గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, జూన్ 24, 2014

తెలంగాణ కబ్జాభూములపై కదనభేరి మ్రోగించిన కేసీఆర్!

gurukul627 ఎకరాల ట్రస్ట్ భూములు హాంఫట్.. రూ.20 వేల కోట్ల భూమిని మింగిన కబ్జాదారులు
సీమాంధ్ర భూబకాసురుల మీద తెలంగాణ కదనభేరి మోగించింది. శిశుపాలుని దోషశతం పరిపూర్ణమై కృష్ణుడు చక్ర ప్రయోగం చేసినట్టు.. తెలంగాణ ప్రభుత్వం కబ్జా భూముల చెర వదిలించడానికి పూనిక తీసుకుంది. అనాథపిల్లల ఆశ్రయం కోసం, విద్యాబుద్ధులకోసం పుణ్యాత్ములిచ్చిన గురుకుల ట్రస్ట్ భూమిని.. ఉచ్ఛం, నీచం మరిచి చెరబట్టిన పాపాత్ముల పాపం పండింది. వలస పాలనలో సీమదొరలు, సీఎం దొరలు, బంధువులు, బంటులు, గ్రీకు వీరులు, సోకు భామలు ఎగబడి.. తెగబడి చెరబట్టిన ఆ భూముల విముక్తికి తెలంగాణ ప్రభుత్వం కరవాలం చేబూనింది.
ఉద్యమకాలంలోనే కబ్జాల బాగోతం బయటపెట్టిన కేసీఆర్ ఆనాడు సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి.. నీ నిజాయితీ నిరూపించుకో..గురుకుల ట్రస్ట్ భూమిలో ఉన్న నీ తమ్ముడి ఇల్లు కూల్చేయ్ అంటూ గర్జించారు. ఆప్పుడు ఆ మాటలు వారి చెవికెక్కలేదు. నిన్నటి ఆ తెలంగాణ ఉద్యమకారుడే నేడు తెలంగాణ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. అస్తిత్వ పతాకను చేబూనారు. అందుకే తెలంగాణ సీఎంగా తన మాటకు తానే తీక్షణ కార్యరూపం ఇస్తున్నారు. స్వరాష్ట్రమంటే సరిహద్దులో చెక్‌పోస్టులే కాదు. ఇంట్లో దొంగలను పొలిమేరలకు తరిమికొట్టడం కూడా. అవునూ!... తెలంగాణ వస్తే మీరే భాషలో మాట్లాడుతారు? ఐదేళ్ల క్రితం ఏదో టీవీలో వినిపించిన ఓ సీమాంధ్రనాయకుని వెకిలి వేళాకోళమిది. బహుశా... వారికి ఇప్పుడు అర్థమై ఉంటుంది...తెలంగాణ ఏ భాషలో మాట్లాడుతున్నదో!

- సీమాంధ్ర పాలనలో అధికార దుర్వినియోగం
- చంద్రబాబు సర్కారు కబ్జాపెట్టిన భూమి 300 ఎకరాలు!
- మిగిలిన 327 ఎకరాలు సీమాంధ్రులు కబ్జా
- అక్రమాలపై ఎప్పటినుంచో కేసీఆర్ పోరాటం
- ప్రత్యేక కథనాలు ప్రచురించిన నమస్తే తెలంగాణ
-ట్రస్ట్‌ను వంచించిన నీచులు.. గురుకుల్ ఆదర్శానికి తూట్లు

గురుకుల్ ట్రస్ట్. ఒక ఆదర్శనీయమైన విద్యాసంస్థ. ఆపన్నులను అక్కున చేర్చుకుని ఆదరించే గురుపీఠం. విద్యాబుద్ధులతోపాటు జీవనోపాధికీ మార్గంచూపే వెలుగు దివ్వె. అది కొంతకాలం మహనీయుల చేతుల్లో సేవలందించింది. ట్రస్ట్ అంటే ధర్మనిధి. దాని శ్వాస విశ్వాసం. కానీ.. కొంతకాలానికి ట్రస్ట్‌ను కొందరు వంచించారు. విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారు. ఫలితం.. సేవలు అంతరించిపోయాయి. ఆదర్శానికి ముచ్చటపడి దాత ఇచ్చిన 627 ఎకరాల భూములు స్వార్థపరులైన భూబకాసురులపరమయ్యాయి. తెలంగాణలో అంతటా కొనసాగినట్లుగానే ఈ పాపం కూడా మూటగట్టుకుంది సీమాంధ్ర బడాబాబులే. మొత్తంగా రూ.20వేల కోట్ల విలువైన భూములను మింగేశారు. చంద్రబాబు పాలనలో సర్కారు 300 ఎకరాలను కబ్జా పెట్టి పందేరం వేయగా, మిగిలిన 327 ఎకరాలను సీమాంధ్రులు వశంచేసుకున్నారు.

వైఎస్ హయాంలో అడ్డూఅదుపూ లేకుండా బడాబాబులు చెలరేగిపోయి, చట్టాలను, నిబంధనలను కాదని దోచుకుతిన్నారు. సీమాంధ్రుల భూ కబ్జాలకు ఒక ఉదాహరణ ఈ గురుకుల్ ట్రస్ట్ భూముల వ్యవహారం. నిజాం పాలకుల నుంచి విముక్తి పొందిన హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల్ ట్రస్ట్ భూములను కాపాడితే.. భాషాప్రయుక్త రాష్ట్రం పేరుతో బలవంతంగా తెలంగాణను విలీనం చేసుకున్న సీమాంధ్ర సర్కారు.. తన భూ ఆక్రమణల పర్వాన్ని గురుకుల్ ట్రస్ట్ భూములతోనే కొనసాగించింది. తెలంగాణ ఉద్యమకారుడిగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆనాడే గురుకుల్ ట్రస్ట్ భూముల ఆక్రమణలపై తీవ్రస్థాయిలో స్పందించారు. గురుకుల్ ట్రస్ట్ భూముల కబ్జాలపై నమస్తే తెలంగాణ దినపత్రిక 2011 ఆగస్టు 2వ తేదీ నుంచి వరుసగా ఏడు రోజులు ప్రత్యేక కథనాలను ప్రచురించింది.

స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో బన్సీలాల్ వ్యాస్ అనే ఆదర్శవాది అందరికీ వేదవిద్యతోపాటు ఆధునికమైన సాంకేతిక విద్యనందించాలన్న పవిత్ర లక్ష్యంతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేయగా, ఆయన మామగారైన బద్రీనాథ్ 627 ఎకరాల భూమిని ట్రస్ట్‌కు దానంగా ఇచ్చారు. 1951లో హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం ఈ భూమిని ట్రస్ట్‌కు ఇవ్వడానికి అనుమతి ఇచ్చింది. సీమాంధ్ర సర్కారు యూఎల్‌సీ పేరుతో ట్రస్ట్ భూములను కబ్జాదారులకు కట్టబెట్టింది. ఆస్తుల నిర్వహణ మీరు చేయలేరంటూ ట్రస్ట్‌ను స్వాధీనం చేసుకున్న సర్కారే కబ్జా చేసింది. చేయించింది.

నిజాం వ్యతిరేక ఉద్యమంలో భాగంగా..

అవి.. నిజాం నిరంకుశత్వంపై పోరాటం సాగుతున్న రోజులు.. తెల్లదొరలకు వ్యతిరేకంగా యువత నడుం బిగించి ఉద్యమిస్తున్న కాలం.. నిషేధాజ్ఞలను లెక్కచేయకుండా శత్రుశిబిరాలపై జాతీయజెండాలను ఎగిరేసే వీర కిశోరాలు.. సాహసికులు.. అలాంటివారిలో ఒకడు బన్సీలాల్ వ్యాస్. రాజధాని నడిబొడ్డున వందేమాతరం అంటూ నినదిస్తానని నిజాం సర్కారుకు సవాల్ విసిరి, హరికథకుడి వేషంలో వచ్చి వందేమాతరం అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించాడు. రాజస్థాన్‌లోని నాగోర్‌కు సమీపగ్రామంలో జన్మించిన బన్సీలాల్ వ్యాస్ తల్లిదండ్రులతోపాటు హైదరాబాద్‌కు వచ్చాడు. ఆయనను ఐదేళ్ల వయస్సులో రాధాలాల్, రాంప్యారీబాయి దంపతులు దత్తత తీసుకున్నారు. స్వామి దయానంద సరస్వతి బాటలో అడుగుపెట్టిన వ్యాస్ హైదరాబాద్‌లో ఆర్య సమాజ స్థాపకులలో అతి ముఖ్యుడయ్యాడు. 1919లో సుల్తాన్‌బజార్‌లో ఏర్పడిన ఆర్యసమాజం వ్యవస్థాపక సెక్రటరీ బన్సీలాల్ వ్యాస్. ఆ తరువాత 1931లో ఆర్యప్రతినిధి సభను ఏర్పాటు చేశారు.

కులనిర్మూలన, స్త్రీలకు విద్య, సమాన అవకాశాలు, అందరికీ వేద విద్య అందించాలన్నవి లక్ష్యాలు. బన్సీలాల్ వ్యాస్ మొట్టమొదట వికారాబాద్‌లోని అనంతగిరి కొండల్లో1938లో గురుకులాన్ని ప్రారంభించారు. 1941లో ఘట్‌కేసర్ గ్రామానికి తరలించారు. ఇప్పుడు ఘట్‌కేసర్‌లోని 20 ఎకరాల గురుకులంలో కళాశాల, స్కూల్ ఉన్నాయి. దేవాదాయశాఖ ఆధీనంలో ఈ పాఠశాల అతిదీనావస్థలో నడుస్తున్నది. బన్సీలాల్ వ్యాస్‌కు 13వ ఏట బద్రీనాథ్ కూతురు జానకీదేవితో పెళ్లి అయింది. అల్లుడి ఉద్యమస్ఫూర్తిని ప్రత్యక్షంగా చూసిన బద్రీనాథ్ ఖానామెట్‌లోని తన 627 ఎకరాల వ్యవసాయ భూమిని కట్నంగా ఇవ్వాలనుకున్నాడు. తనకు కట్నం అవసరం లేదని తేల్చి చెప్పడంతో.. అల్లుడు నిర్వహించే ట్రస్ట్‌కు భూమిని దానంగా ఇచ్చాడు. ఈ మేరకు 1951లో హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో గురుకుల్ ట్రస్ట్‌కు భూమిని దానంగా ఇచ్చాడు.

4-5-1951లో ప్రభుత్వం 796/1951 నంబర్‌తో రిజిస్టర్ చేసింది. ఈ భూమిపై వచ్చే ఆదాయంతో గురుకులం నడిచేది. ఆర్య ప్రతినిధి సభ సెక్రటరీ అయిన బన్సీలాల్ వ్యాస్ పర్యటనలో ఉండగా 1956లో మహబూబ్‌నగర్ జిల్లా జడ్జర్ల వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో అనుచరులతోపాటు దుర్మరణం పాలయ్యారు. వ్యాస్ దుర్మరణం తరువాత ట్రస్ట్ నిర్వహణ బాధ్యతలను 8 మంది సభ్యులు తీసుకున్నారు. ఆ తరువాత దీనిని రిజిస్టర్ చేశారు. కొంతకాలానికి ట్రస్ట్‌లోని ఒక సభ్యుడు దీనిని నిర్వహించలేమంటూ భూముల విక్రయానికి తెరలేపాడు. దీంతో భూ ఆక్రమణల పరంపర కొనసాగింది.

అక్రమార్కుల్లో సీమాంధ్రులే అధికం

ఈ గురుకుల్ ట్రస్ట్ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలు అధిక శాతం సీమాంధ్ర ప్రాంతానికి చెందిన బడాబాబులవే. అధికారం అడ్డు పెట్టుకుని అప్పటి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించినవారి బంధుగణమే నిర్మాణాలను పూర్తి చేసింది. కొంతమంది తెలంగాణ ప్రాంతానికి చెందినవారు కూడా ఈ భూముల్లో కొనుగోలు చేసినప్పటికీ నిర్మాణాలు చేపట్టడానికి సాహసించలేదు. వైఎస్‌ఆర్, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో గ్రేటర్ మునిసిపల్ అధికారులు పక్షపాతంగా వ్యవహరించారు. అప్పటి సీమాంధ్ర ప్రభుత్వ పెద్దలు చెప్పిన నిర్మాణాల జోలికి వెళ్ళని అధికారులు అమాయకులుగా ఉన్నవారి పై మాత్రం చర్యలు తీసుకున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు నిర్మాణాలు చేపడితే వాటిని నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. వైఎస్ సోదరుని నిర్మాణాన్ని మాత్రం వదిలేశారు. అదే తరహాలో కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుని భవనం జోలికి కూడా వెళ్ళలేదు.

అప్పనంగా కట్టబెట్టారు..

సర్కారు స్వాధీనం చేసుకున్న భూమిలో120 ఎకరాల విస్తీర్ణంలో నాక్ బిల్డింగ్, హైటెక్స్ ఏర్పాటు కాగా, 100 ఎకరాల భూమిని నోవాటెల్ హోటల్‌కు అప్పనంగా అప్పగించారు. మరో 30 ఎకరాల భూమిని హూందాయ్ కార్లసంస్థకు కట్టబెట్టారు. అన్నమయ్య కళా పీఠానికి, ఆవధాన పీఠానికి దాదాపు ఆరు ఎకరాల భూమిని కేటాయించారు. మిగిలిన భూమిని హెచ్‌ఎండీఏకు కేటాయించగా, ఈ సంస్థ ఇందులో కొంత భూమిని మంత్రి బొత్స సత్యనారాయణ భాగస్వామ్యంతో రాబోతున్న ఒక దవాఖానకు లీజుకు ఇచ్చినట్లు తెలిసింది.

కడప బ్యాచ్..

కబ్జా చేసిన ట్రస్ట్ భూమిలో కడప బ్యాచ్ ఏకంగా వైఎస్ ఆర్ హిల్స్ ఏర్పాటు చేసింది. వివేకా ఓబంగళా నిర్మించుకోగా.. అక్కినేని నాగార్జున 9 ఎకరాల భూమిలో ఎన్ సెంటర్ ఏర్పాటు చేశాడు. మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి 22 ఎకరాల భూమిని లేఅవుట్ చేసి అమ్మారని స్థానికులు చెప్తుంటారు.


బాబు బంధుగణం..

చంద్రబాబు 5 ఎకరాల భూమిని కొని విక్రయించగా, ఆయన భార్య భువనేశ్వరి పేరుతో ఒక ఎకరం భూమిని కొనుగోలు చేశారు. పురందరేశ్వరి, డీఎల్ రవీంద్రారెడ్డి, వైఎస్ తమ్ముడు సుధీకర్‌రెడ్డి, వైఎస్ ఆంతరంగికుడు సూరి అలియాస్ సూర్యనారాయణరెడ్డి, అప్పటి కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కనుకుల జనార్దన్‌రెడ్డి, సినీ నిర్మాత వడ్డేరమేశ్ తదితరులకు ఇక్కడ భూములున్నాయి. దానం నాగేందర్ కూడా భారీ ఎత్తున గురుకుల్ ట్రస్ట్ భూములను విక్రయించారన్న ఆరోపణలు వినిపించాయి. ఇదే ట్రస్ట్ భూమిలో సూర్య దినపత్రిక అధిపతి నూకారపు సూర్యప్రకాశ్‌రావు భారీ భవనాన్ని నిర్మించి పత్రిక కార్యాలయాన్ని అక్కడి నుంచే నిర్వహిస్తున్నారు.


మహాసేవకుడి మనుమడి హత్య పట్టించుకోని సీమాంధ్ర సర్కారు

గురుకులానికి 627 ఎకరాల భూమిని దానం చేసి దళిత వర్గాలకు వేద విద్య అందించాలన్న లక్ష్యంతో సేవచేసిన బన్సీలాల్ కుటుంబం పరిస్థితి దయనీయంగా మారింది. తమ పెద్దలు త్యాగం చేసిన ట్రస్ట్ భూములను సీమాంధ్ర ముఠాలు కబ్జా చేయడం భరించలేని వ్యాస్ మనుమడు రవీంద్రనాథ్ వ్యాస్ తిరిగి ట్రస్ట్ వ్యవహారాలను చేపట్టాలని భావించారు. ఈ మేరకు ప్రభుత్వాధికారులకు వినతిపత్రాలు ఇచ్చాడు. అధికారులపై ఒత్తిడి పెరిగింది. ట్రస్ట్ చేతికి వచ్చే పరిస్థితి ఏర్పడింది.

కానీ అకస్మాత్తుగా ఆయన జాడ తెలియకుండా పోయింది. ఆ తరువాత కొన్నాళ్లకు విశాఖలో ఆయన మృతదేహం లభించింది. రవీంద్రనాథ్ హత్యపై సర్కారు ఇంతవరకు స్పందించలేదు. కనీసం కేసును కూడా రిజిస్టర్ చేయలేదు. ట్రస్ట్ వ్యవహారాలు రవీంద్రనాథ్ చేపడితే అక్రమాలన్నీ వెలుగులోకి వస్తాయని, ఇక ఆటలు సాగవని భావించిన భూకబ్జాదారులే హత్య చేశారన్న అనుమానాలను ఆర్య ప్రతినిధి సభ వ్యక్తం చేస్తోంది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి