-విభజనలోని సమస్యల పరిష్కారమే లక్ష్యం
-ఉద్యోగుల ఇబ్బందులపై సత్వరమే చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశం
-టీఎన్జీవో నేతల విజ్ఞప్తిపై సానుకూల స్పందన
-నేటి నుంచి సెల్ పని ప్రారంభం
రాష్ట్ర విభజనకు సంబంధించి తెలంగాణ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటుచేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఈ మేరకు సాధారణ పరిపాలనాశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. బుధవారం నుంచి సెక్రటేరియట్ కేంద్రంగా గ్రీవెన్స్ సెల్ పనిచేయనున్నది. విభజనలో భాగంగా సీమాంధ్రకు బట్వాడా అయిన తెలంగాణ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈ సెల్ దృష్టి సారించనున్నది. ఈ విభాగం పనిచేయాల్సిన విధానంపై కూడా సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులకు కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. మౌఖికంగా మార్గదర్శకాలను సూచించారు.
టీఎన్జీవో అధ్యక్షుడు జీ దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ ఈ మేరకు సానుకూలంగా స్పందించారు. ఉద్యోగులు తమ పూర్తి వివరాలు, తాము పనిచేస్తున్న శాఖ, కేటాయింపు విధానం తదితర అంశాలతో విజ్ఞాపనను రూపొందించి గ్రీవెన్స్‌సెల్‌కు అందజేయాలని, ఉద్యోగికి సంబంధించిన సమస్త సమాచారం విజ్ఞాపనలో ఉండాలని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులకు ఇచ్చిన ఆదేశాలలో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యోగులెవ్వరూ ఏ విధమైన ఇబ్బందులు పడకుండా ఇక్కడి ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని, గ్రీవెన్స్ సెల్‌కు విజ్ఞాపన అందగానే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
18,750 మంది సీమాంధ్ర ఉద్యోగుల స్థానికతపై ఫిర్యాదులు:ఎమ్మెల్యే వీ శ్రీనివాసగౌడ్
తెలంగాణలో సీమాంధ్రకు చెందిన 18,750 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. అనంతరం టీజీవో అధ్యక్షురాలు మమత, గ్రేటర్ హైదరాబాద్ టీఎన్‌జీవో అధ్యక్షుడు కృష్ణయాదవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన సీమాంధ్ర ఉద్యోగులు వాటిని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. విభజన కారణంగా ఉద్యోగుల కేటాయింపుల్లో నెలకొన్న గందరగోళాన్ని పరిష్కరించేందుకు కేసీఆర్ ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కొద్దిరోజుల్లోనే ఏ ప్రాంత ఉద్యోగులు ఆ ప్రాంతంలో పనిచేసే విధంగా సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చినందున ఉద్యోగులెవరూ ఆందోళన చెందవద్దన్నారు. ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించనున్నట్లు చెప్పారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి