గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, ఆగస్టు 25, 2014

బీ క్యాటగిరీ సీట్ల భర్తీలో...అక్రమాలు!

-వెబ్‌పోర్టల్‌లో నకిలీ దరఖాస్తులు
-అక్రమ మార్గంలో అడ్మిషన్లకు కాలేజీల యత్నం
ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో 30 శాతం యాజమాన్య (బీ) కోటా సీట్ల భర్తీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. పారదర్శకత కోసం ఉన్నత విద్యా మండలి వెబ్ పోర్టల్ ఏర్పాటు చేసినప్పటికీ.. యాజమాన్యాల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండాపోయింది. వెబ్‌పోర్టల్‌లో నకిలీ దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఎంసెట్‌లో టాప్‌ర్యాంకర్లు వంటి విద్యార్థుల నుంచి సర్టిఫికెట్లు సేకరిస్తూ ఆయా అభ్యర్థులకు తెలియకుండా యాజమాన్య సీట్ల భర్తీ వెబ్ పోర్టల్‌లో ఆన్‌లైన్ దరఖాస్తులను అప్‌లోడ్ చేస్తున్నట్లు సమాచారం. 
కార్పొరేట్ విద్యా సంస్థలతో లాలూచీ పడి టాప్ ర్యాంకులు సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్లను సేకరించి వెబ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఆ తర్వాత టాప్ ర్యాంకర్లంతా మంచి కాలేజీలకు వెళ్లిపోయారంటూ ఖాళీలను చూపిస్తూ తిరిగి భర్తీ చేసుకుంటున్నారు. ఇప్పుడా ప్రభావం నేరుగా ప్రతిభావంతులపై పడింది. ప్రస్తుతం రెండు రాష్ర్టాలలోని బడా కాలేజీలలో కూడా ఈ విధంగా నకిలీ దరఖాస్తులను వెబ్ పోర్టల్ ద్వారా అప్‌లోడ్ చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత దశాబ్దకాలంగా కన్వీనర్ కోటా సీట్ల భర్తీతో పాటు బీ కోటా సీట్ల భర్తీలోనూ అనేక అక్రమాలు వెలుగు చూశాయి.

గతంలో ఆన్‌లైన్ విధానంలో ఎంసెట్ సీట్లు భర్తీచేశారు. దీని వల్ల రిజర్వేషన్ల విధానంలో లొసుగులు ఉన్న విషయం వెలుగుచూసింది. దానికి విరుగుడుగా వెబ్‌బేస్డ్ ఆన్‌లైన్ విధానాన్ని పరిచయం చేశారు. ఇందులో కూడా లోపాలు ఉన్నట్లు అనేక ఫిర్యాదులు వచ్చాయి. వాటిని కూడా సరి చేసుకున్న సాంకేతిక విద్యాశాఖ రిజర్వేషన్ల విధానం, లోకల్, నాన్‌లోకల్ కోటాలో సీట్లను పక్కాగా భర్తీ చేస్తున్నట్లు ఆ శాఖ అధికారులు చెప్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొన్న విద్యార్థి పాస్‌వర్డును దొంగతనం చేసి, తమ కాలేజీలలో సదరు విద్యార్థికి సీట్లు వచ్చే  ఆప్షన్ ఎంపిక చేసుకున్నట్లు పోలీస్ విచారణలో వెలుగు చూసింది. దీనికి కొనసాగింపుగా బీ సీట్ల భర్తీలోనూ యాజమాన్యాలు అనేక అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.

30 శాతం కోటా సీట్లు నేరుగా భర్తీ చేసుకోవడానికి కాలేజీలకు అవకాశం ఉంటుంది. ఆ మేరకు బడా కాలేజీలలో బీ సీట్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దీంతో ఎక్కువ డొనేషన్లు చెల్లించిన వారికి సీట్లు ఇచ్చే సంప్రదాయం ప్రస్తుతం కొనసాగుతున్నది. ఈ క్రమంలో మెరిట్ పద్ధతిలో బీ క్యాటగిరీ సీట్లు భర్తీ చేయాలన్న ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆ విధానానికి చెక్ పెట్టాలని విద్యా మండలి అధికారులు ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో భాగంగా హైకోర్టులోనూ కేసులు దాఖలయ్యాయి. ఈ క్రమంలో బీ క్యాటగిరీ సీట్లు కూడా కన్వీనర్ సీట్ల మాదిరిగా ఆన్‌లైన్ ద్వారా భర్తీ చేయాలని గత ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

దానికనుగుణంగానే రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలోనే బీ సీట్ల భర్తీకి శ్రీకారం చుట్టింది. అయినా ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలు అక్రమ పద్ధతుల విధానాలను కొనసాగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. నకిలీ దరఖాస్తులను అడ్డుకోవాలని విద్యా వేత్తలు, విద్యార్థి సంఘాలు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు సూచిస్తున్నారు. నకిలీ దరఖాస్తుల విధానాన్ని అరికట్టి ప్రతిభ గల విద్యార్థులకు న్యాయం చేసే విధంగా నిబంధనలను కఠినతరం చేయాలని ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్ల సంఘం పీ మధుసూధన్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు.

డొనేషన్లు తిరిగి చెల్లిస్తున్న ఇంజినీరింగ్ కాలేజీలుప్రస్తుత విద్యా సంవత్సరంలో బీ సీట్ల భర్తీ కోసం వసూలు చేసిన డొనేషన్లు తిరిగి విద్యార్థులకు చెల్లించడానికి ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు ముందుకు వస్తున్నాయి. యూనివర్సిటీల నుంచి గుర్తింపు పొందిన 141 కాలేజీలు, గుర్తింపులేని 174 కాలేజీలకు సంబంధించిన కొన్ని కాలేజీ యాజమాన్యాలు బీ క్యాటగిరీ అడ్మిషన్ల నోటిఫికేషన్ కంటే ముందే విద్యార్థుల నుంచి డొనేషన్ల రూపంలో ఫీజులు వసూలు చేశాయి. కాని ఇప్పుడు ఆయా కాలేజీలలో దరఖాస్తు చేసుకోవాలనే విద్యార్థులు నేరుగా కాలేజీలకు కాకుండా ఉన్నత విద్యా మండలికి దరఖాస్తుల చేసుకోవాలని సూచించారు.

అందుకోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేశామని, విద్యార్థులు ఆ వెబ్ పోర్టల్‌లో తమ దరఖాస్తులను అప్‌లోడ్ చేయాలని అధికారులు స్పష్టంచేశారు. దీంతో విద్యార్థులంతా చెల్లించిన డొనేషన్లు తిరిగి ఇవ్వాలని కాలేజీ యాజమాన్యాలపై ఒత్తిడి తెస్తున్నారు. అందుకు చాలా కాలేజీలు ముందుకు వచ్చినట్లు తెలిసింది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి