గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, జూన్ 18, 2015

అవును.. సెక్షన్ 8 జాన్తా నై!

-శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశం
-తేల్చిచెప్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 163
-బిల్లు ఆమోదం సమయంలోనే గుర్తుచేసిన జైట్లీ
-గవర్నర్‌కు ఎలా అప్పగిస్తారని ఆనాడే నిలదీత
-సెక్షన్ 8 అమలుకు కోర్టుకెళ్లినా ప్రయోజనం లేదు
-స్పష్టంచేస్తున్న న్యాయ నిపుణులు


ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లులోని క్లాజ్ 8లో హైదరాబాద్ రెండు రాష్ర్టాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పేర్కొన్నారు. పదేండ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేందుకు మాకేమీ ఇబ్బంది లేదు. శాంతి భద్రతలకు న్యూట్రల్ ఏజెన్సీగా.. గవర్నర్ ఇన్‌చార్జిగా ఉండటానికీ అభ్యంతరం లేదు. నాకున్న ఒకే ఒక భయం.. అదే నా అభ్యంతరం ఏమిటంటే.. మీరు శాంతి భద్రతల అధికారాన్ని ఒక సాధారణమైన చట్టం ద్వారా గవర్నర్ చేతుల్లో ఎలా పెడతారు? గత ఏడాది ఫిబ్రవరి 20న పార్లమెంట్‌లో రాజ్యసభ విపక్ష నేత, న్యాయ నిపుణుడు అరుణ్‌జైట్లీ వేసిన ప్రశ్న!

arun


హైదరాబాద్‌లో శాంతి భద్రతలను గవర్నర్‌కు అప్పగించడం ఏ విధంగానూ వీలుగాని పనిగా తేలిపోతున్నది. అసలు ఇది పసలేనివాదనే కాకుండా.. రాజ్యాంగబద్ధమైనది కాదని కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 8 అమలు కోసం సుప్రీంకోర్టుకు వెళ్లినా ఎలాంటి ఉపయోగం ఉండబోదని తేల్చిచెప్తున్నారు. 

యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆమోదం పొందిన ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో హైదరాబాద్‌ను పదేండ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచుతూ, శాంతి భద్రతలను గవర్నర్ అజమాయిషీలో ఉంచేలా సెక్షన్ 8లో పేర్కొన్నారు. నిజానికి శాంతి భద్రతలు, పోలీసింగ్ అనేది రాష్ర్టాల పరిధిలోని అంశం. దీనికి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అయిన గవర్నర్‌కు ఎలాంటి సంబంధం లేదు. అయితే.. ఆనాడు యూపీఏ ప్రభుత్వం బిల్లు సమగ్రంగా బిల్లు తీసుకురాకపోవడంతో ఈ సెక్షన్ చేరింది. దీన్ని అమలు చేయాలని ఇప్పుడు ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నది. నిజానికి రాజ్యాంగం ప్రకారం అలా అమలు చేసే అవకాశాలే లేవని న్యాయ నిపుణులు తేల్చి చెప్తున్నారు. ఒకవేళ సెక్షన్ 8 అమలు పేరుతో కేంద్రం ఏవైన ఆదేశాలు జారీ చేసినా అవి సుప్రంకోర్టులో న్యాయపరీక్షకు నిలబడవని వారంటున్నారు. 


రాష్ర్టాలకు దఖలు పర్చిన శాంతి భద్రతల అధికారాలను, పోలీస్ పవర్స్‌ను ఒక సాధారణ చట్టంద్వారా గవర్నర్‌కు కట్టబెట్టాడాన్ని, దాని అమలుకు డిమాండ్ చేయడాన్ని సుప్రీం కోర్టు మరో మాట లేకుండా కొట్టిపారేస్తుందని అంటున్నారు. నిజానికి ఇది చట్టవ్యతిరేకమని ఆనాడు తెలంగాణ బిల్లు ఆమోదం పొందే క్రమంలో పార్లమెంటులో జరిగిన చర్చలో నాటి రాజ్యసభ విపక్ష నేత, ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్‌జైట్లీ విస్పష్టంగా చెప్పారు. లొసుగులతో కూడిన చట్టాన్ని ఆమోదిస్తున్నారని ఆనాడే హెచ్చరించారు. శాంతి భద్రతలు అనేవి రాష్ర్టానికి సంబంధించిన అంశమని, దీనిని గవర్నర్ చేతిలో ఎలా పెడతారని నిలదీశారు. ఆ సమయంలో అరుణ్ జైట్లీ చేసిన ప్రసంగంలో సెక్షన్ 8 గురించి చేసిన వ్యాఖ్యలు కింది విధంగా ఉన్నాయి. 


మేం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పూర్తి చట్టబద్ధంగా, సరైన పద్ధతుల్లో జరగాలని కోరుకుంటున్నాం. మీరు ప్రతిపాదించిన ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లులోని క్లాజ్ 8లో హైదరాబాద్ రెండు రాష్ర్టాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పేర్కొన్నారు. పదేండ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేందుకు మాకేమీ ఇబ్బంది లేదు. శాంతి భద్రతలకు న్యూట్రల్ ఏజెన్సీగా.. గవర్నర్ ఇన్‌చార్జిగా ఉండటానికీ అభ్యంతరం లేదు. 


నాకున్న ఒకే ఒక భయం.. అదే నా అభ్యంతరం ఏమిటంటే.. మీరు శాంతి భద్రతల అధికారాన్ని ఒక సాధారణమైన చట్టం ద్వారా గవర్నర్ చేతుల్లో పెడతారా? మంత్రిమండలికి గవర్నర్ సలహా ఇవ్వవచ్చునని రాజ్యాంగంలోని 163వ అధికరణం స్పష్టంగా చెప్తున్నది. మంత్రిమండలి సలహాకు అనుగుణంగా పని చేయాలని సుప్రీం కోర్టు తీర్పులు పేర్కొంటున్నాయి. శాంతి భద్రతలు, పోలీసు పవర్స్‌పై అధికారాలు రాష్ర్టాలకే ఉంటాయి. గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి మాత్రమే. 


నాటి విపక్ష నేతగా జైట్లీ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ నిజమని పలువురు న్యాయ నిపుణులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే డిమాండ్‌తో కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వెళితే ఎన్డీయే ప్రభుత్వం నుంచి ఏపీ నేతలకు ఇదే సమాధానం లభిస్తుంది తప్పించి.. కొత్తగా ఎలాంటి హామీ దొరికేందుకు ఆస్కారమే లేదని వారు పేర్కొంటున్నారు. దీనిపై కోర్టుకు వెళ్లినా.. శాంతి భద్రతలను గవర్నర్‌కు కట్టబెట్టడం రాజ్యాంగ వ్యతిరేకం కనుక సుప్రీం కోర్టు కూడా అందుకు విస్పష్టంగా తిరస్కరిస్తుందని వారు చెప్తున్నారు.


సెక్షన్-8 అమలు డిమాండ్ అర్థంలేనిది: పీపీ రావు


సెక్షన్-8లో గవర్నర్ బాధ్యతలను స్పష్టం గా వివరించినందున మళ్లీ కేంద్రం నుంచి ఆదేశాలు అవసరం లేదు. చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచే సెక్షన్-8 కూడా అమలులోకి వచ్చినట్లే. ప్రస్తుత డిమాండ్లు అర్థం లేని వి. విభజన చట్టంతో ఈ సెక్షన్‌ను విడిగా చూ డలేం. 


హైదరాబాద్‌లో ప్రజల ప్రాణానికి హాని ఏర్పడినప్పుడు, స్వేచ్ఛకు, ఆస్తులకు భంగం కలిగినప్పుడు శాంతిభద్రతల బాధ్యతను గవర్నర్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ గత ఏడాది కాలంలో ఎలాంటి ఘటనలు జరగలేదుకాబట్టి సెక్షన్-8 గురించి చర్చించడం అసందర్భం. శాంతిభద్రతలకు విఘాతం లేని ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్‌కు ఈ సెక్షన్ ద్వారా లభించే అధికారాలు, బాధ్యతల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. గవర్నరే స్వయంగా పరిస్థితులను అంచనా వేసుకుని నిర్ణయం తీసుకుంటారు. అది కూడా తెలంగాణ ప్రభుత్వ మంత్రివర్గంతో సంప్రదింపులు జరిగిన తర్వాతే గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు.


ప్రత్యేక పరిస్థితుల్లోనే గవర్నర్‌కు బాధ్యతలు


-ఎస్ రామచంద్రరావు, మాజీ అడ్వకేట్ జనరల్ 
దేశానికి దిక్సూచి రాజ్యాంగం. రాష్ట్రపతి నుంచి సామాన్యుడి వరకు రాజ్యాంగానికి కట్టుబడాల్సిందే. రాజ్యాంగంలో శాంతి భధ్రతల బాధ్యత అంశాన్ని రాష్ర్టాల జాబితాలో చేర్చారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వానికే పూర్తి అధికారం ఉంటుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినప్పుడు విధించే రాష్ట్రపతి పాలన సమయంలోనే శాంతిభద్రతల బాధ్యత గవర్నర్‌కు ఉంటుంది. ఈ విషయంలో స్పష్టత ఇవ్వకుండానే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్-8ని చేర్చారు. దాని ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతి భద్రతలు, అంతర్గత సెక్యూరిటీ, స్వేచ్ఛ, వ్యక్తుల ఆస్తులకు భంగం వాటిల్లినప్పుడు గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యతలు ఉంటాయి. హైదరాబాద్‌లో శాంతిభద్రతల సమస్య,ఆస్తుల సమస్యగానీ తలెత్తలేదు. ఏపీ సీఎం సెక్షన్-8ని అమలు చేయాలని డిమాండ్ చేయడం అర్ధరహితం.


అధికారాల బదలాయింపు లేదు


-గండ్ర మోహన్‌రావు, సీనియర్ న్యాయవాది
ఉమ్మడి రాజధాని భూభాగంలో కొన్ని అంశాలపై గవర్నర్‌కు కేవలం కొన్ని ప్రత్యేక బాధ్యతలను అప్పచెప్పారు. కానీ పూర్తిస్థాయి అధికారాలను బదలాయించలేదు. ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించే సమయంలో తెలంగాణ మంత్రిమండలితో చర్చించాలని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. శాంతిభద్రతలను రాష్ట్ర పరిధి నుంచి ఇతరులకు బదలాయించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఒకవేళ అలా బదలాయించాలంటే ఏకంగా రాజ్యాంగాన్ని
సవరించాల్సి వస్తుంది. 


కేసు నుంచి తప్పించుకునేందుకే


- సందేళ్ల భూమయ్య, అడ్వకేట్
ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు, ఆ కేసు నుంచి తప్పించుకునేందుకే సెక్షన్-8 అంశాన్ని లేవనెత్తుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. ఒకవేళ తెలంగాణకు ఈ నిబంధన వర్తించదనుకుంటే అది ఏలా సాధ్యమో చంద్రబాబే చెప్పాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ఏ చట్టాలైనా రాజ్యాంగ నిబంధనలకు లోబడే ఉండాలనే మౌలిక విషయాన్ని మర్చిపోవడం దురదృష్టకరం. చేసిన తప్పును ఒప్పుకోకుండా రాజ్యాంగ సంక్షోభం స్పష్టిస్తామని చంద్రబాబు విధేయులు ప్రకటనలు చేయటం శోచనీయం. 


ఏపీ పోలీసులకు తెలంగాణలో అధికారం లేదు


- కే రామకృష్ణారెడ్డి, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ 
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-8లో ఏపీ పోలీసులకు , ఏపీ ప్రభుత్వానికి హైదరాబాద్‌పై అధికారం ఉంటుందని పేర్కొనలేదు. పాలనా సౌలభ్యం కోసం హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పేర్కొన్నప్పటికీ, భూ భాగాల కేటాయింపు విషయంలో హైదరాబాద్‌ను తెలంగాణ రాష్ట్ర పరిధి జాబితాలోనే చూపారు. రాష్ర్టాల్లో శాంతి భద్రతలను కాపాడే బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు, రాష్ట్ర పోలీస్ యంత్రాంగంపైనే ఉంటుంది. కాబట్టి హైదరాబాద్‌లో శాంతిభద్రతల బాధ్యత తెలంగాణ ప్రభుత్వం, పోలీసులపై మాత్రమే ఉంటుంది. ఏపీ సీఎంకు తెలంగాణ పోలీసులే రక్షణ కల్పిస్తారు. సచివాలయం, ఇతర భవనాల వద్ద ఆంధ్ర పోలీసుల మోహరింపు సరికాదు. హైదరాబాద్ ఆస్తులపై ఏపీ ప్రభుత్వానికి యాజమాన్య హక్కులు ఉండవని పదో షెడ్యూల్ సంస్థలపై అధికా రం విషయంలో ఇటీవల హైకోర్టు స్పష్టంగా తీర్పు చెప్పింది. 


గవర్నర్‌కు అధికారాలు కావు, బాధ్యతలే: మాడభూషి శ్రీధర్


ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-8 ద్వారా గవర్నర్‌కు లభించినవి బాధ్యతలే తప్ప అధికారాలు కావు. తెలంగాణ రాష్ట్ర అధికారాలేవీ గవర్నర్‌కు బదిలీ కాలేదు. తెలంగాణ మంత్రివర్గాన్ని సంప్రదించకుండా గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోరాదు. రెండు రాష్ర్టాలకు ఉమ్మడి గవర్నర్‌గా ఉన్నందున ఏపీ మంత్రివర్గం సలహాలు ఇచ్చేటప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా ఇవ్వరాదనేది కూడా గుర్తుంచుకోవాలి. శాంతిభద్రతలు, భవనాల భద్రత, ప్రభుత్వ భవనాల కేటాయింపులు మాత్రమే గవర్నర్ బాధ్యతగా ఉంటాయి. 


ఈ పరిధికి వెలుపల ఉండే అవినీతి, లంచాలు తదితరాలకు సెక్షన్-8 వర్తించదు. వ్యక్తిగత నిర్ణయాన్ని తీసుకొనే అధికారం గవర్నర్‌కు ఉన్నప్పటికీ తగిన కారణాలను ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉండరాదు. ఏపీ ప్రభుత్వానికి, ఉద్యోగులకు, అధికారులకు హైదరాబాద్‌లో నివసించటానికే తప్ప నగరంపై అధికారాలు, హక్కులు ఉండవు. గవర్నర్ నిర్ణయాన్ని సమీక్షించాలని కోరే హక్కు పౌరులకూ ఉంది. సమీక్ష చేసే అధికారం హైకోర్టు,సుప్రీంకోర్టులకు ఉంది.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి