గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, జూన్ 16, 2014

రాజధాని నడిబొడ్డున సీమాంధ్ర అనకొండలు!

-హఫీజ్‌పేటలో మినీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కబ్జా
-విలువ రూ.600 కోట్ల పైమాటే..
-లీజు భూముల్లో రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లు..
-సర్కారుకు ముఫ్పై ఏళ్లుగా రుసుం ఎగవేత
-అండదండలందించిన ఆంధ్రా అధికారులు..
-గడువు దాటిన భూములు వెనక్కి తీసుకోని వైనం
-డీఐసీలో సీమాంధ్ర అధికారుల ఇష్టారాజ్యం..
-సీబీఐ విచారణ జరపాలంటున్న తెలంగాణవాదులు
400 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరాన్ని సీమాంధ్రులు అంగుళం అంగుళం చొప్పున ఎలా దోచుకుంటున్నారో తెలిపే మరో ఉదాహరణ. వారి కాసుల వేటలో తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ఎలా సమాధి అయ్యాయో తెలిపే ఓ సాక్ష్యం. పో.. పొమ్మన్నా హైదరాబాద్‌ను పట్టుకుని అధికారులు గబ్బిలాల్లా ఎందుకు వేలాడుతున్నారో నిగ్గు తేల్చే ఓ వైనం. సీమాంధ్ర సర్కారు.. అధికారులు.. ఆక్రమణదారులు అంతా కుమ్మక్కై రూ.600 కోట్ల విలువైన భూమిని కబ్జాపెట్టిన ఉదంతమే ఈ హఫీజ్‌పేట మినీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కథ! 34 సంవత్సరాల కింద ఇక్కడి నిరుద్యోగుల స్వయంఉపాధి కోసం సదుద్దేశంతో లీజుకిచ్చిన ఎస్టేట్‌ను బెల్లం చుట్టూ మూగే ఈగల్లా సీమాంధ్రులు మాయా మాంత్రికులలా ఆక్రమించేసుకున్నారు. రాజ్యం మనదే...రాజులు మనోళ్లే.. మధ్యలో తెలంగాణోళ్ల ముచ్చటెంత. నిబంధనలు అంగీకరించకపోయినా చాలా తేలిగ్గా వారిని పక్కకు తోసేసి అక్కడ ఆకాశహర్మ్యాలు కట్టేసి సొమ్ము చేసుకున్నారు. పరిశ్రమలు పెట్టేసుకున్నారు.

పారిశ్రామిక ప్రాంతమైనప్పటికీ షాపింగులు, సర్వీసు సెంటర్లు ప్రారంభించారు. అపార్ట్‌మెంట్లకు రహదారులు కూడా పుట్టించారు. ఎస్టేట్ కోసం భూములిచ్చిన తెలంగాణవాళ్లు రోడ్డుమీద పడ్డారు. రోడ్డుమీద తిరిగిన సీమాంధ్రులు కోటీశ్వరులయ్యారు. ముఫ్పై ఏళ్లుగా ఒక్క పైసా లీజురుసుం రాకపోయినా అడిగినవాడు లేడు. నాలుగేళ్ల కిందటే ప్లాట్లు తిరిగి స్వాధీనపరుచుకోవాల్సిఉన్నా నోరెత్తినవాడూ లేడు. అవును అది ఆంధ్రోళ్ళ రాజ్యం.. అప్పికట్లవారి రాజ్యం.. రుచిమరిగిన అధికారులకు బదిలీలుండవు.. వచ్చినా నెలలు తిరగవు.. అదే సీట్లో దశాబ్దాలపాటు తిష్ఠ. కానీ ఇవాళ కొత్త రాష్ట్రం.. కొత్త ప్రభుత్వం.. మన రాష్ట్రం.. మన ప్రభుత్వం.. అక్రమాలు బద్దలు కొట్టాల్సిందే. తెలంగాణకు న్యాయం జరగాల్సిందేనని తెలంగాణవాదులు గళమెత్తారు.

(వినయకుమార్ పుట్ట, టీ మీడియా - మియాపూర్): 1981లో రంగారెడ్డి జిల్లా పరిధిలోని అప్పటి రాజేంద్రనగర్ మండలం హఫీజ్‌పేట గ్రామంలో ప్రభుత్వం భూమి సేకరించింది. తెలంగాణ యువతను స్వయం ఉపాధికింద చిరు పారిశ్రామికవేత్తలుగా మార్చే పథకంలో భాగంగా సర్వే నంబర్ 98లో 14 ఎకరాల 32 గుంటల భూమిలో మినీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ (ఎంఐఈ) ఏర్పాటు చేసింది. నాటి ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఈ స్థలాన్ని 500 నుంచి 2000 గజాల చొప్పున 50 ప్లాట్లుగా విభజించి రంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ (డీఐసీ) అప్పగించింది. చదరపు అడుగుకు నెలకు 3 పైసల చొప్పున రుసుంగా నిర్ణయించి 50 మంది నిరుద్యోగులకు లీజుకు ఇచ్చారు. మినీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ రాకతో హఫీజ్‌పేట పరిసర ప్రాంతాలకు చెందిన యువకులు, నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు పెద్దఎత్తున వస్తాయని ఆశపడ్డారు.

land1
అయితే అప్పటికే భాగ్యనగరం బాటపట్టిన సీమాంధ్రుల కన్ను ఎంఐఈపై పడింది. స్థానికంగా బీహెచ్‌ఈఎల్, అల్యూమినియం ఇండస్ట్రీ(ఆలిండ్) తదితర కంపెనీలలో వివిధ హోదాల్లో స్థిరపడ్డ అనేకమంది ఆంధ్ర, రాయలసీమ ప్రాంతవాసులు ఎంఐఈపై దృష్టిసారించారు. సర్కారులో తమ పలుకుబడిని ఉపయోగించి ఎంఐఈలో పాగా వేశారు.లబ్ధిదారులను మాయచేయడం నుంచి బెదిరింపులకు దిగడం, దౌర్జన్యంగా ఆక్రమించడం, అధికారులతో వేధించడం వంటి అన్ని పద్ధతులూ అవలంబించి భూముల లీజు అగ్రిమెంట్లను తిరగ రాయించుకున్నారు. సబ్‌లీజులపేరిట కొందరు, బినామీల పేరిట మరికొందరు, తనఖా పేరిట ఇంకొందరు మొత్తానికి 90 శాతానికి పైగా లీజు భూముల అగ్రిమెంట్లు చేతులు మారాయి. ఫిర్యాదులు చేసినా సర్కారు మౌనం పాటించింది. సదరు భూముల్లో కొందరు పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మరికొందరు రియల్ ఎస్టేట్‌గా మార్చారు. ఇంకొందరు షాపులు, సర్వీసు సెంటర్లు తెరిచారు. మొత్తానికి తెలంగాణ యువత స్థానంలో 90%సీమాంధ్రులు పాగా వేశారు. ఇటు తెలంగాణ యువతకు స్వయం ఉపాధి దొరకలేదు. అటు ఈ ప్రాంత వాసులకు ఉద్యోగాలు రాలేదు.

బదలాయించే అధికారం లేదు..

నిజానికి ఎంఐఈలో అర్హులైన ఔత్సాహికులు తమకు కేటాయించబడిన స్థలంలో వారే చిన్న, మధ్య తరహా పరిశ్రమలను నెలకొల్పుకోవాలి. స్వయం ఉపాధి కార్యక్రమాలకు మాత్రమే ఈ స్థలాలను వాడుకోవాలి. తమకు కేటాయించబడిన స్థలాన్ని ఇతరులకు ఇచ్చే అధికారం ఉండదు. ఇచ్చినా డీఐసీ నిబంధనల ప్రకారం అది చెల్లదు. కానీ ఈ నిబంధనలను తుంగలో తొక్కి గత మూడు దశాబ్దాలుగా ఈ భూములపై బినామీల పర్వం కొనసాగుతోంది. ఒక్కో ప్లాట్‌లో దాదాపు 3, 4సార్లు లబ్ధిదారుని స్థానంలో బినామీ వ్యక్తులు మారిన దాఖలాలు ఉన్నాయి. 1980లో ప్రభుత్వం జారీ చేసిన వివరాల ప్రకారం మొత్తం 50 ప్లాట్లలో లీజు లబ్ధిదారుల వివరాలను ప్రస్తుతం బేరీజు వేస్తే 90 శాతం లబ్ధిదారులు తెరమరుగైనట్టు రికార్డులు పేర్కొంటున్నాయి.
land2

పైసా కడితే ఒట్టు..

అక్రమంగా లీజు అగ్రిమెంట్లను పొంది కోట్ల రూపాయల ఆర్జనకు తెరతీసిన ఈ పెట్టుబడిదారులు అప్పటి నుంచి నేటి వరకు కనీసం లీజు రుసుము కూడా డీఐసీకి చెల్లించకపోవడం విడ్డూరం. ప్రస్తుతం 50 ప్లాట్లలో కేవలం ఐదుగురు లబ్దిదారులే నిబంధనలకు అనుగుణంగా స్థలాలను ఉపయోగిస్తున్నారు. మిగతా 45లో 10 మంది లబ్ధిదారులు ఉన్నప్పటికీ ఆ స్థలాలు నిరుపయోగంగా ఉన్నాయి. మరో 15 ప్లాట్లు నిబంధనలకు విరుద్ధంగా వేరే వ్యక్తులు తమ ఆక్రమణలో ఉంచుకుని విధులు కొనసాగిస్తున్నారు. మరో 8 ప్లాట్లు సైతం వేరే వ్యక్తుల ఆధీనంలో ఉన్నాయి. మిగిలిన 12 ప్లాట్లలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లు వెలిశాయి. ఇంత జరుగుతున్నా ఈ తతంగంపై డీఐసీ దృష్టి పెట్టకపోవడం గమనార్హం.

భాను టౌన్‌షిప్‌కు దారెలా వచ్చింది?

హఫీజ్‌పేటలోని మినీ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌కు వెనుక ఉన్న ప్రైవేటు స్థలాల్లో భాను టౌన్‌షిప్ పేరిట పలు బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టారు. కాగా సదరు నిర్మాణాలకు రహదారి నుంచి సరైన అప్రోచ్ లేదు. గ్రామంలోని చిన్న మార్గం ద్వారా రాకపోకలు సాగించాల్సి ఉంది. తమ నిర్మాణాలకు సరైన వ్యాపారం లభించదని గ్రహించిన బిల్డర్లు భాను టౌన్‌షిప్‌కు ఎంఐఈ మధ్యలోనుంచి నిబంధనలకు విరుద్ధంగా రహదారిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కుతంత్రానికి డీఐసీలోని పలువురు ఉన్నతాధికారులు సూత్రధారులు. ఈ వ్యవహారంలో లక్షలు చేతులు మారినట్టు తెలుస్తోంది.

12 ఏళ్లుగా పట్టి పీడిస్తున్న సీమాంధ్ర అధికారం...

మినీ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో కొనసాగుతున్న అక్రమాల తంతు వెనక సీమాంధ్ర ఉన్నతాధికారుల హస్తం ఉందనేది ఇక్కడి నిరుద్యోగుల ఆరోపణ. ఇక్కడి అధికారులు సీమాంధ్రులు కావడంతో తమ ప్రాంతాలకు చెందిన వారిని ఎంఐఈలో బినామీలుగా చేసి తెలంగాణ భూముల్లో లక్షలు ఆర్జించుకున్నారు. డీఐసీలోని లొసుగులను ఆధారంగా చేసుకుని కొందరు ఉన్నతాధికారులు తమ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. గత 12ఏళ్లుగా డీఐసీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న విజయవాడ వాస్తవ్యుడు అప్పికట్ల వల్లభభాయ్ పటేల్ (ఏవీపటేల్) వ్యవహారం ఇందుకు నిజమైన నిదర్శనం. 20.09.1997లో రంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా వచ్చిన ఏవీ పటేల్ నాలుగేళ్లపాటు విధులు నిర్వహించి 2001లో బదిలీ అయ్యారు. తిరిగి 2006 ఆగస్టులో డీఐసీ జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టి 17.07.2009 వరకు విధులు నిర్వర్తించి బదిలీ అయ్యారు.
land3

తరువాత 10.02.2010నాడు డీఐసీ జనరల్ మేనేజర్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టారు. ఇలా రంగారెడ్డి జిల్లాలో 8.4ఏళ్లు విధులు నిర్వహించిన ఏవీ పటేల్ రంగారెడ్డి జిల్లా డీఐసీ చుట్టే ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆయన మొత్తం 19ఏళ్ల సర్వీసులో 16 ఏళ్లపాటు హైదరాబాద్, రంగారెడ్డి డీఐసీల్లోనే మకాం వేయడంలో మతలబు ఏమిటో ఇట్టే అర్థమవుతోంది. ఒకానొక సమయంలో బదిలీ అయిన ఈ అధికారి తిరిగి తన స్థానాన్ని దక్కించుకునేందుకు డీఐసీని విభజించి రంగారెడ్డి జిల్లా డీఐసీ-2ను ఏర్పాటు చేయించినట్టు సమాచారం. పైన పేర్కొన్న భాను టౌన్‌షిప్ వ్యవహారంలోనూ ఈయన పాత్ర ఉందని భోగట్టా.

లీజు ముగిసినా స్థలం తీసేసుకోరా?..

ఇదిలా ఉంటే ఎంఐఈలో డీఐసీ కేటాయించిన స్థలాల లీజు కాలపరిమితి ముగిసింది. 1980-81లో 30ఏళ్లకోసం ఇచ్చిన లీజు 2010-11తో ముగిసింది.ఈ క్రమంలో లీజుముగిసిన ఈ భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనపరుచుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇంత పెద్ద ఎత్తున కొనసాగుతున్న కుంభకోణంపై సీబీఐ లాంటి అత్యున్నత సంస్థలతో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని అసలైన లబ్ధిదారులు కూడా కోరుతున్నారు.

అపార్ట్‌మెంట్లూ కట్టేశారు..

స్వయం ఉపాధి కింద కేటాయించబడిన స్థలాల్లో లబ్ధిదారులకు బదులు ఇతర వ్యక్తులు అక్రమంగా ఆ స్థలాలను తమ స్వాధీనంలోకి తీసుకుని కార్యకలాపాలు నిర్వర్తించడం ఒకెత్తయితే ఆ స్థలాల్లో ఏకంగా కమర్షియల్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లను నిర్మించుకుని కోట్ల రూపాయలను గడించడం మరోఎత్తు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో లాభం లేదనుకున్న ఆక్రమణదారులు ఏకంగా బహుళ అంతస్తులు, ప్రముఖ ప్రైవేటు సంస్థల భవనాలు కట్టేశారు. ముఖ్యంగా ఆల్విన్ కాలనీ నుంచి హైటెక్‌సిటీకి వెళ్లే రహదారిపై ఎంఐఈ స్థలంలో హ్యుందాయ్ షోరూం, జిమ్, సెంట్రల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పలు వాణిజ్య సముదాయాలు దర్శనమిస్తున్నాయి. లోపలి వైపు కున్ యునైటెడ్, వోల్వో లాంటి సంస్థలు షోరూం, సర్వీస్ సెంటర్‌లను కొనసాగిస్తున్నాయి. అదేవిధంగా పవర్‌టెక్, తేజ తదితర సంస్థలు కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. మరికొందరైతే జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతులు తీసుకుని మరీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లను నిర్మించుకున్నారు.

భూమి ఒకరికి... భుక్తి ఒకరికి...

డీఐసీ నిబంధనల ప్రకారం ఒకసారి కేటాయించబడిన ప్లాట్లలో నిజమైన లబ్ధిదారులు మాత్రమే ఈ స్థలాన్ని ఉపయోగించుకునేందుకు అర్హులు. ఇతరులకు ఆ స్థలాలపై ఎలాంటి అధికారం ఉండదు. కాగా ఎంఐఈలో ఇందుకు విరుద్ధంగా ఒకే ప్లాట్‌పై 2, 3 మంది లబ్ధిదారుల పేర్లు రీ అలాట్ కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఉదాహరణకు ప్లాట్ నంబర్ 2 లోని 2 వేల గజాల స్థలాన్ని ఏ జయసాహోని (యునైటెడ్ ఆగ్రో ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్)కు కేటాయించగా ప్రస్తుతం వికాస్ జలాన్ (డెక్కన్ ఇండస్ట్రీస్ ప్రాడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్) పేరిట ఉంది. అదేవిధంగా ప్లాట్ నంబర్ 3 లోని 2 వేల గజాలు రవికుమార్ (లక్ష్మి ఇండస్ట్రీస్)కు కేటాయించగా ఎస్ రాజగోపాల్ రావు (ఉమా కార్పొరేషన్) చేతిలోకి మారిందని సమాచారం. ప్లాట్ నంబర్ 4/ఏ, 4/బీ 2322 గజాలు గిరిజా రాణి (శారదా ప్రింటింగ్ అండ్ వాక్స్ కోటింగ్ పేపర్ ఇండస్ట్రీస్)కు కేటాయించగా మహేందర్ కె బైద్ అనే వ్యక్తి ఆధీనంలో ఉన్నట్టు రికార్డులు తెలుపుతున్నాయి. ప్లాట్ నంబర్ 5 లోని 1974 గజాలు అప్పట్లో టీకే మహాపాత్ర పెస్ ప్రొడక్ట్స్)కు కేటాయించగా, ఒక సమయంలో నాగేశ్వర్‌రావు, జేఎన్ కరుణాకర్, మరో సమయంలో టీ లక్ష్మి (సూర్య రోటోప్యాక్ ప్రైవేట్ లిమిటెడ్) పేర్లు రికార్డులకెక్కాయి.

ప్లాట్ నంబర్ 6 లో 2184 గజాలు మధురిమ (మెరీడియన్ గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్)కు కేటాయించగా, ప్రస్తుతం కాకతీయ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ డెవలపర్స్ ఆధీనంలో ఉంది. ప్లాట్ నంబర్ 7లో 1974 గజాల స్థలాన్ని ఉమాదేవి మట్టా (మట్టా గ్రానైట్స్)కు, ప్లాట్ నంబర్ 8లోని 1810 గజాలు ఏ విశ్వనాథ్ (యూనిక్ ఎంటర్ ప్రైజెస్)లకు కేటాయించగా ఈ రెండు స్థలాలను కాకతీయ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ డెవలపర్స్ వినియోగిస్తోంది. వాటితోపాటు మధురిమ (మెరిడియన్ గ్రానైట్స్), దేవినేని బసవ నరేంద్ర బాబు (కాకతీయ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ డెవలపర్స్) అనుభవిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ప్లాట్ నంబర్ 9/ఎ లోని 942 గజాలు ఎన్ నరసింహ వర్మ (జేఆర్ గీత ఇంజనీరింగ్ వర్క్స్)కు ఇవ్వగా, బీవీకే రత్నాకర్ రావు (పవర్ టెక్ హైదరాబాద్ ప్రైవేట్ లి) ఆధీనంలోకి వెళ్లింది. ప్లాట్ నంబర్ 9/బీ లోని 942 గజాల స్థలాన్ని బీ ముకుంద రావు (సవితా ఇంజనీరింగ్ వర్క్స్)కు అలాట్ చేయగా, విశ్వేశ్వర్ రావు (మెకానికల్ డివిజన్, బీవీకే రత్నాకర్ పవర్‌టెక్ హైదరాబాద్ ప్రైవేట్ లి)లు ఆ స్థలాన్ని వినియోగిస్తున్నారు. ప్లాట్ నంబర్ 11లో 1320 గజాలు శాంతా శ్రీ నండూరి (పవర్స్ స్పెక్ట్రమ్)కు కేటాయించగా, కే శివకుమార్ (ఎస్‌ఎస్‌ఆర్ ఎంటర్ ప్రైజెస్) ఆ స్థలంలో లబ్ది పొందుతున్నారు. ప్లాట్ నంబర్ 12లోని 1440 గజాలను సీఎస్ సోమ గుండాల (కెనో టూల్స్ అండ్ హీట్ ట్రీట్‌మెంట్)కు ఇవ్వగా, ఎస్‌ఎస్‌ఆర్ ఎంటర్ ప్రైజెస్ ద్వారా స్థలం వినియోగంలో ఉంది.

ప్లాట్ నంబర్ 14 లోని 1197 గజాలను ఆర్‌వీఎల్ నరసింహ(మహాలక్ష్మీ ఎంటర్‌ప్రైజెస్)కు కేటాయించగా, అందులో ఎల్ పద్మావతి (ఎన్‌ఆర్ ఇండస్ట్రీస్) కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ప్లాట్ నంబర్ 15 లోని 1386 గజాలను ఎంజీ గోపాల్ రెడ్డికి కేటాయించగా టీ సంజయ్ కుమార్ సింగ్ ప్రస్తుతం ఆ స్థలాన్ని వాడుతున్నారు. ప్లాట్ నంబర్ 16/ఎ లోని 600 గజాలను రంగారెడ్డి (ఆర్‌ఆర్ ఇంజనీరింగ్ వర్క్స్)కు కేటాయించగా, జీబీ శ్యాం రావు ఆ స్థలాన్ని ఉపయోగిస్తున్నారు. ప్లాట్ నంబర్ 16/బీ లోని 600 గజాలు బాలకోటేశ్వర్ రావు (మాక్‌వెల్ ఇంజనీరింగ్)కు ఇవ్వగా, లక్ష్మీనారాయణ లబ్ధి పొందుతున్నాడు. ప్లాట్ నంబర్ 17/ఏ లోని 600 గజాలు ఎస్ రవీందర్ (నుల్క ఇంజనీరింగ్ వర్క్స్)కు, ప్లాట్ నంబర్ 17/బీ లోని 600 గజాలను ప్రకాష్‌కు, 17/సీ లోని 600 గజాలను కే అశోక్‌కుమార్ (స్టోన్ ట్రేడర్స్)లకు కేటాయించగా ఈ మూడు స్థలాలను ఎం శ్రీకాంత్ శాస్త్రి (బాలా అండ్ రాజా ఎంటర్ ప్రైజెస్), మనోజ్ ఖండేల్ వాలాలు ఉపయోగిస్తున్నారు. ప్లాట్ నంబర్ 18/ఏ లోని 1070 గజాలను కమలాకర్ రావు (యునైటెడ్ మినరల్స్)కు కేటాయించగా, డీఆర్‌డీఏ స్పాన్సర్డ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అనుభవిస్తోంది. ప్లాట్ నంబర్ 19లోని 1502 గజాలను నిఖిల్ నందన్ షాకు ఇవ్వగా మహావీర్ కుమార్ బైద్ అనుభవిస్తున్నారు. ప్లాట్ నంబర్ 20లోని 1102 గజాలను ధనిష్ట ఇంజనీరింగ్ వర్క్స్‌కు కేటాయించగా, రామానుజం (శ్రీ సిమెంట్ వర్క్స్), సత్యనారాయణ. ఎం(లక్ష్మీ ఇంజనీరింగ్ వర్క్స్) స్థలంలో పాగా వేసింది.

ప్లాట్ నంబర్ 21/బీ లోని 868 గజాలను ఎం రాజేందర్ (లక్ష్మీ ఇండస్ట్రీస్)కు ఇవ్వగా, వీ సుబ్రహ్మణ్యం (విజయ సీ ఫుడ్స్) ఉపయోగించుకుంటున్నారు. ప్లాట్ నంబర్ 23/ఏ లోని 863 గజాలను సీహెచ్‌వీ రామాంజనేయులు (రాజేశ్వరి ఎంటర్‌ప్రైజెస్)కు, ప్లాట్ నంబర్ 23/బీ లోని 863 గజాలను ఎంకే గోపీనాథ్ అపానికర్ (లిబ్రా స్ట్రక్చరల్ వర్క్స్)లకు కేటాయించగా మొత్తం 1707 గజాలను భాస్కర్ రాజు (డెక్కన్ హెవీ ఇంజనీరింగ్ వర్క్స్) అనుభవిస్తున్నారు. 24/ఏ లోని 950 గజాలను ఏ రామ్‌గోపాల్ రావు (కనకదుర్గ అబ్రేసివ్స్)కు కేటాయించగా, అల్లూరి సీతారామ రాజు (అల్లూరి ఇంజనీరింగ్ వర్క్స్) వినియోగంలో ఉంది. ప్లాట్ నంబర్ 25/ఏ లోని 896 గజాలను కే వినయ్ కుమార్ (కల్యాణ్ ఇండస్ట్రీస్)కు కేటాయించగా, వీ మురళీ కష్ణ (స్టీల్ ఫర్నిచర్), అనసూయా దేవి (అనూ ఇండస్ట్రీస్)ల ఆధీనంలో ఉంది. 25/బీ లోని 896 గజాలు టీఏ విజయాసింగ్ (షీలా పాలిథీన్ బ్యాగ్స్)కు ఇవ్వగా, ఎం సుధాకర్ రెడ్డి (స్పార్టెక్స్ స్లాబ్స్) అనుభవిస్తున్నాడు. ప్లాట్ నంబర్ 26లోని 1412 గజాలను ఎస్‌టీ సాలెండర్ (కావేరీ ఇండస్ట్రీస్)కు అలాట్ చేయగా, నరసింహాచారి (రామలక్ష్మి ఇంజనీరింగ్ వర్క్స్), వినాయక బాడీ బిల్డర్స్ అండ్ ఇంజనీరింగ్ కార్పొరేషన్‌లు ఆ స్థలాన్ని వాడుతున్నారు. మొత్తానికి 50 ప్లాట్లలో అసలు లబ్ధిదారుల స్థానంలో ఆక్రమితులు పాగా వేశారు.

-చర్యలు తీసుకుంటాం...

హఫీజ్‌పేట మినీ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో జరిగిన అవకతవకలపై రంగారెడ్డి జిల్లా డీఐసీ-2 అసిస్టెంట్ డైరెక్టర్ వెంకయ్యను టీ మీడియా వివరణ కోరగా సదరు ప్లాట్లలో నిబంధనలకు విరుద్ధంగా స్థలాలను వినియోగిస్తున్నవారిపై విచారణ చేపడతామన్నారు. అక్రమంగా లబ్ధి పొందుతున్న వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎంఐఈ స్థలాలో కమర్షియల్, రెసిడెన్షియల్ నిర్మాణాల విషయమై సర్కిల్ 12 ఉప కమిషనర్ మహేందర్‌ను ప్రశ్నించగా తాను ఇటీవలే డీసీగా బాధ్యతలు చేపట్టానని, అక్రమ నిర్మాణాలు జరిగినట్టు తెలిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి