గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, జూన్ 12, 2014

తెలంగాణ ప్రజల కల సాకారం కానున్నది!-లక్ష్యం.. బంగారు తెలంగాణ 

-అసెంబ్లీ ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్
-అమరుల కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం.. ఉద్యోగం
-ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి రూ.లక్ష కోట్లు 
-ఉద్యోగులకు హెల్త్‌కార్డులు, తెలంగాణ ఇంక్రిమెంట్
-పేదలకు రూ.3లక్షల వ్యయంతో డబుల్‌బెడ్ రూం ఇళ్లు 
-రైతులకు రూ.లక్ష వరకు పంట రుణమాఫీ
-వికలాంగులకు రూ.1,500, వృద్ధులకు వెయ్యి పింఛన్ 
-ఎస్టీ, మైనారిటీలకు చెరో 12 శాతం రిజర్వేషన్లు
-పంచాయతీలుగా లంబాడా తండాలు
-త్వరలో గిరిజన విశ్వవిద్యాలయం
-పేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య
-జర్నలిస్టులకు రూ.10కోట్లు, అడ్వకేట్లకు రూ.100కోట్లతో కార్పస్‌ఫండ్
-దేశ విత్తన భాండాగారంగా తెలంగాణ
-అన్ని జిల్లాల్లో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు
-మహిళా ఉద్యోగినులకు పటిష్ట భద్రత
-రాష్ట్రస్థాయిలో సలహా మండలి ఏర్పాటు : గవర్నర్
-ఉభయసభలనుద్దేశించి ప్రసంగంసంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా బంగారు తెలంగాణ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ తెలిపారు. తెలంగాణ బిడ్డల బలిదానాలకు ఎవరూ విలువ కట్టలేరని.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వందలాదిమంది యువత బలిదానాలను రాష్ట్రప్రభుత్వం ఏనాటికీ మరచిపోదని అన్నారు. అమరుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. అమరుల కుటుంబంలో అర్హతలను బట్టి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు నివాస వసతి.. వారి కుటుంబాలకు ఉచితవిద్య, ఆరోగ్యసంరక్షణ సదుపాయాలకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు.


వ్యవసాయరంగంలో నిమగ్నమైన వారికి వ్యవసాయభూమి పంపిణీ చేస్తామన్నారు. రాజకీయ అవినీతిని సమూలంగా నిర్మూలించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పారు. అన్ని స్థాయిల్లో లంచగొండితనాన్ని నిర్మూలించేందుకు ఒక పారదర్శకవ్యూహాన్ని అమలుచేస్తామన్నారు. బుధవారం అసెంబ్లీ ఉభయసభల సభ్యులనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా వ్యవసాయం, సాగునీరు, విద్యుత్తు రంగాల సత్వర పురోగతికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు.


రైతుకు రుణభారాన్ని తగ్గించడానికి ప్రారంభచర్యగా ప్రతి రైతుకు లక్ష రూపాయల వరకు పంట రుణమాఫీ అమలుచేస్తామని స్పష్టంచేశారు. వ్యవసాయ ట్రాక్టర్లు, ట్రాలీలకు పన్ను మినహాయింపు ఇస్తామన్నారు. వ్యవసాయరంగంలో నిరంతర పరిశోధనలు, అభివృద్ధికి ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేస్తామని, మండలాలవారీగా భూసార పరీక్షలు రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేకవ్యవస్థను రూపొందిస్తామని చెప్పారు. విత్తనాలు, ఎరువులు, యాంత్రికీకరణకు ప్రారంభంలోనే ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తామని తెలిపారు. అత్యంత నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేయడానికి తెలంగాణ భూమి ఎంతో అనువుగా ఉందని వ్యవసాయశాస్త్రవేత్తలు గుర్తించినందున భారత విత్తన భాండాగారంగా రాష్ట్రాన్ని మార్చే దిశగా రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

తెలంగాణలో తిరుగుతున్న ఆటోరిక్షాలకు పన్ను మినహాయింపు ఉంటుందని, ఆటోరిక్షావాలాలకు, నిర్మాణ రంగాల కార్మికులకు ప్రమాద బీమా కల్పిస్తామని చెప్పారు. గల్ఫ్ బాధితుల పునరావాసం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజాస్వామ్యంలో పరిపాలన స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకుని పౌరసమాజం నుంచి నైపుణ్యతను తీసుకునేందుకు రాష్ట్ర స్థాయిలో సలహామండలి ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్లు గవర్నర్ తెలిపారు. ఈ మండలిలో మేధావులు, మీడియా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, సామాజికవేత్తలు, వివిధ వృత్తి నైపుణ్యత కలిగినవారు సభ్యులుగా ఉంటారని తెలిపారు. భారత రాజ్యాంగస్ఫూర్తికి అనుగుణంగా ఎలాంటి పక్షపాతం లేకుండా తెలంగాణలోని నివాసితులందరినీ ప్రభుత్వం సమానంగా ఆదరిస్తుందని తెలిపారు.


బ్లాక్‌మార్కెటింగ్‌పై ఉక్కుపాదం
ఎరువుల బ్లాక్ మార్కెట్‌ను ప్రభుత్వం అరికడుతుందని గవర్నర్ స్పష్టం చేశారు. ఆధునిక వ్యవసాయ పరికరాల కొనుగోలుకు రైతులకు సబ్సిడీలు మంజూరు చేస్తామన్నారు. గ్రీన్‌హౌస్ సాగు పద్ధతులను అనుసరించే రైతులకు తగినంత సబ్సిడీ కల్పిస్తామని చెప్పారు.నిజామాబాద్‌లో పరిశోధన కేంద్రాలు
నిజమాబాద్‌లో చెరకు పరిశోధన కేంద్రాన్ని, జిల్లాలోని మోతెలో పసుపు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయరంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేస్తామని చెప్పారు.కోళ్ల పరిశ్రమకు ఊతం
దేశంలోని కోళ్ల పరిశ్రమ (పౌల్ట్రీ)లో మూడింట ఒకవంతు తెలంగాణలోనే ఉన్నాయని, ఈ పరిశ్రమను మరింతగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పౌల్ట్రీ పరిశ్రమ వైపు మొగ్గుచూపే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తుందని చెప్పారు.ప్రతి సెగ్మెంట్‌లో లక్ష ఎకరాలకు సాగునీరు
తెలంగాణలో గోదావరి, కృష్ణా, వాటి ఉపనదులు, వాగులు ప్రవహిస్తున్నాయని.. ఈ నదుల సాయంతో సమగ్ర సాగునీటి సామర్ధ్యాన్ని పెంపొందించే చర్యలు తీసుకుంటామని గవర్నర్ తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక లక్ష ఎకరాల బీడు భూములను సాగులోకి తీసుకువచ్చేందుకు వీలుగా.. పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేసే దిశగా ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు.పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు
తెలంగాణ జిల్లాల అవసరాలకు దీటుగా పాలమూరు ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు. దీంతో మహబూబ్‌నగర్‌లోని పెద్ద పెద్ద భూభాగాలను సాగులోకి తీసుకురావడంతోపాటు హైదరాబాద్ జంటనగరాలకు తాగునీటి సరఫరా, రంగారెడ్డి జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలకు సాగునీటి అవసరాలు తీరుతాయని తెలిపారు. మహబూబ్‌నగర్‌లోని గుర్రంగడ్డి నుంచి వరంగల్‌లోని పాకాల చెరువుకు ప్రవహిస్తున్న జూరాల-పాకాల గురుత్వాకర్షణ జలాలు, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల గుండా ప్రవహిస్తూ ఆయా ప్రాంతాల్లో సాగుకు దోహదం చేస్తాయని చెప్పారు. ఈ సాగునీటి వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వం సత్వరమే సర్వే చేపడుతుందన్నారు. గొలుసుకట్టు చెరువులు, ఆనకట్టలు, కుంటలను పునరుద్ధరించడం, సాగునీటి వ్యవస్థలో వాటిని అనుసంధానం చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు.తెలంగాణలో విద్యుత్‌లోటు
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం విద్యుత్‌లోటును ఎదుర్కొంటున్నదని గవర్నర్ తెలిపారు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2,283 మెగావాట్లు, జల విద్యుత్తు స్థాపిత సామర్థ్యం 2,157 మెగావాట్లు ఉందని చెప్పారు. లోటును అధిగమించేందుకు కొత్తగా ఎన్టీపీసీ 4,000 మెగావాట్ల కొత్త విద్యుత్ ప్లాంటు ఏర్పాటు విషయమై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. తెలంగాణ జెన్‌కో ద్వారా మరో 6,000 మెగావాట్ల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని, వచ్చే మూడేళ్లలో ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు వీలుగా యుద్ధప్రాతిపదిన ట్రాన్స్‌మిషన్ లైన్లు, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు
ప్రజారోగ్యాన్ని పటిష్టపరిచే చర్యల్లో భాగంగా అన్ని జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అన్ని ప్రైమరీ, సెంకడరీ స్థాయి ఆస్పత్రుల్లో తగినంత పడకల సామర్థ్యాన్ని కల్పిస్తామని.. ప్రస్తుత 108, 104 సర్వీసులను పటిష్టంగా నిర్వహిస్తామన్నారు.ఉత్తమ పారిశ్రామిక విధానం
ఆర్థిక వ్యవస్థకు అవసరమైన పరిపుష్టిని ఇచ్చేలా ఉత్తమ పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని గవర్నర్ చెప్పారు. కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు త్వరితగతిన అనుమతులు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కార్యాలయానికి అనుబంధంగా ప్రత్యేక విభాగం ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు.తిరువూర్ తరహాలో చేనేత కేంద్రాలు
తమిళనాడులోని తిరువూరు తరహాలో వరంగల్, సిరిసిల్లాలను అభివృద్ధి చేసేందుకు నూలు, పట్టు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందని తెలిపారు. ఉద్యోగావకాశాలు పెంపొందించేందుకు హైదరాబాద్, వరంగల్ మధ్య ఒక పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. కాజీపేట వద్ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు.హైదరాబాద్‌కు బ్రాండ్ ఇమేజ్
గంగా-జమున తెహజీబ్ నగరంగా విలసిల్లుతున్న హైదరాబాద్‌ను ఒక విలక్షణమైన బ్రాండ్ ఇమేజ్‌తో ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం పట్టుదలతో ఉందన్నారు. మూసీనదితోపాటు జంటనగరాల్లోని నీటి వనరులను శుద్ధిచేయడం, పరిరక్షించడం వంటి చర్యలకు ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. హైదరాబాద్‌ను పచ్చదనం, పరిశుభ్రతలతో విలసిల్లేలా కాలుష్యరహిత నగరంలా తీర్చిదిద్దుతామన్నారు.శాటిలైట్ టౌన్‌షిప్‌లు
మురికివాడలు లేని పట్టణ సమ్మిళిత హైదరాబాద్‌గా తీర్చిదిద్దడానికి నిర్దిష్టమైన మాస్టర్ ప్లాన్‌తో ప్రణాళికబద్ధమైన శాటిలైట్ టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం కృషిచేస్తుందని తెలిపారు. మెల్‌బోర్న్, వియన్నా, వాంకోవర్, టొరెంటో నగరాల సరసన హైదరాబాద్ చేరేలా మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు శ్రీకారం చుడతామన్నారు.ఐటీఐఆర్‌తో ఎన్నో మార్పులు
హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకమైన ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్(ఐటీఐఆర్) అమలుతో తెలంగాణలో ఐటీ రంగం ఎన్నో అభివృద్ధికరమైన మార్పులకు దోహదపడుతుందని తెలిపారు. వచ్చే పది సంవత్సరాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 52లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని, వివిధ యూనిట్ల కింద రూ.2.13లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని తెలిపారు.ఫార్మా ఉత్పత్తుల్లో మూడో వంతు మనదే
భారతదేశంలోని ఫార్మా ఉత్పత్తిలో తెలంగాణ మూడో వంతు వాటాను కలిగి ఉందని గవర్నర్ గుర్తుచేశారు. ఫార్మా, బయోటెక్, ఇతరరంగాలను మరింతగా విస్తరింపజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. శాటిలైట్ టౌన్‌షిప్పుల్లో ఒకటిగా ఫార్మా నగరాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.సంక్షేమానికి రూ.లక్షకోట్లు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఇతర వర్గాల్లోని పేదల సంక్షేమానికి ప్రభుత్వం వచ్చే ఐదేళ్ళలో లక్షకోట్ల వ్యయం చేస్తుందని తెలిపారు. తెలంగాణలోని అన్ని సామాజిక వ్యవస్థలను పరిగణనలోకి తీసుకుని ప్రజాసంక్షేమానికై ప్రత్యేక దృష్టిసారిస్తుందన్నారు. ఇందులో దళితుల సంక్షేమానికి కోసం రూ.50వేల కోట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. ఎస్సీ ఉప ప్రణాళిక నుంచి ఒక్కపైసా కూడా మళ్లించకుండా గట్టిచర్యలు తీసుకుంటామన్నారు.ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు
తెలంగాణలో గిరిజన జనాభా తగినంత దామాషాలో ఉన్నందున విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్టీలకు 12 శాతం వరకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. కైతి లంబాడీలు, వాల్మీకి బోయలకు ఎస్టీ హోదా కల్పించేందుకు ప్రభుత్వం దృఢసంకల్పంతో ఉందన్నారు. లంబాడా తండాలు, ఆదివాసీ గూడెంలను పంచాయతీలుగా ఏర్పాటుచేస్తామని, త్వరలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని తెలిపారు.బీసీ సంక్షేమానికి రూ.25వేల కోట్లు
జనాభాలో మెజారిటీగా ఉన్న వెనుకబడినతరగతులు(బీసీ) సంక్షేమానికి ప్రభుత్వం సమాన ప్రాముఖ్యతనిస్తుందని గవర్నర్ తెలిపారు. బీసీల సమగ్ర అభివృద్ధికి పటిష్టమైన యంత్రాంగంతో వచ్చే ఐదేళ్లలో రూ.25వేల కోట్లు ఖర్చు చేసే సంకల్పంతో ఉన్నట్లు చెప్పారు. బీసీ కులాల్లోని చేనేత, కల్లుగీత, ఇతర చేతివృత్తుల స్థితిగతులపై అధ్యయనం చేసి వారి అభివృద్ధికి సముచిత చర్యలు తీసుకునేందుకు వీలుగా ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు
తెలంగాణలోని వివిధ మతాలు, భాషలు, సంస్కృతులకు చెందిన ప్రజలు ఎల్లవేళలా సామరస్యంతో జీవిస్తున్నారని, తెలంగాణ గంగా-జమునా తెహజీబ్‌కి పేరుగాంచిందన్నారు. మైనారిటీల ప్రయోజనాలు పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తుందని, ఇందులోభాగంగా మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఉర్దూ భాష పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు.పింఛన్ల పెంపుదల
పింఛన్‌దారులకు ప్రయోజనకరంగా ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం వికలాంగులకు నెలకు రూ.1,500లు, వృద్ధులకు రూ.1,000లు, అనాథ మహిళలకు రూ.1,000లు, బీడీ కార్మికులకు రూ.1,000ల చొప్పున మంజూరు చేస్తుందని తెలిపారు.పేదలకు పక్కా ఇళ్లు
పేదల కోసం చక్కటి గృహనిర్మాణం చేపట్టాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉందని గవర్నర్ తెలిపారు. ప్రతి పేద కుటుంబం ఆత్మగౌరవం, ఆత్మస్థెర్యంతో జీవించగలిగేలా ఒక్కొక్క ఇంటిని కనీసం రూ.మూడు లక్షల వ్యయంతో రెండు పడక గదులు, హాలు, వంటగది, ప్రత్యేక స్నాన, టాయిలెట్ సదుపాయాలతో నిర్మించి ఇస్తుందన్నారు.కేజీ టు పీజీ నిర్బంధ విద్య
ప్రభుత్వ ప్రాధాన్య అంశాల్లో ఒకటిగా పేద విద్యార్థులందరికీ ఇంగ్లిష్ మీడియం సీబీఎస్‌ఈ సిలబస్‌తో కేజీ నుంచి పీజీ వరకు నిర్భంధ, ఉచిత విద్యను కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ప్రొఫెసర్ జయశంకర్ విజన్ మార్గదర్శకాలతో ప్రస్తుత విద్యావ్యవస్థలో మార్పులు తీసుకువస్తామని తెలిపారు.సెగ్మెంట్లలో శాశ్వత కార్యాలయాలు
ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రతి నియోజకవర్గంలో శాశ్వత కార్యాలయ, నివాసాల నిర్మాణాలను చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తుందని తెలిపారు. దీనివల్ల ప్రజలు వారికి అవసరమైన సందర్భాల్లో వారి ఎమ్మెల్యే, ఎంపీలను కలుసుకోవడానికి సాధ్యపడుతుందన్నారు.మహిళలకు చేయూత
జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలకు చేయూతనిస్తే ఏ రంగంలోనైనా రాణించగలరనేది చరిత్ర నిరూపించిందని, ఇటీవల నిజామాబాద్ జిల్లాకు చెందిన గ్రామీణ బాలిక మలావత్ పూర్ణ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడమే ఇందుకు నిదర్శనమన్నారు. మహిళా సంక్షేమానికి ప్రభుత్వం విస్తృత కార్యక్రమాలు రూపొందిస్తుందని తెలిపారు. మహిళల రక్షణ, భద్రతకు, గృహహింస వంటి చట్టాలను పటిష్టంగా అమలుచేస్తామని, హైదరాబాద్ ఐటీ రంగంలో పెద్ద సంఖ్యలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినులకు పటిష్ట భద్రత, శాంతిభద్రతల నిర్వహణలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.జర్నలిస్టులు, న్యాయవాదులకు కార్పస్ ఫండ్
తెలంగాణ రాష్ట్రసాధనలో ఎనలేని పాత్ర పోషించిన జర్నలిస్టులకు రూ.10కోట్ల కార్పస్ వ్యయంతో సంక్షేమ నిధిని ఏర్పాటుచేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమంలో తమదైన పాత్ర పోషించిన న్యాయవాదుల సంక్షేమానికి రూ.100కోట్లతో మరో సంక్షేమ నిధిని ఏర్పాటుచేస్తామని చెప్పారు.ఉద్యోగులకు హెల్త్‌కార్డులు, తెలంగాణ ఇంక్రిమెంట్
ప్రభుత్వం ఉద్యోగి-స్నేహపూర్వక పరిపాలన సంబంధాలను కలిగి ఉంటుందన్నారు. ఉద్యోగులందరికీ హెల్త్‌కార్డులతో పాటు ప్రత్యేకంగా తెలంగాణ ఇంక్రిమెంటు ఇవ్వనున్నట్లు గవర్నర్ తెలిపారు.(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి