-మూడేళ్ళలో మిగులు విద్యుత్ ..
-6వేల మెగావాట్ల అదనపు ఉత్పత్తి
-ప్రణాళికలు రూపొందించండి
-ప్రైవేట్ విద్యుత్ ప్రసక్తే ఉండదు
-ఛత్తీస్‌గఢ్ నుంచి ట్రాన్స్‌మిషన్ లైన్లు
-సౌరవిద్యుత్‌కు ప్రోత్సాహం
-విద్యుత్ విజన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి
-విత్తనాలు, ఎరువుల కోసం పడిగాపులు పోవాలి
-రైతులు బాధపడకుండా చూడాలి
-అడవుల పరిస్థితి మెరుగుపడాలి
-హైదరాబాద్ కోసం రెండు కోట్ల మొక్కలు నాటాలి
-సమీక్షా సమావేశాల్లో సీఎం కేసీఆర్
వచ్చే మూడేళ్లలో తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పాలన పట్టాలకెక్కించే క్రమంలో ప్రభుత్వ శాఖల సమీక్షలను ఆయన వేగవంతం చేశారు. గురువారంనాడు కీలకమైన విద్యుత్, వ్యవసాయ రంగాలతో పాటు అటవీశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించి తగు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ శాఖ సమీక్ష సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితిలోనూ కరెంటు కోతలకు ఆస్కారం ఉండరాదుఅని అధికారులను హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రైవేటు విద్యుత్‌కు ఏ మాత్రం అవకాశం ఇచ్చేది లేదని చెప్పిన సీఎం, జెన్‌కో ఈ బాధ్యతను నెరవేర్చాలన్నారు.-6వేల మెగావాట్ల అదనపు ఉత్పత్తి
-ప్రణాళికలు రూపొందించండి
-ప్రైవేట్ విద్యుత్ ప్రసక్తే ఉండదు
-ఛత్తీస్‌గఢ్ నుంచి ట్రాన్స్‌మిషన్ లైన్లు
-సౌరవిద్యుత్‌కు ప్రోత్సాహం
-విద్యుత్ విజన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి
-విత్తనాలు, ఎరువుల కోసం పడిగాపులు పోవాలి
-రైతులు బాధపడకుండా చూడాలి
-అడవుల పరిస్థితి మెరుగుపడాలి
-హైదరాబాద్ కోసం రెండు కోట్ల మొక్కలు నాటాలి
-సమీక్షా సమావేశాల్లో సీఎం కేసీఆర్
మూడేళ్లలో 6 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. రాష్ట్ర తక్షణ అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఛత్తీస్‌గఢ్‌నుంచి ట్రాన్స్ మిషన్ లైన్‌లు యుద్ధప్రాతిపదికన వేయాలని ఆదేశించారు. వ్యవసాయ రంగం సమీక్ష సందర్భంగా పరిస్థితిని అధికారులనుంచి తెలుసుకున్న సీఎం...ఋతుపవనాల రాక ప్రారంభమైనందున అధికారులు అప్రమత్తం కావాలన్నారు. విత్తనాలు, ఎరువుల కోసం రైతులు బారులు తీరే పరిస్థితి రాకూడదని నిర్దేశించారు. తమ ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని, రైతులకు ఏ చిన్న ఇబ్బందీ రాకుండా చూడాలని అన్నారు. జూన్ 10 నాటికి రైతులందరికీ 33 శాతం సబ్సిడీ మీద ఎరువులు, విత్తనాలు అందుబాటులోకి తెస్తున్నామని అధికారులు చెప్పారు. రాష్ట్రంలో అడవుల పరిస్థితిపై అటవీ శాఖ సమీక్ష సందర్భంగా కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అడవుల సంరక్షణపై పక్షం రోజుల్లో ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. హైదరాబాద్ వాతావరణాన్ని పరిరక్షించేందుకు నగరంలో రెండు కోట్ల మొక్కలు నాటాలని సూచించారు.
మిగులు విద్యుత్తుకు ప్రత్యేక కార్యాచరణ..:
రాష్ట్రంలో మిగులు విద్యుత్తు సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మున్ముందు కరెంటు కోతలకు ఆస్కారంలేకుండా ఉండాలని సచివాలయంలో విద్యుత్‌రంగంపై జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సందర్భంగా సీఎం అన్నారు. తెలంగాణ జెన్‌కో సీఎండీగా బాధ్యతలు చేపట్టిన డీ ప్రభాకరరావును సీఎం అభినందించారు. తెలంగాణలో ప్రయివేటు విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతించబోమని, విద్యుదుత్పత్తి మొత్తం ప్రభుత్వరంగంలోని టీ జెన్‌కో ఆధ్వర్యంలోనే చేపట్టాల్సి ఉంటుందని అన్నారు.
జెన్‌కోకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇస్తున్నాం.. వచ్చే మూడు సంవత్సరాల్లో 6,000 మెగావాట్ల అదనపు విద్యుత్తు ఉత్పత్తికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకునేందుకు సమగ్ర కార్యాచరణతో రావాలని సీఎండీకి సూచించారు. బొగ్గు కొరత అంశాన్ని ప్రస్తావిస్తూ...కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు(కేటీపీపీ) రెండోదశకే కొరత ఉంది...కాబట్టి దేశీయ బొగ్గుపై ఆధారపడకుండా విదేశీ బొగ్గు(ఇంపోర్ట్ కోల్) ఆధారిత ప్రాజెక్టుల రూపకల్పన చేయాలని స్పష్టంచేశారు. ప్రస్తుత విద్యుత్ డిమాండ్‌ను అధిగమించడంతో పాటు రానున్న సంవత్సరాల్లో డిమాండ్ పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని 770 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు మధ్యంతర టెండర్ల(మిడ్‌టర్మ్ బిడ్డింగ్)ను పిలవాలని ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి, ట్రాన్స్‌కో సీఎండీ సురేష్‌చంద్రను సీఎం ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లో పేర్కొన్నట్లుగా తెలంగాణలో ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో 4,000మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు వీలుగా బొగ్గు కేటాయింపులు(కోల్ బ్లాక్) జరపాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నట్లు సీఎం తెలిపారు. ఎన్టీపీసీ ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన స్థలం విషయంలో త్వరలో స్పష్టత వస్తుందన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మిగులు విద్యుత్తును తెలంగాణకు తెచ్చేందుకు ఇరు రాష్ట్రాల మధ్య గోదావరి నది మీదుగా ట్రాన్స్‌మిషన్ లైన్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రితో తాను సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. సౌర విద్యుత్‌పై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరముందని చెప్పారు.
రూఫ్‌టాప్ సోలార్ పవర్‌కు ప్రభుత్వపరంగా ప్రోత్సాహకాలను కొనసాగిస్తూ ఆదిశగా ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలన్నారు. తన ఫామ్‌హౌజ్‌లో రూఫ్‌టాప్ సోలార్‌పవర్ విజయవంతంగా పనిచేస్తుందని అధికారులకు వివరించారు. నగరాలు, పట్టణాలకు ఒక పద్ధతి, గ్రామీణ ప్రాంతాలకు మరొక పద్ధతి అనుసరించడం వల్ల వినియోగదారులపై ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉందన్నారు.
వ్యవసాయరంగ విద్యుత్ అవసరాలకు పూర్తిస్థాయిలో సోలార్ పవర్‌తో సాధ్యమయ్యే అంశాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు, బహుళ అంతస్తుల భవనాలు, విద్యారంగ సంస్థల విద్యుత్ అవసరాలు సోలార్ పవర్‌తో అధిగమించాలని నిర్దేశించారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(టీ ఈఆర్సీ) ఏర్పాటుకు వీలుగా నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకోవాలని ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌చంద్రకు సీఎం సూచించారు. విద్యుత్ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు ఏకె గోయల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్యకార్యదర్శి ఎస్ నర్సింగరావు, ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌చంద్ర, టీజెన్‌కో సీఎండీ డీ ప్రభాకరరావు, ట్రాన్స్‌కో జేఎండీ పీ రమేష్, తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(టీఎస్‌పీడీసీఎల్) సీఎండీ సయ్యద్ ముర్తుజా రిజ్వీ, టీజెన్‌కో డైరెక్టర్ బలరాం పాల్గొన్నారు.
ఎరువుల కోసం రైతులు బాధ పడొద్దు..:
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున ఎరువులు విత్తనాల సరఫరాకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో జరిపిన సమీక్ష సమావేశంలో సీఎం ఆదేశించారు. ఎట్టి పరిస్థితిలోనూ విత్తనాలు, ఎరువుల కోసం రైతులు పడిగాపులు పడే పరిస్థితి రాకూడదన్నారు. సమీక్ష వివరాలను మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మీడియాకు చెప్పారు. రైతాంగానికి 33 శాతం సబ్సిడీతో విత్తనాలను సరఫరా చేయడానికి అన్ని చర్యలు చేపట్టినట్లు పోచారం పేర్కొన్నారు.గతంలో విత్తనాలను కొనుగోలు చేసిన తర్వాత సబ్సిడీని బ్యాంకు ఖాతాల ద్వారా రైతులకు ఇచ్చే పద్ధతి ఉండేదని దాని స్థానంలో కొనుగోలు సమయంలోనే విత్తనాల ధర నుంచే సబ్సిడీని మినహాయిస్తున్నామని తెలిపారు. అలాగే సరఫరాను జిల్లా స్థాయిలో కాకుండా గ్రామ స్థాయిలో సింగిల్ విండోల ద్వారా చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో 1,79,500 క్వింటాళ్ల సోయాబీన్ విత్తనాల అవసరముందని, ఇప్పటి వరకు లక్షా 10వేల క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేశామని చెప్పారు. మిగతా విత్తనాలను జూన్ 10 నాటికి అందిస్తామన్నారు. 17లక్షల 44 వేల టన్నుల ఎరువులు అవసరముండగా ఇప్పటికే 6 లక్షల 50 వేల టన్నుల ఎరువులను అందుబాటులోకి తెచ్చామన్నారు. మిగతా ఎరువులను నాట్లు వేశాక సరఫరా చేస్తామని తెలిపారు.
అడవుల పరిస్థితి బాగాలేదు..:
తెలంగాణలో అడవుల పరిస్థితిపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. అడవుల పరిస్థితి ఏమాత్రం బాగాలేదు..అడవులపై ఆధారపడిన గిరిజనులతో పాటు వన్యమృగాల సంరక్షణకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి.. అని అటవీశాఖ సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో తెలంగాణ వాతావరణంలో ఎంతో మార్పు వచ్చిందని, అందుకు అడవులు అంతరించిపోవడంతో పాటు పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం తగ్గిపోవడం ప్రధాన కారణమని సీఎం తెలిపారు. పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వ పరంగా ఎంత మేరకు ఆర్ధిక సహకారం కావాలనే అంశాలపై మరో పక్షం రోజుల్లో ప్రత్యేక ప్రణాళికను అందజేయాలని ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్‌ను సీఎం ఆదేశించారు.పచ్చదనానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలని, హైదరాబాద్ పరిసరాల వాతావరణంలో మార్పు తెచ్చేందుకు వీలుగా రెండు కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా ముఖ్యకార్యదర్శి అటవీశాఖకు బడ్జెట్‌లో రూ.13 కోట్ల కేటాయింపు ఉందని, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.46కోట్లు, క్యాంపా ప్రాజెక్టులో మరో వంద కోట్లు రాష్ట్రానికి అందుతున్నాయని వివరించారు. ఈ సమావేశానికి అటవీ శాఖ మంత్రి జోగురామన్నతో పాటు తెలంగాణ పీసీసీఎఫ్ ఎస్‌బీఎల్ మిశ్రా, పలువురు అధికారులు హాజరయ్యారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి