గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, జూన్ 23, 2014

అత్యాశకుపోయి మనస్సులోని కుట్ర బయటపెట్టుకున్నారు!

-మంచినీటిని అడగడం వెనుక సాగునీటి కుట్ర!
కృష్ణా డెల్టాకు పది టీఎంసీల నీటిని విడుదలచేసే విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నది. ఆంధ్ర సర్కార్ నీటిపై చేస్తున్న తప్పడు లెక్కల గారడీ అయోమయానికి దారితీసింది. వర్షాభావం వల్ల ఒకవైపు భారీ ప్రాజెక్టులలో నీరు అడుగంటుతుంటే మరోవైపు తాగునీటికోసం పది టీఎంసీలు కావాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ పేచీ పెడుతున్న ది. మొదట కృష్ణా డెల్టాకు నీరు కావాలన్న సర్కార్ ఆ తర్వాత అత్యవసరంగా తాగునీటి కోసం నీటిని విడుదల చేయాలని ఒత్తిడి తెస్తున్నది. వాస్తవానికి కృష్ణా డెల్టా పరిధిలో కేవలం 2 టీఎంసీల నీరు విడుదల చేస్తే తాగునీటి అవసరాలు తీరుతాయని అంచనా. ఆంధ్ర సర్కార్ మాత్రం పది టీఎంసీలను డిమాండ్ చేసి, తాగునీటి పేరిట నారుమళ్లకు నీటిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నది. గతంలో సీమాంధ్ర పాలకుల ఆధిపత్యంలోని సర్కార్లు ఇష్టానుసారం తాగునీటి పేరిట నాగార్జునసాగర్ నుంచి కృష్ణా నీటిని మళ్లించి తెలంగాణ వాటాకు గండి కొట్టాయి. ఈసారి పరిస్థితి మారింది. రాష్ట్ర విభజన తర్వాత నాగార్జునసాగర్ డ్యామ్ సర్కిల్ నిర్వహణ తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి వచ్చింది. నీటిని విడుదల చేయాలంటే తెలంగాణ సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. అధికారుల కమిటీ నీటి విడుదల ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం ముందుంచింది. వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే పది టీఎంసీలు అవసరం లేదు . దాని వెనుక సాగునీటి కుట్ర ఉన్నట్లు తేలింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దీనిపై దృష్టి సారించి కృష్ణానదిలో ఒక్క చుక్కనీటిని కూడా వృథాగా పోనివ్వం... తెలంగాణకు అన్యాయం జరగనివ్వం అని స్పష్టం చేశారు.

వాస్తవానికి హైదరాబాద్ మహానగరానికి నీటి సరఫరా కోసం నాగార్జునసాగర్ పరిధిలోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ నుంచి అక్కంపల్లి రిజర్వాయర్ ద్వారా కేవలం 0.9 టీఎంసీల నీటినే వదిలారు. హైదరాబాద్ తాగునీటి కోసం ఏడాదికి 11టీఎంసీల నీటిని మాత్రమే కేటాయిస్తున్నారు. హైదరాబాద్ పరిస్థితి ఇలాఉంటే కృష్ణా డెల్టాకు ఎందుకు 10టీఎంసీలను విడుదల చేయాలనే విషయంపై ఆంధ్రప్రదేశ్ సర్కారులో అధికారులు శాస్త్రీయంగా వివరించలేకపోతున్నారు. అత్యాశకు పోయి పది టీఎంసీలను డిమాండ్ చేయడంతో సమస్య ఉత్పన్నమైంది. తెలంగాణ అధికారులు అంచనా వేసిన దాన్ని బట్టి కృష్ణా డెల్టాలో మంచినీటి అవసరాలను తీర్చడానికి కేవలం ఒకటి నుంచి రెండు టీఎంసీలే ఎక్కువవుతాయి. ఈ సారి వర్షాలు సాధారణ స్థాయిలో కురిసే అవకాశాలు లేవు. జలాశయాలలో ఉన్న నీటినే జాగ్రత్తగా వాడుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ప్రాజెక్ట్‌లలో నీటిని తాగునీటికి తప్ప సాగునీటికి విడుదల చేయరాదని కేంద్ర జలసంఘం ఆదేశాలిచ్చింది. మరో వైపు వర్షాలు లేక భారీ ప్రాజెక్ట్‌లలో సైతం నీరు అడుగంటే ప్రమాదకర పరిస్థితి నెలకొంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో నీటినిల్వలు భారీ స్థాయిలో పడిపోతున్నాయి. శ్రీశైలంలో నీరు కనిష్ఠ స్థాయి.. అంటే 834అడుగులకు చేరింది. ఈ స్థాయిలో అసలు నీటిని విడుదల చేయటానికి మార్గదర్శకాలు ఒప్పుకోవు. తాగునీటికి కూడా ఆచితూచి వాడాలి. నాగార్జునసాగర్‌లో నీటి నిల్వ 517అడుగులకు పడిపోయింది. 510అడుగులు ఇక్కడ కనిష్ఠ స్థాయి. ఆ తర్వాత చుక్కనీరు వదలడానికి వీల్లేదు. ఇప్పడు ప్రాజెక్ట్‌లో 7అడుగులలో కేవలం 13టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. కృష్ణా డెల్టాకు కేవలం తాగునీటికే 10టీఎంసీలు ఇస్తే తెలంగాణ పరిస్థితి ఏమిటన్నదానికి ఆంధ్ర అధికారుల వద్ద సమాధానం లేదు. మరో వైపు నదీబోర్డులు ఏర్పాటైన తర్వాతనైనా 10టీఎంసీలు విడుదల చేసుకోవాలన్న ప్రయత్నంలో ఆంధ్ర సర్కార్ నక్కజిత్తుల ఎత్తులు వేయడం విచారణీయం.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి