గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, సెప్టెంబర్ 30, 2017

మహిషాసురమర్దినీ స్తోత్రము!

మిత్రులందఱకు
విజయ దశమి పర్వదిన
శుభాకాంక్షలు!



సురనర్తకీ/తరంగక వృత్తము(షట్పాది):

ఇందిరా రమణ సోదరీహిమజ! ♦ హిండిచండిఖల శోషిణీ!
నందయంతిగిరిజామదోత్కటనస్వినీదనుజ నాశినీ!
నందితాఖిల సురేంద్ర ముఖ్యకరుణాంతరంగవరదాయినీ!
కందుకాభ పరిపంథి శీర్ష కర ♦ ఖండితోగ్రమృగవాహినీ!
వందితోరుతర భూజనాళి నత ♦ భక్తిమస్తనగనందినీ!
మందయానపరమార్థ దాయినిమః సతీమహిష మర్దినీ!


సీ.      ఓంకార రూపిణీ! ♦ యోగీశ తోషిణీ! - దివిజ సంస్తుత గాత్రి! ♦ త్రిపుర హంత్రి!
ఐంకార రూపిణీ! ♦ ఆనంద పోషణీ! - షడ్భుజాయుధ ధాత్రి! ♦ శైల పుత్రి!
హ్రీంకార రూపిణీ! ♦ త్రిపథ సంచారిణీ! - సర్వార్థ దాత్రిప్రశస్త గాత్రి!
శ్రీంకార రూపిణీ! ♦ శ్రితజన కళ్యాణి! - దనుజ నాశన కర్త్రి! ♦ తరళ నేత్రి!
గీ.      సర్వ మంత్రాత్మికాకృపా ♦ శరధిమాత! - సర్వ యంత్రాత్మికాసర్వ ♦ శక్తిదాత!
సర్వ తంత్రాత్మికామహైశ్వర్య మహిత! - సర్వ లోకేశ్వరీతల్లి! ♦ సన్నుతు లివె!!

లక్ష్మీస్తుతి
మేఘవిస్ఫూర్జిత వృత్తము:
రమాలక్ష్మీక్షీరాబ్ధ్యధిపతిసుతా! ♦ రమ్యసంస్తుత్య వంద్యా!
నమో దేవీసంపత్ప్రదసుచరితా! ♦ నన్ గటాక్షించు మాతా!
సమీక్షింతున్ పద్మాసనసువదనా! ♦ సత్యమౌ నాదు భక్తిన్!
క్రమమ్మీవున్ సంపత్కరివి యవుటన్ ♦ గాంక్షితమ్మీవె తల్లీ!!

సరస్వతీ స్తుతి
కం.     విద్యాధినేత్రిమాతా! - సద్యః స్ఫురణ ప్రదాత్రి! ♦ శారదవాణీ!
మద్యోగ్య పద్య ధాత్రీ! - మాద్య న్మంగళ సుగాత్రి! ♦ మాన్య!నమస్తే!

తే.గీ.   సకల విద్యాప్రదాత్రివిశాలనేత్రి! - భ్రమరనీలవేణి స్వచ్ఛవర్ణధాత్రి!
బ్రహ్మమానస సత్పుత్రి! ♦ స్వర సుగాత్రి! - బ్రాహ్మిభగవతివరదభారతి నమోఽస్తు!


త్రిమాతృ స్తుతి
శా.      చేతన్ వీణ ధరించివిద్యలొసఁగన్ ♦ శ్రీ వాణివై నిల్చి
చ్చేతోమోద విశేష సంపద లిడన్ ♦ శ్రీ లక్ష్మివై నిల్చియా
చేతోఽoశుల్ మొఱ వెట్టశక్తి నిడఁగన్ ♦ శ్రీ గౌరివై నిల్చి
చ్చైతన్య మ్మిడియో త్రిదేవియిట విశ్వమ్మున్ దగన్ బ్రోవుమా!!

కం.     వాణీవీణా పాణీ! - పాణి స్థిత సకల విభవ ♦ భాస్వ ల్లక్ష్మీ
ప్రాణేశార్ధాజిర శ-ర్వాణీధీ బల ధనాఢ్య! ♦ వరదాయిభజే!!

.      అమ్మమనమ్మునందు నిను ♦ నండగ నమ్మితినమ్ము మమ్మమో
హమ్ముఁ బెకల్చిసన్మనము ♦ నందఁగ నిచ్చిహృదంతరమ్ము శాం
తమ్మున నోలలార్చిసతతమ్ము దయారస మిమ్ముఁ గూర్చినా
కిమ్మహి జన్మ దున్మియిఁకఁ ♦ గేవల సద్గతి నిమ్మయమ్మరో!!


స్వస్తి

సంబంధిత చిత్రం


నా యితర బ్లాగులను వీక్షించడానికి క్లిక్ చేయండి:

మంగళవారం, సెప్టెంబర్ 19, 2017

విద్యాధనము (పద్యరూప సూక్తులు)

image of guru and sishya కోసం చిత్ర ఫలితం

తేటగీతులు:
విద్య యున్నచో జీవన విధులు దెలియు!
లోక వృత్తమ్ము దాన విలోకన మగు!
విద్య లేకున్నఁ బ్రదికెడు విధ మెఱుఁగఁడు!
విద్య లేనట్టివాని జీవితము సున్న!!

విద్యలనుఁ బూర్ణుఁ డెపుడు గర్వితుఁడు కాఁడు;
స్వల్ప మెఱిఁగినవాఁడె గర్వమునుఁ జూపు;
నన్ని తెలియుటయే నిగర్వోన్నతి నిడుఁ;
గొన్ని తెలియుట గర్వానికున్న మహిమ!

ఎంత పండితుఁ డైనను నెంత విద్య
కల్గి యున్నను నిత్యమ్ము కాంక్ష తోడ
సాధనముఁ జేయకున్నచో సమయమునకు
నక్కఱకు రాదు! తద్జ్ఞాన మంతరించు!!

గురువు లెప్పుడు జ్ఞానమ్ముఁ గొనుచు నుండ
విద్యయే దీప్త మగుచుండు వేగముగను!
నిత్య విద్యార్థులై గురుల్ నిలిచినంత
భావి భారత పౌరులే పరిఢవింత్రు!!

బాలకులు బడులకుఁ బోయి భావి పౌరు
లుగను వెలుఁగొందు నట్టి విద్యఁ గొని వెలిఁగి
వెలుఁగు లోకానికినిఁ బంచి నిలువఁ గాను
జగము కీర్తించుఁ గావునఁ జదువ వలయు!!

అభ్యసనమునుఁ బట్టి విద్యయె యెసంగు!
కర్మమునుఁ బట్టి బుద్ధి సద్ఘనత పెరుఁగు!
సాధనము చేత సద్విద్య చాలఁ గలుగు!
పఱఁగ సద్బుద్ధి సత్కర్మ వలన నెసఁగు!!

నేర్చుకొనువాఁడు నిత్యమ్ము నేర్పుతోడ
శత్రువుల నుండి యైనను సద్గుణమ్ముఁ
గొనఁగఁ దగు నయ్య సేవించి వినియుఁ! గాన,
రిపుని నుండైన సచ్ఛీల మెపుడు కొనుఁడు!!

వినఁగ నిచ్ఛ లేకుంటయు; వేగిరపడు
టయును; నాత్మ శ్లాఘయను మూఁట నిల విద్య
నేర్వ నాటంకపఱచియు నిశ్చయముగ
విముఖులనుఁ జేయుఁ గావున వీడుఁ డివియ!!

పండితుఁడు లేని చోట నపండితుండె
గౌరవింపఁగఁ బడుచుండు ఘనముగాను!
వృక్షములు లేని చోటున వెదకిచూడ
నాముదపుఁ జెట్టె, వృక్షమ్మ టండ్రు జనులు!!

జ్ఞాన మెంతేని యున్నచో సర్వులకును
సుంతయైనను నుపయోగవంత మగుట
వలయు! నా జ్ఞాన ముపయోగపడదయేని
కుండలో దీప మున్నట్టు లుండునయ్య!!

పండితుని పరిశ్రమమునుఁ బండితుండె
తెలియఁగలఁడయ్య! యితరుండు తెలియఁగలఁడె?
పురిటి నొప్పులు తెలియును పుత్రవతికె!
బొట్టెలఁ గనని గొడ్రా లవెట్టు లెఱుఁగు?

పొత్తమునఁ గల విద్య యెప్పుడును నవస
రమున కెట్లొనరదొ యటు లక్కఱపడు
సమయమున ధనము పర హస్తమున నుండ
నెట్లు పనికివచ్చు? నెటులు హితము నిడును?

విద్య నొసఁగెడు గురుని సేవింపుమయ్య!
సూక్తి బోధకుఁ డగువాఁడె చుట్టమయ్య!
యెంచి సారము నెల్ల బోధించునట్టి
పెద్దలగువారి వాక్కులె చద్దిమూట!!

యుక్తియుక్తమౌ వాక్కు బాలోక్తమైనఁ
గొనఁగఁ దగునయ్య బుధులకుఁ గూర్మి మీఱ!
తపనుఁ డీక్షింపలేని పదార్థచయముఁ
చూపునుం గాదె యొకచిన్న దీపకళిక!!



స్వస్తి