గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, జూన్ 21, 2014

భావి రక్షకభట వైభవం...


-అన్ని పోలీస్ స్టేషన్లకు ఇంటర్‌నెట్ సౌకర్యం
-వాహనాలకు జీపీఎస్, జీపీఆర్‌ఎస్‌తో అనుసంధానం
-5 నిమిషాల్లో సంఘటన స్థలికి చేరేలా ఏర్పాట్లు
-భారీ ఆధునీకరణ దిశగా పోలీసుశాఖ
-నూతన సాంకేతిక పరిజ్ఞ్ఞానానికి పెద్దపీట..
-నిపుణుల సలహాలతో ప్రతిపాదనలు సిద్ధం
-ప్రపంచ స్థాయి కంట్రోల్ రూమ్ వ్యవస్థ
-జంటనగరాలకు వరల్డ్ క్లాస్ పోలీసింగ్
-సేఫ్ సిటీగా రూపొందాలని సీఎం ఆదేశం
-నగరమంతాపోలీస్ సీసీ కెమెరాలు
-ప్రైవేటు కెమెరాల ఫుటేజీ నిరంతర సేకరణ
-పెట్రోలింగ్‌కు ఇన్‌బిల్ట్ ఇంటర్‌నెట్ ఇన్నోవాలు
-కమాండ్ సెంటర్‌తోపాటుఒక డీసీపీ
తెలంగాణ పోలీస్ శాఖను పూర్తిస్థాయిలో ఆధునీకరించేందుకు ప్రభుత్వం నడుం కట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల పోలీస్ వ్యవస్థను పూర్తిగా పటిష్ఠపరచాలని సంకల్పించింది. ఎక్కడ ఏ ఘటన జరిగినా తక్షణమే సమాచారం అందేలా ఒక కంట్రోలింగ్ వ్యవస్థ రాబోతున్నది. ప్రతి పోలీస్‌స్టేషన్‌కు ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించి సమాచారలోపం లేకుండా ఉండే ఏర్పాటు జరుగుతోంది. పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్ఠ పరిచేందుకు ఆధునిక సౌకర్యాలున్న వాహనాలను ప్రవేశపెట్టనున్నారు. ప్రజల నుంచి సమాచారం అందుకునేందుకు ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి దాన్ని ఆయా స్టేషన్లకు పంపించడంతో పాటు వాటిపై చర్యలను ఎప్పటికప్పుడు నివేదించే వ్యవస్థ దిశగా పోలీసు శాఖ రూపాంతరం చెందబోతున్నది. మోడల్ పోలీసింగ్ కలిగిన రాష్ట్రంగా గుర్తింపు పొందేందుకు ఉన్నతాధికారులు భారీ కసర్తతు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విశ్వనగర విజన్‌కు అనుగుణంగా హైదరాబాద్‌ను సేఫ్ అండ్ స్మార్ట్ సిటీగా రూపొందించేందుకు వరల్డ్ క్లాస్ పోలీసింగ్ అందుబాటులోకి తెస్తున్నారు. నగరాన్ని దేశంలోకెల్లా అత్యంత సురక్షిత నగరంగా రూపొందించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. సేఫ్ సిటీగా నగరం రూపుదిద్దుకోవాలంటే భద్రత అతి ముఖ్యం కాబట్టి రెండు కమిషనరేట్లను అత్యాధునిక టెక్నాలజీతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
net


ఆస్కీ నిపుణులతో ప్రణాళికలు..

వాస్తవానికి రాష్ట్రం ఏర్పాటు కాగానే పోలీసుశాఖ ఆధునీకరణకు అధికారులు కొన్ని ప్రతిపాదనలు సీఎం కే చంద్రశేఖరరావు ముందుంచారు. అయితే ఆయన తన విజన్ వెల్లడించి దానికి అనుగుణంగా నిపుణుల సలహాలతో ప్రతిపాదనలు రూపొందించాలని వారికి సూచించారు. దీనితో అధికారులు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కీ)నిపుణులకు ప్రణాళికలు రూపొందించే బాధ్యత ఇచ్చారు. ఆ మేరకు ఆస్కీ నిపుణులు ప్రణాళిక రూపొందించి గురువారం ఉదయం డీజీపీ కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. డీజీపీ అనురాగ్ శర్మ నేతృత్వంలో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్, పీఅండ్ ఎల్ ఐజీ నవీన్‌చంద్, తెలంగాణ పోలీస్ రీ ఆర్గనైజేషన్ సెల్ అధికారి రమేష్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగర వ్యాప్తంగా అడుగడుగునా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆస్కీ నిపుణులు ప్రతిపాదించారు. ఇప్పటికే నగరంలోని వాణిజ్య, వ్యాపార సముదాయాల్లో సీసీ కెమెరాలున్నాయి. రెసిడెన్సియల్ ప్రాంతాల్లోనూ యజమానులు సీసీ కెమెరాలను ఉపయోగించుకుంటున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖ కెమెరాలతోపాటు వ్యాపార, వాణిజ్య, రెసిడెన్సియల్ కెమెరాలను కూడా వాడుకోవాలని ఆస్కీ ప్రతిపాదించింది.

కేవలం నేరం జరిగిన సమయాల్లోనే కాకుండా ఎప్పటికప్పుడు ఈ డేటాను మొత్తం పోలీస్‌శాఖకు చేరేలా ఒక డాటా కలెక్టింగ్ సిస్టమ్‌ను రూపొందించాలని ఆస్కీ ప్రతినిధులు సూచించారు. దీనివల్ల నేరం జరిగాక తీరిగ్గా వెళ్లి ఈ డేటా సేకరించి విశ్లేషించేందుకు పట్టే కాలవ్యవధి కుదించవచ్చు. ఇక నేరస్థలానికి చేరుకోవడంలో జరుగుతున్న విపరీత జాప్యాన్ని నివారించడం మరో ప్రతిపాదన. ఏదైనా నేరం లేదా మరేదైనా సంఘటన జరిగితే ఆయా పరిధిలోని పోలీసులు అక్కడికి ఎన్ని నిమిషాల్లో చేరుకుంటారన్నదానిపై ఆస్కీ వివరాలు సేకరించింది. నేరం జరిగిన తరవాత గంటల పాటు పోలీసులు సంఘటనస్థలికి చేరుకోని అనేక ఉదాహరణలు వారి దృష్టికి వచ్చాయి. దీని వల్ల నిందితుల గుర్తింపులో ఆలస్యం అవుతోంది. ఆధారాలు ధ్వంసం కావడం, సాక్ష్యాలు సేకరించే అవకాశం లేకుండా పోవడం జరుగుతోంది. అందువల్ల ఘటనా స్థలికి పోలీస్ సిబ్బంది 5 నుంచి 10 నిమిషాల్లో చేరుకునేలా ఓ ఆధునిక వ్యవస్థ ఉండాలని ఆస్కీ ప్రతినిధులు ప్రతిపాదించారు.

వరల్డ్ క్లాస్ కంట్రోల్ రూమ్...

ఇండియాలో తప్ప అన్ని దేశాల్లో వరల్డ్ క్లాస్ కంట్రోల్ రూమ్ వ్యవస్థ అందుబాటులో ఉంది. దేశంలో మొదటి సారిగా ఇలాంటి వ్యవస్థను హైదరాబాద్‌లో అందుబాటులోకి తేవాలని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా డీజీపీ అనురాగ్ శర్మతో పాటు ఇతర అధికారులు అభిప్రాయపడ్డారు. దీనికయ్యే వ్యయం, దాని విధివిధానాలు, కార్యకలాపాలపై నివేదిక ఇవ్వాలని పోలీస్ రీఆర్గనైజేషన్ సెల్ రమేష్‌రెడ్డిని డీజీపీ ఆదేశించారు.ఈ కంట్రోల్ రూమ్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా క్షణాల్లో తెలిసిపోయేలా టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది.

ఇందుకోసం ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఇంటర్‌నెట్ వాడకం, ప్రతి పోలీస్ జీప్‌కు జీపీఎస్, జీపీఆర్‌ఎస్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకువస్తారు. ఈవ్యవస్థలో ప్రజల పాత్ర కూడా ముఖ్యం. ఎక్కడ ఏ ఘటన జరిగినా వెంటనే ఈ కంట్రోల్ రూమ్‌కు చేరవేస్తే ఐదు నిమిషాల్లో ఘటనస్థలి నుంచి పూర్తి వివరాలను ఆయా పరిధిలోని పోలీసులు ఈ వరల్డ్ క్లాస్ కంట్రోల్ రూమ్‌కు తెలియజేస్తారు. ఈ సమాచారాన్ని ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి కంట్రోల్ రూమ్ సిబ్బంది చేరవేస్తారు. దీని వల్ల జరిగే ప్రమాద తీవ్రతను గానీ, నేర ఉద్రిక్తతను తగ్గించడం సులభతరమవుతుంది. వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఉన్నతాధికారులకు వీలు
చిక్కుతుంది.

మరో మానిటరింగ్ వ్యవస్థ...

పోలీసులకు అందుబాటులోకి రానున్న జీపీఎస్, జీపీఆర్‌ఎస్ పెట్రోలింగ్ వాహనాలపై మరో మానిటరింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటుచేయాలని డీజీపీ అనురాగ్ శర్మ భావిస్తున్నారు. పోలీస్ ఉన్నతాధికారులు చేపట్టిన ప్రణాళికలు అమలు కావాలంటే కింది స్థాయి సిబ్బందిని ప్రోత్సహించాలి. టెక్నాలజీ వ్యవస్థపై కూడా కొంత శిక్షణ ఇవ్వాలి. సంఘటన స్థలి నుంచి ఏదైనా ఫొటోలు గానీ, వీడియోలు గానీ వెంటనే చేరవేసేందుకు పోలీస్ జీప్‌లో లాప్ ట్యాప్‌ను అందుబాటులోకి తెస్తారు. వీటిని ఆపరేట్ చేసేందుకు ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని కూడానియమించే యోచనలో ఉన్నారు. ఏదైనా ఘటన జరిగిందని తెలిసిన వెంటనే ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలోని సిబ్బందిని ఈ కంట్రోల్ వ్యవస్థ అలర్ట్ చేసి ఘటన స్థలికి చేరుకునే దాకా పదే పదే వారినుంచి సమాచారం సేకరిస్తుంది. ఇలా మానిటరింగ్‌చేస్తే గానీ ప్రజలకు పోలీస్ సేవలు పూర్తి స్థాయిలో అందవని డీజీపీ భావిస్తున్నారు.

సిటీలో పూర్తి ప్రక్షాళన...

నగరంలోని పెట్రోలింగ్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు గురువారం జరిగిన సమావేశంలో నిర్ణయించారు. లేటెస్ట్ వర్షన్‌తో పాటు ఇంటర్నెట్ ఇన్ బిల్ట్ ఉన్న ఇన్నోవాలను, జీపులను కొనుగోలు చేయాలని నిశ్చయించారు. నగరంలో పెట్రోలింగ్ వ్యవస్థ నిర్వహణకే ప్రత్యేకంగా ఒక డీసీపీని నియమించాలని ప్రతిపాదించారు. హుటాహుటిన ఓ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటుచేసి కెమెరాలు ఆపరేట్ చేసేలా వ్యవస్థను రూపొందించాలని నిర్ణయించారు. వారం రోజుల్లో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ పూర్తి స్థాయిలో పనిచేసేలా ఏర్పాటుచేస్తున్నారు. డయల్ 100 వ్యవస్థను ఆధునీకీకరించాలని, సిబ్బందికి నూతన టెక్నాలజీపై శిక్షణ ఇవ్వాలని ప్రతిపాదనలు సిద్ధంచేశారు. ఆస్కీ ప్రతిపాదనలతో పాటు రిటైర్డ్ పోలీస్ అధికారులు, సామాజిక సంస్థల ప్రతినిధులు, మేధావుల నుంచి కూడా అభిప్రాయాలు, ప్రతిపాదనలు స్వీకరిస్తున్నామని పోలీస్ ఉన్నతాధికారులు చెప్తున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి