గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, ఏప్రిల్ 06, 2015

తెలంగాణపై తాను వేసిన కుట్రల తోవ..ఆంధ్రాకు ఏరువాక!!!

-చంద్రబాబు సేవకే అంకితం
-తెలంగాణ ఉద్యమానికి అడుగడుగునా వెన్నుపోట్లు
-సీమాంధ్ర మేలుకే గవర్నర్‌పై దండయాత్ర
-నిన్న పొగిడిన నోటితో నేడు విమర్శలు






దేశేదేశే కళత్రాణి, దేశేదేశే చ బాంధవాః|
తం తు దేశం న పశ్యామి, యత్ర భ్రాతా సహోదరః||
దేశదేశాలనుంచి పత్నులను తెచ్చుకోవచ్చు. బంధువులను కూడా పొందవచ్చు. కానీ ఒక్క సహోదరుడిని మాత్రం పొందడం సాధ్యం కాదు.. ఇది పూర్వకాలంలో పండితులు చెప్పిన మాట. 
ఇవాళ రాధాకృష్ణ లాంటి వారు దాన్నే రుజువు చేస్తున్నారు. ఆయన తెలంగాణలో ఉంటాడు. తెలంగాణలో పత్రిక నడుపుకుంటాడు. తెలంగాణ వల్ల ఎదుగుతాడు. కానీ తెలంగాణ మేలు కోరడు. పైగా తెలంగాణకు అడుగడుగునా అడ్డుపడుతున్న చంద్రబాబు సేవలో తరించి పోతాడు. బాబు తెలంగాణ మీద అలిగితే రాధాకృష్ణ అలుగుతాడు. గవర్నర్‌మీద అసహనం వ్యక్తం చేస్తే రాధాకృష్ణ కత్తులు నూరుతాడు. రాధాకృష్ణ రాతలు చేతలు అన్నీ సీమాంధ్రబాబు కోసమే. డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటనతో చంద్రబాబు భవిష్యత్తే అగమ్యగోచరంగా మారింది. రాధాకృష్ణ ఈ ఉద్యమం మీద ఎపుడు ఏ స్టాండు తీసుకున్నా అంతా బాబు కోసమే. బాబు సేవకే. పర్వతంలా పాతుకు పోయిన వైఎస్‌ను కదిలించడానికి మొదట్లో ఉద్యమాన్ని ఎగదోసినా.. తర్వాత బాబుకే ఎసరు వచ్చిన వేళ వెన్నుపోట్లు పొడిచాడు. 

radhakrishna

ఇవాళ గవర్నర్ మీద కథనాలను ఆ కోణంలోనే చూడాలి. కేంద్రం తెలంగాణ మీద తొలి ప్రకటన చేసి తర్వాత సంప్రదింపులు అన్న వేళ... తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడం బాబు అవసరం. ఆ నేపథ్యంలో నాడు ఉమ్మడిరాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు నరసింహన్ గవర్నర్‌గా వచ్చారు. ఆ రాక నాడు రాధాకృష్ణకు ఏరువాక అయ్యింది. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకే నరసింహన్‌ను పంపించారని రాధాకృష్ణ అండ్ గ్యాంగు ఆ రోజు తెగ చంకలు గుద్దుకున్నారు. ఆ తర్వాత ఆయన పనితీరుపై పుంఖానుపుంఖాలుగా వార్తలు వేసి ఆనందించారు. 2010 ఆగస్టులో రాధాకృష్ణ ఒక వార్త ప్రచురిస్తూ హైదరాబాద్‌ను యూటీ చేయడమే ఎక్కువమంది అభిమతం అంటూ గవర్నర్ కేంద్రానికి నివేదిక ఇచ్చారని కూడా రాసుకున్నారు. పాలనపై గవర్నర్ తన ముద్ర వేశారని కొన్ని పత్రికలు, నరసింహన్ ఎంపిక భేష్ అంటూ అమెరికా కాన్సులేట్ అభిప్రాయపడిందంటూ మరికొన్ని పత్రికలు రాసుకున్నాయి. పాలనలో భాగంగా నరసింహన్ వీసీల సదస్సులు ఏర్పాటు చేయడం, ఐఏఎస్‌లకు ఆదేశాలివ్వడం, వివిధ తనిఖీలు నిర్వహించడం, మంత్రులను రాజ్‌భవన్‌కు పిలిపించి మాట్లాడడం చూసి ఆయన మామూలు గవర్నర్ కాదు అంటూ ఆంధ్రజ్యోతిసహా పత్రికలన్నీ ఆకాశానికి ఎత్తేశాయి. ఆదిలాబాద్ జిల్లాలో గవర్నర్ జరిపిన పర్యటనలో పంట నష్టపరిహారాన్ని 4 గంటల్లో విడుదల చేయడం ఆ రోజుల్లో ఒక సంచలనమే అయింది. ఇక కిరణ్ రాజీనామా తర్వాత పెట్రోల్ బంకుల సమ్మెను గంటల వ్యవధిలో పరిష్కరించడం కూడా హర్షించారు. 

paper





రాష్ట్రపతి పాలన వచ్చాక కిరణ్ సర్కారు నిర్ణయాలన్నీ గవర్నర్ తిరగదోడుతున్నారని, నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారిని రాజీనామా చేయాలని ఆదేశించారని, వర్సిటీ పాలక మండళ్ల నియామకాలు తిరగదోడుతున్నారని రాధాకృష్ణ సంబరంగా రాసుకున్నారు. తెలంగాణ వచ్చాక కేంద్రం హైదరాబాద్‌కు అధికారాలు ఇస్తున్నదంటూ పుకార్లు వచ్చినపుడు ఆంధ్రజ్యోతి ఆనందం అంతా ఇంతా కాదు. గవర్నర్‌కు ఖాకీ డ్రెస్ తొడిగి హీరోను చేసి తెగ సంబరపడి పోయాడు. గమ్మత్తుగా ఇవాళ అదే రాధాకృష్ణకు గవర్నర్ ఏమీ పనిచేయనట్టు కనిపిస్తున్నారు. గుళ్లు, గోపురాలు తిరుగడం తప్ప మరేం చేయనట్టు అగుపిస్తున్నారు. తిరుపతి దర్శనాల్లో రికార్డులు సృష్టిస్తున్నారట.. నిన్న తానే పొగడిన నోటితో రాధాకృష్ణ ఈ రోజు తెగడుతున్నాడు. చంద్రబాబు చెప్పినట్టు చేయకపోవడం ఆయన తప్పు. తెలంగాణ సర్కారుకు అడ్డంకులు సృష్టించక పోవడం ఆయన నేరం. బాబు ఆగ్రహంతో ఈయన పాలు పంచుకుంటున్నాడు. ఆయన తరపున వకల్తాపుచ్చుకుని బెదిరింపులకు దిగుతున్నాడు. తెలంగాణలో ఉంటూ తెలంగాణపై కుట్రలకు పాల్పడుతున్నాడు.

ఉద్యమానికి ఎన్నిపోట్లు..


ఎపుడు ఏ సందర్భం వచ్చినా రాధాకృష్ణ నిజామాబాద్‌లో పుట్టిన నేను తెలంగాణ వాడినే అంటూ చెప్పుకుంటాడు. తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టిన వాడుగా ప్రచారం చేసుకుంటాడు. అంతేకాదు మేం సహకరించకపోతే ఉద్యమం ఈ స్థాయికి వచ్చేదా? అని కూడా దబాయిస్తాడు. వినేవాడు వెర్రిబాగుల వాడైతే.. రాధాకృష్ణ ఎంతైనా చెప్పుకోగలడు. కానీ చరిత్ర కండ్లముందే ఉంది. తెలంగాణ ఉద్యమానికి రాధాకృష్ణ ఎన్ని వందల పోట్లు పొడిచాడో లెక్క లేదు. ఉద్యమం ఉధృతమై యువత ఊగిపోతున్న వేళ... నై తెలంగాణ అంటూ రాసిన ఎన్ని రాతలు ఎందరు యువకుల ప్రాణాలు తీసుకున్నాయో లెక్కలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వరసగా రాజీనామాలు చేస్తున్న వేళ.. రాజీనామాలకు నో.. అంటూ ఏబీఎన్ ఎన్ని బ్రేకింగులు ఇచ్చిందో వెనక్కి తిరిగి చూసుకుంటో తెలుస్తుంది. కాంగ్రెస్ నాయకులు మీడియా మైకుల ముందే దయచేసి వార్తలు వక్రించవద్దు అని ఏబీఎన్‌ను ఉద్దేశించి ఎన్నిసార్లు అన్నారో ఉద్యమకాలం నాటి బైట్లు చూస్తే బయట పడుతుంది. చివరికి తెలంగాణ జేఏసీ కూడా ఏబీఎన్ ఛానెల్ సహా కొన్ని చానెళ్లను బహిష్కరించిన విషయం అందరికి తెలిసిందే. ఎన్ని దాడులు ఎంత వక్రీకరణలు... చివరకు ఉద్యమం కారణంగా ఇంటర్ మీడియట్ ఫలితాల్లో తెలంగాణ అట్టడుగున పడిపోయిందంటూ రాసిన ఘనత రాధాకృష్ణది. 

cartoon

సకలజనుల సమ్మె జరుగుతున్న వేళ.. ఎన్ని విష కథనాలు.. ఎంత బురద.. జేఏసీలో విభేదాలని..కొత్తగూడెంలో విధులకు వస్తున్నారని.. నిజామాబాద్‌లో పూర్తిస్థాయి అటెండెన్సు అని సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి వేయని ఎత్తుగడ లేదు. సమ్మె విరమించిన తర్వాత చిమ్మిన విష కథనాలకు లెక్కే లేదు. ఇక తెలంగాణ ఉద్యమానికి కేంద్రబిందువుగా ఉన్న టీఆర్‌ఎస్ మీద, పార్టీ అధినేత మీద జరిగిన దాడి ఈ భూగోళం మీద మరే పార్టీ మీద జరిగి ఉండదు. పధ్నాలుగేళ్లు ఉద్యమాన్ని మోసిన నేత మీద కనీసం విచారణ లేకుండా, వివరణ తీసుకోవాలన్న ఇంగితం కూడా లేకుండా కేసీఆర్ తెలంగాణ వాడే కాదంటూ మొదటి పేజీలో రాసిన దిగజారుడు రాతలు రాధాకృష్ణ తప్ప ఇంకెవరు రాయగలరు? ఆంధ్రజ్యోతి కార్టూన్లలో కూడా తెలంగాణపై వివక్షే. ఆ మధ్య ఇద్దరు సీఎంలు కలిసి సమావేశం జరిగినపుడు ఆ పత్రిక వేసిన రన్నింగ్ కామెంటరీలో తెలంగాణవాడికి గోచీ పెట్టి సీమాంధ్ర బాబుకు మాత్రం నాగరిక దుస్తులు వేసి రాధాకృష్ణ తన నైజం చాటుకున్నాడు. 

ఎవడు తెలంగాణవాసి...


రాధాకృష్ణ బహుశా ఈ జన్మలో అర్థం చేసుకోలేని విషయం.. కేవలం నివాసం వల్ల ఏ ఒక్కడూ తెలంగాణవాడు కాలేడు. ఈ నేలతో ఆ అనుబంధం పెనవేసుకోవాలి. ప్రజల్లో కలిసిపోవాలి. ఇక్కడి సంస్కృతిని గౌరవించాలి. సెంటిమెంట్లను ఆవహించుకోవాలి. ఈ గడ్డకు మేలు జరిగితే సంతోషపడాలి. అన్యాయం జరిగితే రగలిపోవాలి. ఈ రాష్ట్ర అభివృద్ధిలో భుజం కలపాలి. వర్తమానం భవిష్యత్తూ అన్నీ ఈ గడ్డతో పంచుకోవాలి. రాజ్యాంగంలో రాసుకున్న అక్షరాలు మహా అయితే ఓ సర్టిఫికెట్టో ధృవీకరణో ఇవ్వవచ్చు. కానీ.. ఇక్కడ నివాసముంటూ పక్కోడి పాట పాడే రాధాకృష్ణలాంటి వారు ఎన్ని వందల జన్మలెత్తినా తెలంగాణ వారు కాలేరు.

(క్లిక్ చేయండి:నమస్తే తెలంగాణ వార్తపై)



(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)


జై తెలంగాణ!    జై జై తెలంగాణ!



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి