గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, జూన్ 13, 2014

గత ఏపీపీ...ఇకనుండి తెలంగాణ స్టేట్ పోలీస్ (టీఎస్‍పీ)గా మార్పు!

-టీఎస్‌పీగా మారనున్న పోలీస్ లోగో
- ఏపీపీ లోగో, బ్యాడ్జీలకు గుడ్‌బై
-కొత్త లోగో రూపకల్పనలో ఫ్యాషన్ డిజైనర్లు
-మారుతున్న ప్రధాన కార్యాలయం బోర్డు
కొత్త రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అవశేషాలు ఒక్కటొక్కటీ తొలగిపోతున్నాయి. ఇన్నాళ్లూ తెలంగాణ పోలీసుల టోపీలు, భుజాల మీదికెక్కి ఆధిపత్యం చెలాయించిన ఏపీ పోలీస్ లోగోలు, బ్యాడ్జీలు చెత్తబుట్ట పాలు కానున్నాయి. వాటి స్థానంలో తెలంగాణ బ్యాడ్జీలు, లోగోలు రానున్నాయి. మొత్తంగా తెలంగాణలో పోలీస్ శాఖ కొత్త రూపు సంతరించుకోబోతోంది. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ పోలీస్ ముఖ్య కార్యాలయంగా ఉన్న ఆఫీసు బోర్డును తొలగించి, దాని స్థానంలో రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం, తెలంగాణ రాష్ట్రం అని ఉండే కొత్త బోర్డు ఏర్పాటు చేయాలని డీజీపీ మంగళవారం ఆదేశించారు. పోలీస్ సిబ్బంది, అధికారుల లోగోలు, బ్యాడ్జీలు మార్చాలని కూడా ఆదేశించారు.

ప్రత్యేక డిజైన్‌తో...

తెలంగాణ పోలీస్ లోగో రూపకల్పన చేసేందుకు పలు డిజైన్లను డీజీపీ అనురాగ్ శర్మ తెప్పించుకున్నారు. ప్రస్తుతం నాలుగు రకాల లోగోలు డీజీపీ పరిశీలనకు వచ్చాయి. అయితే అవేవీ డీజీపీకి నచ్చలేదు. కొత్త లోగోలు ప్రత్యేకంగా డిజైన్ చేయించాలని ఆయన భావిస్తున్నారు. అందుకోసం మాదాపూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ నుంచి నిపుణులను రప్పించారు. చిరకాలం గుర్తుండిపోయేలా లోగో కళాత్మకంగా ఉండాలని, అందరికీ కొత్తదనం కనిపించేలా డిజైన్ చేయాలని నిఫ్ట్ నిపుణులకు సూచించారు.

టీఎస్‌పీగా షోల్డర్ బ్యాడ్జి...

పోలీస్ సిబ్బంది యూనిఫాంలో భుజాలపై ఉండే షోల్డర్ బ్యాడ్జీలను కూడా మార్చాలని డీజీపీ ఆ విభాగాధికారులను ఆదేశించారు. ఇన్నాళ్లు ఏపీపీ (ఆంధ్రప్రదేశ్ పోలీస్)గా ఉన్న షోల్డర్ బ్యాడ్జీ టీఎస్‌పీగా మారనుందని డీజీపీ అనురాగ్ శర్మ టీ మీడియాకు తెలిపారు. దీన్ని కూడా ప్రత్యేకంగా తయారు చేయిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ అనే లోగోపై తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నానన్నారు. ఇవన్నీ రెండు మూడు రోజుల్లో ఫైనల్ చేస్తామని, కార్యాలయ బోర్డు మాత్రం మంగళవారం రాత్రే మార్చాలని ఆదేశాలిచ్చానన్నారు.

వారంలోపే అన్ని జిల్లాల్లో...

మారుతున్న లోగోలతో పాటు షోల్డర్ బ్యాడ్జి లను వారం లోపు తెలంగాణ పోలీస్ సిబ్బంది మొత్తానికి పంపేలా ఏర్పాట్లుచేస్తున్నామని డీజీపీ చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి కోడ్ టీజీ లేదా టీఎస్ అన్నదానిపై క్లారిటీ లేకపోవడం వల్ల కొంత ఆలస్యం జరిగిందని, ఇపుడు టీఎస్ అని క్లారిటీ వచ్చినందున పని వేగవంతం చేస్తామని చెప్పారు. సొంత రాష్ట్రంలో సొంత లోగో, రాష్ట్ర పోలీస్‌గా పెట్టుకోవడానికి పోలీస్ సిబ్బంది తహతహలాడుతున్నారని తెలంగాణకు చెందిన సీనియర్ ఐపీఎస్ ఒకరు టీమీడియాకు తెలిపారు. సిబ్బంది వీటిని ధరించడాన్ని గర్వంగా భావిస్తున్నారని ఆయన తెలిపారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి