- ఆ లేఖ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం..
- హోంశాఖ సూచనలు పాటించలేం
- రాష్ట్ర మంత్రిమండలి సలహామేరకే గవర్నర్ వ్యవహరించాలి
- హోంశాఖ పంపిన లేఖ నన్ను కలచివేసింది
- ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ
- హోంశాఖకు తిరుగుటపాలో సీఎస్ తిరస్కరణ
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గవర్నర్‌కు విశేష అధికారాలను కట్టబెడుతూ కేంద్ర హోంశాఖ రాసిన లేఖపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలు, పరిపాలనాపరమైన వ్యవహారాలలో గవర్నర్‌కు అపరిమిత అధికారాలను ఇవ్వడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని స్పష్టంచేసింది. - హోంశాఖ సూచనలు పాటించలేం
- రాష్ట్ర మంత్రిమండలి సలహామేరకే గవర్నర్ వ్యవహరించాలి
- హోంశాఖ పంపిన లేఖ నన్ను కలచివేసింది
- ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ
- హోంశాఖకు తిరుగుటపాలో సీఎస్ తిరస్కరణ
కేంద్ర హోంశాఖ లేఖను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. లేఖలో చేసిన సూచనలను అమలుచేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దీనిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ కూడా కేంద్ర హోంశాఖకు తిరస్కరణ లేఖ రాశారు. హోంశాఖ లేఖ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ముఖ్యమంత్రి తన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లేఖ మీకు తెలియకుండానే హోంశాఖ నుంచి వచ్చి ఉంటుందని అనుకుంటున్నా అని సీఎం పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం మంత్రిమండలి సలహామేరకే గవర్నర్ వ్యవహరించాల్సి ఉంటుందని సీఎం గుర్తుచేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 8 (3)లో కూడా అదే ఉందని ఆయన ఉటంకించారు.హోంశాఖ పంపిన లేఖను కూడా మోడీకి రాసిన లేఖతో జతచేసిన సీఎం.. దీనిని పరిశీలించి.. ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్య సంప్రదాయాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
సీఎస్‌తో సీఎం భేటీ
కేంద్ర హోంశాఖ లేఖపై ముఖ్యమంత్రి శనివారం సచివాలయం లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో సమావేశమయ్యారు. లేఖ విషయంలో ప్రభుత్వం నుంచి స్పందించాల్సిన తీరుపై సమాలోచనలు జరిపారు. ముఖ్యమంత్రి సూచన మేరకు రాజీవ్‌శర్మ కూడా శనివారం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8(3) ప్రకారం రాష్ట్ర మంత్రిమండలి సూచనల మేరకే గవర్నర్ విధులు నిర్వహించాలని స్పష్టంగా ఉందని లేఖలో రాజీవ్‌శర్మ పేర్కొన్నారు. గవర్నర్‌కు విశేషాధికారాలను కల్పించాలన్న విషయంపై ఎక్కడా స్పష్టత లేదని పేర్కొన్నారు.
ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ సూచనలను పాటించలేమని ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి రాజధాని పేరిట ప్రజాస్వామ్య ప్రభుత్వ హక్కులను హరించేలా కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేదిలేదని తెలంగాణ సర్కార్ భావిస్తున్నది. వాటిని తిప్పికొట్టాలని పట్టుదలతో ఉంది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం రాసిన లేఖను పట్టించుకోరాదని నిర్ణయించింది. దీంతోపాటు ఉమ్మడి రాజధాని ముసుగులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్‌ను కబ్జా చేయడానికి బీజేపీ నాయకులతో కలిసి చేస్తున్న కుట్రలను బట్టబయలు చేయాలని కూడా భావిస్తున్నది. కేంద్ర హోంశాఖ లేఖకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఉభయసభల్లో పెద్ద ఎత్తున ధిక్కారస్వరం వినిపించాలని పార్టీ ఎంపీలకు ముఖ్యమంత్రి సూచించారు.
ప్రజా, న్యాయపోరాటాలకు టీఆర్‌ఎస్ సిద్ధం
కేంద్రం, ఆంధ్ర సర్కార్ చేస్తున్న కుయుక్తులపై ఆందోళనకు టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు సిద్ధమవుతున్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 8లో వివాదాస్పద అంశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా టీఆర్‌ఎస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కాదని గవర్నర్‌కు విశేష అధికారాలిచ్చే విషయంలో ఒకే సమయంలో అటు ప్రజాపోరాటాలు, ఇటు న్యాయపోరాటాలు నిర్వహించాలని నిర్ణయానికి వచ్చారు.
ఉమ్మడి రాజధాని పేరిట కేంద్రం వ్యవహరిస్తున్న నియంతృత్వ పోకడలపై త్వరలోనే అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు తెలిసింది. కేంద్రంలోని మోడీ సర్కార్ తీరు రాష్ట్ర ప్రభుత్వాల ప్రాథమిక హక్కులకు, అస్తిత్వానికే ప్రమాదకరంగా పరిణమిస్తుందని ఆయన సహచర ముఖ్యమంత్రులకు వివరించనున్నారని తెలుస్తున్నది.
హోంశాఖ లేఖపై న్యాయ నిపుణుల విస్మయం
విభజన చట్టంలో ఉన్న అధికారాలను అధిగమించి. శాంతిభద్రతలే కాకుండా.. పరిపాలనాపరమైన వ్యవహారాలలో సైతం జోక్యం చేసుకునే విధంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ లేఖపై న్యాయనిపుణులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్ కార్యాలయాలలో ప్రజాఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేయాలని, దానిని కూడా గవర్నర్ పరిధిలో ఉంచాలని కేంద్రహోంశాఖ లేఖలో పేర్కొనడం విడ్డూరంగా ఉందని వారు చెబుతున్నారు.
విభజన చట్టంలోని ఎనిమిదవ సెక్షన్‌ను అడ్డుపెట్టుకుని కేంద్రం మితిమీరిన జోక్యం చేసుకుంటున్నదని, దీనికి చట్టబద్ధత ఉండదని స్పష్టం చేస్తున్నారు. శాంతిభద్రతలను పూర్తిగా గవర్నర్ పరిధిలోకి తేవడం హద్దుమీరినట్లేనని వారు తేల్చేస్తున్నారు. పాలనా వ్యవహారాలలో గవర్నర్ అధికారాలనిచ్చే ప్రయత్నం మూర్ఖత్వం, నిరంకుశత్వమేనని స్పష్టం చేస్తున్నారు. హోంశాఖ లేఖ కేంద్రం, రాష్ర్టాలకు మధ్య ఉన్న సంబంధాలను దెబ్బతీయడానికే తప్ప మరోరకంగా ఉపయోగపడదని వారంటున్నారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి