గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, జూన్ 09, 2014

పోలవరంపై టీఆర్‍ఎస్ వైఖరిలో మార్పులేదు


-గిరిజనులను ముంచొద్దు.. డిజైన్ మార్చాలి
-కొందరు తొందరపెట్టి ఆర్డినెన్సు తెప్పించారు
-ఇదే విషయం ప్రధానమంత్రి మోడీకి చెప్పిన
-నాలుగు రాష్ట్రాల సీఎంల సమ్మతితోనే ప్రాజెక్టు నిర్మించాలని కోరిన 
-ప్రధాని సానుకూలంగా స్పందించారు
-టీఆర్‌ఎస్ పోరాడుతూనే ఉంటుంది
-పార్లమెంటులో నిరసన తెలుపుతాం
-ఢిల్లీలో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టీకరణ

పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలను అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన ఆర్డినెన్స్‌పై టీఆర్‌ఎస్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, ఈ ఆర్డినెన్సును వ్యతిరేకిస్తూనే ఉంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సోమవారం జరిగే లోక్‌సభ సమావేశాల్లో టీఆర్‌ఎస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తారని తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఇప్పటికే మహబూబాబాద్ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారని చెప్పారు. ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీపై కొందరు ఒత్తిడి తీసుకొచ్చి తొందరపెట్టి హడావిడిగా ఆర్డినెన్స్ నిర్ణయం తీసుకునేలా చేశారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ముంపు బారిన పడి నష్టపోయేది గిరిజనులేనని, డ్యాం నిర్మాణంతో నాలుగు రాష్ట్రాల్లోనూ గిరిజనులను ముంచడం మంచిది కాదని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి తాను సూచించానని చెప్పారు. ప్రత్యామ్నాయ డిజైన్ గురించి ఆలోచించాల్సిందిగా మోడీకి విజ్ఞప్తి చేశానన్నారు. సుమారు 16 లక్షల మంది గిరిజనులను ముంచడం సరికాదు కాబట్టి నలుగురు ముఖ్యమంత్రులతో సంధానకర్తగా సమావేశం ఏర్పాటు చేసి డ్యాం నిర్మాణం విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. 

డ్యాం నిర్మాణానికి టీఆర్‌ఎస్ వ్యతిరేకం కాదని, గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ వాడుకోవడానికి కూడా వ్యతిరేకం కాదని కేసీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంటులో ఈ అంశాన్ని చర్చకు పెట్టినప్పుడు టీఆర్‌ఎస్ ఎంపీలు తప్పనిసరిగా వ్యతిరేకత వ్యక్తం చేస్తారని, నిరసన తెలుపుతారని కూడా మోడీకి స్పష్టంగా చెప్పినట్లు కేసీఆర్ తెలిపారు. సోమవారం ఈ అంశం లోక్‌సభలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని తనకు సమాచారం వచ్చిందని, ఈ సందర్భంగా దీనిపై టీఆర్‌ఎస్ అభ్యంతరాలను ఎంపీలు వెల్లడిస్తారని తెలిపారు. రాష్ట్రాల మధ్య సామరస్య వాతావరణంలో చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం వెతకడం మంచి పద్ధతని, ముఖ్యమంత్రుల సమావేశానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా సూచించానని, తన ప్రతిపాదనకు మోడీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వల్ల సుందరమైన పాపికొండలు లాంటివన్నీ కనుమరుగైపోతాయని కేసీఆర్ అన్నారు.

ప్రధానితో పోలవరం అంశాన్ని ప్రస్తావిస్తున్న సందర్భంగా- ఎవరో మిమ్మల్ని తప్పుడు మార్గం పట్టించి తొందరపెట్టారు. మీరు తీసుకున్నది హడావిడి నిర్ణయం. అది సరిగ్గా లేదు అని మోడీకి వివరించినట్లు తెలిపారు. ఇప్పటికే వ్యతిరేకించాం.. ఇకపైన కూడా వ్యతిరేకిస్తూనే ఉంటాం. ముఖ్యమంత్రిగా నా డ్యూటీ నేను చేయాలి అని కూడా చెప్పాను.. అని కేసీఆర్ అన్నారు. గోదావరి నదిలోని నీటిని ఆంధ్ర ప్రాంతం తీసుకుపోవడానికి తాను వ్యతిరేకం కాదని, శబరి నదికి ఆవల గోదావరి జలాలు ఎలాగూ తెలంగాణకు ఉపయోగపడవు...కాబట్టి వృథాగా సముద్రంలో కలవడంకంటే డ్యాం నిర్మించి సాగునీటి అవసరాలకు వాడుకోవడం మంచిదనే విషయంలో టీఆర్‌ఎస్‌కు ఎలాంటి భిన్నాభిప్రాయం లేదని తెలిపారు. అయితే.. ప్రత్యామ్నాయ పద్ధతుల్లో పోలవరం డ్యాంను నిర్మించవచ్చంటూ ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఇంజినీర్లు, నిపుణులు మ్యాప్‌లతో సహా గతంలో ప్రణాళికను వివరించారని, ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పుడు ఎందుకు గిరిజనుల జీవితాలను బలిచేయాలన్నదానిపై మోడీకి వివరించానని కేసీఆర్ చెప్పారు. 

మీడియాకు చెప్పనందుకే..
పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలకు సంబంధించిన అంశాన్ని ప్రధానితో తాను చర్చించలేదంటూ మీడియాలో వచ్చిన కథనాలపై కేసీఆర్ స్పందించారు. ఇలా రావడాన్ని తాను తప్పుపట్టడం లేదని, ఈ అంశం గురించి మీడియాతో ప్రస్తావించనందుకే మోడీతో చర్చించలేదన్న సంకేతం బైటకు వచ్చిందని అన్నారు. ఈ అంశంపై ప్రధానమంత్రి మోడీతో ఏడు నిమిషాలపాటు చర్చించానని చెప్పారు. గతంలోనే ఒక మెమోరాండంను ప్రధానికి, మరొకటి రాష్ట్రపతికి సమర్పించి అందులో టీఆర్‌ఎస్ అభ్యంతరాలను వివరించామని గుర్తు చేశారు. అందువల్ల మరోమారు ఈ విషయాన్ని మోడీకి సమర్పించిన మెమోరాండంలో పేర్కొనలేదని, కానీ లోతుగా చర్చించానని కేసీఆర్ వివరించారు.

విద్యుత్‌పై ప్రధాని సానుకూలంగా స్పందించారు
తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం...కాబట్టి విద్యుత్ కొరత ఉంటుందని కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని, అందువల్లనే నాలుగువేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అవసరాన్ని గుర్తించి తెలంగాణలో నిర్మించాలని పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. కానీ ఇప్పుడు ముంపు ప్రాంతాల పేరుతో ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపడం ద్వారా దిగువ సీలేరులో ఉత్పత్తి అవుతున్న 450 మెగావాట్ల విద్యుత్ కూడా కోల్పోయినట్లయిందని పేర్కొన్నారు. ఒకవంక తెలంగాణకు విద్యుత్ కొరత ఏర్పడుతుందని చెప్తూనే మరోవంక వినియోగంలో ఉన్న విద్యుత్‌ను కూడా సీమాంధ్రకు తరలించాలని ఆర్డినెన్సు ద్వారా కేంద్రం చెప్పడం సమంజసం కాదని అన్నారు. ఇదే అంశాన్ని ప్రధానమంత్రి మోడీతో ప్రస్తావించినప్పుడు సానుకూలంగా స్పందించి వాస్తవాన్ని గ్రహించారని, దీని విషయంలో ఆలోచిస్తామంటూ తనకు హామీ ఇచ్చారని కేసీఆర్ పేర్కొన్నారు. ఆయన చెప్పిన విధానం తనకు బాగా నచ్చిందన్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి