గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, జూన్ 07, 2014

ప్రజా సంక్షేమ ప్రభుత్వం

చాలా రోజుల తరువాత మళ్లా పాలకుల నోట సంక్షేమ రాజ్య భావన వినిపించడం, అదీ తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో కావడం సంతోషం కలిగిస్తున్నది. కేసీఆర్ సోమవారం తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవంలో ప్రసంగిస్తూ- ప్రభుత్వం సంక్షేమానికి పెద్ద పీట వేయాలని తలపెట్టిందని వెల్లడించారు. వద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పింఛను పెంచడం, బీడీ కార్మికులకు భృతి, బలహీనవర్గాలకు రెండు పడకగదుల ఇల్లు, రైతులకు లక్ష రూపాయల వరకు ఋణం మొదలైనవన్నీ పేద వర్గాలకు ఊరట కలిగించేవే. 

దళితులు ఇతర బలహీనవర్గాల కోసం లక్ష కోట్ల రూపాయలు కేటాయిస్తామనడం కూడా హర్షణీయం. దేశంలో ఇప్పుడున్న ఆర్థిక విధానాల పరిధిలో సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలు చేయడం ఎంత వరకు సాధ్యమనే ప్రశ్న ఉండనే ఉన్నది. అయినప్పటికీ ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం సమర్థనీయం. కొత్త విద్యుత్ కేంద్రాలను ప్రైవేటు రంగంలో కాకుండా జెన్‌కో ఆధ్వర్యంలో నిర్మిస్తామని కూడా కేసీఆర్ ఇటీవలే ప్రకటించారు. ఇది కూడా కీలకమైన విధాన నిర్ణయం.
ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ మొదలైన నాటి నుంచి సంక్షేమ పథకాల వల్లనే దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమైందనే తప్పుడు ప్రచారం భారీ ఎత్తున సాగింది. ఈ దుష్ప్రచారం ఎంతగా సాగిందంటే దేశం ఎదుర్కొన్న చెల్లింపుల సంక్షోభానికి కూడా సబ్సిడీలే కారణమని చెప్పుకొచ్చారు. ఎగుమతి దిగుమతుల మధ్య సమతూకం పాటించకుండా విచ్చలవిడిగా దిగుమతులకు తలుపులు తెరవడం వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని పేదల సబ్సిడీలకు ముడిపెట్టడం కుట్రపూరితంగా సాగింది.

విదేశాలలో వ్యవసాయానికి యాభై శాతం వరకు సబ్సిడీ ఇస్తుంటే మన దేశంలో పది శాతం దాటలేదు. అయినా సరే సబ్సిడీలు అభివృద్ధికి ప్రతిబంధకమేననే ప్రచారం సాగింది. పరిశ్రమలకు వేల కోట్ల రూపాయల మేర రాయితీలు ఇస్తున్నా సరే అభ్యంతరం పెట్టని ఆర్థిక వేత్తలు కొందరు సబ్సిడీల వల్లనే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందనే తప్పుడు ప్రచారం సాగిస్తున్నారు. విదేశీ అప్పులు పారిశ్రామిక మౌలిక వసతుల కోసం ఖర్చు చేసి వాటిని తీర్చడానికి సంక్షేమ పథకాలను కుదిస్తున్నాయి. ఈ పోకడకు అడ్డుకట్టవేయాలె. సంక్షేమ పథకాలు సామ్యవాద వ్యవస్థలోనే ఉంటాయనే తప్పుడు అభిప్రాయం కూడా చాలా మందికి ఉన్నది. 1929లో మహా మాంద్యం వచ్చిన తరువాత సంక్షేమ విధానాలు ప్రాచుర్యం పొందాయి. వినియోగదారుడికి కొనుగోలు శక్తి కూడా లేకపోతే మార్కెట్ వ్యవస్థ పనిచేయదనే స్పృహ ప్రభుత్వాలకు వచ్చింది. అందువల్ల సంక్షేమ పథకాలు లేకపోతే మార్కెట్ వ్యవస్థ కూడా కుప్పకూలి సంక్షోభాలు వస్తాయి.

సామాన్యులకు ఇండ్లు కట్టివ్వడం కూడా పరోక్షంగా మార్కెట్ వ్యవస్థ బలోపేతానికి ఉపయోగపడుతుంది. సొంత ఇల్లు ఉం కొనుగోలుదారుడు ఇతర అవసరాల కోసం ఖర్చు చేస్తాడని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కొనుగోలుదారుడు లేకపోతే మార్కెట్ ఉండదనే కనీస సూత్రం సంక్షేమ పథకాలను వ్యతిరేకిస్తున్నవారు గుర్తించడం మంచిది. ఈ సంక్షేమ పథకాలను మరింత పకడ్బందీగా అమలు చేయడం అవసరం. ఏయే సామాజిక వర్గాలు, ప్రాంతాలు ఏ స్థితిలో ఉన్నాయో అధ్యయనాలు జరిపి వాటి ప్రాతిపదికన సామాజిక అభివద్ధి వ్యూహాలు రూపొందిస్తే, నిర్దేశిత వర్గాలకు చేరుతాయి.
విద్యుత్ కేంద్రాలను గతంలో ప్రైవేటు రంగానికి అప్పగించడం అత్యంత వివాదాస్పదమైన, ప్రజా వ్యతిరేకమైన చర్య. ప్రభుత్వ రంగంతో పోలిస్తే ప్రైవేటు రంగమే సమర్థవంతంగా ఉంటుందనే తప్పుడు ప్రచారాన్ని మొదట సాగించారు. ఈ విధంగా ప్రైవేటీకరణకు ప్రజామోదం పొందే ప్రయత్నం జరిగింది.

కానీ మన దేశంలో ప్రైవేటీకరణ మొదలైన తరువాత అనుభవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. విద్యుత్ రంగమే కాదు, వైద్యం, విద్య మొదలైన అన్ని రంగాల పరిస్థితి అంతే. మహారాష్ట్రలో దభోల్ ప్రయోగం ఇందుకు ఉదాహరణ. ప్రభుత్వం ప్రైవేటు రంగానికి పెద్ద పీట వేసే బదులు రాష్ట్ర విద్యుత్ బోర్డు (ఎస్‌ఇబి)లనే కొంత వెచ్చించి పటిష్ఠపరిస్తే వినియోగదారుడికి అత్యంత చౌకగా విద్యుత్ అందుతుందని ఆనాడే విద్యుత్ రంగ నిపుణులు స్పష్టంగా చెప్పినా పాలకులు వినిపించుకోలేదు. దభోల్ ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందమే ప్రజా వ్యతిరేకమైనది. ఈ ఒప్పందం ప్రకారం ఎస్‌ఇబిల ఉత్పత్తిని నిలిపివేసైనా సరే దభోల్ ప్రాజెక్టు నుంచి ప్రభుత్వం ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. విదేశాల నుంచే వచ్చే సహజవాయువు ఆధారంగా జరిగే ఉత్పత్తి వల్ల డాలర్ విలువ పెరిగినప్పుడల్లా ఈ విద్యుత్ ధర పెరుగుతూ ఉంటుంది. అయినా సరే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ దివాలాకోరు ఒప్పందం కుదుర్చుకున్నది.

ఆ తరువాత ఒప్పందం అమలు కాని పరిస్థితి తెలిసిందే. అంతేకాదు ముంబయిలో భారీ వరదలు వచ్చినప్పుడు మన దేశంలోకి ఒక ప్రైవేటు సంస్థ కన్నా ఎస్‌ఇబి ఉద్యోగులే సమర్థవంతంగా పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టారు. ఇన్ని అనుభవాలు ఉన్న తరువాత కూడా ఆంధ్రా పాలకవర్గాలు ప్రైవేటు విద్యుత్ కేంద్రాల వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం జెన్‌కో ఆధ్వర్యంలో విద్యుత్ కేంద్రాలు ప్రారంభించాలనే నిర్ణయం వల్ల ప్రజలకు ఎంతో మేలు చేసినట్టవుతుంది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి