గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, జూన్ 11, 2014

శాసింపబడే స్థాయినుండి...శాసించే స్థాయికి...


-ప్రొటెం స్పీకర్‌గా జానారెడ్డి.. తొలుత కేసీఆర్, తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేల ప్రమాణం
- తొలిరోజు 117 మంది సభ్యుల ప్రమాణం .. సభకు హాజరుకాని అక్బరుద్దీన్, ముంతాజ్ అహ్మద్
-రెండుగంటలపాటు సాగిన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం

చారిత్రక ఘట్టం మొదలైంది. తెలంగాణ తొలి శాసనసభ ఏర్పాటైంది. తెలంగాణ నినాదాలతో దద్దరిల్లిన చోటే తెలంగాణ అసెంబ్లీ కొలువుదీరింది. ఇన్నాళ్లూ సీమాంధ్రుల వలస పాలనలో అణిచివేతకు గురైన తెలంగాణ ఇప్పుడు శాసించే స్థాయికి చేరుకుంది. సోమవారం ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ శాసనసభ ప్రారంభమైంది. ప్రొటెం స్పీకర్‌గా కుందూరు జానారెడ్డి అధ్యక్ష స్థానంలో కూర్చున్న మరుక్షణమే జనగణమన జాతీయగీతంతో తెలంగాణ అసెంబ్లీ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

జాతీయగీతం ముగియగానే సభలో ఒక్కరిద్దరు సభ్యులు జై తెలంగాణ నినాదాలుచేశారు. ప్రొటెం స్పీకర్ జానారెడ్డి సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ శాసనసభ సభ్యులుగా తొలుత ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు, తర్వాత మంత్రులు, ఆ తర్వాత అన్ని పార్టీల మహిళాసభ్యులు, అనంతరం అక్షరక్రమంలో మిగతా ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారని జానారెడ్డి ప్రకటించారు. ముందుగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేసి ప్రొటెం స్పీకర్ వద్దకు వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత రిజిస్టర్‌లో సంతకం చేసిన కేసీఆర్ సభాపక్ష నేతల వద్దకు వెళ్ళి కరచాలనం చేసి అభినందనలు తెలిపారు. ఆ తర్వాత సభలో ముఖ్యమంత్రి కూర్చునే స్థానంలో కేసీఆర్ ఆసీనులయ్యారు. ఆ తర్వాత మంత్రులు తాటికొండ రాజయ్య, ఈటెల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, జోగు రామన్న, కే తారకరామారావు, పీ మహేందర్‌రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, టీ పద్మారావు, టీ హరీశ్‌రావు ప్రమాణం చేశారు.

మహిళా సభ్యుల్లో అజ్మీరా రేఖానాయక్, డీకే అరుణలు ముందుగా ప్రమాణం చేయగా, ఇతర సభ్యుల్లో మొదట బలాల, పువ్వాడ అజయ్‌లతో ప్రమాణస్వీకార కార్యక్రమం మొదలైంది. తెలంగాణ ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం దాదాపు రెండుగంటల పాటు సాగింది. తెలంగాణ అసెంబ్లీ సభ్యులుగా ప్రమాణం చేసిన సభ్యులను ప్రొటెం స్పీకర్ జానారెడ్డి ఆలింగనం చేసుకుని అభినందించారు. ఉదయం 11.06 గంటలకు సభ ప్రారంభం కాగా, సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం మధ్యాహ్నం 1.08 గంటలకు పూర్తి అయ్యింది. దీంతో సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రొటెం స్పీకర్ జానారెడ్డి ప్రకటించారు. సభ్యుల్లో ఎక్కువ మంది దైవసాక్షిగా ప్రమాణం చేయగా, ఐదారుగురు మాత్రం మనస్సాక్షిగా ప్రమాణం చేశారు. అజ్మీరా రేఖానాయక్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పద్మావతితో పాటు షకీల్ అహ్మద్ ఆంగ్లంలో, బీజేపీ సభ్యుడు రాజాసింగ్ హిందీలో, మజ్లిస్ సభ్యులు ఉర్దూలో ప్రమాణంచేశారు.

తొలి స్పీకర్ మధుసూదనాచారి 
-అన్ని పార్టీల మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నిక
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తొలి స్పీకర్‌గా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం స్పీకర్ పదవికి నామినేషన్లు స్వీకరించగా మధుసూదనాచారి మినహా మరెవ్వరూ నామినేషన్‌వేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. అయితే ఈ ఎన్నికను నేడు ప్రొటెం స్పీకర్ జానారెడ్డి అధికారికంగా ప్రకటిస్తారు. తెలంగాణ తొలి స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు అధికార పక్షం గత రెండు రోజులుగా వివిధ పార్టీల నాయకులతో సంప్రదింపులు జరిపింది. దీనితో మధుసూదనాచారి ఏకగ్రీవ ఎన్నికకు మార్గం సుగమమైంది.

Madhusudhana-charyసోమవారం అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మధుసూదనాచారిని తోడ్కొని సభలోని వివిధ పక్షాల నేతలంతా వెంటరాగా అసెంబ్లీ సెక్రెటరీ రాజా సదారాం కార్యాలయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, బీజేపీఎల్‌పీ నేత లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, గీతారెడ్డి, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, సీపీఎం ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రనాయక్, ఎంఐఎం ఎమ్మెల్యేలు బలాల, మ్హొహియుద్దీన్, వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు పీ వెంకటేశ్వర్లు, టీ వెంకటేశ్వర్లు, మదన్‌లాల్‌లు మధుసూదనాచారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ సంతకాలు చేసిన నామినేషన్ పత్రాలను సదారాంకు అందచేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్‌రావు, ఈటెల రాజేందర్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కృష్ణారెడ్డి, బీఎస్‌పీ ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఇంద్రకరణ్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. సాయంత్రం వరకుకూడా ఒకే నామినేషన్ దాఖలు కావడంతో మంగళవారం మధుసూదనాచారిని స్పీకర్‌గా ప్రకటించనున్నారు.

మధుసూదనాచారి ప్రొఫైల్

పేరు : సిరికొండ మధుసూదనాచారి
భార్య పేరు : సిరికొండ ఉమాదేవి
పిల్లలు : ప్రదీప్, ప్రశాంత్, క్రాంతి
చదువు : ఎంఏ (ఇంగ్లీష్)
మొదటిసారిగా సభకు : 1994-99కాలంలో తెలుగుదేశం ఎమ్మెల్యే.

తెలంగాణ ఉద్యమం ప్రారంభం అవుతున్న సమయంలో కేసీఆర్‌కు దగ్గరయ్యా రు. పార్టీ స్థాపనకు 8 నెలల ముందునుంచే చురుగ్గా పనిచేశారు. పార్టీ ప్రతి ప్రస్థానంలో మధుసూదనాచారి అడుగులున్నాయి. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం పార్టీలో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు

ఇప్పుడు : 2014 సార్వత్రిక ఎన్నికల్లో భూపాలపల్లి అసెంబ్లీ స్థానం నుండి 7300ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు

గతం : 1994లో అసెంబ్లీకి మొదటిసారిగా ఎన్నికై వచ్చే సమయం నాటికి రాష్ట్రవ్యాప్తంగా పత్తిరైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీన్ని చూసి చలించిపోయిన మధుసూదనాచారి పత్తిరైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం దష్టికి తెచ్చేందుకు పురుగుల మందును సభలోకి తెచ్చా రు. ఈ సమయంలోనే సభ్యులు గుర్తించి దాన్ని బయటకు తీసుకెళ్లారు.

ప్రొటెం స్పీకర్‌గా జానారెడ్డి

-మండలి చైర్మన్‌గా విద్యాసాగర్‌రావు..
-ప్రమాణం చేయించిన గవర్నర్
-హాజరైన సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
janareddyతెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ సభ్యుడు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, తెలంగాణ శాసన మండలి ఛైర్మన్‌గా నేతి విద్యాసాగర్‌రావులతో సోమవారం ఉదయం గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్నికైన ఎమ్మెల్యేలతో సభలో స్పీకర్ ప్రమాణం చేయించాల్సి ఉంటుంది.

vidyasagarశాసనసభ స్పీకర్ ఎన్నిక కానందున, సంప్రదాయం ప్రకారం కొత్త సభ ఏర్పాటైనప్పుడు ప్రొటెం స్పీకర్ సభ్యులతో ప్రమాణం చేయిస్తారు. సభలో సీనియర్ సభ్యుడు ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరిస్తారు. ప్రస్తుత అసెంబ్లీలో సీనియర్ సభ్యుడైన కాంగ్రెస్ ఎమ్మెల్యే జానారెడ్డిని ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో జానారెడ్డి ప్రొటెం స్పీకర్‌గా సోమవారం సమావేశాల తొలిరోజున కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుత శాసన మండలి సభ్యులు గతంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులుగా ప్రమాణం చేసినందున, కొత్తగా ఏర్పడిన తెలంగాణ మండలి సభ్యులుగా ఇప్పుడు మరోసారి ప్రమాణంచేయడం అనివార్యమైంది.

రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి వైస్‌చైర్మన్‌గా తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతి విద్యాసాగర్‌రావు వ్యవహరించారు. విభజన అనంతరం ఏర్పడే తెలంగాణ మండలికి విద్యాసాగర్‌రావు చైర్మన్‌గా కొనసాగుతారంటూ రాష్ట్ర పునర్వవ్యవస్థీకరణ బిల్లు పేర్కొంది. దీంతో తెలంగాణ మండలి చైర్మన్‌గా వ్యవహరించిన విద్యాసాగర్‌రావు సమావేశాల తొలి రోజున తెలంగాణ ప్రాంత శాసన మండలి సభ్యులతో మండలిలో ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు రాజ్‌భవన్‌లో ఉదయం 9.30 గంటలకు ప్రొటెం స్పీకర్‌గా జానారెడ్డి, తెలంగాణ శాసనమండలి చైర్మన్‌గా నేతి విద్యాసాగర్‌రావులతో గవర్నర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఛైర్మన్ డాక్టర్ చక్రపాణితో పాటు ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇద్దరిదీ ఒకటే జిల్లా...

తెలంగాణ రాష్ట్ర శాసనమండలి, శాసనసభల్లో కీలక పదవుల్లో నిర్వహించిన నేతలిద్దరిదీ నల్లగొండ జిల్లానే కావడం విశేషం. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నుంచి గెలుపొందిన జానారెడ్డి తెలంగాణ తొలి అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించగా, తెలంగాణ తొలి శాసన మండలి చైర్మన్‌గా నల్గొండ జిల్లాకే చెందిన ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌రావు బాధ్యతలు నిర్వహించారు. కాగా శాసన మండలిలో మరో ఆసక్తికరమైన దశ్యం కనిపించింది. మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేతగా, పార్టీ పక్ష నేతగా నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డీ శ్రీనివాస్ వ్యవహరిస్తే, పార్టీ డిప్యూటీ లీడర్‌గా అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ షబ్బీర్ అలీకి అవకాశం లభించింది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి