గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, జూన్ 13, 2014

మా భూములు మీ అయ్యల జాగీరులా?

-సీమాంధ్ర మాజీ ఎంపీ బంటు బాగోతం
-కబ్జా ధ్రువీకరిస్తూ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ తీర్పు
-ఖాతరు చేయని సీమాంధ్ర అధికారులు
-చర్యలు తీసుకోవడానికి ససేమిరా
-దొంగ పట్టాలకు రాజముద్రలు
-రూ. 30 కోట్ల భూమి హాంఫట్
-ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో బరితెగింపు
ఎక్కడినుంచో వచ్చినోడు ఇక్కడి భూములను అయ్య జాగీరులా కబ్జాలు పెడుతున్నడు. ఈ నేలతో.. ఈ నగరంతో.. ఏ బంధమూ లేనోడు ఈ భూముల మీద పట్టాలు పుట్టిస్తున్నడు. తన చెమట చుక్కైనా తడపని భూమిని కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నడు. నాలుగు రోజుల్లో రాష్ట్రం వదిలిపోవాల్సిన అధికారులు దొంగ పట్టాలకు రాజముద్రలు వేస్తున్నరు. పో పొమ్మన్నా పోకుండా తిష్ఠ వేసిన ఉద్యోగులు పత్రాల మీద పత్రాలు పుట్టిస్తున్నరు. పట్టుబడ్డోళ్లకు పక్కదార్లు చూపుతున్నరు. దొంగలకు సద్దులు కడుతున్నరు. తెలంగాణమా.. గుర్తుంచుకో.. రాష్ట్రం వచ్చినా విముక్తి కాలేదింకా!

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా రాజధానిలో సీమాంధ్ర బడాబాబుల భూ ఆక్రమణల పర్వం ఆగడం లేదు. సొంత రాష్ట్రానికి పోకుండా ఇక్కడే తిష్ఠ వేసిన సీమాంధ్ర ఉద్యోగుల అండదండలతో దొరికిన భూములన్నీ కబ్జాలు పెడుతున్నారు. కోట్ల రూపాయలకు తెగనమ్ముకుంటున్నారు. ఈ కబ్జా బాగోతంలో తాజా కథ.. రాజధాని శివారు ప్రాంతమైన ఫైనాన్షియల్ సిటీలో రూ. 30 కోట్ల విలువ చేసే రెండెకరాల భూమిని సీమాంధ్రకు చెందిన బడాబాబులు కబ్జా చేశారు. అంతేగాక ఈ భూమి తమదేనంటూ దబాయిస్తూ దొంగే దొంగ అన్న చందంగా వ్యవహరించారు. విషయం వీథికెక్కి ఉన్నత విచారణ దాకా వెళ్లింది. సుదీర్ఘ విచారణ అనంతరం రంగారెడ్డి జిల్లా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ భూ ఆక్రమణ జరిగింది వాస్తవమేనని ధ్రువీకరించారు. వెంటనే ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని 32 పేజీల సుదీర్ఘ తీర్పు ఇచ్చారు. అయితే ఆ తీర్పు అమలు కాకుండా ఇక్కడ తిష్ఠ వేసిన సీమాంధ్ర అధికారులు సర్వశక్తులు ఒడ్డారు. వీరి మంత్రాంగంతో కొంత మంది రెవెన్యూ అధికారులను బడాబాబులు లోబర్చుకున్నారు.
land
దీనితో కబ్జా భూములు స్వాధీనం చేసుకోవాల్సిన అధికారులు మౌనం దాల్చారు. ఎందుకని అడిగితే అప్పీల్‌కు వెళ్లి స్టే తెచ్చుకుంటారని, అందుకే తాము స్వాధీనం చేసుకోవడం లేదని కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారు. భూమిని స్వాధీనం చేసుకోవాలని స్పష్టమైన ఆదేశాలున్నా కావాలనే రెవెన్యూ అధికారులు కాలయాపన చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజధాని శివారు ప్రాంతమైన పుప్పాలగూడ రెవెన్యూ గ్రామ పరిధిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని సర్వేనంబర్ 304లో ఉన్న 18 ఎకరాల 11 గుంటల భూమి కాందీశీకులకు చెందినది. ఈ భూమిలో నాలుగు ఎకరాల భూమిని వడ్డె జంగయ్య 1950 కి ముందు నుంచి సాగు చేసుకుంటున్నారు. ఈ భూమిని నమ్ముకొని జీవిస్తున్న వడ్డెజంగయ్య కుటుంబం తనకు ఈ భూమిని క్రమబద్ధీకరించాలని ప్రభుత్వానికి ఆర్జీ పెట్టుకున్నారు. ఆర్జీని పరిశీలించిన ప్రభుత్వం ఫైల్ నెంబర్ డీ3/5187/93 పేరుతో 16-12-1994లో క్రమబద్ధీకరించింది. 1995 జనవరి 5వ తేదీన పూర్తి హక్కులు దఖలు పరుస్తూ సేల్ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది.

ఆ తరువాత రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు 1995-96,1996-97లలో ఆర్వోఆర్‌లో రిజిస్టర్ చేసి పట్టాదార్ పాస్ పుస్తకాన్ని కూడా ఇచ్చారు. టైటిల్ డీడ్ కూడా వచ్చింది. ఈ మేరకు 18 ఎకరాల 11 గుంటల భూమిలో నుంచి జంగయ్య కుటుంబం వ్యవసాయం చేసుకుంటున్న 4 ఎకరాల భూమిని డీమార్క్ చేసి, మిగతా భూమిని సర్కారు స్వాధీనం చేసుకున్నది. ఇంత వరకు బాగానే ఉన్నా ఇక్కడ భూముల విలువ అమాంతం పెరిగిపోవడంతో సీమాంధ్రకు చెందిన బాలాజీ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈ భూమి కన్నేశాడు. ఓ మాజీ ఎంపీకి బంధువుగా చెప్పుకునే బాలాజీ 2005లో ఇక్కడ రంగప్రవేశం చేయడంతో సీన్ తారుమారైంది. ఈ 304 సర్వే నెంబర్ ఆర్డర్‌లోనే ఉన్న మరో భూమి 298 సర్వేనెంబర్‌లో 9 ఎకరాల 18 గుంటల భూమికి యాజమాన్య హక్కులు పొందిన వడ్డె సత్తయ్యను రంగంలోకి దించారు.

వాస్తవానికి 298 సర్వేనెంబర్‌లో ఉన్న 18 ఎకరాల 36 గుంటల భూమిలో వడ్డె జంగయ్య, వడ్డెసత్తయ్యలకు చెరో 9 ఎకరాల 18 గుంటల భూమిని ప్రభుత్వం 1995 లో ఇచ్చింది. అలాగే జంగయ్యకు అప్పటికే సాగు చేసుకుంటున్న 304 సర్వేనెంబర్‌లోని నాలుగుఎకరాల భూమిని కూడా ఇచ్చింది. ఇదంతా ఒకే ఆర్డర్‌లో ఉన్నది. హైదరాబాద్‌లో ఏవిధంగా భూములు కబ్జా చేయాలా అని నిరంతరం ఆలోచన చేసే ఈ బడాబాబులు రెవెన్యూ విభాగంలో ఉన్న అధికారులను లోబర్చుకొని ఫైనాన్షియల్ సిటీలో ఉన్న 304 సర్వేనెంబర్‌లోని భూమి రికార్డులను తారు మారు చేశారు. బాలాజీ అనే మహా మాయగాడు పహాణిలో వడ్డెజంగయ్య పేరుతో ఉన్న భూమిలో సత్తయ్య పేరును చేర్చారు. తిన్నగా జంగయ్య భూమి పక్కనే ఉన్న రెండెకరాలను కబ్జా చేశారు. ఈ విషయాలు తెలియని జంగయ్య కుటుంబం తమ భూమి అయితే కాదుకదా అని మిన్నకున్నారు. ఇదే అవకాశంగా తీసుకున్న సదరు బడాబాబు వడ్డె సత్తయ్య పేరుతో భూమిని మ్యూటేషన్ చేయించారు. ఆ తరువాత బాలాజీకి అమ్మినట్లు రికార్డులు తయారు చేశారు. ఆ తరువాత బాలాజీ అందులో జామ తోట పెట్టారు.

ఆ తర్వాత తిన్నగా జంగయ్య భూమికి ఎసరుపెట్టారు. 304 సర్వేనెంబర్‌లో జంగయ్యకు, సత్తయ్యకు చెరో రెండు ఎకరాల భూమి ఇచ్చారని ఆర్డర్ ముందు పెట్టి పేచీలు పెట్టారు. దీనికి రకరకాల డాక్యుమెంట్లు సృష్టించారు. దీనిపై వడ్డె జంగయ్య తరపు వాళ్లు డిప్యూటీ కలెక్టర్ కోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ చేసిన న్యాయస్థానం వడ్డెసత్తయ్య పేరుతో వచ్చిన డాక్యుమెంట్లన్నీ తప్పని తేల్చింది. వీఆర్‌ఓతో కొల్యూడ్ అయి రికార్డులలో పేర్లు చొప్పించారని, 1995లో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం 304 సర్వేనెంబర్‌లో వడ్డె జంగయ్యకు మాత్రమే నాలుగు ఎకరాల భూమిని ఇచ్చారని తెలిపింది. వెంటనే మిగిలిన 14 ఎకరాల 11 గుంటల భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత కూడా ఇక్కడ తిష్ఠ వేసిన సీమాంధ్ర రెవెన్యూ అధికారులు కావాలనే ఈ భూమిని స్వాధీనం చేసుకోవడం లేదని సమాచారం. పైగా సదరు అధికారులు భూమిని స్వాధీనం చేసుకోకుండా అప్పీల్‌కు వెళతారని బడాబాబులే ప్రచారం చేసుకుంటున్నారంటే ఎంతగా కలిసిపోయారో అర్థం చేసుకోవచ్చు. అప్పీల్‌లో స్టే వస్తుందని, దీంతో డిప్యూటీ కలెక్టర్ ఇచ్చే తీర్పుకు విలువ ఉండదని ఫలితంగా తాము కబ్జా చేసిన భూమిని తిరిగి తీసుకోవడం తెలంగాణ ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదని సీమాంధ్ర బడాబాబులు సవాళ్లు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంపై తక్షణమే దృష్టి సారించి బడాబాబుల కబ్జాలనుంచి విలువైన ప్రభుత్వ భూములను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.

(నమస్తే తెలంగాణ దినపతిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి