-చంద్రబాబు హయాంలోనే పలు జీవోలు జారీ
-కావల్సినవారికి వేల ఎకరాల ధారాదత్తం
-నాలుగాకులు ఎక్కువే చదివిన వైఎస్
-జీవో 166తో పెద్దలకు భారీగా లాభం
-అనేక కేసులు.. వివాదాలు.. పెండింగ్‌లో ఫైళ్లు
-ప్రక్షాళనకు సిద్ధమైన తెలంగాణ సర్కార్
-మరో 3 నెలల్లో భూ అక్రమ బాగోతాలకు చెక్
-తదుపరి కబ్జాలపై పీడీ యాక్ట్కూ సిద్ధం
-భూముల క్రమబద్ధీకరణపై విపక్షం వింత ధోరణి
ప్రైవేటు వ్యక్తులు, సంస్థల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరించేందుకు, తద్వారా రాష్ట్రంలో భూ అక్రమాలకు చరమగీతం పాడేందుకు తెలంగాణ సర్కారు సంకల్పిస్తే.. విపక్షంమాత్రం వింత ధోరణితో విమర్శనాస్ర్తాలు సంధిస్తున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో వేల దరఖాస్తులను వేల సంఖ్యలో వివాదాలు చుట్టుముట్టిన నేపథ్యంలో.. అంతే స్థాయిలో కోర్టు వివాదాల్లో నలుగుతున్న సమయంలో వాటన్నింటికీ పరిష్కార మార్గంగా కేసీఆర్ సర్కారు ముందుకు తెచ్చిన భూముల క్రమబద్ధీకరణపై ప్రతిపక్షాలు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయని పలువురు నిపుణులు విమర్శిస్తున్నారు. -కావల్సినవారికి వేల ఎకరాల ధారాదత్తం
-నాలుగాకులు ఎక్కువే చదివిన వైఎస్
-జీవో 166తో పెద్దలకు భారీగా లాభం
-అనేక కేసులు.. వివాదాలు.. పెండింగ్‌లో ఫైళ్లు
-ప్రక్షాళనకు సిద్ధమైన తెలంగాణ సర్కార్
-మరో 3 నెలల్లో భూ అక్రమ బాగోతాలకు చెక్
-తదుపరి కబ్జాలపై పీడీ యాక్ట్కూ సిద్ధం
-భూముల క్రమబద్ధీకరణపై విపక్షం వింత ధోరణి
పేదలకు ఉచితంగా, వివిధ స్థాయి విస్తీర్ణాల్లో భూములు స్వాధీనంలో ఉన్నవారికి నిర్దిష్ట మార్కెట్ రేట్ ప్రకారం క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తే.. అదేదో చేయరాని పని అన్నట్లు బురద జల్లుతున్నారని అంటున్నారు. నిజానికి ఇదే అంశంపై ఎవరేం చేశారో పరిశీలిస్తే.. అసలు వాస్తవాలు బయటపడుతాయని తేల్చేస్తున్నారు. తెలంగాణలో సర్కారీ స్థలాలను అమ్మినదెవరు? ఆ అమ్మకం ద్వారా వచ్చిన నిధులను దారి మళ్లించినదెవరు? అసలు ఆ స్థలాలపై హక్కులెవరివి? వాటిని ఎవరికి హస్తగతం చేశారు? ఇందుకు ఉద్దేశించిన క్రమబద్ధీకరణ కార్యక్రమాలు ఎవరు మొదలుపెట్టారు? వాటిని సర్కారీ దందాగా ఎవరు మార్చారు? కార్యక్రమం ముసుగులో ఎవరు తమ అనుయాయులకు లబ్ధి చేకూర్చుతూపోయారు?
ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న వేల దరఖాస్తులకు.. వాటిపై కోర్టుల్లో నానుతున్న వేల దరఖాస్తులకు ఎవరు కారణం? ఇటువంటి కొన్ని ప్రశ్నలు వేసుకుంటే.. వేళ్లన్నీ నాటి ఉమ్మడి రాష్ట్రంలో పాలనాపగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వైపే చూపిస్తున్నాయి. కబ్జా స్థలాల క్రమబద్ధీకరణ పేరుతో 1995 నుంచే మొదలైన ఈ క్రమబద్ధీకరణ దందా ముసుగులో గడిచిన ఏండ్ల కాలంలో ప్రభుత్వ భూములు, యూఎల్సీ, సర్‌ప్లస్ వంటి అన్ని రకాల భూములనూ తెగనమ్మేశారు. తమవారు అనుకున్న వారికి పేదల ముసుగులో అగ్గువకు పట్టాలు కట్టబెట్టేశారు.
ఈ పరిస్థితి మారాలనే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణలో భూ అక్రమాలకు తావు లేకుండాచేసి ఆదర్శంగా నిలిపినప్పుడే పారిశ్రామికాభివృద్ధి సాధ్యమని, పెట్టుబడులు రాకకు సానుకూల వాతావరణం నెలకొంటుందని సీనియర్ ఐఏఎస్, టాస్క్‌ఫోర్స్ కమిటీ ఆన్ ల్యాండ్ చైర్మన్ ఎస్‌కే సిన్హావంటి అధికారులు కూడా చెబుతున్నారు. అలాంటి నిపుణుల సూచనలను అమలు చేసే దిశలో ప్రభుత్వం అడుగులు వేస్తున్నది.
1995 లోనే మొదలైన క్రమబద్ధీకరణ పర్వం
భూములను క్రమబద్ధీకరించడం 1995లోనే మొదలైంది. పరిశ్రమల పేరుతో, స్వచ్ఛంద సంస్థల ముసుగులో, ఉపాధి కల్పన వంకతో వ్యక్తులకు/సంస్థలకు యథేచ్ఛగా కట్టబెట్టారు. ఇలా ఆక్రమణల్లో ఉన్నవారిలో అత్యధికులు అప్పట్లో టీడీపీ కార్యకర్తలే అధికంగా ఉండటంతోనే వారికి మేలు చేకూర్చేందుకు నాటి సీఎం చంద్రబాబు కబ్జాలకు గురైన స్థలాలను క్రమబద్ధీకరించే ఉపాయం కనుగొన్నారనే విమర్శలు వచ్చాయి. అలా ఈ పథకం సృష్టికర్త ఒక విధంగా చంద్రబాబు నాయుడేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
యూఎల్సీ భూములకు ఎసరు
1976లో అమల్లోకి వచ్చిన పట్టణ భూగరిష్ఠ పరిమితి చట్టాన్ని అమలు చేయడంద్వారా ప్రభుత్వ ఖాతాలో వేల ఎకరాలు చేరాయి. కానీ వాటిని ఆక్రమించుకున్న వారికి ధారాదత్తం చేసేందుకు ఊతమిచ్చిన ఘనత కూడా చంద్రబాబునాయుడిదేననే అభిప్రాయాలు రెవెన్యూ వర్గాల్లో ఉన్నాయి. యూఎల్సీ కింద రికార్డుల్లో పేర్కొన్న భూముల్లో రియల్టర్లు, అక్రమార్కులు లేఅవుట్లు వేసి అమాయకులకు విక్రయించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో యూఎల్సీ చట్టం ద్వారా 11,894 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా 3,839 ఎకరాల వరకు క్రమబద్ధీకరించారు.
వైఎస్ హయాంలో పెద్ద దందా
2004 తర్వాత పాలనా పగ్గాలు చేపట్టిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూడా పేదలకు మేలు చేస్తామంటూ జీవో నం.166 తీసుకొచ్చారు. ఇది సాగించిన దందా అంతాఇంతా కాదు. 80 గజాల లోపు స్థలాలను ఉచితంగా క్రమబద్ధీకరించే లక్ష్యాన్ని పేర్కొంటూనే బడాబాబులకు మేలు కలిగించారని, పేదల దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టి 250 గజాలకు పైగా, 500 గజాలకు పైగా ఉన్న స్థలాలను రెగ్యులరైజ్ చేసుకునేందుకు సంపన్న వర్గాలకు తోడ్పాటునందించారని విమర్శలు ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాలో 358 ఎకరాలకుపైగా క్రమబద్ధీకరించినా.. ప్రభుత్వ ఖజానాకు వచ్చిన ఆదాయం మాత్రం రూ.54 కోట్లు మాత్రమే! తెలంగాణలో జీవో 166కింద క్రమబద్ధీకరణకు 1,44,348 దరఖాస్తులొచ్చాయి.
వాటిలో 80 గజాల లోపు ఉన్న స్థలాలకు సంబంధించి 74,747దరఖాస్తులు, 81 నుంచి 250 గజాల లోపు స్థలాల క్రమబద్ధీకరణకు 50,232 దరఖాస్తులు, 251నుంచి 500 గజాలలోపు స్థలాల క్రమబద్ధీకరణకు 13,692 దరఖాస్తులు, 501 నుంచి 2000 గజాల దాకా 5677 దరఖాస్తులు ఉన్నాయి. వీటిలో 13,628 దరఖాస్తులను పరిష్కరించి క్రమబద్ధీకరణ ఉత్తర్వులను జారీచేశారు.
జీవోల కథ
-చంద్రబాబు హయాంలో 20.10.1995న జీవో నం.508 జారీతోనే స్థలాల క్రమబద్ధీకరణ షురూ అయ్యింది. అప్పట్లో 45 రోజుల్లో దరఖాస్తు చేసుకున్న వారికేనని స్పష్టంచేశారు. దీంట్లో నివాస స్థలాలతోపాటు ఇండస్ట్రియల్ వినియోగ ప్లాట్లకూ అవకాశం కల్పించారు. మళ్లీ జీవో నం.515, తేదీ 19.04.2003 విడుదలైంది.
-యూఎల్సీ స్థలాల క్రమబద్ధీకరణకూడా ఆయన హయాంలోనే మొదలైంది. జీవో 455, 456లను 29.07.2002లో, జీవో 183ని 15.02.2006న, జీవో 603ను 22.04.2008న, జీవో 615ను 26.04.2008న, జీవో 747ను 18.06.2008న జారీ చేశారు.
-వైఎస్ అధికారంలోకి వచ్చిన కొంతకాలానికే 2005 ఆగస్టు 29న జీవో నం.1601 ద్వారా దందా మొదలుపెట్టారు. ఆయన కూడా ఇండస్ట్రియల్ స్థలాలకు అవకాశం ఇచ్చారు. ఓ అడుగు ముందుకేసి 501 నుంచి 1000 గజాల వరకు రిజిస్ట్రేషన్ ధరలో 50 శాతానికే కట్టబెట్టారు. 1001 గజాలకు పైగా ఉన్న వాటికి మాత్రమే అప్పటి రిజిస్ట్రేషన్ ధరలో క్రమబద్ధీకరించారు. పరిశ్రమలకు కూడా 500 గజాల వరకు 2003 నాటి రిజిస్ట్రేషన్ ధర ప్రకారం, 501 నుంచి 1000 గజాల వరకు అప్పటి రిజిస్ట్రేషన్ విలువలో 75 శాతానికి, 1001 గజాలకు పైగా ఉండే స్థలాలకు మాత్రం రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా చేపట్టారు.
దీనివల్ల ప్రభుత్వం తీవ్రంగా నష్టపోవల్సి వచ్చింది. ఏడాది తిరగక ముందే 2006 జూన్ 8న జీవో 674 వచ్చింది. అంతకు ముందు ధరల ప్రకారమే రెగ్యులరైజ్ చేశారు. 2008 ఫిబ్రవరి 16న జీవో 166ను తీసుకొచ్చి ప్రభుత్వ భూములను కొల్లగొట్టేశారు. పేదల పేరిట పెద్దలకు వందలాది ఎకరాలను కట్టబెట్టారు.
వేలం పేరిట వేల ఎకరాలు మాయం: చంద్రబాబు అధికారం కోల్పోవటానికి ఏడాదిముందు ప్రభుత్వ భూముల వేలానికి తెరతీశారు. 2003లో హుడా ఆధ్వర్యంలో అన్ని రకాల ప్రభుత్వ భూముల వేలాలను కొనసాగించారు. వేలంలో పెద్ద ఎత్తున గోల్‌మాల్ జరిగిందన్న ఆరోపణలున్నాయి.గోప్యత పాటించి, తమ అనుయాయులకు దక్కేటట్లుగా చేశారని అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది.
చరమ గీతం పాడాల్సిందే:
భూ అక్రమాలకు తెర దించాలనే గట్టి డిమాండ్ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ముందుకు వచ్చింది. ప్రభుత్వం కూడా ఆ దిశగానే ఆలోచించింది. ఆక్రమణలకు చరమగీతం పాడేందుకు అఖరి అంకాన్ని సీఎం కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. మూడు నెలల కాలంలో మరో కబ్జా బాగోతం ఉండొద్దని, అన్యాక్రాంతానికి ప్రయత్నిస్తే పీడీ యాక్ట్‌ను ప్రయోగించాల్సిందేనంటూ జీవో నం.58, 59, 60లను విడుదల చేశారు. స్థలాల క్రమబద్ధీకరణకు ఈ నెల 20లోపు దరఖాస్తు చేసుకోకపోతే స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!