-టెండర్ల ఆమోదంలో గందరగోళం
- ఐటీ/ఐటీఈఎస్ పార్కు పనుల్లో గోల్‌మాల్
పారిశ్రామిక వాడల మౌలిక సదుపాయాల కల్పన పనుల్లో ఏపీఐఐసీ వ్యవహరిస్తున్న తీరు దుమారం రేపుతున్నది. టెండర్ల ఆమోదం విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. ఎక్సెస్ టెండర్లకు అనుమతులివ్వడం, లెస్‌కు దాఖలైన వాటిని తిరస్కరించడం వంటి చర్యలు అవినీతి ఆరోపణలకు తావిస్తున్నాయి. ప్రభుత్వానికి నష్టం వాటిల్లే పనులను అనుమతించడం, ఇష్టారాజ్యంగా సాంకేతిక అనుమతులు మంజూరు చేయడం, భూసేకరణ కూడా చేపట్టకుండానే పనులకు ఆమోద ముద్ర వేయడం ఎవరి ప్రయోజనాలకోసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర విభజన గందరగోళం కొనసాగుతున్న సంధికాలంలోనే పనులు పూర్తి చేసి నిధులు స్వాహా చేయాలన్న తొందరపాటు కనిపిస్తోందని అంటున్నారు ఏపీఐఐసీ ఐటీ/ఐటీఈఎస్ పార్కుల్లో చేపట్టిన పనులు ఈ ఆరోపణలకు ఊతమిస్తున్నాయి.- ఐటీ/ఐటీఈఎస్ పార్కు పనుల్లో గోల్‌మాల్
ఏరోస్పేస్ పార్కు మంచినీటి కథ...
ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్లలో సర్వే నెం.519, 523, సరూర్‌నగర్ మండలం నాదర్‌గుల్‌లో సర్వే నెం. 656లో ఏర్పాటు చేయడానికి నిర్దేశించిన ఐటీ/ఐటీఈఎస్ ఎరోస్పేస్ పార్కులో మంచినీటి సరఫరా పనులకు ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రూ.2,78,70,000 మంజూరయ్యాయి. ఈ పనులను ఓ కాంట్రాక్టర్ 4.90 శాతం అధికంగా రూ.2,92,35,640లకు టెండర్ దాఖలు చేసి పనులు దక్కించుకున్నారు. అది కూడా ఏకైక టెండర్ దాఖలు కావడం విశేషం. టెండర్లు ఆశించిన స్థాయిలో రాకపోతే మళ్లీ ఆహ్వానించాలన్న నిబంధనలు ఉన్నాయి. అయినా అవేవీ పాటించకుండా 4.90% ఎక్సెస్ టెండర్‌ను ఆమోదించి పనులు అప్పగించారు. ఇక్కడున్నది 10 మీటర్ల రహదారి. 7 మీటర్ల వరకు బీటీ రోడ్డు ఉంటుంది. ఇరుపక్కలా మిగిలేది 1.5 మీటర్లు. రహదారి విస్తరణ చేపట్టకుండా ఈ మాత్రం స్థలంలో అది సాధ్యపడదు. అయినా టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్ సాంక్షన్ ఎలా ఇచ్చారో అర్థం కాదు.
ఔటర్ రింగ్‌రోడ్డు సర్వే నెం.165/పి నుంచి ఆదిబట్ల సర్వే నెం.255 వరకు(ఐటీ/ఐటీఈఎస్ పార్కు వరకు) రహదారి విస్తరణ, పటిష్టం చేసే పనికి రూ.4.40 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనికి టెండర్లు పిలిస్తే ఓ కాంట్రాక్టరు 20 శాతం లెస్(తక్కువ)(రూ.3,38,40,853)కు టెండర్ దాఖలు చేసి దక్కించుకున్నాడు. శంషాబాద్ జోనల్ ఆఫీసు నుంచి టెక్నికల్ సాంక్షన్ లభించింది. పరిపాలన ఆమోదం ఇచ్చారు. టెండర్లు ఓపెన్ చేసి 20 శాతం లెస్ వేసిన కాంట్రాక్టరుకు దక్కినట్లు మొదట ప్రకటించారు. ఆ వెంటనే రహదారి విస్తరణకు స్థలం లేదని అంటే భూ సేకరణ జరుపలేదన్న నెపాన్ని చూపిస్తూ దాన్ని రద్దు చేశారు. సదరు కాంట్రాక్టరు చెల్లించిన ఈఎండీని కూడా వాపసు ఇచ్చేశారు.
పై రెండు పనులు దాదాపు ఒకే ప్రాంతానికి సంబంధించినవి. మొదటి పనికి అంచనా కంటే అధిక మొత్తానికి వచ్చిన టెండర్ ఆమోదించారు. రెండో పని 20 శాతం తక్కువకే చేయగలమంటూ ముందుకొచ్చిన సంస్థను విస్మరించారు. అక్కడ ఇక్కడ స్థల సేకరణ జరగకుండా పని జరిగే పరిస్థితి లేదు. అయితే వాటిలో ఒక పనిని రద్దు చేసి, మరోదాన్ని చేపట్టడం ఎలా సాధ్యమని ఏపీఐఐసీలోని ఉద్యోగులే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు భూసేకరణ వంటి పెద్ద సమస్య అవరోధంగా ఉండగా సాంకేతిక అనుమతులు, పరిపాలన ఆమోదం ఎలా తెలిపారన్నది మరో ప్రశ్న. ఏకైక టెండరు మాత్రమే వచ్చినప్పుడు రద్దు చేయాలన్న నిబంధనలున్నా అధికారులు సదరు కాంట్రాక్టరు పట్ల ఔదార్యం చూపించడం వెనుక ఆంతర్యమేమిటో బోధ పడడం లేదు. ఏపీఐఐసీ చేపట్టిన మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనులపై దర్యాప్తు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి