గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, జూన్ 25, 2014

పీపీఏల లొల్లి ఫట్

-ఏపీజెన్‌కో కొనుగోలు ఒప్పందాల రద్దు ఏకపక్షమన్న సీఈఏ
-జూన్ 2 నాటికి ఉన్న యథాతథస్థితికి ఆదేశం
-బెంగళూరు ఎస్‌ఆర్‌పీసీ భేటీలో వాడివేడిగా వాదనలు
తెలంగాణను సంక్షోభంలోకి నెట్టాలనుకున్న ఆంధ్ర సర్కారు దవడ పగిలింది. సాంకేతికాంశాల సాకుతో విద్యుత్ రంగంలో పీపీఏలు రద్దుచేసిన ఆంధ్రాబాబుల చెవులు మెలిపెట్టి తెలంగాణ తన కోటా తాను సాధించుకుంది. ముంచుకొచ్చిన సమస్యను మౌనగంభీర ముద్రతోనే ఎదుర్కొని తానేమిటో తెలంగాణ సర్కారు నిరూపించుకుంది. కేంద్రం జేబులో ఉన్నంత మాత్రాన దేశంలో వ్యవస్థలన్నీ దాసోహం కాబోవనే సందేశం బెంగళూరు సమావేశం విస్పష్టంగా ప్రకటించింది. ఈ విజయం రాబోయే అనేక వివాదాల్లో తెలంగాణకు ఇది ముందస్తు శుభసంకేతమై నిలిచింది.

విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)పై పేచీపెట్టిన ఆంధ్రాసర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. జూన్ 2వ తేదీ నాటి యథాతథస్థితి (స్టేటస్‌కో) కొనసాగించాలని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఏపీజెన్‌కో, ఏపీ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఏపీఎస్‌ఎల్‌డీసీ)ను ఆదేశించింది. ఏపీ సర్కార్ పీపీఏల వివాదంపై మంగళవారం బెంగళూరులో సదరన్ రీజనల్ పవర్ కమిటీ (ఎస్‌ఆర్‌పీసీ) సమావేశాన్ని నిర్వహించింది. వారం రోజులుగా పీపీఏల విద్యుత్ వివాదంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. వివాదం మరింత జటిలమైతే ఏకంగా దక్షిణాది రాష్ర్టాల సదరన్ పవర్ గ్రిడ్‌కు ముప్పు పొంచి ఉండడంతో సదరన్ రీజనల్ పవర్ కమిటీ(ఎస్‌ఆర్‌పీసీ) అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది.

project
సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన ఏపీ జెన్‌కో, తెలంగాణ జెన్‌కో, రెండు రాష్ర్టాల లోడ్ డిస్పాచ్ సెంటర్ల ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా హాజరుకాగా, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ), నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎన్‌ఎల్‌డీసీ) ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. కమిటీ ముందు ఇరు రాష్ర్టాల ప్రతినిధులు వారి వారి వాదనలను సుదీర్ఘంగా వివరించారు. ఏపీజెన్‌కో, ఏపీఎస్‌ఎల్‌డీసీ ప్రతినిధులు ఇప్పటివరకు చెప్పిన వాదనలనే ఎస్‌ఆర్‌పీసీ ముందు ప్రస్తావించారు. తెలంగాణ ఎస్‌ఎల్‌డీసీ ప్రతినిధులు సాయిరాం, సురేష్‌బాబు, తెలంగాణ సదరన్ పవర్ డిస్కమ్ డైరెక్టర్ రఘుమారెడ్డి వాస్తవ పరిస్థితులను కమిటీకి వివరించడంతో పాటు ఆంధ్రా విద్యుత్ సంస్థల నక్కజిత్తుల చర్యలను ఎండగట్టారు.

ఏకపక్ష నిర్ణయాలు చెల్లవన్న కేంద్ర అధికారులు..

పీపీఏల వివాదంపై పూర్తి అవగాహనకు వచ్చిన సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, నేషనల్ లోడ్ డిస్పాచ్‌సెంటర్ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల అనుసరిస్తున్నామన్న ఏపీ జెన్‌కో, ఏపీఎస్‌ఎల్‌డీసీల వాదనతో విభేదించారు. జాతీయ సమగ్రత దృష్ట్యా అత్యవసర సర్వీసుల విషయంలో రాష్ర్టాలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదని స్పష్టంచేసినట్లు తెలిసింది. అంతే కాకుండా విద్యుత్ చట్టం-2003, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లలోని అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేసినట్లు సమాచారం. ఇరు రాష్ర్టాల మధ్య తలెత్తిన పీపీఏల వివాదంపై కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ తుది నిర్ణయం తీసుకునేంత వరకు జూన్ 2వ తేదీ వరకు అమలులో ఉన్న స్థితిని యధాతధంగా కొనసాగించాలని సదరన్ రీజనల్ పవర్ కమిటీ మెంబర్ సెక్రెటరీ ఎస్.ఆర్.భట్ నిర్దేశించారు. పీపీఏ వివాదానికి తెరలేపిన ఆంధ్రాసర్కార్ చర్య సరైంది కాదని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన సదరన్ రీజియన్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ), నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎన్‌ఎల్‌డీసీ) ఇప్పటికే ఏపీజెన్‌కో, ఏపీ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎపీఎస్‌ఎల్‌డీసీ)ల దృష్టికి తీసుకువచ్చాయి. అయినా సరే తమ నిర్ణయం తమదేనంటూ ఆంధ్రా సంస్థలు మొండిగా వ్యవహరిస్తూ వచ్చాయి.

విద్యుత్ విభజనపై ఆంధ్రా రాద్ధాంతం

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ప్రకారం వినియోగాన్ని బట్టి విద్యుత్ విభజన జరిగింది. తెలంగాణ ప్రాంత వ్యవసాయరంగం భూగర్భజలాలపై ఆధారపడి ఉండడం, రాజధాని చుట్టూ పారిశ్రామిక కేంద్రాలు, హైదరాబాద్ జంటనగరాలు, సైబరాబాద్ పట్టణీకరణ తదితర కారణాలతో తెలంగాణ విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ద్వారా మొత్తం విద్యుత్తు ఉత్పత్తిలో తెలంగాణకు 53.89 శాతం, సీమాంధ్రకు 46.11 శాతం వాటాల నిర్ణయం జరిగింది. రాష్ట్ర విభజన క్రమంలో భాగస్వాములైన నిపుణులు వివాదాలకు ఆస్కారం లేకుండా పూర్తిస్థాయిలో కసరత్తు చేసి విద్యుత్ విభజన చేశారు.

భౌగోళికంగా ఎక్కడి విద్యుత్ ప్రాజెక్టు ఆ రాష్ర్టానికి చెందండంతో పాటు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏల) ప్రకారం విద్యుత్ లభ్యత ఇరు రాష్ర్టాలకు ఉంటుందని విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో అధికారపగ్గాలు చేపట్టిన ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయడం ఇప్పట్లో సాధ్యం అయ్యే అవకాశం లేకపోవడంతో ప్రజానీకం దృష్టిని మళ్ళించేందుకు విద్యుత్ వివాదానికి ఆజ్యం పోసినట్లుగా భావిస్తున్నారు. మిగతా అంశాలన్నీ జనాభా ఆధారంగా విభజించినప్పుడు విద్యుత్ విభజన సైతం జనాభా ఆధారంగానే ఉండాలని సీమాంధ్ర సీఎం వాదన. ఇప్పటి వరకు ఈఆర్సీ జెన్‌కో పీపీఏలకు అనుమతివ్వని విషయాన్ని గుర్తించిన చంద్రబాబు పీపీఏలు అమలులో లేనందున అవి కొనసాగుతున్నట్లు కాదని, ఏపీ జెన్‌కో సమర్పించిన పీపీఏ ప్రతిపాదనలను ఈఆర్సీ పరిశీలించాల్సిన అవసరం లేదనే అభిప్రాయంతో సదరు పీపీఏలను ఏపీ జెన్‌కో రద్దు చేసుకుంటున్నట్లుగా ఈఆర్సీకి గత మంగళవారం లేఖ రాసి వివాదానికి తెరలేపింది.

రద్దు రాద్ధాంతంతో తెలంగాణకు కష్టాలు

ఆంధ్రా సర్కార్ పీపీఏల రద్దు రాద్ధాంతంతో తెలంగాణకు వారం రోజులుగా కరెంటు కష్టాలు ఎక్కువయ్యాయి. ఇప్పటికే రుతుపవనాల రాక మరింత జాప్యం కావడంతో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఇదే సమయంలో పీపీఏల పేచీతో ఆంధ్రాసర్కార్ 460 మెగావాట్ల(10మిలియన్ యూనిట్లు) విద్యుత్తును అడ్డుకోవడంతో తెలంగాణ విద్యుత్‌లోటుతో అతలాకుతలం అవుతున్నది. ఫలితంగా అధికారికంగా మూడు గంటల నుంచి ఆరు గంటల పాటు కరెంటు కోతలను ప్రభుత్వం అమలుచేయాల్సిన పరిస్థితి తలెత్తింది. హైదరాబాద్, వరంగల్ నగరాల్లో మూడు గంటల పాటు, మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లా కేంద్రాల్లో మూడు గంటల పాటు, పట్టణాలు, మున్సిపాలిటీల్లో నాలుగు గంటల పాటు, మండల కేంద్రాల్లో ఆరు గంటల పాటు, గ్రామీణ ప్రాంతాల్లో పన్నెండు గంటలకు పైగా కరెంటు కోతలను అమలు అవుతున్నాయి.

పీపీఏ నిప్పుల కుంపటి రాజేసి ఏపీఈఆర్సీ

రాష్ట్ర విభజనకు ముందు నాలుగు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు(డిస్కమ్స్) ప్రతిపాదించిన విద్యుత్ ఛార్జీల పెంపుదల ప్రతిపాదనలను ఏపీఈఆర్సీ తిరిగి వెనక్కి పంపించి పీపీఏల నిప్పును రాజేసిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. గత ఐదారు సంవత్సరాలపాటు ఏపీజెన్‌కో, డిస్కమ్‌లు కుదుర్చుకున్న పీపీఏలపై ఈఆర్సీ నిర్ణయం తీసుకోకుండా నిర్లక్ష్యం వహించిందనేది నగ్నసత్యం. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం(2014-15)కు సంబంధించి నాలుగు డిస్కమ్‌లు ఈఆర్సీకి అందజేసిన విద్యుత్ ఛార్జీల పెంపుదల ప్రతిపాదనల నిర్ణయం తీసుకోలేదు. అంతే కాకుండా రాష్ట్ర విభజన నేపధ్యలో తెలంగాణ ప్రాంతంలోని రెండు డిస్కమ్‌ల పరిధిలో భౌగోళిక మార్పులు చోటుచేసుకున్నాయనే కారణంతో ఈఆర్సీ డిస్కమ్‌ల టారీఫ్ ఆర్డర్లను వెనక్కి పంపించింది.

దాంతో ఆంధ్రాసర్కారు మదిలో దురాలోచన రేకెత్తింది. 2009-10 ఆర్ధిక సంవత్సరం నుంచి 2013-14 ఆర్ధిక సంవత్సరం వరకు ఏపీజెన్‌కో పీపీఏలు ఈఆర్సీ ఆమోదం లేకున్నా డిస్కమ్‌ల టారీఫ్ అర్డర్లను ఈఆర్సీ ఆమోదించడం వల్ల ఏపీజెన్‌కో పీపీఏలకు ఆమోదం లేదనే అంశమే ఎక్కడా ప్రస్తావనకు రాకపోవడం గమనార్హం. ఎప్పుడైతే ఈఆర్సీ డిస్కమ్‌ల టారీఫ్ ఆర్డర్లను వెనక్కి పంపించిందో ఏపీజెన్‌కో పీపీఏలకు ఈఆర్‌సీ అమోదంలేదు అనే కుట్రకు తెరతీసినట్లయ్యింది. దాంతో ఏపీజెన్‌కో పీపీఏలు ఇంకా ఆమోదం పొందలేదు కనుక భౌగోళికంగా మా ప్రభుత్వం పరిధిలో ఉన్న ఏపీజెన్‌కో విద్యుత్ ఉత్పత్తిని మా ప్రభుత్వం ఆజమాయిషీలోని రెండు డిస్కమ్(విశాఖపట్నం, తిరుపతి)లకే విద్యుత్తును అందజేస్తామంటూ తిరకాసు పెట్టేందుకు ఆస్కారాన్ని ఏపీఈఆర్సీ కల్పించినట్లయ్యింది. పీపీఏల వివాదం కాస్తా ముదిరిపోవడంతో ఏపీఈఆర్సీ నాలుక కరుచుకుని ఏపీజెన్‌కో నాలుగు డిస్కమ్‌లతో పీపీఏలు కుదుర్చుకున్నందున జెన్‌కో, నాలుగు డిస్కమ్‌లు అంగీకరిస్తే తప్ప పీపీఏలు రద్దుచేయడం సాధ్యంకాదనే వాదనతో ఈఆర్సీ ఏపీజెన్‌కోకు ప్రత్యుత్తరం పంపించింది. అయినా ససేమిరా అంటూ ఏపీజెన్‌కో, ఏపీఎల్‌డీసీలు తమవైఖరిలో ఎలాంటి మార్పులేదని గిరిగీసుకున్నాయి.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి