గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, ఆగస్టు 21, 2014

రిజిస్ట్రేషన్ శాఖలో లీకువీరులు...!

-కబ్జాదారులకు ముందుగానే చేరుతున్న సమాచారం
-సీమాంధ్ర ఉద్యోగుల పెత్తనం వల్లే అంటున్న తెలంగాణ ఉద్యోగులు
స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో ప్రభుత్వానికి చెందిన రహస్యాలు కబ్జాదారులకు చేరుతున్నాయి.. ఈ శాఖలోని కీలకస్థానాల్లో ఎక్కువగా సీమాంధ్రులే ఉండటంతో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలు ముందే బయటకు పొక్కుతున్నాయి.. భూకబ్జాలపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న క్రమంలో కొన్ని భూములకు సంబంధించి దస్తావేజులు, ఇతర సమాచారం కబ్జాదారులకు చేరిపోతున్నదని తెలంగాణ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణ నుంచి అర్హులైన అధికారులు ఉన్నా.. కీలకస్థానాల్లో వారిని నియమించకపోవడం వల్ల నష్టం జరుగుతున్నదని వారు చెప్తున్నారు. జాయింట్ ఐజీ మొదలుకొని అడిషనల్ ఐజీ కంప్యూటర్స్ వరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో సీమాంధ్రులదే పెత్తనం కొనసాగుతున్నది. నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్, హైదరాబాద్ వంటి కీలమైన స్థానాల్లోనూ వారు తిష్ఠవేశారు.

దీంతో ఆ శాఖకు చెందిన రహస్యాలు ఆంధ్రప్రదేశ్ అనుకూల శక్తులకు చేరుతున్నాయని తెలంగాణ ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గురుకుల ట్రస్ట్ భూములకు సంబంధించిన సమాచారం ముందే బయటకు పొక్కిందని చెప్తున్నారు. బడ్జెట్ నివేదికలు తయారవుతున్న ప్రస్తుత తరుణంలో సీమాంధ్ర వారు ముఖ్యమైన పదవుల్లో ఉండటం వల్ల ప్రభుత్వానికి ఆర్థికపరంగా కూడా నష్టం జరిగే ప్రమాదముందని అంటున్నారు. ఆదాయ అంచనాలను ఒక్కసారిగా తగ్గించడమో లేదా పెంచడమో చేయడం వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది ఉంటుందని చెప్తున్నారు. సర్కార్ ఖజానాకు దాదాపు రూ. 6,700కోట్ల ఆదాయం అందిస్తున్న రిజిస్ట్రేషన్ శాఖలో కీలక స్థానాల్లో తెలంగాణ అధికారులుండాల్సిన అవసరముందని ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి