గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, జులై 09, 2015

అవి కల్తీలేని కన్నీళ్లా?!

-ప్రాజెక్టుల మీద పెడబొబ్బలు
-సొంత తీర్పులతో వింత రాతలు
-మార్పుతో కలిసి రాని మేధావులు
రాష్ట్రంలో ప్రాజెక్టుల రీ ఇంజినీరింగ్ జరుగుతున్నది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రతిపాదించిన.. చేపట్టిన ప్రాజెక్టుల మంచి చెడ్డలకు అనుగుణంగా మార్పు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. గత ఏడాదినుంచి ఇందుకోసం భారీ కసరత్తు జరుగుతున్నది. ఇందులో భాగంగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టుగా మారిపోయింది. పాలమూరు-రంగారెడ్డి పథకం నీరు స్వీకరించే చోటు కూడా మారింది. అదే దారితో నక్కలగండి ప్రాజెక్టు తీరు తెన్నుల్లో మార్పులు వచ్చాయి. కొన్ని ప్రాజెక్టులకు మెరుగైన ప్రత్యామ్నాయాలు లభ్యమైనపుడు పాతవి పక్కన పెట్టడం సాధారణం. ఈ క్రమంలో లేని అపోహలను ఉద్రిక్తతలను రేకెత్తించే కార్యక్రమం ఒకటి ప్రారంభమైంది. ప్రాణహిత ప్రాజెక్టు మార్పు అంటూ మేధావుల వేదిక పేరిట దాడి మొదలైంది. లేనిపోని ఉద్దేశాలు అంటగడుతూ బట్టకాల్చి మీద వేసే రీతిలో ఇది కొనసాగుతున్నది. ప్రాణహిత ప్రాజెక్టు మార్పు ఆదిలాబాద్ జిల్లాకు నష్టమంటూ సామాన్య ప్రజలకు అంతగా తెలియని సముద్ర మట్టాలు, నీటి లభ్యత, ముంపు తదితర లెక్కలు ముందు పెట్టి ప్రచారం చేస్తున్నారు. 

sagar




వాస్తవానికి తుమ్మిడిహట్టి ప్రాజెక్టును ప్రభుత్వం ఆపివేయలేదు. అది అమలులోనే ఉంది. తుమ్మిడిహట్టి వద్ద ఎత్తిపోతలతో లక్షా 50 వేల ఎకరాలకు నీరివ్వాలని ప్రతిపాదిస్తున్నది. దానికి ఇప్పటిదాకా కట్టిన కాల్వలను వాడుకోవాలని ప్రతిపాదించింది. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిపాదనలో ఉన్న అన్ని ప్రాజెక్టులకు తోడు నూతన పథకాలకు రూపకల్పన జరుగుతున్నది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పెన్‌గంగ ప్రాజెక్టుకు మహారాష్ట్ర అనుమతిని సాధించింది. చుక్క నీరు జిల్లాకు దక్కదని రాతలు రాస్తున్న వారు దీన్ని విస్మరిస్తున్నారు.


మార్పు చేర్పులు ఇపుడే కొత్తా?ప్రాజెక్టుల డిజైన్లు, స్థలాలు, దిశలు మారడం ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా కనిపెట్టిందేమీ కాదు. గతంలో శ్రీశైలం ఎడమ కాలువ విషయంలోనే సొరంగమా? లిఫ్టా? అనే విషయంలో అనేక వాదోపవాదాలు జరిగి ఆచరణయోగ్యం అని భావించిన తర్వాతే సొరంగ మార్గాన్ని ఎన్నుకున్నారు. పాలమూరు-రంగారెడ్డి పథకం మొదట్లో జూరాల బ్యాక్‌వాటర్‌ నుంచి తీసుకోవాలని ఆ జిల్లాకు చెందిన మాజీ ఇంజనీర్లే ప్రతిపాదించారు. ఈ మేరకే సర్వేలు సిద్ధమయ్యాయి. ఆ తర్వాత ముంపు గ్రామాల సమస్య వచ్చింది. జూరాలనుంచి నీరు తోడడం అనేది ఇతర అపోహలకు దారితీసే అవకాశం వచ్చింది. దీనితో వ్యయం ఎక్కువైనా నేరుగా శ్రీశైలం రిజర్వాయర్‌నుంచే నీరు తీసుకోవాలని నిర్ణయించారు. దీనివల్ల నీటికి గ్యారెంటీకూడా పెరిగింది. ఇదే రీతిలో నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు నీరందించే నక్కలగండి పథకం. తొలుత నీరు తీసుకోవడానికి ప్రతిపాదించింది వేరు. ఇపుడు శంకుస్థాపన చేసిన సమయానికి నిర్ణయించింది వేరు. ఇవాళ కాళేశ్వరం వద్ద పథకం ఏదో తప్పు అంటున్న వాళ్లు నిజాం కాలంలో నిర్ణయించిన ఇచ్ఛంపల్లి ప్రాజెక్టు కాస్తా అటు ఇటూగా ఇక్కడికి సమీపంలోనే ప్రతిపాదించారని మరిచిపోతున్నారు. మేధావులైనా.. రాజకీయవాదులైనా గమనించాల్సిన అంశం ఏమిటంటే టీఆర్‌ఎస్‌లో జలవనరుల నిపుణులు పెద్దసంఖ్యలో ఉన్నారు. కేంద్రజలవనరుల సంఘం స్థాయిలో పనిచేసినవాళ్లూ ఉన్నారు. ఇవాళ పాలమూరు ఎత్తిపోతల నుంచి కాళేశ్వరం దాకా అన్ని పథకాల్లో వారి శ్రమ, చెమట ఉన్నాయి. 


అంకెలు.. రంకెలు...సముద్ర మట్టాలు, రిజర్వాయర్ ఎత్తులు, నీటి లభ్యతలు వాదనల కోసం ఇష్టారాజ్యంగా మార్చేయడం మనకున్న పాత జబ్బు. తుమ్మిడిహట్టి వద్ద కనీసనీటి లభ్యత 160 టీఎంసీలు అని మన వాదన. కానీ జలసంఘం ఈ లెక్కలను కొట్టేసింది. ఇక్కడ 110-20 టీఎంసీలను మించి లభ్యత లేదు పొమ్మంది. అలాగే ప్రాజెక్టు డిజైన్‌లో 160 టీఎంసీలకు సరిపడా బ్యారేజీలు లేవని చెప్పింది. 14.7 టీఎంసీల నీరు సరిపోయే ఏడు బ్యారేజీలు కట్టి 160 టీఎంసీలు పరిమిత కాలంలో ఎక్కడ ఎత్తిపోస్తారు? అని నిలదీసింది. ఏది నిజం? ముంపు విషయం కూడా అంతే. ప్రాణహిత వల్ల మహారాష్ట్రలో 10 వేలకు పైగా ఎకరాలు, తెలంగాణలో 17 వందలకు పైగా ఎకరాల ముంపు ఉంది. 2015 ఫిబ్రవరి 15న మహారాష్ట్ర సీఎంతో కేసీఆర్ సమావేశం జరిపినపుడు ముంపు ఉంటే అంగీకరించలేమని ఆయన కుండబద్దలు కొట్టారు. దీనితో ముంపును పరిమితం చేసేందుకు రిజర్వాయర్ ఎత్తు తగ్గించడం నుంచి ప్రారంభించి ఒకటికి బదులు రెండు మూడు రిజర్వాయర్ల ప్రతిపాదనలు కూడా పరిశీలించిందన్న విషయాన్ని మేధావులు వారి వేదికలు తమ సౌకర్యార్థం మరిచిపోయినట్టు కనిపిస్తున్నది. మహారాష్ట్రతో జరిగిన చర్చల్లో అనేక ఏండ్లుగా నలుగుతున్న పెన్‌గంగ ప్రాజెక్టు సుఖాంతం అయినపుడు ప్రాణహిత చేవెళ్ల సుఖాంతం ఎందుకు కాలేదు? అని క్షణం ఆలోచించినా వాస్తవం బోధపడుతుంది. 


ఇక ప్రాణహిత.. గోదావరి అంటూ విచిత్ర వాదనలు. ప్రాణహిత మీద కడితే ఏపీతో సమస్య ఉండదని సిద్ధాంతీకరణ. మరి ఏపీ ప్రభుత్వం తుంగభద్రను మరోమార్గంలో మళ్లించి ప్రాజెక్టు కట్టుకుని కృష్ణ నీటితో సంబంధం లేదంటే మనం నోట్లో వేలేసుకుని కూచుంటామా? పైన బిగబట్టి ప్రాజెక్టులు కడితే కింది రాష్ర్టాలు, జలసంఘాలు, ట్రిబ్యూనళ్లు కండ్లు మూసుకుంటాయా? 


ఆఖరుకు జిల్లావాదులుగా..విచిత్రమైన విషయం ఏమిటంటే మేధావులుగా ఉద్యమకారులుగా చెలామణీ అయ్యే అనేకమంది ఆఖరుకు జిల్లావాదులుగా బయట పడిపోతున్నారు. ఎంతోకాలంగా చాలా హుందాగా వ్యవహరిస్తారని పేరున్న ఓ ప్రొఫెసర్ ఆ మధ్య ఓ వ్యాసంలో పాలమూరుకు కావల్సినవి చేయకపోతే బాగుండదంటూ చండప్రచండంగా ఓ హెచ్చరికే జారీ చేశారు. అలాగే ఓ ఉద్యమకళాకారిణి రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తూ పాలమూరు రంగారెడ్డి పథకం వదిలి కేసీఆర్ జూరాల పాకాల చేపడితే విప్లవం వస్తుందని హెచ్చరిక జారీ చేశారు. చాలా విచిత్రం.. రంగారెడ్డి మీద ప్రేమ కురిపించిన సదరు ఉద్యమకారిణికి వరంగల్ జిల్లా అక్కరలేదా? అనే అనుమానం తలెత్తుతుంది. ప్రాణహిత గురించి వాదిస్తున్న ఓ ఉద్యమకారుడు కూడా తాను జిల్లా వాసినని.. జిల్లాను ప్రేమిస్తానని చెప్తున్నారు. జిల్లా మీద ప్రేమ కురిపిస్తున్న ఉద్యమకారులు అదే జిల్లాలో సదర్‌మాట్ విషయం మాత్రం మాట్లాడరు. వట్టివాగు వట్టిపోతే, కడెం చివరి ఆయకట్టు ధ్వంసమవుతుంటే మాట్లాడరు. అనేక ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న లోయర్ పెన్‌గంగ గురించి బాధపడరు. 


అది ధర్మాగ్రహం.. కుటుంబాన్ని పోషించేందుకు రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేసే కుటుంబ పెద్ద... తన కష్టాన్ని గుర్తించకపోగా లేనిపోని నిందలు వేస్తే.. ఆటంకాలు కలిగిస్తే ఆగ్రహం చెందడం సహజం. ఒక తపనతో పనిచేసే వారు ’కమీషన్ల కోసం ప్రాజెక్టులు కడుతున్నారు’ లాంటి చవకబారు విమర్శలు విన్నపుడు కటువుగానే తిప్పికొడుతారు. ఓ సచివాలయం కడదామంటే అడ్డంకులు.. హుస్సేన్‌సాగర్ను శుభ్రం చేస్తామంటే అడ్డంకులు.. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామంటే ఆందోళనలు.. రైతుమాఫీ రెండు రోజులు ఆలస్యమైతే దాడులు... మైనారిటీ తీరని బీడీకార్మికులకూ పింఛన్లు కావాలనే డిమాండ్లు.. అరవై ఏండ్లు పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో తొలిప్రభుత్వాన్ని అడుగడుగునా ఆటంకపరిచే చర్యలు చూసి చూసి విసిగిపోయిన ఆవేదనకు రూపం ఆ మాటలు. న్యాయం ఆలోచించే వారికి అందులో న్యాయం కనిపిస్తుంది. దోషం వెతికే వారికి దోషమే కనిపిస్తుంది. ఎక్కడ దొరుకుతాడా? అని కసిగా వెంటాడేవారికి అందులో కులతత్వం, దురహంకారం కూడా కనిపిస్తుంది. గత ఏడాదిగా ప్రాజెక్టుల అంశం మీద ముఖ్యమంత్రి కేసీఆర్ జరిపినన్ని సమావేశాలు, సమీక్షలు బహుశా మరే రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి జరిపి ఉండక పోవచ్చు. ఇటు జలరంగ నిపుణులు, అటు అధికారులు, మధ్యలో వాప్కోస్ వంటి సంస్థల నివేదికలతో శతావధానం చేశారు. తాను స్వయంగా కృష్ణా, గోదావరి నదులను విహంగ వీక్షణం చేయడం.. నిపుణులకు కూడా పంపించడం ఆయా ప్రాజెక్టులను సందర్శించడం.. ఇలా కేసీఆర్ భారీ కసరత్తే చేశారు. పొద్దున ఢిల్లీలో జలసంఘాన్ని కలిసి మాపటికి హైదరాబాద్‌లో సమీక్షలు జరిపిన ఉదంతాలు కూడా ఉన్నాయి. పుట్టిన రోజు నాడు మహారాష్ట్రకు వెళ్లి ఆ రాష్ట్ర సీఎంతో గంటలతరబడి చర్చలు జరిపారు. లోయర్ పెన్‌గంగకు ఆ సమావేశంలోనే పరిష్కారం లభించింది. ప్రాణహిత ప్రాజెక్టుకు 160 టీఎంసీల నీటి వాడకానికి గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. అయితే ముంపు విషయంలోనే పీటముడి పడింది. ఒక రాష్ట్రం తన భూభాగం ముంపుకు ససేమిరా అన్నంత కాలం ప్రాజెక్టుల నిర్మాణం సాధ్యపడుతుందా? అనేది మేధావులూ నాయకులతో పాటుగా తెలంగాణులందరూ ఇపుడు ఆలోచించాలి.


-సవాల్‌రెడ్డి


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి