గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, సెప్టెంబర్ 04, 2014

కబ్జా "భూమి" పూజ!

-అది పక్కా ప్రభుత్వభూమి
-గోపనపల్లిలో వంద కోట్ల విలువచేసే మూడెకరాలు స్వాహా
-రియల్టర్లు, అధికారుల దొంగాట
- 2013 వరకూ దార్గుపల్లి కుటుంబానికి పహాణీ
- ఇప్పటికీ అదే భూమిలో వ్యవసాయం
- 1985లోనే విక్రయించినట్లు డాక్యుమెంట్లు
- 2000 సంవత్సరంలో మరోసారి రిజిస్ట్రేషన్
- టైటిల్ లేకున్నా ఎన్‌వోసీ ఇచ్చిన అధికారులు
- భూమి తమదేనంటున్న పూజ వెంచర్స్
- భారీ స్థాయిలో విల్లాల నిర్మాణం
- ప్రభుత్వానిదే ఈ భూమి అంటున్న హుడా
అది ప్రభుత్వ భూమి! అందులో మూడెకరాలను ఓ దళిత కుటుంబానికి ఇచ్చారు! కాలక్రమేణా ఆ ప్రాంతం కాసులు కురిపించే నేలగా మారింది! రియల్ రాబందుల కన్నుపడింది! కబ్జాకు రంగం సిద్ధమైంది! అందుకు అనుగుణంగా యజమానికాని యజమాని పేరుతో జీపీఏ డాక్యుమెంట్లు పుట్టుకొచ్చాయి! సర్కారీ భూమిని కాపాడాల్సిన అధికారులు మిన్నకున్నారు! తమకు ఆ భూమిపై ఆసక్తిలేదంటూ నిర్లక్ష్యంగా తప్పుకొన్నారు! అడ్డూఅదుపు లేదనుకున్న రియల్టర్లు ఇప్పుడు ఆ భూమిలో బడాబాబుల కోసం విల్లాలు మొలిపిస్తున్నారు! ఈ అక్రమంపై నివ్వెరబోయిన పట్టాదారులు ఇదేం అన్యాయమని అధికారుల దగ్గరకు వెళితే.. అది మీరు ఎప్పుడో అమ్మేశారంటూ పత్రాలు చూపిస్తున్నారు! ఈ కనికట్టు జరిగింది ఎక్కడో కాదు.. నగర శివార్లలో ఐటీ పరిశ్రమ కేంద్రంగా ఉన్న శేరిలింగంపల్లి మండలంలోని గోపనపల్లిలో!
land-scam
గోపనపల్లిలో ఒక దళిత కుటుంబానికి మూడెకరాల భూమిని ఎప్పుడో లావణి పట్టా కింద ఇచ్చారు. మిగిలిన భూమి మొత్తం ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నది. లావణి పట్టా కింద ఇప్పటికీ సదరు దళిత కుటుంబం ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నది. ఇప్పుడు ఆ భూమి విలువ వందకోట్ల పైమాటే! ఆ విలువే ఆ భూమిపై కబ్జాదారుల కన్నుపడేలా చేసింది. అంతే.. భూమి యజమానులకు తెలియకుండా ఆ భూమిలో ఇప్పటివరకూ అరడజను లేఅవుట్లు, వందల డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. భూముల విషయంలో అధికారులు చిత్ర విచిత్ర విన్యాసాలు ప్రదర్శిస్తుంటారు. భూమిని సాగు చేసుకుంటున్న రైతులకు కాస్రా పహాణీ ఇచ్చిన అధికారులు.. మరోవైపు ఆ భూమి తమదేనని వాదించే రియల్టర్లకు పాస్‌బుక్‌లు ఇచ్చి, మ్యూటేషన్లూ చేస్తారు. ఈ అధికారుల నిర్వాకం సాక్షిగా కోట్ల రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతం అయిపోతాయి. ఎవరికి వారు తేలుకుట్టిన దొంగల్లా తప్పించుకుంటారు. గోపనపల్లిలో జరిగింది కూడా ఇదే. తాము అభివృద్ధి చేస్తున్న సర్వే నంబర్ 74 (ఆ), 74 (ఇ)లకు చెందిన మూడెకరాల భూమిని తాము స్థానిక దళితుల నుంచి కొన్నామని, అందుకే ఇక్కడ విల్లాలు నిర్మిస్తున్నామని రియల్టర్లు చెప్తున్నారు.

land-scamతాము తమ భూమిని ఎవరికీ అమ్మలేదని దళిత కుటుంబం మొత్తుకుంటున్నది. లోతుల్లోకి వెళితే.. 1985లోనే ఈ భూమిని ప్లాట్లు చేసి, సురేశ్ అనే వ్యక్తి అమ్మేసినట్లు డాక్యుమెంట్లు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ సర్వే నంబర్ 74 (ఆ), 74(ఇ)లకు చెందిన మూడెకరాల భూమికి అసలు యజమానులెవ్వరు? అన్నది మిస్టరీగా మారింది.

సర్వే నంబర్ 74లో ఉన్నది ప్రభుత్వ భూమే!

గోపనపల్లి గ్రామంలో సర్వే నంబర్ 74లో 1954-55 కాస్రా పహాణీ ప్రకారం 105 ఎకరాల 18 గుంటల ప్రభుత్వ భూమి ఉన్నది. ఈ భూమిని 74(ఆ), 74(ఇ)గా విభజించి, ఈ రెండు బై నంబర్ల కింద 3 ఎకరాలను ఈ గ్రామానికి చెందిన దార్గుపల్లి గండయ్య తండ్రి చిన్న వీరయ్యకు సాగు చేసుకొని జీవించడానికి ప్రభుత్వం లావణి పట్టా ఇచ్చింది. ఇది 1954-55 కాస్రా పహాణిలోనే స్పష్టంగా ఉన్నది. తండ్రి నుంచి వారసత్వంగా దార్గుపల్లి గండయ్య ఈ భూమిని సాగు చేసుకున్నారు. గండయ్య తదనంతరం ఆయన వారసులు రాములు, శంకరయ్య, నర్సింహ కూడా ఇదే భూమిలో సేద్యం చేసుకుంటూ జీవిస్తున్నారు. వర్షాకాలంలోగానీ, పని రోజుల్లోగానీ ఇంటికి వెళ్లకుండా రాత్రింబవళ్లు పొలంలోనే ఉండి వ్యసాయ పనులు పూర్తి చేసుకునేందుకు ఈ భూమి వద్దనే చిన్న చిన్న గదులు కట్టుకున్నారు. ప్రభుత్వ రికార్డులలో ఇప్పటికీ కూడా మూడెకరాల భూమి మాత్రమే ప్రైవేట్‌దని ఉన్నది.

1985లోనే వాలిన రియల్ రాబందులు

ఈ భూములను పీక్కు తినడానికి రియల్ రాబందులు అమాంతం వాలాయి. సర్వే నంబర్ 75లో ఉన్న 5 ఎకరాల 37 గుంటల ప్రైవేట్ భూమిని, సర్వే నంబర్ 74లో ఉన్న మూడెకరాల లావణి పట్టా భూమితో పాటు మరికొంత ప్రభుత్వ భూమిని కలుపుకొని మొత్తం 18 ఎకరాల భూమిని కాజేశారు. ఈ 18 ఎకరాల భూమిని బీ సురేశ్ అనే వ్యక్తి 1985 ఫిబ్రవరి 25, మార్చి 27, ఏప్రిల్ 8వ తేదీలపై మూడు జీపీఏలను రిజిస్టర్ చేయించుకున్నారు. ఒకవైపు ఈ భూమిని అమ్మడానికి జీపీఏ హక్కులు సృష్టించుకుంటూనే అమ్మకాలు చేశారు. 1985 జూలై 11న 4802/85 డాక్యుమెంటు ఆనాడు ఈ భూమిపై అమ్మకాలు చేపట్టారనటానికి ఉదాహరణ.

ఆనాడు జరిగిన విక్రయాల తీరు పరిశీలిస్తే అంతా కాగితాలపైనే నడిచినట్లు అర్థమవుతున్నది. అయితే 1985లో 18 ఎకరాల భూమికి జీపీఏ హక్కులను సురేశ్‌కు కల్పించినట్లుగా రిజిస్టర్ డాక్యుమెంట్లు ఉండగా, 1974లోనే ఈ 18 ఎకరాలపై గ్రామపంచాయతీ లేఅవుట్ చేసినట్లుగా ఉంది. ఈ మేరకు 1974 జనవరి 14వ తేదీ సంక్రాంతి పండుగనాడు ఈ శాంక్షన్‌ను చేస్తూ ఆనాటి సర్పంచ్ మదన్‌మోహన్ దూబ సంతకం చేసినట్లుగా ఉంది. వీటిని పరిశీలిస్తే ఇలా ప్రభుత్వ, ప్రైవేట్ భూమిని ప్లాట్లు చేసి అమ్మినట్లుగా అర్థమవుతున్నది.

కానీ గోపనపల్లిలోని తమ భూమిని తాము ఎవ్వరికీ విక్రయించలేదని, నేటికీ ఈ భూమి వారసులం తామేనని దార్గుపల్లి గండయ్య వారసులు అంటున్నారు. కేవలం పక్క సర్వే నంబర్‌లోని ఐదెకరాల భూమిని అడ్డం పెట్టుకొని 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి విక్రయించుకున్న తీరు కూడా వెలుగు చూసింది. అయితే ఆనాడు ప్రభుత్వ భూమి అని తెలిసినా కబ్జా అవుతున్న భూమిని కాపాడకుండా రెవెన్యూ అధికారులు ఏం చేశారు? రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఏవిధంగా రిజిస్ట్రేషన్ చేశారు? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అనాడు రెవెన్యూ విభాగంలో పని చేస్తున్న కీలకమైన అధికారుల అండదండలతోటే సర్కారు భూముల అక్రమదందా జరిగిందన్న అనుమానాలు బలపడుతున్నాయి.

ఒకే భూమిపై రెండుసార్లు రిజిస్ట్రేషన్

దార్గుపల్లి గండయ్యకు చెందిన 3 ఎకరాల భూమిని ఏకమొత్తంగా 2000లలో విక్రయించినట్లుగా డాక్యుమెంట్లు వెలుగు చూశాయి. వాస్తవానికి ఒక సర్వే నంబర్‌కు చెందిన భూమి ఒకసారి రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ అయిన తరువాత మరోసారి అదే భూమిని తిరిగి రిజిస్టర్ చేయడం చెల్లదు. ఆ భూమిపై క్రయవిక్రయాలు మధ్యలో భూమిని కోనుగోలు చేసిన వారికే ఉంటాయి. 1985లో జరిగిన క్రయవిక్రయాల ప్రకారం, ఆనాడు ప్లాట్లుగా ఈ భూమిని కొనుగోలు చేసిన వారు అమ్ముకోవాలి. కానీ ఈ భూమిని ఏకమొత్తంగా ఎవ్వరు అమ్మినా చెల్లదు. అలా రిజిస్టర్ చేయడం చట్టరీత్యా నేరం కూడా.

లేదా.. ఆనాడు సురేశ్‌కు చేసిన జీపీఏను, ఆనాటి క్రయవిక్రయాలను రద్దు చేయాలి. ఇదంతా చేయడమనేది అసాధ్యమైన పని. పైగా 18 ఎకరాల భూమిని కాగితాలపై అమ్ముకొనిపోయిన సురేశ్ అనే వ్యక్తి ప్రస్తుతం సీన్‌లో లేడు. కానీ అనూహ్యంగా ఈ భూమికి కొత్త యజమాని కాగితంపై పట్టుకువచ్చాడు. ప్రస్తుత యజమానుల్లో ఒకరైన నర్సింహ తండ్రి గండయ్య. కానీ.. నర్సింహ అనే వ్యక్తికి నర్సయ్య అనే తండ్రి ఉన్నాడని, ఆయన, ఆయన కుటుంబ సభ్యులు ఈ భూమిని అమ్మారని పేర్కొంటూ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు పుట్టుకొచ్చాయి. యజమానికాని యజమాని పేరుతో ఇలా డాక్యుమెంట్లు ఎలా వచ్చాయనేది వేయి డాలర్ల ప్రశ్న.

అన్నీ అనుమానాలే..

దార్గుపల్లి గండయ్య భూమిని, పూజా వెంచర్స్‌కు డెవలప్‌మెంట్ వివాదం సృష్టిస్తే, అధికారులు తానా అంటే తందానా అని వంత పాడుతూ గండయ్య వారసుల నుంచి ఈ భూమిని వేరు చేసే కుట్రను చాలా పకడ్బందీగా అమలు చేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. దార్గుపల్లి గండయ్యకు రాములు, శంకరయ్య, నర్సింహ్మలు వారసులు కాగా... అధికారులు ఈ భూమిపై వివాదం నేపథ్యంలో జిల్లా కలెక్టరుకు శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు ఇచ్చిన పలు నివేదికలలో సర్వే నంబర్లు 74(ఆ), 74(ఇ)లలోని క్లాసిఫికేషన్‌లో పట్టా భూమి అని స్పష్టం చేస్తూ పట్టా కాలమ్‌లో, పొజిషన్ కాలమ్‌లో దార్గుపల్లి గండిగ, చిన్న వీరిగ అని రాశారు, కానీ 2002-2003 నాటికి ఈ రెండు సర్వే నంబర్లలో వారసుల పేర్లు ఎక్కాలి.

కానీ దీనికి విరుద్ధంగా క్లాసిఫికేషన్‌లో పట్టా భూమి కాస్తా లావణి పట్టా అని పట్టా కాలమ్‌లో, పొజిషన్ కాలమ్‌లో దార్గుపల్లి నర్సింహ అని ఎక్కించారు. వాస్తవానికి దార్గుపల్లి గండయ్య మూడవ కుమారుడైన నర్సింహ పేరు రాసినట్లుగా చూపించి, పూజా వెంచర్స్ విల్లాలు నిర్మిస్తున్న భూమిని విక్రయించినట్లుగా డాక్యుమెంటులో ఉన్న దార్గుపల్లి నర్సింహ తండ్రి నర్సయ్య పేరును రియల్టర్లు, అధికారులు కలిసి చాలా ముందుచూపుతో తెరపైకి తీసుకువచ్చారన్న సందేహాలు వెలువడుతున్నాయి. తిన్నగా రికార్డులో దళితులైన అసలు భూ యజమానుల పేరు లేకుండా చేస్తున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి.

2004 వరకు దార్గుపల్లి గండయ్య కుటుంబ సభ్యుల నుంచి భూమిశిస్తును వసూలు చేసిన అధికారులు ఆ తరువాత కావాలనే తిరస్కరించినట్లు తెలుస్తున్నది. మరోవైపు గండయ్య మూడవ కుమారుడైన నర్సింహ పేరుతో 2013 వరకు పహాణీ ఇచ్చారు. మరోవైపు ఇదే సర్వే నంబర్‌పై భూమి యజమానులుగా పేర్కొంటూ పూజా వెంచర్స్‌కు విల్లాలను నిర్మించడానికి అగ్రిమెంట్ ఇచ్చిన లలిత, ఎమ్ సుమంత్‌కుమార్‌ల పేరుతో పహాణీలు ఇచ్చారు. ఇంతటితో ఆగకుండా పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇవ్వడం గమనార్హం. ఈ సర్వే నంబర్‌పై కేవలం మూడెకరాల భూమి మాత్రమే ఉండగా.. అంతా అధికారుల జాగీరైనట్లు ఆరు ఎకరాలకు ముగ్గురికి పహాణీలు ఇచ్చారు.

శేరిలింగంపల్లి మండల కార్యాలయం సాక్షిగా కుట్ర

1954-55 నాటికే 74 సర్వే నంబర్ బైఫర్‌కేషన్ అయింది. 74(ఆ), 74(ఇ) అంటూ రెండు బై నంబర్లు కేటాయించి 105 ఎకరాల 18 గుంటల భూమిలో ఒక పక్కన మూడెకరాల భూమిని కేటాయించారు. ఈ మేరకు డిక్లరేషన్ కూడా ఉన్నది. కానీ రెవెన్యూ అధికారులు ఈ ల్యాండ్‌ను బైఫర్‌కేషన్ చేయలేదని అంటున్నారు. ఇప్పుడు బైఫర్‌కేషన్ చేస్తున్నామని చెపుతున్నారు.

ఈ మేరకు 74 సర్వే నంబర్‌ను 74(1), 74(2), 74(3)గా విభజిస్తున్నట్లు కొత్త డ్రామాలు ఆడుతున్నారని విశ్వసనీయంగా తెలిసింది. బైఫర్‌కేషన్ అయిన సర్వే నంబర్‌ను మరోసారి బైఫర్‌కేషన్ చేస్తున్నామని చెపుతూ న్యాయవివాదాల్లోకి గండయ్య కుటుంబం నిలబడకుండా ఓడిపోవాలని ముందు చూపుతో కుట్ర చేస్తున్నట్లు కనిపిస్తున్నది. మరోవైపు ఈ భూమిపై దార్గుపల్లి నర్సింహ తండ్రి నర్సయ్య అనే కుటుంబానికి ఎలాంటి సంబంధం లేకున్నా, దార్గుపల్లి గండయ్య మూడవ కుమారుడి పేరు నర్సింహ కావడంతో ఈ పేరుతో ఒక గందరగోళం సృష్టించి భూమిని కొల్లగొట్టాలని చూస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు కుటుంబానికి మూడెకరాల భూమిని ఇస్తున్నారు.

కానీ రాజధాని శివారులోని గోపనపల్లిలో దళితుడైన దార్గుపల్లి గండయ్యకు చెందిన ముగ్గురు కుమారులకు కలిసి ఉన్న మూడెకరాల భూమిని గుంజుకోవడానికి అవీనీతి అధికారుల పూర్తి అండదండలతో బడా బాబులు ప్రయత్నిస్తున్నారు. బడాబాబులు దళితులను భూముల నుంచి వెళ్లగొట్టడానికి చేస్తున్న కుట్రలను అడ్డుకోవడానికి ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని తెలంగాణ దళితులు కోరుతున్నారు. మరోవైపు ఇదే సర్వే నంబర్ పేరుతో దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకొని అక్రమంగా విల్లాలు నిర్మిస్తున్న భూమిని స్వాధీనం చేసుకోవాలని, ఇందుకు సహకరించిన రెవెన్యూ, మున్సిపల్ అధికారులను కఠినంగా శిక్షించాలని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు.

1954-55 నుంచి గండయ్య కుటుంబానిదే

ramuluదార్గుపల్లి గండయ్య తండ్రి చిన్న వీరయ్య హయాం నుంచి ఈ భూమి రెవెన్యూ రికార్డుల్లో ఉన్నది. 1954-55 క్రాసా పహాణీలో కూడా ఉన్నది. చిన్నవీరయ్య కుమారుడు గండయ్య ఈ భూమిలో బావి తవ్వుకుని కరెంటు మోటరు కూడా నడిపాడు. ఈ భూమికి 1985లోనే కరెంటు మీటరు సర్వీసు కూడా ఉన్నది. ఆ తరువాత బోరు వేసుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు. గండయ్య తదనంతరం ఆయన కుమారులు దార్గుపల్లి రాములు, శంకరయ్య, నర్సింహలు సాగు చేసుకుంటున్నారు. ఈ ఏడాదికి కూడా భూమిని సాగు చేయడం కోసం బోరుబావి ఆసరాతో నారు పోశారు. వర్షాలు సరిగ్గా లేకపోవడంతో పాటు బోరులో నీరు కూడా సరిగ్గా రాక, కరెంటు సరిగా లేక నారు ఎండిపోయి కనిపించింది. ఎండిన నారు పనికిరాదని భావించిన వీళ్లు పశువులు మేయడానికి వదిలారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా భూమి శిస్తు కడుతూనే ఉన్నారు.

ఆ వివరాలు 1974 నుంచి 2004 వరకు భూమిశిస్తు పాసుపుస్తకంలో రికార్డు అయి ఉన్నాయి. అయితే 2004 తరువాత నుంచి భూమిశిస్తు చెల్లించడానికి వెళితే తీసుకోవడం లేదని దార్గుపల్లి గండయ్య కుమారుడు రాములు నమస్తే తెలంగాణకు తెలిపారు. కొంతకాలం తరువాత తమ భూమి సర్వే నంబర్ల పేరుతో భూముల క్రయవిక్రయాలు తమకు తెలియకుండానే జరుగుతున్నాయని గుర్తించిన ఈ కుటుంబసభ్యులు మండల కార్యాలయంలో కాస్రా పహాణీలను తీసుకున్నారు. 2005-2006 నుంచి 2013 వరకు తీసుకున్న పహణీలలో దార్గుపల్లి నర్సింహ, తండ్రి గండయ్య పేరుతో ఇచ్చారు.

ఈ మేరకు నేటికీ రికార్డులలో ఉన్నట్లే లెక్క. కానీ.. ఇక్కడ మరికొందరు ముందుకు వచ్చారు. ఈ భూమిని తాము కొనుక్కున్నామని లలిత, సుమంత్‌కుమార్ అనే వ్యక్తులు ైక్లెమ్ చేస్తున్నారు. వీరు ఏకంగా పూజా వెంచర్స్‌కు ఆ భూమిని డెవలప్‌మెంట్‌కు ఇచ్చేశారు. ఈ మేరకు దార్గుపల్లి నర్సింహ తండ్రి నర్సయ్య, దార్గుపల్లి సత్యమ్మ, దార్గుపల్లి స్వామి, దార్గుపల్లి సత్యనారాయణ, దార్గుపల్లి నరేందర్, దార్గుపల్లి సురేందర్‌ల వద్ద 2000 జూన్ 30వ తేదీన రిజిస్టర్ చేసుకున్నట్లు డాక్యుమెంట్లు చూపిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇదే భూమిలో వ్యవసాయం చేసుకుంటున్న నర్సింహ కుటుంబీకులు మాత్రం పైన చెప్పినవారెవరూ తమ కుటుంబ సభ్యుల్లోనే లేరని తేల్చి చెబుతున్నారు.

తమ కుటుంబంలో ఎవరెవరున్నదీ చూపిస్తూ కుటుంబ సభ్యుల గ్రూప్‌ఫొటో కూడా టీ మీడియాకు ఇచ్చారు. మరోవైపు తాము కొనుక్కున్నామంటూ లలిత అండ్ అదర్స్ ైక్లెమ్‌చేస్తున్న భూమి హుడా ఆధీనంలో ఉందని అధికారులు తెలుపుతున్నారు. ఈ మేరకు సర్వేయర్లు నిర్థారించారు. కలెక్టర్ కూడా ఇచ్చిన ఎన్‌ఓసీని రద్దు చేశారు. దీనిపై కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. అయితే అధికారులు ఎన్‌ఓసీ ఇచ్చిన తీరే చాలా అభ్యంతరకరంగా ఉంది. ఈ భూమిపై తమకు ఇంట్రెస్ట్ లేదని అందుకే ఎన్‌ఓసీ ఇస్తున్నట్లు పేర్కొనడం గమనార్హం. ఈ విషయంలో ఒకే సర్వే నంబర్‌పై ఉన్న భూమి తమదేనని ఇద్దరు ైక్లెమ్ చేస్తున్నారని మండల రెవెన్యూ అధికారులు కలెక్టర్‌కు లేఖ రాసి చేతులు దులుపుకున్నారు.

వాస్తవంగా ఈ సర్వే నంబర్ భూమికి యజమానులు ఎవరనే విషయాన్ని తేల్చకుండా అధికారులు అక్రమార్కులకు అవకాశం కల్పిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతే కాదు మహావీర్ బిల్డర్స్‌కు చెందిన సంస్థ తమ వెంచర్‌లో 74 సర్వే నంబర్‌కు చెందిన ఎకరంకుపైగా భూమి కలిసిందని, ఈ భూమిని డిమార్క్ చేసి వెనక్కుతీసుకోవాలని కోరినా కూడా శేరిలింగంపల్లి మండల రెవెన్యూ అధికారులు భూమిని స్వాధీనం చేసుకోవడానికి వెనుకాడుతున్న తీరే.. అధికార యంత్రాంగానికి ప్రభుత్వ భూములపై ఉన్న శ్రద్ధ ఏ పాటిదో చెప్పకనే చెబుతున్నది.
scan

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి