గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, జూన్ 24, 2014

సుప్రీంలో తెలంగాణ దాఖలుచేయనున్న ఇంప్లీడ్ పిటిషన్!

- బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పుపై సవాల్ చేయనున్న ప్రభుత్వం
- అధికారులు, జలరంగ నిపుణులతో సీఎం కేసీఆర్ సమీక్ష

kcr
 కృష్ణా జలాల పంపిణీపై జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నీటి పంపకాలే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటకలను కలిపి మళ్లీ తాజాగా వాదనలు వినాలని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌లో కోరనుందని సమాచారం. పిటిషన్‌లో ఏయే అంశాలను చేర్చాలి? దేనిపై వాదనలు వినిపించాలి? అనే అంశాలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు, న్యాయనిపుణులతో సోమవారం ప్రత్యేకంగా చర్చించారు. 

మంత్రి హరీశ్‌రావు, అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రారావు, నీటిపారుదలశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్‌లు నారాయణరెడ్డి, మురళీధర్, నీటిపారుదలరంగ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీమాంధ్ర ఆధిపత్యంలోని సమైక్య రాష్ట్రసర్కారు అప్పట్లో ట్రిబ్యునల్ ముందు తెలంగాణ ప్రాజెక్ట్‌లపై గట్టిగా వాదించకపోవడంతో తీవ్ర అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాదించబోతోంది. 

కృష్ణా మిగులు జలాల పంపిణీపై బ్రిజేశ్ ఇచ్చిన అంతిమ తీర్పును గెజిట్‌లో ప్రచురించరాదని, మిగులు జలాలపై స్వేచ్ఛ కాదు హక్కు కావాలని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం వేసిన పిటిషన్లపై ప్రస్తుతం సుప్రీం కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఇటీవల విచారణను సుప్రీంకోర్టు జూలై మూడో వారానికి వాయిదా వేసింది. జూన్ 2న కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు ఇప్పుడు రైపేరియన్ స్టేట్‌గా తన అభ్యంతరాలపై పిటిషన్ వేసి వాదనలు వినిపించే అవకాశం లభించింది. బ్రిజేశ్ ట్రిబ్యునల్ తన పరిధి దాటి వ్యవహరించిందని, మిగులుజలాల్లో తమకు కూడా హక్కు ఉంటుందని కర్ణాటక సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. తమకు కేటాయించిన నీటిపై కూడా షరతులు పెట్టడం సరికాదని పిటిషన్‌లో పేర్కొంది.

తెలంగాణ, ఏపీ మధ్య నీటి కేటాయింపులకు సంబంధించిన అంశాలపై వాదనలు వినేందుకు వీలుగా బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ గడువును కేంద్రం రెండేళ్లు పొడిగించిన విషయం తెలిసిందే. ట్రిబ్యునల్ ఇకపై తెలంగాణ, ఏపీ వాదనలు విననుంది. కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఏపీ ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా అదే ట్రిబ్యునల్ ఎదుట తమ వాదనలు వినిపించాల్సి ఉంది. బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పును వ్యతిరేకిస్తూ సమైక్య ఏపీ ప్రభుత్వం సుప్రీంలో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌లో తెలంగాణ కూడా ఇంప్లీడ్ కావాలని అంతర్‌రాష్ట్ర జలవనరుల విభాగం ఇంజినీర్లు ఇదివరకే నివేదిక ఇచ్చారు. 

2578 టీఎంసీల సరాసరి ప్రవాహం కంటే ఎక్కువ ఉన్న నీటిపై బేసిన్ నిష్పత్తి ప్రకారం వాటాను సాధించుకోవడానికి ప్రయత్నించాలని వారు సూచించారు. కృష్ణా బేసిన్ ఎక్కువగా ఉన్న తెలంగాణకు వరదజలాలను పంచాలని, నాగార్జునసాగర్, శ్రీశైలంలో 150టీఎంసీల క్యారీఓవర్ స్టోరేజి నీటిలో వాటాను బేసిన్ ప్రకారం పంచాలని తెలంగాణ ప్రభుత్వం వాదించనుంది. బేసిన్‌లో ఉన్న తెలంగాణ ప్రాజెక్ట్‌లకు ముందుగా వరదజలాలను కేటాయించిన తర్వాతే సీమాంధ్ర ప్రాజెక్ట్‌లకు నీరు వదలాలన్న డిమాండ్లను సుప్రీం కోర్టుకు నివేదించనుంది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి