గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, జులై 20, 2014

భూదానం భూతాల పాలు !

-భూదాన్ భూముల్లో బినామీల రాజ్యం.. వినోభా ఆశయాలకు గండి
- పేదలకివ్వాల్సిన భూముల్లో పెద్దల పాగా
- కుటుంబ సభ్యులకూ పంచుకున్న బోర్డు సభ్యులు
- సొసైటీల పేరిట రూ. వందల కోట్ల భూములకు ఎసరు
- రంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్ భూముల కైంకర్యం
- భూముల రక్షణకు నడుంకట్టిన తెలంగాణ సర్కార్
ప్రఖ్యాత అంతర్జాతీయ పత్రిక టైమ్ 1953 మే 11 సంచికపై ఆచార్య వినోబా భావే ఫోటోతో భారతదేశంలో భూదానోద్యమం గురించి కవర్‌పేజీ కథనం ప్రచురించింది. ముఖపత్రం కింద ఆ పత్రిక పెట్టిన శీర్షిక భావే వస్తున్నారు.. మిమ్మల్ని ప్రేమతో దోచుకోవడానికి.. అని. ప్రపంచమే హర్షించిన నిశ్శబ్ద విప్లవానికి నాంది పలికిన ఆ మహనీయుడి ఆశయాలకు ఉమ్మడి రాష్ట్రంలో సమాధి కట్టారు. ఆ అరవైఏళ్ల అంధకారయుగంలో భూబకాసురులు తేరగా వచ్చిన భూమిని ఆబగా కబ్జాలు పెట్టేశారు. కాలేజీలు, సిటీలు కట్టేశారు. పేదల కోసం పోగేసిన భూముల్లో వ్యాపారాలు చేసి ఆకాశ హర్మ్యాలు వేసి కోట్ల పంట పండించుకున్నారు.
కంచే చేను మేసినట్టు భూదాన్ బోర్డు బాధ్యులు తామే డైరెక్టర్లుగా ఉన్న సంస్థలకు భూములు మంజూరు చేయించుకున్నారు. భార్యాపిల్లలకే కాదు.. వారి డ్రైవర్లు, పనిమనుషుల పేరిట కూడా యథేచ్ఛగా భూపందేరం జరుపుకున్నారు. ఇవాళ ఆ అంధకారం భగ్నమైంది. భూదాన భూముల చెరవదిలించే అపూర్వ దృశ్యాన్ని చూడాలని స్వాతంత్య్ర యోధులు, సర్వోదయ నాయకులు, తెలంగాణవాదులు కూడా ఎదురు చూస్తున్నారు.
bhudanamభూదాన్ ఉద్యమంలో భాగంగా ఆచార్య వినోబా భావే తెలంగాణలో సేకరించిన లక్ష ఎకరాల పైచిలుకు భూముల్లో సింహభాగం అన్యాక్రాంతమయ్యాయి. భూమిలేని నిరుపేదల దారిద్య్రం చూసి చలించి ఆయన ప్రారంభించిన నాటి భూదానోద్యమానికి ఎంతోమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వందలకొద్దీ ఎకరాల భూములను దానం చేశారు. తెలంగాణలో 1.70 లక్షల ఎకరాలు భూదానోద్యమ ఖాతాకు చేరాయి. వాటిని పేదలకు పంచేందుకు ఆచార్య వినోబా భావే నియమ నిబంధనలు రూపొందించారు.

కానీ అవన్నీ గంగలో కలిశాయి. భూదాన యజ్ఞ బోర్డు కమిటీ వారి అనుయాయులకు, సంపన్నవర్గాలకు, పాలకవర్గాలకు, పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టారు. రాష్ట్ర రాజధాని శివార్లలో ఎకరా రూ. కోట్లు విలువజేసే భూముల్లో ధనిక వర్గాల సామ్రాజ్యాలు ఏర్పడ్డాయి. రియల్ వెంచర్లు వెలిశాయి. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల మద్దతు, ప్రోత్సాహంతో భూములు అన్యాక్రాంతమయ్యాయి. లక్షల ఎకరాలు హారతి కర్పూరమయ్యాయి.

ఏమిటా భూదాన్ ఉద్యమం..?

bhudanam2నిజాం లొంగుబాటు అనంతరం తెలంగాణ ప్రాంతం సాయుధపోరాటంతో నెత్తురోడుతున్న సమయంలో సర్వోదయ నాయకుడు ఆచార్య వినోబా భావే ఆ ప్రాంతాల్లో పర్యటనకు బయలు దేరారు. ప్రజల అసలు సమస్య ఏమిటి? రక్తపాతం నివారించేందుకు చేయాల్సిందేమిటి అనే అన్వేషణ ఆయనది. 1951 ఏప్రిల్ 18న నల్లగొండ జిల్లా పోచంపల్లికి ఆయన చేరుకున్నారు. ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దళితవాడకు వెళ్లి వారితో ఆయన సంభాషించారు. ప్రభుత్వం వారికి భూములు ఇవ్వలేకపోయిందని (మొదటి పేజీ తరువాయి) గుర్తించారు. భూమితోనే అసలు సమస్య ముడిపడి ఉన్నదని గుర్తించారు. అదే రోజు గ్రామస్తులతో జరిగిన సమావేశంలో ప్రభుత్వం భూములు సమకూర్చలేకపోతే ఆ పని గ్రామస్తులైనా చేయవచ్చు కదా! అని ప్రశ్నించారు.

ఆ వెంటనే గ్రామ భూస్వామి వెదిరె రామచంద్రారెడ్డి తన వంద ఎకరాల భూమిని దానంగా ప్రకటించారు. వినోభాకు పరిష్కారం దొరికింది. పోచంపల్లి స్ఫూర్తితో సర్వోదయ ఉద్యమంలో భాగంగా భూదాన ఉద్యమం రూపు దిద్దుకుంది. దేశమంతా ఈ సందేశంతో ఆయన విస్తృత పర్యటనలు జరిపారు. లక్షలాది ఎకరాల భూమిని సేకరించారు. దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం కింద సేకరించిన భూమి 48 లక్షల ఎకరాలు కాగా తెలంగాణలో లక్షా 70 వేల ఎకరాలు సేకరించారు. ఈ భూములన్నీ వ్యక్తిగతంగా పంచడం సాధ్యం కాదు కాబట్టి ఆయా రాష్ర్టాల్లో భూదాన్ బోర్డులు ఏర్పాటు చేశారు. భూముల పంపిణీకి మార్గదర్శకాలు నిర్దేశించారు.

భూముల కేటాయింపు మార్గదర్శకాలు...

bhudanam3గ్రామ సభల ద్వారా భూమి లేని నిరుపేదల జాబితాను తయారు చేయాలి. అవసరమైతే లాటరీ పద్ధతిని అనుసరించాలి. గ్రామ సభలో సర్పంచులు, గ్రామ సహాయకులు, సామాజిక సేవకులు, భూదాతలు పాల్గొనాలి. గ్రామ సభ గురించి రెండు రోజుల ముందుగానే దండోరా వేయించాలి. లబ్ధిదారులు భూమిలేని వ్యవసాయ కూలీలై ఉండాలి. ఎస్సీలకు 34 శాతం, మిగతా వారికి 66 శాతం వాటా ఉంటుంది. లబ్ధిదారుడు అంటే అతడికి గాని, అతడి కుటుంబ సభ్యులకు గాని భూమి ఉండరాదు. లబ్ధిదారులకు ఖుష్కి ఐతే ఎకరం నుంచి గరిష్ఠంగా ఐదెకరాల వరకు ఇవ్వొచ్చు. అనర్హులు ఉన్నట్లు ఎప్పుడు తేలినా రద్దు చేసి అర్హులకు ఇవ్వొచ్చు. 1965 భూదాన గ్రామ దాన చట్టానికి విరుద్ధంగా ఏ లబ్దిదారుడైతే భూదాన భూములను విక్రయించినచో పూర్తి వివరాను సేకరించి బోర్డుకు తగు చర్య కోసం తెలుపొచ్చు.

సర్వ సేవా సంఘ్..

నా ఉద్యమం ఫలితంగా పలు రాష్ర్టాల్లో భూమిని సేకరించి పేదలకు పంపిణీ చేసేందుకు ముందుకొచ్చాయి. దీని కోసం సర్వ సేవా సంఘ్‌ను నామినేట్ చేస్తున్నా. నా బదులుగా సర్వ సేవా సంఘ్ కార్యకలాపాలను నిర్వహిస్తుంది... అంటూ తేదీ.8-1-1973న బోర్డు కార్యకలాపాల నిర్వహణ గురించి వినోభా భావే లిఖితపూర్వకంగా అనుమతి ఇచ్చారు. అప్పటి నుంచి సర్వ సేవా సంఘ్ సూచించిన వ్యక్తులను భూదాన బోర్డుకు కమిటీ ప్రతినిధులుగా ఆయా రాష్ర్టాల ప్రభుత్వాలు నియమిస్తున్నాయి.

ఆనవాయితీకి భిన్నంగా చైర్మన్ నియామకం...

listtఉమ్మడి రాష్ట్రంలో చాలా కాలం పాటు సీవీ చారి అనే వ్యక్తి చైర్మన్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జీ రాజేందర్‌రెడ్డి బోర్డులోకి రంగప్రవేశం చేశారు. సర్వ సేవా సంఘ్‌కు బదులుగా మహిళా చేత్నా కేంద్ర అధ్యక్షురాలు డా వీణాబెహన్ సిఫారసుతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి దరఖాస్తు చేసుకున్నారు. సర్కారు 2012 డిసెంబరు 14న గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అందులో చైర్మన్‌గా రాజేందర్‌రెడ్డితో పాటు మాజీ చైర్మన్ సీవీ చారిని సభ్యుడిగా చేర్చారు. ఈ విషయాన్ని గుర్తించిన సర్వ సేవా సంఘ్ కమిటీ కన్వీనర్ గౌరంగచ్ మహాపాత్రో బోర్డు ప్రతినిధులను రాజీనామా చేయాలని ఆదేశించడంతో బోయినపల్లి వెంకటరామారావు, జీవీ సుబ్బారావు ఈ ఫిబ్రవరిలో రాజీనామా చేశారు. తేదీ. 20-2-2014న వీణాబెహన్‌ను వివరణ కోరగా ఆమె తేదీ.21-3-2014న బదులు ఇస్తూ తనెవరికీ సిఫారసు చేయలేదని తెలిపారు. 2013 ఫిబ్రవరి 21న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి సర్వ సేవా సంఘ్ లేఖ రాస్తూ ప్రస్తుత కమిటీని రద్దు చేయాలని సిఫారసు చేసింది.

ఎక్కడెక్కడ ఎంతెంత కైంకర్యం?..

రెండు దశాబ్దాలుగా సాగిన భూ బాగోతంపై నమస్తే తెలంగాణ దృష్టి సారించినపుడు అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే సాగిన దందాలో కోట్లకు కోట్లు చేతులు మారినట్టు తేలింది. భూదాన్ భూముల్లో జరిగిన అక్రమాల చిట్టా చాలా పెద్దది.

- హయత్‌నగర్ మండలం పిగ్లిపురం సర్వే నెం.17లో 60 ఎకరాలను బడాబాబులకు ధారాదత్తం చేశారు. సత్యం లెర్నింగ్ క్యాంపస్ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరిట 12 మందికి ఐదెకరాల వంతున 60 ఎకరాలను ప్రొసిడింగ్ నెం.18270 నుంచి 18281 వరకు జారీ చేశారు. ప్రొసిడింగ్స్ పొందిన వారిలో టీ సత్యనారాయణ, ఆర్ పద్మ, వై రత్నకుమారి, బీ సూర్యనారాయణ, పీ మణికంఠేశ్వర, రమణమూర్తి, పీ రాధిక, ఎస్ మాధవి, పీ భవాని, కే యశోద, బీ నారాయణ తదితరులు ఉన్నారు.

ఇందులో రాయలసీమకు చెందిన గంగిరెడ్డి అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ కళాశాలను కట్టేశారు. 2006లో ఎకరం స్థలంలో బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించారు. నిబంధనలను ఉల్లంఘించినందున చర్యలు తీసుకోవాలని కోరుతూ హయత్‌నగర్ డిప్యూటీ కలెక్టర్ నెం.సి/736/2005, తేదీ.18-08-2009న భూదాన్ యజ్ఞ బోర్డు కార్యదర్శికి నోటీసులు జారీ చేశారు. కానీ ఇప్పటి వరకు ఆచరణలో పెట్టలేదు. ఇందులో రూ.50 లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. పైగా ఈ స్థలం భూదాన్ బోర్డుకు చెందినదని తెలిసి కూడా హయత్‌నగర్ డిప్యూటీ కలెక్టర్ తేదీ.29-11-2004న ఎడ్యుకేషనల్ సొసైటీకి వినియోగించుకోవచ్చునంటూ ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్‌ను జారీ చేశారు.

- హయత్‌నగర్ మండలం తారామతిపేట సర్వే నెం.215, 216, 217లో 59.10 ఎకరాలు అన్యాక్రాంతమైంది. వ్యవసాయం కోసం 48 మందికి పట్టాలు ఇవ్వగా అందులో వెంచర్లు చేసి అమ్ముకున్నారు. రాజేంద్రనగర్ మండలం వట్టినాగులపల్లి సర్వే నెం.186, 187, 188, 189ల్లో 29.26 ఎకరాలు, హయత్‌నగర్ మండలం కుంట్లూరు దగ్గర పాపాయిగూడలో సర్వే నెం.219, 224ల్లో 82.39 ఎకరాలు అన్యాక్రాంతమైంది.

- మహేశ్వరం మండలంలో 300 ఎకరాల్లో పెద్దలు రాజ్యమేలుతున్నారు. నాగారంలో సర్వే నం.181/1, 181/2, 181/3లో 50 ఎకరాలు ఉంది. దీన్ని రికార్డుల్లో భూదాన్ ఖరీజ్‌ఖాతాగా చూపిస్తున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో అది కుంచించుకుపోయింది. మంఖల్ సర్వే నెం.132లో 6.33 ఎకరాలు ఆర్ కృష్ణారెడ్డి, తుమ్మలూరు సర్వే నెం.312లో 8 ఎకరాలు ఆమనగంటి సుధాకర్‌రెడ్డి, పోరండ్ల సర్వే నెం.97లో 5 ఎకరాలు జీ పుష్పలత, మెట్టు లక్ష్మిల ఆక్రమణంలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. సిరిగిరిపూర్ సర్వే నం.68/1లో 2.31 ఎకరాలు షేక్ బూబకర్‌కు, పోరండ్ల సర్వే నెం.17/ఎ2లో 1.10 ఎకరాలను బీఆర్ రవితేజకు అసైన్ చేయగా ఇండ్లు వెలిశాయి.

- మహేశ్వరం మండలం మంఖల్ సర్వే నం.447, 449, 450, 453లో 55.35 ఎకరాలు, హయత్‌నగర్ మండలం పాపాయిగూడ సర్వే నం.215, 224లో 100 ఎకరాలను, ఇబ్రాహింపట్నం మండలం ఆదిబట్ల సర్వే నం.51, 52, 53లో సుమారు 30 ఎకరాలు, కూకట్‌పల్లి సర్వే నం.353, 354లో 24.26 ఎకరాలు, హయత్‌నగర్ మండలం బాటసింగారం సర్వే నం.319లో 13.35 ఎకరాల్లో లేఅవుట్లు చేశారు. చాలా వరకు ప్రైవేటు వ్యక్తుల పరమైంది. ఒక్కొక్కరి పేరిట పది, ఇరవై ప్లాట్లు రాయించుకొని ఇతరులకు విక్రయించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆదిబట్లలో సర్వే నం.67లో 17.31 ఎకరాలను ఏపీఐఐసీ స్వాధీనం చేసుకుంది. దీన్ని టీసీసీ కంపెనీకి కట్టబెట్టింది. కర్మన్‌ఘాట్ సర్వే నం.57/2లో 7 ఎకరాలకు లే అవుట్ చేశారు. దీని విలువ రూ.200 కోట్ల పైమాటే.

చైర్మన్ నేతృత్వంలోని సొసైటీకి ...

ఇబ్రహీంపట్నం బాగ్ ఇబ్రహీంపట్నం సర్వే నం. 581/69లో 100 ఎకరాలు భూదాన్ యజ్ఞ బోర్డు స్థలం ఉంది. దీన్ని వినోభా బావే డెవలప్‌మెంట్ సొసైటీకి భూదాన్ యజ్ఞ బోర్డు ప్రొసిడింగ్ నెం.22948, తేదీ.17-1-1986న కట్టబెట్టింది. అయితే భూదాన్ బోర్డు చైర్మన్‌గా ఉన్న జి రాజేందర్‌రెడ్డే ఆ సొసైటీకి ఆపరేషనల్ డైరెక్టర్‌గా ఉండడం గమనార్హం. క్రయ విక్రయాలు జరుపొద్దన్న నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి రాజేందర్‌రెడ్డి సేల్ డీడ్ డాక్యుమెంట్ నం.3961/2008 ద్వారా 50 ఎకరాలను ఎం అంబాదాస్, కే శ్రీనివాస్‌రెడ్డి, బోయపల్లి శ్రీరాములు, వంగాల శ్రీను, బీ మధుసూదన్‌ల పేరిట రూపొందించారు.

ఎకరానికి రూ.3 లక్షలుగా పేర్కొన్నారు. అలాగే కామధేను డెయిరీ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌కు సేల్ డీడ్ నెం.6137/2008 ద్వారా 15 ఎకరాలను కట్టబెట్టారు. దానికి కూడా మేనేజింగ్ డైరెక్టర్‌గా జీ రాజేందర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. అలాగే ఎస్వీఎస్ రైతు డెయిరీకి సేల్ డీడ్ నెం.1901/2009 ద్వారా 30 ఏళ్ల పాటు ఎకరానికి ఏడాదికి రూ.75 వేలకు 35 ఎకరాలను జీ కృష్ణాచంద్ర, అరుణలకు ఇచ్చారు. ఐతే ఈ కృష్ణాచంద్ రాజేందర్‌రెడ్డి కొడుకు కావడం, అరుణ అంబాదాస్ భార్య కావడం విశేషం. ఈ కుట్ర బయటపడి డీడ్ నెం.4659/12, 4660/12ల ద్వారా సేల్‌డీడ్, లీజు డీడ్‌ల ద్వారా రద్దు చేశారు. దీనిపై తేదీ 29-10-2013న లోకాయుక్తకు ఫిర్యాదు అందింది. విచారణకు రంగారెడ్డిజిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

ఒట్టినాగులపల్లిలో బినామీల దందా

రాజేంద్రనగర్ మండలం ఒట్టినాగులపల్లి సర్వే నెం.186, 187, 188, 189 నెంబర్లల్లో రూ.200 కోట్ల విలువైన 29.27 ఎకరాలను బోర్డులోని సభ్యుల బినామీల పేరిట 2006 జూన్ 12న పట్టాలు ఇచ్చారు. అందులో చైర్మన్ రాజేందర్‌రెడ్డి బంధు మిత్రులు 20 మంది, మాజీ చైర్మన్ సీవీ చారి బంధువులు 12 మంది, మాజీ ఆర్గనైజర్ ఎన్ రాఘవరావు బంధువులు 10 మంది ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 60 మంది లబ్దిదారుల జాబితాను రూపొందించారు. ఆఖరికి డ్రైవర్లు, పని మనుషులకు కూడా స్థలాలు ఇచ్చారు.

ఈ మేరకు రాజేంద్రనగర్ డిప్యూటీ కలెక్టర్ కూడా 2007 ఫిబ్రవరి 15న భూ మార్పిడికి ఉత్తర్వులు నం.డి/8616/2005ను జారీ చేశారు. ఈ 60 మంది సదరు 29.27 ఎకరాలను అమ్మేందుకు నాగులపల్లి రాఘవరావు(ఆర్గనైజర్, భూదాన్ యజ్ఞ బోర్డు రంగారెడ్డి)కు పవర్ ఆఫ్ అటర్నీ అప్పగిస్తూ డాక్యుమెంటు నెం.18570, తేదీ.5-11-2007న రాసుకున్నారు. సదరు రాఘవరావు రూ. వందల కోట్ల విలువైన స్థలాన్ని అబ్రిడ్జ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే సంస్థకు విక్రయించేందుకు ప్రయత్నించారు. పెద్ద ఎత్తున గందరగోళం జరుగడంతో రద్దు చేసుకున్నారు. అటు ఇటు తిరిగి బోర్డుపై విమర్శలు రావడంతో 60 మంది పట్టాలను రద్దు చేశారు.

ఇబ్రహింపట్నం, మంచాల మండలాల్లో 800 ఎకరాల్లో పాగా

రంగారెడ్డి జిల్లా మంచాల, ఇబ్రహింపట్నం మండలాల్లోనే వందలాది ఎకరాల భూదానోద్యమ భూములను అన్యాక్రాంతమైనట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తులో తేలింది. భూదానోద్యమ ఫలితంగా లభించిన 535.26 ఎకరాలతో పాటు వెట్టిచాకిరిలో మగ్గిన కార్మికులకు ఇచ్చిన 266.10 ఎకరాలను ఒకే రియల్ ఎస్టేట్ సంస్థ(జనహర్ష) కొనుగోలు చేసింది. నాగన్‌పల్లిలో రిజర్వ్ ఫారెస్టుకు చెందిన 2 ఎకరాలు కూడా కబ్జాకు గురైంది. రెవెన్యూ డివిజనల్ అధికారి ముందు ఎలాంటి డిక్లరేషన్లు చూపించకుండా సీలింగ్ లిమిట్ చట్టాన్ని ఉల్లంఘించినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ గుర్తించింది. సదరు సంస్థ ఆంధ్రప్రదేశ్(తెలంగాణ ప్రాంతం) ల్యాండ్ రెవెన్యూ రూల్స్ (వ్యవసాయేతర వినియోగం మార్పిడి చట్టం 2006) 1951 రూల్ 70, సెక్షన్ 3ని ఏ మాత్రం పట్టించుకోలేదు. రియల్ ఎస్టేట్ సంస్థలు అనధికారికంగా ఎన్నో లే అవుట్లను రూపొందించి ప్లాట్లను విక్రయించినట్లు రుజువైంది. ఆఖరికి హెచ్‌ఎండీఏ యాక్ట్ 2008 రూల్ 20(1), రూల్ 20(5)ని కూడా పట్టించుకోకుండా యథేచ్ఛగా భూదందాను కొనసాగిస్తున్నారు.

రూ.6.73 కోట్లు ఎగవేసిన రియల్ ఎస్టేట్లు..

రియల్ ఎస్టేట్ సంస్థలు నాలా మార్పిడి, లే అవుట్ ప్రాసెసింగ్, డెవలప్‌మెంట్ ఫీజులతో పాటు మినరల్ సెస్ వంటి అంశాలను కూడా పట్టించుకోలేదు. దీని ద్వారా ప్రభుత్వానికి వ్యవసాయేతర వినియోగానికి చెల్లించవల్సిన ఫీజు రూ.64,04,430తో పాటు మైనర్ మినరల్స్‌ను వినియోగించుకున్నందుకు గాను రూ.3,97,30,720లు నష్టం వాటిల్లింది. మొత్తంగా పెనాల్టీలతో కలిసి రూ.6.73 కోట్లు ఎగనామం పెట్టినట్లు తేలింది. అటవీ శాఖకు కూడా గత నవంబరులోనే రెండెకరాలు కబ్జాకు గురైనట్లు విజిలెన్స్ లేఖ రాసింది. కానీ నేటికీ పట్టించుకోలేదు.

కారు చీకట్లో కాంతిరేఖ..

స్వరాష్ట్రమైన తెలంగాణ తన పూర్వవైభవాన్ని పునరుద్ధరించుకునే చర్యలు చేపట్టింది. ఇష్టారాజ్యంగా భూములను ఆక్రమించి పండగ చేసుకున్న స్వార్థపరుల ఆట కట్టించి భూములు కక్కిస్తోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భూదాన్ భూముల ప్రస్తావన తేవడంతో అనేకమంది స్వాతంత్య్రయోధులు, సర్వోదయ నాయకుల ఆశలు చిగురిస్తున్నాయి. ఈ క్రమంలోనే భూదాన యజ్ఞ బోర్డును ప్రభుత్వపరం చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. రెవెన్యూ యంత్రాంగం ఈ భూములపై క్షేత్ర స్థాయిలో దర్యాప్తు చేపట్టింది. చరఖా పట్టి నూలు వడికిన నాటి తరం వాళ్లు, వాళ్ల వారసులు మంచి రోజులు వచ్చాయని ఆనందిస్తున్నారు.

సిగ్గు...సిగ్గు

సేకరించడం చేతకాదు.. పేదలకు భూములివ్వడానికి మనసు రాదు.... ప్రభుత్వాలకు కనీసం భూదాన్ భూముల రక్షణ కూడా చేతకావడం లేదు. దేశవ్యాప్తంగా భూదాన్ భూముల వ్యవహారం మీద లోకసభలో 2012 సెప్టెంబర్ 11న ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. నాటి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేశ్ సమాధానమిస్తూ భూదాన్ భూముల రక్షణపై నిస్సహాయత వ్యక్తం చేశారు.

వినోబా దేశవ్యాప్తంగా 48 లక్షల ఎకరాలు సేకరించారని అందులో 24 లక్షల ఎకరాలు పేదలకు పంచామని ఆయన చెప్పారు. మిగతా భూముల వివరాలు గల్లంతయ్యాయని చెప్పారు. ఆ భూముల దస్తావేజులు లభించడం లేదని దాంతో ఆ భూమి ఏమైందో చెప్పలేక పోతున్నామని నిండు లోక్‌సభలో చెప్పారు. రెవెన్యూశాఖలు ఈ విషయంపై శ్రద్ధ చూపకపోవడంతో సమస్య వచ్చిందని వాపోయారు. రాజస్థాన్, మధ్య ప్రదేశ్ , జార్ఖండ్, బీహార్, ఆంధ్రప్రదేశ్‌లో ఈ సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి