గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, జూన్ 30, 2014

తస్మాత్ జాగ్రత...జాగ్రత!

-ఆంధ్రా బాబు తీరుపై అప్రమత్తతతో ఉండాలి
-సీమాంధ్ర పాలకుల తప్పులను సరిదిద్దాలె..
- మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం
-ప్రజలకు సుపరిపాలన అందిద్దాం.. మన పాలన చూసి దేశం గర్వించాలె
-పథకాల అమలులో పూచికపుల్లంత అవినీతి జరుగొద్దు
-క్యాంపు కార్యాలయంలో మంత్రులతో భేటీ
-ఏపీతో వివాదాంశాలు, స్థానిక ఎన్నికలపై రెండు గంటలపాటు చర్చ
-జెడ్పీ చైర్మన్ ఎన్నికల కోసం మంత్రులకు జిల్లాల బాధ్యతలు

employeeప్రభుత్వ పథకాలు పారదర్శకంగా, వేగంగా అమలు జరిగేలా నిరంతరం అప్రమత్తతతో పనిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తన మంత్రివర్గ సహచరులకు సూచించారు. తెలంగాణ ప్రజలకు దేశం గర్వించదగ్గ సుపరిపాలన అందిద్దామని పిలుపునిచ్చారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఆదివారం వివిధ శాఖల మంత్రులతో రెండుగంటలపాటు సమావేశమై పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. కృష్ణా జలాల పంపిణీ, విద్యుత్ ఒప్పందాలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవలంబిస్తున్న వివాదాస్పద వైఖరి, త్వరలో జరుగనున్న జెడ్పీ చైర్మన్ ఎన్నికలపై ప్రధానంగా చర్చించిన ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, మహమూద్ అలీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జోగురామన్న, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ditssసమైక్య రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు చేసిన తప్పిదాలను పునః పరిశీలించి తెలంగాణకు జరిగిన అన్యాయాలను సవరించేందుకు మంత్రులు కృషి చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేలా తరుచూ వివాదాలు సృష్టిస్తున్న అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ధోరణిని ఎప్పటికప్పుడు అంచనావేస్తూ తెలంగాణకు ఏమాత్రం నష్టం రాకుండా అప్రమత్తతతో మెలగాలని మంత్రులకు సూచించారు. నదీ జలాల పంపిణీపై ఆంధ్రప్రదేశ్ తప్పుడు వాదనలను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావును ఆదేశించారు.

అవసరమైతే ఎక్కడైనా తెలంగాణ వాదనను బలంగా వినిపించేందుకు న్యాయవాదులను సిద్ధం చేసుకోవాలని సూచించినట్లు తెలిసింది. సొంత రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తూనే పక్క రాష్ట్రం వ్యవహారాలపై కన్నేసి ఉంచాలని సూచించినట్లు సమాచారం. మంత్రుల పేషీల్లో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేసేలా చూడాల్సిన బాధ్యత మంత్రులదేనన్నారు. ప్రజా సంక్షేమ పథకాల అమలులో పూచికపుల్లంత అవినీతి కూడా జరుగటానికి వీల్లేదని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం.

అత్యధిక జెడ్పీ స్థానాలను దక్కించుకోవాలె

జిల్లా పరిషత్, మండల పరిషత్ చైర్మన్లు, నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కించుకొనేందుకు కృషి చేయాలని మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. హంగ్ ఏర్పడిన జిల్లాల్లో చైర్మన్ పోస్టులను దక్కించుకొనేందుకు వ్యూహాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ జిల్లాల్లో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమైనప్పటికీ రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో పార్టీ నేతలను సమన్వయం చేసి విజయం సాధించేందుకు పలువురు మంత్రులకు ఆయా జిల్లాల బాధ్యతలు అప్పగించారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

పదవీ విరమణ వయస్సును 60 ఏండ్లకు పెంచాలి

-ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి
-టీ ఉద్యమంలో ఉద్యోగులపై పెట్టిన కేసులు ఎత్తేయాలి
-ప్రభుత్వానికి టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ విజ్ఞప్తి
-టీఎన్జీవో కేంద్ర కార్యవర్గం భేటీ.. ఉద్యోగ సమస్యలపై చర్చ
-అనంతరం సీఎం కేసీఆర్‌ను కలిసి సమావేశ తీర్మానాలు అందజేత
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు జీ దేవీప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. వివిధ ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వెంటనే చర్యలు తీసుకొని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం నాంపల్లిలోని తెలంగాణ ఉద్యోగ భవన్‌లో దేవీప్రసాద్ అధ్యక్షతన టీఎన్జీవో కేంద్ర సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది.

employee
ఉద్యోగుల సమస్యలు, న్యాయమైన డిమాండ్లు, ప్రభుత్వ ఇచ్చిన హామీల అమలుపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి పది డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. అంతకుముందు సమావేశ వివరాలను దేవీప్రసాద్ విలేకరులకు వెల్లడించారు.

-రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి ఉన్నత  స్థాయి అధికారుల వరకు పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లుగా ఉందని, ఇదే  విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అమలు చేయాలని,
-ఉద్యోగులకు ఆరోగ్య కార్డులివ్వాలని,
-10వ పీఆర్సీతోపాటు 70 శాతం ఫిట్‌మెంట్‌ను అమలుచేయాలని,
-తెలంగాణ ఉద్యమంలో భాగంగా 42 రోజులపాటు నిర్వహించిన సకలజనుల  సమ్మెను విధుల్లో ఉన్నట్లుగా పరిగణించాలని,
-తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులపై నమోదుచేసిన కేసులను వెంటనే  ఉపసంహరించుకోవాలని,
-ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు మంజురు చేయాలని,
-తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇవ్వాలని 

విజ్ఞప్తి చేశారు. కార్యవర్గ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి కే రవీంద్రరెడ్డి, కార్యవర్గ సభ్యులు బండారు రేచల్, బుచ్చిరెడ్డి, రామినేని శ్రీనివాసరావు, మంగళగిరి హరిబాబు, నగరశాఖ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు తదితరులతోపాటు పలు జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.

దేవీప్రసాద్ నాయకత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆయన అధికారిక నివాసంలో కలిసిన నేతలు దాదాపు రెండున్నర గంటలపాటు ఉద్యోగ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాభివృద్ధి కోసం తాము ఉద్యోగులుగా కాకుండా శ్రామికులుగా పని చేస్తామని, అన్ని వేళలా ప్రభుత్వానికి అండగా ఉంటామని దేవీప్రసాద్ ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. సీఎం కలిసిన వారిలో టీఎన్జీవో నేతలు కే రవీంద్రరెడ్డి, కార్యవర్గ సభ్యులు బండారు రేచల్, బుచ్చిరెడ్డి, రామినేని శ్రీనివాసరావు, మంగళగిరి హరిబాబు తదితరులు ఉన్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

వ్యతిరేకిస్తున్నా...ముంపు విలీన జీవో వెలువరించటం అప్రజాస్వామికం!

ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేసిన జీవో నెంబర్ 18411ను నిరసిస్తూ పోలవరం ముంపు మండలాల్లో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఆదివారం ఖమ్మంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో జీవో ప్రతులను, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ జిల్లాలోని ఏడు మండలాలను తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగించాలని అనేక విధాలుగా ఆందోళన చేస్తూన్నప్పటికీ వారి సమస్యను పరిష్కరించకుండా ఆగమేఘాల మీద ఏపీ ప్రభుత్వం ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తూ జీవోను జారీ చేయడం అప్రజాస్వామిక చర్య అని ధ్వజమెత్తారు. అఖిలపక్ష నాయకులు కుక్కునూరు ప్రధాన రహదారిపై బైఠాయించి ఉత్తర్వు ప్రతులను దహనం చేశారు.

ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వింజరం రేవు వద్ద గోదావరి నదిలో నాయకులు జలదీక్ష చేపట్టి నిరసన తెలిపారు. భద్రాచలంలో టీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల విద్యార్థి కార్యాచరణ వేదిక చేపట్టిన మూడో రోజు కూడా రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాధినేని పూర్ణచందర్‌రావు మాట్లాడుతూ ముంపు మండలాలను సీమాంధ్రలో కలపడం వలన ఐదు వేల మంది ఉద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. పోలవరం ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని కోరుతూ ముంపు మండలాల్లో సోమవారం తలపెట్టిన విద్యా సంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని పోలవరం వ్యతిరేక కమిటీ కన్వీనర్ వట్టం నారాయణదొర పిలుపునిచ్చారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

పక్కా గోల్‌మాల్...!

-ఇండ్లు మాయ.. 
-కోట్లు మాయం.. 
-లెక్కతేలని లక్షల ఇండ్ల కథ
-కోట్లు ఖర్చయినా పేదలకు దక్కని ఇండ్లు
-అక్రమార్కుల జేబుల్లోకి రూ.3800 కోట్లు 
-593 గ్రామాల్లోనే రూ.236 కోట్ల అవినీతి
-ప్రభుత్వ విచారణలో బయటపడ్డ నిజాలు
-సోషల్ ఆడిట్‌లోనూ వెల్లడైన అవినీతి
-అక్రమాలను అసెంబ్లీలో ప్రస్తావించిన సీఎం కేసీఆర్

-రాష్ట్రంలో 84.20 లక్షల కుటుంబాలు
-పక్కా ఇండ్లున్న కుటుంబాలు 57లక్షలు
-శిధిలావస్థలో ఉన్నవి 3.37 లక్షలు
-సర్కారు కట్టింది 55 లక్షలు
-కట్టాల్సినవి మరో 10 లక్షలు
-పిలిస్తే.. మరో 25 లక్షల దరఖాస్తులు రెడీ

-నిజమైన లబ్ధిదారులకే ఇండ్లు చేరాలి
-లబ్ధిదారుల ఎంపికకు కఠిన నిబంధనలు తేవాలి
-అసలైన పేదలకే ఇండ్లు దక్కాలి
-తెలంగాణ ప్రజల ఆకాంక్ష
Indiramma-House


రాష్ట్రంలో రెండున్నర దశాబ్దాల ఇండ్ల నిర్మాణ పథకం కరిమింగిన వెలగపండైంది. అధికారులు, రాజకీయనాయకులు అందినకాడికి దోచుకుని నిరుపేదను గాలికీ, ధూళికీ వదిలేశారు. కాగితాల మీదే ఇండ్లు కట్టి, పాత ఇండ్లకు రంగులు వేసి, ఉన్న వాళ్లే మళ్లీ మంజూరు చేయించుకుని అక్షరాలా రూ. 3,800 కోట్ల పేదల సొమ్ము దోచుకున్నారు. గూడు కావాలనుకున్న పేదలను అపహాస్యం చేశారు. మళ్లీ మంజూరు చేసే ఇండ్ల కోసం అర్రులు చాస్తున్నారు. ఈ తరుణంలో స్వరాష్ట్రంలో సొంత ఇంటి కోసం ఎదురుచూస్తున్న అసలైన నిరుపేదలకు లబ్ధి చేకూరాలంటే ప్రభుత్వం అప్రమత్తం కావాల్సి ఉంది.. సర్కారు సొమ్ము ప్రతి పైసా అర్హులైన పేదలకు చేరాలంటే ఎంపిక విధానాలను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉంది.

ఏ ఒక్క నిరుపేదా అన్యాయానికి గురికాకుండా చూడడంతోపాటు ఎట్టి పరిస్థితిలోనూ అనర్హులకు లబ్ధి చేకూరకుండా వెయ్యికండ్లతో కనిపెట్టాల్సి ఉంది. దేశమంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్న ప్రతిష్ఠాత్మక రెండు పడక గదుల ఇండ్ల పథకం చేపట్టబోతున్న ముఖ్యమంత్రి కేసీఆర్, దాన్ని సంపూర్ణంగా అమలు చేయడంతోపాటు అర్హులైన.. అసలైన పేదలకే అందించిన ఖ్యాతిని సైతం ఆర్జించాలన్నదే సకల తెలంగాణ జనుల ఆకాంక్ష!
పేదల ఇండ్ల నిర్మాణంలో అవినీతి ఏరులై పారి దాదాపు రూ. 3,800 కోట్ల పేదల సొమ్ము అడ్డదారుల్లో అవినీతిపరుల చేతుల్లోకి చేరింది. ప్రభుత్వం అక్కడక్కడా నిర్వహించిన విచారణలోనే రూ.236.90 కోట్ల అవినీతి బయటపడింది. ఈ అవినీతిని సాక్షాత్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అసెంబ్లీలో సైతం ప్రస్తావించారు. దీనిని అరికట్టడానికి కలిసికట్టుగా ముందుగా సాగాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇప్పటివరకు ప్రభుత్వం నిర్మించిన 55 లక్షల ఇండ్లు నిజమైన లబ్ధిదారులకు చేరి ఉంటే రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలే ఉండేవారు కాదని గుర్తు చేశారు. రాజకీయ నాయకులు, అధికారులు కుమ్మక్కై పేదలకు చేరాల్సిన పథకాలను మధ్యలోనే బొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గహనిర్మాణ శాఖ ర్యాండమ్‌గా చేపట్టిన అంతర్గత విచారణలో వెలుగుచూసిన వాస్తవాలను ఆయన ప్రస్తావించారు. ఆ విచారణ నివేదిక నమస్తే తెలంగాణ చేతికి చిక్కింది. అందులో పేర్కొన్న వివరాలు..

అంతా మాయ..: ఇండ్ల నిర్మాణ పథకం అమలులోకి వచ్చిన రెండున్నర దశాబ్దాల కాలంలో రాష్ట్రంలో 55 లక్షల ఇండ్లు నిర్మించారు. ప్రభుత్వం నిర్మించిన ఇండ్లు నిజమైన లబ్ధిదారులకు చేరిఉంటే రాష్ట్రంలో ఇండ్లులేని పేదలే ఉండకూడదు. కానీ అంతా తలకిందుల కథ! ఇండ్లు కావాలని కోరుతూ 10.08 లక్షల మంది పేదలు పెట్టుకున్న దరఖాస్తులు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.

ఇప్పటికిప్పుడు ప్రభుత్వం సొంత ఇండ్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తే కనీసం 25 లక్షల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో చూసినా రాష్ట్రంలోని ఇప్పటికీ ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపాలిటీలో ఇండ్లు లేని పేదలు భారీ సంఖ్యలో ఉన్నారు. హైదరాబాద్ నగరపు మురికివాడల్లో సొంత ఇండ్లు లేక మగ్గుతున్న వారు భారీగా ఉన్నారు. మరోవైపు 2011 జనాభా లెక్కలను పరిశీలిస్తే రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితి మరోలా ఉంది. జనాభా లెక్కల హౌజ్ హోల్డ్ సర్వేలో రాష్ట్రంలో మొత్తం 84,20,662 కుటుంబాలున్నాయి.

ఇందులో మంచి ఇండ్లు ఉండి ప్రభుత్వ ఇండ్లు అవసరం లేని కుటుంబాలు 57,05,102 లక్షల దాకా ఉన్నాయి. ఆ స్థాయిలో కాకపోయినా నివాసానికి అనుకూలంగానే ఉన్న ఇండ్లు మరో 23,77,962 ఉన్నాయి. కేవలం 3,37,598 ఇళ్లు మాత్రమే శిధిలావస్థలో ఉన్నాయి. ఇది వాస్తవం కాగా ప్రభుత్వం వద్ద ఉన్న లెక్కల ప్రకారం ఇప్పటి వరకు ప్రభుత్వం 55 లక్షల ఇళ్లను నిర్మించింది. ఒక అంచనా ప్రకారం పాతకాలంలో నిర్మించిన 10 లక్షల సెమి ఇళ్లను మళ్లీ నిర్మించారని అనుకున్నా ప్రభుత్వం కొత్తగా నిర్మించిన ఇండ్ల సంఖ్య 45 లక్షలు. 

ఇప్పటికే ఉన్నవాటికి ప్రభుత్వం నిర్మించినవి కలిపితే రాష్ట్రంలో ఇండ్లు లేని వారే ఉండకూడదు. కానీ ప్రస్తుతం హౌసింగ్ కార్పొరేషన్ వద్ద 10.08 లక్షల కొత్త ఇండ్లు మంజూరై ఉన్నాయి. వాటి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు దరఖాస్తులు పిలిస్తే మళ్లీ పది లక్షల దరఖాస్తులు వస్తాయని అధికారుల అంచనా. అంటే లక్షలకు లక్షల ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా ఇండ్లు లేని వారు తగ్గడం లేదు. మరి నిర్మించిన పక్కానిర్మాణాలు ఎటుపోతున్నాయి. ఆ నిధులన్నీ ఏమయ్యాయన్నదే అసలు ప్రశ్న..

విచారణలో బయటపడ్డ రూ. 235.90 కోట్ల అవినీతి..

రాష్ట్రంలో ఇండ్ల నిర్మాణంపై భారీ ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో గత రాష్ట్ర ప్రభుత్వ హయాంలో వివిధ జిల్లాలో 593 గ్రామాలలో విచారణ జరిపారు. అక్కడక్కడా శాంపిల్‌గా ఎంపిక చేసిన 593 గ్రామాలలో జరిగిన విచారణలో రూ.236.90 కోట్ల అవినీతి జరిగిందని బయటపడింది. పై నుంచి కింది వరకు అన్ని స్థాయిల అధికారులు అవినీతికి పాల్పడ్డారని స్పష్టమైంది. ఈ 593 గ్రామాలలో 90,123 ఇండ్లను నిర్మించకుండానే నిర్మించామని చెప్పి డబ్బులు డ్రా చేశారని, 1.04,601 ఇండ్లను అనర్హులకు ఇచ్చారని విచారణలో తేలింది.

ఈ ఇళ్ల నిర్మాణంలో రూ.235.90 కోట్లు అవినీతి జరిందని నిర్థారించి రికవరీ చట్టం కింద వసూలు చేయాలని నోటిస్ ఇచ్చారు. ఇందులో రూ.2.87 కోట్లను రికవరీ చేసినట్లు అధికారులు చూపించారు. ఈ అవినీతిలో కార్పొరేషన్ రెగ్యులర్ అధికారులు 371, ఎంహెచ్‌ఓ, ఎంపీడీఓ, ఎమ్మార్వో, పంచాయతీ రాజ్ ఎఇలతో పాటు ఇతర అధికారులు 43 మంది, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు 94 మంది ఉన్నారు. వీరు కాకుండా రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు 294 మంది తేలారు. ఈ మొత్తం వ్యవహారంలో 179 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇందులో 85 మంది అధికారులు, 94 మంది రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లున్నారు. 

ప్రభుత్వం 150 మంది అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు 68 మంది మంది అధికారులను సర్వీస్ నుంచి తొలగించింది. ఈ రకమైన విచారణ అన్ని గ్రామాలలో జరపాలని భావించినా అప్పటి సర్కారు ఒత్తిళ్లకు తలొగ్గి విచారణను నిలిపి వేసింది. దీంతో అనేక మంది అక్రమార్కులు తప్పించుకు తిరుగుతున్నారు. కేవలం 593 గ్రామాలలో విచారణ జరిపితేనే రూ.237 కోట్ల అవినీతి జరిగినట్లు తేలితే మొత్తం రాష్ట్రంలోని 9 వేల గ్రామ పంచాయతీలో విచారణ జరిపితే కనీసం రూ.3800 కోట్ల మేర అవినీతి బయటకు వచ్చి ఉండేదని ఒక సీనియర్ అధికారి అన్నారు. 

సోషల్ ఆడిట్‌లోనూ బట్టబయలైన అవినీతి

వరంగల్ జిల్లాలో పరకాల మండలం వర్కల్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లపై నిర్వహించిన సామాజిక సర్వే రిపోర్టును పరిశీలిస్తే దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగు చూశాయి. హౌసింగ్ కార్పోరేషన్ ఎండీ కోరిక మేరకు సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అకౌంటబులిటీ అండ్ ట్రాన్సఫరెన్సీ(ఎస్‌ఎస్‌ఏఏటి) బందం 2013 డిసెంబర్ 9 నుంచి 15 వ తేదీ వరకు గ్రామంలో సోషల్ ఆడిట్ నిర్వహించింది. హౌసింగ్ కార్పొరేషన్ 952 పక్కా ఇళ్ల నిర్మాణం కోసం రుణం, సబ్సిడీ రూపంలో 2006-07లో రూ.3,09,37,874 మంజూరు చేసింది. ఈ నిధులతో ఇళ్ల నిర్మాణం చేశారు.

దీనిని పరిశీలించిన సొషల్ అడిట్ బందం రూ.1,32,48,123 అక్రమాలు జరిగినట్లు తేల్చింది. ఈ గ్రామంలో 952 పక్కా ఇండ్లు నిర్మిస్తే 500 ఇండ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయి. 105 పాత ఇండ్లకు రూ.42,02,406లు చెల్లించారు. 69 ఇండ్లు అసలు ఉనికిలోనే లేవు. వాటికి రూ.22,20,035 చెల్లించారు. 

regప్రభుత్వం లేదా రాజకీయ నాయకుల మద్దతుతో ఐదు ఇండ్ల లబ్దిదారులకు రూ.22,500 అక్రమంగా చెల్లించారు. 9 ఇండ్ల లబ్దిదారులకు పూర్తి స్థాయిలో 1,20,607 రూపాయలు చెల్లించినా నయాపైసా కూడా నిజమైన లబ్దిదారుల చేతికి చేరలేదు. 13 మంది లబ్దిదారులకు పూర్తి స్థాయిలో రూ.3,25,700 చెల్లించినా వారు కనీసం పునాది కూడా తీయలేదు. 89 ఇళ్లకు పూర్తి మొత్తం రూ.21,03,756 చెల్లిస్తే సగం మాత్రమే నిర్మాణం చేశారు.

నాలుగు ఇళ్లకు రూ.21,760 ఇచ్చినా సిమెంట్, మెటీరియల్ ఇవ్వలేదు. 106 మంది లబ్దిదారులకు రూ.30,90,839 నిధులు పూర్తి స్థాయిలో చెల్లించారు. కానీ రేషన్ కార్డులు ఎక్కడా మ్యాచ్ కాలేదు. రూ.8,71,670లు ఇంటి నిర్మాణం కోసం సర్కారు నుంచి నిధులు తీసుకున్న 40 మంది లబ్దిదారులను పరిశీలిస్తే ఒకే రేషన్ కార్డు మీద ఎక్కువ ఇండ్లు తీసుకున్న వారున్నారు.

45 ఇండ్లకు టాయ్‌లెట్ల పేరిట రూ.1,55,980 ఇస్తే ఒక్క టాయ్‌లెట్ కూడా నిర్మించలేదు. 11 మంది లబ్దిదారులకు సొంత ఇండ్లు ఉన్నా ప్రభుత్వ నిధులతో మళ్లీ ఇండ్లు నిర్మించుకొని వాటిని అద్దెకిచ్చుకున్నారు. ఇందిరమ్మ నిధులు రూ.1,12,870 లతో ఇండ్లు నిర్మించుకున్న నలుగురు లబ్దిదారులు వాటిని అమ్ముకున్నారు. కొన్ని ఇండ్లు నిజమైన లబ్దిదారులకు చేరలేదు. ఇండ్ల మంజూరు తతంగంలో రాజకీయ నాయకులు, పైరవీ కారులు భారీగా సంపాదించుకున్నారని ఈ సోషల్ సర్వేలో బయటపడింది.
people
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీపీఎస్సీ) ఏర్పాటు దిశగా అడుగులు...

-గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ
-పబ్లిక్ సర్వీసు కమిషన్ ఏర్పాటుకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి
ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు శనివారం సాయంత్రం గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీపీఎస్సీ) ఏర్పాటుపైనే ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగినందున తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసి.. ఇక్కడి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సహకరించాల్సిందిగా గవర్నర్‌ను సీఎం కేసీఆర్ కోరినట్లు సమాచారం.

kcr_governorఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని పదో షెడ్యూల్లో ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంశం గవర్నర్ పరిధిలో ఉంది. దీంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుకు గవర్నర్ ప్రతిపాదన చేయాల్సి ఉంటుంది. ఆ ప్రతిపాదనను భారత రాష్ట్రపతి ఆమోదిస్తే వెంటనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు అవుతుంది. పరిపాలన సౌలభ్యం కోసం ప్రస్తుతం గాంధీభవన్ పక్కన ఉన్న ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లోని 3, 4 అంతస్తుల్లోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుచేసే అవకాశాలున్నాయి. ప్రస్తుత ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితం అవుతుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటయ్యాక తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ అధికారిని కార్యదర్శిగా నియమించడంతోపాటు అనుభవజ్ఞులతో కొత్త చైర్మన్, సభ్యులను ఎంపిక చేస్తుంది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

ఆదివారం, జూన్ 29, 2014

మన రేషన్‌కార్డు...

-పాతవన్నీ రద్దు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశం.. కొత్త కార్డులకు గ్రీన్‌సిగ్నల్
-పౌరసరఫరాల శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష
-రాష్ట్రంలోని కుటుంబాలకంటే అధికంగా ఉన్న కార్డులు
-కొత్త కార్డుల్లో బోగస్‌కు అవకాశం ఇవ్వొద్దు
-పరిమితికి మించి ఉన్న కార్డులను డీలర్లు ప్రభుత్వానికి అప్పగించాలి: కేసీఆర్

పాత రేషన్‌కార్డులకు రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడనుంది. కొత్త రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియను చేపట్టనుంది. రాష్ట్రంలోని కుటుంబాల సంఖ్యకంటే రేషన్‌కార్డులు ఎక్కువ ఉండటంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విస్మయం వ్యక్తం చేశారు. తక్షణమే పాత కార్డులు రద్దు చేసి.. కొత్తవి పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మళ్లీ బోగస్‌కు అవకాశం లేకుండా చూడాలని, ఇందుకు పకడ్బందీగా విధివిధానాలు రూపొందించాలన్నారు. పౌరసరఫరాల శాఖపై అధికారులతో శనివారం సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 83.59 లక్షల కుటుంబాలు ఉంటే.. తెల్ల రేషన్‌కార్డులు 91 లక్షలకుపైగా, గులాబీ రంగువి 15 లక్షలు, అంత్యోదయ కార్డులు 40 వేలు ఉన్నాయని ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు తీసుకువచ్చారు. కుటుంబాలకంటే 32 లక్షల కార్డులు అదనంగా ఉన్నాయనివెల్లడించారు. రేషన్‌కార్డుల జారీలో గత ప్రభుత్వాలు వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

పరిమితికి మించి ఉన్న కార్డులను డీలర్లు తక్షణమే ప్రభుత్వానికి అప్పగించాలని.. లేకపోతే అధికారులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అర్హులైన వారందరికీ కొత్త రేషన్‌కార్డులు అందుబాటులోకి తేవడంతోపాటు బోగస్ విషయంలో కఠినచర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియలోఅర్హులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని సూచించారు. ఏకీకృత విధానంతో కార్డుల జారీ ప్రక్రియను పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఉత్తర తెలంగాణలో పెట్రోల్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మంత్రులు ఈటెల రాజేందర్, హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగరావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ పార్థసారథి, మేనేజింగ్ డైరెక్టర్ అనిల్‌కుమార్ పాల్గొన్నారు.

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

వక్ఫ్ భూములపై అతి త్వరలోనే కార్యాచరణ...

-గురుకుల్ కూల్చివేతలు ఆపే ముచ్చటే లేదు
-మధ్యతరగతివారుంటే మరో రకంగా ఆదుకుంటాం
-త్వరలోనే రాష్ట్ర వ్యాప్త భూముల రీసర్వే
-నిబంధనలు పాటించని కట్టడాలపై చర్యలు తప్పవు
-టీ మీడియాతో డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ
రాష్ట్రంలో వక్ఫ్ భూముల స్వాధీనానికి త్వరలోనే కార్యాచరణ ప్రారంభమవుతుందని ఉపముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ ఆలీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో వక్ఫ్ భూములు దురాక్రమణకు గురయ్యాయని, ఆక్రమణదారుల భరతం పట్టక తప్పదని ఆయన అన్నారు. చట్ట ప్రకారం వక్ఫ్ భూములను కొనడం, అమ్మడం రెండూ నేరమేనని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ భూములను తిరిగి వక్ఫ్‌కు అప్పగించడం తథ్యమని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీకి వచ్చిన సందర్భంగా ఆయన టీమీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. Ali

ప్రశ్న : వక్ఫ్ భూములపై ప్రభుత్వ వైఖరి ఏమిటి?


జవాబు : వక్ఫ్ భూములు అనేవి ముస్లిం మైనారిటీ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఉద్దేశించి ఇచ్చినవి. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఇవి దురాక్రమణకు గురయ్యాయి. ప్రభుత్వం వీటిపై త్వరలోనే దృష్టి సారిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ భూములు వక్ఫ్ బోర్డుకు మాత్రమే చెందాలన్నది ప్రభుత్వ విధానం. అందువల్ల ఎక్కడెక్కడ ఎలాంటి దురాక్రమణలు జరిగాయి.. ఈ భూములతో ఎలాంటి క్రయ విక్రయాలు జరిగాయి ముందు తేలాలి. అలాగే ఇపుడు ఈ భూములు ఎవరెవరి అధీనంలో ఉన్నాయి వీటి పరిస్థితి ఏమిటన్నదీ సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఈ సమీక్ష తర్వాత ప్రభుత్వం వీటిని ఎలా తిరిగి స్వాధీనం చేసుకుని వక్ఫ్ బోర్డుకు అప్పగించాలో నిర్ణయించిన తగు కార్యాచరణ రూపొందిస్తుంది.

లాంకో హిల్స్ వక్ఫ్ భూముల్లోనే వెలిసినట్లు ఆరోపణలు..!


వక్ఫ్ భూములను కొనడానికి, అమ్మడానికి ఎవరికీ అధికారం లేదు. హైదరాబాద్‌లోని లాంకో హిల్స్ భవనాలను సుమారు 1650 ఎకరాల వక్ఫ్ భూముల్లో కట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇది నిజం కూడా. అయితే ఈ భూములు ఎలా అమ్ముడయ్యాయి? అమ్మిందెవరు? కొన్నదెవరు లాంటి వివరాలన్నింటిపై ఆరా తీస్తాం. నేరంఎవరు చేసినా నేరమే. ఈ భూముల్లో నిర్మాణాలు చేపట్టిన సంస్థల ప్రతినిధులతో ముందు మాట్లాడతాం. వారి అభిప్రాయాలను తెలుసుకుంటాం. ఆ తర్వాత చర్యల గురించి నిర్ణయిస్తాం. తొలుత ఆ భూములను తిరిగి వక్ఫ్‌కు అప్పగించేలా చూస్తాం. లేదంటే ఆ భూమికి మరో చోట భూమిని ఇచ్చేలా నష్టపరిహారపు చర్యలపై ఆలోచిస్తాం. ఈ అంశం లోతుల్లోకి వెళ్ళిన తర్వాత ఏ రకమైన చర్యలు తీసుకోవాలనేదానిపై త్వరలోనే స్పష్టత వస్తుంది.

గురుకుల్ ట్రస్ట్ విషయంలో..


గురుకుల్ ట్రస్ట్‌పై ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఆహ్వానించదగినవే. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన కట్టడాలను ప్రభుత్వం మౌనంగా చూస్తూ ఊరుకోదు. చట్టవిరుద్ధంగా ఇష్టారాజ్యంగా భవనాలు, కట్టడాలు వెలుస్తూ ఉంటే చేతులు ముడుచుకోలేం. గురుకుల్ ట్రస్ట్ భూముల్లో భవనాల కూల్చివేతపై విమర్శలు సరికాదు. ఇంకా ఇలాంటి నిబంధనలకు విరుద్ధమైన భవనాలు చాలా ఉన్నాయి. వాటిని కూడా ప్రభుత్వం వదిలిపెట్టబోదు. దిగువ మధ్య తరగతి ప్రజలకు ఇబ్బందులుంటే ప్రభుత్వం స్పందిస్తుంది. వారికి ఏ విధమైన సహాయం కావాలో చేయడానికి ముందుకు వస్తుంది. అంతే కానీ నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన భవనాల కూల్చివేత మాత్రం ఆపబోము.

నగరంలోని భూముల రిజిస్ట్రేషన్లపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి గదా!


హైదరాబాద్ నగరంలో ఒకే భూమి పలువురి పేర్ల మీద రిజిస్టర్ అయినట్లు ఆరోపణలు ఉన్నమాట వాస్తవం. వీటి వివరాలను రాబట్టడానికి భారీ కసరత్తు చేయాల్సి ఉంది. గత కొంత కాలంగా బయటి ప్రాంతాల నుంచి వచ్చిన రియల్ మాఫియా ఘనకార్యమిది. భూములను అనేక పేర్లతో రిజిస్ట్రేషన్లు చేశారు. వీటి సంగతి తేల్చాల్సి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టక తప్పదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్టర్లను పరిశీలించడంతో పాటు లాండ్ రీ సర్వే జరిపించాల్సిన అవసరం ఉంది. ఈ రీ సర్వేలో అక్రమాలన్నీ బయటకు వస్తాయి. దాన్ని బట్టి ప్రభుత్వ చర్యలు ఉంటాయి. ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చిన తర్వాత సీలింగ్ లాంటి చర్యలు ఏ మేరకు ఉంటాయన్నదానిపై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంటుంది.

లాండ్ రీ సర్వే అవసరం ఇప్పుడే ఎందుకు?


నైజాం కాలంలో 1935 ప్రాంతంలో జరిగిన భూముల సర్వేనే చివరిది. ఆ తర్వాత మళ్ళీ సర్వేలు జరగలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా నిజాం కాలం నాటి సర్వేపైనే ఆధారపడి లావాదేవీలు జరిగాయి. 80 సంవత్సరాలుగా పాత సర్వే రిపోర్టులే ఆధారంగా ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. కాబట్టి మరోమారు సర్వే జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు రూ. 600 కోట్ల ఖర్చుతో పాటు సమయం కూడా బాగానే పట్టే అవకాశం ఉంది. భూముల రిజిస్ట్రేషన్లలో జరిగిన అక్రమాలు, లోపాలు తదితరాలన్నీ అంచనాకు అందితే దానికి తగిన విధంగా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి వీలు ఉంటుంది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా రీసర్వే చేయాలనుకుంటున్నాం. కేంద్రం నుంచి కూడా ఆర్థిక సాయం కోరాం. వస్తుందని ఆశిస్తున్నాం. త్వరలోనే రీ సర్వే జరగనుంది.

ఢిల్లీలో జరిగిన భూసేకరణ చట్టంపై సమావేశాల్లో తెలంగాణ వైఖరి ఏమిటి?


గత యుపీఏ హయాంలో ఈ భూ సేకరణ చట్టం చేశారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఆ చట్టాన్ని సమీక్షించడంతో పాటు వివిధ ప్రాజెక్టులకు అవసరమైన స్థల సేకరణపై ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకోవాలనుకుంటున్నది. అందుకే ఈ సమావేశాలు. తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాలను కేంద్రానికి స్పష్టం చేశాం. అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూమిని ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశాం. అదే సమయంలో రైతుల సాగుభూముల విషయంలో మాత్రం ప్రభుత్వం చాలా స్పష్టమైన వైఖరితో ఉంది. వాటి జోలికి వెళ్ళవద్దనే అనుకుంటోంది. ప్రభుత్వ లేదా అసైన్డ్ భూమి విషయంలో నిర్ణయం తీసుకుంటుందిగానీ, రైతుల సాగుభూములు, వారికి జీవనాధారమైన వ్యవసాయం విషయంలో మాత్రం ప్రజల జీవనాధారానికే తొలి ప్రాధాన్యతనిస్తుంది. ఇదే విషయాన్ని కేంద్రానికి స్పష్టం చేశాం. ఇక స్థల సేకరణ విషయంలో ప్రభుత్వం నిర్ణయించే ధరకు ప్రామాణికం ఏంటనేదానికి సంబంధించి లాండ్ రీ సర్వే జరుగుతుంది కాబట్టి తదనుగుణంగా ధర నిర్ణయించబడుతుంది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

అక్కినేని నాగార్జున "ఎన్-కన్వెన్షన్" అక్రమమే!

-మూడెకరాలు ఆక్రమించిన నాగార్జున
-వివాదాస్పద భూమి, పైగా చెరువు కబ్జా
-సర్వేలో నిర్ధారించిన అధికారులు
-ఆక్రమిత స్థలానికి మార్కింగ్
-ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత ఖాయం!
-నిర్మాణానికి అనుమతి లేదు
-ఐదేళ్లుగా పైసా పన్ను కట్టలేదు
-ఆదాయం మాత్రం కోట్లలో
-రెవెన్యూ రికార్డుల్లో 6 ఎకరాల 30 గుంటలు
-తేలిన అదనపు భూమి 3 ఎకరాల 12 గుంటలు
-మార్కింగ్‌లో మార్పులతో వివాదం
-సూపరింగ్ పొజిషన్ మ్యాప్‌తో తేలనున్న బాగోతం
సీమాంధ్రుల అక్రమాల పుట్టలు ఒకటొకటిగా బద్దలవుతున్నాయి. నిన్నటిదాకా భూములు దిగమింగిన బకాసురుల భరతంపట్టిన తెలంగాణ ప్రభుత్వం నేడు చెరువులు మింగిన బడాబాబులను కూడా బయటికి లాగుతున్నది. ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఇందుకు తార్కాణం. ఎకరాలకు ఎకరాలు నీటివనరులు కబ్జాలుపెట్టిన వెండితెర మన్మథుల బాగోతాలను ప్రభుత్వం బయటకు లాగుతున్నది. పేదపిల్లల నోళ్లుకొట్టి ఆక్రమించిన భూముల్లో కోట్లు పండించుకున్న అక్రమార్కుల కోటలను బద్దలు కొడుతున్నది. చెక్కుచెదరని దీక్షతో విముక్తి దిశగా అడుగులు వేస్తున్నది. ఈ జోరు కొనసాగాలన్నది సకల తెలంగాణ ప్రజల ఆకాంక్ష.. ఆశీస్సు. పునర్నిర్మాణమంటే కూల్చేసి కట్టుకుంటారా? అన్నాడో సీమాంధ్ర మహామేధావి. అవును.. ఈ అక్రమ సామ్రాజ్యాలు కూల్చేయకుండా తెలంగాణ విముక్తి పరిపూర్ణం కాదు.. పునర్నిర్మాణమూ సాధ్యం కాదన్నది తెలంగాణవాదుల నిశ్చితాభిప్రాయం. center

హైదరాబాద్‌లోని మాదాపూర్ ఖానామెట్‌లో ఉన్న సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ అక్రమ నిర్మాణమేనని అధికారులు తేల్చారు. ఆక్రమించిన భూమిలోనే సగానికి పైగా నిర్మాణం ఉందని కూడా దాదాపు అంచనాకు వచ్చారు. పక్కనే ఉన్న చెరువును ఆక్రమించి పూడ్చేసి నిర్మాణాలు సాగించారని శనివారం అధికారులు జరిపిన సర్వేలో బట్టబయలైంది. సర్వేకు సంబంధించి మరికొన్ని లాంఛనాలు పూర్తిచేసిన అనంతరం నిర్మాణం కూల్చేయనున్నారని సమాచారం. సీమాంధ్రులు నగరంలో ఎక్కడపడితే అక్కడ ఇష్టారాజ్యంగా భూములను కబళించి కట్టిన అక్రమ నిర్మాణాలపై యుద్ధం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక అక్రమ కట్టడాలను నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. ఈ పరంపరలో ఒక ప్రముఖుడి పేరు బయటకు రావడం ఇదే ప్రథమం.
వేగం పెరిగిన ఆపరేషన్...

మాదాపూర్ గురుకుల్ ట్రస్ట్ అక్రమ నిర్మాణాల విముక్తి ఆపరేషన్‌లో జీహెచ్‌ఎంసీ అధికారులు స్పీడు పెంచారు. నిన్న మొన్నటి దాకా నిర్మాణంలో ఉన్న భవనాల కూల్చివేత, ఆ తర్వాత అక్రమ భవనాల సీజింగ్ పూర్తి చేసిన అధికారులు తాజాగా బడాబాబుల ఆక్రమణలపైకి దృష్టి మరల్చారు. ఈ క్రమంలోనే మాదాపూర్ ఖానామెట్‌లో ఉన్న సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ స్థలాలను రెవెన్యూ అధికారులు శనివారం సర్వే చేశారు. తమ్మిడికుంట చెరువు పూర్తిస్థాయి నీటి మట్టం (ఎఫ్టీఎల్), బఫర్ జోన్ పరిధులను దాటి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారని అధికారులు గుర్తించారు. చెరువు ఆక్రమణ జరిగినంత మేర ఉన్న నిర్మాణానికి మార్కింగ్ కూడా వేశారు. జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది సంయుక్తంగా ఈ సర్వేలో పాల్గొన్నారు.
Naga

రికార్డుల్లో 6 ఎకరాల 30 గుంటలే..

రికార్డుల ప్రకారం తమ్మిడిచెరువుకు ఆనుకుని సినీ నటుడు నాగార్జునకు వివాదాస్పద గురుకుల్ ట్రస్ట్ కు చెందిన 6 ఎకరాల 30 గుంటల స్థలం మాత్రమే ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నెంబర్‌లోని 11/2అ లో 3 ఎకరాలు, 11/3/ఆ 3 గుంటలు, 11/36/అ 3 ఎకరాల 27 గుంటల స్థలం నాగార్జున పేరిట ఉంది. కానీ ఈ కన్వెన్షన్ సెంటర్ దాదాపు 10 ఎకరాల విస్తీర్ణం అధిగమించింది. ఈ స్థలంలో నాలుగేళ్ల క్రితం ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం చేపట్టారు. శనివారం అధికారులు నిర్వహించిన సర్వే ప్రకారం 3 ఎకరాల 12 గుంటల చెరువు స్థలం ఆక్రమణకు గురైనట్టు నిర్దారించారు. అందులో ఒక ఎకరా 12 గుంటల స్థలం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోది కాగా, 2 ఎకరాల స్థలం బఫర్ జోన్‌లోకి వస్తుందని అధికారులు తేల్చి చెప్పారు. ఈ స్థలంలో ఏర్పాటైనందున ఈ ఎన్‌కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం అక్రమమని అధికారులు ధ్రువీకరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో వెలిసిన అక్రమ నిర్మాణాలపై మార్కింగ్ వేశారు. 

గోప్యంగా ఉంచుతున్న అధికారులు..

శనివారం ఎన్ కన్వెన్షన్ సెంటర్ స్థలంలో అధికారుల సర్వే సుదీర్ఘంగానే సాగింది. దాదాపు 3 గంటల పాటు కొనసాగిన ఈ సర్వే జరుపుతున్న సమయంలో మీడియా ప్రతినిధులెవ్వరినీ ఎన్ కన్వెన్షన్ లోపలికి అనుమతించలేదు. వివరాలేవీ బయటికి పొక్కకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు పాటించారు. శనివారం ఉదయం 9 గంటలకు ఎన్ కన్వెన్షన్‌కు చేరుకున్న అధికారులు 10 గంటలకు లోపలికి వెళ్లగా 3 గంటల సర్వే అనంతరం మధ్యాహ్నం 1 గంటకు బయటికి వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడకుండానే వెనుదిరిగారు. మీడియా ప్రతినిధులను లోపలికి అనుమతించక పోవడం, వివరాలను గోప్యంగా ఉంచడంతో పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. 

మార్కింగ్ కుదింపు ఎందుకు?

ఎన్ కన్వెన్షన్ సంబంధిత స్థలాల్లో సర్వే నిర్వహించిన అధికారులు ఆక్రమణకు గురైన స్థలాన్ని గుర్తించి వేసిన మార్కింగ్ పలు అనుమానాలకు తావిస్తోంది. మొదట సగానికి పైగా కన్వెన్షన్ సెంటర్ ఆక్రమిత స్థలంలో ఉన్నట్టు మార్కింగ్ వేసిన అధికారులు కాసేపటికే దాన్ని మారుస్తూ సుమారు 20 అడుగుల స్థలాన్ని కుదించి తిరిగి మార్కింగ్ వేశారు. మార్కింగ్‌లో తేడాలు చోటు చేసుకోవడంతో అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. మార్కింగ్ కుదింపులో ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వం కఠిన చర్యలకు ఆదేశించినప్పటికీ అధికారులు భిన్నంగా ప్రవర్తిస్తున్నారా? అన్న అనుమానాలకు దారి తీసింది. జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు గతంలో నిర్మాణదారులతో కుదుర్చుకున్న లోపాయికారి ఒప్పందాల కారణంగానే చర్యలు తీసుకోవడంలో తాత్సారం చేస్తున్నారని బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. 

సూపరింగ్ పొజిషన్ మ్యాప్‌తో గుర్తిస్తాం: తహసీల్దార్

ఎన్ కన్వెన్షన్ సెంటర్ స్థలాల సర్వే, తదుపరి చర్యల విషయమై శేరిలింగంపల్లి తహసీల్దార్ విద్యాసాగర్‌రావును టీ మీడియా వివరణ కోరగా సూపరింగ్ పొజిషన్ మ్యాప్ ద్వారా పాయింట్ అవుట్ చేస్తే ఎంత ఆక్రమణకు గురైందీ కచ్చితంగా తెలుస్తుందని అన్నారు. దీనిద్వారా వివరాలను సేకరించి సదరు సమాచారాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులకు అందజేస్తామని చెప్పారు. దాని ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. తమ్మిడి చెరువు మొత్తం విస్తీర్ణం 29 ఎకరాలు ఉంటుందని, ఈ సర్వే ద్వారా చెరువు ఎంత ఆక్రమణకు గురైందో తేలుతుందని స్పష్టం చేశారు. 

హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు..

కాగా గతంలో ఏ ప్రభుత్వం చేయలేని రీతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం భూముల కబ్జాపై వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా హర్షం వెల్లువెత్తుతోంది. గత వారం రోజులుగా గురుకుల్ ట్రస్ట్ భూముల్లో రాజీ లేకుండా అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తెలంగాణ వాదులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్, బాబు ప్రభుత్వాల మాదిరిగా పైపై చర్యలు కాకుండా ఈ వైఖరి ఇలాగే కొనసాగి తెలంగాణ ప్రభుత్వ భూముల్లో సీమాంధ్రుల కబ్జాలను విముక్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలి: పాశం యాదగిరి

ఏ నగరానికైనా, పట్టణానికైనా చెరువులు, కుంటలు "కిడ్నీ"ల లాంటివని తెలంగాణ ఐక్య కార్యచరణ కమిటీ ప్రతినిధి పాశం యాదగిరి అన్నారు. ఎన్‌కన్వెన్షన్ సెంటర్ స్థలం సర్వే సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌లో 2 లక్షల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారని అన్నారు. నాగార్జున నిజ స్వరూపం ఎన్ కన్వెన్షన్ ఆక్రమణతో బయట పడిందన్నారు. పిల్లి పిల్లలను, కుక్క పిల్లలను అక్కున చేర్చుకునే వారి కుటుంబం ప్రభుత్వ, శిఖం భూములను కబ్జా చేసి చెరువులో ఉన్న జలచరాలను, సహజ సంపదను నాశనం చేయడం, జలకాలుష్యానికి పాల్పడడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. భూమిని స్వాధీనం చేసుకుని దానికి ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. 

నాగార్జునను అరెస్టు చేయాలి: కసిరెడ్డి భాస్కర్ రెడ్డి

చెరువు శిఖం భూమిని కబ్జా చేసి అక్రమ నిర్మాణం ద్వారా కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న నటుడు నాగార్జునను వెంటనే అరెస్టు చేయాలని జనం కోసం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు, గతంలో నాగార్జునపై కోర్టులో ఫిర్యాదు చేసిన కసిరెడ్డి భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. తమ్మిడి చెరువును ఆక్రమించి ఎన్‌కన్వెన్షన్ సెంటర్ నిర్మించారంటూ తమ సంస్థ తరఫున లోకాయుక్తకు గతంలో ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. ఇందుకు స్పందించిన లోకాయుక్త అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వాణీ ప్రసాద్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కృష్ణబాబు, హెచ్‌ఎండీఏ లేక్ ప్రొటెక్షన్ కమిటీ సెక్రటరీ సునీల్ కుమార్ గుప్తా, నార్త్ ట్యాంక్ డివిజన్ ఇరిగేషన్ ఈఈ ఏసుబాబు, వెస్ట్‌జోన్ కమిషనర్ అలీం బాషా, సర్కిల్ 12 డిప్యూటీ కమిషనర్ మనోహర్, శేరిలింగంపల్లి తహసీల్దార్ రాజేశంలకు నోటీసులు కూడా పంపిందని చెప్పారు. చెరువు శిఖం స్థలం ఆక్రమణ అధికారులు తేల్చినందున నాగార్జునపై వాల్టా చట్టం ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

పైసా పన్ను లేదు.. ఆదాయం కోట్లలో..ప్లేటు భోజనం రూ.2 వేలు

అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉండడంతో నగరంలో ప్రముఖుల ఖరీదైన విందు, వివాహాల వేడుకలకు ఎన్-కన్వెన్షన్‌ను వేదికగా ఎంచుకుంటారు. ఈ ప్రాంగణంలో ఎన్-డైమండ్, ఎన్-బనియాన్ ట్రీ, ఎన్-కన్వెన్షన్ అనే మూడు హాళ్లున్నాయి. డైమండ్‌లో సుమారు 500మంది, బనియన్‌లో 1200-1500మంది, కన్వెన్షన్‌లో 1500-2000మంది కూర్చునే వీలుంది. వీటి అద్దె రూ. లక్షల్లో ఉంది. ఇక ఇక్కడ విందులు చేస్తే ఏ స్టార్ హోటల్‌కూ తగ్గకుండా ఒక్కో ప్లేటుకి కనీసం రెండు వేలనుంచి చార్జ్ వసూలు చేస్తారు.ఇక్కడ ఏ చిన్న ఫంక్షన్ చేసినా కనీసం తక్కువలో తక్కువ రూ. 20 లక్షల బిల్లు అవుతుంది. దీన్నిబట్టి ఈ కన్వెన్షన్ సెంటర్ ఆదాయం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఈ స్థలం పూర్తిగా గురుకుల్ ట్రస్టు భూమి కావడం వల్ల అమ్మకాలకు అనుమతి లేకపోవడంతో దీని నిర్మాణానికి ఎటువంటి అనుమతులు మంజూరు కాలేదు. అనుమతులే లేకపోవడంతో ఆక్యుపెన్సీ అనే ప్రశ్నే తలెత్తదు. అనుమతి లేని నిర్మాణం కావడంతో దానిపై ఎటువంటి పన్ను కూడా జీహెచ్‌ఎంసీ వసూలుచేయడంలేదు. అంటే ప్రభుత్వానికి పైసా కట్టక పోయినా అనుమతులు రాక పోయినా అద్దెల రూపంలో మాత్రం కోట్ల ఆదాయం వస్తోంది. విచిత్రంగా ఈ అనుమతి లేని నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ లక్షల ఖర్చుతో రోడ్డు కూడావేసింది.

పత్రాలు లేకుండానే క్రమబద్ధీకరణ యత్నం..

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2008-09లో దీన్ని నిర్మించారు. నిర్మాణానికి అనుమతి లేదు. భూమికి సరైన ప్రతాలుకూడా లేవు. అయినా క్రమబద్దీకరణకు మాత్రం యత్నించారు. అధికారిక సమాచారం ప్రకారం మొత్తం 6.69ఎకరాల స్థలాన్ని తమదిగా పేర్కొంటూ అక్రమ భవనాల క్రమబద్ధీకరణ పథకం కింద(బీపీఎస్) దరఖాస్తు చేశారు. అయితే డాక్యుమెంట్లు మాత్రం కేవలం 45సెంట్ల((2175చదరపు గజాలు,అర ఎకరానికన్నా తక్కువ)కు మాత్రమే సమర్పించారు. అసలే ట్రస్టు భూమి కావడం, అదీ ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో ఉండడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు క్రమబద్దీకరణ దరఖాస్తును తిరస్కరించారు. దీంతో నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు చట్ట వ్యతిరేకంగా చర్యలు చేపట్టరాదని తీర్పు వెలువరించింది. కన్వెన్షన్ నిర్మాణం పూర్తిగా అక్రమం కావడంతో కోర్టు తీర్పు పరోక్షంగా జీహెచ్‌ఎంసీకి అనుకూలంగానే వచ్చినట్లు చెప్పవచ్చు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

ఏపీఐఐసీలో అధికారుల ఇష్టారాజ్యం

-టెండర్ల ఆమోదంలో గందరగోళం
- ఐటీ/ఐటీఈఎస్ పార్కు పనుల్లో గోల్‌మాల్
పారిశ్రామిక వాడల మౌలిక సదుపాయాల కల్పన పనుల్లో ఏపీఐఐసీ వ్యవహరిస్తున్న తీరు దుమారం రేపుతున్నది. టెండర్ల ఆమోదం విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. ఎక్సెస్ టెండర్లకు అనుమతులివ్వడం, లెస్‌కు దాఖలైన వాటిని తిరస్కరించడం వంటి చర్యలు అవినీతి ఆరోపణలకు తావిస్తున్నాయి. ప్రభుత్వానికి నష్టం వాటిల్లే పనులను అనుమతించడం, ఇష్టారాజ్యంగా సాంకేతిక అనుమతులు మంజూరు చేయడం, భూసేకరణ కూడా చేపట్టకుండానే పనులకు ఆమోద ముద్ర వేయడం ఎవరి ప్రయోజనాలకోసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర విభజన గందరగోళం కొనసాగుతున్న సంధికాలంలోనే పనులు పూర్తి చేసి నిధులు స్వాహా చేయాలన్న తొందరపాటు కనిపిస్తోందని అంటున్నారు ఏపీఐఐసీ ఐటీ/ఐటీఈఎస్ పార్కుల్లో చేపట్టిన పనులు ఈ ఆరోపణలకు ఊతమిస్తున్నాయి.

ఏరోస్పేస్ పార్కు మంచినీటి కథ...

ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్లలో సర్వే నెం.519, 523, సరూర్‌నగర్ మండలం నాదర్‌గుల్‌లో సర్వే నెం. 656లో ఏర్పాటు చేయడానికి నిర్దేశించిన ఐటీ/ఐటీఈఎస్ ఎరోస్పేస్ పార్కులో మంచినీటి సరఫరా పనులకు ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రూ.2,78,70,000 మంజూరయ్యాయి. ఈ పనులను ఓ కాంట్రాక్టర్ 4.90 శాతం అధికంగా రూ.2,92,35,640లకు టెండర్ దాఖలు చేసి పనులు దక్కించుకున్నారు. అది కూడా ఏకైక టెండర్ దాఖలు కావడం విశేషం. టెండర్లు ఆశించిన స్థాయిలో రాకపోతే మళ్లీ ఆహ్వానించాలన్న నిబంధనలు ఉన్నాయి. అయినా అవేవీ పాటించకుండా 4.90% ఎక్సెస్ టెండర్‌ను ఆమోదించి పనులు అప్పగించారు. ఇక్కడున్నది 10 మీటర్ల రహదారి. 7 మీటర్ల వరకు బీటీ రోడ్డు ఉంటుంది. ఇరుపక్కలా మిగిలేది 1.5 మీటర్లు. రహదారి విస్తరణ చేపట్టకుండా ఈ మాత్రం స్థలంలో అది సాధ్యపడదు. అయినా టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్ సాంక్షన్ ఎలా ఇచ్చారో అర్థం కాదు.

ఔటర్ రింగ్‌రోడ్డు సర్వే నెం.165/పి నుంచి ఆదిబట్ల సర్వే నెం.255 వరకు(ఐటీ/ఐటీఈఎస్ పార్కు వరకు) రహదారి విస్తరణ, పటిష్టం చేసే పనికి రూ.4.40 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనికి టెండర్లు పిలిస్తే ఓ కాంట్రాక్టరు 20 శాతం లెస్(తక్కువ)(రూ.3,38,40,853)కు టెండర్ దాఖలు చేసి దక్కించుకున్నాడు. శంషాబాద్ జోనల్ ఆఫీసు నుంచి టెక్నికల్ సాంక్షన్ లభించింది. పరిపాలన ఆమోదం ఇచ్చారు. టెండర్లు ఓపెన్ చేసి 20 శాతం లెస్ వేసిన కాంట్రాక్టరుకు దక్కినట్లు మొదట ప్రకటించారు. ఆ వెంటనే రహదారి విస్తరణకు స్థలం లేదని అంటే భూ సేకరణ జరుపలేదన్న నెపాన్ని చూపిస్తూ దాన్ని రద్దు చేశారు. సదరు కాంట్రాక్టరు చెల్లించిన ఈఎండీని కూడా వాపసు ఇచ్చేశారు.

పై రెండు పనులు దాదాపు ఒకే ప్రాంతానికి సంబంధించినవి. మొదటి పనికి అంచనా కంటే అధిక మొత్తానికి వచ్చిన టెండర్ ఆమోదించారు. రెండో పని 20 శాతం తక్కువకే చేయగలమంటూ ముందుకొచ్చిన సంస్థను విస్మరించారు. అక్కడ ఇక్కడ స్థల సేకరణ జరగకుండా పని జరిగే పరిస్థితి లేదు. అయితే వాటిలో ఒక పనిని రద్దు చేసి, మరోదాన్ని చేపట్టడం ఎలా సాధ్యమని ఏపీఐఐసీలోని ఉద్యోగులే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు భూసేకరణ వంటి పెద్ద సమస్య అవరోధంగా ఉండగా సాంకేతిక అనుమతులు, పరిపాలన ఆమోదం ఎలా తెలిపారన్నది మరో ప్రశ్న. ఏకైక టెండరు మాత్రమే వచ్చినప్పుడు రద్దు చేయాలన్న నిబంధనలున్నా అధికారులు సదరు కాంట్రాక్టరు పట్ల ఔదార్యం చూపించడం వెనుక ఆంతర్యమేమిటో బోధ పడడం లేదు. ఏపీఐఐసీ చేపట్టిన మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనులపై దర్యాప్తు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

మళ్లీ సీమాంధ్ర సర్కారు కరెంటు కుట్రలు...!

-ఈసారి ఈఆర్సీ ఆమోదించలేదనే సాకు
-కేంద్రానికి లేఖ రాసిన ఆంధ్రా సీఎస్
-సోలార్, విండ్ పీపీఏలపై పేచీ..700 మెగావాట్లకు ఎసరు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ అంశంపై రోజుకో పేచీ పెడుతున్నది. ఎదురుదెబ్బలు తాకినా పట్టించుకోకుండా కుట్రలకు పాల్పడుతున్నది. పీపీఏలను ఏపీఈఆర్సీ ఆమోదించలేదనే సాకుతో మా ప్రాజెక్టుల విద్యుత్ ఉత్పత్తి మాకే అంటూ వివాదానికి తెరతీసింది. సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల(సీజీఎస్) విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణకు కేటాయించిన వాటా నుంచి 1.77శాతం అంటే 65మెగావాట్లు(15లక్షల యూనిట్లు) కాజేసింది. ఈసారి కొత్తగా మరో వివాదానికి తెరతీసింది. ఏపీఈఆర్సీ ఆమోదించిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సైతం లాక్కునేందుకు జులుం చేస్తున్నది. ప్రస్తుతం తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(గతంలో సీపీడీసీఎల్) వద్ద ఉన్న ఈ పీపీఏల ఫైళ్ళను తక్షణమే తమకు ఒత్తిడి తీసుకువస్తున్నది. అనంతపురం, కర్నూలు జిల్లాలను భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్‌లో చేర్చినందున ఆ రెండు జిల్లాల్లోని దాదాపు 700 మెగావాట్ల సాంప్రదాయేతర ఇంధన వనరుల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం ఆంధ్రప్రదేశ్‌కే చెందుతుందనేది వాదన.

అయితే ఈ పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు తెలంగాణ డిస్కమ్(సీపీడీసీఎల్) ప్రతిపాదించడం, వాటిని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీఈఆర్సీ) ఆమోదించడం వల్ల అవి తెలంగాణ రాష్ర్టానికే చెందుతాయని తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాదిస్తున్నది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కష్ణారావు ఈనెల 11వ తేదీన కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ కార్యదర్శి ప్రదీప్‌కుమార్ సిన్హాకు అధికారికంగా లేఖ(నెం.1786) రాయడం గమనార్హం. భౌగోళికంగా ఆ రెండు జిల్లాల పరిధిలో ఉన్న నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ(ఎన్‌సీఈ) ప్రాజెక్టుల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)లను 2008లో జారీచేసిన ఉత్తర్వులు(జీవో నెం.53) ప్రకారం తక్షణమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఆ లేఖలో పేర్కొనడం విశేషం.

ఆరెండు జిల్లాల లెక్కల్లో తప్పులు

రాష్ట్ర విభజనలో భాగంగా సీమాంధ్రలోకి చేరిన అనంతపురం, కర్నూలు జిల్లాల లెక్కల్లో తప్పులున్నట్లు విభజనకు ముందు, ఆ తర్వాత తెలంగాణ విద్యుత్‌రంగ నిపుణులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఆ రెండు జిల్లాల విద్యుత్ వినియోగం పరంగా 8.03 శాతంగా నిర్ణయించడంపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు కూడా చేశారు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా ఐదేళ్ళ విద్యుత్ వినియోగాన్ని బట్టి కోటాలను నిర్ధారించడం వల్ల తెలంగాణకు రూ.1,060కోట్ల మేరకు ఆర్ధికనష్టం వాటిల్లుతుందనేది తెలంగాణ విద్యుత్ నిపుణుల అభిప్రాయం. తప్పుడు విధానాలను అనుసరించి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో విద్యుత్ వినియోగం 17.42 శాతంగా ఉన్నట్లు ప్రభుత్వం నిర్ధారించింది. వాస్తవానికి హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సెంట్రల్‌పవర్ డిస్కమ్ విద్యుత్‌కోటా46.06 శాతంగా ఉండగా, వాటిల్లో కర్నూలు, అనంతపురం జిల్లాల వాటా కేవలం 5.9 శాతమేనని గణాంకాలు చెబుతున్నాయి. రెండు జిల్లాల విద్యుత్ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని కోటాలను నిర్దేశించడం వల్ల సెంట్రల్ పవర్ డిస్కమ్ (సీపీడీసీఎల్)కు 2.14 శాతం విద్యుత్ కోటా నష్టం వాటిల్లుతుంది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న డిస్కమ్ విద్యుత్‌కోటా 46.06 శాతంలో కర్నూలు, అనంతపురం జిల్లాల వాటాగా 8.03 శాతం ఖరారుచేస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు(జీవోనెం.20) తక్షణమే రద్దుచేయాల్సిన అవసరం ఎంతైన ఉంది.

లోయర్ సీలేరు లేని నష్టం వేల కోట్లు

పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలపై కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌తో తెలంగాణకు ఖమ్మం జిల్లా చింతూరు మండలంలోని 460 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన లోయర్ సీలేరు హైడెల్ జనరేషన్ ప్రాజెక్టు తెలంగాణకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏటా 1,100 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణ కోల్పోవాల్సి వస్తున్నది.

మల్టీఇయర్ టారీఫ్‌తో ఎంతో మేలు

రాష్ట్రంలో వచ్చే ఐదు సంవత్సరాలకు(మల్టీఇయర్ టారీఫ్) సంబంధించిన ట్రాన్స్‌మిషన్ టారిఫ్, డిస్ట్రిబ్యూషన్ టారిఫ్, ఎస్‌ఎల్‌డీసీ టారిఫ్‌లను రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్(ఈఆర్సీ) ఖరారుచేస్తూ ఈఆర్సీ గత మే నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం(2014-15) నుంచి 2018-19 సంవత్సరం వరకు టారిఫ్ అమలులో ఉంటుంది. విద్యుత్‌ఉత్పత్తి సంస్థల నుంచి ట్రాన్స్‌మిషన్ లైన్ల ద్వారా స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్‌ఎల్‌డీసీ) నుంచి డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు పంపిణీ అయ్యే విద్యుత్తుకు టారిఫ్‌ను నిర్ధారించడంతో పాటు ట్రాన్స్‌మిషన్ నష్టాలను సైతం ఈఆర్సీ నిర్దేశించింది. రాష్ట్ర ప్రభుత్వ విధానం ప్రకారంగా సౌరవిద్యుత్తు, పవన విద్యుత్తు, మినీ హైడెల్ వంటి సాంప్రదాయేతర ఇంధనవనరులకు ట్రాన్స్‌మిషన్ చార్జీల నుంచి మినహాయింపు ఉంటుందని ఈఆర్సీ స్పష్టంచేసింది. దీంతో ఈఆర్సీ ఆమోదించిన సాంప్రదాయేతర ఇంధన వనరుల విద్యుత్ ఉత్పత్తితో తెలంగాణకు ఎంతో మేలు చేకూరుతుంది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

శనివారం, జూన్ 28, 2014

ఆంధ్రా కుట్రవల్ల తెలంగాణకు సీజీఎస్ కోటా తగ్గింపు...


-తెరవెనుక మళ్ళీ ఆంధ్రా కుట్రల వ్యూహం
-అటువైపు మొగ్గి తెలంగాణపై కేంద్రం వివక్ష
-రోజుకు 15 లక్షల యూనిట్లు (1.2 ఎంయూ) లోటు 

తెలంగాణ సమాజం అనుమానించినట్లుగానే జరుగుతున్నది. కేంద్రంలో తాము మద్దతిచ్చిన ప్రభుత్వమే ఉన్నందున ఏమైనా చేయొచ్చనే ఆంధ్రా బాబుల కుట్రలు, కుయుక్తులు కొనసాగుతున్నవి. ఆంధ్రా సర్కారు వంకర బుద్ధి మానడం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ వైపు మొగ్గు చూపుతున్నది. సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల (సీజీఎస్) కోటాలో మార్పులు ఇందుకు తాజా ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్నిన వ్యూహాల ఫలితంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో సీజీఎస్ విద్యుత్ కోటాల మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఫలితంగా తెలంగాణ రోజుకు 15 లక్షల యూనిట్ల విద్యుత్‌కు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఆంధ్రా సర్కారు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) వివాదాన్ని తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఆంధ్రా సర్కారు తెరచాటుగా సీజీఎస్ కోటాను పెంచుకోగలిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సీజీఎస్ కోటాల కేటాయింపుల్లో చిన్న పొరపాటు జరిగిందనే నెపంతో తెలంగాణ సీజీఎస్ కోటాను కుదించేందుకు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) విధానపరమైన నిర్ణయం తీసుకుంది. 

దీనికి సంబంధించి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ పరిధిలోని ఇంటిగ్రేటెడ్ రిసోర్స్ ప్లానింగ్ డివిజన్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధికారికంగా లేఖ అందింది. వాస్తవానికి సీజీఎస్ విద్యుత్ కోటాలను తెలంగాణకు 53.89 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 46.11 శాతం చొప్పున కేంద్రం కేటాయింపులు జరిపింది. జూన్ 2వ తేదీ నుంచి ఈ కోటాలను కేంద్రం అమలుచేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 21వ తేదీన కేంద్రానికి రాసిన లేఖతో పాటు రాజకీయ ఒత్తిళ్ల ఫలితంగా ఆంధ్రా సర్కారు అదనంగా 1.77 శాతం సీజీఎస్ కోటాను పెంచుకోగలిగింది. అంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న 46.11 శాతం వాటా కాస్తా 47.88 శాతానికి పెరిగింది. దీంతో తెలంగాణకు ఉన్న సీజీఎస్ 53.89 శాతం వాటా కాస్తా 52.12 శాతానికి తగ్గిపోయింది. ఫలితంగా తెలంగాణ రాష్ర్టానికి సరాసరిగా 60 మెగావాట్ల నుంచి 70 మెగావాట్ల మేరకు సీజీఎస్ కోటాలో కోతలు ఏర్పడతాయి.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

నాగార్జున "ఎన్ కన్వెన్షన్ సెంటర్‌"కు నోటీసులు...!

-నేడు తంగడికుంట చెరువులో అధికారుల సర్వే
-అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాల సీజ్
-గురుకుల్ ఖాళీ భూముల్లో సూచిక బోర్డులు
గురుకుల్ ట్రస్ట్ భూముల్లోని తంగడికుంట చెరువులో అక్రమంగా నిర్మించిన సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ (జీహెచ్‌ఎంసీ) అధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు. ఎఫ్‌టీఎల్(ఫుల్‌ట్యాంక్ లెవల్)మార్కు చేసిన చెరువు పరిధిలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌తో పాటు ఇతర నిర్మాణాలన్నింటిని అవసరమైతే కూల్చివేస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ చెప్పారు. ఇక నిబంధనలను అతిక్రమించినట్టు తేలితే ఎలాంటి చర్యలకైనా వెనుకాడబోమని స్పష్టం చేశారు. గురుకుల ట్రస్ట్ భూముల్లో అక్రమ నిర్మాణాలను తొలగించడం ద్వారా ఇప్పటి వరకు 300 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామన్నారు. అక్రమ నిర్మాణాలను గుర్తించి మార్కింగ్ చేసినట్లు తెలిపారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ భూముల సర్వేను శనివారం చేపట్టనున్నట్టు శేరిలింగంపల్లి తహసీల్దార్ విద్యాసాగర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కు కేటాయించిన స్థలం, ఎఫ్‌టీఎల్ ఆక్రమణ విషయాలను సర్వే ద్వారా తెలుసుకోనున్నారు. 
center


అక్రమ నిర్మాణాలపై అధికారుల కొరడా

గురుకుల్ ట్రస్ట్ భూముల్లో అక్రమంగా నిర్మిస్తున్నవాటిని కూల్చివేసిన అధికారులు తాజాగా అక్రమ నిర్మాణాలను సీజ్ చేశారు. గ్రేటర్ కమిషనర్ సోమేశ్‌కుమార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనం ద్, విద్యుత్ శాఖ సీఎండీ రిజ్వీ, వాటర్ వర్క్స్ ఎండీ జగదీష్, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ చంపాలాల్, రాజేంద్రనగర్ ఆర్‌డీవో సురేష్‌ల పర్యవేక్షణ లో అయ్యప్ప సొసైటీలోని 11 అక్రమ నిర్మాణాలను శుక్రవారం సీజ్ చేశారు. షణ్ముగ శ్రీనివాస్ (ప్లాట్ నంబర్ 83), చంద్రశేఖర్‌రెడ్డి (ప్లాట్ నంబర్ 535), వర్మ (ప్లాట్ నంబర్ 1214), రాధాకృష్ణ (1209), లక్ష్మీనారాయణ (800)లకు చెందిన భవనాలతోపాటు 1157, 525, 531, 536,817 నంబర్లు గల ప్లాట్లలోని నిర్మాణాలను, ఖానామెట్‌లోని గుట్ట కన్వెన్షన్ సెంటర్‌ను అధికారులు సీజ్ చేశారు. 

అయ్యప్ప సొసైటీలో నివాసం ఉండని అక్రమ నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ యాక్ట్ 461/ఎ సెక్షన్ ప్రకారం సీజ్ చేస్తున్నామని, నివాసం ఉంటున్న ఇళ్లను మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఖాళీ చేయించి వాటిని కూడా సీజ్ చేయిస్తామని సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రతి ఇంటికి ఎర్ర రంగుతో మార్క్ చేసి ఎవరూ అమ్మడానికి, కొనడానికి వీలు లేకుండా చేస్తామన్నారు. భవనాలను సీజ్ చేసే సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రతను ఏర్పాటు చేశామని మాదాపూర్ డీసీపీ క్రాంతి రాణా మాట్లాడుతూ తెలిపారు. అయ్యప్ప సొసైటీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు సభ్యులు మాట్లాడుతూ తాము సదరు భూములను చట్టబద్ధంగా కొనుగోలు చేశామని, ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదన్నారు. 

సూచిక బోర్డుల ఏర్పాటు

ఖాళీగా ఉన్న గురుకుల్ ట్రస్ట్ భూముల్లో రెవెన్యూ అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ చంపాలాల్, ఆర్‌డీవో సురేష్, వాటర్ వర్క్స్ ఎండీ జగదీష్, శేరిలింగంపల్లి తహసీల్దార్ విద్యాసాగర్‌లు మాదాపూర్‌లోని గురుకుల్ ట్రస్ట్ భూములను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బంది సదరు భూములు తెలంగాణ ప్రభుత్వానికి చెందినవిగా సూచిస్తూ బోర్డులను ఏర్పాటు చేశారు. ఖానామెట్ అవధాన సరస్వతీ పీఠం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో, మీనాక్షి టవర్స్ ఎదుట, పక్కన, జయభేరి క్లబ్‌కు వెళ్లే దారిలో ఉన్న ఖాళీ స్థలాల్లో ఈ సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

పదవులకే ఠీవి.. మన పీవీ

-రాజకీయ కోవిదుడి 93వ జయంతి నేడు
-అన్ని విధాలా రాణించిన బహుముఖ ప్రజ్ఞాశాలి
-దేశ ప్రధానిగా ఎదురీదిన తెలంగాణ బిడ్డ
-మాజీ ప్రధానిని పట్టించుకోని ప్రభుత్వాలు
-పరాయిపాలనలో తెలంగాణ బిడ్డల విస్మరణ
-ఇకపై ఆ దుస్థితి కొనసాగొద్దంటున్న సీఎం కేసీఆర్
-తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రత్యేక గుర్తింపు
-పీవీ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం
PV
పాములపర్తి వెంకట నరసింహారావు.. తెలంగాణలోని మారుమూల గ్రామంలో పుట్టిన ఆ బిడ్డ ప్రజాజీవితంలో అంచెలంచెలుగా ఎదిగి క్లిష్ట సమయంలో భారతదేశ ప్రధానిగా ఐదేండ్లపాటు బాధ్యతలు నిర్వహించారు. రాజకీయంగా తన ప్రత్యేకతను చాటిచూపిన నేత. మృదుస్వభావి, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆయన రాష్ట్రంలో మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రంలో హోం, విదేశాంగ, రక్షణ మంత్రిగా రాణించారు. పదవులకు వన్నె తెచ్చారు. తన రాజనీతిజ్ఞతతో అంతర్జాతీయంగా ప్రశంసలందుకున్నారు. రాజీవ్‌గాంధీ మరణానంతరం క్లిష్ట సమయంలో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి, అనంతరం ప్రధానిగా ఐదేండ్లు రాణించారు. ఎవరూ ఊహించనిరీతిలో నిరాటంకంగా పరిపాలన కొనసాగించారు.

ఆ బిడ్డకు జన్మనిచ్చింది ఈ తెలంగాణ గడ్డ. పోరు తెలంగాణ నుంచి ఎదిగి రాజకీయ సమరంలో విజయభేరి మోగించారు. 1921 జూన్ 28న జన్మించిన పీవీ నరసింహారావు 2004 డిసెంబర్ 23న 83 ఏండ్ల వయసులో కీర్తిశేషులయ్యారు. ఆయన 93వ జయంతి నేడు. అంతటి గొప్ప పదవులు నిర్వహించిన ఆ నేతను ఇంతకాలం రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో కొనసాగిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. సముచితరీతిలో గౌరవించలేదు. ఇక్కడ.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది. ఇంతకాలం పరాయిపాలనలో విస్మరణకు గురయిన తెలంగాణ బిడ్డల జీవితాలను, చరిత్రలను సమాజానికి, ఈ తరానికి తెలియజేయాల్సిందేనని సంకల్పించింది. తెలంగాణ పోరాట వారసత్వ స్ఫూర్తితోనే పోరాడి గెలిచి తెలంగాణను సాధించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తొలి ప్రభుత్వం ఇప్పుడు పీవీ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నది. వివిధ రంగాల్లో రాణించిన తెలంగాణ బిడ్డల ఘనతను చాటిచెప్పే యత్నంలో ఇది తొలి అడుగు.

తెలంగాణలోని మారుమూల గ్రామంలో పుట్టిన పీవీ నరసింహారావు తెలుగు నేలపైనే కాకుండా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సైతం తన ప్రత్యేకతను చాటిచెప్పారు. ఒక మామూలు కుటుంబంలో పుట్టి, వందేమాతరం ఉద్యమం పట్ల ఆకర్షితులై, నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ రాజకీయాల్లో అడుగుపెట్టారాయన. రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ప్రధానిగా అనేక సంస్కరణలు చేపట్టి, నూతన విధానాలకు నాంది పలికారు. భారతదేశంతో విదేశీ సంబంధాలను మెరుగుపరుచుకోవడంలో కృషి సలిపారు. ఆయన జయంతి సందర్భంగా మరోసారి ఆయన జీవిత విశేషాలను గుర్తుచేసుకుందాం.

వరంగల్ జిల్లాలో పుట్టి.. కరీంనగర్ జిల్లాలో పెరిగి..

పీవీ నరసింహారావు 1921 జూన్ 28న వరంగల్ జిల్లా నర్సంపేటకు సమీపంలోని లక్నేపల్లిలో సీతారామారావు, రుక్మాబాయి దంపతులకు జన్మించారు. మూడేండ్ల వయసులో పీ రంగారావు, రత్నాబాయి దంపతులు దత్తత చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాలోని వంగరలో పెరిగారు. హన్మకొండలో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లోనే పీవీ వందేమాతరం ఉద్యమం వైపు ఆకర్షితులై అందులో చురుకుగా పాల్గొన్నారు. మహారాష్ట్రలోని పుణె ఫెర్గొసన్ కాలేజీలో బీఎస్సీ అంతరిక్ష పరిశోధన (ఆస్ట్రానమి), ఆ తర్వాత నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి లా పూర్తిచేశారు. ఎల్‌ఎల్‌బిలో ఆయన గోల్డ్‌మెడల్ సాధించారు. అనంతరం హిందీలో సాహిత్యరత్న చేశారు. నాడు నిజాం పాలకులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పీవీ కీలక పాత్ర పోషించారు. 

రాజకీయాల్లో అంచెలంచెలుగా..

1940లో రాజకీయాల్లో ప్రవేశించిన పీవీ తాను చనిపోయేవరకు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే కొనసాగారు. స్వామి రామానందతీర్థ పీవికి రాజకీయ గురువు. రామానంద తీర్థకు ముగ్గురు ప్రియశిష్యులు. వారిలో పీవి మొదటివారు. మరో ఇద్దరు ఎస్‌బీ చవాన్, వీరేంద్రపాటిల్. ఈ ముగ్గురు కూడా ఆయా రాష్ర్టాలకు ముఖ్యమంత్రులుగా, కేంద్ర క్యాబినెట్ మంత్రులుగా పనిచేయడం గమనార్హం. వీరిలో పీవిని ప్రధాని పదవి వరించింది. ఆయన ఐదేండ్లపాటు కేంద్రంలో ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపించారు.

1952లో పీవీ తొలిసారిగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి కమ్యూనిస్ట్ నేత బద్దం ఎల్లారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 1957లో మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1977, 1980 లోక్‌సభ ఎన్నికల్లో హన్మకొండ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు. 1984, 1989 లోక్‌సభ ఎన్నికల్లో హన్మకొండతోపాటు మహరాష్ట్రలోని రాంటెక్ లోక్‌సభ స్థానాల నుంచి పీవీ పోటీచేశారు. 1991 లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉన్న పీవీ, నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్‌గాంధీ మరణానంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆయనను ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసింది.

అప్పటికి పార్లమెంటు సభ్యుడిగా లేని పీవీ ప్రధాని పదవి చేపట్టిన అనంతరం కర్నూలు జిల్లా నంద్యాల నుంచి ఉపఎన్నికలో లోక్‌సభకు పోటీచేసి గెలుపొందారు. అప్పట్లో పీవీ మెజారిటీ ఉప ఎన్నికల్లో అత్యధిక మెజారిటీగా రికార్డు సాధించింది. అప్పుడు పీవీ ప్రధానిగా ఉండటంతో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, ఇతర పార్టీలు పోటీ నుంచి వైదొలిగి సహకరించాయి. ఆ తరువాత 1996 లోక్‌సభ ఎన్నికల్లో నంద్యాలతోపాటు ఒడిశాలోని బర్హంపూర్ స్థానాల నుంచి పోటీచేసిన పీవీ రెండుచోట్లా గెలుపొందారు. నంద్యాల స్థానానికి రాజీనామా చేసి బర్హంపూర్‌కు ప్రాతినిధ్యం వహించారు. 

మంత్రిగా జైళ్ల సంస్కరణల నుంచి..

రాజకీయాల్లో రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న పాములపర్తి వెంకట నరసింహారావు అనేక రంగాల్లో సంస్కరణలు చేపట్టి గొప్ప సంస్కరణకర్తగా గుర్తింపు పొందారు. 1962లో నీలం సంజీవరెడ్డి క్యాబినెట్‌లో తొలిసారిగా మంత్రి బాధ్యతలు చేపట్టిన పీవీ రాష్ట్ర జైళ్ల శాఖను సమర్థంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు.

జైళ్ల సంస్కరణల్లో భాగంగా అప్పట్లో ఆయన దేశంలోనే మొదటిసారిగా ఓపెన్ జైళ్ల విధానాన్ని ప్రవేశపెట్టి జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పీవీ అక్కడ కూడా అనేక మార్పులు చేపట్టారు. ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేట్ ప్రాక్టీస్‌ను నిషేధించారు. అనంతరం విద్యాశాఖమంత్రిగా పనిచేసిన సమయంలో పీవీ ప్రవేశపెట్టిన విధానాలు, చేపట్టిన సంస్కరణలు నేటికీ కొనసాగుతున్నాయంటే అతియోశక్తి కాదు. తెలుగు అకాడమీని నెలకొల్పడం, ఉన్నత విద్యలో తెలుగు మీడియంను ప్రవేశపెట్టడం పీవీ విద్యాశాఖ మంత్రిగా తీసుకొచ్చిన కార్యక్రమాలే.

ముఖ్యమంత్రిగా భూసంస్కరణలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దాదాపు ఏడాదిన్నరపాటు పనిచేసిన పీవీ తన పాలనలో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. 1969లో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నది. దీంతో బ్రహ్మానందరెడ్డిని తప్పించి పార్టీ హైకమాండ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న పీవీకి రాష్ట్ర పాలనా పగ్గాలు అప్పగించింది. 1971 సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పీవీ 1973 జనవరి 10 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆ సమయంలో ఆయన దేశంలో తొలిసారిగా భూసంస్కరణలు తీసుకొచ్చారు.

పీవీ హయాంలో తెలంగాణ ఉద్యమంతోపాటు జై ఆంధ్ర ఉద్యమాలు ఊపందుకోవడంతో.. చివరకు నాటి కేంద్ర ప్రభుత్వం ఆయనను సీఎం పదవి నుంచి తప్పించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించింది. భూసంస్కరణల చట్టం అమలు రుచించని సీమాంధ్ర భూస్వాములు పీవీని గద్దె దించడానికి నాడు జై ఆంధ్ర ఉద్యమానికి బాసటగా నిలిచి ఊపిరిపోశారని కొందరంటుంటారు.

మైనారిటీలో ఉన్నా.. ఐదేండ్ల పాలన

ప్రధానమంత్రిగా పీవీ బాధ్యతలు చేపట్టినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ లేదు. అయినా పీవీ తన వాక్‌చాతుర్యం, రాజకీయ అనుభవంతో అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని వారి సహకారంతో ఐదేండ్లపాటు ప్రభుత్వాన్ని నడిపించగలిగారు. దేశ ఆర్థిక పరిస్థితిని, విదేశీ సంబంధాలను మరింత మెరుగుపర్చారు. ఆర్థికంగా క్లిష్టపరిస్థితుల్లో ఉన్న దేశాన్ని సంస్కరణల ద్వారా గట్టెక్కించి ప్రగతి పథంలో నడిపించారు. సభలో మెజారిటీ ఉన్నా లేకపోయినా అన్ని పార్టీలు, ప్రజల మద్దతుతో అందర్ని కలుపుకొని పోవడమే ఒక విధానంగా అనుసరించారు.

కాంగ్రెస్‌తోపాటు బీజేపీ, జనతాదళ్, వామపక్షాలు.. ఇలా అన్ని రాజకీయ పార్టీలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ పరిస్థితిని చక్కదిద్దే బాటలు వేశారు. ప్రధానిగా పనిచేసిన ఐదేండ్లకాలంలో పీవీ పెనుమార్పులకు శ్రీకారం చుట్టారు. కొన్ని సందర్భాల్లో ఆయన మెతకగా వ్యవహరిస్తారని, మౌనంగా ఉంటారనే అభిప్రాయాలే తప్ప 1996లో ఆయన ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా ఏ ఒక్క విమర్శా రాకపోవడం ఆయన పాలన తీరుకు నిదర్శనం. గడచిన గతాన్ని, రాబోయే భవిష్యత్తును ఏ మాత్రం ఆలోచించకుండా.. ప్రస్తుతం ఏం చేస్తే దేశానికి, ప్రజలకు మేలు జరుగుతుందనే ఎజెండాతోనే పీవీ ముందుకు వెళ్ళేవారని ఆయన సన్నిహితులు, దగ్గరనుంచి చూసినవారు చెప్తుంటారు. 

పదవులకు దూరమై.. పార్టీలోనే కొనసాగి..

కాంగ్రెస్ పార్టీ టికెట్ లభించకపోవడంతో పీవీ 1998లో లోక్‌సభకు వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో పోటీచేయలేదు. ప్రధాని పదవీకాలం ముగిసిన తర్వాత దాదాపు 8 సంవత్సరాలపాటు పదవులకు దూరంగా ఉంటూ, సాహిత్య సేవచేస్తూ కాంగ్రెస్‌తోనే తన అనుబంధం కొనసాగించారు. బహుభాషా కోవిదుడిగా, రాజకీయ మేధావిగా, గొప్ప సంస్కరణకర్తగా గుర్తింపు పొందిన పీవీ నరసింహారావు 2004 డిసెంబర్ 23న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుది శ్వాస విడిచారు. 

జాతీయ రాజకీయాల్లో రాణింపు..

ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగిన అనంతరం పీవీ జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1975లో తొలిసారిగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1977 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆయనను హన్మకొండ స్థానం నుంచి లోక్‌సభ బరిలో నిలబెట్టింది. 1980లో తొలిసారిగా కేంద్ర మంత్రివర్గంలో పీవీకి చోటు దక్కింది. అప్పట్లో ఆయన కేంద్ర విదేశాంగశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1984లో కొంతకాలంపాటు కేంద్ర హోంశాఖ, తర్వాత రక్షణశాఖ మంత్రిగా పనిచేశారు. 1988లో మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో జాతీయ స్థాయి విద్యారంగంలో అనేక మార్పులు, సంస్కరణలు చేపట్టారు.

కొత్త కొత్త విద్యా విధానాలు తీసుకొచ్చారు. నవోదయ విద్యాలయాల ఏర్పాటు ఆయన హయాంలోనే జరిగింది. 1991లో రాజీవ్‌గాంధీ మరణానంతరం ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన పీవీని ప్రధాని పదవి వరించింది. అలా ఆ పదవి చేపట్టి తెలుగు రాష్ట్రం నుంచి ప్రధాని పదవి చేపట్టిన తొలి నేతగా పీవీ రికార్డు సాధించారు. తన పాలనలో పీవీ అనేక సంస్కరణలు చేపట్టి కొత్త ఒరవడి, కొత్తదనాన్ని చూపించారు. మార్పు వల్ల సమాజంలో మంచి జరుగాలని ఆయన కోరుకునేవారు.

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

ల్యాంకోహిల్స్‌ భూములపై సుప్రీంకు..

-గత ప్రభుత్వ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటాం..
-వక్ఫ్ ఆస్తుల రక్షణకు కఠిన చర్యలు
-కబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టాలె..
-ఏపీ వక్ఫ్‌బోర్డును తెలంగాణ వక్ఫ్ యాక్ట్‌గా మార్పు
-వక్ఫ్ భూముల రక్షణ బాధ్యత తహసీల్దార్లకు..
-భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు
-వక్ఫ్ భూములపై మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో సమీక్ష
హైదరాబాద్ శివారు ప్రాంతం మణికొండలోని వక్ఫ్ భూమిని నిబంధనలకు విరుద్ధంగా ల్యాంకో హిల్స్‌కు కేటాయించటంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వక్ఫ్ భూములను ఇతరులకు విక్రయించటం చట్టవిరుద్ధమని, ఆ భూములు ల్యాంకో సంస్థకు ఇవ్వకూడదని రాష్ట్ర హైకోర్టు అప్పటి ప్రభుత్వాన్ని ఆదేశించినప్పటికీ అక్రమంగా దోచిపెట్టారని విమర్శించారు. కోర్టు ఆదేశాలను బేఖాతర్ చేస్తూ ప్రభుత్వమే దళారిగా మారి అవి వక్ఫ్ భూములు కావంటూ సుప్రీంకోర్టులో కేసు వేయటం దుర్మార్గమని మండిపడ్డారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం కేటాయించిన భూములను కంచే చేను మేసినట్లుగా ప్రభుత్వం ల్యాంకో హిల్స్‌కు అప్పగించిందన్నారు. గత ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన కేసును టీఆర్‌ఎస్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని, లాంకోహిల్స్‌కు ఇచ్చినవి వక్ఫ్ భూములేనని మరో కేసు వేస్తామని వెల్లడించారు.

hariraoశుక్రవారం మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని కలెక్టరేట్‌లో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి వక్ఫ్ భూములపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ శరత్‌తో పాటు, 46 మండలాల తహసీల్దార్లు, మైనార్టీ మత పెద్దలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వ భూముల పరిరక్షణకై టీఆర్‌ఎస్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. గురుకుల్ ట్రస్ట్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. అన్యాక్రాంతమైన వక్ఫ్‌బోర్డు భూములను గజం కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కబ్జా కోరల్లో చిక్కుకున్న వక్ఫ్ భూములను తిరిగి ప్రభుత్వ స్వాధీనం చేసుకుంటుందని, భూములు ఆక్రమించిన వారు ఎంతటి వారైన వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ప్రభుత్వ భూముల జోలికి వెళ్లాలంటే వెన్నులో వణుకు పుట్టాలని, మరొకరు తప్పు చేయకుండా ఉండాలంటే కఠినంగా వ్యవహరించక తప్పదన్నారు. కబ్జాదారులు ఇంటిదొంగలైనా, ఇతరులైనా వదిలిపెట్టే ప్రసక్తేలేదన్నారు.

80శాతం వక్ఫ్ భూములు ఆక్రమణలోనే..

రాష్ట్రంలో వేల ఎకరాల వక్ఫ్ భూములున్నప్పటికీ వాటి ద్వారా ముస్లింలకు ఎలాంటి లబ్ధి చేకూరటం లేదని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొత్తం 77వేల ఎకరాలకు పైగా వక్ఫ్ భూములుండగా, మెదక్ జిల్లాలోనే అత్యధికంగా 35వేల ఎకరాల భూమి ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయని తెలిపారు. ఇందులో 80 శాతం భూములు అన్యాక్రాంతమయ్యాయని, కొన్ని చోట్ల వక్ఫ్ భూముల్లో భారీ నిర్మాణాలు కూడా వెలిశాయని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వక్ఫ్ భూములను అమ్మడం, కొనడం కుదరదని, అయినప్పటికీ గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వేల ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని అన్నారు. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ వక్ఫ్‌బోర్డును తెలంగాణ వక్ఫ్‌యాక్ట్‌గా మార్చనున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. ఈ యాక్ట్‌లో రాష్ట్ర శాసనసభ ఆమోదంలో పలు సవరణలు చేస్తామని చెప్పారు.

వక్ఫ్ ఆస్తుల రక్షణ తహసీల్దార్లకు..

వక్ఫ్ ఆస్తులను ప్రస్తుతం ముతవలీలు పరిరక్షిస్తున్నారని, చట్టంలో సవరణ ద్వారా దేవాదాయ, రెవెన్యూ భూములను పరిరక్షిస్తున్న తహసీల్దార్లకే వక్ఫ్ భూముల పరిరక్షణ బాధ్యత కూడా అప్పగిస్తామని హరీశ్‌రావు తెలిపారు. భూములను కంప్యూటరీకరణ చేయటంతో పాటు వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ముస్లింల విద్య, వైద్యం, ఇతర అభివృద్ధి కోసమే వినియోగిస్తామన్నారు. వక్ఫ్ భూముల రక్షణపై గత ప్రభుత్వాలు కనీసం అధికారులతో సమావేశం నిర్వహించిన దాఖలాలు కూడా లేవన్నారు. వక్ఫ్ ఆస్తుల రక్షణకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం నడుం కట్టిందని, మెదక్ జిల్లా నుంచే అందుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. రెవెన్యూ అధికారులకు పోలీసుశాఖ వెన్నంటే ఉంటుందని, అధికారులు ఎవరికీ భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. భూముల స్వాధీనంపై ప్రతినెలా అధికారులతో సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు.

వక్ఫ్ ఆస్తుల రక్షణ చర్యలు హర్షణీయం: వక్ఫ్‌బోర్డు సీఈవో అబ్దుల్ హమీద్

వక్ఫ్ భూములు అన్యాక్రాంతమైనది వాస్తవమేనని వక్ఫ్‌బోర్డు సీఈవో అబ్దుల్ హమీద్ తెలిపారు. సిబ్బంది కొరత కారణంగా భూముల ఆక్రమణను అడ్డుకోలేకపోతున్నామని చెప్పారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం ముందుకు రావటం హర్షణీయమని, ఆక్రమణకు గురైన ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు. రికార్డుల్లో ఉన్న భూములను పరిశీలించి, ఆక్రమణకు గురైనట్లు తేలితే వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ శరత్, ఆర్డీవోలు, తహసీల్దార్ల కోరారు. ఈ సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, మదన్‌రెడ్డి, చింతా ప్రభాకర్, మహిపాల్‌రెడ్డి, కిష్టారెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి పర్యటనలో భాగంగా పట్టణంలో నూతనంగా నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని హరీశ్‌రావు, పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!