గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, జులై 03, 2014

గోకుల్.. మరో గురుకుల్...!

-ప్రైవేటుపరమైన నిజాం జాగీరు భూముల్లో సీమాంధ్రుల పాగా
-అనుమతులు నిల్ బహుళ అంతస్తులు ఫుల్
-ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల గండి
-అక్రమనిర్మాణాలపై చర్యలకు రంగం సిద్ధం.. నోటీసులు జారీ
మొన్న లీజు భూములు.. నిన్న గురుకుల్ ట్రస్టు భూములు.. నేడు పైగా భూములు. సీమాంధ్ర భూబకాసురులు కబ్జా పెట్టిన తెలంగాణ భూములు ఒక్కొక్కటిగా చెరవీడుతున్నాయి. హైదరాబాద్ నడిబొడ్డున వలసవాదులు నిర్మించుకున్న ఆధిపత్య ప్రతీకలు కూలుతున్నాయి. గత సీమాంధ్ర ప్రభుత్వాల అండదండలతో రూ.లక్షల కోట్ల విలువచేసే భూములు దర్జాగా కబ్జా పెట్టుకున్న అక్రమార్కుల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరుగెడుతున్నాయి. లీజు భూములు, గురుకుల్ ట్రస్ట్ భూముల్లో ఆక్రమణలను కూల్చిన అధికారులు ఇప్పుడు గోకుల్ ప్లాట్స్‌పై దష్టి పెట్టారు. కాలనీలోని 50 అక్రమ నిర్మాణాలను గుర్తించి బుధవారం వారందరికీ స్పీడ్‌పోస్టులో నోటీసులు పంపారు. పోలీసు బందోబస్తు లేని కారణంగా కూల్చివేతలు వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. హఫీజ్‌పేట సర్వేనెంబర్ 78లోని 214 ఎకరాల పైగా భూములు నాటి సీమాంధ్ర ప్రభుత్వాల అలసత్వం, అధికారుల అడ్డగోలుతనం కారణంగా పరాధీనమై ఎలా గోకుల్ ప్లాట్స్‌గా మారాయో చూడండి.
buildings

ఇదీ పైగా భూముల కథ..

హైదరాబాద్ సంస్థానంలో నిజాం రెవెన్యూ, రక్షణవ్యవస్థల్లో కీలక విధులు నిర్వహించిన పలువురు సేవకులకు జాగీర్లు, ఇనాములు ఇచ్చారు. ఈ జాగీర్లు అందుకున్నవారిలో నిజాం సైన్యాధికారి ఖుర్షీద్‌జా పూర్వీకులు కూడా ఉన్నారు. వారసత్వంగా వచ్చిన ఆ భూములను ఖుర్షీద్‌జా అప్పట్లో రైల్వేలైన్ నిర్మాణం కోసం ఇచ్చేశారు. దానికి బదులుగా హైదర్‌నగర్, హఫీజ్‌పేట శివారు గ్రామాలను నిజాం ఆయనకు ఇనాముగా ఇచ్చాడు. వీటినే పైగా అనేవారు. ఈ రెండు గ్రామాలపై వచ్చే పన్నులను ఖుర్షీద్‌జాకు నష్టపరిహారంగా చెల్లించేలా ఉత్తర్వులిచ్చాడు. 1949లో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన సమయంలో జాగీర్ అబాలిషన్ రెగ్యులేషన్స్ 1358ఎఫ్ యాక్ట్ ప్రకారం ఇనాం గ్రామాలైన హైదర్‌నగర్, హఫీజ్‌పేటలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. రద్దు చేసిన గ్రామాల జాబితాలో హైదర్‌నగర్, హఫీజ్‌పేట గ్రామాలను సీరియల్ నెంబరు 380, 381గా పేర్కొన్నారు. పలుమార్లు ఈ భూములు ప్రభుత్వ ఆస్తేనని కోర్టులు తీర్పులిచ్చాయి. 

కానీ ఖుర్షీద్ జా వారసులు ఈ రెండు గ్రామాల్లోని భూములు తమవిగా పేర్కొంటూ నిజాంనవాబుకు, అతని అల్లుడు ఖాజీం నవాబ్‌జంగ్‌కు విక్రయించారు. నిజాం మరణానంతరం అతని కార్యదర్శి ఎఫ్.ఇ.దిన్‌షా లిమిటెడ్ పేరిట ఈ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించాడు. భూములపై హక్కులు పొందిన ఎఫ్.ఇ.దిన్‌షా లిమిటెడ్ అనంతరం ఎఫ్‌ఈ సైరస్ ఇన్వెస్ట్‌మెంట్‌గా పేరు మార్చుకుని డాక్టర్ పీఎస్ ప్రసాద్‌ను ఆస్తులకు జీపీఏగా నియమించింది. అనంతరం భూములను ప్రసాద్‌కు చెందిన గోల్డ్‌స్టోన్ సంస్థకు అసైన్ చేసింది. ఈ విధంగా గతంలో న్యాయస్థానాలు ప్రభుత్వ ఆస్తిగా తేల్చిన భూములపై సీమాంధ్ర ప్రభుత్వాల అలసత్వం కారణంగా చివరికి గోల్డ్‌స్టోన్ సంస్థకు హక్కులు సంక్రమించాయి. ఈ భూముల్లోనే 162 ఎకరాల్లో గోకుల్‌ప్లాట్స్ లే ఔట్ చేసి ప్లాట్లు విక్రయించారు. మొత్తం 162 ఎకరాల్లో 1800ప్లాట్లు వేశారు. కేవలం నోటరీ కాగితమే ఆధారంగా ఉన్న ఈ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే ఆకాశహర్మ్యాలు నిర్మించడం మొదలుపెట్టారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి