గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, జూన్ 27, 2014

స్థానికత నిరూపణకై...కటాఫ్...1956...!

-విద్యార్థుల స్థానికతకు ఇదే ప్రమాణం
-పోగొట్టుకున్న చోటే వెతికి పట్టుకుంటున్న తెలంగాణ
- అసలైన తెలంగాణ పిల్లలకే ఫీజులు..
-సూత్రప్రాయంగా నిర్ణయించిన పభుత్వం
- స్థానికతను విద్యార్థులే నిరూపించుకోవాలి..
- వారం రోజుల్లో విధానపరమైన నిర్ణయం
collegeతెలంగాణ ప్రభుత్వం తాజా నిర్ణయం 1956 అమలులోకి వస్తే.. పూర్వం స్థిరపడిన వారికే ఫీజులు చెల్లిస్తే తెలంగాణలో చదువుతున్న సీమాంధ్ర పిల్లల సంఖ్య భారీగా బట్టబయలయ్యే అవకాశం ఉంది. సీమాంధ్రలో కూడా తెలంగాణ విద్యార్థులు 18 వేలమంది చదువుతున్నారని అధికారులు గుర్తించారు. వీరికి తెలంగాణ ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుందని ఇప్పటికే ప్రకటించింది. జూలై మొదటివారంలో ఇంజినీరింగ్ అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ లోగా ఫీజుల చెల్లింపునకు సంబంధించి ప్రభుత్వం ఫీజురీయింబర్స్‌మెంట్‌పై విధి విధానాలు రూపొందించి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. 
పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి. అవును తెలంగాణ తనను తాను పోగొట్టుకున్న 1956 దగ్గరే తనను వెతుక్కోవాలి. అందుకే విద్యార్థుల స్థానికత నిర్ధ్దారణకు ఆ 1956నే ప్రామాణికంగా నిర్ధ్దారించబోతున్నది. 1956 ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు పూర్వంనుంచి తెలంగాణలో నివాసం ఉంటున్న తెలంగాణవాసుల పిల్లలకే ఫీజు పథకం వర్తింపజేయాలని సూత్రప్రాయంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దీనిప్రకారం ఫీజు రీయింబర్స్‌మెంట్ కోరే విద్యార్థుల తల్లిదండ్రులు, తాతలు తెలంగాణకు చెందినవారని విద్యార్థులు నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను విద్యార్థులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా కేవలం నిజమైన తెలంగాణ పిల్లలు మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి చెందినవారమని నిరూపించుకోగలరు. 1956 తర్వాత వలస వచ్చినవారు, సీమాంధ్రులు తెలంగాణ స్థానికతను నిరూపించుకోలేరు. ఇప్పటి వరకు సీమాంధ్రులు ఉమ్మడి రాష్ట్రంలో దొంగ సర్టిఫికెట్లతో, నకిలీ తెలంగాణ స్థానికతతో చొరబడి తెలంగాణ ఉద్యోగాలు, విద్యావకాశాలు కొల్లగొట్టిన అంశాలను తెలంగాణ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాశాఖ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సమీక్ష నిర్వహించారు. స్థానికతపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా నిజాం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ముల్కీ నిబంధనలపై సవివరంగా చర్చించింది. ముల్కీ నిబంధనల ప్రకారం తెలంగాణలో పుట్టిన బిడ్డ తాను పుట్టే నాటికి తండ్రి 15 ఏళ్లు తెలంగాణలో నివాసం ఉండాలి. ఇది నిబంధన. ఈ నిబంధనలో కొన్ని మార్పులు చేస్తూ ఆరు దశాబ్దాలుగా తెలంగాణలో నివాసంలో ఉన్న వారికే అనగా 1956కు పూర్వం తెలంగాణలో నివాసం ఉన్న వారికే ఫీజులు చెల్లించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అడ్వకేట్లు, విద్యావేత్తలతో చర్చించి వారం రోజుల్లో ఫీజుల పథకంపై విధానపరమైన నిర్ణయానికి రావాలి అని ప్రభుత్వం భావిస్తోంది. మన రాష్ట్ర విద్యార్థులు ఆంధ్రాలో చదువుతున్నా ఫీజులు చెల్లించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయానికి వచ్చింది. సంక్షేమ శాఖ అధికారుల లెక్కల ప్రకారం తెలంగాణలో సీమాంధ్ర విద్యార్థులు 39 వేల మంది వరకూ చదువుతున్నారు.
అసలైన తెలంగాణ వారికే...ప్రభుత్వ నిర్ణయమే అమలులోకి వస్తే అసలైన తెలంగాణ వాసుల బిడ్డలకే ఫీజుల పథకం వర్తించే అవకాశం దక్కుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో స్థానికత అనే అంశాన్ని భ్రష్టు పట్టించి ఇష్టారాజ్యంగా సీమాంధ్రులు తెలంగాణలో చొరబడ్డారు. బస్‌స్టాండ్‌లో కాలు పెట్టినవాడల్లా స్థానికుడే అనే రీతిలో స్థానికత అంశాన్ని నవ్వులపాలు చేశారు. కేవలం నాలుగు సంవత్సరాలు చదివిన వాడల్లా స్థానికుడినేనంటూ తయారయ్యారు.
అడ్మిషన్లు యధాతథమే..ఆంధ్ర ప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టం 2014 ప్రకారం పదేళ్లపాటు ప్రస్తుతం అమలు అవుతున్న అడ్మిషన్ల విధానం కొనసాగించాలి. కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని గౌరవిస్తూ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగిస్తారు. అయితే విద్యార్థుల ఫీజుల అంశం ఆయా రాష్ర్టాల ఇష్టాన్ని బట్టే ఉంటుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి తనకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోజాలదు. ఈ నేపథ్యంలో అడ్మిషన్ కౌన్సెలింగ్ ఆలస్యం కాకుండా, ఏఒక్క తెలంగాణ విద్యార్థికి అన్యాయం జరగకుండా ఉండే విధంగా ప్రభుత్వం విధాన పరమైన నిర్ణయం తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది. కేజీ నుంచి పీజీ ఉచిత నిర్భంద విద్య అందించేందుకు ఒక అధ్యయన కమిటీ వేయాలని నిర్ణయించింది. కమిటీ అధ్యయన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి జి జగదీశ్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి సమీక్షా విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్, కళాశాల విద్యా కమిషనర్ శైలజారామయ్యర్, పాఠశాల విద్యా కమిషనర్ జగదీశ్వర్ పాల్గొన్నారు.
సుప్రీం తీర్పుకు పట్టాభిషేకం..రాష్ట్రాల పునర్విభజన చట్టం ప్రజల ప్రాథమిక హక్కులను హరించేందుకు కాదు 1972 అక్టోబర్ 3న ముల్కీ నిబంధనలు చెల్లుతాయని తీర్పు ఇచ్చిన సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యానమిది. సరిగ్గా ఈ హక్కునే ఉమ్మడి రాష్ట్రం హరించింది. 1919లో నిజాం ఇచ్చిన స్థానికత ఫర్మానాను కాలరాచింది. పుట్టుక ద్వారా కానీ, నివాసం ద్వారా కానీ 15 ఏళ్లు ఈ నేలతో బంధం ఉన్నవాడికే ఇక్కడ ఉద్యోగాలు ఉంటాయని ఆ ఫర్మానా శాసించింది. 1950లో అమలులోకి వచ్చిన రాజ్యంగం కూడా భారత భూభాగం, సంస్థానాల్లో ఉన్న చట్టాలు కొనసాగుతాయని హామీ ఇచ్చింది. 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం కూడా పెద్దమనుషుల ఒప్పందానికి చట్టబద్దత కల్పించింది. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, బొంబాయి రాష్ట్రాలకు ప్రత్యేక మినహాయింపులు ఇస్తూ 371 ఆర్టికల్‌కు సవరణ చేసింది. ఇవన్నీ తెలంగాణ స్థానికతకు విలువనిచ్చినవే. వీటన్నింటినీ మించి 1972లో అత్యున్నత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు చిరస్మరణీయం. అయినా సీమాంధ్రులు కుట్రపూరితంగా స్థానికతను నీరుగార్చారు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం సంపూర్ణం కాకపోవచ్చు గానీ సంస్మరణీయమే. సుప్రీం తీర్పును శిరసావహించడమే.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి