గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, జూన్ 05, 2014

బంగారు తెలంగాణ సాధిస్తాం : గజ్వేల్ సభలో సీఎం కేసీఆర్

రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చి దిద్దుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు ఎన్నో కలలతో టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తెచ్చారని, వారి కలలను సాకారం చేయాల్సిన బాధ్యత టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఉందని కేసీఆర్ అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ నెరువేరుస్తామని పునరుద్ఘాటించారు. 


రాజకీయ అవినీతిని నూటికి నూరు శాతం అంతం చేస్తామని, రాజకీయ అవినీతి అంతమైతేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, రాజకీయ అవినీతికి పాల్పడే వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని కేసీఆర్ అన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారిగా మెదక్ జిల్లాలోని తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌కు కేసీఆర్ వచ్చారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు చెప్పారు. గజ్వేల్‌ను రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేస్తానని, తనను అఖండ మెజార్టీతో గెలిపించిన గజ్వేల్ ప్రజల రుణం తీర్చుకుంటానని సీఎం అన్నారు. 

సంక్షేమానికి పెద్ద పీట వేస్తాం 
తెలంగాణ వస్తే మానిధులు, మా నీళ్లు, మా ఉద్యోగాలు మాకే వస్తాయని తెలంగాణ ప్రజలు కోటి ఆశలతో ఉన్నారని, వారి ఆశలను నెరవేర్చే దిశగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకు పోతుంది అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ముఖ్యంగా సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని, ఇందులో భాగంగా దళిత, ముస్లిం, క్రైస్తవ మైనార్టీలు, బీసీలకు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పారు. ఒక్క రూపాయి కూడా వృథా కాకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని సీఎం చెప్పారు. 

మెరుగైన వైద్య సేవలు అందిస్తాం 
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ లక్ష్యాల్లో ఒకటని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికలకు ముందు చెప్పినట్లు ప్రతి జిల్లాకో నిమ్స్ స్థాయి ప్రభుత్వాసుపత్రిని నెలకొల్పుతామని, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా ఆధునీకరిస్తామని సీఎం చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో కార్పొరేట్ స్థాయిలో ఒక ఏరియా ఆసుపత్రిని నిర్మిస్తామన్నారు. 

వ్యవసాయానికి అగ్రతాంబూలం 
వ్యవసాయం అభివృద్ధి చెందితేనే ఈ రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాయని సీఎం కీసీఆర్ అన్నారు. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి పెద్ద పీట వేస్తామని, విత్తన ఉత్పత్తికి అనుకూలంగా ఉన్న తెలంగాణలో అందకు కావల్సిన పరిశోధనలు చేసి సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా రాష్ట్రాన్ని తయారు చేస్తామన్నారు. గ్రీన్ హౌస్ వ్యవసాయాన్ని పైలెట్ ప్రాజెక్టు చేపడతామని, కమతాల ఏకీకరణ చేపడతామని చెప్పారు. ఎన్నికల ముందు చెప్పినట్లు రైతులందరికీ పంట రుణాలు మాఫీ చేస్తామని సీఎం స్పష్టం చేశారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి