గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, ఆగస్టు 18, 2014

"సయోధ్యతో ముందుకు" -కేసీఆర్

-సుహృద్భావ వాతావరణంలో ఇరువురు సీఎంల చర్చలు
-తెలంగాణకు ఈ భేటీ శుభపరిణామం.. ఇరు రాష్ర్టాలు కలిసిసాగితేనే అభివృద్ధి
-ఏదైనా అంశముంటే ఇద్దరం కలిసి ఢిల్లీపై ఒత్తిడితెస్తం: కేసీఆర్
- భవనాల కేటాయింపు, ఉద్యోగుల పంపిణీ, అధికారుల నియామకాలపై అవగాహన
- గవర్నర్‌కు ఒక్క అధికారం కూడా అదనంగా లేదు
- విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు

గవర్నర్ సమక్షంలో ఇద్దరు ముఖ్యమంత్రుల చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తనకు మధ్య శాసనసభా భవనాల కేటాయింపు, ఉద్యోగుల పంపిణీ, అధికారుల నియామకాలపై ప్రధానంగా చర్చ జరిగిందని తెలిపారు. ఈ మూడు అంశాలపై ఇరువురి మధ్య సయోధ్య కుదిరిందన్నారు. గవర్నర్ నరసింహన్‌తో భేటీ అనంతరం ఆదివారం సాయంత్రం సీఎం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
kcr-babuతెలుగు ప్రజలు కలిసి మెలిసి ఉండాలి, రెండు రాష్ర్టాలు అభివృద్ధిలో ముందుకు వెళ్లాలన్నదే తన అభిమతమని గవర్నర్ సమక్షంలో చెప్పినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. చిన్న చిన్న విషయాల్లో కలహించుకుంటే చూసేవారికి ఎబ్బెట్టుగా ఉంటుందని భావించి తానే ఒక అడుగు ముందుకువేసి చర్చలకు సంసిద్ధత వ్యక్తంచేశానని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య సమస్యలుంటే ఇద్దరం కలిసి కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళితే సమస్యల పరిష్కారం సులువవుతుందని చంద్రబాబు నాయుడుకు సూచించానని కేసీఆర్ చెప్పారు. రాష్ర్టాలుగా విడిపోయిన తర్వాత చిన్న చిన్న విషయాల్లో వివాదాలకు పోవడం మంచికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

అసెంబ్లీలో తెలంగాణ కార్యదర్శి కూర్చున్న కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కావాలని అడిగారని, అది వారికి అనువుగా ఉంటుందని ఆంధ్ర అసెంబ్లీ కార్యదర్శికి కేటాయించేందుకు అంగీకరించామని, మరో కార్యాలయంలో తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ కూర్చుంటారని ముఖ్యమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు రెండు రోజులు క్లాష్ వచ్చిందని, ఏపీవారిని 7వతేదీ వరకు కుదించుకోవాలని కోరామని, అందుకు వారు అంగీకరించినట్లు తెలిపారు. శాసనసభ భవనాలను రెండు రాష్ర్టాలకు కేటాయించే విషయంలో వివాదాలు లేకుండా పరిష్కరించుకున్నామన్నారు. ఉద్యోగుల పంపిణీ విషయంలో కూడా కమలనాథన్ కమిటీ, ప్రత్యుష్‌సిన్హా కమిటీలపై ఆధారపడే కంటే ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు కూర్చొని నిబంధనల ప్రకారం పంపిణీ చేసుకుంటే బాగుంటుందనే ఒప్పందానికి వచ్చినట్లు కేసీఆర్ తెలిపారు.

మొత్తం 67 వేల స్టేట్ క్యాడర్ పోస్టులు ఉన్నాయని, ఇందులో 22 వేలు ఖాళీలు ఉన్నాయని ఆయన చెప్పారు. పంపిణీ చేసుకోవాల్సింది 45 వేలేనని అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల స్థాయిలో పరిష్కారం కాని విషయాలుంటే ముఖ్యమంత్రుల వద్దకు తీసుకురావాలని రెండు రాష్ట్రాల సీఎస్‌లకు సూచించామని చెప్పారు. తెలంగాణలో ఉన్న నాక్, నిథమ్ వంటి సంస్థలకు విభజన బిల్లులోని నిబంధనల ప్రకారం తెలంగాణ ప్రభుత్వమే డైరెక్టర్లను నియమిస్తుందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డైరెక్టర్లను నియమించే అధికారంలేదని, ఇందుకు చంద్రబాబు అంగీకరించినట్లు చంద్రశేఖర్ రావు తెలిపారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అధికారిని నియమించాలనుకుంటే జాయింట్ డైరెక్టర్‌ను మాత్రమే నియమించాలని, ఒకే స్థాయి అధికారులను రెండు ప్రభుత్వాలు నియమించరాదని చర్చల్లో అంగీకారం కుదిరినట్లు కేసీఆర్ చెప్పారు.

అఖిల భారత సర్వీసు అధికారులను ప్రత్యూష్ సిన్హా కమిటీ విభజన ప్రకారం తెలంగాణ సీఎస్, డీజీపీలు ఒకవేళ ఆంధ్రప్రదేశ్‌కు వస్తే వారిని తెలంగాణ ప్రభుత్వంలో కొనసాగేలా ఎన్‌ఓసీ ఇవ్వాలని కూడా అహ్లాదపూర్వక వాతావరణంలో చంద్రబాబు నాయుడును అడిగానని , అందుకు ఆయన నవ్వుతూ అంగీకరించారని చంద్రశేఖర్ రావు తెలిపారు. రెండు రాష్ర్టాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే ఇంకా రెండు, మూడు సార్లు కూడా చర్చలు జరుతామని తెలిపారు. తెలంగాణ రాష్ర్టానికి ఎగుమతులు, దిగుమతుల కోసంఒక పోర్టు కావల్సి వస్తుందని, అందుకు తెలంగాణకు దగ్గర ఉన్న బందర్ పోర్టును కేటాయించాలని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరామని, అందుకు చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఏ అంశమొచ్చినా కలిసి, కూర్చుని మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నం. ఏదైనా అంశం వస్తే ఇద్దరం కలిసి ఢిల్లీ ప్రభుత్వంపై ఒత్తిడి కూడా తేవాలని అనుకున్నం.

ఇది శుభ పరిణామం. రెండు తెలుగు రాష్ర్టాలు విడిపోయినా మంచిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నం. అని కేసీఆర్ చెప్పారు. ఇతర రాష్ర్టాల్లో ఉన్న గవర్నర్ల కంటే తెలంగాణ గవర్నర్‌కు ఒక్క అధికారం కూడా ఎక్కువలేదని, ఇందులో ఎవరూ అపోహ పడాల్సిన అవసంలేదని స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌కు ఎలాంటి అధికారాలు ఉండాలో తెలంగాణ గవర్నర్‌కు కూడా అలాంటి అధికారాలే ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటుంది కానీ, అదనంగా అధికారాలు రుద్దాలని చూస్తే ఒప్పుకోమని సీఎం స్పష్టం చేశారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి