తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొన్నాం. అనేక పోరాటాలు చేశాం. అదే స్ఫూర్తితో రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. అరవై ఏండ్ల వలసపాలనలో విచ్ఛిన్నమైపోయిన ఆర్థిక, రాజకీయ, సామాజిక సాంస్కృతిక వ్యవస్థలను పునర్నిర్మించుకోవాలి.
తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం ఒక ఎత్తు. రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించే కర్తవ్యం మరోఎత్తు. అందుకే నేడు ప్రజలు ప్రజాస్వామిక వాదులు, అభ్యుదయ వాదులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరూ గురుతర బాధ్యతగా భావిస్తే తెలంగాణ అభివృద్ధి వేగంగా సాధ్యమవుతుంది. తెలంగాణ ప్రజలు ఏ ఆశ లు, ఆకాంక్షల కోసం ప్రాణాలు త్యాగం చేశారో.. ఆ ఆశయ సాధన కేవలం పునర్నిర్మాణం ద్వారానే సాధ్యమవుతుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా వలసపాలకుల పెత్తనాలు ఇంకా కొనసాగుతున్నాయి. అందుకే రాష్ట్ర పునర్నిర్మాణం ఎలా? ఆంధ్ర వలస పాలకులు అంటే ఆంధ్ర ప్రాంత ప్రజలు కాదని, ఆంధ్ర ప్రాంత వలస పాలకులు మాత్రమేనని టీఆర్‌ఎస్ స్పష్టం చేసింది. ఆచరణ ద్వారా రుజువు చేసింది. ఆంధ్ర ప్రాంత సంపన్న పాలకవర్గం అరవై ఏళ్లు పాలించారు. ఈ ప్రాంతం పట్ల వివక్ష చూపారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఇక్కడి వనరులు, వ్యవసాయం, పరిశ్రమలు, గనులు, నిక్షేపాలు అన్నింటిని కాపాడుకొని తెలంగాణ ప్రజలకు చెందేలా కృషిచేయాలి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, పక్షపాత వైఖరిని, ఆంధ్ర పాలకుల కుట్రలను ఓడించాలి.
తెలంగాణ రాష్ట్ర విభజన జరిగి 16 నెలలు అయింది ఇప్పటికీ 231 ప్రభుత్వరంగ సంస్థల విభజన జరుగలేదు. ప్రభుత్వ సంస్థల, శాఖల విభజన జరిగితే మరో యాభై వేల కోట్ల రూపాయల ఆస్తులు తెలంగాణకే చెందుతాయి. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు మార్గం సులువవుతుంది. విభజన చట్టంలోని 9,10 షెడ్యూల్‌లో పొందుపరిచినట్లుగా, అలాగే రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం 2014లో విభజన జరగడానికి కావలసిన అన్ని సెక్షన్లు ఉన్నా ఆంధ్ర పాలకులు మోకాలడ్డుతున్నారు. కేంద్రం బయ్యారం స్టీల్ ప్లాంట్, ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడంలో నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, హార్టీకల్చర్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ విషయంలో కాలయాపన చేస్తున్నది. తెలంగాణలో 6300 కిమీ మేర రోడ్డును ప్రతిపాదిస్తే 1200 కి.మీ. రోడ్లకు మాత్ర మే కేంద్రం అనుమతించింది. రేషన్ బియ్యం కోటా, బడ్జెట్ కేటాయింపుల్లో, ఎన్టీపీసీ విద్యుత్ పాంట్ల పట్ల వివక్ష చూపుతున్నది. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించాలి. తెలంగాణ అభివృద్ధి కోసం అనేక ఆటంకాలను అధిగమించాలి.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలు, పునర్నిర్మాణం కోసం చేపట్టిన కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలి. అందరూ ఐక్యంగా కదలాలి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎలా ఉమ్మడిగా ఉద్యమించామో రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా ఐక్యంగా కదలాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పట్ల కనబరుస్తున్న చిత్తశుద్ధిని అర్థం చేసుకోవాలి.
తెలంగాణ అభివృద్ధి కూడా ఆందోళనలో, ఆరాటంలో భాగమేనని గుర్తించలేని వారు పునర్నిర్మాణంలో భాగస్వాములు కాకుండా పారిపోతారు. ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 18 నెలలు గడిచింది. ఆంధ్రా పాలకుల కుట్రలు, ఎలా పట్టి పీడిస్తున్నాయో అర్థం చేసుకోవాలి. మధ్యప్రదేశ్‌లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కేవలం ఆరు నెలల కాలంలోనే అన్ని విభజనలు జరిగిపోయాయి. ఉమ్మడిగా ఉన్న అనేక సమస్యలు సులభంగా పరిష్కారమయ్యాయి. కానీ తెలంగాణలో కాలయాపన జరగడానికి ఆంధ్ర వలసపాలకుల కుట్రలు, కేంద్రం నిర్లక్ష్య వైఖరి అనేది వాస్తవం.
ఆంధ్ర వలసవాదుల ఆధిపత్యం అన్నిరంగాలతో పాటు మీడియా రంగంపై ఉన్నది. దుష్ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. తెలంగాణ అభివృద్ధిని ఆవగింజంత చూపించి, లోపాలను తాటికాయంత చూపించడం వీరి నైజం. ఆరోపణ కోసం ఆరోపణ, విమర్శ కోసం విమర్శ అనే వింత పోకడను ప్రదర్శిస్తున్నారు.
ఉదాహరణకు- మిష కాకతీయ అనే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. చెరువుల పునరుద్ధరణ పని ప్రారంభమైనప్పటి నుంచి ఇది కమీషన్ మిషన్ అనీ, కాంట్రాక్టుల కోసమని అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. నిజాం కాలంలో తవ్విన చెరువులను ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర వలస పాలకులు ఎంత ఘోరంగా నిర్లక్ష్యం చేశారో తెలిసిందే. ఇక ఆక్రమణల సంగతి సరే సరి. అరవై ఏండ్ల నాటి నుంచి ఏ ఒక్క రాజకీయ పార్టీ.. చెరువుల గురించి పట్టించుకున్న పాపానపోలేదు. ప్రతిపక్షాలు మిషన్ కాకతీయపై దుమ్మెత్తి పోసినా ప్రజలు మాత్రం సంతోషంగా స్వాగతం పలుకుతున్నారు. రైతుల ఆత్మహత్యలపై ప్రచారం చేసిన వీరు రైతులకు భరోసా కల్పించే కర్తవ్యం గానీ, ఆత్మహత్యల నివారణకు ఏ ఒక్క కార్యక్రమం కానీ చేపట్టకపోగా రైతుల సమస్యలను రాజకీయ ప్రచారం కోసం వినియోగించుకున్నారు. తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆ పని అప్రజాస్వామిక చర్యగానే భావించాలి.
ప్రతిపక్ష పార్టీలు, వామపక్ష పార్టీలు, కొన్ని సంఘాలు తెలంగాణ అభివృద్ధి గురించి కాకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే కార్యక్రమానికి పూనుకున్నాయి. తప్పుడు అవగాహన కలిగిన వీరు, అసహనంతో మాట్లాడుతూ జరుగరానిది ఏదో జరిగిపోయిందని ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడటంతోనే తిరిగి దొరల రాజ్యం ఏర్పడినట్లు, భాగస్వామ్య వ్యవస్థ మళ్లీ పుట్టిందన్నట్లు ప్రచారం చేస్తున్నారు. వీరికి ఒకటే సమాధానం. ఇది వర్గ వ్యవస్థ, భూస్వా మ్య వ్యవస్థ కూలిపోలేదు. కానీ మళ్లీ పుట్టిందని మాట్లాడుతున్నారు. వర్గ వ్యవస్థ ఉన్నంత కాలం అణచివేత, నిర్బంధం ఉంటుంది. ఇది వాస్తవం. నిర్బంధాలు, దాడులను నిరసించడం, వ్యతిరేకించడం కంటిన్యూగా సాగే ఉద్యమ క్రమం. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగే పోలీసుల చర్యల గురించి గోల పెడుతున్నారు. ఆంధ్ర వలస పాలనలో ఎన్‌కౌంటర్ హత్యల పట్ల మౌనం వహించినవారు కూడా.. స్థల, కాల, నూతన పరిణామాల పేరిట నయా కుట్రలు పన్నుతున్నారు. అభివృద్ధిని అడ్డుకుంటూ, అప్రతిష్ట పాలు జేసేందుకు మీడియాను ఆయుధంగా వినియోగించుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొన్నాం. అనేక పోరాటాలు చేశాం. అదే స్ఫూర్తితో రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. అరవై ఏండ్ల వలసపాలనలో విచ్ఛిన్నమైపోయిన ఆర్థిక, రాజకీయ, సామాజిక సాంస్కృతిక వ్యవస్థలను పునర్నిర్మించుకోవాలి. ఇందుకోసం ప్రజల అండదండలు, సంపూర్ణ మద్దతు కావాలి. ఆందోళనలు, నినాదాలు, ఉద్యమాల స్థానంలో పటిష్టమైన నిర్మాణం, అభివృద్ధి సాధించి తీరాలి. దీనికోసం ప్రభుత్వాల మద్దతు కావాలి. లేదంటే జరుగుతున్న పొరపాట్లను ఎత్తిచూపాలి. ప్రజానుకూలంగా పాలన సాగేట్లు చూడాలి.
అదే సమయంలో ఆయా పార్టీలు ప్రజా సంఘాల నాయకత్వంలో ప్రజలను కదిలించే పోరాట పటిమ ఉందని, ఉద్యమ స్ఫూర్తి ఉందని అనుకోవడంతోనే సరిపోదు. ప్రజా ఆకాంక్షలను గుర్తించి వాటికి అనుగుణంగా నడుచుకోవాలి. ఈ స్థితిలో ఉద్యమాలు ముందుకు వెళ్లాలి. ఉద్యమ దశ, దిశ మొత్తం ఆంధ్ర పాలకులపైన కేంద్ర ప్రభుత్వ వివక్షతా విధానాలపైన పోరాడే విధంగా ఉండాలి.
ఇదంతా తెలంగాణ పునర్నిర్మాణం కోసమని అందరూ గుర్తించాలి. ఈ పునర్నిర్మాణం లేకపోతే మనకు దక్కింది ఏమిటనేది ప్రశ్న వేసుకోవాలి. భారతదేశ పటంలో తెలంగాణ రాష్ర్టాన్ని చూసి, సంబురపడటం ఒక్కటే కాదు, అది తెలంగాణ ప్రజల పురోగమనానికి నాంది కావాలి. చైతన్యానికి మరోపేరు కావాలి.
వ్యాసరచయిత: బి. మోహన్ రెడ్డి
జై తెలంగాణ! జై జై తెలంగాణ!