గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, జనవరి 01, 2016

హాయిగ రెండువేల పదహా రిడు శాంతులు సౌఖ్యముల్ సిరుల్!!



2015 సంవత్సరం అతి వేగంగా గడిచిపోయింది. గత ఏడాది నాటి ఉద్వేగాలు ఇప్పుడు లేవు. పోయినేడాది మొదటి సగం తెలంగాణ వస్తున్న ఉద్వేగం... మిగతా సగం తెలంగాణ ఆవతరించిన సంతోషం... ఆనందంగా గడిచిపోయింది. ఈ ఏడాదంతా పునర్నిర్మాణంపైనే ధ్యాస. సొంత రాష్ట్రం, సొంత ప్రభుత్వం ఏర్పడితే మన ప్రాధాన్యాలను మనం నిర్ణయించుకొని ఎట్లా అభివృద్ధి చెందగలమనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల అనుభవంలోకి తేగలిగారు. పుష్కరాల నిర్వహణతో కేసీఆర్ దక్షత తెలిసివచ్చింది. మనకు మనం చెప్పుకోవడం బాగుండదు కానీ, చాలా మంది సీమాంధ్ర ప్రజలు ఏపీతో పోల్చి చూసుకుని కేసీఆర్ పాలనా సామర్థ్యం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కరెంటు కోత లేకపోవడం కూడా జనాన్ని బాగా సమాధాన పరిచింది. సంక్షేమ పథకాలపై దృష్టి సారిస్తూనే, ముఖ్యమంత్రి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చారు. గోదావరి పొడుగునా పుష్కరాలు నిర్వహించడం వల్ల ప్రజల్లో మన నది, మన నీళ్ళు అనే అభిప్రాయం ఏర్పడ్డది. చెరువుల తవ్వకం, ఇంటింటికీ నల్లా నీళ్ళు మొదలైన పథకాలు ప్రజలు ఇది మా ప్రభుత్వం అనుకునే విధంగా చేశాయి. తెలంగాణ ప్రజలు మొదటిసారిగా శ్రీరామ్‌సాగర్‌లో ఎన్ని నీళ్ళున్నయి, ఏయే ప్రాజెక్టులు కడుతున్నారు అనే విషయాలు చర్చించుకుంటున్నారు. రాష్ట్ర బడ్జెట్ గురించి, గ్రామ అభివృద్ధి గురించీ సాధారణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. తెలంగాణ సమాజానికి ఇదొక కొత్త అనుభవం. 


తెలంగాణ రాష్ట్రం కోరుకున్నప్పటికీ, మన కాళ్ళ మీద మనం ఎట్లా నిలబడతామనే నమ్మకం కొందరికి లేదు. సీమాంధ్ర పాలకవర్గాలు, మీడియా సృష్టించిన సందేహాలు అవి. ఈ దుష్ట శక్తులు తెలంగాణ ఏర్పడిన తరువాత కేసీఆర్‌పై విమర్శలను మరింత తీవ్రతరం చేశాయి. ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదు అంటూ పక్క రాష్ర్టానికి చెందిన పెద్ద మనిషి బహిరంగంగా అనడం తెలంగాణవాదుల్లో ఆందోళన కలిగించింది. కానీ కేసీఆర్ ధీమాగా తెలంగాణ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని సాగించారు. దీంతో ప్రజల విశ్వాసం మరింత బలపడ్డది. ప్రత్యర్థులు నిర్వీర్యమైపోయారు. సంవత్సరాంతాన చండీయాగం పూర్తి చేసే నాటికి కేసీఆర్ అజేయుడిగా అవతరించారు. ఆయన రాజకీయంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే కాకుండా, తెలంగాణ సమాజానికి తాము అభివృద్ధి చెందుతామనే ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వగలిగారు. తెలంగాణ సమాజాన్నంతా ఏకతాటిపైకి తేగలిగారు. ఇది ముఖ్యమంత్రిగా కేసీఆర్ సాధించిన విజయం. 


ఆంధ్రా సమాజంలోనూ తమ రాష్ట్రం నిలదొక్కుకోగలదనే ధీమా ఈ ఏడాది కాలంలో ఏర్పడ్డది. కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య రాజధాని నిర్మాణం పట్ల అక్కడి ప్రజల్లో హర్షాతిరేకం వ్యక్తమవుతున్నది. రాష్ట్ర విభజన జరిగితే, కొత్త రాజధాని ఏర్పడి పరిపాలనా వ్యవస్థ ప్రజలకు చేరువవుతుందనీ, రెండు ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయని కేసీఆర్ మొదటి నుంచి చెబుతున్నారు. అది ఇప్పుడు వారి అనుభవానికి వచ్చింది. కేసీఆర్ చెప్పిన మాటలు వారికి ఇప్పుడు అర్థమయ్యాయి. విభజన జరగగానే ఏదో కోల్పోయినట్టు, సీమాంధ్ర ఇక నిలబడలేదన్నట్టు అక్కడి నాయకులు ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది అందుకు భిన్నంగా ఉన్నది. ఒక్కో రాష్ట్రంలో ఎన్నో పోరాటాలు చేస్తే తప్ప రానట్టి అనేక విద్యా సంస్థలు తమ ప్రాంతానికి ఒక్క పెట్టున రావడాన్ని వారు గుర్తించారు. ఈ మార్పు పట్ల పెల్లుబికిన ఆనందం కేసీఆర్ పట్ల అభిమానంగా మారిపోయింది. 


రాష్ట్ర విభజన జరిగిన తరువాత రెండు రాష్ర్టాల మధ్య అనేక సమస్యలు తలెత్తాయి. సీమాంధ్ర నాయకులు అనుసరించిన విధానం, కేంద్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యం ఇందుకు కారణం. ఈ సమస్యలు సలుపుతూనే ఉంటాయనీ, తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య కయ్యాలు పేట్రేగిపోతాయని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ ఏడాది తిరిగేలోగా ఇరువురు ముఖ్యమంత్రులు సన్నిహితంగా వ్యవహరించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఏపీ రాజధాని అమరావతి నగర శంకుస్థాపన సందర్భంగా చంద్రబాబు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి చేరుకొని సాదరంగా ఆహ్వానించారు. అక్కడ అమరావతిలో కేసీఆర్ పట్ల చంద్రబాబు చూపిన ఆదరణ కూడా మరువలేనిది. కేసీఆర్ చండీయాగానికి చంద్రబాబును అంతే సాదరంగా ఇంటికి వెళ్ళి ఆహ్వానించారు. చంద్రబాబు నివాసంలో విందు భోజనం చేశారు. చండీయాగానికి వచ్చిన చంద్రబాబుకు కేసీఆర్ నుంచి సముచిత సత్కారం లభించింది. మన మిత్రులను ఎంచుకోగలం కానీ, మన ఇరుగు పొరుగును నిర్ణయించుకోలేమనే సూక్తి ఉన్నది. తెలంగాణ, ఏపీ ఇరుగుపొరుగు రాష్ర్టాలు. ఒకరితో ఒకరికి అవసరాలు ఉంటాయి. ప్రజలు ఎప్పుడూ శాంతిని కోరుకుంటారు. ఇరువురు ముఖ్యమంత్రులు సన్నిహితంగా మెలుగుతుండటాడాన్ని ప్రజలు కూడా హర్షిస్తున్నారు. 

తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య సమస్యలు లేవని కాదు. పంపకాల, అంపకాల సమస్యలు ఇంకా తెగిపోలేదు. సమస్యలనేవి రాష్ర్టాల మధ్య, దేశాల మధ్య ఉండనే ఉంటాయి. అందులో కొత్తగా విభజన జరిగిన రాష్ర్టాలు కనుక విభజన విభేదాలు తలెత్తడం సాధారణం. ఈ విభేదాలను ఏ విధంగా పరిష్కరించుకుంటామనేది ప్రధానం. శత్రుపూరితంగా వ్యవహరించకుండా సామరస్యంగా పరిష్కారాలు సాధించాలె. రెండు రాష్ర్టాల ప్రజలను రెచ్చగొట్టే శక్తులు ఎప్పుడూ పొంచి ఉంటాయి. వాటికి అవకాశం ఇవ్వకూడదు. ఈ విజ్ఞత ఏ ఒక్కరికో ఉంటే సరిపోదు. రెండు పక్షాలకూ ఉండాలె. ఇరువురు ముఖ్యమంత్రుల కనబరుస్తున్న స్నేహశీలతను గమనిస్తే విభజనాంశాలు సమస్యగా పరిణమించవనే నమ్మకం కలుగుతున్నది. 


తెలంగాణలో, ప్రత్యేకించి హైదరాబాద్‌లో శాశ్వత నివాసం ఉండే సీమాంధ్ర మూలాలున్న ప్రజలకైతే ఆ మాత్రం బాధ కూడా లేదు. సామరస్యం విషయానికి వస్తే తెలంగాణ వారితో పాటు ఈ సీమాంధ్ర ప్రజలనూ అభినందించ వలసిందే. తెలంగాణ విముక్తి ఉద్యమం సీమాంధ్ర పాలకవర్గాల పెత్తనానికి వ్యతిరేకంగా వచ్చిందనీ, అక్కడి ప్రజల పట్ల తెలంగాణ వారికి ఎటువంటి పేచీ లేదని ఉద్యమకారులు అనేక సందర్భాలలో చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తరువాత సీమాంధ్ర ప్రజలు ఇక్కడివారితో కలిసిమెలిసి ఉండవచ్చునని కూడా స్పష్టం చేశారు. తెలంగాణలో ఎంతో కాలంగా ఉంటున్న సీమాంధ్ర ప్రజలు ఇక్కడి స్థానికుల పట్ల ఏనాడూ అనుమానాలు వ్యక్తం చేయలేదు. తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా తాము ఇక్కడే ఉండిపోతామని అనేక మంది తమ నిశ్చితాభిప్రాయాన్ని వెల్లడించారు. అయినప్పటికీ సీమాంధ్ర ప్రజలకు భద్రత ఉండదని, వాడకో పోలీసు స్టేషన్ పెట్టాల్సి ఉంటుందని భయపెట్టిన మేధావులూ ఉన్నారు. ఇప్పుడా రాతలు ఎంత అర్థం లేనివో అవి రాసిన బుద్ధిజీవులు గ్రహించుకుంటే మంచిది. 


తెలంగాణ ఉద్యమానికి తాము వ్యతిరేకం కాదని చెప్పుకునే కొందరు సీమాంధ్ర పాత్రికేయ మిత్రులు కూడా తెలంగాణవాదాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. నమస్తే తెలంగాణ పత్రిక ప్రారంభమైన మొదట్లో సంగతి. నటరాజ రామకృష్ణ మరణించినప్పుడు మిగతా పత్రికల కన్నా నమస్తే తెలంగాణ ఎక్కువగా కవరేజి ఇచ్చింది. ఆయన తండ్రి ఆంధ్ర ప్రాంతీయుడనీ, తల్లి మాత్రమే తెలంగాణ అనీ... మరి నమస్తే తెలంగాణ ఎందుకు ఇంతగా మనవాడంటూ ఓన్ చేసుకున్నదనీ కొందరు ఆంధ్రా పాత్రికేయులు ఆశ్చర్యపోయారు. అప్పుడు ఎడిటర్‌గా ఉన్న అల్లం నారాయణ గారికి, శేఖర్ రెడ్డి గారికి ఫోన్ చేసి చర్చించిన వారూ ఉన్నారు. తల్లిదండ్రులు ఇరువురు ఆంధ్రా వారే అనుకుందాం. అయినంత మాత్రాన తెలంగాణలో ఉండి, ఇక్కడి కళారంగానికి విశేష సేవలు అందించిన మహానుభావుడికి నివాళులు అర్పించుకోమా! సీమాంధ్ర మూలం ఉందని పరాయిని చేసుకుంటామా? కాళోజీని తెలంగాణ నుంచి విడదీసి చూడగలమా! తమకు సేవలందించిన మహానుభావులను ఏ జాతీ విస్మరించలేదు. ఎం.ఎఫ్. హుస్సేన్ మొదలుకొని ఈ గడ్డతో అనుబంధం ఉన్న ప్రముఖులను నమస్తే తెలంగాణ మననం చేసుకుంది. గౌరవించింది. ఇందుకు ప్రశంసలు అందుకున్నది. సానియా, సైనాలను మన తెలంగాణ బిడ్డలుగా చెప్పుకున్నామే తప్ప ఏనాడూ పరాయిలుగా చూడలేదు. తెలంగాణలో అటువంటి కుసంస్కృతి ఏనాడూ లేదు. 

venugopal


తెలంగాణ అవతరణకు ముందూ, తరువాత కొందరు విభజన రేఖలు గీయడమే పనిగా పెట్టుకున్నారు. కేసీఆర్, చంద్రబాబు పరస్పరం గౌరవించుకోవడాన్ని హర్షించడానికి బదులు అదిగో రాజీ పడ్డారు అంటూ వక్ర భాష్యాలు చెప్పిన వారూ ఉన్నారు. హైదరాబాద్ నగరంలో కానీ, తెలంగాణలో అంతటా కానీ ఉన్న సీమాంధ్ర ప్రజలు ఈ వంకర మాటలను పట్టించుకోవడం లేదు. తెలంగాణ వారితో అరమరికలు లేకుండా కలిసిపోయి ఉంటున్నారు. ఇరు వర్గాల మధ్య పొరపొచ్చాలు లేవని వారి జీవితానుభవమే చెబుతున్నది. అనుమానాలు, అపోహలు అన్నీ గతం. ఇక్కడ ఉంటున్న సీమాంధ్ర మూలాలున్న ప్రజలు తెలంగాణ సమాజంలో భాగం. వారికి స్థానికులతో ఎటువంటి గొడవా లేదు. తమకు రెండు రాష్ర్టాలు విడిపోయాయన్న భావనే కలగడం లేదని ఎప్పటి మాదిరిగానే ఉంటున్నామని ఇక్కడ ఉంటున్న సీమాంధ్ర ప్రజలు అంటున్నారు. ఇక్కడ మరాఠీలు, కన్నడిగులు, తమిళులు, మళయాళీలు, గుజరాతీలు, బెంగాలీలు, ఉత్తర భారతీయులు, పారశీకులు, ఆంగ్లో ఇండియన్లు- ఇట్లా అనేక జాతులు, భాషా సంస్కృతుల వారు ఉంటున్నారు. ఎవరినీ తెలంగాణ సమాజం పరాయిగా చూడలేదు. ఆంధ్ర ప్రజల చేరికతో తెలంగాణ భిన్నత్వం మరింత శోభాయమానమైంది. తెలంగాణ సమాజమంతా ఒకే తాటిపై నిలిచి అభివృద్ధి పథాన పయనిస్తున్నది. ఈ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నది. ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రజలు కూడా తమ రాజధాని నగరాన్ని నిర్మించుకొని అభివృద్ధి చెందాలని ఆకాంక్షిద్దాం. కొత్త రాజధానికి శంకు స్థాపన చేసుకున్నందుకు వారికి అభినందనలు. ఈ అన్యోన్యత కలకాలం నిలవాలని కోరుకుందాం.



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!