆహార పంటలు, పరిమితమైన వనరులు, పరిమిత ప్రశాంత సాధుజీవనం. ఇప్పటికీ...తెలంగాణ గ్రామాల్లో గ్లోబలైజేషన్ కాలంలో కూడా...దాని ఛాయలు కనబడుతాయి.


మన సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్న వేల ఏండ్ల జానపద కళారూపాలు, శాతవాహన, కాకతీయ శిల్పసంపద తెలంగాణ విశిష్టతను పరిపూర్ణం చేశాయి. జానపద కళారూపాలకు ఆధారమైన కుల పురాణాలు, ఆశ్రిత కులాలు కళలను పూర్వకాలం నుంచి తెలంగాణ గ్రామీణ ప్రజలను అలరిస్తున్నాయి. కేవలం అలరించడమే కాకుండా అనేక చారిత్రక విషయాలను ఈ కథల ద్వారా సమాజానికి బోధిస్తున్నాయి. చిందు, బైండ్ల, ఒగ్గు, శారద, మందహెచ్చులు, పటమొల్లు, బుడుబుడుకలవారు, దాసరులు, జంగాలు, బాలసంతులు, ఫకీర్లు తదితరులు తరతరాలుగా సాంస్కృతిక వారధులుగా నిలుస్తున్నారు. అలాగే తెలంగాణ శ్రమ సంస్కృతిలో భాగంగా ఇక్కడ "పాట" సజీవంగా ఉన్నది. మౌఖిక సంప్రదాయంగా వచ్చిన ఈ పాట తెలంగాణ ప్రాంతంలో ఉన్న దళిత, బహుజన కులాల జీవనాన్ని కండ్ల ముందుంచుతున్నది. 


అందుకే పాట ఇక్కడ మకుటాయమానంగా ఉన్నది. అనేక కళారూపాలు పాశ్చాత్య వలస సంస్కృతి దాడికి కనుమరుగైనా, పాట ఒక్కటే ఈ ప్రాంతంలో జరిగిన ప్రజా ఉద్యమాల కారణంగా సజీవంగా ఉన్నది. ఈ కళారూపాలతో పాటు, తెలంగాణ చారిత్రక వైభవానికి అద్దం పట్టే శిల్ప సంపద శతాబ్దాలు గడిచినా చెక్కు చెదరలేదు. శాతవాహన, కాకతీయ రాజుల పాలనలోని కట్టడాలు ఇక్కడి ప్రజల కళాభిరుచికి ప్రతిబింబంగా నిలుస్తున్నాయి. వరంగల్, కరీంనగర్, హైదరాబాద్‌లతో పాటు, ఏ జిల్లా చూసినా, శిల్పకళలతో ఇక్కడి కళావైభవానికి ఆనవాళ్లుగా కనిపిస్తాయి. శిల్ప కళతో పాటు హస్తకళలు కూడా అనేకం తెలంగాణలో వెలుగొందాయి. 


పెంబ ర్తి నగిషీలు, నిర్మల్ బొమ్మలు, భూదాన్ పోచంపల్లి చేనేత పరిశ్రమ తెలంగాణ కళాత్మకతను మరింత ప్రకాశవంతం చేశాయి. కాకతీయుల కాలంలోనే పేరిణి శివతాండవ నృత్యం ఆవిర్భవించి ప్రసిద్ధికెక్కింది. ఇంకా తెలంగాణలో విస్తారంగా ఉన్న అడవుల్లో కోయా, గోండు, చెంచు ప్రజలు తమవైన కళారూపాలను ప్రదర్శించడం మన సాంస్కృతిక చరిత్రకు కొత్త వన్నెను అద్దుతున్నాయి. ఇవే కాకుండా అనేక ప్రదర్శన కళలు సాంస్కృతిక వారసత్వానికి పెట్టని కోటలుగా వర్ధిల్లుతున్నాయి.


(మిగతాది రేపు)
వ్యాసకర్త: సాంస్కృతిక సారథి, ఎమ్మెల్యే

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!




ఇప్పటికైనా ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొనేనా....???!!!

land


ప్రభుత్వ భూములకు కంచెవేశారు!

నిరుపేద ప్రజలకు పంపిణీ చేసిన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. హైదరాబాద్ మహానగరానికి ఆనుకొని ఉన్న మొయినాబాద్ మండలంలోని కోట్ల విలువ చేసే ప్రభుత్వ(అసైన్డ్) భూములు చాలావరకు పరాధీనం పాలయ్యాయి. రెవెన్యూ అధికారులు భూమిని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ బోర్డులు పెట్టినా వాటిని పీకేసీ మరీ హార్స్‌రైడింగ్ క్లబ్ ఆక్రమించింది. లావణీ చట్టాలను, 111 జీవోను తుంగలో తొక్కి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ భూ మాయ హైదరాబాద్‌లోని అప్పా సమీపంలో, హైదరాబాద్-బీజీపూర్ రహదారికి ఆనుకొని ఉన్న అజీజ్‌నగర్ రెవెన్యూలో చోటు చేసుకుంది. హైదరాబాద్ మహానగరానికి, ఔటర్ రింగ్‌రోడ్డుకు సమీపంలో మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్ గ్రామ రెవెన్యూలో దాదాపు 146.13 ఎకరాలను 1961లో ప్రభుత్వం 46 మంది రైతులకు లావణీ చట్టం కింద పంపిణీ చేసింది. 



-మొయినాబాద్‌లో బోర్డు పీకేసీ మరీ అక్రమ నిర్మాణాలు
-హార్స్ రైడింగ్ క్లబ్ ఆధీనంలో 12 ఎకరాలు
-కబ్జా భూమి విలువ రూ.50 కోట్లు
-చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు

అట్టి భూములను పంటల సాగుకు వినియోగించుకోవాలి తప్ప క్రయవిక్రయాలు జరపరాదు. కొందరు లబ్ధిదారులు ఇతరులకు విక్రయించడంతో 1996లో పీవోటీ చట్టం కింద 112.31 ఎకరాలను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. ఇందులో 12 ఎకరాలు తమవేనంటూ కొందరు ఆర్డీవో కోర్టుకు వెళ్లారు. 2010లో నాటి చేవెళ్ల స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఇది ప్రభుత్వ భూమి కాదని, పట్టా(ప్రైవేటు భూమి) అంటూ ఆదేశాలిచ్చారు. 2011లో దీనిపై సమగ్ర విచారణ జరిపిన జాయింట్ కలెక్టర్ ఇది ప్రభుత్వ భూమి అని తిరిగి ఆదేశాలిచ్చారు. తక్షణమే ఆ భూమిని పరిశీలించాలని అప్పటి మొయినాబాద్ తహసీల్దార్‌ను ఆదేశించారు. అప్పటికే క్లబ్ చేపట్టిన నిర్మాణాలను అధికారులు తొలగించి ప్రభుత్వ భూమి అని బోర్డుఏర్పాటు చేశారు. అయితే హైదరాబాద్ పోలో అండ్ హార్స్ రైడింగ్ క్లబ్ ప్రతినిధులు ఆ బోర్డును పీకేసీ రూ.50 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కంచె వేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు.


వందల ఎకరాల అసైన్డ్ భూములు అన్యాక్రాంతం


అజీజ్‌నగర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 176, 177లలో ప్రభుత్వ భూములు ఉన్నాయి. 177సర్వేలోని మొత్తం 162.08 ఎకరాల్లో 146.13 ఎకరాలను గతంలోనే ప్రభుత్వం నిరుపేద రైతులకు పంపిణీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూముల క్రయవిక్రయాలు జరగడంతో రెవెన్యూ అధికారులు 112.31 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. సర్వే నంబర్ 176లో 220.37 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా ..అందులో 209 ఎకరాలను అసైన్డ్ చేశారు. ఇక్కడా క్రయవిక్రయాలు జరగడంతో అప్పటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులోని 126.29 ఎకరాలను అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం దిల్ సంస్థకు కేటాయించింది. అక్కడా భారీగా కబ్జాలు చోటుచేసుకున్నాయి. అన్యాక్రాంతమైన విలువైన భూములను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకోవచ్చని స్థానికులు అంటున్నారు.


జేసీ ఉత్తర్వుల ప్రకారం చర్యలు తీసుకుంటాం


-మండల తహసీల్దార్ పీఎల్ గంగాధర్ హైదరాబాద్ పోలో హార్స్ రైడింగ్ క్లబ్ నిర్వాహకులు ప్రభుత్వ భూమిలోనే క్లబ్‌ను ఏర్పాటు చేశారు. పక్కా ప్రభుత్వ భూమి అని గుర్తించాం. ఆ భూమికి సంబంధించిన నివేదికను జేసీకి నివేదించాం. అట్టి నివేదికను జేసీ విచారిస్తున్నారు. జేసీ జారీ చేసే ఉత్తర్వుల ప్రకారం చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూమిని ఎవరు కబ్జా చేసినా ఉపేక్షించేది లేదు. చట్టపర చర్యలు తీసుకుంటాం...అంటున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వభూములకు స్వేచ్ఛ దొరికేనా...అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


సోమవారం, మే 25, 2015

తగిన చర్యలు తీసుకోకపోవడంలోని...లోగుట్టు పెరుమాళ్ళకెరుక...!!!

govt


సర్కారు భూమికి రెక్కలు...156 ఎకరాలు.. విలువ 300 కోట్లు:

సుమారు రూ.300 కోట్ల విలువైన సర్కారు భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళుతున్నది. కాపాడాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కపెడుతున్నారు. ప్రభుత్వ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా బాజాప్తా నమోదై ఉన్నా.. నిబంధనలు అనుమతించకున్నా యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి. విషయం ఉన్నతాధికారులకు తెలిసినా వాటిని రద్దు చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇదేమని అడిగినవారు లేరు. వివిధ విభాగాల ఉద్యోగులు పక్కవారి మీదికి బాధ్యతలు నెట్టేస్తూ చేతులు దులిపేసుకుంటున్నారు. నగర శివార్లలోని అత్యంత విలువైన గండిపేట గ్రామంలో జరుగుతున్న బాగోతమిది. 


-22-ఏ కింద గుర్తించినా యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు
-మీనమేషాలు లెక్కిస్తున్న ఉన్నతాధికారులు
-బాధ్యతలు దులిపేసుకుంటున్న ప్రభుత్వ శాఖలు
-రిజిస్ట్రేషన్ల రద్దుపై కొనసాగుతున్న అయోమయం
ఇదీ జరుగుతున్నది.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని గండిపేట గ్రామ పరిధిలో సర్వేనంబరు 65లో ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 65/1 నుంచి 65/33 వరకు ఉన్న సర్వేనంబర్లలోని 156.17 ఎకరాలు సర్కారుదేనని ఇప్పటికే ఆర్‌ఓఆర్‌లో నమోదైంది. చాలా ఏండ్ల కిందటే ఈ భూమిని 22-ఏ కింద గుర్తించారు. రిజిస్ట్రేషన్ శాఖ చట్టం ప్రకారం 22-ఏ కింద గుర్తించిన భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్ట్రేషన్లు చేయడానికి వీలు లేదు. ఒకవేళ దీనిపై న్యాయస్థానాల నుంచి ఏవైనా ఉత్తర్వులు ఉన్నట్లయితే, జిల్లా జాయింట్ కలెక్టర్ నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్‌వోసీ) సమర్పిస్తేనే రిజిస్ట్రేషన్ చేయాలని నిబంధనలు చెప్తున్నా యి. అయినా రిజిస్ట్రేషన్ శాఖాధికారులు ఇవేవీ పట్టించుకోవడం లేదు. విలువైన ఈ భూమిని యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ పోతున్నారు. 


1999లో మొదలైన ఈ అక్రమ ప్రక్రియ ఇవాల్టికీ కొనసాగుతున్నది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో కూడా సుమారు 40 ఎకరాలకు పైగా భూమి ముగ్గురి పేరిట రిజిస్ట్రేషన్లు చేశారు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత ఉన్న అధికారులే ఇలా అత్యంత విలువైన భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం వెనుక భారీ ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నట్లు ఆరోపణలున్నాయి. 


మీనమేషాలు లెక్కిస్తున్న అధికారులు:
నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ రిజిస్ట్రేషన్ల వ్యవహారం మీద ఇప్పటికే రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖలకు చెందిన ఉన్నతాధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చినట్లు తెలిసింది. అయినా చర్యలు తీసుకోవడం, రిజిస్ట్రేషన్లను రద్దు చేయడంపై వారు మీనమేషాలు లెక్కిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఒక రిజిస్ట్రేషన్ రద్దు చేయాలంటే అమ్మినవారు, కొన్నవారి అంగీకారంతోనే జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రభుత్వం అయినందున సంబంధిత శాఖ నుంచి సిఫార్సు రావాల్సి ఉంటుంది. ఈ మేరకు రద్దుకు సిఫార్సు చేయాల్సిందిగా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు రెవెన్యూ శాఖను కోరినట్లు తెలిసింది. అయితే జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు వస్తే తప్ప తాము జోక్యం చేసుకోబోమని స్థానిక రెవిన్యూ అధికారులు చేతులు దులుపుకొన్నట్టు తెలిసింది. ఇలా ఈ రెండు శాఖల మధ్య వ్యవహారం నలుగుతుండగా మరోవైపు రిజిస్ట్రేషన్లు కొనసాగుతూనే ఉన్నాయి.

సమైక్య సర్కారులో పట్టించుకునే దిక్కు లేదు:
సమైక్య సర్కారు హయాంలో మరీ ఘోరం. వాస్తవంగా 65 సర్వేనంబరులో మొత్తం 958 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 65/1 నుంచి 65/33 వరకు విస్తరించి ఉన్న 156.17 ఎకరాల విస్తీర్ణం గండిపేట-శంకర్‌పల్లి ప్రధాన రహదారికి అనుసరించి ఉంది. ఇది సీబీఐటీకి అతి సమీపంలో ఉండటంతో ఈ భూములకు బాగా డిమాండు ఉంది.

దీంతో కొందరు పెద్దలు కన్నేసి ఇది తమ భూమి అంటూ రంగంలోకి వచ్చారు. దీంతో 2005 సంవత్సరంలో అప్పటి రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ ఎస్‌ఎం రిజ్వీ సమగ్ర విచారణ జరిపి అది ప్రభుత్వ భూమిగా తేల్చారు. క్షేత్రస్థాయికి వెళ్లి, ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రైవేటు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించగా వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ తర్వాత మరో ప్రైవేటు వ్యక్తి కూడా హైకోర్టుకు వెళ్లి, అదేరీతిలో తన భూమి అంటూ మరో ఆర్డర్‌ను తీసుకువచ్చారు. తెరవెనక పావులు కదలడంతో ఆనాడు ప్రభుత్వపరంగా ఈ భూమిని కాపాడుకునేందుకు అధికారుల వైపునుంచి సరైన చర్యలు తీసుకోలేదు. పైగా పరోక్షంగా ప్రైవేటు వ్యక్తులకు సహకరించారనే ఆరోపణలున్నాయి. ఇదిలాఉంటే ఇప్పటివరకు ప్రభుత్వ రికార్డుల్లో ఆ 156.17 ఎకరాలు ప్రభుత్వ భూమిగానే ఉంటూ వస్తున్నది.

ముఖ్యంగా 22-ఏ జాబితా నుంచి వాటిని తొలగించలేదు. నిబంధనల ప్రకారం ఆ భూములు రిజిస్ట్రేషన్ చేయడం చట్టవిరుద్ధం. అయినప్పటికీ ఒకవైపు రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా, మరోవైపు గతంలో జాయింట్ కలెక్టర్ ప్రభుత్వ భూమిగా తేల్చి స్వాధీనం చేసుకున్న భూమిపై అధికారులు ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకుని ఇంత విలువైన భూమిపై న్యాయ పోరాటం సాగించాలని, మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న రిజిస్ట్రేషన్లపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండు చేస్తున్నారు.

పరిశీలించి, చర్యలు తీసుకుంటాం... ఆర్డీవో:


ఈ విషయంపై నమస్తే తెలంగాణ రాజేంద్రనగర్ ఆర్డీవో పొద్దాటి సురేష్‌ను సంప్రదించగా నిబంధనల ప్రకారం 22-ఏ కింద గుర్తించిన భూములను రిజిస్ట్రేషన్ చేయడం సరికాదని స్పష్టం చేశారు. సర్వేనంబరు 65కు సంబంధించిన అంశంపై పరిశీలిస్తామని, రిజిస్ట్రేషన్ల రద్దుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ విషయంపై జిల్లా రిజిస్ట్రార్ అశోక్‌ను సంప్రదించగా దీనికి సంబంధించిన నివేదికను పది రోజుల క్రితం జిల్లా కలెక్టర్‌కు సమర్పించానని తెలిపారు. కలెక్టర్ తుది నిర్ణయం తీసుకొని ఆదేశాలు జారీ చేస్తే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. మరెందుకో ఈ తాత్సారం.........???!!!


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


శుక్రవారం, మే 22, 2015

భూదాన్ అక్రమార్కులకు బిగుస్తున్న ఉచ్చు!!!


భూదాన్ బోర్డుకు చెందిన అత్యంత విలువైన భూములను అయినవారికి అడ్డగోలుగా కట్టబెట్టిన సంస్థ చైర్మన్, సభ్యుల మెడకు ఉచ్చు బిగుస్తున్నది. అక్రమాల్లో కీలక పాత్ర పోషించిన చైర్మన్ రాజేందర్‌రెడ్డితోపాటు వైస్ చైర్మన్ ఇతర సభ్యులపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నపుడు తమకున్న పలుకుబడిని ఉపయోగించి వారు భారీ మోసానికి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు చేపట్టాలని భావిస్తున్నది. అంతులేని వారి అక్రమాకు అండగా నిలిచిన నాటి కాంగ్రెస్ సర్కారు పెద్దలు ఎవ్వరనేదానిపై కూడా విచారణ చేయిస్తున్నట్లు తెలిసింది. భూదాన్ బోర్డును ఇప్పటికే రద్దుచేసిన ప్రభుత్వం తదుపరి చర్యలపై వేగం పెంచింది.


25 వేల ఎకరాల భూమి అన్యాక్రాంతం: 

నాటి కాంగ్రెస్ పెద్దల అండదండలతో అక్రమంగా భూదాన్ యజ్ఞబోర్డు చైర్మన్ పదవిని దక్కించుకొన్న రాజేందర్‌రెడ్డి భూదాన్ భూములను భారీఎత్తున చట్టవిరుద్ధంగా విక్రయించినట్లు ఆరోపణలున్నాయి. ఆయన హయాంలో దాదాపు 25 వేల ఎకరాల భూమిని అనర్హులకు అప్పగించారని సమాచారం. విలువైన భూములను ప్లాట్లుగా మార్చి విక్రయించారనే విమర్శలు కూడా చాలా వచ్చాయి. అనేక సంస్థలు, సొసైటీలు, కొంతమంది బడాబాబులకు ఆ భూములను రాజేందర్‌రెడ్డి అప్పనంగా అప్పగించారని పలువురు పేర్కొంటున్నారు. అంతేకాకుండా బినామీ పేర్లతో 140 ఎకరాల భూదాన్ భూమిని ఆయన కాజేరని సమాచారం. భూదాన్ భూములకు ఎన్‌ఓసీలు ఇవ్వడం రాజేందర్‌రెడ్డి హయాంలో ఒక దందాగా నడిచిందని ప్రభుత్వ విచారణలో తేలింది. కావలికారుగా జీవితాన్ని ప్రారంభించిన రాజేందర్‌రెడ్డి భూదాన్ బోర్డు చైర్మన్ దక్కించుకొని భారీగా ఆస్తులు కూడబెట్టడం వెనుక నాటి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల పాత్ర ఎంతో ఉందని తెలంగాణవాదులు పేర్కొంటున్నారు. 


ఫోర్జరీ లేఖతో బోర్డు నియామకం: 

భూదాన్ యజ్ఞబోర్డుకు చైర్మన్‌గా రాజేందర్‌రెడ్డితోపాటు మొత్తం 11 మందిని నియమిస్తూ నాటి కాంగ్రెస్ సర్కారు 2012, డిసెంబర్ 14వ తేదీన జీవో 687 విడుదల చేసింది. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న మహిళా కేంద్ర అధ్యక్షురాలు వీణా బెహన్ సిఫారసు మేరకు వారిని నియమిస్తున్నట్లు జీవోలో ఆనాటి రెవెన్యూ కార్యదర్శి అనిల్‌చంద్ర తెలిపారు. భూదాన్ చట్టం ప్రకారం ఆచార్య వినోబా భావే సిఫారసు చేసినవారినే బోర్డు సభ్యులుగా నియమించాలి. ఆయన తదనంతరం అయితే ఆయనకు నామినీగా ఉన్నవారు సిఫారసు చేస్తే ప్రభుత్వం నియమించాలి. కానీ రాజేందర్‌రెడ్డితోపాటు ఇతర సభ్యులను వినోబాభావే నామినీ అయిన సర్వసేవా సంఘ్ సిఫారసు చేయలేదు. వీణా బెహన్ రాసినట్లుగా ఉన్న ఓ లేఖ ఆధారంగా ఆనాడు రాజేందర్‌రెడ్డి తదితరులను నియమించారు. బోర్డు అక్రమాలపై ప్రభుత్వం జరిపిన విచారణలో వీణా బెహన్ లేఖ కూడా ఫోర్జరీదేనని తేలటంతో అందరూ అవాక్కయ్యారు. ఇంత జరిగినా, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పరిశీలించకుండా గుడ్డిగా బోర్డును నియమించటంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీణా బెహన్ లేఖపై అధికారులు విచారణ చేపట్టగా తాను అలాంటి లేఖ ఎవ్వరికీ రాయలేదని ఆమె చెప్పడంతో రాజేందర్‌రెడ్డి ముఠా అక్రమాల పుట్ట బద్దలయ్యింది.




(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)


జై తెలంగాణ! జై జై తెలంగాణ!


తెలంగాణలోని ఆస్తులు.. టీఎస్ ఆర్టీసీకే!!

- 28న తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ అపాయింటెడ్ డే
- పర్మిట్లు ముగియగానే ఏపీ బస్సుల నుంచి టాక్స్
- కార్మికుల కష్టాలు చూసే సీఎం ఫిట్‌మెంట్ ఇచ్చారు
- ఇతర రాష్ర్టాలతో పోల్చితే రాష్ట్రంలో చార్జీలు తక్కువ
- త్వరలో 60 ఏసీ, 10 గరుడ ప్లస్ బస్సుల కొనుగోలు
- ఆర్టీసీ లోగో ఆవిష్కరణలో మంత్రి మహేందర్‌రెడ్డి
రాష్ట్రంలోని ఆర్టీసీ ఆస్తులన్నీ టీఎస్ ఆర్టీసీకే చెందుతాయని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆస్తుల విషయంలో ఏపీ మంత్రితోపాటు కార్మికులకు కూడా స్పష్టత ఉందన్నారు. ప్రస్తుత పర్మిట్ల కాలపరిమితి ముగియగానే ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణకు వచ్చే అన్ని బస్సుల మాదిరిగానే ఏపీ బస్సులకు కూడా పన్ను విధిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం మిగతా రాష్ర్టాల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని, ప్రభుత్వాన్ని చూస్తుందన్నారు. మే 28న టీఎస్ ఆర్టీసీ అపాయింటెడ్ డే ఉంటుందన్నారు. 


ts_rtc

గురువారం బస్‌భవన్‌లో టీఎస్ ఆర్టీసీ లోగో, కొత్త రంగులతో రూపొందించిన పల్లెవెలుగు బస్సులను ప్రారంభించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు చాలా కష్టపడుతున్నారని, ప్రజలను గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవేయడంలో ఎనలేని సేవలు అందిస్తున్నారని తెలిపారు. కార్మికులు 43 శాతం ఫిట్‌మెంట్ డిమాండ్ చేస్తే సీఎం కేసీఆర్ 44 శాతం ఇచ్చారని అన్నారు. సీఎం నమ్మకాన్ని నిలబెట్టడానికి అందరం కలిసికట్టుగా పనిచేసి నష్టాల్లో ఉన్న ఆర్టీసీనీ లాభాల్లోకి తెచ్చుకుందామని సూచించారు.


బస్సు చార్జీల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్న మంత్రి మహేందర్‌రెడ్డి.. 
ఎంత శాతం పెంచుతామనే విషయంపై స్పష్టత ఇవ్వలేనన్నారు. చార్జీల విషయంపై ఈ వారంలో సమావేశమవుతామన్నారు. ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణ రాష్ట్రంలో బస్సు చార్జీలు తక్కువగా ఉన్నాయన్నారు. డీజీల్ రేటు అనేకసార్లు పెరిగినా రెండేండ్లుగా ఆర్టీసీ చార్జీలు పెంచలేదన్నారు. మే 28న ఆర్టీసీ తాత్కాలిక విభజన జరుగుతుందని, త్వరలోనే కేంద్రం నుంచి విభజనకు అధికారిక ఉత్తర్వులు వస్తాయని పేర్కొన్నారు.


ఆర్టీసీ లోగోతోపాటు పల్లె వెలుగు బస్సుల్లో బంగారు తెలంగాణ చిహ్నాలు ఉన్నాయని, హరిత హారం వంటి పథకాలు ప్రతిబింబిస్తున్నాయన్నారు. సీఎం ఇచ్చిన రూ.150 కోట్లతో 500 కొత్త బస్సులు కొనుగోలు చేస్తామన్నా రు. అందులోనుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 20 కోట్ల వ్యయంతో 60 కొత్త రాజధాని ఏసీ(ఇంద్ర) బస్సులు, రూ.10 కోట్లతో 10 అత్యాధునిక, సౌకర్యవంతమైన మల్టీయాక్సిల్ గరుడ ప్లస్, వోల్వో ఏసీ బస్సులు ఈ నెలాఖరులోగా ప్రవేశపెడ్తామని చెప్పారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!