గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, జూన్ 26, 2014

తెలంగాణ బిడ్డలకే ఫీజులు చెల్లిస్తాం

-స్థానికతను తెలంగాణ ప్రభుత్వం నిర్ణయిస్తది
-కళాశాలల పాత బకాయిలు ఏ రాష్ట్ర విద్యార్థులకు ఆ రాష్ర్టాలు ఇవ్వాలి
-విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి



రాష్ట్రప్రభుత్వం తెలంగాణ బిడ్డలకు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తుందని, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు చెల్లించేది లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా సూర్యాపేటలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రులు గందరగోళం సృష్టించి ఆ ప్రాంత విద్యార్థులకు ఫీజు చెల్లించాలనడం సిగ్గుచేటన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా చెల్లించేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు వర్తించదని తెలిపారు. ఆ రాష్ట్ర పిల్లలను వారే చదివించుకోవాలని సూచించారు. స్థానికత అనేది తెలంగాణ ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. అడ్మిషన్లు గతంలో ఏ విధంగా జరిగాయో అదే విధంగా జరుగుతాయని చెప్పారు. రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు.

jagadeesh
ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉంచాలా.. తీసివేయాలా.. అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని చెప్పారు. కళాశాలల యాజమాన్యం కూడా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను చేర్పించుకునే సమయంలో ఆలోచించుకోవాలని సూచించారు. చేరబోయే విద్యార్థి ఏ రాష్ట్రానికి చెందినవారో ముందుగానే తెలుసుకొని అడ్మిషన్లు ఇవ్వాలన్నారు. కళాశాలల పాత బకాయిలను ఏ రాష్ట్ర విద్యార్థులకు ఆ రాష్ట్రాలే చెల్లించాలన్నారు. సమావేశంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, టీఆర్‌ఎస్ నేతలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కట్కూరి గన్నారెడ్డి, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.

తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

గతంలో ముల్కీ నిబంధనలు ఉల్లంఘించినందుకే గైర్ ముల్కీ ఉద్యమం వచ్చింది. అసలు తెలంగాణ ఉద్యమమే స్థానికత అంశంగా జరిగింది. స్థానికులకే ఉద్యోగాలు అన్నట్లుగా స్థానిక విద్యార్ధులకే ఫీజు రీ యింబర్స్‌మెంట్ సరైన విధానం. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం స్వాగతించదగ్గది. అయితే కొందరు కుట్రపూరితంగా కావాలనే దీన్ని రాద్ధాంతం చేస్తున్నారు. తెలంగాణ ప్రజల పన్నులతో వచ్చిన రాబడిని ఇతర ప్రాంత విద్యార్థులకు ఎలా ఖర్చు చేస్తాం? నాటి ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా అప్పటి సీమాంధ్ర నేతలు కుట్రలతో 32వ రాజ్యాంగ సవరణ ద్వారా రద్దు చేయించారు. 

అనంతరం తెలంగాణ ప్రయోజనాల కోసం 1975లో రాష్ట్రపతి ఉత్తర్వులు అమలులోకి వచ్చాయి. వాటినీ తుంగలో తొక్కారు. లోకల్ అంశం వచ్చిన ప్రతిసారీ తెలంగాణలో గందరగోళం రేకెత్తిస్తున్నారు. సీమాంధ్ర ఉద్యోగులకు ఫీజు భరిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా వివాదం చేయడం అనైతికం. కేంద్ర విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఫీజులను భరిస్తున్న తరహాలోనే రెండు రాష్ట్రాలు వ్యవహరించాలి. తెలంగాణ బిడ్డలుగా ఏ రాష్ట్ర విద్యార్థికి అన్యాయం జరగొద్దన్నదే మా అభిమతం.
- దేవీ ప్రసాద్, టీఎన్జీవో అధ్యక్షుడు

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి