- ఒక్క మల్కాజిగిరి సెగ్మెంట్ లెక్క ఇది
- 3 నెలల్లో జోరుగా బోగస్ ఓట్ల నమోదు
- హైదరాబాద్ శివార్లలో ఆంధ్రామాయ
- చిరునామా లేకుండానే ఓటర్లుగా రిజిస్టర్
- నకిలీలతో ఎన్నికల ఫలితాలు తారుమారు
- ఖమ్మంలోనూ ఇదే పరిస్థితి..
- ఆధార్ లింక్‌తో బయటపడుతున్న మోసం
ఊహించినట్లే హైదరాబాద్ నగర శివార్లలో బోగస్ ఓట్ల గుట్టు రట్టవుతున్నది. బోగస్ ఓట్లు కుప్పలుతెప్పలుగా బయటపడుతున్నాయి. గత ఏడాది సాధారణ ఎన్నికలకు ముం దు ఆంధ్ర వలస ఓటర్లు ఆన్‌లైన్‌లో జరిపిన కుట్ర ఆధార్ కార్డు అనుసంధానంతో బట్టబయలవుతున్నది. ఎన్నడూ లేని విధంగా గత సార్వత్రిక ఎన్నికలకు మూడు నెలల ముందు లక్షలాదిగా పుట్టుకొచ్చిన బోగస్ ఓట్లు ఎన్నికల ఫలితాలను తారుమారు చేశాయి. ఒక్క మల్కాజిగిరి పార్లమెంట్ నియోజవర్గంలోనే దాదాపు 6,40,000 పైచిలుకు బోగస్ ఓట్లు నమోదైనట్లు తాజా పరిశీలనలో తేలింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. బోగస్ ఓట్ల ఏరివేతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. - 3 నెలల్లో జోరుగా బోగస్ ఓట్ల నమోదు
- హైదరాబాద్ శివార్లలో ఆంధ్రామాయ
- చిరునామా లేకుండానే ఓటర్లుగా రిజిస్టర్
- నకిలీలతో ఎన్నికల ఫలితాలు తారుమారు
- ఖమ్మంలోనూ ఇదే పరిస్థితి..
- ఆధార్ లింక్‌తో బయటపడుతున్న మోసం
హైదరాబాద్ శివార్లలోనే కాకుండా ఖమ్మం జిల్లా కొత్తగూడెం తదితర నియోజకవర్గాలలో కూడా బోగస్ ఓట్లు వేల సంఖ్యలో బయటపడుతున్నాయి. 2009లో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సుమారు 23, 50,000 ఓటర్లుండగా 2014 సార్వత్రిక ఎన్నికల నాటికి ఏకంగా 31,83,000కు పెరిగారు. ఎన్నికలకు కేవలం మూడునెలల ముందే దాదాపు ఆరు లక్షల పైచిలుకు ఓటర్లు ఆన్‌లైన్‌లో నమోదైనట్లు అధికారుల పరిశీలనలో స్పష్టమైంది. వారందరికీ అటు ఆంధ్రాలోనూ ఇటు తెలంగాణలోనూ ఓట్లున్నట్లు తేలింది. వాస్తవానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు హైదరాబాద్‌లో తమ పట్టునిలుపుకోవడానికి ఆన్‌లైన్‌లో తప్పుడు చిరునామాలతో ఓట్లు నమోదు చేసుకున్నట్లు విమర్శలొచ్చాయి. గతేడాది ఏప్రిల్ 30న తెలంగాణలో సాధారణ ఎన్నికలు జరుగగా, మే 7న ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉండే చాలామంది కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, ఎల్బీ నగర్, మల్కాజిగిరి నియోజకవర్గాలలో ఓటర్లుగా ఆన్‌లైన్‌లో నమోదుచేసుకొని ఏప్రిల్ 30న తెలంగాణలో, మే 7వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో ఓట్లేశారు. దీనిపై శివాలెత్తిన డూప్లికేట్లు అన్న శీర్షికతో మే 21న నమస్తే తెలంగాణలో వార్త ప్రచురితమైంది.
ఆ తర్వాత అధికారులు దానిపై దృష్టి సారించారు. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో సెటిలర్ల పేరిట వేలమంది ఓటర్లుగా నమోదుచేసుకొని రెండు రాష్ర్టాల్లోనూ ఓట్లు వేసి ఫలితాలను తారుమారుచేసినట్లు ఆధారాలున్నాయి.
ఆధార్ లింక్‌తో మోసం బట్టబయలు:
ఓటర్ల జాబితాలో అవకతవకలను సరిచేసేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ఆధార్ లింక్‌తో బోగస్ ఓటర్ల బాగోతం బట్టబయలైంది. ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానిస్తూ అధికారులు చేస్తున్న పరిశీలనలో విస్మయకర వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. కూకట్‌పల్లి నియోజవర్గంలోని దాయార్‌గూడలో 5-6-119/6 ఇంటి చిరునామాతో 36 ఓట్లు నమోదయ్యాయి. కానీ ఆ ఇంట్లో కేవలం ఏడుగురు మాత్రమే ఉన్నట్లు ఇటీవల అధికారుల పరిశీలనలో తేలింది. మిగతా వారంతా ఆంధ్ర ప్రాంతానికి చెందినవారే. వారంతా తప్పుడు అడ్రస్‌తో ఆన్‌లైన్‌లో ఓట్లు నమోదుచేసుకున్నట్లు వెల్లడైంది.
కూకట్‌పల్లి ప్రకాశంనగర్‌లోని రత్న నిలయంలో 130 నుంచి 140 మంది ఓటర్లు ఉన్నట్లు జాబితాలో ఉంది. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అక్కడ 30 మంది కూడా లేరు. కూకట్‌పల్లి ఎల్‌ఐజీ, ఎంఐజీలోని ఒక్కో ఇంట్లో 30 నుంచి 40 మంది ఉన్నట్లు ఓటర్ల జాబితాలో ఉండగా అందులో సగం మంది బోగసేనని తేలింది. కొన్ని పోలింగ్ కేంద్రాలలో 50 శాతానికి పైగా ఓటర్లు చిరునామా లేకుండానే జాబితాలో నమోదయ్యారు. కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్‌లోని 326, 327, 375 పోలింగ్ కేంద్రాల్లో సమగ్ర పరిశీలన జరిగింది. ఈ మూడు కేంద్రాలలో 2,786 మంది ఓటర్లుండగా 1,281మంది అసలు చిరునామాలో లేకపోవడం గమనార్హం. వారంతా బోగస్ ఓటర్లేనని అధికారులు తేల్చారు. ఆంధ్రప్రాంతానికి చెందిన నాయకులు వ్యూహాత్మకంగానే ఆన్‌లైన్‌లో నకిలీ ఓట్లను నమోదు చేయించారు. కూకట్‌పల్లిలో దాదాపు 85 వేలు, శేరిలింగంపల్లిలో లక్ష, కుత్బుల్లాపూర్‌లో 60 వేల వరకు ఆన్‌లైన్‌లో నకిలీ ఓట్లు నమోదైనట్లు అంచనా.
40 శాతం మందికి రెండుచోట్ల ఓట్లు:
రెండు రాష్ర్టాల్లో ఎన్నికలు వేర్వేరు తేదీల్లో జరపడం వల్ల భారీ సంఖ్యలో ఓటర్లు రెండు చోట్ల ఓట్లు వేసినట్లు ఎన్నికల సంఘం కూడా గుర్తించింది. నకిలీ ఓట్ల నివారణకు ఆధార్ కార్డును అనుసంధానించే పని చేపట్టడంతో మొత్తం గుట్టురట్టవుతున్నది. ప్రస్తుతం ఆధార్ లింక్‌తో జీహెచ్‌ఎంసీ అధికారులు కేసీహెచ్‌బీ కాలనీతోపాటు కొన్ని పోలింగ్ బూత్‌ల కేంద్రంగా జరిపిన సర్వేలో దాదాపు 40శాతం మందికి రెండుచోట్ల ఓట్లు ఉన్నట్లు తేలింది. ఓటర్లుగా నమోదైన చాలామందికి ఆధార్‌కార్డు కాదు కదా ఎలాంటి ఆధారం లేదు. కొన్ని చోట్ల ఒకే వ్యక్తికి కూకట్‌పల్లి, శేరిలింగంపల్లితోపాటు ఆంధ్రలో కూడా ఓట్లున్నట్లు తేలింది. నకిలీ ఓట్లవల్లే తాము ఓడిపోయామని కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గాల నుంచి టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన గొట్టిముక్కల పద్మారావు, కొలను హనుమంత్‌రెడ్డి, శంకర్‌గౌడ్, రామ్మోహన్‌గౌడ్‌లు హైకోర్టులో వేసిన పిటీషన్‌పై విచారణ మొదలయ్యింది. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్17,18 ప్రకారం ఒక ఓటరు ఒకటికంటే ఎక్కువచోట్ల ఓట్లు వేస్తే అది చెల్లదు. సాధారణ ఎన్నికలలో చాలా మంది రెండు చోట్ల ఓట్లు వేసినందున మొత్తం ఎన్నికనే రద్దు చేయాలని పిటిషన్‌లో టీఆర్‌ఎస్ నేతలు కోరారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి