గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, జూన్ 26, 2014

ప్రస్తుత తెలంగాణకు ముల్కీ రూల్సే ముద్దు!

-స్థానికతకు ఆ పద్ధతినే అనుసరించాలి
-ఇంకా సీమాంధ్రకు పెద్దపీట సరికాదు
-మనవి మనకేనంటున్న తెలంగాణవాదులు
-స్థానికతపై రగులుతున్న విద్యార్థి యువతరం
-నాలుగేండ్లు చదివితే లోకలైతే మన సంగతేంది?
-ఇప్పటికే లక్ష ఉద్యోగాలు కొల్లగొట్టిన సీమాంధ్రులు
-ఇంకా వారి పిల్లలకు అడ్మిషన్లు, ఫీజులా?
-అసలైన తెలంగాణ స్థానికులను గుర్తించాలివారికే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలి
-ఫీజులకే కాదు.. అన్నింటికీ వర్తింపజేయాలని డిమాండ్
-సానుకూలంగా స్పందించనున్న ప్రభుత్వం
-ముల్కీ అమలు చేయాలనే నిర్ణయం?

నీళ్లు.. నిధులు.. నియామకాలు.. ఈ మూడింటిలోనూ తెలంగాణ దగాపడింది. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు వివక్షను భరించలేక మన సొంత రాష్ట్రం కోసం తెగించి పోరాటానికి దిగి తెలంగాణను సాధించుకున్నరు. మన తెలంగాణ మనకయింది. సంబురం. కానీ.. ఏ ఆశలతో విద్యార్థులు, ఉద్యోగులు రగిలిన మంటతో, ఉరుకులెత్తిన ఉత్సాహంతో ఉద్యమించారో ఆ ఫలితాలు ఇప్పుడు అందాలి కదా.. ఇప్పుడు మన రాష్ట్రంలోనూ పరాయి పాలన నియమాలే కొనసాగితే ఎలా?.. ఇంకా ఆంధ్రోళ్లు స్థానికుల విద్యావకాశాల్లో చొరబడితె ఎట్ల?.. ఈ గడ్డపై మమకారం లేనివారు.. అనుబంధం పెంచుకోనివారు.. దోపిడీకి పాల్పడి భూములు కొల్లగొట్టి.. ఉద్యోగాలను కాజేసినవారు..

ఇప్పటికీ ఇక్కడ నాలుగేండ్లు చదివితేచాలు 85 శాతం స్థానికుల కోటాలోనే విద్యాసంస్థల్లో చేరొచ్చు.. అలాగే ఉద్యోగాలు పొందొచ్చు అంటే ఎలా?.. ఇది ఒప్పం గాక ఒప్పం.. అంటున్నారు తెలంగాణవాదులు. ఆ నియమాలు చెల్లవుగాక.. చెల్లవంటోంది విద్యార్థి యువత. కొత్త పద్ధతులు కావాలె అని ప్రజలు కోరుకుంటున్నరు. తమ బిడ్డలు ఇకనైనా కొలువుల్లో చేరితే మురిసిపోతమంటున్నరు. ఇది న్యాయమైన కోర్కె. మన తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే కదులుతున్నది. ప్రస్తుతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై లోకల్ ఎవరు వివాదం కొనసాగుతున్నది. ఇందుకోసం స్థానికత నియమాలను మార్చాలనుకుంటున్నది. ఆంధ్రపాలనలోని నాలుగేండ్లకు బదులు నిజాం హయాంలో రూపొందించిన పుట్టుక నుంచి 15 ఏండ్లు ముల్కీ నిబంధనను అమలుపరుచాలనుకుంటున్నది. ముల్కీ విధానాన్ని కేవలం ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే కాదు.. అన్నింటికీ వర్తింపజేయాలని తెలంగాణవాదులు కోరుతున్నరు.
Students
తెలంగాణ రాష్ట్రంలో సీమాంధ్రుల గురించి మనకెందుకింత తండ్లాట?.. మన రాష్ట్ర విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తూ.. సీమాంధ్ర విద్యార్థులకు కూడా ఫీజులు చెల్లించాలా?.. నాలుగేండ్లు ఇక్కడ చదువంగనే స్థానికులెట్లయితరు? సీమాంధ్ర పాలకుల స్వార్థ విధానాలు ఇంకా అమలుకావాల్నా?.. నిజాం హయాంలో విదేశాల నుంచి సిపాయిలను భర్తీ చేసుకున్నప్పుడు స్థానికులు ఆందోళన చేస్తే.. నిజాం ప్రభుత్వం అసలైన స్థానికత అంటే ఏమిటో స్పష్టంగా నిర్వచిస్తూ ముల్కీ నిబంధనలు రూపొందించింది. కానీ వాటిని ఆంధ్రోళ్లు పట్టించుకోలేదు. వివిధ పద్ధతుల్లో తెలంగాణ స్థానికుల లక్ష ఉద్యోగాలు కొల్లగొట్టారు. ఆ లక్ష ఉద్యోగాలే తెలంగాణ నిరుద్యోగులకు వస్తే ఇప్పటికి ఎన్ని లక్షల కుటుంబాలు బాగుపడేటివి?.. మన నోటికాడి కూడు గుంజుకున్నరు.. అలాంటివారికి తెలంగాణ రాష్ట్రంలో అడ్మిషన్లు కల్పించి ఫీజులు చెల్లించాలా?.. ఇది ప్రతి తెలంగాణ విద్యార్థి, సగటు తెలంగాణవాది మాట. అప్పటి నిజాం హయాంలో అనుసరించిన స్థానిక అర్హత విధానాన్ని పాటించడం మేలని ఇప్పుడు పలువురు తెలంగాణవాదులు అభిప్రాయపడుతున్నారు. అసలు ముల్కీ నిబంధనలు ఏమిటి?.. ఎందుకు రూపొందాయి?.. ఆ నిబంధనలు ఏమిటో ఒకసారి పరిశీలించి చూస్తే..

ముల్కీ ప్రకారం.. పుట్టుక నుంచి 15ఏండ్లు

నిజాం కాలంలో ఎవరు స్థానికులు? ఎవరు స్థానికేతరులు?.. అనే అంశంపై పూర్తి స్థాయి స్పష్టత ఉంది. హైదరాబాద్‌లో పుట్టుక నుంచి 15 ఏళ్లు స్థానికంగా నివాసం ఉంటేనే వారు హైదరాబాద్ లోకల్ అని నిజాం సర్కారు స్థానికతపై నిర్వచనం ఇచ్చింది. నిజాం సర్కారు ఆ కాలంలో అవసరాల కోసం విదేశాల నుంచి సిపాయిలను తీసుకునేది. అలా వచ్చినవారి పిల్లలకే నిజాం సర్కారు ఉద్యోగాలు ఇస్తున్నదంటూ అప్పట్లో స్థానికులు ఆందోళనకు దిగారు. ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం జరిగింది. దీంతో నిజాం సర్కారు స్పందించి లోకల్ ఎవరు? నాన్ లోకల్ ఎవరు? అనే అంశంపై పూర్తి స్థాయి స్పష్టత ఇచ్చింది. ఈ లోకల్ నిబంధన ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోనూ ఐదేండ్ల వరకు కొనసాగింది. ఆ తర్వాత ఆంధ్రా సర్కారు స్థానికతకు వక్రభాష్యాలు చెప్పి తెలంగాణవారి నోట్లో మన్ను కొట్టింది.

1974-75లో రాష్ట్రపతి ఉత్తర్వులు..

1969లో ముల్కీ అమలు చేయాలని తెలంగాణ ఉద్యమం, 1971-72లో ముల్కీ రద్దు చేయాలని జై ఆంధ్రా ఉద్యమం కొనసాగాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఎం సిక్రీతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ముల్కీ రూల్స్‌ను సమర్థించింది. అయినప్పటికీ ఆ తర్వాత 1973లో కేంద్ర ప్రభుత్వంపై సీమాంధ్రుల ఒత్తిడి కారణంగా 32వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం ముల్కీ రూల్స్ రద్దు చేసింది. ఆ తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇరు ప్రాంతాల ప్రజలను తప్తిపరిచే విధంగా అప్పుడు ఉమ్మడి రాష్ర్టాన్ని ఆరు జోన్లుగా విభజించారు. ఉద్యోగాల భర్తీలో పోస్టుల స్థాయిని వర్గీకరించి జిల్లా, జోనల్, మల్టీ జోనల్, రాష్ట్రస్థాయి క్యాడర్లుగా ఏర్పాటు చేశారు. ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేశారు.

విద్యావకాశాల్లో స్థానికత

రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు, అడ్మిషన్లకు స్థానికత వేరు వేరుగా ఉంది. వివిధ వత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్‌లో 85శాతం స్థానిక విద్యార్థులకు, 15 శాతం ఓపెన్ మెరిట్ కోటాగా అడ్మిషన్లు నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రవేశాలు కల్పించే సమయంలో క్వాలిఫయింగ్ పరీక్షకు ముందు నాలుగేండ్లు ఏ జిల్లాలో చదివితే ఆ విద్యార్థిని ఆ జిల్లా లోకల్ విద్యార్థిగా పరిగణిస్తున్నారు. ఈ ప్రకారం ఉదాహరణకు హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌లో ప్రవేశం కోరే విద్యార్థులు అంతకుముందు ఏడేండ్లలో నాలుగేండ్ల్లు.. అంటే ఇంటర్, పది, తొమ్మిది తరగతులు హైదరాబాద్‌లో చదివి ఉంటే చాలు స్థానిక కోటాలో సీటుకు అర్హులవుతున్నారు. హైదరాబాద్ లోకల్ కోటాలో ప్రవేశాలు పొందాలంటే లేదంటే 6 నుంచి 12 తరగతుల్లో నాలుగేండ్లు హైదరాబాద్‌లో చదివితే చాలని రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలా నాలుగేండ్లు చదివినవారు స్థానికులుగా 85 శాతం కోటాలో ప్రవేశాలు పొందుతున్నారు.

ఉద్యోగాల్లో స్థానికత

ఉద్యోగాల విషయానికి వస్తే 4 నుంచి 10 తరగతుల వరకు నాలుగేండ్లు ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లాలో వారిని స్థానికులుగా గుర్తిస్తున్నారు. ఇవి ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉత్తర్వులు. నాలుగేండ్లు తెలంగాణలో చదివినంతమాత్రాన సీమాంధ్రులు తెలంగాణవారు ఎలా అవుతారు?.. ఇంకా పాత ఉమ్మడి రాష్ట్రంలోని జీవోలు అమలు చేస్తే స్వచ్ఛమైన తెలంగాణ విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం ఎలా జరుగుతుంది అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేయాలంటే పాత జీవోలను అమలు చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

డిగ్రీలో నాన్‌లోకల్ ప్రవేశం, పీజీలో లోకల్ గుర్తింపు

ఇంజినీరింగ్ ఫార్మసీ డిగ్రీ కోర్సులు, బీటెక్, బీ ఫార్మసీ, ఇతర డిగ్రీ కోర్సుల్లో ఓపెన్ మెరిట్ కోటా 15 శాతంలో అడ్మిషన్లు పొందిన సీమాంధ్ర విద్యార్థులు పీజీకి వచ్చేసరికి లోకల్ కోటాగా మారిపోతున్నారు. వత్తివిద్యా కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించేపటప్పుడు క్వాలిఫయింగ్ పరీక్షకు ముందు ఏడేండ్లు ఎక్కడ చదివారనేది పరిగణనలోకి తీసుకుంటారు. ఆ ఏడేండ్లలో నాలుగేండ్లు ఏ జిల్లా, ఏ యూనివర్సిటీ పరిధిలో చదివితే ఆ యూనివర్సిటీ పరిధిలో లోకల్ విద్యార్థి అవుతారు. సీమాంధ్రకు చెందిన విద్యార్థులు హైదరాబాద్‌లో 15 శాతం ఓపెన్ మెరిట్‌లో బీటెక్, బీ ఫార్మసీలో ప్రవేశం పొందితే ఎంటెక్, ఎంఫార్మసీకి వచ్చేసరికి లోకల్ విద్యార్థులుగా మారుతున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం సీమాంధ్రులను కూడా లోకల్ విద్యార్థులుగా పరిగణిస్తున్నందున వారికి తెలంగాణ ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయాల్సి వస్తుంది. ఇది మరీ దారుణమని తెలంగాణవాదులు మండిపడుతున్నారు.

తల్లిదండ్రుల స్థానికతను గుర్తించాలి

1969 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలో పనిచేసిన సీమాంధ్ర ఉద్యోగుల సర్వీసు రికార్డులు పరిశీలించాలి. సర్వీసు రికార్డుల్లో ఉన్న తండ్రి స్థానికత ఆధారంగా స్థానికతను గుర్తించాలి. ఉద్యోగులు కానివారు, వ్యాపారులు, ఇతర వర్గాల ప్రజల స్థానికతను గుర్తించాలి. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలోని విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల స్థానికతను గుర్తించాలి. తెలంగాణ ప్రాంతానికి చెందినవారు అయితేనే వారి పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని నిజమైన స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఓపెన్ మెరిట్ కోటాకు నాన్ లోకల్ కోటాగా వక్రభాష్యం

రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ కొలువులను జిల్లా, జోనల్, మల్టీ జోనల్, రాష్ట్ర స్థాయి క్యాడర్ పోస్టులుగా విభజించారు. జిల్లా పోస్టుల్లో స్థానికులకు 80 శాతం, జోనల్‌లో స్థానికులకు 70శాతం, మల్టీ జోనల్‌లో స్థానికులకు 60 శాతం ఉద్యోగాలు కల్పించాలి. ఓపెన్ మెరిట్ కోటాలో జిల్లా స్థాయి పోస్టులకు 20 శాతం, జోనల్‌లో 30, మల్టీ జోనల్ పోస్టుల్లో 40శాతం ఇవ్వాలి. కానీ సీమాంధ్ర పాలకులు ఓపెన్ మెరిట్ కోటాకు కూడా వక్రభాష్యం చెప్పారు. ఓపెన్ మెరిట్ కోటా అంటే నాన్‌లోకల్ కోటానే అంటూ వాటిని ఆంధ్రావారితో భర్తీ చేశారు. ఆ రకంగా సుమారు లక్ష మంది తెలంగాణ స్థానికుల ఉద్యోగాలను కొల్లగొట్టారు. ఇదే పెద్ద అన్యాయమైతే.. ఇంకా ఇప్పుడు వారి పిల్లలకు అడ్మిషన్లు కల్పించడం, తెలంగాణ ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయడం సరికాదని తెలంగాణవాదులు అంటున్నారు.

ప్రభుత్వ నిర్ణయం సరైందే..

ప్రభుత్వ నిర్ణయం పూర్తిగా సమర్థనీయం. గతంలో ముల్కీ రూల్స్‌లో కూడా ఇదే నిబంధన ఉంది. సీమాంధ్రులు ఒక కుట్ర ప్రకారం ముల్కీ రూల్స్‌ను రద్దు చేయించి తెలంగాణకు తీరని అన్యాయం చేశారు. అదే పరిస్థితి మళ్లీ ఉత్పన్నం కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీ యింబర్స్‌మెంట్ విషయంలో తండ్రి ఇక్కడివాడై ఉండాలని నిబంధన పెట్టడం హర్షించదగ్గదే. దీనివల్ల తెలంగాణపై ఆర్థిక భారం తగ్గి, స్థానికులకు న్యాయం జరుగుతుంది. ముల్కీ నిబంధనల్లో 15 ఏళ్లు ఇక్కడే ఉండి ఉంటే స్థానికుడనే నిబంధన ఉండేది. దాన్ని మళ్లీ తెరపైకి తేవడం ఆహ్వానించదగ్గ పరిణామం.


ఇంకా దోపిడి సాగదు...

ఇప్పటికి జరిగిన అన్యాయాలు, అక్రమాలు, దోపిడీ, ఉల్లంఘనలు చాలవా? మళ్లీ తెలంగాణ ప్రజల సొమ్ముపై ఆశ ఎందుకు? ఎవరి నిబంధనలు వారే నిర్దేశించుకోవాలి. రెండు రాష్ర్టాలు, రెండు ప్రభుత్వాలు ఉన్నప్పడు వరి వ్యయం వారే భరించాలనడం అన్యాయమా? ఇంకా మీ ఆటలు సాగవు. స్థానికులంటే తెలంగాణలో తెలంగాణ తల్లిదండ్రులకు పుట్టినవారే.


లక్ష ఉద్యోగాలు.. ఇంకా ఫీజులా?

దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉండగా తెలంగాణలో సీమాంధ్ర ఉద్యోగులు సుమారు 26వేల మంది ఉన్నట్లు తేల్చారు. 1969లో అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినప్పటికీ బ్రహ్మానందరెడ్డి సీమాంధ్ర ఉద్యోగులను వారి ప్రాంతానికి పంపించకుండా అడ్డుకున్నారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవరకు వారు తెలంగాణలోనే కొనసాగారు. తెలుగుగంగ ప్రాజెక్టు పనుల సమయంలో తెలంగాణ ఇంజినీర్లు 30 మంది సీమాంధ్రలో పనిచేసేందుకు పోతే ఆ సీమాంధ్రులు అడ్డుకున్నారు. దాంతో మళ్లీ స్థానికత అంశం తెరపైకి వచ్చింది.

ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ అప్పుడు జయభారతిరెడ్డి కమిషన్ వేశారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సుమారు 56 వేల మంది ఉద్యోగులు తెలంగాణ స్థానికుల ఉద్యోగాలను చేజిక్కించుకున్నట్లు వెల్లడయింది. వారిని వెనుకకు పంపించాలని నివేదికలో పేర్కొన్నారు. దాంతో 1985 డిసెంబర్ 30న ఎన్టీఆర్ 610 జీవో విడుదల చేశారు. కానీ ఇంతవరకు ఆంధ్రా ఉద్యోగులు వారి ప్రాంతానికి వెళ్లలేదు. 1969 నుంచి 2014 వరకు తెలంగాణ స్థానికుల ఉద్యోగాలు కొల్ల్లగొట్టి తెలంగాణలో సెటిలయ్యారు. అలాంటివారి పిల్లలకు ఇక్కడ లోకల్ స్టేటస్ ఇచ్చి వారికి ఫీజులు ఇవ్వాలా?.. అనేది వివాదాస్పదంగా మారింది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి