- నిజాం ఆస్తుల విభజన కుదరదు
- ఏపీ భవన్ సందర్శనలో ముఖ్యమంత్రి స్పష్టీకరణ
- కార్యాలయాలు, ఆస్తుల వివరాలపై ఆరా
- ఉద్యోగులను సొంత రాష్ట్రాలకే ఇవ్వాలని గోయల్‌కు సూచన
ఏపీ భవన్‌లో తెలంగాణకు వాటా ఉంటుందని...ఇది రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోనే ఉందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఈ భవనంలో తెలంగాణకు వాటా ఉండదంటూ వస్తున్న వదంతులను ఆయన తోసి పుచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన అన్ని ఆస్తుల్లో ఇరు రాష్ట్రాలకు వాటా ఉంటుందని, అదే సమయంలో నిజాంకు చెందిన ఆస్తుల విభజన మాత్రం సాధ్యం కాదన్నారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌ను కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం సందర్శించారు. భవన్‌కు చెందిన భవనాలు, వివిధ కార్యాలయాల వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏపీ భవన్ మ్యాప్‌ను పరిశీలించారు. అధికారులను వాకబు చేసి సందేహాలు నివృత్తి చేసుకున్నారు. సుమారు ఇరవై నిమిషాలపాటు ఏపీ భవన్ ప్రాంగణంలో వివిధ బ్లాకులను కలియ తిరిగారు. శబరి బ్లాక్‌తో సహా ఇంజనీరింగ్, ఆర్ అండ్ బీ, లీగల్‌సెల్ తదితర శాఖలకు చెందిన కార్యాలయాలను కూడా ఆయన పరిశీలించారు. అనంతరం కేసీఆర్...గురజాడ కాన్ఫరెన్స్ హాలులో మీడియాతో మాట్లాడుతూ ఏపీ భవన్‌లో ఉద్యోగుల విభజన సరిగా జరగలేదని అన్నారు.
ఏ ప్రాంతానికి చెందినవారు ఆ రాష్ట్రంలో పని చేయాలని కోరుకుంటారని , కాబట్టి ఏ ప్రాంతం వారిని ఆ రాష్ట్రానికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్‌కు స్పష్టం చేశానని అన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు శనివారమే తనను కలిసి కొన్ని సమస్యలను తన దృష్టికి తెచ్చారని, తాను స్పందించి ప్రధాన కార్యదర్శికి, ముఖ్య కార్యదర్శికి ఆదేశాలిచ్చానని చెప్పారు. ఏపీ భవన్ పరిధిలో ఉన్న ఆస్తులు పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా జనాభా నిష్పత్తి ప్రకారం జరుగుతుందని ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదని స్పష్టం చేశారు. అదే సమయంలో నిజాంకు చెందిన భవనాలు, స్థిరాస్తులు పంపకానికి వీలుకానివని అన్నారు.
ఢిల్లీలో ఉన్న హైదరాబాద్ హౌస్‌గానీ, అజ్మీర్‌లో ఉన్న భవనాలుగానీ, సౌదీ అరేబియాలో మక్కాకు సమీపంలో ఉన్న భవనంగానీ...ఇలా చాలా విభజించడానికి వీలు పడనివని అన్నారు. హైదరాబాద్‌లో ఉన్న సెంట్రల్ లైబ్రరీ భవనం కూడా అప్పట్లో వట్టికోట ఆళ్వారు స్వామి గ్రంథాలయ ఉద్యమంలో భాగంగా నిజాంపై కొట్లాడి సాధించుకున్నదని, దాన్ని విభజించడానికి సాధ్యం కాదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కొన్ని ఆస్తులు కూడా ఇలాంటివేనని అన్నారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి