-నిగ్గుతేల్చేందుకు కమిటీ వేసిన కేసీఆర్
-స్థానికతపై సీమాంధ్ర ఉద్యోగుల డాక్యుమెంట్లను పరిశీలించనున్న కమిటీ
-ఉద్యోగుల విభజనలో మార్గదర్శకాల్లోని మతలబులేమిటి?
నేడు కొంపల్లిలో ఉద్యోగ సంఘాల నేతలతో టీఆర్‌ఎస్ అధినేత కీలక భేటీ
మున్పిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తిష్ఠవేసిన సీమాంధ్ర ఉద్యోగులను తిప్పి పంపిస్తామన్న కేసీఆర్
రాష్ట్ర విభజన తుదిఘట్టంలో ఉద్యోగుల స్థానికత నిర్ధారణ, విభజన మార్గదర్శకాల్లోని లోటుపాట్లు తదితర అంశాలపై తెలంగాణ ఉద్యోగులలో పెల్లుబుకుతున్న ఆందోళనను గమనించిన టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు, రాష్ర్టానికి కాబోయే ముఖ్యమంత్రిగా రంగంలోకి దిగారు. ఉద్యోగుల స్థానికతను నిర్ధారించేందుకు ముగ్గురు ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, పీ మహేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ స్వామిగౌడ్, ఇద్దరు ఉన్నతాధికారులు సభ్యులుగా బుధవారం ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
గురువారం తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలతో కేసీఆర్ కీలకభేటీ నిర్వహించనున్నారు. ఉద్యోగుల విభజనకు రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు తెలంగాణ ఉద్యోగులను రోడ్డున పడేసేలా ఉన్నాయని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ మండిపడుతున్నది. ఈ విషయంలో ప్రభుత్వ తీరు తాంబూలాలు ఇచ్చాం, తన్నుకు చావండి అన్నట్లుగా ఉందని సంఘం నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సచివాలయంలో 200 మంది సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణకు బట్వాడా చేసి అగ్నిలో ఆజ్యం పోశారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులు సమర్పించిన డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించేందుకు కేసీఆర్ ఈ కమిటీని ఏర్పాటుచేశారు. ఇలావుండగా, తెలంగాణ జిల్లాలతోపాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో అక్రమంగా తిష్ఠవేసిన సీమాంధ్ర ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కింద పనిచేసేందుకు తిప్పి పంపిస్తామని కేసీఆర్ తనను కలిసిన తెలంగాణ మున్సిపల్ అధికారుల సంఘం నేతలకు స్పష్టంచేశారు. ఉద్యోగుల పంపిణీ, స్థానికత తదితర అంశాలపై రాష్ట్రప్రభుత్వం పక్షపాత ధోరణిని అవంలంబిస్తున్నదన్న తెలంగాణ ఉద్యోగ సంఘాల ఆందోళనల మధ్య కీలకమైన ఈ దశలో అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించేందుకు గురువారం ఉదయం 11 గంటలకు కొంపల్లిలోని ఆర్‌డీ కన్వెన్షన్ సెంటర్‌లో కేసీఆర్ సమావేశం ఏర్పాటుచేసినట్టు ఆయన రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖల ఉద్యోగ సంఘాల నేతలు ఈ సమావేశానికి హాజరై తగిన సూచనలు, సలహాలు అందించాలని ఆయన తెలిపారు.
ఉద్యోగ సంఘాలతో సమావేశం ఉన్నందున గురువారం కేసీఆర్ సందర్శకులకు అందుబాటులో ఉండరని తెలిపారు. తెలంగాణ ఉద్యోగుల సంశయాలన్నింటికీ సమాధానాలు వెదికే దిశగా, ప్రతి జిల్లాలో పదివేల ఉద్యోగాల భర్తీ చేస్తామన్న టీఆర్‌ఎస్ హామీపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్టు టీఆర్‌ఎస్ వర్గాలు నిర్ధారించాయి. మార్గదర్శకాలపైన ఉద్యోగ సంఘాలు చెప్పిన అభ్యంతరాలన్నింటిపైన ఇందులో చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఉద్యోగ సంఘాలను ఆహ్వానించే బాధ్యతను శ్రీనివాస్‌గౌడకు అప్పగించారు. కమిటీలో ఉండే ఇద్దరు ఐఏఎస్ అధికారుల పేర్లను గురువారం ప్రకటిస్తామని శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఇదేవిధంగా ఉద్యోగుల సమస్యలను తెలియచేసేందుకు, విజ్ఞాపనలను స్వీకరించేందుకు ప్రత్యేకంగా సెల్‌ను ఏర్పాటు చేయనున్నారు. సమస్యలను కమిటీ చర్చించి రేపటి తెలంగాణ ప్రభుత్వానికి పరిష్కారాలను సూచించనున్నది.
వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కేసీఆర్ విడిగా మాట్లాడి సమస్యలను తెలుసుకొంటారు. ముఖ్య ఉద్యోగ సంఘాల నాయకులతో కమిటీని ఏర్పాటుచేయనున్నారు. ఈ క్రమంలోనే గురువారం సమావేశంలో చర్చించాల్సిన అంశాలు, జూన్ 2 తర్వాత పరిపాలన సందర్భంలో వచ్చే సమస్యలు, ఉద్యోగుల ఆందోళనలను వెంటనే చల్లార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలతో ఎజెండా సిద్ధం చేశారు. బుధవారం ఈ ఎజెండాపై కేసీఆర్ ఉద్యోగసంఘాల నేతలతో సమావేశం జరిపారు.
తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ జీ.దేవీప్రసాద్, సెక్రటరీ జనరల్ సీ.విఠల్, గ్రూప్-.1 అధికారుల సంఘం చైర్మన్ చంద్రశేఖర్‌గౌడ్, సెక్రటేరియట్ తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ ఎం.నరేందర్‌రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాగా 610 జీవో, గిర్‌గ్లానీ సిఫారసులు తదితర తెలంగాణ ఉద్యోగుల సమస్యలపై అవగాహన కలిగిన టీ.హరీశ్‌రావు, సకల జనుల సమ్మె వంటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక భూమిక పోషించిన శ్రీనివాస్‌గౌడ్ వంటి నాయకులు ఉద్యోగుల సమస్యల పరిష్కారాల కమిటీలో ఉండటం ఆహ్వానించతగ్గ పరిణామమని, ఈ కమిటీనీ, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్‌ఎస్ అధినేత చూపుతున్న చొరవను స్వాగతిస్తున్నామని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్ తెలిపారు.
తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీలోని 70 సంఘాల ప్రతినిధులు, అధ్యక్ష కార్యదర్శులు, కన్వీనర్లు, 10జిల్లాల తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీలో భాగస్వామ్య సంఘాలుగా ఉన్న ఆర్‌టీసీ, విద్యుత్తు, పబ్లిక్‌సెక్టార్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీ, వివిధ కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఉద్యోగుల విభజనలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకసూత్రాలు, మార్గదర్శక సూత్రాలపైన తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ తెలియచేసిన అభ్యంతరాలు, వాటిని సవరించాల్సిన అవసరాలు, సవరించాల్సిన మార్గాలు తదితర అంశాలను కేసీఆర్ వివరించనున్నారు.
తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు స్వచ్ఛందంగా తమ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో వెళ్లాలని, అనవసర రాద్దాంతానికి అవకాశం ఇవ్వవద్దని ఈ సమావేశం నుంచి సీమాంధ్ర ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేయనున్నారు. తెలంగాణ ఉద్యోగసంఘాల జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్ విభజన సందర్భంలో వస్తున్న సమస్యలన్నింటినీ వివరించనున్నారు. గతంలో జీవోఎం సభ్యులతో, కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు అనిల్‌గోస్వామి, రాజీవ్‌శర్మ, విభజన కమిటీ చైర్మన్ కమలనాథన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి పీ.కే. మహంతితో జరిపిన చర్చలను కూడా ప్రస్తావించనున్నారు.
సీమాంధ్ర అక్రమార్కుల ఆగడాలు అన్నీ...ఇన్నీ...కావు!
ప్రతి శాఖలో...ప్రతి ఒక్కటీ...వాళ్ళ మోసాన్ని ప్రకటించేదే!
వీరిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టరాదు.
అక్రమాలు బయటపెట్టాలి...తగిన శిక్షవేయించాలి...
అప్పుడుగానీ వీళ్ళ తిక్కకుదరదు...మన తెలంగాణులకు న్యాయంజరగదు!
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో...)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి