-ఏసీబీ తెరపైకి వచ్చిన జిమ్మీ
-బాబు, లోకేశ్‌ల కీలక అనుచరుడు
-రూ.50 లక్షలు తరలించాడని అనుమానం
-కుట్రలో కీలక పాత్ర ఉందంటున్న దర్యాప్తు అధికారులు
-రెండో ఎపిసోడ్‌లో కీలకంగా మారనున్న జిమ్మీ
-ఇద్దరు ఎంపీల జాతకాలు బయటపడే అవకాశం
ఓటుకు నోటు కేసు రెండో ఎపిసోడ్ ప్రారంభంలోనే ఏసీబీ కుట్రదారులకు షాకిచ్చింది. ఈ కేసులో బాబు, లోకేశ్‌లకు ప్రధాన అనుచరుడైన జిమ్మీకి నోటీసు ఇవ్వడం ద్వారా కలకలం రేపింది. ఎమ్మెల్యే కొనుగోలు కుట్రలో రేవంత్, సెబాస్టియన్, మత్తయ్యలతో పాటు జిమ్మీదీ ప్రధాన పాత్రేనని ఏసీబీ దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈవ్యవహారంలో ముందుగా మత్తయ్యతో కుట్ర నడిపించిన బాస్, తర్వాత రంగంలోకి జిమ్మీని దించి, సెబాస్టియన్, రేవంత్‍ల ద్వారా కొనుగోలు వ్యవహారం నడిపించారని అనుమానిస్తున్నట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు. ఈ కేసులో రేవంత్, సెబాస్టియన్ తర్వాత కీలక ఆధారాలు జిమ్మీ ద్వారానే వెల్లడవుతాయని వారు తెలిపారు. కరీంనగర్ జిల్లా రామగుండంకు చెందిన జిమ్మీ గతంలో రామగుండం కార్పొరేటర్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పొందాడు. చాలాకాలంగా మల్కాజిగిరిలో నివాసముంటున్నాడు.-బాబు, లోకేశ్‌ల కీలక అనుచరుడు
-రూ.50 లక్షలు తరలించాడని అనుమానం
-కుట్రలో కీలక పాత్ర ఉందంటున్న దర్యాప్తు అధికారులు
-రెండో ఎపిసోడ్‌లో కీలకంగా మారనున్న జిమ్మీ
-ఇద్దరు ఎంపీల జాతకాలు బయటపడే అవకాశం
ఏసీబీ జిమ్మీని విచారించడమంటే మొత్తం డొంకను కదిలించినట్టేనంటున్నారు. బాబుకు, లోకేష్‌కు కీలక వ్యక్తిగా... జిమ్మీ చంద్రబాబుతో పాటు లోకేష్‌కు సంబంధించిన అనేక వ్యవహరాలు మధ్యవర్తిగా చక్కబెడతాడని టీడీపీలోని ఓ వర్గం చెప్తున్నది. కుట్రల్లో పాలుపంచుకోవడం నుంచి పార్టీలో అతి కీలకమైన పనులు సైతం జిమ్మీలాంటి వ్యక్తులకే ఇద్దరు బాబులు అప్పగిస్తారని వారు తెలిపారు. పాదయాత్ర సమయంలో ప్రతిక్షణం చంద్రబాబుతో పాటే ఉన్న జిమ్మీ, లోకేష్, బాలకృష్ణ, రేవంత్ తదితర సీనియర్ నేతలతో అత్యంత సన్నిహితంగా తిరగడాన్ని ఏసీబీ గుర్తించింది. ముందుగా జిమ్మీకి సంబంధించిన అన్ని వివరాలు ఆరా తీసిన ఏసీబీ, ఇపుడు పలు సంచలనాత్మక వివరాలను లాగేందుకు అతన్ని విచారించాలని నిర్ణయించింది. గత ఎన్నికల సమయంలో గుంటూర్, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఇలాంటి వ్యక్తులు కీలకంగా వ్యవహరించారని, కావాల్సిన వారికి ఎంత అందాలో అంత ముట్టచెప్పడానికి వీరికి ఆ బాధ్యతలు అప్పగించేవారని టీడీపీ పార్టీలోని అసంతృప్త నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా ఓటుకు నోటు కేసు వెలుగుతో జిమ్మీ వ్యవహారం బయటపడటం పచ్చపార్టీ మొత్తాన్ని కలవర పెడుతున్నట్టు తెలుస్తోంది.
డబ్బులు తెచ్చింది జిమ్మీయేనా?
సెబాస్టియన్‌తో ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు గాలం వేయడం, రేవంత్‌తో సెటిల్‌మెంట్ చేయించడం.. ఇలా పూర్తిగా కుట్రలో అత్యంత కీలకంగా వ్యవహరించింది జిమ్మీయే అని ఏసీబీ దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. చాపకింద నీరులా సాగిపోయే ఇలాంటి వ్యవహారంలో పార్టీలోని ఉన్నత బాధ్యులకు జిమ్మీ షాడోగా వ్యవహరించాడని దర్యాప్తు సంస్థ భావిస్తున్నది. స్టీఫెన్‌సన్‌కు రేవంత్ ఇవ్వజూపిన 50లక్షల రూపాయలను పారిశ్రామిక వేత్తలు, రాజ్యసభ ఎంపీల నుంచి తీసుకువచ్చింది జిమ్మీయే అయి ఉంటాడని ఏసీబీ అనుమానిస్తున్నది. అలాగే ఇద్దరు బాబుల వద్ద జిమ్మీ పాత్ర కీలకమని తేలడంతో...ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చింది...అనే విషయమైనా జిమ్మీకి తెలిసి ఉంటుందని అంచనా వేస్తున్నది. ఒకవేళ డబ్బులు తీసుకువచ్చింది జిమ్మీయేనని విచారణలో తేలితే స్టీఫెన్‌సన్‌కు ఇచ్చేందుకు అగ్రిమెంట్ అయిన మిగతా రూ. 4.5కోట్ల సంగతి కూడా ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు సంస్థలోని ఓ కీలక అధికారి స్పష్టంచేశారు.
మిగతా ఎమ్మెల్యేల కొనుగోలులో...
ఎమ్మెల్సీ ఎన్నికలతో టీఆర్‌ఎస్ పార్టీ, ప్రభుత్వాన్ని కూల్చేందుకు బాబు వేసిన ఎత్తుగడలో మిగతా ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలోనూ జిమ్మీ పాత్ర వహించి ఉండవచ్చేమోననే భావన ఏసీబీలో ఉంది. ఒక్క స్టీఫెన్‌సన్ వ్యవహారం కాకుండా మరికొంత మంది ఎమ్మెల్యేలను కొనే ప్రక్రియలో కూడా బాబు షాడోగా జిమ్మీయే ప్రయత్నాలుచేసి ఉంటాడని, ఆ వివరాలు సైతం తాము రాబడతామని ఏసీబీ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. అలా ఎమ్మెల్యేలను కొనేందుకు ఏమైనా డబ్బుల సరఫరా జరిగిందా? జరిగితే ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి? ఎవరిచ్చారు? సంబంధిత పూర్తి వివరాలను జిమ్మీ విచారణలో బయటపెట్టేందుకు ప్రయత్నిస్తామని ఏసీబీ వర్గాలు తెలిపాయి.
ఆ ఎంపీలకు సంకటమే..
జిమ్మీ వ్యవహారంలో మరో కీలక ట్విస్ట్ ఎదురయ్యే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటి వరకు రేవంత్, సెబాస్టియన్, ఉదయ్‌సింహాలను విచారించిన ఏసీబీకి, కుట్రలో రూ.50లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయం పూర్తిగా ధ్రువపడలేదు. ఈ డబ్బులను కొందరు ఎంపీలు సరఫరా చేశారని ఏసీబీ దగ్గర సమాచారం ఉంది. దాన్ని ధ్రువపరుచుకోవాల్సి ఉంది. ఇపుడు జిమ్మీని విచారిస్తే ముడుపులిచ్చిన ఎంపీల సంగతి తేలుతుందని విశ్వసనీయ సమాచారం. డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసేందుకు ప్రోత్సహించిన ఎంపీలకు జిమ్మీతో షాక్ తగలనుందని ఏసీబీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి