గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, జూన్ 11, 2014

ఉద్యోగుల విభజన విధానంలోనే కుట్రలు దాగి ఉన్నాయి!



-కమలనాథన్ కమిటీ, రిటైర్డ్ సీఎస్ కుట్రదారులే
-మండిపడుతున్న తెలంగాణ ఉద్యోగ సంఘాలు
-ప్రభుత్వంతో గొడవపడేలా చేశారని విమర్శలు
-తెలంగాణ ఐఏఎస్‌ల సూచనలు ఖాతరు చేయలేదని ఆగ్రహం
-అశాస్త్రీయ విభజనపై సర్వేరిపోర్ట్ రూపొందించిన టీఎన్జీవో

ఉద్యోగుల విభజన పూర్తిగా కుట్రలతో కూడుకున్నదని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. విభజన తర్వాత ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వంతో గొడవకు దిగేలా విభజన కమిటీలకు నేతృత్వం వహించిన అధికారులు కుట్ర పన్నారని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. విభజనలో కీలక బాధ్యత వహించిన కమలనాథన్ కమిటీ, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ పీకే మహంతి, 21 విభజన కమిటీలు..అన్నీ అశాస్త్రీయ విభజనకు శ్రీకారం చుట్టారని, పొరపాట్లకు వాళ్లే బాధ్యులని ఆరోపిస్తున్నారు. కమిటీల్లో బాధ్యత వహించిన ఐఏఎస్ అధికారులు వీ నాగిరెడ్డి, బీ వెంకటేశ్వర్లు వంటి తెలంగాణ ఐఏఎస్‌లు చెప్పిన సూచనలను కూడా ఖాతరు చేయలేదని ఉద్యోగ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటివరకు సెక్రటేరియట్, శాఖాధిపతుల కార్యాలయాలు, అసెంబ్లీలో కలిపి 48 వేల ఉద్యోగులను విభజించారని, ఇక్కడా నిబంధనలను పాటించకుండా ఉద్దేశపూర్వకంగా తెలంగాణ ఉద్యోగులను ఆంధ్రకు, ఆంధ్ర ఉద్యోగులను తెలంగాణకు బదిలీ చేసి పైశాచికానందం అనుభవిస్తున్నారని ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కుట్రలకు కేంద్ర బిందువు సెంటర్‌ఫర్ గుడ్ గవర్నెన్స్
జీవోఎంకు సమర్పించిన జాబితాలో హైదరాబాద్‌లో 205 శాఖాధిపతుల కార్యాలయాలు ఉన్నాయని చూపించి, మే 12, 2014న జారీ చేసిన జీవోఎంఎస్ నం 100లో శాఖాధిపతుల కార్యాలయాలు 139 మాత్రమేనని ప్రకటించారని ఉద్యో గ నేతలు మండిపడుతున్నారు. ఈ జీవో ప్రకారం 66 శాఖాధిపతి కార్యాలయాల్లో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులందరినీ యథాతథంగా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగేలా మంత్రాంగం నడిపారని విమర్శలున్నాయి. తెలంగాణ సెక్రటేరియట్‌కోసం విభజించిన 1056 ఉద్యోగుల్లో 193 మంది అవశేష ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులున్నారని, వారు స్థానికత వివరాలతోసహా అందచేసినప్పటికీ ప్రత్యామ్నాయ చర్యలు ఎందుకు తీసుకోలేదని ఉద్యోగ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం బయటపడడంతో ఉద్యోగుల జాబితాను ప్రకటించే విధానానికే మంగళం పాడారని మండిపడుతున్నారు. సెంటర్‌ఫర్ గుడ్ గవర్నెన్స్ విభజనలో కుట్రలకు కేంద్ర బిందువైందని ఉద్యోగ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలోనే టీఎన్జీవో నగరశాఖ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు సారథ్యంలో ఉద్యోగ సంఘాల కమిటీ 47 శాఖాధిపతుల కార్యాలయాల్లో ప్రతి ఉద్యోగిని విభజించిన విధానంపై శాస్త్రీయమైన నివేదికను రూపొందించింది. ఈ నివేదికను తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మకు సమర్పించారు. పౌరసరఫరాల శాఖ, బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్, దేవాదాయ శాఖ, డ్రగ్స్ కంట్రోల్, తాగునీటి సరఫరా విభాగం, వ్యవసాయం, మహిళా శిశుసంక్షేమశాఖ, డీజీపీ, కార్మికశాఖ, సంక్షేమశాఖ, ఉద్యానవన, సెరికల్చర్ విభాగాల్లో టీఎన్జీవో సర్వే జరిపి నివేదికను అందచేసింది. రెండు మూడు నెలల్లో రిటైర్ కానున్న తెలంగాణ ఉద్యోగులను కూడా సీమాంధ్రకు కేటాయించారని సర్వేలో వెల్లడైంది. రాజ్యాంగంలోని పదో షెడ్డ్యూల్ ప్రకారం రాష్ట్రంలోని 107 పబ్లిక్‌సెక్టార్లలో ఇప్పుడు విభజన జరగడం లేదని, ఆర్నెళ్ల తర్వాతే ఆయా సెక్టార్లలో విభజన ప్రారంభమవుతుందని చెప్పడం మరో కుట్రని ఉద్యోగులు విమర్శిస్తున్నారు.


అటోళ్లు ఇటు.. ఇటోళ్లు అటు!
జిల్లాల్లో 20 శాతం, జోన్లలో 30 శాతం, మల్టీజోన్లలో 40 శాతం ఉద్యోగులు స్థానికేతరులున్నారని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. సీమాంధ్ర ఉద్యోగులు సీమాంధ్రకు, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణకు స్వచ్ఛందంగా వచ్చేందుకు లిఖిత పూర్వకమైన సమ్మతిని తెలియజేశారని వెల్లడించారు. తెలంగాణ జిల్లాల నుంచి 6 వేల మంది ఉపాధ్యాయులు అవశేష ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ విభజన కమిటీ స్పందించడం లేదని ఉద్యోగ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఉద్యోగులను కావాలని సీమాంధ్ర రాష్ట్రానికి, సీమాంధ్రలో సమైక్య ఉద్యమానికి నేతృత్వం వహించినవారిని తెలంగాణకు కేటాయించడంపైనా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఏపీఎన్జీవో నాయకత్వంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న పీవీ సత్యనారాయణను తెలంగాణకు, తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగంలో ఉన్న సీ విఠల్, కే వెంకటేశ్వర్లును సీమాంధ్రకు బదిలీ చేయడం కుట్రలో భాగమేనని మండిపడుతున్నారు.

సీఎం వ్యాఖ్యలు బేఖాతర్
తెలంగాణ ఉద్యోగులందరినీ తమ రాష్ట్రానికే ఇవ్వాలని, ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంటే సూపర్‌న్యూమరీ పోస్టులను ఏర్పాటు చేసుకుంటామన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను కూడా విభజన కమిటీలు పరిగణనలోకి తీసుకోలేదని ఉద్యోగనేతలు ఉదాహరిస్తున్నారు. జీవో నెం.251 ప్రకారం కమలనాథన్ కమిటీ సారథ్యం లో ఉద్యోగుల విభజనలో వచ్చే అభ్యంతరాలన్నింటినీ పరిశీలించేందుకు కేంద్రం ఏర్పాటు చేస్తామన్న గ్రీవెన్స్ సెల్ విభాగం ఏమైందని ఉద్యోగనేతలు ప్రశ్నిస్తున్నారు. పదోన్నతులకు అవకాశం ఉన్న పోస్టులన్నింటినీ అవశేష ఆంధ్రప్రదేశ్‌కు, పదోన్నతులకు అవకాశం లేని పోస్టులను తెలంగాణకు ఇచ్చారని మండిపడుతున్నారు. దేవాదాయశాఖ, ఎక్సైజ్, పే అండ్ అకౌంట్స్‌లో ఉద్యోగుల విభజనలను ఉదాహరణగా చూపుతున్నారు. 2008లో 610 జీవోను అమలు చేస్తున్నామని చెప్పి, తెలంగాణ ఉద్యోగులకు తెలంగాణ ఉద్యోగులతోనే జుట్లు ముడేసినట్లుగా.. తాజాగా ఉద్యోగుల విభజనను గందరగోళ పరుస్తున్నారని విమర్శిస్తున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)


జై తెలంగాణ!   జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి