గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, జూన్ 23, 2014

సింగరేణిలో అధికారుల మాయాజాలం

-బిడ్డింగ్ సరిగా రాలేదని మూసేసిన బొగ్గు రవాణా టెండర్‌నుఆంధ్రా కాంట్రాక్టర్‌కు కట్టబెట్టే యత్నం?
-రూ.కోట్లు చేతులు మారినట్లు విమర్శలు
-విజిలెన్స్ విచారణకు డిమాండ్








సింగరేణి సంస్థ రామగుండం డివిజన్-1 పరిధిలోని మేడిపల్లి ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు-4 నుంచి బొగ్గు రవాణాకు సంబంధించి ఏడాది క్రితం మూసివేసిన టెండర్‌ను తిరిగి సంప్రదింపుల పేరుతో యాజమాన్యం ఆంధ్రా కాంట్రాక్టర్‌కు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీనికి గాను కోట్లాది రూపాయలు సింగరేణి ఉన్నతాధికారులకు అందినట్లు తెలుస్తోంది. గతంలో ఎక్కువ ధరకు కోట్ చేసిన బొగ్గు రవాణా టెండర్‌ను ఇవ్వడం ద్వారా సింగరేణి యాజమాన్యానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుందని భావించి నిలిపివేసిన టెండర్‌ను ఇప్పుడు తిరిగి ఓపెన్ చేయడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మేడిపల్లి ఓసీపీ-4 నుంచి లారీల ద్వారా సీహెచ్‌పీకి బొగ్గు రవాణా చేసే కంట్రాక్టును సింగరేణి యాజమాన్యం ఖరారు చేస్తూ గతంలోనే టెండర్ వెలువరించింది. టెండర్ నోటీస్ నెం. ఇ141300007 తేదీ 10-04-2013ను జారీ చేసింది. దీనికి కొంత మంది కంట్రాక్టర్లు పనిని దక్కించుకునేందుకు ఈఎండీ చెల్లించి టెండర్ వేశారు. ఈ టెండర్లను పరిశీలించిన యాజమాన్యం కాంట్రాక్టర్లు పెద్ద మొత్తంలో డబ్బులను కోట్ చేసిన కారణంగా టెండర్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి టెండర్‌లో పాల్గొన్న వారికి ఈఎండీని తిరిగి చెల్లించింది. 

ఈ వ్యవహారం ముగిసిన తర్వాత తిరిగి తాజాగా అదే టెండర్ షెడ్యూల్డ్ ఆధారంగా మళ్లీ టెండర్ రీ ఓపెన్ చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అనాడు సింగరేణికి నష్టం జరుగుతుందని భావించి రద్దు చేసిన టెండర్‌ను మళ్లీ టెండర్ తేదీ 11-06-2014న నోటీసు నెం. సీఆర్‌పీ/సీఎంసీ/పీసీ/4130000/7/ 1645  ద్వారా గతంలో టెండర్ దాఖలు చేసిన వారికే కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత టెండర్‌లో పాల్గొన్న వారితోనే మరోసారి ఈఎండీ తీసుకొని వారితో ఇప్పటికే ఆరు సార్లు సంప్రదింపులు జరిపి టెండర్‌ను ఖరారు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. సింగరేణి సంస్థకు భారీగా నష్టం చేకూర్చుతుందని భావించి రద్దు చేసిన అదే టెండర్‌ను ఆనాడు టెండర్‌లో పాల్గొన్న వారినే తిరిగి దానిని రీ ఓపెన్ చేసి పిలవడం అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది. ఈ టెండర్‌ను ఎలాగైనా పొందడానికి ఓ రాజకీయ పార్టీకి చెందిన నేత ద్వారా సింగరేణి ఉన్నతాధికారులకు పెద్ద మొత్తంలో ముడుపులు అందడం వల్లే గతంలో మూసివేసిన టెండర్‌ను రీ ఓపెన్ చేసి ఉంటారనే ఆరోపణలు వినవస్తున్నాయి. సింగరేణి విజిలెన్స్ విభాగం విచారణ జరపాలనే డిమాండ్ ఊపందుకుంది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి