గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, జూన్ 08, 2014

పురోగమనంలో తెలంగాణ అభివృద్ధి

హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి, తెలంగాణ సమాజ అభివృద్ధికి కొత్త ప్రభుత్వం పథక రచనలు చేయడం హర్షణీయం. నిజాముల కాలంలో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి కృషి జరిగింది. ఆనాడు పౌర వసతులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. విద్యుత్ వెలుగులు విరజిమ్ముతూ ఆనాటి హైదరాబాద్ ఆరోగ్య నగరంగా, ఉద్యానవన నగరంగా, సరస్సుల నగరంగా పేరొందింది. పరాయి పాలన ఆరంభంలో 1957లో నాలుగవ మేయర్‌గా కృష్ణస్వామి ముదిరాజ్ ఉన్నప్పుడు ఆధునిక హైదరాబాద్‌ను రూపుదిద్దడానికి మాస్టర్ ప్లాన్ రూపొందించారు. తోపుడు బండ్లను నిషేధించి వీటిని నడిపించే వారికి పునరావాసం కల్పించడం ఆయన గొప్పతనం. ఆయన దృష్టిలో నగరమంటే మనుషులు. కానీ, వలస పాలన స్థిరపడేకొద్దీ హైదరాబాద్ అభివృద్ధి అంటే కబ్జాలు చేయడంగా, బంధుమిత్రుల రియల్ ఎస్టేట్ దందాగా మారిపోయింది. గతుకుల రోడ్లు, మురికి నీటితో నగర జీవనాన్ని నరకప్రాయంగా మార్చిన ఘనత వలస పాలకులది. ఒకప్పుడు దేశంలో ఐదవ స్థానంలో ఉన్న నగరం వలస పాలనలో ఆరవ స్థానానికి దిగజారింది.

ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నగర పూర్వ శోభను పునరుద్ధరించడానికి ఆసక్తి చూపడం తెలంగాణ వారికి ఆనందం కలిగిస్తున్నది. హైదరాబాద్ నగరాన్ని కనీసం నివాస యోగ్యంగా మార్చుకోవడం తక్షణావసరం.అభివృద్ధిని హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా మొత్తం తెలంగాణపై దృష్టి సారించాలె. ఆ అభివృద్ధి ఎటువంటిదై ఉండాలనే విషయమై చర్చించాలె. ఇంత కాలం తెలంగాణ అభివృద్ధి సీమాంధ్ర కోణంలో సాగింది. వారి అవసరాలే ప్రధానమయ్యాయి. ఇప్పుడు తెలంగాణ సమాజ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి జరగాలె.

తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యాలలో ఇదొకటి. రవాణా రంగం ఇందుకు ఒక ఉదాహరణ. ఉత్తర తెలంగాణకు కేంద్రమైన కరీంనగర్‌కు ఇప్పటి వరకు రైల్వే లైన్ లేదు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వచ్చి పరీక్షలు రాయాలంటే, బస్సులు దొరకక అనేక కష్టాలు పడడం చాలా మంది విద్యార్థులకు మరువలేని అనుభవం. అదే విజయవాడ, గుంటూరు వాసులు హైదరాబాద్‌కు ఆరామ్‌గా వచ్చి వెళ్ళవచ్చు. ఉద్యోగాలలో జోనల్ విధానం పెట్టి మిగతా జిల్లాల వారు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు రాకుండా అడ్డుకున్నారు. సీమాంధ్రులను నిబంధనలను ఉల్లంఘించి ఇక్కడకు తరలించడం పాలకవర్గ విధానంగా అమలయింది. ఇదే విధంగా రవాణా వ్యవస్థ సీమాంధ్ర జిల్లాల నుంచి హైదరాబాద్‌కు, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగించడానికి అనువుగా రూపొందింది. తెలంగాణ వారు విద్యా, వ్యాపారాల కోసం తిరగాడకుండా అణచివేయడానికి రవాణా తదితర వ్యవస్థలను ఉపయోగించారు. ఈ విధానాన్ని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చక్కదిద్దాలె. ఒకప్పుడు మరాట్వాడా, హైదరాబాద్- కర్ణాటక, బేరార్ నిజాం రాజ్యంలో భాగమే. మరాట్వాడా, విదర్భతో పాటు ముంబయి వరకు తెలంగాణవారు రాకపోకలు సాగిస్తుంటారు. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పెల్లి, ఆర్మూర్, నిజామాబాద్ తదితర ప్రాంతాల నుంచి తెల్లారితే చాలు అనేక ప్రైవేటు బస్సులు మహారాష్ట్ర వైపు పరుగులు పెడుతుంటాయి.

ధర్మపురి, జగిత్యాల తదితర చోట్ల నుంచి ముంబయికి మహారాష్ట్ర డిపోల బస్సులు నడుస్తున్నాయి. కరీంనగర్ నుంచి నాగ్‌పూర్, చంద్రాపూర్‌ల వరకు ప్రయాణాలు సాగిస్తుంటారు. జగ్దాల్‌పూర్, బస్తర్, చంద్రాపూర్, నాగ్‌పూర్ తదితర ప్రాంతాలతో కూడా కరీంనగర్ జిల్లావాసులకు వివాహ సంబంధాలున్నాయి. వరంగల్ జిల్లా నుంచి కూడా మహారాష్ట్ర ప్రాంతాలకు ఇచ్చిపుచ్చుకోవడం సాగుతున్నది. తెలంగాణకు మహారాష్ట్రతో బలమైన సామాజిక, వ్యాపార సంబంధాలు ఉన్నప్పటికీ సీమాంధ్ర పాలకుల పుణ్యమా అని తదనుగుణమైన రవాణా వసతి ఏర్పాటుకాలేదు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు రైలు వసతి లేక బస్సుల్లో ముంబయి వెళ్ల వలసి రావడం పెద్ద వింత! మోర్తాడ్- నిజామాబాద్ రైలు మార్గం పూర్తి కాలేదంటే పాలకులు ఇంత కాలం ఎంత వివక్ష చూపారో అర్థమవుతున్నది. కరీంనగర్ నుంచి ఇటు హైదరాబాద్‌కు, అటు ముంబయికి రైలు మార్గం వేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నించాలె. దీని వల్ల ఉత్తర తెలంగాణ కేంద్రంగా కరీంనగర్ అభివృద్ధి అనూహ్యంగా ఉంటుంది. తెలంగాణకు పశ్చిమ తీరం వరకు వ్యాపార సంబంధాలు భారీగా పెరుగుతాయి. వ్యాపారాభివృద్ధి వ్యూహాలు కూడా ఈ కోణంలో సాగాలె. తెలంగాణ చెరువుల చేపలు కలకత్తా నగరానికి సరఫరా అవుతున్నాయనే వాస్తవం చాలా మందికి తెలువదు.

హైదరాబాద్ నగరాభివృద్ధి అంటే ఇక్కడ స్థానికుల అభివృద్ధి కూడా. విద్యా, ఉద్యోగాలు, వ్యాపారం, సేవలు తదితర రంగాలలో స్థానికుల పట్ల చూపిన వివక్ష తొలగించేదిగా ఉండాలె. అప్పుడే మన హైదరాబాద్ అవుతుంది. పరాయి పాలనలో వివక్షకు గురైన నీటిపారుదల రంగంపై శ్రద్ధ పెట్టడం, వ్యవసాయాభివృద్ధికి చర్యలు తీసుకోవడం, బలహీనవర్గాలకు నిధులు కేటాయించడం, పంట రుణాల మాఫీ- తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకాలు, విధానాలన్నీ- తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణాభివృద్ధికి దోహదపడే చర్యలే. అయితే సామాజిక, వ్యాపార అభివృద్ధి వ్యూహాలను రచించే ముందు భిన్న రంగాలలో పేరుకు పోయిన వలస పెత్తనాన్ని హరించే తెలంగాణ కోణాన్ని దృష్టిలో పెట్టుకోవాలె. వలస పెత్తనాల్ని నిర్మూలించిన తర్వాతనే ఈ అభివృద్ధి తెలంగాణ అంతటికీ అందుతుందనే సత్యాన్ని పాలకులు విస్మరించకూడదు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి